కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసుక్రీస్తు ఎవరు?

యేసుక్రీస్తు ఎవరు?

యేసుక్రీస్తు ఎవరు?

అంద్రెయ అనే ఒక యువ యూదుడు, నజరేయుడైన యేసు మాటలు మొదటిసారి విన్నప్పుడు ఎంత ఉత్తేజితుడై ఉంటాడో ఊహించండి! అంద్రెయ వెంటనే తన సహోదరుని దగ్గరకు వెళ్ళి “మేము మెస్సీయను [లేక, క్రీస్తును] కనుగొంటిమి” అని చెప్పినట్లు బైబిలు వివరిస్తోంది. (యోహాను 1:​41) హీబ్రూ, గ్రీకు భాషల్లో “మెస్సీయా,” “క్రీస్తు” అని సాధారణంగా అనువదించబడిన పదాలకు “అభిషిక్తుడు” అని అర్థం ఉంది. యేసు అభిషిక్తుడు, లేక దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి, వాగ్దానం చేయబడిన నాయకుడు. (యెషయా 55:⁠4) లేఖనాల్లో ఆయన గురించిన ప్రవచనాలున్నాయి, ఆ కాలంలోని యూదులు ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్నారు.​—⁠లూకా 3:​15.

యేసు నిజంగా దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి అని మనకు ఎలా తెలుస్తుంది? మనం సా.శ. 29వ సంవత్సరంలో యేసు 30వ ఏట ఆయనకు ఏమి జరిగిందో పరిశీలిద్దాం. ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం పొందడానికి ఆయన దగ్గరికి వెళ్ళాడు. దాని గురించి బైబిలు ఇలా చెబుతోంది: “యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. మరియు—ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.” (మత్తయి 3:​16, 17) ఆమోదాన్ని వ్యక్తం చేసే ఆ మాటలు విన్న తర్వాత యేసు, దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి అనే విషయంలో యోహానుకు ఏమైనా అనుమానం కలిగి ఉండవచ్చా? యెహోవా, యేసు మీద తన పరిశుద్ధాత్మ కుమ్మరించడం ద్వారా ఆయనను అభిషిక్తుణ్ణి చేశాడు, లేక తాను స్థాపించబోయే రాజ్యానికి రాజుగా నియమించాడు. అలా యేసు, క్రీస్తు అయ్యాడు, లేక అభిషిక్తుడైన యేసు అయ్యాడు. అయితే, యేసు ఏ విధంగా దేవుని కుమారుడు? ఆయన ఎక్కడ నుండి వచ్చాడు?

ఆయన “పురాతన కాలము” నుండి ఉనికిలో ఉన్నాడు

యేసు జీవితాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. మొదటి దశ, ఆయన మానవునిగా పుట్టడానికి చాలాకాలం ముందే ప్రారంభమైంది. ఆయన “పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము” నుండి ఉనికిలో ఉన్నాడని మీకా 5:⁠2 చెబుతోంది. యేసు స్వయంగా ఇలా చెప్పాడు: “నేను పైనుండువాడను” అంటే పరలోకంలో ఉండేవాడు. (యోహాను 8:​23) ఆయన పరలోకంలో బలమైన ఆత్మసంబంధ వ్యక్తిగా ఉన్నాడు.

