కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లిదండ్రులారా—మీరు మీ పిల్లలకు ఎలాంటి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు?

తల్లిదండ్రులారా—మీరు మీ పిల్లలకు ఎలాంటి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు?

తల్లిదండ్రులారా​—⁠మీరు మీ పిల్లలకు ఎలాంటి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు?

“యౌవనులు కన్యలు . . . యెహోవా నామమును స్తుతించుదురు గాక.”​—⁠కీర్తన 148:12, 13.

తమ పిల్లల భవిష్యత్తు గురించి ఏ తల్లిదండ్రులు మాత్రం చింతించరు? బిడ్డ పుట్టిన దగ్గర నుండే లేదా అంతకుముందు నుండే తల్లిదండ్రులు ఆ బిడ్డ సంక్షేమం గురించి చింతించడం ఆరంభిస్తారు. బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందా? బిడ్డ అందరిలాగే పెరుగుతోందా? అంతేకాక ఆ బిడ్డ ఎదిగేకొద్దీ అదనపు చింతలు ఉండనే ఉంటాయి. సాధారణంగా, తల్లిదండ్రులు తమ పిల్లలకు అంతా మంచే జరగాలని కోరుకుంటారు.​—⁠1 సమూయేలు 1:11, 27, 28; కీర్తన 127:3-5.

2 అయితే నేటి ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తమమైనది అందించడం చాలా కష్టం. చాలామంది తల్లిదండ్రులు యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు, ఆర్థిక ఇబ్బందులు, భౌతిక, మానసిక ఉద్వేగాల వంటి కష్టాలు అనుభవించారు. కాబట్టి, తమ పిల్లలు అలాంటివి అనుభవించకూడదని వారు హృదయపూర్వకంగా కోరుకోవడం సహజమే. సంపన్న దేశాల్లో తల్లిదండ్రులు తమ స్నేహితుల, బంధువుల కుమారులు, కుమార్తెలు వృత్తిపరంగా విజయం సాధిస్తూ మంచిగానే జీవిస్తున్నట్లు గమనించవచ్చు. అందువల్ల, తమ పిల్లలు కూడా పెరిగి పెద్దవారై సుఖంగా ఎలాంటి ఒడుదుడుకుల్లేకుండా మంచి జీవితం అనుభవించేలా తాము అన్నివిధాలా కృషి చేయాలని వారు భావించవచ్చు.​—⁠ప్రసంగి 3:13.

మంచి జీవితాన్ని ఎంచుకోవడం

3 యేసుక్రీస్తు అనుచరులుగా క్రైస్తవులు తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకునేందుకు నిర్ణయించుకున్నారు. యేసు పలికిన ఈ మాటలు వారిపై ప్రభావం చూపించాయి: “ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను.” (లూకా 9:​23; 14:​27) అవును, క్రైస్తవుని జీవితంలో స్వయంత్యాగం ఉంది. కానీ అది పేదరికంతో హీనంగా జీవించే జీవితం కాదు. బదులుగా, అది సంతోషభరితమైన, సంతృప్తికరమైన మంచి జీవితం, ఎందుకంటే ఆ జీవితంలో ఇతరులకు ఇవ్వడం ఇమిడివుంది, అంతేగాక యేసు చెప్పినట్లుగా, “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.”​—⁠అపొస్తలుల కార్యములు 20:35.

4 యేసు కాలంలోని ప్రజలు చాలా కష్టభరిత పరిస్థితుల్లో జీవించారు. జీవనం గడవడానికి తీవ్రంగా కష్టపడడమే కాక, రోమా క్రూర పరిపాలనను, ఆ కాలపు కఠిన మతాచారాల భారాన్ని కూడా వారు మోయవలసి వచ్చింది. (మత్తయి 23:2-4) అయినప్పటికీ, యేసు మాటలు విన్న చాలామంది తమ వ్యక్తిగత లక్ష్యాలను, వృత్తులను సహితం ప్రక్కనబెట్టి ఆయన అనుచరులయ్యారు. (మత్తయి 4:​18-22; 9:9; కొలొస్సయులు 4:14) ఆ శిష్యులు కష్టాలు కొనితెచ్చుకుంటూ భవిష్యత్తును ప్రమాదంలో పడవేసుకున్నారా? యేసు మాటలను గమనించండి: “నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును.” (మత్తయి 19:29) తన పరలోకపు తండ్రికి వారి అవసరాలు తెలుసని యేసు తన అనుచరులకు అభయమిచ్చాడు. కాబట్టి ఆయన వారికిలా ఉద్బోధించాడు: “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”​—⁠మత్తయి 6:31-33.

