కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పొంతి పిలాతు ఎవరు?

పొంతి పిలాతు ఎవరు?

పొంతి పిలాతు ఎవరు?

“పిలాతు పేరు వినగానే అపహసించే, అనుమానించే చారిత్రక వ్యక్తి మనకు గుర్తుకు వస్తాడు. కొందరు ఆయనను దివ్యపురుషునిగా పరిగణిస్తారు, మరికొందరు ఆయనను మానవ బలహీనతలకు ప్రతిరూపంగా, స్థిరత్వాన్ని కాపాడుకోవడం కోసం ఒక వ్యక్తిని బలిగా ఇవ్వడానికైనా సిద్ధపడిన ఒక రాజకీయవేత్తకు పరిపూర్ణ ఉదాహరణగా పరిగణిస్తారు.”​—⁠పొంటియస్‌ పయిలెట్‌, ఆన్‌ రో రచించినది.

మీరు ఆ అభిప్రాయాలతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా, పొంతి పిలాతు మాత్రం తాను యేసుక్రీస్తుతో వ్యవహరించిన విధానాన్నిబట్టి తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. పిలాతు ఎవరు? ఆయన గురించిన సమాచారం ఏమిటి? ఆయన స్థానం గురించి మరింతగా అర్థం చేసుకోవడం, ఈ భూమ్మీద ఇంతవరకు సంభవించని అతి ప్రాముఖ్యమైన ఘటనల గురించిన మన అవగాహనను పెంచుతుంది.

పదవి, విధి నిర్వహణ, అధికారం

సా.శ. 26లో రోమా చక్రవర్తి తిబెరు, పిలాతును యూదా ప్రాంతానికి అధిపతిగా నియమించాడు. అలాంటి ఉన్నతాధికారులు ఈక్విస్ట్రియన్‌ ఆర్డర్‌ అని పిలువబడిన వర్గానికి చెందినవారు, వారు రోమా రాష్ట్రసభ హోదా ఉన్న కులీనులకన్నా క్రిందిస్థాయి శ్రీమంతుల వర్గానికి చెందినవారు. పిలాతు బహుశా ఒక సైనిక అధికారిగా లేక క్రిందిస్థాయి సైన్యాధిపతిగా సైన్యంలో చేరి కర్తవ్య నిర్వహణలో క్రమంగా వివిధ పదవులను చేపడుతూ 30 సంవత్సరాలు నిండక ముందే అధిపతిగా నియమించబడ్డాడు.

పిలాతు సైనికునిగా ఉన్నప్పుడు బిగువుగా ఉండే తోలు దుస్తులను, లోహపు మైమరువును ధరించి ఉంటాడు. సామాన్య ప్రజల మధ్య ఉన్నప్పుడు ఊదారంగు అంచులతో వదులుగా ఉండే తెల్లటి పైవస్త్రాన్ని ధరించి ఉంటాడు. ఆయనకు కురచగా ఉండే తల వెంట్రుకలు, నున్నగా గీసుకున్న గడ్డం ఉండవచ్చు. ఆయన స్పెయిన్‌ నుండి వచ్చి ఉండవచ్చని కొంతమంది భావిస్తున్నా, ఆయన దక్షిణ ఇటలీ నుండి వచ్చిన సామ్నైట్‌ శ్రీమంతులకు చెందిన పొంతి తెగకు చెందినవాడై ఉండవచ్చని ఆయన పేరు సూచిస్తోంది.

పిలాతు వర్గానికి చెందిన ఉన్నతాధికారులు సాధారణంగా అనాగరిక ప్రాంతాలకు పంపించబడేవారు. రోమన్లు యూదాను అనాగరిక ప్రాంతంగానే పరిగణించేవారు. పిలాతు శాంతిభద్రతలను కాపాడడమే కాక, పరోక్ష పన్నుల వసూలును, ఓటు పన్ను వసూలును కూడా పర్యవేక్షించేవాడు. ప్రతిదిన న్యాయవ్యవహారాల నిర్వహణ మీద యూదా కోర్టుల అధికారం ఉండేది, అయితే మరణశిక్ష అవసరమైన కేసుల విచారణ మాత్రం ఉన్నత న్యాయాధికారమున్న అధిపతి దగ్గరకు పంపించబడేవి.