సృష్టి అంతటికీ ప్రారంభం ఉంది కాబట్టి, దేవుడు ఒంటరిగా ఉన్న ఒక సమయం ఉంది. అయితే, దేవుడు లెక్కించలేనన్ని సంవత్సరాల క్రితం సృష్టికర్త అయ్యాడు. ఆయన మొదటిగా ఎవరిని సృష్టించాడు? బైబిలు చివరి పుస్తకం యేసును “దేవుని సృష్టికి ఆదియునైనవాడు” అని గుర్తిస్తోంది. (ప్రకటన 3:​14) యేసు “సర్వసృష్టికి ఆదిసంభూతుడు.” ఎందుకంటే “ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని . . . సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.” (కొలొస్సయులు 1:​15, 16) అవును, దేవుడు యేసును మాత్రమే స్వయంగా సృష్టించాడు. అందుకే ఆయన దేవుని “అద్వితీయకుమారునిగా” పిలువబడ్డాడు. (యోహాను 3:​16) జ్యేష్ఠపుత్రునికి “వాక్యము” అనే బిరుదు కూడా ఉంది. (యోహాను 1:​14) ఎందుకు? ఎందుకంటే ఆయన మానవునిగా పుట్టకముందు పరలోకంలో దేవుని తరఫున మాట్లాడే వ్యక్తిగా పనిచేశాడు.

“ఆదియందు,” “భూమ్యాకాశములు” సృష్టించబడినప్పుడు “వాక్యము” యెహోవా దేవునితో ఉన్నాడు. “మన స్వరూపమందు . . . నరులను చేయుదము” అని దేవుడు చెప్పింది ఆయనతోనే. (యోహాను 1:1; ఆదికాండము 1:​1, 26) యెహోవా జ్యేష్ఠ కుమారుడు తన తండ్రి ప్రక్కన ఉండి ఆయనతో కలిసి చురుకుగా పనిచేశాడు. సామెతలు 8:​22-31లో ఆయన ఇలా చెప్పాడని వర్ణించబడుతోంది: “నేను ఆయన [సృష్టికర్త] యొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని.”

యెహోవా దేవుడు, ఆయన అద్వితీయ కుమారుడు కలిసి పనిచేయడం ద్వారా వారు ఒకరినొకరు ఎంత సన్నిహితంగా తెలుసుకొని ఉంటారో కదా! యెహోవా దేవునితో లెక్కలేనన్ని యుగాలు ఆ విధంగా సన్నిహితంగా సహవసించడం దేవుని కుమారుణ్ణి ఎంతో ప్రభావితం చేసింది. ఈ విధేయ కుమారుడు పూర్తిగా తన తండ్రియైన యెహోవాలాగే తయారయ్యాడు. వాస్తవానికి, కొలొస్సయులు 1:​15, యేసును “అదృశ్యదేవుని స్వరూపి” అని పిలుస్తోంది. మన ఆధ్యాత్మిక అవసరాన్ని తీర్చుకోవడానికి, దేవుని గురించి తెలుసుకోవాలని మనకున్న సహజ కోరికను తీర్చుకోవడానికి యేసు గురించిన జ్ఞానం చాలా ప్రాముఖ్యమని చెప్పడానికి ఇదొక కారణం. యేసు భూమ్మీద ఉన్నప్పుడు చేసిన ప్రతీది యెహోవా ఆయన నుండి ఆశించిన విధంగానే ఖచ్చితంగా చేశాడు. అందుకే, యేసు గురించి తెలుసుకోవడం అంటే యెహోవా గురించిన మన జ్ఞానాన్ని పెంచుకోవడమని కూడా దాని భావం. (యోహాను 8:​28; 14:​8-10) అయితే యేసు భూమ్మీదకు ఎలా వచ్చాడు?

మానవునిగా ఆయన జీవితం

దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమ్మీదకు పంపించినప్పుడు యేసు జీవితంలోని రెండవ దశ ప్రారంభమైంది. యెహోవా యేసు జీవాన్ని పరలోకం నుండి మరియ అనే యూదా కన్యక గర్భంలోకి అద్భుతంగా మార్చడం ద్వారా యేసును భూమ్మీదకు పంపించాడు. యేసుకు మానవ తండ్రి లేడు కాబట్టి ఆయనకు ఎలాంటి అపరిపూర్ణతలు వారసత్వంగా రాలేదు. దేవుని పరిశుద్ధాత్మ అంటే దేవుని చురుకైన శక్తి మరియ మీదకు వచ్చింది, ఆయన శక్తి ఆమెను ‘కమ్ముకొని’ ఆమె అద్భుత రీతిలో గర్భవతి అయ్యేలా చేసింది. (లూకా 1:​34, 35) ఆ కారణంగా మరియ ఒక పరిపూర్ణుడైన బాలునికి జన్మనిచ్చింది. వడ్రంగి అయిన యోసేపు దత్త పుత్రునిగా ఆయన నిరాడంబరమైన కుటుంబంలో పెరిగాడు, ఆ కుటుంబంలో ఉన్న చాలామంది పిల్లల్లో ఆయన మొదటివాడు.​—⁠యెషయా 7:14; మత్తయి 1:22, 23; మార్కు 6:⁠3.

