కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవాయందలి భయభక్తులే జ్ఞానము”

“యెహోవాయందలి భయభక్తులే జ్ఞానము”

“యెహోవాయందలి భయభక్తులే జ్ఞానము”

“ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ప్రసంగి 12:​13) ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను దైవప్రేరేపణతో ఎంతటి జ్ఞానవంతమైన ముగింపుకు వచ్చాడో కదా! పితరుడైన యోబు కూడా దైవభయానికున్న విలువను గ్రహించాడు కాబట్టే ఆయన ఇలా అన్నాడు: ‘యెహోవాయందలి భయభక్తులే జ్ఞానము దుష్టత్వము విడచుటయే వివేకము.’​—⁠యోబు 28:​28.

యెహోవాపట్ల భయభక్తులు చూపించడం గురించి బైబిలు ఎంతో ప్రాముఖ్యంగా నొక్కిచెబుతోంది. మనం దేవునిపట్ల భక్తిపూర్వక భయాన్ని పెంపొందించుకోవడం ఎందుకు జ్ఞానయుక్తమైన చర్య? దైవభయం వ్యక్తిగతంగా, సత్యారాధకుల గుంపుగా మనకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుస్తుంది? సామెతలు 14వ అధ్యాయంలోని 26 నుండి 35 వచనాలు ఆ ప్రశ్నలకు జవాబులు ఇస్తాయి. *

‘బహు ధైర్యానికి’ మూలం

“యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు” అని సొలొమోను చెబుతున్నాడు. (సామెతలు 14:​26, 27ఎ) దైవ భయంగల వ్యక్తి విశ్వసనీయమైన, సర్వశక్తిగల దేవుని మీదనే నమ్మకముంచుతాడు. అలాంటి వ్యక్తి భవిష్యత్తును బహు ధైర్యంగా లేక గట్టి నమ్మకంతో ఎదుర్కొంటాడని అనడంలో ఆశ్చర్యం లేదు! ఆయన భవిష్యత్తు సుదీర్ఘంగా, సంతోషాన్నిచ్చేదిగా ఉంటుంది.

కానీ లౌకిక పథకాలను, సంస్థలను, ఆలోచనా విధానాలను, వస్తువులను నమ్ముకునేవారి భవిష్యత్తు గురించి ఏమని చెప్పవచ్చు? వారు ఆశించేది ఎలాంటి భవిష్యత్తు అయినా అది కొద్ది కాలమే ఉంటుంది, ఎందుకంటే బైబిలు ఇలా చెబుతోంది: “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహాను 2:​17) కాబట్టి మనం “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమిం[చడానికి]” ఏదైనా కారణం ఉందా?​—⁠1 యోహాను 2:​15.

దైవ భయంగల తల్లిదండ్రులు తమ పిల్లలకు “ఆశ్రయస్థానము” లభించేలా చూసుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? “పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను” అని కీర్తనకర్త పాడాడు. (కీర్తన 34:​11) పిల్లలు తల్లిదండ్రుల ఆదర్శం ద్వారా, వారిచ్చే ఉపదేశం ద్వారా దేవునిపట్ల భయభక్తులతో ఉండడాన్ని నేర్చుకున్నప్పుడు వారు యెహోవా మీద గట్టి నమ్మకం ఉన్న స్త్రీపురుషులుగా ఎదగవచ్చు.​—⁠సామెతలు 22:⁠6.

“యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును” అని సొలొమోను ఇంకా వివరిస్తున్నాడు. (సామెతలు 14:​27) సత్య దేవుడు “జీవజలముల ఊట” కాబట్టి యెహోవాపట్ల భయభక్తులు చూపించడం “జీవపు ఊట.” (యిర్మీయా 2:​13) యెహోవా గురించి, యేసుక్రీస్తు గురించి జ్ఞానం సంపాదించడంవల్ల మనం నిత్యజీవాన్ని పొందవచ్చు. (యోహాను 17:⁠3) దైవభయం మనల్ని మరణపాశాల నుండి కూడా విడిపిస్తుంది. ఎలా విడిపిస్తుంది? సామెతలు 13:​14 ఇలా చెబుతోంది: “జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణపాశములలోనుండి విడిపించును.” మనం యెహోవాపట్ల భయభక్తులతో ఉండి, ఆయన నియమాలకు విధేయత చూపిస్తూ, మన మార్గాలను నిర్దేశించడానికి ఆయన వాక్యాన్ని అనుమతిస్తే అకాల మరణానికి నడిపించగల హానికరమైన అలవాట్ల నుండి, భావోద్రేకాల నుండి మనం తప్పించుకోమా?

