కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ మనస్సాక్షి సుశిక్షితమైనదేనా?

మీ మనస్సాక్షి సుశిక్షితమైనదేనా?

మీ మనస్సాక్షి సుశిక్షితమైనదేనా?

“అలా చేయడం తప్పని నా మనసుకు తెలుసు” లేదా, “మీరు నన్ను చేయమంటున్నది నేను చేయలేను. అది తప్పని నా అంతరాత్మ చెబుతోంది” అని మీరెప్పుడైనా అన్నారా? అదే మీ మనస్సాక్షి “స్వరం,” తప్పొప్పుల విషయంలో ఆ అంతర్గత అవగాహన లేక గ్రహింపు, ఒక వ్యక్తిని క్షమిస్తుంది లేదా నిందిస్తుంది. అవును, మనస్సాక్షి మనలో జన్మతః ఉంటుంది.

మానవుడు దేవుని నుండి దూరమైపోయినా అతడికి తప్పొప్పులను గ్రహించే సాధారణ సామర్థ్యం ఉంటుంది. ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు, అందుకే అతడు జ్ఞానం, నీతి వంటి దైవిక లక్షణాలను కొంతమేరకు ప్రతిబింబిస్తాడు. (ఆదికాండము 1:​26, 27) దీని గురించి అపొస్తలుడైన పౌలు దైవ ప్రేరేపణతో ఇలా వ్రాశాడు: “ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.” *​—⁠రోమీయులు 2:​14, 15.

మొదటి మానవుడైన ఆదాము నుండి వారసత్వంగా వచ్చిన ఈ నైతిక స్వభావం అన్ని జాతుల, దేశాల ప్రజల్లో ఒక “ధర్మశాస్త్రం”లా, ప్రవర్తనా నియమావళిలా పనిచేస్తుంది. అది మనల్ని మనం పరిశీలించుకుని మనల్ని మనం విమర్శించుకొనే సామర్థ్యం. (రోమీయులు 9:​2, 3) ఆదాము హవ్వలు తాము దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన వెంటనే ఈ సామర్థ్యాన్ని కనబరిచారు, వారు దేవునికి కనిపించకూడదని దాక్కున్నారు. (ఆదికాండము 3:​7, 8) మనస్సాక్షి ఎలా పనిచేస్తుందనేదానికి మరో ఉదాహరణ, రాజైన దావీదు తాను జనాభా లెక్కలు సేకరించడం ద్వారా పాపం చేశానని గుర్తించినప్పుడు ఆయన ప్రతిస్పందించిన తీరు. దానికి బైబిలు ‘దావీదు మనస్సు కొట్టుకున్నది’ అని చెబుతోంది.​—⁠2 సమూయేలు 24:​1-10.

గతాన్ని పరిశీలించుకొని, మన నైతిక ప్రవర్తనను విమర్శించుకొనే సామర్థ్యం, దేవుడు అంగీకరించేలాంటి పశ్చాత్తాపం చూపించడమనే ప్రాముఖ్యమైన చర్య తీసుకునేలా మనల్ని ప్రేరేపించగలదు. దావీదు ఇలా వ్రాశాడు: “నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నా యెముకలు క్షీణించినవి. నా దోషము కప్పుకొనక నీ యెదుట నా పాపము ఒప్పుకొంటిని.​—⁠యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు.” (కీర్తన 32:​3, 5) అలా, సరిగ్గా పనిచేసే మనస్సాక్షి పాపం చేసిన వ్యక్తిని తిరిగి దేవుని దగ్గరికి తీసుకువచ్చి, దేవుని క్షమాపణ పొందవలసిన అవసరాన్ని, ఆయన మార్గాలను అనుసరించవలసిన అవసరాన్ని గుర్తించడానికి అతనికి సహాయం చేస్తుంది.​—⁠కీర్తన 51:1-4, 9, 13-15.