5 నేటి పరిస్థితులు దానికి భిన్నంగా ఏమీ లేవు. యెహోవాకు మన అవసరాలు తెలుసు, పైగా రాజ్య సంబంధ విషయాలకు తమ జీవితాల్లో ప్రథమస్థానమిచ్చే వారిపట్ల, ప్రత్యేకంగా పూర్తికాల సేవను లక్ష్యంగా పెట్టుకున్నవారిపట్ల ఆయన శ్రద్ధ చూపిస్తాడనే హామీ ఇవ్వబడుతోంది. (మలాకీ 3:6, 16; 1 పేతురు 5:7) అయితే కొందరు తల్లిదండ్రులు ఈ విషయంలో అనిశ్చిత భావాలతో ఉన్నారు. ఒకవైపున వారు తమ పిల్లలు యెహోవా సేవలో ముందుకుసాగి, బహుశా చివరకు పూర్తికాల పరిచర్యలో ప్రవేశించడాన్ని చూడాలని ఇష్టపడతారు. మరోవైపున నేటి ప్రపంచ ఆర్థిక, ఉద్యోగ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ, యౌవనులు మంచి ఉద్యోగానికి అర్హతలు సంపాదించుకునేలా లేదా అవసరమైనప్పుడు కనీసం ఆసరాగా ఉండేలా వారు మొదట చక్కగా చదువుకోవడం ప్రాముఖ్యమని భావిస్తారు. అలాంటి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉన్నత విద్య అవసరమని భావిస్తారు.

భవిష్యత్తు కోసం సిద్ధపడడం

6 దేశాలనుబట్టి విద్యా విధానాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఉదాహరణకు, ఇండియాలో పాఠశాలలు 10-12 సంవత్సరాల ప్రాథమిక విద్యను అందిస్తాయి. ఆ తర్వాత, విద్యార్థులు వైద్య, న్యాయ, ఇంజనీరింగ్‌ తదితర వృత్తుల బ్యాచ్‌లర్స్‌ డిగ్రీ లేదా పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీల కోసం మూడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు విశ్వవిద్యాలయానికి లేదా కళాశాలకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ ఆర్టికల్‌లో “ఉన్నత విద్య” అని ఉపయోగించబడిన పదం, అలాంటి విశ్వవిద్యాలయ విద్యనే సూచిస్తోంది. ఇవేకాక, ఏదోక వృత్తిలో లేదా పనిలో సర్టిఫికెట్‌ లేదా డిప్లొమా ఇచ్చే స్వల్పకాల సాంకేతిక, వృత్తివిద్యా పాఠశాలలు ఉన్నాయి.

7 విద్యార్థులను ఉన్నత విద్యకు సిద్ధం చేయడమే నేటి ధోరణి. అందుకే అధికశాతం విద్యా సంస్థలు విద్యార్థులను ఉద్యోగం కోసం సిద్ధం చేసే కోర్సులకు బదులు విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు ఎక్కువ మార్కులు సంపాదించేందుకు దోహదపడే విద్యాంశాల మీదే దృష్టి నిలుపుతున్నాయి. ఆశాజనకమైన, అధిక జీతాలు చెల్లించే ఉద్యోగాలకు అవకాశమిచ్చే డిగ్రీలు సంపాదించిపెట్టగల ఉత్తమ విశ్వవిద్యాలయంలో ప్రవేశించే గురి పెట్టుకొమ్మని ఉపాధ్యాయుల నుండి, సలహాదారుల నుండి, తోటి విద్యార్థుల నుండి వచ్చే తీవ్రమైన ఒత్తిడిని నేటి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్నారు.

