కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నా తల్లిదండ్రుల ఆదర్శం నన్ను బలపరిచింది

నా తల్లిదండ్రుల ఆదర్శం నన్ను బలపరిచింది

జీవిత కథ

నా తల్లిదండ్రుల ఆదర్శం నన్ను బలపరిచింది

జానెజ్‌ రెకెల్‌ చెప్పినది

అది 1958వ సంవత్సరం. నేను, నా భార్య స్టాంకా, ఆస్ట్రియాకు పారిపోవాలనే ఉద్దేశంతో యుగోస్లావియా ఆస్ట్రియాల సరిహద్దుల్లోవున్న కారవాన్జ్‌కెన్‌ ఆల్ప్స్‌ పర్వతాలమీదకు చేరుకున్నాం. అది చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే యుగోస్లావియా సాయుధ సరిహద్దు గస్తీదళాలు, ఎవరూ సరిహద్దులు దాటి వెళ్ళకుండా ఆపాలనే దృఢనిశ్చయంతో ఉన్నారు. మేము ముందుకు సాగుతుండగా, నిటారుగావున్న ఎత్తైన కొండకొనకు చేరుకున్నాం. స్టాంకా, నేను ఆస్ట్రియావైపున్న పర్వతాలను ముందెప్పుడూ చూడలేదు. మేము తూర్పు దిశగా ప్రయాణించి రాళ్ళూ రప్పలతో ఎగుడుదిగుడుగా ఉన్న ఏటవాలు ప్రాంతాన్ని చేరుకున్నాం. మాతో తెచ్చుకున్న టార్పాలిన్‌ను మా చుట్టూ చుట్టుకొని, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియకుండా, పర్వతం మీదనుండి క్రిందికి జారాం.

మేము ఆ పరిస్థితిలోకి ఎలా వచ్చామో, కష్టకాలాల్లో యెహోవాపట్ల యథార్థంగా ఉండడానికి నా తల్లిదండ్రుల నమ్మకమైన ఆదర్శం నన్నెలా పురికొల్పిందో చెబుతాను.

నేను స్లోవేనియాలో పెరిగాను, అదిప్పుడు మధ్య యూరప్‌లో ఒక చిన్న దేశం. అది యూరప్‌లోని ఆల్ప్స్‌ పర్వతాల నడుమ నెలకొని ఉంది, దానికి ఉత్తరాన ఆస్ట్రియా, పశ్చిమాన ఇటలీ, దక్షిణాన క్రొయెషియా, తూర్పున హంగరీ ఉన్నాయి. అయితే, నా తల్లిదండ్రులు ఫ్రాన్‌ట్స్‌, రోజలీయ రెకెల్‌లు పుట్టినప్పుడు స్లోవేనియా ఆస్ట్రో-హంగేరియన్‌ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం ముగింపులో సెర్బియన్ల, క్రొయేషియన్ల, స్లోవేనియన్ల రాజ్యమని పిలువబడే ఒక క్రొత్త రాష్ట్రంలో స్లోవేనియా భాగమైంది. 1929లో ఆ దేశం పేరు యుగోస్లావియా అని మార్చబడింది, దానికి అక్షరార్థంగా “దక్షిణ స్లోవియా” అని అర్థం. నేను అదే సంవత్సరం జనవరి 9న, సుందరమైన బ్లెడ్‌ సరస్సుకు దగ్గర్లోవున్న పోదోం అనే గ్రామ శివార్లలో జన్మించాను.

అమ్మ నిష్ఠగల క్యాథలిక్‌ కుటుంబంలో పెరిగింది. ఆమె చిన్నాన్న ఒకాయన ప్రీస్టు, ముగ్గురు మేనత్తలు నన్‌లు. ఒక బైబిలు సంపాదించుకొని, దాన్ని చదివి అర్థం చేసుకోవాలని ఆమెకు ఎంతో కోరికగా ఉండేది. అయితే నాన్నకు మాత్రం మతమంటే సరైన అభిప్రాయం ఉండేదికాదు. 1914-18లో జరిగిన గొప్ప యుద్ధంలో మతం పోషించిన పాత్ర కారణంగా ఆయనకు మతం మీద ఏవగింపు కలిగింది.