రాజులకు ఘనత”

సొలొమోను తన పరిపాలనలో చాలాకాలం యెహోవాకు విధేయత చూపించిన దైవభయంగల రాజుగా ఉన్నాడు. అది ఆయన పరిపాలన విజయవంతం కావడానికి దోహదపడింది. ఒక రాజు విజయవంతంగా పరిపాలిస్తున్నాడనేదాన్ని ఏది నిర్ధారిస్తుంది? దానికి సామెతలు 14:​28 ఇలా జవాబిస్తోంది: “జనసమృద్ధి కలుగుటచేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము రాజులకు వినాశకరము.” ఒక రాజు విజయం ఆయన ప్రజల సంక్షేమాన్నిబట్టి నిర్ధారించబడుతుంది. చాలామంది ఆయన పరిపాలనలోనే ఉండాలని కోరుకున్నట్లయితే అది ఆయనను ఒక విజయవంతమైన రాజుగా సిఫారసు చేస్తుంది. సొలొమోను “[ఎర్ర] సముద్రమునుండి [మధ్యధరా] సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు . . . రాజ్యము” చేశాడు. (కీర్తన 72:​6-8) ఆయన పరిపాలన ఇంతకుముందెన్నడూ లేని శాంతి సౌభాగ్యాల ద్వారా గుర్తింపుపొందింది. (1 రాజులు 4:​24, 25) సొలొమోను పరిపాలన విజయవంతమయ్యింది. మరోవైపు, సామాన్య ప్రజల ఆమోదం లేకపోవడం ఒక ఉన్నతాధికారికి అవమానాన్ని సూచిస్తుంది.

ఈ విషయంలో గొప్ప సొలొమోను, మెస్సీయ రాజైన యేసుక్రీస్తు కీర్తి గురించి ఏమి చెప్పవచ్చు? ఆయనకు నేడు కూడా ఉన్న పౌరుల గురించి ఆలోచించండి. భూవ్యాప్తంగా దాదాపు 60 లక్షలకన్నా ఎక్కువమంది దైవభయంగల స్త్రీపురుషులు ఇప్పటికే క్రీస్తు పరిపాలనలో జీవించడానికి నిర్ణయించుకున్నారు. వారు యేసుమీద విశ్వాసముంచి జీవముగల దేవుని సత్య ఆరాధనలో ఐక్యంగా ఉన్నారు. (యోహాను 14:⁠1) వెయ్యేండ్ల పరిపాలన అంతానికల్లా దేవుని జ్ఞాపకంలో ఉన్న వారందరూ పునరుత్థానం చేయబడతారు. అప్పుడు పరదైసు భూమి తమ రాజుకు కృతజ్ఞతను చూపించిన సంతోషంగల, నీతియుక్త ప్రజలతో నిండి ఉంటుంది. క్రీస్తు పరిపాలనా విజయానికి అది ఎంత గొప్ప నిదర్శనమై ఉంటుందో కదా! మనం మన అద్భుతమైన రాజ్య నిరీక్షణను గట్టిగా అంటిపెట్టుకొని ఉందాం.

