యేసు ప్రత్యక్షతా సూచనను మీరు గుర్తిస్తున్నారా?
యేసు ప్రత్యక్షతా సూచనను మీరు గుర్తిస్తున్నారా?
తమకు ఏదో పెద్ద జబ్బు చేయాలనో, పెద్ద విపత్తు సంభవించాలనో ఎవరూ ఆశించరు. అలాంటి విపత్తులను తప్పించుకోవడానికి జ్ఞానవంతుడైన వ్యక్తి ప్రమాదాన్ని సూచించే సూచనలను గమనించి తగినవిధంగా చర్య తీసుకుంటాడు. మనం గుర్తించవలసిన ఒక ప్రత్యేక సూచనను యేసుక్రీస్తు వర్ణించాడు. ఆయన ప్రస్తావించిన సూచన భూవ్యాప్తంగా ప్రభావం చూపించి, మానవజాతినంతటినీ ప్రభావితం చేస్తుంది. అది మిమ్మల్నీ మీ కుటుంబాన్నీ ప్రభావితం చేస్తుంది.
దుష్టత్వాన్ని నిర్మూలించి భూమిని పరదైసుగా మార్చే దేవుని రాజ్యం గురించి యేసు మాట్లాడాడు. ఆయన శిష్యులు దీని గురించి ఉత్సుకతతో ఉండి, ఆ రాజ్యం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. వాళ్ళిలా అడిగారు: “నీ రాకడకును [‘ప్రత్యక్షతకును,’ NW] ఈ యుగసమాప్తికిని సూచనలేవి?”—మత్తయి 24:3.
తాను చంపబడి పునరుత్థానం చేయబడిన తర్వాత, మెస్సీయ రాజుగా మానవజాతిపై పరిపాలించడానికి పరలోకంలో తాను సింహాసనాన్ని అధిష్టించేందుకు శతాబ్దాల కాలం పడుతుందని యేసుకు తెలుసు. తాను సింహాసనాన్ని అధిష్టించడం మానవులకు కనిపించదు కాబట్టి, తన అనుచరులు తన “ప్రత్యక్షతను,” అలాగే “యుగసమాప్తిని” గుర్తించడానికి ఆయన ఒక సూచన ఇచ్చాడు. ఈ సూచనలో వివిధ అంశాలు ఇమిడివున్నాయి, అవన్నీ కలిపి ఒక సంయుక్త గుర్తింపు చిహ్నంగా లేదా సంకేతంగా పనిచేస్తాయి, అంటే యేసు ప్రత్యక్షతకు సూచనగా పనిచేస్తాయి.
సువార్త రచయితలు మత్తయి, మార్కు, లూకా యేసు జవాబును జాగ్రత్తగా వ్రాసిపెట్టారు. (మత్తయి, 24, 25 అధ్యాయాలు; మార్కు, 13వ అధ్యాయం; లూకా 21వ అధ్యాయం) ఇతర బైబిలు రచయితలు ఆ సూచనకు మరిన్ని వివరాలను చేర్చారు. (2 తిమోతి 3:1-5; 2 పేతురు 3:3, 4; ప్రకటన 6:1-8; 11:18) ఆ వివరాలన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించడానికి ఇక్కడ స్థలం సరిపోదు, కానీ యేసు ప్రస్తావించిన సూచనలోని ఐదు కీలకాంశాలను మనం పరిశీలిద్దాం. అలా పరిశీలించడం మీకు వ్యక్తిగతంగా అర్థవంతమైనదిగా, ప్రాముఖ్యమైనదిగా ఉన్నట్లు మీరు గ్రహిస్తారు.—6వ పేజీలోని బాక్సు చూడండి.
“ఒక క్రొత్త శకాన్ని ప్రవేశపెట్టిన మార్పు”
“జనముమీదికి జనమును, రాజ్యముమీదికి రాజ్యమును లేచును.” (మత్తయి 24:7) 1914కు ముందు ప్రజలు, “మరింత స్వేచ్ఛ, ప్రగతి, సమృద్ధి ఉండే బంగారు భవిష్యత్తు వస్తుందని నమ్మారు” అని డేర్ స్పీగల్ అనే జర్మన్ వార్తాపత్రిక నివేదిస్తోంది. ఆ తర్వాత అంతా మారిపోయింది. “1914 ఆగస్టులో ప్రారంభమై 1918 నవంబరులో ముగిసిన యుద్ధం నాటకీయమైన ఘటన. అది పాత నుండి క్రొత్తను వేరుచేస్తూ మానవజాతి చరిత్రలో ఒక హఠాత్ మార్పును తీసుకువచ్చింది” అని గెయో అనే పత్రిక పేర్కొన్నది. ఐదు ఖండాలకు చెందిన ఆరు కోట్లకంటే ఎక్కువమంది సైనికులు ఆ క్రూరమైన పోరాటంలో పాల్గొన్నారు. సగటున ప్రతీరోజు దాదాపు 6,000 మంది సైనికులు చంపబడ్డారు. అప్పటినుండి ప్రతీ తరంలోని చరిత్రకారులు, అన్ని రకాల రాజకీయ నమ్మకాలుగల చరిత్రకారులు “1914 నుండి 1918 వరకున్న సంవత్సరాలను ఒక క్రొత్త శకాన్ని ప్రవేశపెట్టిన మార్పుగా” దృష్టించారు.