సత్యం తెలుసుకోవడం

యుద్ధం ముగిసిన తర్వాత కొంతకాలానికి, మా అమ్మవైపు బంధువులు జానెజ్‌ బ్రాయిస్‌, ఆయన భార్య అన్చుకా బైబిలు విద్యార్థులయ్యారు, అప్పట్లో యెహోవాసాక్షులు అలా పిలువబడేవారు. ఆ సమయంలో, వాళ్ళు ఆస్ట్రియాలో నివసించేవారు. దాదాపు 1936 నుండి అన్చుకా చాలా సందర్భాల్లో అమ్మను కలవడానికి వచ్చింది. ఆమె అమ్మకు ఒక బైబిలు ఇవ్వడంతో అమ్మ వెంటనే దాన్ని చదవడం ప్రారంభించింది, దానితోపాటు స్లోవేనియన్‌ భాషలోని కావలికోట పత్రికలను, ఇతర బైబిలు ప్రచురణలను కూడా అమ్మ చదివింది. చివరకు, 1938లో హిట్లర్‌ ఆస్ట్రియాను ఆక్రమించడంతో, జానెజ్‌ అన్చుకాలు మళ్ళీ స్లోవేనియాకు చేరుకున్నారు. వాళ్ళు విద్యావంతులు, అవగాహనగలవారు, యెహోవాపట్ల నిజమైన ప్రేమగల దంపతులు అని నాకు గుర్తుంది. వాళ్ళు అమ్మతో తరచూ బైబిలు సత్యాల గురించి చర్చించేవారు, అలాంటి చర్చలు అమ్మ తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడానికి పురికొల్పాయి. 1938లో అమ్మ బాప్తిస్మం తీసుకుంది.

అమ్మ క్రిస్‌మస్‌ పండుగ జరుపుకోవడంలాంటి లేఖనరహిత ఆచారాలను మానుకున్నప్పుడు, రక్తంతో చేసిన పదార్థాలు తినడం మానేసినప్పుడు, ప్రాముఖ్యంగా మా దగ్గరున్న విగ్రహాలన్నీ తీసేసి వాటిని కాల్చేసినప్పుడు ఆ ప్రాంతంలో సంచలనం రేగింది. ఆ తర్వాత వ్యతిరేకత తలెత్తడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నన్‌లుగావున్న అమ్మ మేనత్తలు, అమ్మ మళ్ళీ మరియను ఆరాధించేందుకు, చర్చికి వెళ్ళేందుకు ఆమెను ఒప్పించే ప్రయత్నంలో భాగంగా ఉత్తరాలు వ్రాశారు. అయితే, వాటికి బదులుగా అమ్మ కొన్ని బైబిలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని వాళ్ళకు వ్రాసేసరికి ఇక వాళ్ళ దగ్గరి నుండి సమాధానం రాలేదు. మా తాతయ్య కూడా ఆమెను చాలా వ్యతిరేకించాడు. ఆయన చెడ్డవాడేమీ కాదు గానీ మా బంధువులు, సమాజంలోని వారు ఆయన మీదకు చాలా ఒత్తిడి తీసుకువచ్చారు. ఫలితంగా ఆయన, అమ్మ దగ్గరున్న బైబిలు సాహిత్యాలను చాలాసార్లు నాశనం చేశాడు గానీ ఆమె బైబిల్‌ను ఎప్పుడూ ముట్టుకోలేదు. చర్చీకి తిరిగి రమ్మని ఆయన అమ్మ ఎదుట మోకాళ్ళూని మరీ వేడుకున్నాడు. ఒకసారైతే కత్తి తీసుకుని చంపేస్తానని బెదిరించడానికి కూడా వెనుకాడలేదు. అయితే, మా నాన్నగారు తాను అలాంటి ప్రవర్తనను ఎంతమాత్రం సహించనని తాతయ్యకు ఖండితంగా చెప్పేశారు.