యేసు బాల్యం గురించి మనకు ఎక్కువగా తెలియదు, అయితే ఒక సంఘటన మాత్రం గమనార్హమైనది. యేసుకు 12 ఏండ్ల వయసున్నప్పుడు, ఆయన తల్లిదండ్రులు ఆయనను ప్రతీ సంవత్సరం తీసుకెళ్ళినట్లే పస్కా పండుగకు యెరూషలేముకు తీసుకువెళ్ళారు. అక్కడ ఆయన “దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు [అడుగుతూ]” చాలా సమయం ఆలయంలో గడిపాడు. అంతేకాక, “ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ మొందిరి.” అవును, బాలుడైన యేసు ఆలోచన రేకెత్తించే ప్రశ్నలను, మతసంబంధమైన ప్రశ్నలను అడగడం మాత్రమే కాక ఇతరులకు విస్మయం కలిగించిన తెలివైన జవాబులు కూడా ఇచ్చాడు. (లూకా 2:​41-50) ఆయన నజరేతు పట్టణంలో పెరుగుతున్నప్పుడు, తనను పెంచిన తండ్రి దగ్గరే వడ్రంగి పని నేర్చుకున్నాడు.​—⁠మత్తయి 13:55.

యేసు తనకు 30 సంవత్సరాలు వచ్చేంతవరకు నజరేతులోనే నివసించాడు. ఆ తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి యోహాను దగ్గరకు వెళ్ళాడు. యేసు బాప్తిస్మం తీసుకున్న తర్వాత చైతన్యవంతమైన తన పరిచర్యను ప్రారంభించాడు. ఆయన మూడున్నర సంవత్సరాలపాటు తన స్వదేశమంతా సంచరించి దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆయన తనను దేవుడు పంపించాడని రుజువుచేశాడు. ఎలా రుజువు చేశాడు? మానవ సామర్థ్యానికి మించిన శక్తివంతమైన కార్యాలను అంటే అనేక అద్భుతాలను చేయడం ద్వారా రుజువు చేశాడు.​—⁠మత్తయి 4:17; లూకా 19:​37, 38.

యేసు మృదుస్వభావం, ప్రగాఢ భావాలు కూడా ఉన్న వ్యక్తి. ఇతరులను ఆయన దృష్టించిన విధంలో, ఇతరులతో ఆయన వ్యవహరించిన విధంలో ఆయన మృదుత్వం ప్రత్యేకంగా స్పష్టమయింది. యేసు సమీపింపదగిన వ్యక్తి, దయగల వ్యక్తి కాబట్టి ప్రజలు ఆయనకు ఆకర్షితులయ్యారు. పిల్లలు కూడా ఎలాంటి భయం లేకుండా ఆయనతో హాయిగా మెలగగలిగారు. (మార్కు 10:​13-16) యేసు కాలంలో స్త్రీలను కొందరు హీనంగా చూసినా ఆయన మాత్రం వారితో గౌరవంగా వ్యవహరించాడు. (యోహాను 4:​9, 27) బీదవారు, అణచివేయబడినవారు తమ ‘ప్రాణాలకు విశ్రాంతి పొందేందుకు’ ఆయన సహాయం చేశాడు. (మత్తయి 11:​28-30) ఆయన బోధనా పద్ధతి స్పష్టంగా, సరళంగా, ఆచరణాత్మకంగా ఉండేది. సత్య దేవుడైన యెహోవా గురించి తన శ్రోతలు తెలుసుకోవాలనే ఆయన హృదయపూర్వక కోరిక కూడా ఆయన బోధలో ప్రతిబింబించింది.​—⁠యోహాను 17:​6-8.

