కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వెలిచూపుతో కాక విశ్వాసంతో నడుచుకోండి!

వెలిచూపుతో కాక విశ్వాసంతో నడుచుకోండి!

వెలిచూపుతో కాక విశ్వాసంతో నడుచుకోండి!

“వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము.”​—⁠2 కొరింథీయులు 5:⁠6.

అది సా.శ. 55వ సంవత్సరం. క్రైస్తవులను హింసించే సౌలు క్రైస్తవత్వాన్ని స్వీకరించి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. దేవుని మీద తన నమ్మకాన్ని బలహీనపరచడానికి ఆయన గడిచిన ఆ కాలాన్ని అనుమతించలేదు. ఆయన తన భౌతిక నేత్రాలతో పరలోకంలో ఉన్నవాటిని చూడకపోయినా, విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డాడు. పరలోక నిరీక్షణగల అభిషిక్త క్రైస్తవులకు వ్రాస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము.”​—⁠2 కొరింథీయులు 5:⁠6.

2 విశ్వాసముతో నడుచుకోవాలంటే, మన జీవితాలను నిర్దేశించే దేవుని సామర్థ్యంపై మనకు ప్రగాఢ నమ్మకం ఉండాలి. మనకు అత్యంత ప్రయోజనకరమైనదేదో ఆయనకు నిజంగా తెలుసని మనకు పూర్తి ఒప్పుదల ఉండాలి. (కీర్తన 119:66) మనం జీవితంలో నిర్ణయాలు తీసుకొని వాటి ప్రకారం నడుస్తుండగా, “మనకు కనిపించనివాటిని” పరిగణలోకి తీసుకుంటాం. (హెబ్రీయులు 11:​1, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) వీటిలో వాగ్దానం చేయబడిన ‘క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి’ ఉన్నాయి. (2 పేతురు 3:​13) మరోవైపున, వెలిచూపుతో నడవడమంటే, మన భౌతిక జ్ఞానేంద్రియాలు గ్రహించగల వాటితో నిర్దేశించబడే జీవిత విధానాన్ని అనుసరించడమని అర్థం. ఇది ప్రమాదకరమైనది, ఎందుకంటే అది దేవుని చిత్తాన్ని పూర్తిగా పెడచెవినబెట్టేందుకు దారితీయవచ్చు.​—⁠కీర్తన 81:12; ప్రసంగి 11:⁠9.

3 మనం పరలోక పిలుపుగల ‘చిన్నమందకు’ చెందినవారమైనా లేక భూసంబంధ నిరీక్షణగల ‘వేరే గొఱ్ఱెలకు’ చెందినవారమైనా సరే మనలో ప్రతీ ఒక్కరం వెలి చూపుతో కాక, విశ్వాసంతో నడుచుకోవాలనే హెచ్చరికను లక్ష్యపెట్టాలి. (లూకా 12:​32; యోహాను 10:​16) ఈ ప్రేరేపిత సలహాను పాటించడం ‘అల్పకాల పాపభోగమునకు’ బలికాకుండా, ఐశ్వర్యాసక్తి అనే ఉరిలో చిక్కుకోకుండా, విధానాంతపు విషయాన్ని మరచిపోకుండా మనల్ని ఎలా కాపాడుతుందో పరిశీలిద్దాం. వెలిచూపుతో నడుచుకోవడంవల్ల కలిగే ప్రమాదాలను కూడా మనం పరిశీలిద్దాం.​—⁠హెబ్రీయులు 11:24.

