కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసుక్రీస్తు నడిచినట్లు నడుచుకోండి

యేసుక్రీస్తు నడిచినట్లు నడుచుకోండి

యేసుక్రీస్తు నడిచినట్లు నడుచుకోండి

ఆయనయందు [దేవునియందు] నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన [యేసు] ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు.”​—⁠1 యోహాను 2:⁠5.

“విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు [“శ్రద్ధగా,” NW] చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (హెబ్రీయులు 12:​1-2) మనం విశ్వసనీయ మార్గంలో నడవాలంటే, యేసుక్రీస్తువైపు శ్రద్ధగా చూడాల్సిన అవసరం ఉంది.

2 క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ‘శ్రద్ధగా చూడడం’ అని అనువదించబడిన ఆదిమ భాషలోని మూలపదానికి, “పరధ్యానంలో పడకుండా అవధానం నిలపడం,” “రెప్పవాల్చకుండా దృష్టి కేంద్రీకరించడం” అనే అర్థాలున్నాయి. ఒక రెఫరెన్సు గ్రంథం ఇలా చెబుతోంది: “స్టేడియంలో పరుగెత్తే ఒక గ్రీకు క్రీడాకారుడు తను పరుగెడుతున్న దిశ నుండి, గమ్యం నుండి తన దృష్టిని మరల్చి ప్రేక్షకులవైపు చూసిన మరుక్షణమే తన వేగాన్ని కోల్పోతాడు. క్రైస్తవుల విషయంలోనూ అలాగే జరుగుతుంది.” పరధ్యానంలో పడిపోవడం మన ఆధ్యాత్మిక పురోగతికి అవరోధం కలిగిస్తుంది. మనం యేసుక్రీస్తును శ్రద్ధగా చూడాలి. ఆయనలో మనం దేని కోసం చూస్తున్నాం? ఇక్కడ “కర్త” అని అనువదించబడిన గ్రీకు పదానికి, “అన్ని విషయాల్లో సారథ్యం వహిస్తూ మాదిరిగా ఉండే ముఖ్య సారథి” అనే అర్థముంది. యేసువైపు శ్రద్ధగా చూడడం అంటే ఆయన మాదిరిని అనుకరించాలి.

3 “ఆయనయందు [దేవునియందు] నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన [యేసు] ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు” అని బైబిలు చెబుతోంది. (1 యోహాను 2:⁠5) యేసు తన తండ్రి ఆజ్ఞలను పాటించినట్లే మనమూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, దేవునియందు నిలిచి ఉండాలి.​—⁠యోహాను 15:10.

4 కాబట్టి మనం యేసు నడిచినట్లే నడవాలంటే, ముఖ్య సారథిగా ఆయననే జాగ్రత్తగా గమనిస్తూ ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి. దీనికి సంబంధించి పరిశీలించవలసిన ముఖ్యమైన ప్రశ్నలు ఏవంటే: నేడు క్రీస్తు మనల్ని ఎలా నడిపిస్తున్నాడు? ఆయన నడిచిన విధానాన్ని అనుకరించడం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? యేసుక్రీస్తు ఉంచిన మాదిరికి హత్తుకొని ఉండడంవల్ల కలిగే ప్రయోజనాలేమిటి?

క్రీస్తు తన అనుచరులను ఎలా నడిపిస్తున్నాడు?

5 పునరుత్థానం చేయబడిన యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమవడానికి ముందు తన శిష్యులకు కనబడి, వారికి ఒక ప్రాముఖ్యమైన పనిని అప్పగించాడు. ఆయన వారికిలా చెప్పాడు: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.” ఈ పనిని వారు చేస్తుండగా తాను కూడా వారికి తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఆ సందర్భంలో ముఖ్య సారథి ఇలా అన్నాడు: “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” (మత్తయి 28:19, 20) ఈ యుగసమాప్తి కాలంలో యేసుక్రీస్తు ఎలా తన అనుచరులతో ఉన్నాడు?

6 “ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును” అని యేసు చెప్పాడు. (యోహాను 14:26) యేసు నామమున పంపించబడిన పరిశుద్ధాత్మ నేడు మనలను నిర్దేశిస్తూ, బలపరుస్తోంది. అది మనకు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగిస్తూ “దేవుని మర్మములను” సహితం అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తోంది. (1 కొరింథీయులు 2:10) అంతేకాక, దైవిక లక్షణాలైన “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” ఆత్మ ఫలాలై ఉన్నాయి. (గలతీయులు 5:​22, 23) పరిశుద్ధాత్మ సహాయంతో మనమీ లక్షణాలను పెంపొందించుకోవచ్చు.