8 కాబట్టి క్రైస్తవ తల్లిదండ్రులు ఏమిచేయాలి? నిజమే, తమ పిల్లలు పాఠశాలలో మంచి మార్కులు సంపాదించుకోవాలనీ, భవిష్యత్తులో జీవనోపాధికి తోడ్పడే నైపుణ్యాలు నేర్చుకోవాలని వారు కోరుకుంటారు. (సామెతలు 22:29) అలాగని వారు తమ పిల్లలు వస్తుపరమైన అభివృద్ధిని, విజయాన్ని సాధించడానికి పోటీతత్వపు ప్రభావంలో పడిపోయేందుకు అనుమతించాలా? వారు తమ మాటల ద్వారా, వ్యక్తిగత మాదిరి ద్వారా తమ పిల్లల ఎదుట ఎలాంటి లక్ష్యాలు పెడుతున్నారు? సమయమొచ్చినప్పుడు తమ పిల్లలను విశ్వవిద్యాలయాలకు పంపగలిగేలా కొందరు తల్లిదండ్రులు కష్టపడి పనిచేసి డబ్బు ఆదా చేస్తారు. మరికొందరు దీనికోసం అప్పు చేయడానికి కూడా వెనుకాడరు. అయితే అలాంటి నిర్ణయాల విలువను కేవలం డబ్బుతో లెక్కించలేం. నేడు ఉన్నత విద్యను పొందడానికి చెల్లించవలసిన మూల్యమేమిటి?​—⁠లూకా 14:28-33.

ఉన్నత విద్యను పొందడానికి చెల్లించవలసిన మూల్యం

9 వెలను గురించి ఆలోచించినప్పుడు, మనం సాధారణంగా ఖర్చయ్యే డబ్బు గురించే ఆలోచిస్తాం. కొన్ని దేశాల్లో ఉన్నత విద్యకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది, కాబట్టి అర్హులైన విద్యార్థులు ఎలాంటి ఫీజులూ చెల్లించనక్కర్లేదు. అయితే చాలా దేశాల్లో ఉన్నత విద్య చాలా ఖర్చుతో కూడుకున్నదే కాక, ఆ ఖర్చు ఇంకా పెరుగుతోంది. న్యూయార్క్‌ టైమ్స్‌లో ఓ ప్రత్యేక ఆర్టికల్‌ ఇలా అభిప్రాయపడింది: “ఒకప్పుడు ఉన్నత విద్య అవకాశాల ద్వారంగా పరిగణించబడేది. కానీ ఇప్పుడు అది ధనికుల, పేదల మధ్య తేడాను ధృవీకరిస్తోంది.” మరో విధంగా చెప్పాలంటే, నాణ్యమైన ఉన్నత విద్య ధనవంతుల, ప్రాబల్యంగల వారి పరిధిలోకే అంతకంతకు వెళ్ళిపోతోంది, వారు తమ పిల్లలను కూడా ఈ లోకంలో ధనవంతులుగా, ప్రాబల్యంగలవారిగా చేసేందుకు వారికి ఉన్నత విద్య అభ్యసింపజేస్తున్నారు. క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అలాంటి లక్ష్యాన్ని ఎంచుకోవాలా?​—⁠ఫిలిప్పీయులు 3:7, 8; యాకోబు 4:4.

10ఉన్నత విద్య ఉచితంగా లభించే దేశాల్లో కూడా బయటకు కనిపించనివేవో అంతర్లీనంగా ముడిపెట్టబడి ఉంటాయి. ఉదాహరణకు, ఒకానొక ఆగ్నేయాసియా దేశంలో, ప్రభుత్వం “ఉత్తమ విద్యార్థులను నిర్లజ్జగా ఉన్నత శ్రేణికి నెట్టే పిరమిడ్‌ తరహా పాఠశాల విధానాన్ని” నిర్వహిస్తోందని ద వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ నివేదిస్తోంది. చివరకు ఆ “ఉత్తమ విద్యార్థులకు” ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, అమెరికాలోని ఐవీ లీగ్‌ పాఠశాలల వంటివాటిలో ప్రవేశం లభిస్తుంది. అలాంటి దీర్ఘకాలిక కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం ఎందుకు అందిస్తోంది? “జాతీయాదాయాన్ని పెంచుకోవడానికే” అని ఆ నివేదిక పేర్కొంటోంది. విద్య ఉచితమే కావచ్చు, కానీ విద్యార్థులు చెల్లించే మూల్యమేమిటంటే, ప్రస్తుత విధానాభివృద్ధికే తమ యావత్‌ జీవితాన్ని ధారపోయడం. లోకంలో ప్రజలు అలాంటి జీవన విధానాన్నే అత్యంత ఉన్నతమైనదిగా అనుసరిస్తున్నప్పటికీ, క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అలాంటి జీవితాన్ని కోరుకుంటారా?​—⁠యోహాను 15:19; 1 యోహాను 2:15-17.