మొదటి ప్రపంచ యుద్ధం మానవ సమాజంపై తిరిగి సరిచేయలేని మార్పులను రుద్ది మానవజాతిని ఈ విధానపు అంత్యదినాల్లోకి నెట్టేసింది. ఆ శతాబ్దంలోని మిగతా కాలం యుద్ధాలతో, సాయుధ పోరాటాలతో, తీవ్రవాదంతో నిండిపోయింది. ఈ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో పరిస్థితులు మంచిగా ఏమీ మారలేదు. యుద్ధాలే గాక సూచనలోని ఇతర అంశాలు కూడా కనిపిస్తున్నాయి.
కరవులు, తెగుళ్ళు, భూకంపాలు
“అక్కడక్కడ కరవులు . . . కలుగును.” (మత్తయి 24:8) మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో యూరప్‌లో ఆకలి రాజ్యమేలింది, అప్పటినుండి కరవు మానవజాతిని పట్టిపీడిస్తోంది. రష్యా యుక్రెయిన్లలో 1933లో, “ఆకలితో అలమటిస్తున్న పెద్ద గుంపులు వీధుల్లో తిరిగాయి . . . రోడ్డుకు ఇరుప్రక్కల శవాలు గుట్టలుగా పేరుకుపోయాయి” అని చరిత్రకారుడైన అలెన్ బులక్ వ్రాశాడు. టి. హెచ్. వైట్ అనే విలేఖరి, 1943లో చైనాలోని హైనాన్‌లో ఏర్పడిన కరవును ప్రత్యక్షంగా చూశాడు. ఆయనిలా వ్రాశాడు: “కరవు సమయంలో దాదాపు ఏదైనా తినదగినదే అవుతుంది, మానవ శరీరం దేన్నైనా పిండిచేసుకుని, తినేసి, దాన్ని శక్తిగా మార్చుకోగలదు. అయితే ఒక వ్యక్తికి మరణభయం ఉంటే అప్పటివరకు తినకూడనిదిగా పరిగణింపబడుతున్నదాన్ని కూడా తినాలనుకుంటాడు.” విచారకరంగా, ఇటీవలి దశాబ్దాల్లో ఆఫ్రికాలో కరవు దాదాపు సర్వసాధారణ విషయమైపోయింది. అందరికీ సరిపోయేంత ఆహారాన్ని భూమి ఉత్పత్తి చేస్తున్నా, ప్రపంచవ్యాప్తంగా 84 కోట్లమందికి తినడానికి సరిపోయేంత ఆహారం లేదని ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ అంచనా వేసింది.
‘అక్కడక్కడ తెగుళ్లు తటస్థించును.’ (లూకా 21:11) “1918లో స్పానిష్ ఇన్ఫ్లూయెన్జా రెండు కోట్ల నుండి ఐదు కోట్ల మందిని చంపినట్లు అంచనా వేయబడింది, ఈ సంఖ్య ప్లేగువ్యాధి లేదా మొదటి ప్రపంచ యుద్ధం మూలంగా మరణించినవారి సంఖ్య కంటే ఎక్కువ” అని స్యూట్‌డోయిష్ సైటుంగ్ నివేదిస్తోంది. అప్పటినుండి లెక్కలేనంత మంది మలేరియా, మశూచి, క్షయ, పోలియో, కలరా వంటి వ్యాధుల బారినపడ్డారు. అడ్డూ అదుపూ లేకుండా వ్యాపిస్తున్న ఎయిడ్స్‌ను చూసి లోకం విభ్రాంతి చెందుతోంది. ఇప్పుడు మనం ఎలాంటి కలవరపరిచే స్థితిలో ఉన్నామంటే, ఒకవైపు వైద్యరంగం అద్భుతరీతిలో పురోగతి సాధిస్తున్నా చికిత్సకు తగ్గని వ్యాధులు అలాగే ఉండిపోతున్నాయి. మానవజాతికి ఇంతవరకు తెలియని ఈ పరస్పర విరుద్ధ పరిస్థితి, మనం అసాధారణ కాలాల్లో జీవిస్తున్నామని గుర్తించడానికి సహాయం చేస్తుంది.