పిలాతూ, అతని భార్యా, ఓడరేవు పట్టణమైన కైసరయలో కొద్దిమంది లేఖికులు, సహచరులు, వార్తాహరులుగల సిబ్బందితో నివసించేవారు. పిలాతుకు 500 నుండి 1,000 మంది వరకు ఉండే ఐదు పదాతి దళాల మీదనే కాక బహుశా 500 మంది ఉన్న ఆశ్వికదళం మీద కూడా అధికారం ఉండేది. అతని సైనికులు నియమాలను ఉల్లంఘించినవారిని నియమానుసారంగా కొరతవేసేవారు. శాంతి సమయాల్లో సంక్షిప్త విచారణల తర్వాత శిక్షను అమలుచేసేవారు, అయితే తిరుగుబాటు జరిగినప్పుడు మాత్రం, తిరుగుబాటుదారులను పెద్ద మొత్తంలో వెంటనే చంపేవారు. ఉదాహరణకు రోమన్లు, స్పార్టాకస్‌ నాయకత్వం వహించిన తిరుగుబాటును అణచివేయడానికి 6,000 మంది దాసులను కొరతవేశారు. యూదాలో అపాయం పొంచి ఉన్నట్లయితే, అధిపతి సాధారణంగా రోమన్‌ సైనిక దళాలపై ఆధిపత్యం వహించే సిరియాలో ఉండే సామ్రాజ్యపు లెగేట్‌ సహాయం కోసం అడగవచ్చు. అయితే, పిలాతు పాలనలో చాలాకాలం వరకు సిరియాలో లెగేట్‌ లేడు కాబట్టి అలాంటి అల్లర్లను పిలాతే స్వయంగా వెంటనే అణచివేయాల్సి వచ్చేది.

అధిపతులు క్రమంగా చక్రవర్తిని సంప్రదించేవారు. ఆయన గౌరవానికి సంబంధించిన అంశాలున్నా, రోమా అధికారానికి ఎలాంటి ముప్పు ఉన్నా అధిపతులు చక్రవర్తికి నివేదించేవారు, వాటినిబట్టి సామ్రాజ్యపు ఉత్తర్వులు జారీ అయ్యేవి. ఒక అధిపతి తన ప్రాంతంలో జరిగిన ఘటనల గురించి ఇతరులు ఫిర్యాదు చేయక ముందే తన కథనాన్ని చక్రవర్తికి చెప్పడానికి ఆతురత చూపించవచ్చు. యూదాలో సమస్యలు పొడచూపుతున్నాయి కాబట్టి అలాంటి చింతలు పిలాతుకు చాలా గంభీరంగా ఉండేవి.

సువార్త వృత్తాంతాలే కాక చరిత్రకారులు ఫ్లేవియస్‌ జోసిఫస్‌, ఫిలోలు కూడా పిలాతు గురించిన సమాచారానికి ప్రధాన మూలాధారాలు. క్రైస్తవులు తమ పేరును క్రైస్తస్‌ అనే వ్యక్తి నుండి తీసుకున్నారని, పిలాతు ఆయనను చంపాడని రోమన్‌ చరిత్రకారుడు టాసిటస్‌ కూడా చెప్పాడు.