7 లేఖనాలను అధ్యయనం చేస్తూ మనం నేర్చుకున్నవి అన్వయించుకోవడానికి కృషి చేస్తుండగా మనం, జ్ఞానం, వివేచన, అవగాహన, పరిజ్ఞానం, వివేకం, ఆలోచనా శక్తి వంటివాటిలో ఎదగడానికి యెహోవా ఆత్మ మనకు సహాయం చేస్తుంది. (సామెతలు 2:1-11) శోధనలను, పరీక్షలను సహించడానికి కూడా పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తుంది. (1 కొరింథీయులు 10:13; 2 కొరింథీయులు 4:7; ఫిలిప్పీయులు 4:13) ‘పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరానికి, ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి పవిత్రులుగా చేసుకోవాలని’ క్రైస్తవులకు ఉద్బోధించబడింది. (2 కొరింథీయులు 7:1) పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం దేవుడు కోరే పరిశుద్ధతకు లేదా పవిత్రతకు అనుగుణంగా నిజంగా జీవించగలమా? నేడు మనల్ని నడిపించడానికి యేసు ఉపయోగించే మాధ్యమాల్లో ఒకటి పరిశుద్ధాత్మ, యెహోవా దేవుడు దీనిని ఉపయోగించడానికి తన కుమారునికి అధికారమిచ్చాడు.​—⁠మత్తయి 28:18.

8 సంఘాన్ని నడిపించడానికి క్రీస్తు నేడు ఉపయోగిస్తున్న మరో మాధ్యమాన్ని పరిశీలించండి. యేసు తన ప్రత్యక్షత గురించి, యుగసమాప్తి గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నాడు: “యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”​—⁠మత్తయి 24:3, 45-47.

9 ఆ యజమాని యేసుక్రీస్తు. భూమ్మీది అభిషిక్త క్రైస్తవుల గుంపే ఆ “దాసుడు.” యేసు భూసంబంధ ఆస్తుల గురించి శ్రద్ధ తీసుకుంటూ, తగినవేళ ఆధ్యాత్మిక ఆహారంపెట్టే బాధ్యత ఈ దాసునికి అప్పగించబడింది. ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా’ ఉన్న ఆ సంయుక్త దాసుని గుంపులో నుండి, అర్హులైన కొందరు పైవిచారణకర్తలు ఆ దాసునికి ప్రతీకగా, పరిపాలక సభగా రూపొందారు. ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిని, తగినవేళ ఆధ్యాత్మిక పోషకాహారాన్ని అందించే పనిని వారు నిర్దేశిస్తున్నారు. ఆ విధంగా ఆత్మాభిషిక్త “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా, తన పరిపాలక సభ ద్వారా క్రీస్తు సంఘాన్ని నడిపిస్తున్నాడు.

10 క్రీస్తు నాయకత్వానికి మరో రుజువు ‘మనుష్యులకు అనుగ్రహించబడిన ఈవులు,’ అంటే క్రైస్తవ పెద్దలు లేదా పైవిచారణకర్తలు. ‘పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరిగించుటకును’ వారు అనుగ్రహించబడ్డారు. (ఎఫెసీయులు 4:​8, 13) వారి గురించి హెబ్రీయులు 13:7 ఇలా చెబుతోంది: “మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.” సంఘంలో పెద్దలు సారథ్యం వహిస్తారు. వారు క్రీస్తు యేసును అనుకరిస్తారు కాబట్టి, వారి విశ్వాసం అనుకరణకు యోగ్యమైనదిగా ఉంటుంది. (1 కొరింథీయులు 11:1) ‘మనుష్యులకు అనుగ్రహించబడిన ఈ ఈవులకు’ విధేయత చూపిస్తూ, లోబడడం ద్వారా పెద్దల ఏర్పాటుపట్ల మనం మన కృతజ్ఞతా భావాన్ని చూపించవచ్చు.​—⁠హెబ్రీయులు 13:17.