‘అల్పకాల పాపభోగము అనుభవించడాన్ని’ తిరస్కరించడం

4 అమ్రాము కుమారుడైన మోషే అనుభవించే అవకాశం ఉన్న జీవితం గురించి ఒక్కసారి ఊహించండి. ప్రాచీన ఐగుప్తులో రాజ కుటుంబంలో పెరిగిన మోషేకు అధికారం, ఐశ్వర్యం, ప్రాబల్యం సంపాదించుకోవడం తన చేతిలో పని. మోషే ఇలా తర్కించి ఉండగలిగేవాడే: ‘ప్రఖ్యాత ఐగుప్తు జ్ఞానంలో నిష్ణాతుడను, మాటలోను, చేతలోనూ నాకు తిరుగులేదు. నేను రాజ కుటుంబంతోనే ఉంటే, అణచివేతకు గురవుతున్న నా హెబ్రీ సహోదరులకు సహాయం చేయడానికి నేను నా స్థానాన్ని ఉపయోగించే అవకాశం ఉంది.’ (అపొస్తలుల కార్యములు 7:​22) అయితే మోషే దానికి భిన్నంగా ‘దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడాన్ని’ ఎంచుకున్నాడు. కారణం? ఐగుప్తు ఇవ్వగల వాటన్నింటినీ తిరస్కరించడానికి మోషేను ఏది పురికొల్పింది? బైబిలు దానికి ఇలా సమాధానమిస్తోంది: “విశ్వాసమునుబట్టి అతడు [మోషే] అదృశ్యుడైనవానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధిగలవాడై, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను.” (హెబ్రీయులు 11:​24-27) నీతికి కట్టుబడి ఉండేవారికి యెహోవా అనుగ్రహించే ప్రతిఫలంపట్ల మోషేకున్న విశ్వాసం, పాపాన్ని, ఆ పాపపు అల్పకాల భోగాన్ని తిరస్కరించడానికి ఆయనకు సహాయం చేసింది.

5 ‘బైబిలు సూత్రాలతో ఏ మాత్రం పొందికలేని అభ్యాసాలను లేదా అలవాట్లను నేను వదులుకోవాలా? వస్తుపరంగా ప్రయోజనకరంగా ఉన్నట్లు అనిపించినా నా ఆధ్యాత్మిక పురోగతిని అడ్డగించే ఉద్యోగంలో చేరాలా?’ వంటి విషయాల్లో కష్టంగా ఉండే నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితిని మనం కూడా తరచూ ఎదుర్కొంటాం. ఈ లోకపు దూరదృష్టిలేని స్వభావాన్ని ప్రతిబింబించే నిర్ణయాలు తీసుకోకుండా మోషే ఉదాహరణ మనల్ని ప్రోత్సహిస్తోంది; బదులుగా మనం “అదృశ్యుడైన” యెహోవా దేవుని దూరదృష్టిగల జ్ఞానాన్ని విశ్వసించాలి. మోషేలాగే మనం కూడా ఈ లోకం అందించే దేనికన్నా యెహోవా స్నేహాన్నే ఎక్కువ విలువైనదిగా పరిగణించుదము గాక.

6 పితరుడైన ఇస్సాకు కుమారుడైన ఏశావుకు మోషేకున్న తారతమ్యం చూడండి. ఏశావు తక్షణ సంతృప్తిని కోరుకున్నాడు. (ఆదికాండము 25:30-34) ఏశావు ‘భ్రష్టుడై ఒక పూట కూటికొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు.’ (హెబ్రీయులు 12:16) జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకోవాలనే తన నిర్ణయం యెహోవాతో తన సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో లేదా తన చర్య తన సంతానంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అతను గ్రహించలేదు. అతను ఆధ్యాత్మిక దృష్టిని కోల్పోయాడు. దేవుని అమూల్య వాగ్దానాలు పనికిరానివన్నట్లు భావిస్తూ వాటిని అలక్ష్యం చేశాడు. అతను విశ్వాసంతో కాదు, కేవలం వెలిచూపుతోనే నడుచుకున్నాడు.

7 నేడు మనకు ఏశావు ఒక హెచ్చరికగా ఉన్నాడు. (1 కొరింథీయులు 10:​11) మనం తీసుకునే నిర్ణయాలు పెద్దవైనా, చిన్నవైనా మీరు కోరుకుంటున్నది వెంటనే పొందాలి అనే సాతాను లోకపు ప్రచారంచేత మోసపోకూడదు. మనల్ని మనమిలా ప్రశ్నించుకోవాలి: ‘నేను తీసుకునే నిర్ణయాల్లో ఏశావు వంటి స్వభావాలు కనబడుతున్నాయా? నాకిప్పుడు కావలసిన వాటికోసం ప్రయాసపడడం ఆధ్యాత్మిక విషయాలను వెనక్కి నెట్టివేస్తుందా? నా నిర్ణయాలు దేవునితో నా స్నేహాన్ని, నా భవిష్యత్‌ ప్రతిఫలాన్ని ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయా? నేను ఇతరులకు ఎలాంటి ఆదర్శాన్ని ఉంచుతున్నాను?’ మన నిర్ణయాలు పవిత్ర విషయాలపట్ల మన కృతజ్ఞతను ప్రతిబింబించినప్పుడు, యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు.​—⁠సామెతలు 10:22.