యూదులు కోపోద్రిక్తులయ్యేలా రెచ్చగొట్టబడ్డారు

రోమా అధిపతులు, విగ్రహాలను చేసే విషయంలో యూదుల అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని చక్రవర్తి చిత్రాలు ఉన్న సైనిక పతాకాలను యెరూషలేములోకి తీసుకువచ్చేవారు కాదని జోసిఫస్‌ చెబుతున్నాడు. అయితే పిలాతు అలాంటి సంయమనాన్ని చూపించకపోవడంతో కోపోద్రిక్తులైన యూదులు ఫిర్యాదు చేయడానికి వెంటనే కైసరయకు వెళ్లారు. పిలాతు ఐదు రోజుల వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఆయన ఆరవ రోజున తన సైనికులను ఆందోళనకారులు చుట్టుముట్టి వారు అక్కడి నుండి వెళ్ళకపోతే వారిని చంపుతామని బెదిరించమని ఆజ్ఞాపించాడు. యూదులు తమ ధర్మశాస్త్రం ఉల్లంఘించబడడాన్ని చూడడంకన్నా తాము చనిపోవడానికైనా సిద్ధమేనని చెప్పారు, దాంతో పిలాతు వెనక్కి తగ్గి ఆ చిత్రాలను తీసివేయాలని ఆజ్ఞాపించాడు.

పిలాతు బలప్రయోగానికి వెనకాడలేదు. జోసిఫస్‌ నమోదు చేసిన ఒక ఘటనలో, పిలాతు యెరూషలేముకు నీళ్ళు తీసుకురావడానికి ఒక కృత్రిమ జలమార్గపు పనిని ప్రారంభించి, ఆ ప్రణాళికకు ఆర్థిక సహాయం కోసం ఆలయ ఖజానా నిధులను ఉపయోగించాడు. పిలాతు నేరుగా వెళ్ళి ఆ ధనాన్ని స్వాధీనం చేసుకోలేదు ఎందుకంటే ఆలయాన్ని దోచుకోవడం అపచారమనీ, అలా చేస్తే కోపోద్రిక్తులయ్యే యూదులు తనను అధిపతిగా తీసివేయమని తిబెరిని కోరవచ్చనీ ఆయనకు తెలుసు. కాబట్టి పిలాతు ఆలయ అధికారుల సహకారాన్ని పొందాడని అనిపిస్తోంది. “కొర్బాను” అని పిలువబడే సమర్పిత నిధులను నగారానికి ప్రయోజనం చేకూర్చేలా ప్రజాపనులకు న్యాయంగా ఉపయోగించవచ్చు. అయితే వేలాదిమంది యూదులు తమ కోపాన్ని వ్యక్తం చేయడానికి గుమికూడారు.

పిలాతు, తన దళాలను ఆ గుంపులో కలిసిపోయి ఖడ్గాలను ఉపయోగించకుండా ఆందోళనకారులను లాఠీలతో కొట్టమని ఆదేశించాడు. దీన్నిబట్టి ఆయన హత్యాకాండ కలిగించకుండా అల్లరిమూకను నియంత్రించాలని కోరుకున్నాడని అనిపిస్తోంది. అయితే అందులో కొందరు చనిపోయినా, ఆ వ్యూహం మాత్రం ఫలించింది. పిలాతు గలిలయుల రక్తాన్ని తమ బలులతో కలిపాడు అని యేసుకు కొందరు చెప్పినప్పుడు వారు ఈ ఘటననే పేర్కొని ఉండవచ్చు.​—⁠లూకా 13:⁠1.

“సత్యమనగా ఏమిటి?”

యేసు తనను తాను రాజుగా పిలుచుకున్నాడు అని యూదా ప్రధాన యాజకులు, పెద్దలు చేసిన ఆరోపణలను పిలాతు విచారణ చేయడం ఆయనకు అపకీర్తి తెచ్చిపెట్టింది. పిలాతు సత్యమునకు సాక్ష్యమిచ్చే యేసు పని గురించి విన్నప్పుడు, ఆ ఖైదీ నుండి రోముకు ఎలాంటి ముప్పూలేదని గ్రహించాడు. సత్యాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యమనే భావంతో “సత్యమనగా ఏమిటి?” అని అడిగాడు. ఆయన ఏ అభిప్రాయానికి వచ్చాడు? “అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు.”​—⁠యోహాను 18:37, 38; లూకా 23:⁠4.