11పరిశీలించవలసిన మరో విషయం పర్యావరణం. కళాశాల లేదా విశ్వవిద్యాలయ ఆవరణలు మాదకద్రవ్యాల, మత్తుపానీయాల దుర్వినియోగానికి, లైంగిక దుర్నీతికి, మోసానికి, ఏడిపించడానికి తదితర చెడు ప్రవర్తనకు పేరుగాంచాయి. మత్తుపానీయాల దుర్వినియోగాన్నే పరిశీలించండి. ఒళ్లు తెలియనంతగా త్రాగే బింజ్‌ డ్రింకింగ్‌ గురించి నివేదిస్తూ న్యూ సైంటిస్ట్‌ పత్రిక ఇలా చెబుతోంది: “[అమెరికాలో విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో] దాదాపు 44 శాతం మంది రెండు వారాల్లో కనీసం ఒకసారి ఒళ్లు తెలియనంతగా త్రాగుతున్నారు.” ఆస్ట్రేలియా, బ్రిటన్‌, రష్యా, మరితర ప్రాంతాల్లో కూడా యౌవనస్థుల్లో ఇది సాధారణ సమస్యగా ఉంది. లైంగిక దుర్నీతి విషయానికొస్తే, విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎక్కువగా “హుకింగ్‌ అప్‌” గురించే నేడు మాట్లాడుకుంటున్నారు. న్యూస్‌వీక్‌ నివేదిక ప్రకారం ఆ పదం “ఆ తర్వాత కనీసం మాట్లాడుకోవాలనే ఉద్దేశం కూడా లేని పరిచయస్థుల మధ్య, ముద్దుల నుండి శారీరకంగా కలుసుకోవడం వరకు, ఒకసారి మాత్రమే జరిగే లైంగిక క్రియను వర్ణిస్తుంది.” 60 నుండి 80 శాతం మంది విద్యార్థులు ఇలాంటి పనులు చేస్తున్నారని అధ్యయనాలు చూపిస్తున్నాయి. “మీరొక సాధారణ కళాశాల విద్యార్థి అయితే మీరు హుకింగ్‌ అప్‌కు పాల్పడతారు” అని ఒక పరిశోధకురాలు అంటోంది.​—⁠1 కొరింథీయులు 5:​11; 6:9, 10.

12చెడు పర్యావరణానికి తోడుగా, హోమ్‌వర్క్‌, పరీక్షల ఒత్తిడి ఉంటుంది. పరీక్షలు పాసవడానికి విద్యార్థులు శ్రద్ధగా చదవడం, హోమ్‌వర్క్‌ చేయడం అవసరం. కొందరు కళాశాలకు వెళ్ళడంతోపాటు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం కూడా చేయవలసి రావచ్చు. దీనంతటికి ఎంతో సమయం, శక్తి అవసరమవుతాయి. అలాంటప్పుడు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సమయం, ఓపిక ఇంకెక్కడ ఉంటాయి? ఒత్తిళ్లు పెరిగినప్పుడు వారు దేనిని నిర్లక్ష్యం చేస్తారు? అప్పుడు కూడా రాజ్య సంబంధ విషయాలు ప్రథమస్థానంలో ఉంటాయా లేక వాటిని ప్రక్కకు నెట్టేయడం జరుగుతుందా? (మత్తయి 6:33) బైబిలు క్రైస్తవులకు ఇలా ఉద్బోధిస్తోంది: “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.” (ఎఫెసీయులు 5:​15, 16) తమ సమయాన్ని, శక్తిని అధికంగా తీసుకునే వాటిలో నిమగ్నమైపోయినందుకు లేదా కళాశాలలో లేఖనరహిత ప్రవర్తనలో చిక్కుకున్నందుకు కొందరు విశ్వాసం నుండి తొలగిపోవడం ఎంత విచారకరమో కదా!

13నిజమే, లైంగిక దుర్నీతి, చెడు ప్రవర్తన, ఒత్తిళ్లు కళాశాలకు లేదా విశ్వవిద్యాలయ ఆవరణలకు మాత్రమే పరిమితం కాదు. అయితే లోకసంబంధ యౌవనులు చాలామంది, అలాంటివన్నీ కేవలం విద్యలో భాగమనీ, అవి మామూలేనని భావిస్తారు. క్రైస్తవ తల్లిదండ్రులు ఉద్దేశపూర్వకంగా, తమ పిల్లలను అలాంటి పర్యావరణంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఉండేందుకు అనుమతిస్తారా? (సామెతలు 22:3; 2 తిమోతి 2:22) యౌవనులు పొందే ప్రయోజనాలు ఏవైనప్పటికీ, అందులో ఇమిడివున్న ప్రమాదం ప్రయాసకు తగిన ప్రతిఫలాన్నిస్తుందా? అంతకంటే ప్రాముఖ్యంగా, తమ జీవితంలో ప్రథమస్థానం ఇవ్వవలసిన వాటిగురించి యౌవనులు అక్కడ ఏమి నేర్చుకుంటున్నారు? * (ఫిలిప్పీయులు 1:​9-10; 1 థెస్సలొనీకయులు 5:21) తల్లిదండ్రులు ఈ ప్రశ్నలతోపాటు విద్యకోసం తమ పిల్లలను వేరే నగరానికి లేదా దేశానికి పంపించే ప్రమాదాన్ని గురించి కూడా గంభీరంగా, ప్రార్థనాపూర్వకంగా పరిశీలించాలి.