యేసు దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో అద్భుతాలు చేస్తూ దయతో రోగులను, బాధితులను స్వస్థపరిచాడు. (మత్తయి 15:​30, 31) ఉదాహరణకు, ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: “నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు.” యేసు అప్పుడు ఏమి చేశాడు? ఆయన తన చెయ్యి చాపి ఆ వ్యక్తిని ముట్టుకొని ఆయనతో ఇలా అన్నాడు: “నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము.” అప్పుడు ఆ రోగి స్వస్థత పొందాడు!​—⁠మత్తయి 8:​2-4.

జనసమూహం యేసు దగ్గరకు వచ్చి, ఆయనతో మూడు దినాలు ఉండి ఏమీ తినకుండా ఉన్న సందర్భాన్ని కూడా పరిశీలించండి. ఆయన వారి మీద కనికరపడి ‘స్త్రీలు, పిల్లలు గాక నాలుగువేల మంది పురుషులకు’ అద్భుత రీతిలో భోజన ఏర్పాటు చేశాడు. (మత్తయి 15:​32-38) మరో సందర్భంలో, యేసు తన స్నేహితుల సంక్షేమానికి ముప్పుగా ఉన్న తుపానును నిమ్మళింప చేశాడు. (మార్కు 4:​37-39) ఆయన మరణించినవారిని పునరుత్థానం చేశాడు అంటే తిరిగి బ్రతికించాడు. * (లూకా 7:22; యోహాను 11:​43, 44) యేసు అపరిపూర్ణ మానవజాతికి భవిష్యత్తు గురించి నిరీక్షణ ఉండేలా తన పరిపూర్ణ మానవ జీవితాన్ని కూడా ఇష్టపూర్వకంగా అర్పించాడు. యేసుకు ప్రజలపట్ల ఎంత అపారమైన ప్రేమ ఉందో కదా!

యేసు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?

యేసు 33 1/2 సంవత్సరాల వయసులో హింసాకొయ్య మీద మరణించాడు. * అయితే మరణం ఆయన జీవితానికి అంతం కాదు. యేసు మరణించిన దాదాపు మూడు దినాల తర్వాత యెహోవా దేవుడు తన కుమారుణ్ణి ఒక ఆత్మసంబంధ వ్యక్తిగా పునరుత్థానం చేసినప్పుడు, ఆయన జీవితంలోని మూడవ దశ ప్రారంభమైంది. యేసు తన పునరుత్థానం తర్వాత, సా.శ. మొదటి శతాబ్దంలో జీవించిన వేలాదిమందికి కనిపించాడు. (1 కొరింథీయులు 15:​3-8) ఆ తర్వాత, ఆయన “దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై” రాజరిక అధికారం పొందడానికి వేచి ఉన్నాడు. (హెబ్రీయులు 10:​12, 13) యేసు రాజ్యాధికారాన్ని చేపట్టే సమయం రాగానే రాజుగా పరిపాలించడం ఆరంభించాడు. కాబట్టి ఇప్పుడు యేసును మనం ఎలా ఊహించుకోవాలి? మరణశిక్ష విధించబడి బాధను అనుభవిస్తున్న వ్యక్తిగా మనం ఆయనను ఊహించుకోవాలా? లేదా, ఆరాధించబడాల్సిన వ్యక్తిగా మనం ఆయనను దృష్టించాలా? యేసు ఇప్పుడు ఒక మానవుడూ కాదు, సర్వశక్తిగల దేవుడూ కాదు. బదులుగా, ఆయన రాజుగా పరిపాలిస్తున్న శక్తిమంతుడైన ఒక ఆత్మ ప్రాణి. ఆయన ఇప్పుడు అతి త్వరలో కష్టాలతో నిండివున్న మన భూమ్మీద తన పరిపాలనను ప్రారంభిస్తాడు.