11 అవును, యేసుక్రీస్తు నేడు తన అనుచరులను పరిశుద్ధాత్మ ద్వారా, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా, సంఘ పెద్దల ద్వారా నడిపిస్తున్నాడు. కీస్తు నడిచినట్లుగా మనం కూడా నడవడంలో ఆయన సారథ్య విధానాన్ని అర్థం చేసుకొని దానికి లోబడడం ఇమిడివుంది. దానితోపాటు ఆయన నడిచిన విధానాన్ని అనుకరించడం కూడా అవసరం. “ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను” అని అపొస్తలుడైన పేతురు వ్రాశాడు. (1 పేతురు 2:​20, 21) యేసు పరిపూర్ణ మాదిరిని అనుసరించడం ఏ విధంగా మనల్ని ప్రభావితం చేయాలి?

అధికార నిర్వహణలో సమతుల్యంగా ఉండండి

12 యేసుకు తన తండ్రి నుండి సాటిలేని అధికారం లభించినప్పటికీ, దాని నిర్వహణలో ఆయన సమతుల్యతను ప్రదర్శించాడు. సంఘంలోని వారందరూ ప్రత్యేకంగా పైవిచారణకర్తలు తమ సమతుల్యతను లేదా ‘సహనాన్ని సకల జనులకు తెలియబడనివ్వాలి.’ (ఫిలిప్పీయులు 4:5; 1 తిమోతి 3:2, 3) సంఘంలో పెద్దలకు కొంతమేరకు అధికారం ఉంటుంది కాబట్టి, దాని నిర్వహణలో వారు క్రీస్తు అడుగుజాడల్లో నడవడం అత్యంత ప్రాముఖ్యం.

13 యేసు తన శిష్యుల పరిమితులను పరిగణలోకి తీసుకున్నాడు. వారు ఇవ్వగలిగిన దానికన్నా ఆయన వారినుండి ఎక్కువ కోరలేదు. (యోహాను 16:12) యేసు తన అనుచరులను ఒత్తిడి చేయకుండా, దేవుని చిత్తం చేయడంలో “పోరాడుడి” అని ప్రోత్సహించాడు. (లూకా 13:24) ఆయన సారథ్యం వహిస్తూ వారి హృదయాలను ప్రేరేపించడం ద్వారా వారిని ప్రోత్సహించాడు. అదేవిధంగా, జంకుతూనో లేదా అపరాధ భావంతోనో దేవుణ్ణి సేవించేలా నేడు క్రైస్తవ పెద్దలు ఇతరులను భయపెట్టరు. బదులుగా, వారు యెహోవాపట్ల, యేసుపట్ల, తోటివారిపట్ల తమకున్న ప్రేమనుబట్టి ఆయనను సేవించాలని వారిని ప్రోత్సహిస్తారు.​—⁠మత్తయి 22:37-39.

14 ప్రజల జీవితాలను అదుపుచేస్తూ యేసు తనకివ్వబడిన అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. లేదా వారు పాటించలేని ప్రమాణాలను పెట్టలేదు, లేక చెప్పలేనన్ని నియమాలను విధించలేదు. మోషే ద్వారా ఇవ్వబడిన నియమాల వెనకున్న సూత్రాలతో వారి హృదయాలను ఆకట్టుకొనే పద్ధతితో ఆయన ఇతరులను పురికొల్పాడు. (మత్తయి 5:27, 28) యేసుక్రీస్తు మాదిరిని అనుసరిస్తూ పెద్దలు తమ అభిప్రాయాలనుబట్టి నియమాలు విధించరు లేదా తమ వ్యక్తిగత దృక్కోణాలే చెల్లుబాటు కావాలని పట్టుబట్టరు. దుస్తులు, కనబడే తీరు లేదా ఉల్లాస కార్యకలాపాలు, వినోదం విషయాల్లో పెద్దలు మీకా 6:8; 1 కొరింథీయులు 10:31-33; 1 తిమోతి 2:​9, 10 వంటి లేఖనాల్లో ప్రస్తావించబడిన దైవిక సూత్రాలను ఉపయోగిస్తూ వారి హృదయాలను చేరడానికి ప్రయత్నిస్తారు.