యేసు న్యాయవిచారణ అంతటితో ముగిసిపోయి ఉండాలి, కానీ ఆయన దేశాన్ని కూలదోస్తున్నాడని యూదులు మళ్ళీమళ్ళీ ఆరోపించారు. ప్రధాన యాజకులు యేసును రోమా అధికారులకు అప్పగించడానికి కారణం ఆయన మీది ఈర్ష్యే అని పిలాతుకు తెలుసు. యేసును విడుదల చేస్తే సమస్య ఉత్పన్నమవుతుందని కూడా ఆయనకు తెలుసు, అలా కావడం ఆయనకు ఇష్టంలేదు. ఆయన అప్పటికే చాలా సమస్యలను ఎదుర్కొన్నాడు ఎందుకంటే బరబ్బాతోపాటు ఇంకా కొందరు రాజద్రోహం, హత్య ఆరోపణల కారణంగా అప్పటికే చెరసాలలో ఉన్నారు. (మార్కు 15:7, 10; లూకా 23:⁠2) అంతేకాక, యూదులతో ఇంతకుముందు జరిగిన వివాదాలు, అసమర్థులైన అధిపతులతో కఠినంగా వ్యవహరిస్తాడనే పేరు ఉన్న తిబెరి ముందు పిలాతు పేరును అప్రతిష్టపాలు చేశాయి. అయినా యూదుల ఒత్తిడికి లొంగిపోతే అది తన బలహీనతను సూచిస్తుంది. కాబట్టి పిలాతు సందిగ్ధావస్థలో పడ్డాడు.

పిలాతు యేసు స్వస్థలం గురించి తెలుసుకున్న తర్వాత ఆయన గలిలయకు చతుర్థాధిపతిగా ఉన్న హేరోదు అంతిప వద్దకు ఈ వివాదాన్ని పంపించడానికి ప్రయత్నించాడు. అదీ విఫలమవడంతో, పస్కా పండుగ సమయంలో ఒక ఖైదీని విడుదల చేసే అలవాటు ఉంది కాబట్టి, పిలాతు తన రాజ భవనం బయట గుమికూడినవారితో యేసును విడుదల చేయమని అడిగించడానికి ప్రయత్నించాడు. కానీ జనసమూహం బరబ్బాను విడుదల చేయమని కేకలువేశారు.​—⁠లూకా 23:5-19.

పిలాతు సరైనదే చేయాలని ఇష్టపడి ఉండవచ్చు, అయితే తన స్థానాన్ని కాపాడుకోవాలని, జనసమూహాన్ని సంతోషపెట్టాలని కూడా ఆయన కోరుకున్నాడు. చివరకు ఆయన తన మనస్సాక్షీ, న్యాయం కన్నా తన పదవికే చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. ఆయన నీళ్ళు తెప్పించుకొని తన చేతులు కడుక్కొని తాను అప్పుడే విధించిన మరణశిక్ష విషయంలో తాను నిరపరాధినని చెప్పాడు. * అతను యేసు నిరపరాధి అని నమ్మినా, ఆయనను కొరడాలతో కొట్టించి, సైనికులు ఆయనను అపహసించడానికి, కొట్టడానికి, ఆయన మీద ఉమ్మివేయడానికి అనుమతించాడు.​—⁠మత్తయి 27:​24-31.

పిలాతు యేసును విడుదల చేయడానికి చివరి ప్రయత్నం చేశాడు, అయితే అలా విడుదల చేస్తే ఆయన కైసరు స్నేహితుడు కాదని జనసమూహం అరిచారు. (యోహాను 19:​12) పిలాతు అది విన్న తర్వాత వారికి తలొగ్గాడు. పిలాతు నిర్ణయం గురించి ఒక విద్వాంసుడు ఇలా అన్నాడు: “పరిష్కారం సులభం, ఆ వ్యక్తికి మరణదండన విధించాలి. నిజానికి కోల్పోయేదల్లా అల్పుడైన ఒక యూదుని ప్రాణమే, అతని కారణంగా సమస్యను అధికం కానివ్వడం మూర్ఖత్వమే అవుతుంది.”

పిలాతుకు ఏమయ్యింది?