ఏ ప్రత్యామ్నాయాలున్నాయి?

14యౌవనులు ప్రయోజకులు కావాలంటే విశ్వవిద్యాలయ విద్య ఒక్కటే మార్గం అనేది నేడు జనసమ్మతమైన అభిప్రాయం. అయితే జనసమ్మతమైన అభిప్రాయాన్ని అనుసరించే బదులు, బైబిలు ఇస్తున్న ఈ హెచ్చరికను క్రైస్తవులు లక్ష్యపెడతారు: “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” (రోమీయులు 12:2) పెద్దవారైనా, యౌవనులైనా ఈ అంత్యకాలపు చివరి దశలో తన ప్రజల విషయంలో దేవుని చిత్తమేమిటి? పౌలు తిమోతికి ఇలా ఉద్బోధించాడు: “నీవు అన్ని విషయములలో మితముగా [‘జాగ్రత్తగా,’ NW] ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.” ఆ మాటలు నేడు మనందరికీ తప్పకుండా వర్తిస్తాయి.​—⁠2 తిమోతి 4:⁠5.

15ఈ లోకంలోని వస్తుసంబంధ స్ఫూర్తిలో పడిపోయే బదులు, మనమందరం ‘అన్ని విషయాల్లో జాగ్రత్తగా’ ఉండాలి, అంటే ఆధ్యాత్మిక విషయాలే మన జీవితంలో ప్రధానాంశాలుగా ఉండాలి. మీరు ఒక యౌవనస్థుడైతే మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘దేవుని వాక్య పరిచారకునిగా అర్హుడనయ్యేందుకు నేను “నా పరిచర్యను” జరిగించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నానా? పరిచర్యను “సంపూర్ణముగా” జరిగించేలా నేను ఎలాంటి పథకాలు వేసుకుంటున్నాను? పూర్తికాల సేవను నా జీవన ధ్యేయంగా చేపట్టాలని ఆలోచిస్తున్నానా?’ ఉజ్జ్వల భవిష్యత్తుకు నడిపిస్తాయని ఊహిస్తూ ‘గొప్పవాటిని వెదికే’ స్వార్థపూరిత ప్రయాసల్లో మునిగిపోయే ఇతర యౌవనులను మీరు చూసినప్పుడు ఈ ప్రశ్నలు ప్రత్యేకంగా కష్టంగానే ఉంటాయి. (యిర్మీయా 45:5) కాబట్టి క్రైస్తవ తల్లిదండ్రులు పసితనం నుండే తమ పిల్లలకు సరైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తూ, శిక్షణ అందించడం జ్ఞానయుక్తం.​—⁠సామెతలు 22:6; ప్రసంగి 12:1; 2 తిమోతి 3:14, 15.

16“అమ్మ మా సహవాసాన్ని జాగ్రత్తగా పరిశీలించేది. మేము మా బడి పిల్లలతో కాదు, సంఘంలో మంచి ఆధ్యాత్మిక అలవాట్లున్న వారితో మాత్రమే సహవసించేవాళ్లం. సహవాసం కోసం ఆమె పూర్తికాల సేవలో ఉన్నవారిని అంటే మిషనరీలను, ప్రయాణ పైవిచారణకర్తలను, బెతెల్‌ కుటుంబ సభ్యులను, పయినీర్లను క్రమంగా మా ఇంటికి ఆహ్వానిస్తుండేది. వారి అనుభవాలు వినడం, వారి ఆనందాన్ని గమనించడం మా హృదయాల్లో పూర్తికాల సేవ చేయాలనే కోరికను కలిగించింది” అని తల్లి ఎన్నో సంవత్సరాలుగా పూర్తికాల పరిచర్యలో ఉన్న కుటుంబంలోని ముగ్గురు అబ్బాయిల్లో పెద్దవాడు గుర్తు చేసుకుంటున్నాడు. ఆ ముగ్గురు కుమారులు నేడు పూర్తికాల సేవలో అంటే ఒకరు బెతెల్‌ సేవలో ఉండడాన్ని మరొకరు పరిచర్య శిక్షణా పాఠశాలకు హాజరవడాన్ని, ఇంకొకరు పయినీరు సేవలో ఉండడాన్ని చూడడం ఎంత ఆనందకరమో కదా!