బైబిలు చదివి, తన నమ్మకాలకు అనుగుణంగా ఎంపికలు చేసుకునే విషయంలో అమ్మకుగల హక్కును నాన్నగారు సమర్థిస్తూనే వచ్చారు. 1946లో ఆయన కూడా బాప్తిస్మం తీసుకున్నారు. వ్యతిరేకత ఉన్నప్పటికీ అమ్మ సత్యం కోసం నిర్భయంగా నిలబడడానికి యెహోవా ఆమెను ఎలా బలపరిచాడో, ఆమె విశ్వాసాన్నిబట్టి యెహోవా ఆమెకెలా ప్రతిఫలమిచ్చాడో చూడడం నేను దేవునితో సంబంధాన్ని పెంపొందింపజేసుకోవడానికి నన్ను పురికొల్పింది. బైబిల్లో నుండి, బైబిలు ఆధారిత సాహిత్యాల్లో నుండి నాకు బిగ్గరగా చదివి వినిపించే ఆమె అలవాటువల్ల కూడా నేనెంతో ప్రయోజనం పొందాను.

అమ్మ తన చెల్లెలు మారీయ రిపెతో సుదీర్ఘ చర్చలు జరిపేది, చివరకు మారీయ పిన్ని, నేను ఒకేరోజున అంటే 1942 జూలై మధ్యభాగంలో బాప్తిస్మం తీసుకున్నాం. ఒక సహోదరుడు వచ్చి ఒక చిన్న ప్రసంగమిచ్చారు, మా ఇంట్లోవున్న పెద్ద చెక్క తొట్టిలో మేము బాప్తిస్మం తీసుకున్నాం.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వెట్టిచాకిరి

1942లో, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు జర్మనీ, ఇటలీ స్లోవేనియామీద దాడి చేసి దాన్ని తమకు హంగరీకి మధ్య విభజించుకున్నాయి. మా అమ్మానాన్నలు ఫోల్క్స్‌బంట్‌ అనే నాజీ ప్రజల సంస్థలో చేరడానికి నిరాకరించారు. నేను స్కూల్లో “హేల్‌ హిట్లర్‌” అని చెప్పడానికి నిరాకరించాను. మా టీచరు పరిస్థితి గురించి అధికారులకు తెలియజేశారు.

లేబర్‌ క్యాంప్‌గా ఉపయోగించబడిన, బవర్యాలోవున్న హ్యూటెన్‌బాక్‌ గ్రామం దగ్గరున్న ఒక కోటకు వెళ్ళే రైలులోకి మమ్మల్ని ఎక్కించారు. నేను స్థానిక బేకరీ నడిపే ఒక వ్యక్తి కుటుంబంతో కలిసి పనిచేస్తూ వాళ్ళ దగ్గరే ఉండేలా నాన్నగారు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో నేను బేకింగ్‌ చేయడం నేర్చుకున్నాను, అది ఆ తర్వాత ఎంతో ఉపయోగపడింది. కొంతకాలానికి, (మారీయ పిన్ని, ఆమె కుటుంబంతో సహా) మా కుటుంబంలోని మిగతావాళ్ళంతా గున్‌జెన్‌హౌజెన్‌ క్యాంపుకు పంపబడ్డారు.

యుద్ధం ముగింపులో, నేను మా అమ్మానాన్నలున్న ప్రాంతానికి వెళ్ళడానికి ఒక గుంపుతో కలవడానికి సిద్ధపడ్డాను. నేను బయలుదేరబోయే ముందు సాయంకాలం నాన్నగారు వచ్చారు. నేను ఆ గుంపుతో కలిసి వెళ్ళుంటే ఎక్కడికి చేరుకునేవాడినో తెలియదు, ఎందుకంటే ఆ గుంపులోని వాళ్లు అంత నమ్మదగినవారు కాదు. నన్ను కాపాడి నాకు శిక్షణ ఇవ్వడానికి నా తల్లిదండ్రులను ఉపయోగించుకున్నందుకు నేను మరోసారి యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధను చవిచూశాను. నాన్నగారు, నేను, మా కుటుంబాన్ని కలుసుకోవడానికి మూడు రోజులపాటు నడిచాం. 1945 జూన్‌కల్లా మేమంతా తిరిగి ఇంటికి చేరుకున్నాం.