సానుభూతి చూపండి, క్షమించండి

15 క్రీస్తు తన శిష్యుల వైఫల్యాల విషయంలో, తప్పుల విషయంలో వారితో వ్యవహరించిన విధానాన్ని మనం అనుసరించేందుకు మనకొక మాదిరినుంచాడు. భూమిమీద మానవునిగా ఆయన గడిపిన చివరి రాత్రి జరిగిన రెండు సంఘటనలను పరిశీలించండి. గెత్సేమనేకు వచ్చిన తర్వాత యేసు, “పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి . . . మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో” చెప్పాడు. ఆ తర్వాత ‘కొంతదూరము సాగిపోయి నేలమీద పడి ప్రార్థించడం ఆరంభించాడు.’ ఆయన తిరిగివచ్చినప్పుడు, “వారు నిద్రించుచుండుట” చూశాడు. అప్పుడు యేసు ఎలా ప్రతిస్పందించాడు? ఆయనిలా అన్నాడు: “ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము.” (మార్కు 14:32-38) ఆయన పేతురును, యాకోబును, యోహానును కఠినంగా గద్దించలేదు, బదులుగా వారిపట్ల సానుభూతి కనబరిచాడు. ఆ రాత్రే పేతురు యేసును ఎరుగనని మూడుసార్లు అబద్ధమాడాడు. (మార్కు 14:66-72) ఆ తర్వాత యేసు పేతురును ఎలా దృష్టించాడు? “ప్రభువు నిజముగా లేచి సీమోను [పేతురు]నకు కనబడెను.” (లూకా 24:34) ఆయన “కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడెను” అని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 15:5) యేసు కోపగించుకోకుండా పశ్చాత్తాపం చూపించిన అపొస్తలుణ్ణి క్షమించి ఆయనను బలపరిచాడు. ఆ తర్వాత యేసు పేతురుకు గొప్ప బాధ్యతలను అప్పగించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 2:​14; 8:​14-17; 10:44, 45.

16 మన తోటి విశ్వాసులు మానవ అపరిపూర్ణత కారణంగా ఏదోక రీతిలో విఫలమైనప్పుడు లేదా మనపట్ల తప్పు చేసినప్పుడు, యేసులాగే మనం కూడా సానుభూతి చూపిస్తూ క్షమించవద్దా? పేతురు తన తోటి విశ్వాసులకు ఇలా ఉద్బోధించాడు: “మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి. . . . కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణయైనను చేయక” ఉండుడి. (1 పేతురు 3:8, 9) ఒక వ్యక్తి మనతో యేసు వ్యవహరించి ఉండగల విధంగా వ్యవహరించకుండా, సానుభూతి చూపించడానికి, క్షమించడానికి నిరాకరిస్తే అప్పుడేమిటి? అప్పుడు కూడా మనం యేసును అనుకరించడానికి ప్రయత్నిస్తూ, ఆయన స్పందించి ఉండగల విధంగానే మనమూ స్పందించవలసిన బాధ్యత మనపై ఉంది.​—⁠1 యోహాను 3:16.

రాజ్య సంబంధ విషయాలకు ప్రథమ స్థానమివ్వండి

17 మరో విషయంలో కూడా మనం యేసుక్రీస్తులాగే నడుచుకోవలసిన అవసరం ఉంది. దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం యేసు జీవితంలో అతి ప్రాముఖ్యమైన స్థానం వహించింది. సమరయలో సుఖారను పట్టణం దగ్గర సమరయ స్త్రీకి ప్రకటించిన తర్వాత, యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.” (యోహాను 4:34) తండ్రి చిత్తం చేయడం యేసును బలపరిచింది; అది ఆహారంలా ఆయనకు పుష్టిని, సంతృప్తిని, సేదదీర్పును ఇచ్చింది. దేవుని చిత్తం చేయడం మీదే దృష్టిసారిస్తూ యేసును అనుకరించడం నిజంగా అర్థవంతమైన, సంతృప్తికరమైన జీవితానికి నడిపించదా?