ఐశ్వర్యాసక్తి ఉరిని తప్పించుకోవడం

8 మొదటి శతాబ్దం చివర్లో అపొస్తలుడైన యోహానుకు కలిగిన దర్శనంలో, మహిమపరచబడిన యేసుక్రీస్తు ఆసియా మైనర్‌లో ఉన్న లవొదికయ సంఘానికి ఒక సందేశాన్ని పంపించాడు. అది ఐశ్వర్యాసక్తి విషయంలో ఒక హెచ్చరికా సందేశం. లవొదికయలో ఉన్న క్రైస్తవులు వస్తుపరంగా సంపన్నులుగా ఉన్నా, ఆధ్యాత్మికంగా దివాలా తీశారు. విశ్వాసంతో నడుచుకొనే బదులు, ఆధ్యాత్మిక దూరదృష్టి విషయంలో వస్తుసంపదలు తమను అంధులయ్యేలా చేయడానికి వారు అనుమతించారు. (ప్రకటన 3:14-18) ఐశ్వర్యాసక్తికి నేడు కూడా అలాంటి ప్రభావమే ఉంది. అది మన విశ్వాసాన్ని బలహీనపరచి, జీవపు ‘పందెములో సహనంతో పరుగెత్తకుండా చేస్తుంది.’ (హెబ్రీయులు 12:1) మనం జాగ్రత్తగా ఉండకపోతే, “యీ జీవన సంబంధమైన విచారములు” మన ఆధ్యాత్మిక కార్యకలాపాలు ‘అణచివేయబడేంతగా’ వాటిని తొక్కిపెట్టగలవు.​—⁠లూకా 8:14.

9 ఈ లోకాన్ని అమితముగా అనుభవిస్తూ, మనల్ని మనం వస్తుపరంగా సంపన్నులను చేసుకొనే బదులు ఉన్నదానితో తృప్తిగా ఉండడమే ఆధ్యాత్మిక సంరక్షణకు కీలకం. (1 కొరింథీయులు 7:31; 1 తిమోతి 6:6-8) మనం వెలిచూపుతో కాక విశ్వాసంతో నడుచుకున్నప్పుడు, మనం ప్రస్తుత ఆధ్యాత్మిక పరదైసులో ఆనందం పొందుతాం. పోషణార్థమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని భుజిస్తుండగా, మనం “హృదయానందముచేత కేకలు” వేయడానికి ప్రేరేపించబడడం లేదా? (యెషయా 65:13, 14) అంతేకాక, దేవుని ఆత్మ ఫలాలను కనబరుస్తున్న వారి సాంగత్యంలో మనం సంతోషిస్తాం. (గలతీయులు 5:22, 23) ఆధ్యాత్మిక రీతిలో యెహోవా దయచేస్తున్నవాటి విషయంలో తృప్తికలిగి, సేదదీరడం ఎంత ప్రాముఖ్యమో కదా!

10 మనం స్వయంగా వేసుకోవలసిన కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి: ‘నా జీవితంలో భౌతిక విషయాలకు ఎలాంటి స్థానం ఉంది? నేను నా వస్తు సంపదలను దేనికి ఉపయోగిస్తున్నాను, సుఖప్రదమైన జీవితం జీవించడానికా లేక సత్యారాధనకు తోడ్పడడానికా? నాకు ఏది ఎక్కువ సంతృప్తినిస్తుంది? బైబిలు అధ్యయనమా క్రైస్తవ కూటాల్లో సహవాసమా లేక క్రైస్తవ బాధ్యతలకు దూరంగావుండే వారాంతాలా? నేను నా వారాంతాలను క్షేత్ర పరిచర్యకు, స్వచ్ఛారాధనకు సంబంధించిన ఇతర కార్యకలాపాలకు కేటాయించకుండా ఉల్లాస కార్యకలాపాలకే ఎక్కువగా కేటాయిస్తున్నానా?’ విశ్వాసంతో నడుచుకోవడమంటే, యెహోవా వాగ్దానాలపై పూర్తి నమ్మకంతో రాజ్య సంబంధ పనుల్లో నిమగ్నమై ఉండడమని అర్థం.​—⁠1 కొరింథీయులు 15:58.