మనం ఏదైనా ఎంపిక చేసుకోవలసి వచ్చినప్పుడు లేదా నైతికపరమైన నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు మనస్సాక్షి హెచ్చరికలను లేక మార్గనిర్దేశాన్ని కూడా ఇస్తుంది. మనస్సాక్షికి సంబంధించిన ఈ అంశమే వ్యభిచారం తప్పని, అనైతిక చర్యయని, దేవుని ఎదుట అది పాపమని ముందే గుర్తించడానికి యోసేపుకు సహాయం చేసివుంటుంది. వ్యభిచారం చేయకూడదనే ఒక నిర్దిష్టమైన కట్టడ ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన పది ఆజ్ఞల్లో చేర్చబడింది. (ఆదికాండము 39:1-9; నిర్గమకాండము 20:​14) కాబట్టి కేవలం మనల్ని విమర్శించడానికే కాక మనకు మార్గనిర్దేశం ఇచ్చే విధంగా కూడా మన మనస్సాక్షికి శిక్షణనిచ్చినప్పుడు మనం ఎంతో ప్రయోజనం పొందే అవకాశముందని స్పష్టమవుతోంది. మీ మనస్సాక్షి ఆ విధంగానే పనిచేస్తోందా?

సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనస్సాక్షికి శిక్షణనివ్వడం

మనం మనస్సాక్షిని జన్మతః పొందుతున్నప్పటికీ, విచారకరంగా ఆ వరం లోపభూయిష్టంగా ఉంది. మానవజాతి పరిపూర్ణంగానే ప్రారంభమైనప్పటికీ, “అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.” (రోమీయులు 3:​23) పాపము అపరిపూర్ణతల మూలంగా మనం పాడైపోయినందున, మన మనస్సాక్షి పెడదారిపట్టవచ్చు, అది యెహోవా మొదట్లో ఉద్దేశించిన మార్గాల్లో సంపూర్ణంగా ఇక పని చేయకపోవచ్చు. (రోమీయులు 7:​18-23) అంతేగాక బాహ్య కారకాలు మన మనస్సాక్షిపై ప్రభావం చూపించే అవకాశముంది. అది మన పెంపకం, స్థానిక ఆచారాలు, నమ్మకాలు, వాతావరణం వంటివాటిచే ప్రభావితం కాగలదు. ఈ లోకపు పతనమైపోతున్న నైతిక విలువలు, దిగజారిపోతున్న ప్రమాణాలు మంచి మనస్సాక్షికి ప్రామాణికంగా ఎంతమాత్రం పనికిరావు.

కాబట్టి ఒక క్రైస్తవునికి దేవుని వాక్యమైన బైబిలులోవున్న సుస్థిరమైన నీతియుక్త ప్రమాణాల యొక్క అదనపు సహాయం అవసరం. ఇవి విషయాలను సరిగ్గా విశ్లేషించుకుని, వాటిని సరిచేసుకోవడానికి మన మనస్సాక్షికి మార్గనిర్దేశాన్ని ఇవ్వగలవు. (2 తిమోతి 3:​16) మన మనస్సాక్షికి దేవుని ప్రమాణాలకు అనుగుణంగా ఉపదేశం లభించినప్పుడు, అది నైతికంగా హాని చేయగల చర్యలను మనం నివారించడానికి చక్కగా సహాయం చేయగలుగుతుంది, తద్వారా “మేలు కీడులను వివేచించుటకు” మనకు దోహదపడుతుంది. (హెబ్రీయులు 5:​14) దేవుని ప్రమాణాలు లేకపోతే, మనం తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు మన మనస్సాక్షి మనకు హెచ్చరిక ఇవ్వకపోవచ్చు. “ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును” అని బైబిలు చెబుతోంది.​—⁠సామెతలు 16:25; 17:​20.