18 పూర్తికాల సేవ చేసేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించినప్పుడు, వారు వారి పిల్లలు అనేక ఆశీర్వాదాలు అనుభవిస్తారు. కవల పిల్లల తండ్రి తన కుమారులిద్దరికీ వారి చిన్నతనం నుండే పయినీరు సేవను లక్ష్యంగా పెట్టాడు. తమ విద్యాభ్యాసం ముగిసిన తర్వాత ఆ కవలలిద్దరూ పయినీరు సేవను చేపట్టారు. ఫలితంగా తనకు లభించిన ఆనందాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ తండ్రి ఇలా వ్రాస్తున్నాడు: “మా పిల్లలు మమ్మల్ని నిరాశపరచలేదు. ‘కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము’ అని మేము కృతజ్ఞతాపూర్వకంగా చెప్పగలం.” (కీర్తన 127:3) పూర్తికాల సేవను చేపట్టడం ద్వారా పిల్లలు ఎలా ప్రయోజనం పొందుతారు? ఐదుగురు పిల్లల ఒక తల్లి ఇలా చెబుతోంది: “పయినీరు సేవ మా పిల్లలకు యెహోవాతో మరింత సన్నిహిత సంబంధాన్ని వృద్ధి చేసుకోవడానికి సహాయం చేసింది, వారి వ్యక్తిగత అధ్యయన అలవాట్లను మెరుగుపరిచింది, తమ సమయాన్ని జ్ఞానయుక్తంగా సద్వినియోగం చేసుకోవడాన్ని వారికి నేర్పడమే కాక, తమ జీవితాల్లో ఆధ్యాత్మిక విషయాలకు ప్రథమ స్థానమెలా ఇవ్వాలో నేర్చుకోవడానికి కూడా సహాయం చేసింది. అందుకు వారందరూ అనేక సర్దుబాట్లు చేసుకోవాల్సివచ్చినా, తాము అనుసరించడానికి ఎంచుకున్న మార్గాన్నిబట్టి వారిలో ఎవ్వరూ చింతించడం లేదు.”

19 యౌవనులారా, మీ భవిష్యత్‌ ప్రణాళికలు ఏమిటి? ఏదోక వృత్తిపరమైన రంగంలో అత్యున్నత స్థాయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారా? లేక పూర్తికాల సేవకోసం కృషి చేస్తున్నారా? “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి” అని పౌలు హెచ్చరించాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: “ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.”​—⁠ఎఫెసీయులు 5:15-17.

విశ్వసనీయంగా ఉండండి

20 యేసు నడిచినట్లు నడవాలంటే ఆయన విశ్వసనీయతను అనుకరించాలి. యేసు విశ్వసనీయత గురించి, బైబిలు ఇలా చెబుతోంది: “ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను.” యేసు తన విషయంలో దేవుని చిత్తానికి విశ్వసనీయంగా లోబడడం ద్వారా యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించాడు. ఆయన హింసాకొయ్యపై మరణం అనుభవించునంతగా విధేయత చూపించాడు. మనం కూడా ‘ఈ మనస్సును కలిగియుండి’ దేవుని చిత్తం చేయడానికి విశ్వసనీయంగా లోబడాలి.​—⁠ఫిలిప్పీయులు 2:5-8.

21 యేసు తన నమ్మకమైన అపొస్తలులపట్ల కూడా విశ్వసనీయతను ప్రదర్శించాడు. వారికి బలహీనతలు, అపరిపూర్ణతలు ఉన్నప్పటికీ యేసు వారిని “అంతమువరకు” ప్రేమించాడు. (యోహాను 13:1) అదే విధంగా, మన సహోదరుల అపరిపూర్ణతలు మనం వారిపట్ల విమర్శనాత్మక వైఖరి అవలంబించేలా చేయకూడదు.

యేసు ఉంచిన మాదిరిని అంటిపెట్టుకొని ఉండండి

22 నిజమే, అపరిపూర్ణ మానవులుగా మనం, పరిపూర్ణుడైన మన మాదిరికర్త అడుగుజాడల్లో ఖచ్చితమైన రీతిలో నడవలేం. అయితే, ఆయన అడుగుల్ని సన్నిహితంగా అనుసరించడానికి మనం కృషి చేయవచ్చు. అలా నడిచేందుకు క్రీస్తు సారథ్య విధానాన్ని అర్థం చేసుకొని, దానికి లోబడుతూ ఆయన మాదిరిని అంటిపెట్టుకొని ఉండడం అవసరం.