అంతాన్ని దృష్టిలో ఉంచుకోవడం

11 విశ్వాసంతో నడుచుకోవడం అంతం దూరంలో ఉందనే లేదా అసలు రానే రాదనే శారీరక దృక్పథాలను విసర్జించేందుకు మనకు సహాయం చేస్తుంది. బైబిలు ప్రవచనాన్ని చులకన చేసే సంశయవాదులకు భిన్నంగా, మన కాలం గురించి దేవుని వాక్యం ముందే తెలియజేసినవాటిని, లోక సంఘటనలు ఎలా నెరవేరుస్తున్నాయో గ్రహిస్తాం. (2 పేతురు 3:3, 4) ఉదాహరణకు, సాధారణ ప్రజల దృక్పథం, ప్రవర్తన మనం “అంత్యదినములలో” జీవిస్తున్నామనే రుజువివ్వడం లేదా? (2 తిమోతి 3:1-5) ప్రస్తుత ప్రపంచ సంఘటనలు కేవలం చరిత్ర పునరావృతమవడం కాదని మనం విశ్వాస నేత్రాలతో చూస్తున్నాం. బదులుగా, అవి “[క్రీస్తు] రాకడకును [‘ప్రత్యక్షతకు,’ NW] యుగసమాప్తికిని సూచన[లుగా]” రూపుదాలుస్తున్నాయి.​—⁠మత్తయి 24:1-14.

12 మన కాలానికి సదృశ్యంగా ఉన్న సామాన్య శకపు మొదటి శతాబ్దంలో జరిగిన ఒక సంఘటనను పరిశీలించండి. యేసు భూమ్మీద ఉన్నప్పుడు తన అనుచరులను ఇలా హెచ్చరించాడు: “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను.” (లూకా 21:20, 21) ఈ ప్రవచన నెరవేర్పుగా, సెస్టియస్‌ గ్యాలస్‌ ఆధ్వర్యంలోని రోమా సైన్యాలు సా.శ. 66లో యెరూషలేమును చుట్టుముట్టాయి. అయితే, అక్కడున్న క్రైస్తవులు ‘కొండలకు పారిపోవడానికి’ వారికి సూచనను, అవకాశాన్ని ఇస్తూ ఆ సైన్యాలు హఠాత్తుగా వెనక్కి తిరిగి వెళ్లిపోయాయి. కానీ సా.శ. 70వ సంవత్సరంలో రోమా సైన్యాలు తిరిగివచ్చి యెరూషలేమును ముట్టడించి, ఆలయాన్ని నాశనం చేశాయి. పది లక్షలకుపైగా యూదులు హతమయ్యారనీ, 97 వేలమంది బంధీలుగా కొనిపోబడ్డారనీ జోసీఫస్‌ నివేదిస్తున్నాడు. ఆ యూదా మత విధానంపై దైవిక తీర్పు వచ్చింది. విశ్వాసంతో నడుస్తూ, యేసు హెచ్చరికను లక్ష్యపెట్టినవారు ఆ విపత్తు నుండి తప్పించుకున్నారు.

13 మన కాలంలోనూ అలాంటిదే జరగబోతోంది. ఐక్యరాజ్య సమితిలోని శక్తులే దైవిక తీర్పును అమలు చేయడంలో భాగం వహిస్తాయి. మొదటి శతాబ్దపు రోమా సైన్యాలు పాక్స్‌ రోమనను (రోమ్‌ శాంతి ప్రక్రియను) కాపాడే ఉద్దేశంతో ఎలా రూపొందించబడ్డాయో అలాగే నేడు ఐక్యరాజ్య సమితి శాంతిని నెలకొల్పే ఉపకరణంగా ఉండాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. రోమా సైన్యాలు అప్పట్లో ఉనికిలోవున్న ప్రపంచమంతా కొంతమేరకైనా సురక్షితమైనదిగా ఉండేలా చూడడానికి ప్రయత్నించినా, యెరూషలేమును మాత్రం అవే పాడుచేశాయి. అదేవిధంగా నేడు, ఐక్యరాజ్య సమితిలోని సైనిక శక్తులు, మతాన్ని నేటి కలతలకు కారణంగా పరిగణించి ప్రస్తుతకాల యెరూషలేమును అంటే క్రైస్తవమత సామ్రాజ్యాన్నీ, దానితోపాటు మహాబబులోను మిగతా భాగాన్నీ నాశనం చేయడానికి చర్య తీసుకుంటాయి. (ప్రకటన 17:12-17) అవును, ప్రపంచ అబద్ధ మతసామ్రాజ్యం మొత్తం నాశనపు అంచున ఉంది.