ఆధ్యాత్మిక, భౌతిక ప్రయోజనాలు

దేవునిపట్ల భక్తితో కూడిన భయం మనకు నెమ్మదిగల హృదయాన్ని, ప్రశాంతమైన మనస్సును ఇస్తుంది. ఎందుకంటే జ్ఞానానికి ఉన్న అనేక కోణాల్లో యుక్తాయుక్త పరిజ్ఞానం, వివేచన కూడా ఉన్నాయి. సామెతలు 14:​29 ఇలా చెబుతోంది: “దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.” అదుపుచేసుకోలేని కోపం మన ఆధ్యాత్మికత మీద వినాశకరమైన ప్రభావాన్ని చూపిస్తుందని గుర్తించడానికి వివేచన మనకు సహాయం చేస్తుంది. మనం ‘దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా’ చేయగల పనుల్లో “ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు” పేర్కొనబడ్డాయి. (గలతీయులు 5:​19-21) సమర్థనీయమైన కోపాన్ని కూడా ఉంచుకోకూడదని మనకు సలహా ఇవ్వబడింది. (ఎఫెసీయులు 4:​26, 27) అసహనం, మనం తర్వాత చింతించే మూర్ఖపు మాటలకు, చర్యలకు నడిపించవచ్చు.

కోపంవల్ల భౌతికంగా కలిగే ప్రతికూల ప్రభావాలను సూచిస్తూ ఇశ్రాయేలు రాజు ఇలా అన్నాడు: “సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్లు.” (సామెతలు 14:​30) కోపం, క్రోధావేశాలవల్ల కలిగే రుగ్మతల్లో శ్వాససంబంధ సమస్యలు, అధిక రక్తపోటు, కాలేయ వ్యాధులు, క్లోమం మీద వినాశకరమైన ప్రభావాలు కూడా ఉన్నాయి. కోపం, క్రోధావేశాలు అల్సర్లు, దద్దుర్లు, ఉబ్బసం, చర్మ వ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలు వంటి రోగాలను తీవ్రతరం చేస్తాయని లేక వాటిని కలిగిస్తాయని కూడా వైద్యులు పేర్కొంటున్నారు. మరోవైపు, “ప్రశాంతంగా ఉండే హృదయం శరీరానికి జీవాన్నిస్తుంది.” (సామెతలు 14:​30, న్యూ ఇంటర్నేషనల్‌ వర్షన్‌) కాబట్టి మనం “సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరిం[చడం]” జ్ఞానయుక్తం.​—⁠రోమీయులు 14:​19.

దేవుని భయం మనం నిష్పక్షపాతంగా ఉండడానికి సహాయం చేస్తుంది

“దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు” అని సొలొమోను అంటున్నాడు. (సామెతలు 14:​31) దేవుని భయంగల వ్యక్తి, మానవులందరికీ ఒకే సృష్టికర్తయైన యెహోవా దేవుడు ఉన్నాడని గుర్తిస్తాడు. పేదవాడు కూడా తోటిమానవుడే కాబట్టి ఆయనతో వ్యవహరించే విధానం మానవ సృష్టికర్తను ప్రభావితం చేస్తుంది. మనం దేవుణ్ణి ఘనపరచాలంటే ఇతరులతో న్యాయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. పేద క్రైస్తవుడు నిష్పక్షపాతంగా ఆధ్యాత్మిక శ్రద్ధను పొందాలి. మనం దేవుని రాజ్య సువార్తను పేదవారికీ, సంపన్నులకూ ప్రకటించాలి.

దేవుని భయంవల్ల కలిగే మరో ప్రయోజనం గురించి పేర్కొంటూ జ్ఞానియైన రాజు ఇలా అంటున్నాడు: “అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.” (సామెతలు 14:​32) భక్తిహీనుడు ఎలా నశిస్తాడు? అతనికి విపత్తు ఎదురైనప్పుడు కోలుకొనే ఎలాంటి అవకాశం ఉండదని సూచించబడింది. మరోవైపు, విపత్తు ముంచుకొచ్చినప్పుడు దైవభయంగల వ్యక్తి దేవునిపట్ల తనకున్న యథార్థతను ఆశ్రయిస్తాడు. ఆయన మరణించేంత వరకు యెహోవా మీద పూర్తి నమ్మకముంచడం ద్వారా యోబు చూపించినటువంటి దృఢ సంకల్పాన్నే కనబరుస్తాడు, యోబు ఇలా చెప్పాడు: “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను!”​—⁠యోబు 27:⁠5.