17తల్లిదండ్రులు తమ పిల్లలకు బలమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించడానికి తోడుగా వారికి సాధ్యమైనంత త్వరగా పాఠశాల అంశాలకు, వృత్తిపరమైన లక్ష్యాలకు సంబంధించి సరైన నిర్దేశాన్ని కూడా ఇవ్వాలి. ఇప్పుడు బెతెల్‌ సేవలో ఉన్న మరో యౌవనుడు ఇలా చెబుతున్నాడు: “మా తల్లిదండ్రులు తమ వివాహానికి ముందూ వివాహమైన తర్వాతా పయినీరు సేవ చేయడమే కాక, కుటుంబమంతటిలో పయినీరు స్ఫూర్తి నింపడానికి శాయశక్తులా కృషి చేశారు. మా భవిష్యత్తుపై ప్రభావం చూపే నిర్ణయాలను లేదా పాఠశాల అంశాలను మేము ఎంపిక చేసుకున్నప్పుడెల్లా, పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తూ పయినీరు సేవచేయడానికి దోహదపడే నిర్ణయాలు తీసుకునేలా మమ్మల్ని ప్రోత్సహించారు.” విశ్వవిద్యాలయ విద్యను లక్ష్యంగాపెట్టే విద్యాంశాలను ఎంచుకొనే బదులు, ఇటు తల్లిదండ్రులు అటు పిల్లలు దైవపరిపాలనా సేవను చేపట్టడంలో ఉపయుక్తమయ్యే కోర్సుల గురించి ఆలోచించాలి. *

18చాలా దేశాల్లో విశ్వవిద్యాలయ పట్టభద్రులకన్నా, చిన్నచిన్న వృత్తులు, ఉద్యోగాల్లో పనిచేసేవారి అవసరతే అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు చూపిస్తున్నాయి. “రాబోయే దశాబ్దాల్లో పనివాళ్లలో 70 శాతం మందికి అవసరమయ్యేది నాలుగు సంవత్సరాల కళాశాల డిగ్రీ కాదు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ చదువు లేదా సాంకేతిక విద్యా సర్టిఫికెట్‌” అని యుఎస్‌ఎ టుడే నివేదిస్తోంది. అలాంటి అనేక సంస్థలు ఆఫీసు పనులు, ఆటో రిపేరు, కంప్యూటర్‌ రిపేరు, ప్లంబింగ్‌, హెయిర్‌ డ్రెస్సింగ్‌ వంటి అనేక ఇతర వృత్తుల్లో స్వల్పకాల కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఇవి కోరదగిన వృత్తులేనా? ఖచ్చితంగా కోరదగినవే! కొందరు ఊహించినట్లుగా అవి అంతగా ఆకర్షణీయమైనవి కాకపోవచ్చు, అయితే అవి యెహోవా సేవే నిజమైన వృత్తిగా ఉన్నవారికి జీవనోపాధినిస్తూ, తగిన స్వాతంత్ర్యాన్నిస్తాయి.​—⁠2 థెస్సలొనీకయులు 3:8.

19“యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది” అని బైబిలు ఉద్బోధిస్తోంది. (కీర్తన 148:​12, 13) లోకం అందించే హోదాలు, ప్రతిఫలాలతో పోలిస్తే యెహోవాకు చేసే పూర్తికాల సేవే నిస్సందేహంగా ఆనందకరమైన, సంతృప్తిదాయకమైన జీవన మార్గంగా ఉంటుంది. బైబిలు ఇస్తున్న ఈ హామీని మనస్సులో పెట్టుకోండి: “యెహోవా దీవెన నీకు ఐశ్వర్యమిస్తుంది మరియు ఆ ఐశ్వర్యము దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు.”​—⁠సామెతలు 10:​22, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

[అధస్సూచీలు]

^ పేరా 18 విశ్వవిద్యాలయ విద్యకన్నా దైవపరిపాలనా విద్యకు అధిక విలువిచ్చిన వారి వృత్తాంతాల కోసం కావలికోట (ఆంగ్లం) మే 1, 1982 3-6 పేజీలు; ఏప్రిల్‌ 15, 1979 5-10 పేజీలు; తేజరిల్లు! (ఆంగ్లం) జూన్‌ 8; 1978 15వ పేజీ; ఆగస్టు 8, 1974 3-7 పేజీలు చూడండి.