పిలాతు పరిపాలనా కాలంలో జరిగిన మరో పోరాటానికి సంబంధించిన ఘటన చివరగా నమోదు చేయబడింది. సాయుధ సమరయుల ఒక గుంపు, మోషే గెరీజీము కొండ మీద పాతిపెట్టాడని భావించిన నిధులను వెలికితీయాలనే ఆశతో అక్కడ గుమికూడారు. పిలాతు జోక్యం చేసుకున్నాడు, అతని సైనికదళాలు గుంపులో చాలామందిని చంపాయి. సమరయులు పిలాతు పైఅధికారియైన సిరియా అధిపతి లుక్యుస్‌ విటెలియుస్‌కు ఫిర్యాదు చేశారు. పిలాతు హద్దులు మీరి ప్రవర్తించాడని విటెలియుస్‌ భావించాడో లేదో పేర్కొనబడలేదు. ఏదేమైనా ఆయన పిలాతును తన చర్యల గురించి చక్రవర్తికి సంజాయిషీ చెప్పుకోవడానికి రోముకు రమ్మని ఆజ్ఞాపించాడు. అయితే అతను రాకముందే తిబెరి మరణించాడు.

“ఆ తర్వాత, పిలాతు గురించి చరిత్ర దస్తావేజులు ఏమీ చెప్పడం లేదు, అయితే అతని గురించి అనేక పురాణాలు ఉన్నాయి” అని ఒక మాసపత్రిక చెబుతోంది. అతని గురించి తెలియని వివరాలు సేకరించడానికి చాలామంది ప్రయత్నించారు. పిలాతు ఒక క్రైస్తవుడయ్యాడని చెప్పబడుతోంది. ఇతియోపీయాకు చెందిన “క్రైస్తవులు” ఆయనకు “దివ్యపురుషుని” హోదాను ఇచ్చారు. యూదా ఇస్కరియోతులాగే పిలాతు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని వ్రాసిన చాలామందిలో మూడవ శతాబ్దపు చివరి భాగం నుండి నాలుగో శతాబ్దపు ప్రారంభ భాగపు రచయిత యుసేబియస్‌ ఒకడు. అయితే పిలాతుకు అసలు ఏమి సంభవించిందనేది ఊహాకల్పితమే.

పిలాతు మొండివాడు, అమర్యాదస్థుడు, కఠినుడే కావచ్చు. అయితే అతను పది సంవత్సరాలు పదవిలో ఉన్నాడు, అదే యూదాకు చెందిన చాలామంది అధిపతులు చాలా తక్కువ కాలం పదవిలో ఉన్నారు. కాబట్టి పిలాతు, రోమా పౌరుని దృష్టిలో సామర్థ్యంగల వ్యక్తి. అతను తనను తాను కాపాడుకోవడానికి యేసును అవమానకరమైన రీతిలో హింసించి చంపిన పిరికివానిగా పిలువబడ్డాడు. పిలాతు ప్రథమ కర్తవ్యం శాంతి కోసం, రోమా ప్రయోజనాల కోసం పాటుపడడమే గానీ న్యాయాన్ని స్థిరపరచడం కాదు అని ఇతరులు వాదిస్తారు.

పిలాతు కాలాలకు మన కాలాలకు చాలా వ్యత్యాసం ఉంది. అయినా ఏ న్యాయాధిపతీ తాను నిరపరాధి అని పరిగణించిన వ్యక్తికి న్యాయంగా మరణదండన విధించలేడు. పొంతి పిలాతు యేసును ఎదుర్కోనట్లయితే, అతను చరిత్ర పుటల్లో కేవలం మరో వ్యక్తిగా మాత్రమే ఉండేవాడు.

[అధస్సూచి]

^ పేరా 19 చేతులు కడుక్కోవడం, రక్తపాతంలో భాగం లేదని వ్యక్తం చేయడానికి యూదులు ఉపయోగించే పద్ధతి, రోమన్లది కాదు.​—⁠ద్వితీయోపదేశకాండము 21:​6, 7.

[11వ పేజీలోని చిత్రం]

పొంతి పిలాతును యూదా అధిపతిగా గుర్తిస్తున్న ఈ స్మారక చిహ్నం కైసరయలో దొరికింది