14 అబద్ధ మతం నాశనమవడం మహాశ్రమల ఆరంభాన్ని సూచిస్తుంది. మహాశ్రమల చివరి అంకంలో, ఈ దుష్ట విధానపు మిగిలిన శక్తులు నాశనం చేయబడతాయి. (మత్తయి 24:29, 30; ప్రకటన 16:14, 16) విశ్వాసంతో నడుచుకోవడం బైబిలు ప్రవచన నెరవేర్పు విషయంలో అప్రమత్తంగా ఉండేందుకు మనకు సహాయం చేస్తుంది. నిజమైన శాంతిభద్రతలు తీసుకువచ్చేందుకు ఐక్యరాజ్య సమితి వంటి ఏ మానవ నిర్మిత సంస్థ కూడా దేవుని మాధ్యమమని తలంచే మోసంలో పడిపోము. కాబట్టి “యెహోవా మహాదినము సమీపమాయెను” అనే నమ్మకాన్ని మన జీవన విధానం ప్రదర్శించవద్దా?​—⁠జెఫన్యా 1:14.

వెలిచూపుతో నడుచుకోవడం ఎంత ప్రమాదకరమైనది?

15 ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని బలహీనపరిచే విధంగా వెలిచూపుతో నడుచుకోవడానికి అనుమతించడంవల్ల కలిగే ప్రమాదాలను ప్రాచీనకాల ఇశ్రాయేలీయుల అనుభవాలు ఉదాహరిస్తున్నాయి. ఐగుప్తు అబద్ధ దేవతలను సిగ్గుపరచిన పది తెగుళ్లను కళ్లారా చూసి, ఆ తర్వాత ఎర్ర సముద్రంగుండా అద్భుత రీతిలో విడుదలను చవిచూసి కూడా ఆ ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసుకొని దానిని ఆరాధించడం ఆరంభించారు. “మోషే కొండ దిగకుండా తడవుచేయుట చూచినప్పుడు” వారు ఓపిక పట్టలేక, విసుగు చెందారు. (నిర్గమకాండము 32:1-4) ఓపిక నశించడం తమ కళ్లకు కనిపించిన విగ్రహాన్ని ఆరాధించేలా వారిని పురికొల్పింది. వారు వెలిచూపుతో నడుచుకోవడం యెహోవాను అవమానపరచి, “మూడు వేలమంది” హతమవడానికి దారితీసింది. (నిర్గమకాండము 32:25-29) యెహోవా ఆరాధకుడు నేడు యెహోవా మీద అపనమ్మకాన్ని సూచించే నిర్ణయాలు, వాగ్దానాలు నెరవేర్చే ఆయన శక్తిని అనుమానించే నిర్ణయాలు తీసుకోవడం ఎంత విచారకరమో కదా!

16 బాహ్యరూపాలు ఇతర విధాలుగా కూడా ఇశ్రాయేలీయుల మీద ప్రతికూల ప్రభావం చూపించాయి. వెలిచూపుతో నడుచుకోవడం వారు తమ శత్రువులను చూసి భయపడేలా చేసింది. (సంఖ్యాకాండము 13:28, 32; ద్వితీయోపదేశకాండము 1:28) అది దైవానుగ్రహ అధికారంగల మోషేను ధిక్కరించి, తమ జీవనస్థితి గురించి ఫిర్యాదు చేసేందుకు కారణమైంది. ఈ విశ్వాసరాహిత్యం వారు వాగ్దాన దేశానికి బదులు దయ్యాల ఆధీనంలోని ఐగుప్తును కోరుకునేందుకు దారితీసింది. (సంఖ్యాకాండము 14:1-4; కీర్తన 106:24) ఆ ప్రజలు తమ అదృశ్య రాజును తీవ్రంగా అవమానపరచడాన్ని చూసినప్పుడు యెహోవా ఎంతగా నొచ్చుకొని ఉంటాడో కదా!