యుద్ధం ముగిసిన తర్వాత, అధ్యక్షుడైన యొసీప్‌ బ్రాస్‌ టిటో నాయకత్వం క్రింద యుగోస్లావియాలో కమ్యూనిస్టువాదులు అధికారానికి వచ్చారు. తత్ఫలితంగా, యెహోవాసాక్షులకు పరిస్థితులు కష్టభరితంగానే ఉండిపోయాయి.

1948లో ఆస్ట్రియా నుండి ఒక సహోదరుడు వచ్చి మాతో కలిసి భోంచేశాడు. ఆయన వెళ్లిన ప్రతీ చోటికి పోలీసులు ఆయన్ని అనుసరించి ఆయన సందర్శించిన సహోదరులందరినీ అరెస్టు చేశారు. ఆయనకు ఆతిథ్యమిచ్చినందుకు, ఆయనను పోలీసులకు అప్పగించనందుకు నాన్నగారిని కూడా అరెస్టు చేశారు, ఫలితంగా నాన్నగారు రెండు సంవత్సరాలు జైలులో గడిపారు. నాన్నగారు లేకపోవడమే కాక నేను, మా తమ్ముడు త్వరలోనే తటస్థత విషయంలో పరీక్షను ఎదుర్కోక తప్పదని కూడా తెలియడంతో అమ్మకు అది చాలా కష్టమైన సమయమే అయ్యింది.

మాసిడోనియాలో జైలుశిక్ష

1949 నవంబరులో, నాకు సైన్యంలో చేరమని పిలుపు వచ్చింది. ఆ సేవ చేయడానికి నేను నా మనస్సాక్షి కారణంగా నిరాకరిస్తున్నానని వివరించడానికి నేను వెళ్ళాను. అధికారులు నేను చెప్పేదాన్ని పట్టించుకోకుండా, యుగోస్లావియాకు ఇంకో చివరనవున్న మాసిడోనియాకు వెళ్తున్న క్రొత్తగా చేరిన ఇతర సైనికులతోపాటు నన్ను కూడా రైలు ఎక్కించేశారు.

మూడు సంవత్సరాలపాటు, నేను నా కుటుంబం నుండి, సహోదరుల నుండి విడిపోయి, ఏ విధమైన సాహిత్యంగానీ బైబిలు గానీ లేకుండా ఉండిపోయాను. అది నాకు చాలా కష్టమనిపించింది. యెహోవా గురించి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఉదాహరణ గురించి ధ్యానించడం ద్వారా బలం పొందాను. నా తల్లిదండ్రుల ఆదర్శం కూడా నన్ను బలపరిచింది. అంతేగాక, బలం కోసం పట్టుదలతో ప్రార్థించడం కూడా నిరాశ చెందకుండా ఉండేందుకు నాకు తోడ్పడింది.

కొంతకాలానికి నన్ను స్కోప్జె దగ్గరున్న ఇడ్రిజోవో జైలుకు పంపారు. ఈ జైలులో ఖైదీలు వివిధ రకాల పనులు చేసేవారు. మొదట్లో, నేను క్లీనరుగా, ఆఫీసుల మధ్య కొరియర్‌గా పనిచేశాను. అంతకుముందు రహస్య పోలీసు సభ్యునిగా పనిచేసిన ఒక ఖైదీ నన్ను తరచూ వేధిస్తున్నప్పటికీ మిగతా అందరితో అంటే కాపలాదారులతో, ఖైదీలతో, చివరికి జైలు ఫ్యాక్టరీ మేనేజరుతో పని విషయంలో నాకు సత్సంబంధాలు ఉండేవి.

ఆ తర్వాత, జైలు బేకరీలో ఒక బేకర్‌ అవసరం ఉందని నాకు తెలిసింది. కొన్నిరోజుల తర్వాత మేనేజరు హాజరు తీసుకోవడానికి వచ్చాడు. ఆయన వరుసగా ఒక్కొక్కరి దగ్గరకు వస్తూ నా ఎదురుగా ఆగి, “నీవు బేకర్‌వా?” అని అడిగాడు. “అవునండి” అని సమాధానమిచ్చాను. “రేపు ఉదయం బేకరీకి వెళ్లు” అని ఆయన చెప్పాడు. నన్ను వేధించే ఖైదీ తరచూ బేకరీ ముందునుండే వెళ్ళేవాడు గానీ ఏమీ చేయలేకపోయేవాడు. అక్కడ నేను 1950 ఫిబ్రవరి నుండి జూలై వరకు పనిచేశాను.