ప్రకటన 19:​11-16, యేసు తెల్లని గుర్రం మీద కూర్చొని నీతినిబట్టి తీర్పు తీర్చడానికి, యుద్ధం చేయడానికి వస్తున్న రాజని సూచనార్థక భాష ఉపయోగించి వివరిస్తోంది. “జనములను కొట్టుటకై ఆయన” దగ్గర “వాడిగల ఖడ్గము” ఉంది. అవును, యేసు దుష్టులను నాశనం చేయడానికి తన గొప్ప శక్తిని ఉపయోగిస్తాడు. ఆయన భూమ్మీద ఉన్నప్పుడు కనబరచిన మాదిరిని అనుసరించడానికి కృషి చేసే వారి విషయమేమిటి? (1 పేతురు 2:​21) దేవుని పరలోక రాజ్యంలో వారు భూమ్మీద నిరంతరం జీవించడానికి ఆయనా, ఆయన తండ్రీ హార్‌మెగిద్దోను అని పిలువబడే, రానున్న “సర్వాధికారియైన దేవుని మహాదినములో” వారిని రక్షిస్తారు.​—⁠ప్రకటన 7:​9, 14; 16:​14, 15; 21:​3, 4.

యేసు తన శాంతియుత పరిపాలనలో మానవజాతి అంతటి కోసం ఎన్నో గొప్ప అద్భుతాలు చేస్తాడు. (యెషయా 9:​6, 7; 11:​1-10) ఆయన రోగాలను నయం చేసి మరణాన్ని అంతమొందిస్తాడు. కోట్లాదిమందిని పునరుత్థానం చేసి వారికి భూమ్మీద నిరంతరం జీవించే అవకాశం ఇవ్వడానికి దేవుడు యేసును ఉపయోగిస్తాడు. (యోహాను 5:​28, 29) రాజ్య పరిపాలనలో మన జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మనం ఊహించలేం. కాబట్టి మనం బైబిలు జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో కొనసాగుతూ యేసుక్రీస్తు గురించి ఎక్కువ తెలుసుకోవడం ప్రాముఖ్యం.

[అధస్సూచీలు]

^ పేరా 15 యేసు చేసిన అద్భుతాలు అందరికీ తెలిసినవే. ఆయన ‘అనేకమైన సూచకక్రియలు చేశాడని’ యేసు శత్రువులు కూడా అంగీకరించారు.​—⁠యోహాను 11:​47, 48.

^ పేరా 17 క్రీస్తు మ్రాను మీద చనిపోయాడా లేదా సిలువ మీద చనిపోయాడా అనే విషయం గురించిన వివరణ కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాలనుండి తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలోని 89-90 పేజీలను చూడండి.

[7వ పేజీలోని బాక్సు]

యేసు సర్వశక్తిగల దేవుడా?

చాలామంది దైవభక్తిగల ప్రజలు యేసు దేవుడు అని అంటారు. కొందరు దేవుడు త్రియేక దేవుడు అని వాదిస్తారు. ఆ బోధ ప్రకారం, “తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, అయినా ముగ్గురు వేర్వేరు దేవుళ్ళు కాదు కానీ ఒకే దేవుడు.” ఈ ముగ్గురు “నిత్యులు, సమానులు” అని నమ్మబడుతోంది. (ద క్యాథలిక్‌ ఎన్‌సైక్లోపీడియా) అలాంటి అభిప్రాయాలు సరైనవేనా?