17 ప్రవక్తయైన సమూయేలు కాలంలో, అనుగ్రహిత ఇశ్రాయేలు జనాంగం మళ్లీ వెలిచూపుతో నడుచుకునే ఉరిలో చిక్కుకుంది. ప్రజలు తాము చూడగలిగిన రాజును కోరుకోవడం ప్రారంభించారు. యెహోవా, తానే వారి రాజునని నిరూపించుకున్నా, వారు విశ్వాసంతో నడుచుకొనేలా చేయడానికి అది సరిపోలేదు. (1 సమూయేలు 8:4-9) తమకు హానికలిగేలా వారు నిర్దోషమైన యెహోవా మార్గనిర్దేశాన్ని మూర్ఖత్వంతో తృణీకరించి తమ చుట్టూవున్న జనాంగాల్లా ఉండేందుకే ఇష్టపడ్డారు.​—⁠1 సమూయేలు 8:19, 20.

18 యెహోవా ఆధునిక దిన సేవకులుగా దేవునితో మనకున్న మంచి సంబంధాన్ని విలువైనదిగా పరిగణిస్తాం. గత సంఘటనల నుండి విలువైన పాఠాలను ఆసక్తితో నేర్చుకొని వాటిని మన జీవితాల్లో అన్వయించుకుంటాం. (రోమీయులు 15:4) ఇశ్రాయేలీయులు వెలిచూపుతో నడుచుకున్నప్పుడు, దేవుడు మోషే ద్వారా వారిని నడిపిస్తున్నాడనే సంగతి మరచిపోయారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం కూడా యెహోవా దేవుడు, గొప్ప మోషే అయిన యేసుక్రీస్తు నేడు క్రైస్తవ సంఘాన్ని నిర్దేశిస్తున్నారనే సంగతి మరచిపోతాం. (ప్రకటన 1:12-16) యెహోవా సంస్థకు చెందిన భూసంబంధ భాగం విషయంలో మానవ దృక్కోణం ఏర్పరచుకోకుండా మనం జాగ్రత్తపడాలి. అలాంటి మానవ దృక్కోణం ఫిర్యాదుచేసే స్వభావం ఏర్పడడానికే కాక, యెహోవా ప్రతినిధులపట్ల “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందిస్తున్న ఆధ్యాత్మిక ఆహారంపట్ల కృతజ్ఞతా భావాన్ని కోల్పోవడానికి కూడా దారితీయగలదు.​—⁠మత్తయి 24:45.

విశ్వాసంతో నడుచుకోవడానికి తీర్మానించుకోండి

19 “మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము” అని బైబిలు చెబుతోంది. (ఎఫెసీయులు 6:​12) అపవాదియగు సాతానే మన ముఖ్య విరోధి. యెహోవాపై మనకున్న విశ్వాసాన్ని నాశనం చేయడమే అతని లక్ష్యం. దేవుణ్ణి సేవించాలనే మన నిర్ణయం నుండి మనల్ని ప్రక్కకు తప్పించడానికి ఎలాంటి ప్రయత్నాన్నైనా అతడు విడిచిపెట్టడు. (1 పేతురు 5:8) సాతాను విధానపు బాహ్యరూపంవల్ల మోసగించబడకుండా ఉండేలా మనల్ని ఏది కాపాడుతుంది? వెలిచూపుతో కాక విశ్వాసంతో నడుచుకోవడమే మనల్ని కాపాడుతుంది! యెహోవా వాగ్దానాలపట్ల నమ్మకం, ప్రగాఢ విశ్వాసం ‘మన విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోకుండా’ మనల్ని కాపాడుతుంది. (1 తిమోతి 1:19) కాబట్టి, యెహోవా ఆశీర్వాదంపై పూర్తి నమ్మకాన్నుంచుతూ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎల్లప్పుడూ విశ్వాసంతో నడుచుకోవాలని మనం తీర్మానించుకుందాం. అలాగే సమీప భవిష్యత్తులో జరగబోయే వాటన్నింటిని తప్పించుకోవడానికి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉందాం.​—⁠లూకా 21:36.