^ పేరా 23 తేజరిల్లు! నవంబరు 8, 1998 4-6 పేజీల్లోని “భద్రతగల జీవితానికై అన్వేషణ,” తేజరిల్లు! (ఆంగ్లం) మే 8, 1989 12-14 పేజీల్లోని “నేను ఎలాంటి వృత్తిని ఎంచుకోవాలి?” చూడండి.

మీరు వివరించగలరా?

సురక్షిత భవిష్యత్తు కోసం క్రైస్తవులు దేనిపై తమ నమ్మకం ఉంచుతారు?

తమ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి క్రైస్తవ తల్లిదండ్రులు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు?

ఉన్నత విద్యా విలువను ఎంచేటప్పుడు దేనిని పరిగణలోకి తీసుకోవాలి?

యెహోవా సేవా లక్ష్యాన్ని అనుసరించడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా సహాయం చేయవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. పిల్లల గురించి తల్లిదండ్రులకు ఎలాంటి చింతలు ఉంటాయి?

2. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు పెరిగి పెద్దవారైనప్పుడు మంచి జీవితం అనుభవించాలని ఎందుకు గట్టిగా భావిస్తారు?

3. క్రైస్తవులు ఎలాంటి ఎంపిక చేసుకున్నారు?

4. దేనిని వెంబడించమని యేసు తన అనుచరులకు ఉద్బోధించాడు?

5. దేవుడు తన సేవకులపట్ల శ్రద్ధ చూపిస్తాడని యేసు ఇచ్చిన అభయం విషయంలో కొందరు తల్లిదండ్రులు ఎలా భావిస్తారు?

6. ఈ ఆర్టికల్‌లో “ఉన్నత విద్య” అనే పదం ఏ భావంలో ఉపయోగించబడింది?

7. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నారు?

8. క్రైస్తవ తల్లిదండ్రులకు ఎలాంటి ఎంపికలు ఎదురవుతాయి?

9. నేటి ఉన్నత విద్యా వెలను గురించి ఏమి చెప్పవచ్చు?

10. ఉన్నత విద్యకు ప్రస్తుత విధానాభివృద్ధితో ఎలాంటి దగ్గరి సంబంధం ఉంది?

11. విశ్వవిద్యాలయ విద్యార్థుల మధ్య మత్తుపానీయాల దుర్వినియోగం గురించి, లైంగిక దుర్నీతి గురించి నివేదికలు ఏమి వివరిస్తున్నాయి?

12. కళాశాల విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురవుతారు?

13. క్రైస్తవ తల్లిదండ్రులు ఏ ప్రశ్నలను పరిశీలించాలి?

14, 15. (ఎ) జనసమ్మతమైన అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ, నేడు ఏ బైబిలు ఉపదేశం వర్తిస్తుంది? (బి) యౌవనస్థులు తమకు తాము ఏ ప్రశ్నలు వేసుకోవచ్చు?

16. తల్లిదండ్రులు జ్ఞానయుక్తంగా తమ పిల్లలకు సరైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఎలా కల్పించవచ్చు?

17. పాఠశాల అంశాలు, వృత్తిపరమైన లక్ష్యాల విషయంలో యౌవనుల నిర్ణయాలకు సంబంధించి తల్లిదండ్రులు ఎలాంటి నిర్దేశం అందించవచ్చు? (29వ పేజీలోని బాక్సు చూడండి.)

18. యౌవనులు ఎలాంటి ఉద్యోగావకాశాల గురించి ఆలోచించవచ్చు?

19. ఆనందకరమైన, సంతృప్తిదాయకమైన జీవానికి ఖచ్చితమైన మార్గమేమిటి?

[29వ పేజీలోని బాక్సు]

ఉన్నత విద్యకున్న విలువేమిటి?

విశ్వవిద్యాలయంలో చేరే చాలామంది మంచి జీతానికీ, సురక్షిత ఉద్యోగానికీ అవకాశమిచ్చే డిగ్రీ సంపాదించుకోవాలని ఎదురుచూస్తారు. అయితే కళాశాలకు వెళ్లేవారిలో 25 శాతం మంది మాత్రమే ఆరు సంవత్సరాల్లోగా డిగ్రీ సంపాదించుకుంటారు అని ప్రభుత్వ నివేదికలు వివరిస్తున్నాయి. అది చాలాతక్కువ శాతం. అయినప్పటికీ ఆ డిగ్రీవల్ల మంచి ఉద్యోగం దొరుకుతుందా? ఇటీవలి పరిశోధన, అధ్యయనాలు ఏమి చెబుతున్నాయో గమనించండి.