ఆ తర్వాత నన్ను ప్రెస్పా సరస్సు దగ్గర, మాసిడోనియాకు దక్షిణానవున్న ఓల్కొడేరీ అని పిలువబడే బారకాసులకు బదిలీచేశారు. సమీపంలోవున్న ఓటసోవో పట్టణం నుండి నేను ఇంటికి ఉత్తరాలు వ్రాయగలిగేవాణ్ణి. నేను ఖైదీలతోపాటు రోడ్డు నిర్మాణంలో పనిచేసేవాణ్ణి, కానీ ఎక్కువమేరకు బేకరీలోనే చేసేవాణ్ణి, అది నాకు కాస్త సులభంగా ఉండేది. 1952, నవంబరులో నేను విడుదల చేయబడ్డాను.

పోదోంలో నేను లేని సమయంలో, ఆ ప్రాంతంలో ఒక సంఘం ఏర్పడింది. మొదట్లో, ఆ సంఘం స్పోన్యే గార్యెలోని అతిథిగృహంలో కూడుకునేది. ఆ తర్వాత, నాన్నగారు సంఘం కూడుకోవడానికి మా ఇంట్లోనే ఒక గది సిద్ధం చేశారు. నేను మాసిడోనియా నుండి తిరిగి వచ్చినప్పుడు వారితో చేరి ఆనందించాను. నేను జైలుకు వెళ్లకముందు కలిసిన స్టాంకాతో నా పరిచయం మరింత పెంచుకున్నాను. 1954, ఏప్రిల్‌ 24న మేము వివాహం చేసుకున్నాం. అయితే, నా స్వేచ్ఛ ముగింపుకు రాబోతోంది.

మారిబోర్‌లో జైలుశిక్ష

సెప్టెంబరు 1954లో నాకు మరోసారి పిలుపు వచ్చింది. ఈసారి, స్లోవేనియాకు తూర్పునవున్న మారిబోర్‌ జైల్లో నాకు మూడున్నర సంవత్సరాలకంటే ఎక్కువకాలం శిక్ష పడింది. నాకు సాధ్యమైనంత త్వరగా నేను కొన్ని పేపర్లు, పెన్సిళ్లు కొనుక్కున్నాను. నాకు గుర్తున్న లేఖనాలు, కావలికోటలోని వాక్యాలు, ఇతర క్రైస్తవ ప్రచురణల్లోని తలంపులు వ్రాయడం మొదలుపెట్టాను. నేను వ్రాసుకున్నవాటిని చదివి చూసుకొని, నా స్మృతిలో ఇంకా మెదులుతున్నవాటిని అలాగే వ్రాసుకుంటూ వెళ్ళాను. చివరకు, పుస్తకం నిండిపోయింది, ఇలా చేయడం నేను సత్యంపైనే మనసు కేంద్రీకరించడానికి, ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి నాకు సహాయం చేసింది. నా ఆధ్యాత్మిక బలానికి ప్రార్థన, ధ్యానం కూడా అమూల్యమైన సహాయకాలుగా తోడ్పడి, సత్యాన్ని ఇతరులతో పంచుకోవడంలో మరింత ధైర్యంగా ఉండడానికి సహాయం చేశాయి.

ఆ కాలంలో, నేను నెలకు ఒక ఉత్తరం అందుకోవడానికి, నెలకు ఒకసారి 15 నిమిషాలపాటు ఎవరైనా నన్ను సందర్శించడానికి నాకు అనుమతి లభించింది. స్టాంకా ఉదయాన్నే జైల్లో నన్ను కలుసుకోవడానికి, రాత్రంతా రైలు ప్రయాణం చేసివచ్చేది, ఆ తర్వాత అదేరోజు మళ్ళీ తిరిగి వెళ్ళేది. ఆమె అలా వచ్చి వెళ్లడం నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చేది. అప్పుడు నేను బైబిలు సంపాదించుకోవడానికి ఒక పథకం వేశాను. స్టాంకా నేను ఒక బల్ల దగ్గర ఎదురెదురుగా కూర్చునే వాళ్ళం, మమ్మల్ని గమనించడానికి ఒక కాపలావాడు ఉండేవాడు. కాపలావాడు చూడనప్పుడు నేను ఆమె చేతిసంచిలోకి ఒక ఉత్తరం వేశాను, అందులో ఈ సారి వచ్చినప్పుడు సంచిలో ఒక బైబిలు పెట్టుకుని రమ్మని వ్రాశాను.