జీవితంలోని కొన్నిరంగాల్లో, దేవుని వాక్యం సుస్పష్టమైన మార్గదర్శక సూత్రాలను, మార్గనిర్దేశాలను ఇస్తుంది, వాటిని అనుసరించడం ద్వారా మనం ప్రయోజనం పొందుతాం. మరోవైపున, బైబిలులో అనేక పరిస్థితుల విషయంలో నిర్దిష్టమైన ఆదేశాలు లేవు. ఉద్యోగం, ఆరోగ్యం, ఉల్లాసకర కార్యకలాపాలు, వస్త్రధారణ, కనబడేతీరు, తదితర విషయాల్లో మనం చేసుకునే ఎంపికలు వాటిలో కొన్ని. ప్రతి సందర్భంలోనూ ఏమి చేయాలి, ఎలా సరైన నిర్ణయం తీసుకోవాలి అనేది తెలుసుకోవడం అంత సులభం కాదు. ఆ కారణంగానే మనకు దావీదుకున్నటువంటి దృక్పథం ఉండాలి, ఆయనిలా ప్రార్థించాడు: “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము; నీ త్రోవలను నాకు తేటపరచుము. నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు.” (కీర్తన 25:​4, 5) దేవుని దృక్కోణాలను, మార్గాలను మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే, మన పరిస్థితులను అంత ఖచ్చితంగా విశ్లేషించుకొని స్వచ్ఛమైన మనస్సాక్షితో నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

కాబట్టి, ఏదైనా ప్రశ్న తలెత్తినప్పుడు లేక ఏదైనా నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు, అన్వయించగల బైబిలు సూత్రాల గురించి మనం మొదట ధ్యానించాలి. వాటిలో కొన్ని: శిరసత్వంపట్ల గౌరవం చూపించడం (కొలొస్సయులు 3:18, 20); అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండడం (హెబ్రీయులు 13:​18); చెడ్డవాటిని ద్వేషించడం (కీర్తన 97:10); సమాధానం కోసం ప్రయత్నించడం (రోమీయులు 14:19); స్థాపించబడిన ప్రభుత్వాధికారాలకు విధేయత చూపించడం (మత్తయి 22:21; రోమీయులు 13:1-7); దేవుణ్ణి మాత్రమే ఆరాధించడం (మత్తయి 4:​10); లోకసంబంధి కాకుండా ఉండడం (యోహాను 17:​14); దుష్టసాంగత్యాలు చేయకుండడం (1 కొరింథీయులు 15:​33); వస్త్రధారణలో, కనబడేతీరులో అణకువ ప్రదర్శించడం (1 తిమోతి 2:​9, 10); ఇతరులకు అభ్యంతరకరం కాకుండా ఉండడం (ఫిలిప్పీయులు 1:​9-10). ఆ విధంగా, సంబంధిత బైబిలు సూత్రాలను గుర్తించడం మన మనస్సాక్షిని బలపర్చి, సరైన నిర్ణయం తీసుకోవడానికి మనకు సహాయం చేయగలదు.

మీ మనస్సాక్షి చెప్పేది వినండి

మన మనస్సాక్షి మనకు సహాయం చేయాలంటే, అది చెప్పేది మనం వినాలి. మన బైబిలు శిక్షిత మనస్సాక్షి ఇచ్చే సూచనలకు మనం వెంటనే స్పందించినప్పుడే మనం దానినుండి ప్రయోజనం పొందుతాం. సుశిక్షిత మనస్సాక్షిని మనం వాహనంలోని ఇండికేటర్‌ పానెల్‌లో ఉండే హెచ్చరికా లైట్లతో పోల్చవచ్చు. ఆయిల్‌ తక్కువగా ఉందని మనల్ని హెచ్చరిస్తూ లైట్‌ వచ్చిందనుకోండి. మనం ఆ హెచ్చరికకు వెంటనే స్పందించకుండా వాహనం అలాగే నడిపిస్తే ఏమవుతుంది? మనం ఇంజన్‌కు చాలా నష్టం చేకూర్చిన వాళ్ళమవుతాం. అదేవిధంగా, మన మనస్సాక్షి లేక అంతరాత్మ, ఫలాని చర్య తీసుకోవడం తప్పు అని మనల్ని హెచ్చరించగలదు. మన లేఖనాధార ప్రమాణాలను, విలువలను మనం తీసుకుంటున్న లేక తీసుకోబోయే చర్యతో పోల్చి, ఇండికేటర్‌ పానెల్‌లోని లైట్‌లా అది మనల్ని హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికకు వెంటనే స్పందించినప్పుడు అది మనం తప్పుడు చర్యవల్ల కలిగే చెడు పర్యవసానాలను తప్పించుకోవడానికే కాక, మన మనస్సాక్షి సరైన విధంగా పనిచేస్తూ ఉండేందుకు కూడా మనకు సహాయం చేస్తుంది.