20 వెలిచూపుతో కాక, విశ్వాసంతో నడుచుకునే ఉత్తమ మాదిరికర్త మనకున్నాడు. “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను” అని బైబిలు చెబుతోంది. (1 పేతురు 2:21) ఆయన నడిచినట్లే మనమూ ఎలా నడుచుకోవచ్చో తర్వాతి ఆర్టికల్‌ చర్చిస్తుంది.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

వెలిచూపుతో కాక, విశ్వాసంతో నడుచుకునే విషయంలో మోషే, ఏశావు ఉదాహరణల నుండి మీరేమి నేర్చుకున్నారు?

ఐశ్వర్యాసక్తికి దూరంగా ఉండేందుకు దోహదపడే కీలకమేమిటి?

విశ్వాసంతో నడుచుకోవడం అంతం దూరంలో ఉందనే దృక్కోణాన్ని విసర్జించేందుకు మనకు ఎలా సహాయం చేస్తుంది?

వెలిచూపుతో నడుచుకోవడం ఎందుకు ప్రమాదకరం?

[అధ్యయన ప్రశ్నలు]

1. పౌలు వెలిచూపుతో కాక విశ్వాసంతోనే నడుచుకున్నాడని ఏది చూపిస్తోంది?

2, 3. (ఎ) విశ్వాసంతో నడుచుకుంటున్నామని మనమెలా ప్రదర్శిస్తాం? (బి) వెలిచూపుతో నడుచుకోవడం అంటే అర్థమేమిటి?

4. మోషే ఎలాంటి ఎంపిక చేసుకున్నాడు, ఎందుకు?

5. మోషే ఉదాహరణ మనల్ని ఎలా ప్రోత్సహిస్తుంది?

6, 7. (ఎ) ఏశావు తాను వెలిచూపుతో నడుచుకోవడాన్నే ఇష్టపడుతున్నట్లు ఎలా చూపించాడు? (బి) ఏశావు మనకు ఎలా ఒక హెచ్చరికగా ఉన్నాడు?

8. లవొదికయ క్రైస్తవులు ఏమని హెచ్చరించబడ్డారు, అది మనకెందుకు ఆసక్తి కలిగించాలి?

9. ఆధ్యాత్మిక ఆహారంపట్ల తృప్తి, కృతజ్ఞతా భావం మనల్ని ఎలా సంరక్షిస్తాయి?

10. మనం స్వయంగా ఎలాంటి ప్రశ్నలు వేసుకోవాలి?

11. విశ్వాసంతో నడవడం అంతాన్ని దృష్టిలో ఉంచుకోవడానికి మనకు ఎలా సహాయం చేస్తుంది?

12. లూకా 21:20, 21లో నమోదు చేయబడిన యేసు మాటలు మొదటి శతాబ్దంలో ఎలా నెరవేరాయి?

13, 14. (ఎ) త్వరలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి? (బి) బైబిలు ప్రవచన నెరవేర్పు విషయంలో మనమెందుకు అప్రమత్తంగా ఉండాలి?

15. దేవుని ఆశీర్వాదాలను చవిచూసి కూడా, ఇశ్రాయేలీయులు ఎలాంటి ఉరిలో చిక్కుకున్నారు?

16. బాహ్యరూపాలచేత ఇశ్రాయేలీయులు ఎలా ప్రభావితులయ్యారు?

17. సమూయేలు కాలంలో ఇశ్రాయేలీయులు యెహోవా మార్గనిర్దేశాన్ని తృణీకరించడానికి ఏది కారణమైంది?

18. వెలిచూపుతో నడుచుకోవడంలోని ప్రమాదాల గురించి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

19, 20. మీరేమి చేయడానికి తీర్మానించుకున్నారు, ఎందుకు?

[17వ పేజీలోని చిత్రం]

మోషే విశ్వాసంతో నడుచుకున్నాడు

[18వ పేజీలోని చిత్రం]

ఉల్లాస కార్యకలాపాలు తరచూ మీ దైవపరిపాలనా కార్యకలాపాలకు అడ్డొస్తున్నాయా?

[20వ పేజీలోని చిత్రం]

దేవుని వాక్యాన్ని లక్ష్యపెట్టడం మిమ్మల్ని ఎలా కాపాడుతుంది?