స్టాంకా, మా అమ్మానాన్నలు ఇది చాలా ప్రమాదకరమైనదని భావించి, క్రైస్తవ గ్రీకు లేఖనాలను విడదీసి దాని పేజీలను కొన్ని బన్నుల మధ్య పెట్టారు. ఆ విధంగా నేను నాకు కావలసిన బైబిలును అందుకున్నాను. అదేవిధంగా, నేను కావలికోట ప్రతులను కూడా అందుకున్నాను, అవి స్టాంకా చేతితో ఎత్తి వ్రాసినవి. నేను వెంటనే వాటిని ఎత్తివ్రాసి మరో కాపీ తయారుచేసుకుని, ఆమె వ్రాసిన వాటిని చింపేసేవాడిని, లేకపోతే ఎవరైనా చూశారంటే అవి నాకు ఎక్కడినుండి లభిస్తున్నాయో కనుక్కోగలిగేవారు.

నేను పట్టుదలతో సాక్ష్యమిస్తున్నందుకు, తప్పక సమస్యల్లో చిక్కుకుంటానని తోటి ఖైదీలు అనేవారు. ఒకసారి, నేను నా తోటి ఖైదీతో ఎంతో ఉత్సాహంగా బైబిలు చర్చ జరుపుతున్నాను. ఎవరో తాళం తీస్తున్న శబ్దం మాకు వినిపించింది, అంతలో ఒక కాపలాదారుడు లోపలికి రానేవచ్చాడు. నాకు ఏకాంతవాస శిక్ష పడుతుందని వెంటనే అనుకున్నాను. కానీ కాపలాదారుడి ఉద్దేశం అది కాదు. ఆయన చర్చ విని తను కూడా మాతో కలవాలని వచ్చాడు. ఆయనడిగిన ప్రశ్నలకు నేనిచ్చిన సమాధానాలకు సంతృప్తిపడి ఆయన వెళ్లిపోతూ మళ్ళీ తలుపు తాళం వేసి వెళ్ళాడు.

నా శిక్షలోని చివరి నెలలో, ఖైదీలను సంస్కరించే అధికారి సత్యం కోసం నేను కనబరచిన దృఢసంకల్పంతో కూడిన వైఖరికి నన్ను ప్రశంసించాడు. యెహోవా నామాన్ని ప్రకటించడానికి నేను చేసిన కృషికి ఇది చక్కని ప్రతిఫలమని నేను భావించాను. 1958 మేలో నేను మళ్ళీ జైలు నుండి విడుదలయ్యాను.

ఆస్ట్రియాకు పారిపోవడం, ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్ళడం

1958 ఆగస్టులో మా అమ్మ మరణించింది. ఆమె కొంతకాలంపాటు అస్వస్థతతో ఉంది. ఆ తర్వాత 1958 సెప్టెంబరులో నాకు మూడోసారి పిలుపు వచ్చింది. ఆ సాయంకాలం స్టాంకా నేను చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం, దాని మూలంగానే ప్రారంభంలో పేర్కొన్నట్లు మేము నాటకీయంగా సరిహద్దులు దాటాం. మేము ఎవరికీ చెప్పకుండా, భుజాలకు తగిలించుకునే రెండు సంచులు సర్దుకుని, టార్పాలిన్‌ తీసుకొని కిటికీలో నుండి బయటికి వచ్చేసి, స్టోల్‌ పర్వతానికి కొంచెం పశ్చిమానవున్న ఆస్ట్రియా సరిహద్దు వైపుకు బయలుదేరాం. మాకు ఉపశమనం అవసరమని యెహోవా గ్రహించినప్పుడు ఆయనే మాకు మార్గం సుగమం చేసినట్లు అనిపించింది.