మనం హెచ్చరికను అలక్ష్యం చేయడానికే నిర్ణయించుకుంటే ఏమవుతుంది? కొంతకాలానికి, మనస్సాక్షి మొద్దుబారిపోవచ్చు. మనస్సాక్షిని ఎప్పుడూ అలక్ష్యం చేస్తూ ఉండడాన్ని లేక దాన్ని అణచివేయడాన్ని, కాలుతున్న ఇనుముతో చర్మంపై వాతవేయడంతో పోల్చవచ్చు. అలా వాతవేయబడిన చోట నరాల చివర్లు ఉండవు కాబట్టి అక్కడ ఇక ఏ విధమైన స్పర్శా ఉండదు. (1 తిమోతి 4:​1-3) అలాంటి మనస్సాక్షి మనమేదైనా పాపం చేసినప్పుడు మనల్ని ఇక విమర్శించదు, అలాగే అలాంటి పాపం మళ్ళీ చేయకుండా మనకు హెచ్చరికలు ఇవ్వదు. వాతవేయబడిన మనస్సాక్షి తప్పొప్పుల విషయంలో బైబిలు ప్రమాణాలను అలక్ష్యం చేస్తుంది, అందుకే అది చెడ్డ మనస్సాక్షి. అది అపవిత్రమైన మనస్సాక్షి, అలాంటి మనస్సాక్షిగల వ్యక్తి “నానావిధమైన అపవిత్రతను” జరిగిస్తూ దేవునికి దూరమైపోతాడు. (ఎఫెసీయులు 4:17-19; తీతు 1:​15) ఎంత విచారకరమైన పర్యవసానమోకదా!

‘నిర్మలమైన మనస్సాక్షి కలిగివుండండి’

మంచి మనస్సాక్షిని కాపాడుకోవడానికి నిరంతర కృషి అవసరం. అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను.” (అపొస్తలుల కార్యములు 24:​16) ఒక క్రైస్తవునిగా పౌలు తాను దేవునికి వ్యతిరేకంగా తప్పేమీ చేయకుండా ఉండేలా నిశ్చయించుకోవడానికి తన చర్యల విధానాన్ని నిరంతరం పరిశీలించుకుంటూ, దాన్ని సరిచేసుకున్నాడు. తుది విశ్లేషణలో, మన క్రియల తప్పొప్పులను నిర్ణయించేది దేవుడేనని పౌలుకు తెలుసు. (రోమీయులు 14:10-12; 1 కొరింథీయులు 4:⁠4) పౌలు ఇలా అన్నాడు: “మనమెవనికి లెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.”​—⁠హెబ్రీయులు 4:​13.