23 క్రీస్తును అనుకరించేవారిగా ఉండడం అనేక ఆశీర్వాదాలకు దారితీస్తుంది. మన సొంత చిత్తం చేసుకోవడం మీద కాక దేవుని చిత్తం చేయడం మీదే దృష్టి సారిస్తాం కాబట్టి మన జీవితం మరింత అర్థవంతంగా, సంతృప్తికరంగా మారుతుంది. (యోహాను 5:​30; 6:38) మనకు మంచి మనస్సాక్షి ఉంటుంది. మనం నడిచే విధానం ఆదర్శవంతంగా ఉంటుంది. యేసు తన దగ్గరకొచ్చి విశ్రాంతి పొందమని ప్రయాసపడుతూ, భారము మోస్తున్న సమస్త ప్రజలను ఆహ్వానించాడు. (మత్తయి 11:28-30) మనం యేసు మాదిరిని అనుసరించినప్పుడు, మనం కూడా ఇతరులకు మన సహవాసంలో సేదదీర్పును అందిస్తాం. కాబట్టి మనం యేసు నడిచినట్లే నడుచుకుందాం.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

నేడు క్రీస్తు తన అనుచరులను ఎలా నడిపిస్తున్నాడు?

పెద్దలు తమకు దేవుడు అనుగ్రహించిన అధికార నిర్వహణలో క్రీస్తు సారథ్యాన్ని ఎలా అనుసరించవచ్చు?

ఇతరుల వైఫల్యాలతో వ్యవహరించేటప్పుడు మనమెలా యేసు మాదిరిని అనుసరించవచ్చు?

యౌవనులు రాజ్య సంబంధ విషయాలకు ఎలా ప్రథమ స్థానమివ్వవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. యేసువైపు శ్రద్ధగా చూడడంలో ఏమి ఇమిడివుంది?

3, 4. (ఎ) యేసుక్రీస్తు నడిచినట్లే నడుచుకోవాలంటే మనమేమి చేయాలి? (బి) ఏ ప్రశ్నలను మనం శ్రద్ధగా పరిశీలించాలి?

5. యేసు పరలోకానికి ఆరోహణమవడానికి ముందు తన అనుచరులకు ఏమని వాగ్దానం చేశాడు?

6, 7. యేసు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఎలా నడిపిస్తాడు?

8, 9. సారథ్యం వహించడానికి “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుణ్ణి” క్రీస్తు ఎలా ఉపయోగిస్తున్నాడు?

10. పెద్దలపట్ల మన దృక్పథమెలా ఉండాలి, ఎందుకు?

11. క్రీస్తు నేడు తన అనుచరులను ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఆయన నడిచినట్లే నడవడంలో ఏమి ఇమిడివుంది?

12. సంఘంలోని పెద్దలకు క్రీస్తు మాదిరిలోని ఏ అంశం ప్రత్యేకంగా ఆసక్తికరమైనదై ఉండాలి?

13, 14. దేవుణ్ణి సేవించడానికి ఇతరులను ప్రోత్సహించడం ద్వారా పెద్దలు ఏ విధంగా క్రీస్తును అనుకరించవచ్చు?

15. యేసు తన శిష్యుల వైఫల్యాల విషయంలో ఎలా స్పందించాడు?

16. మన తోటి విశ్వాసులు ఏదోక రీతిలో విఫలమైనప్పుడు లేదా మనపట్ల తప్పు చేసినప్పుడు యేసులాగే మనమూ ఎలా నడుచుకోవచ్చు?

17. దేవుని చిత్తం చేయడానికి యేసు తన జీవితంలో ప్రథమ స్థానమిచ్చాడని ఏది చూపిస్తోంది?

18. పూర్తికాల సేవ చేపట్టడానికి పిల్లలను ప్రోత్సహించడం ఫలితంగా ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?

19. ఎలాంటి భవిష్యత్‌ ప్రణాళికలను యౌవనులు జ్ఞానయుక్తంగా ఆలోచించాలి?

20, 21. యేసు ఏ విధంగా విశ్వసనీయంగా ఉన్నాడు, ఆయన విశ్వసనీయతను మనమెలా అనుకరించవచ్చు?

22, 23. యేసు ఉంచిన మాదిరిని అంటిపెట్టుకొని ఉండడంవల్ల ఎలాంటి ఆశీర్వాదాలు లభిస్తాయి?

[23వ పేజీలోని చిత్రం]

క్రీస్తు సారథ్యాన్ని అనుసరించడానికి క్రైస్తవ పెద్దలు మనకు సహాయం చేస్తారు

[24, 25వ పేజీలోని చిత్రాలు]

యౌవనులారా, ప్రతిఫలదాయకమైన క్రైస్తవ జీవితం కోసం మీరు ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటున్నారు?