“హార్వార్డ్‌ లేదా డ్యూక్‌ [విశ్వవిద్యాలయాలకు] వెళ్లడం యాంత్రికంగా మంచి ఉద్యోగాన్ని, జీతాన్ని ఇవ్వదు. . . . కంపెనీలకు ఉద్యోగం కోసం వెతుకుతున్న యౌవన అభ్యర్థుల గురించి అంతగా తెలియదు. తళతళలాడే సర్టిఫికెట్‌ (ఐవీ లీగ్‌ డిగ్రీ) ఆకట్టుకునే రీతిలో ఉండవచ్చు. అయితే ఆ తర్వాత ప్రజలు ఏమి చేయగలరు, ఏమి చేయలేరు అనేదే అత్యంత ప్రాముఖ్యం.”​—⁠న్యూస్‌ వీక్‌, నవంబరు 1, 1999.

“నిజమే గతంలోకంటే నేటి ఉద్యోగాలకు ఉన్నత నైపుణ్యాలు అవసరం . . . , అయితే ఈ ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలు బలమైన ఉన్నత పాఠశాల స్థాయి నైపుణ్యాలే అంటే కాలేజీ స్థాయి నైపుణ్యాలు కాదుగానీ, 9వ తరగతి స్థాయిలో లెక్కలు, చదవడం, వ్రాయడమే అవసరం. . . . మంచి ఉద్యోగం కావాలంటే విద్యార్థులు కాలేజీకే వెళ్లనవసరం లేదు, కానీ వారు ఉన్నత పాఠశాల స్థాయి నైపుణ్యాల్లో మాత్రం సమర్థులుగా ఉండాలి.”​—⁠అమెరికన్‌ ఎడ్యుకేటర్‌, స్ప్రింగ్‌ 2004.

“లోకంలో విద్యార్థులను కళాశాలానంతర ప్రపంచంలో పనివాళ్ళగా సిద్ధం చేయడంలో చాలా కళాశాలలు బొత్తిగా వెనకబడ్డాయి. వృత్తివిద్యా పాఠశాలలు . . . త్వరితగతిన ఊపందుకుంటున్నాయి. 1996 నుండి 2000 మధ్యకాలంలో వాటిలో చేరేవారి సంఖ్య 48 శాతం పెరిగింది. . . . అయితే ఖరీదైన, సమయాన్ని కాజేసే కళాశాల డిప్లొమాలు ఇప్పుడు విలువను కోల్పోయాయి.”​—⁠టైమ్‌, జనవరి 24, 2005.

“భావి పరిస్థితులకు సంబంధించి యుఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ లేబర్‌ అంచనాల ప్రకారం 2005వ సంవత్సరమంతటిలో నాలుగేళ్ళ కళాశాల పట్టభద్రుల్లో కనీసం మూడింట ఒకవంతు మందికి తమ డిగ్రీకి తగిన ఉద్యోగం లభించదనే భయానక విషయం వెల్లడవుతోంది.”​—⁠ద ఫ్యూచరిస్ట్‌, జూలై/ఆగస్టు 2000.

వీటన్నింటి దృష్ట్యా అంతకంతకు ఎక్కువమంది విద్యావేత్తలు నేటి ఉన్నత విద్యా విలువను చాలా సందేహిస్తున్నారు. “అనుచిత భవిష్యత్తు నిమిత్తం మనం ప్రజలను విద్యావంతులను చేస్తున్నాం” అని ఫ్యూచరిస్ట్‌ నివేదిక విచారం వెలిబుచ్చుతోంది. దానికి భిన్నంగా దేవుని గురించి బైబిలు ఏమి చెబుతోందో గమనించండి: “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించినయెడల నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్రతరంగములవలెను ఉండును.”​—⁠యెషయా 48:​17, 18.

[26వ పేజీలోని చిత్రం]

వారు తమ వ్యక్తిగత లక్ష్యాలను ప్రక్కనబెట్టి యేసును అనుసరించారు

[31వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ తల్లిదండ్రులు జ్ఞానయుక్తంగా తమ పిల్లలకు పసితనం నుండే బలమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తారు