మనుష్యులకు వ్యతిరేకంగా తప్పు చేయకపోవడం గురించి కూడా పౌలు ప్రస్తావించాడు. దానికొక ఉదాహరణ ఏమిటంటే, ఆయన “విగ్రహములకు బలిగా అర్పించినవాటిని తినుట” గురించి కొరింథులోని క్రైస్తవులకు ఇచ్చిన ఉపదేశం. ఆయన చెబుతున్నదేమిటంటే, దేవుని వాక్యపు దృక్కోణం నుండి చూస్తే ఏదైనా ఒక చర్య అభ్యంతరకరమైనది కాకపోయినా, ఇతరుల మనస్సాక్షిని పరిగణలోకి తీసుకోవడం ప్రాముఖ్యం. అలా చేయలేకపోవడం, ‘ఎవరికొరకు క్రీస్తు చనిపోయాడో ఆ సహోదరులకు’ ఆధ్యాత్మికంగా హాని చేస్తుంది. మనం దేవునితో మన సంబంధాన్ని కూడా పోగొట్టుకుంటాం.​—⁠1 కొరింథీయులు 8:4, 11-13; 10:​23, 24.

కాబట్టి మీ మనస్సాక్షికి శిక్షణ ఇవ్వడంలోనూ, మంచి మనస్సాక్షిని కాపాడుకోవడంలోనూ కొనసాగండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని మార్గనిర్దేశం కోసం అడగండి. (యాకోబు 1:⁠5) దేవుని వాక్యాన్ని చదివి, దాని సూత్రాలు మీ మనస్సును, హృదయాన్ని మలచడానికి అనుమతించండి. (సామెతలు 2:​3-5) గంభీరమైన విషయాలు తలెత్తినప్పుడు, తత్సంబంధిత బైబిలు సూత్రాలను మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోవడానికి పరిణతి చెందిన క్రైస్తవులను సంప్రదించండి. (సామెతలు 12:15; రోమీయులు 14:1; గలతీయులు 6:⁠5) మీ నిర్ణయం మీ మనస్సాక్షిని ఎలా ప్రభావితం చేస్తుందో, ఇతరులనెలా ప్రభావితం చేస్తుందో, అన్నిటికంటే ముఖ్యంగా, యెహోవాతో మీ సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో పరిశీలించుకోండి.​—⁠1 తిమోతి 1:​5, 18, 19.

మన మనస్సాక్షి మన ప్రేమగల పరలోక తండ్రియైన యెహోవా దేవుడు ఇచ్చిన అద్భుత వరం. దాన్ని ఇచ్చిన దేవుని చిత్తానికి అనుగుణంగా దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా మనం మన సృష్టికర్తకు సన్నిహితులమవుతాం. మనం చేసేవాటన్నిటిలో ‘నిర్మలమైన మనస్సాక్షి కలిగివుండడం’ ద్వారా మనం దేవుని స్వరూపంలో చేయబడ్డామని స్పష్టంగా చూపిస్తాం.​—⁠1 పేతురు 3:15; కొలొస్సయులు 3:⁠9.

[అధస్సూచి]

^ పేరా 3 ఇక్కడ మనస్సాక్షి అని అనువదించబడిన గ్రీకు పదానికి “అంతర్గతంగా ఉండే నైతికపరమైన యుక్తాయుక్త పరిజ్ఞానం” అనే భావం ఉంది (హెరాల్డ్‌ కె. మౌల్టన్‌ రచించిన ది అనలిటికల్‌ గ్రీక్‌ లెక్సికన్‌ రివైజ్డ్‌); “నైతికంగా ఏది తప్పు ఏది ఒప్పు అనేది గుర్తించడం.”​—⁠జె. హెచ్‌. థెయర్‌ యొక్క గ్రీక్‌-ఇంగ్లీష్‌ లెక్సికన్‌.

[13వ పేజీలోని చిత్రాలు]

మీ మనస్సాక్షికి మిమ్మల్ని కేవలం విమర్శించడానికే కాక మీకు మార్గనిర్దేశం ఇచ్చే విధంగా కూడా శిక్షణ ఇవ్వబడిందా?

[14వ పేజీలోని చిత్రం]

మనం బైబిలు సూత్రాలను తెలుసుకొని వాటిని అన్వయించుకుంటే సుశిక్షిత మనస్సాక్షి లభిస్తుంది

[15వ పేజీలోని చిత్రాలు]

మీ మనస్సాక్షి ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకండి