కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ‘దేవునియెడల ధనవంతులుగా’ ఉన్నారా?

మీరు ‘దేవునియెడల ధనవంతులుగా’ ఉన్నారా?

మీరు ‘దేవునియెడల ధనవంతులుగా’ ఉన్నారా?

యేసుక్రీస్తు చెప్పిన ఆలోచన రేకెత్తించే అనేక ఉపమానాల్లో ధనవంతుడైన భూస్వామిని గురించిన ఉపమానం ఒకటి. ఆ భూస్వామి తన భవిష్యత్తును పదిలపరచుకునే ప్రయత్నంలో పెద్ద పెద్ద ధాన్యపు కొట్లను నిర్మించుకోవాలని ప్రణాళిక వేసుకున్నాడు. కానీ యేసు ఉపమానంలోని ఆ వ్యక్తి ‘వెఱ్ఱివాడు’ అని పిలువబడ్డాడు. (లూకా 12:16-21) అనేక బైబిలు అనువాదాలు ‘మూర్ఖుడు’ అనే పదాన్ని కూడా ఉపయోగిస్తున్నాయి. ఆ వ్యక్తి విషయంలో ఎందుకంత కఠినమైన పదం ఉపయోగించబడింది?

ఆ ధనవంతుడు తన ప్రణాళికల్లో దేవునికి స్థానమివ్వనట్లు స్పష్టమవుతోంది; అలాగే అతను భూమి సమృద్ధిగా పండినందుకు దేవునికి ఏ ఘనతా చెల్లించలేదు. (మత్తయి 5:​45) బదులుగా, అతను గర్వంగా ఇలా చెప్పుకున్నాడు: “ప్రాణమా, అనేక సంవత్సరములకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము.” అవును, అతను తన ప్రయత్నాల ఫలితం “యెత్తయిన ప్రాకారము”గా పనిచేస్తుందని అనుకున్నాడు.​—⁠సామెతలు 18:11.

అటువంటి అహంకార స్ఫూర్తిని గురించి హెచ్చరిస్తూ, శిష్యుడైన యాకోబు ఇలా వ్రాశాడు: “నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరివంటివారే.”​—⁠యాకోబు 4:​13, 14.

ఆ మాటల నిజత్వం నిరూపించబడింది, యేసు ఉపమానంలోని ఆ ధనవంతునితో దేవుడు ఇలా అన్నాడు: ‘వెఱ్ఱివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగును?’ తన కలలు నిజంకాకముందే ఆ ధనవంతుడు అంతలో మాయమయ్యే ఆవిరివలే చనిపోతాడు. దీనిలో ఉన్న పాఠాన్ని మనం గ్రహిస్తున్నామా? యేసు ఇలా అన్నాడు: “దేవునియెడల ధనవంతుడుకాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండును.” మరి మీరు ‘దేవునియెడల ధనవంతులుగా’ ఉన్నారా?