యథార్థత కాపాడుకోవడానికి దేవుని భయం, జ్ఞానం అవసరం. జ్ఞానాన్ని ఎక్కడ పొందవచ్చు? “తెలివిగలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును బుద్ధిహీనుల అంతరంగములోనున్నది బయలుపడును” అని సామెతలు 14:​33 జవాబిస్తోంది. అవును, జ్ఞానం తెలివిగలవాని హృదయం నుండి లభించగలదు. అయితే అది బుద్ధిహీనుల అంతరంగంలో ఎలా వెల్లడవుతుంది? ఒక రెఫరెన్సు గ్రంథం ప్రకారం, “మూర్ఖుడు, జ్ఞానునిగా కనిపించాలనే ఆతురతతో తాను జ్ఞానం అని భావించేదానిని వెళ్లగక్కుతాడు, అయితే అది అతని బుద్ధిహీనతనే వెల్లడి చేస్తుంది.”

‘జనము ఘనతకెక్కుతుంది’

ఇశ్రాయేలు రాజు, దైవిక భయంవల్ల ఒక వ్యక్తి ఎలా ప్రభావితుడవుతాడో అనే విషయం నుండి, అది పూర్తి జనాంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందన్న విషయం మీదకు మన దృష్టిని మళ్ళిస్తూ ఇలా అంటున్నాడు: “నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును.” (సామెతలు 14:​34) ఆ సూత్రం, ఇశ్రాయేలు జనాంగం విషయంలో ఎంత స్పష్టంగా ప్రదర్శించబడిందో కదా! ఇశ్రాయేలు జనాంగం దేవుని ఉన్నత ప్రమాణాలను అంటిపెట్టుకొని ఉన్నప్పుడు అది వారిని చుట్టుప్రక్కల జనాంగాలకన్నా గొప్పవారిని చేసింది. అయితే వారు పదే పదే అవిధేయులు కావడం అవమానానికి, చివరకు యెహోవా ఆ జనాంగాన్ని తిరస్కరించడానికి దారితీసింది. ఆ సూత్రం నేటి దేవుని ప్రజలకు కూడా అన్వయిస్తుంది. క్రైస్తవ సంఘం దేవుని నీతియుక్త సూత్రాలను అంటిపెట్టుకొని ఉంటుంది కాబట్టి అది లోకానికి వేరుగా ఉంది. అయితే, ఆ ఉన్నత స్థానాన్ని కాపాడుకోవడానికి మనం వ్యక్తిగతంగా ఒక పవిత్రమైన జీవితాన్ని గడపాలి. పాపాన్ని అభ్యసించడం కేవలం మనకు వ్యక్తిగతంగా అవమానాన్ని తీసుకురావడమే కాక సంఘానికి, దేవునికి కూడా అవమానాన్ని తీసుకువస్తుంది.

రాజును సంతోషపెట్టే విషయం గురించి చెబుతూ సొలొమోను ఇలా అంటున్నాడు: “బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు అవమానకరముగా నడచువానిమీద రాజు కోపించును.” (సామెతలు 14:​35) సామెతలు 16:⁠13 ఇలా చెబుతోంది: “నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు.” అవును, మన నాయకుడూ, రాజూ అయిన యేసుక్రీస్తు, మనం నీతియుక్తంగా బుద్ధితో ప్రవర్తించినప్పుడు, రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను తయారుచేసే పనిలో మన పెదవులను ఉపయోఃగించినప్పుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి మనం సత్య దేవునిపట్ల భయభక్తులు చూపించడం ద్వారా కలిగే ఆశీర్వాదాలను మనం అనుభవిస్తూ మనం ఆ పనిలో నిమగ్నమై ఉందాం.

[అధస్సూచి]

^ పేరా 3 సామెతలు 14:​1-25 వచనాల చర్చ కోసం, కావలికోట, నవంబరు 15, 2004, 26-9 పేజీలు, జూలై 15, 2005, 17-20 పేజీలు చూడండి.

[15వ పేజీలోని చిత్రం]

దేవుని భయాన్ని నేర్పించవచ్చు