యెహోవా దేవుడు సృష్టికర్త. (ప్రకటన 4:​10, 11) ఆయనకు ఆది గానీ అంతం గానీ లేదు, ఆయన సర్వశక్తిమంతుడు. (కీర్తన 90:⁠2) మరోవైపు యేసుకు ఆది ఉంది. (కొలొస్సయులు 1:​15, 16) దేవుణ్ణి తన తండ్రిగా పేర్కొంటూ యేసు ఇలా అన్నాడు: “తండ్రి నాకంటె గొప్పవాడు.” (యోహాను 14:​28) యేసు కొన్ని విషయాలు తనకు గానీ దేవదూతలకు గానీ తెలియవు కానీ తన తండ్రికి మాత్రమే తెలుసు అని కూడా వివరించాడు.​—⁠మార్కు 13:​32.

అంతేకాక, యేసు తన తండ్రికి ఇలా ప్రార్థించాడు: “నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక.” (లూకా 22:​42) యేసు సర్వోన్నతుడైన వ్యక్తికి కాక మరెవరికి ప్రార్థిస్తున్నాడు? అంతేకాక యేసును మృతులలో నుండి దేవుడే పునరుత్థానం చేశాడు, యేసు తనంతటతానే పునరుత్థానం కాలేదు. (అపొస్తలుల కార్యములు 2:​32) యేసు భూమ్మీదకు రాకముందు గానీ వచ్చిన తర్వాత గానీ తండ్రీకుమారులు సమానులుగా లేరన్నది స్పష్టం. యేసు పరలోకానికి పునరుత్థానం చేయబడిన తర్వాతి విషయమేమిటి? మొదటి కొరింథీయులు 11:⁠3 ఇలా చెబుతోంది: “క్రీస్తునకు శిరస్సు దేవుడు.” వాస్తవానికి కుమారుడు ఎల్లప్పుడూ దేవునికి లోబడే ఉంటాడు. (1 కొరింథీయులు 15:​28) కాబట్టి, యేసు సర్వశక్తిగల దేవుడు కాదని లేఖనాలు చూపిస్తున్నాయి. బదులుగా, ఆయన దేవుని కుమారుడు.

త్రిత్వంలో మూడవ వ్యక్తిగా పిలువబడే పరిశుద్ధాత్మ, ఒక వ్యక్తి కాదు. ఎలీహు ఇలా అన్నాడు: “దేవుని ఆత్మ నన్ను సృజించెను.” (యోబు 33:4) ఆ ఆత్మ దేవుడు కాదు, అది తాను కోరుకున్నది నెరవేర్చడానికి ఆయన పంపించే లేక ఉపయోగించే చురుకైన శక్తి. దేవుడు దానిని ఉపయోగించి ఆకాశాలను, భూమిని, సమస్త జీవరాశిని సృష్టించాడు. (ఆదికాండము 1:2; కీర్తన 33:⁠6) దేవుడు బైబిలును వ్రాసిన వ్యక్తులను ప్రేరేపించడానికి తన పరిశుద్ధాత్మను ఉపయోగించాడు. (2 పేతురు 1:​20, 21) కాబట్టి త్రిత్వం లేఖనానుసారమైన బోధ కాదు. * “మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా” అని బైబిలు చెబుతోంది.​—⁠ద్వితీయోపదేశకాండము 6:⁠4.

[అధస్సూచి]

^ పేరా 28 అదనపు సమాచారం కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన త్రిత్వమును మీరు నమ్మవలయునా? అనే బ్రోషుర్‌ను చూడండి.

[5వ పేజీలోని చిత్రం]

యేసు తన బాప్తిస్మం సమయంలో దేవుని అభిషిక్తుడు అయ్యాడు

[7వ పేజీలోని చిత్రం]

యేసు తన శక్తిని దేవుడు ఇచ్చిన పనిని చేయడానికి ఉపయోగించాడు

[7వ పేజీలోని చిత్రం]

యేసు ఇప్పుడు ఒక శక్తిమంతుడైన రాజుగా ఉన్నాడు