ఆస్ట్రియా అధికారులు మమ్మల్ని సాల్జ్‌బర్గ్‌ దగ్గరున్న శరణార్థి శిబిరానికి పంపించారు. మేమక్కడున్న ఆరు నెలల్లో మేము ఎప్పుడూ స్థానిక సాక్షులతోనే ఉన్నాం, కాబట్టి మేము శరణార్థి శిబిరంలో చాలా తక్కువ సమయం గడిపేవాళ్ళం. మేము అంత త్వరగా స్నేహితులను ఎలా సంపాదించుకున్నామని శరణార్థి శిబిరంలోని ఇతరులు ఆశ్చర్యపోయారు. ఈ సమయంలోనే మేము మా మొదటి సమావేశానికి హాజరయ్యాం. అంతేగాక మొట్టమొదటిసారిగా మేము స్వేచ్ఛగా ఇంటింటి సేవలో పాల్గొన్నాం. మేము వెళ్ళిపోవలసిన సమయం వచ్చినప్పుడు ఈ ప్రియ స్నేహితులను వదిలి వెళ్ళడం మాకు చాలా కష్టమైంది.

ఆస్ట్రియా అధికారులు మేము ఆస్ట్రేలియాకు వలసవెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. మేము అంతదూరం వెళ్ళగలమని ఎప్పుడూ అనుకోలేదు. మేము రైలులో ఇటలీలోని జెనోవాకు వెళ్ళి, అక్కడినుండి ఆస్ట్రేలియాకు వెళ్ళే ఓడ ఎక్కాము. చివరకు మేము న్యూ సౌత్‌ వేల్స్‌లోని ఒల్లొంగాంగ్‌ నగరంలో స్థిరపడ్డాం. అక్కడ 1965, మార్చి 30న మా అబ్బాయి ఫిలిప్‌ జన్మించాడు.

ఆస్ట్రేలియాలో నివసించడం మాకు అనేక సేవావకాశాలను ఇచ్చింది, మునుపు యుగోస్లావియా అని పిలువబడిన ప్రాంతాల నుండి వలస వచ్చినవారికి ప్రకటించడం ఆ అవకాశాల్లో ఒకటి. మేము ఐక్య కుటుంబంగా యెహోవా సేవ చేయగలుగుతున్నందుకు, ఆయన ఆశీర్వాదాలన్నిటికీ మేము ఆయనకు కృతజ్ఞులం. ఫిలిప్‌కు, ఆయన భార్య సూజీకి ఆస్ట్రేలియాలోని యెహోవాసాక్షుల బ్రాంచిలో సేవ చేసే ఆధిక్యత లభించింది, అంతేగాక స్లోవేనియాలోని బ్రాంచి కార్యాలయంలో కూడా రెండు సంవత్సరాలు సేవ చేసే అవకాశం వారికి లభించింది.

వయస్సు పైబడుతున్నందుకు, ఆరోగ్య సమస్యల మూలంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవలసి వస్తున్నప్పటికీ, నేను నా భార్య యెహోవాకు మేము చేసే సేవలో ఆనందాన్ని పొందుతున్నాం. నా తల్లిదండ్రుల మంచి ఆదర్శానికి నేనెంతో కృతజ్ఞుడిని. అది నన్ను బలపరుస్తూనే ఉంది, “నిరీక్షణగలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పుగలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి” అని అపొస్తలుడైన పౌలు చెప్పినది చేయడానికి నాకు సహాయం చేస్తోంది.​—⁠రోమీయులు 12:​12.

[16, 17వ పేజీలోని చిత్రం]

1920ల చివరి సంవత్సరాల్లో నా తల్లిదండ్రులు

[17వ పేజీలోని చిత్రం]

తనకు సత్యం బోధించిన అన్చుకాతో అమ్మ, కుడి చివరన

[18వ పేజీలోని చిత్రం]

మా వివాహమైన కొంతకాలానికి, నా భార్య స్టాంకాతో

[19వ పేజీలోని చిత్రం]

1955లో మా ఇంట్లో కూడుకున్న సంఘం

[20వ పేజీలోని చిత్రం]

నా భార్య, మా కుమారుడు ఫిలిప్‌, ఆయన భార్య సూజీలతో