మత్తయి 24:8) గత వంద సంవత్సరాల్లో, భూకంపాలు లక్షలాదిమంది ప్రాణాలను బలిగొన్నాయి. ఒక పుస్తకం ప్రకారం, భవనాలను కూల్చేసి నేలను చీల్చేసే శక్తిగల భూకంపాలు 1914 నుండి సగటున సంవత్సరానికి 18 చొప్పున సంభవించాయి. భవనాలను నేలమట్టం చేసేంత శక్తిగల ప్రాణాంతక భూకంపాలు దాదాపు సంవత్సరానికి ఒకటి చొప్పున సంభవించాయి. సాంకేతికాభివృద్ధి జరుగుతున్నా మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది, ఎందుకంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు భూకంపం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి.
“భూకంపములు.” (సంతోషకరమైన వార్త!
అంత్యదినాలకు సంబంధించిన సూచనలోని అనేక అంశాలు దుఃఖకరమైనవే. కానీ యేసు ఒక సంతోషకరమైన వార్త గురించి కూడా చెప్పాడు.
“ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును.” (మత్తయి 24:14) యేసు తానే స్వయంగా ప్రారంభించిన పని, అంటే రాజ్య సువార్త ప్రకటించే పని అంత్యదినాల్లో చరమాంకాన్ని చేరుతుంది. నిజంగా అలాగే జరుగుతోంది. యెహోవాసాక్షులు బైబిలు సందేశాన్ని ప్రకటిస్తూ, తెలుసుకోవాలని ఇష్టపడే ప్రజలకు తాము నేర్చుకున్నది అనుదిన జీవితంలో ఎలా అన్వయించుకోవాలో బోధిస్తున్నారు. ప్రస్తుతం 60 లక్షలకంటే ఎక్కువమంది సాక్షులు 400 కంటే ఎక్కువ భాషల్లో, 235 దేశాల్లో ప్రకటిస్తున్నారు.
వేదనభరితమైన ప్రపంచ పరిస్థితుల మూలంగా జీవితం ఆగిపోతుందని యేసు చెప్పలేదని కూడా గమనించండి. ప్రపంచమంతా సూచనలోని కేవలం ఒక్క అంశంతోనే ఉక్కిరిబిక్కిరి అవుతుందని కూడా ఆయన చెప్పలేదు. అయితే, భూమ్మీద ఎక్కడనుండి చూసినా గుర్తించదగిన సూచనగా రూపొందే అనేక సంఘటనల గురించి మాత్రం ఆయన చెప్పాడు.
మీరు ఒక్కో సంఘటనను చూడకుండా లేదా సంఘటనలను విడివిడిగా చూడకుండా, ఒక నమూనాను, భూగోళవ్యాప్త ప్రాముఖ్యతగల సంయుక్త సూచనను గ్రహించగలుగుతున్నారు. భూమ్మీద జరుగుతున్న సంఘటనలు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయి. మరి ఈ సూచనను చాలా తక్కువమంది ప్రజలే ఎందుకు గ్రహిస్తున్నారనే ప్రశ్న తలెత్తవచ్చు.
మన ప్రయోజనాలు ప్రథమస్థానం వహిస్తాయి
“ఇక్కడ ఈతకొట్ట కూడదు,” “హై వోల్టేజీ,” “వేగం తగ్గించండి” వంటి కొన్ని సూచనలను, హెచ్చరికలను మనం చూస్తుంటాం, కానీ అవి తరచూ అలక్ష్యం చేయబడతాయి. ప్రజలు వీటిని ఎందుకు పట్టించుకోరు? మనకేది మంచిదని మనం పరిగణిస్తామో దానితో మనం సులభంగా తప్పుదారి పడతాం. ఉదాహరణకు, చట్టం అనుమతించే దానికంటే ఎక్కువ వేగంగా డ్రైవ్ చేయవలసిన అవసరం ఉందని మనం భావించవచ్చు, లేదా ఈత కొట్టడం నిషేధించబడిన స్థలంలో ఈతకొట్టాలని మనకు బలమైన కోరిక కలగవచ్చు. కానీ సూచనలను అలక్ష్యం చేయడం అవివేకమే అవుతుంది.
ఉదాహరణకు ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇటలీ, స్విట్జర్లాండ్లలో ఉన్న ఆల్ప్స్ పర్వతాలపై సంభవించే హిమానిపాతాలు, సురక్షితమైన మార్గాల్లో మాత్రమే స్కీయింగ్ చేయమని ప్రోత్సహించే హెచ్చరికలను అలక్ష్యం చేసే పర్యాటకుల ప్రాణాలను కొన్నిసార్లు బలిగొంటున్నాయి. స్యూట్‌డోయిష్ సైటుంగ్ ప్రకారం, అలాంటి హెచ్చరికలను అలక్ష్యం చేసే చాలామంది పర్యాటకులు సాహసం చేయనిదే సంతోషం పొందలేం అనే సూత్రం ప్రకారం జీవిస్తారు. దుఃఖకరంగా, హెచ్చరికలను అలక్ష్యం చేయడంవల్ల విషాదకరమైన ఫలితాలు వస్తాయి.
యేసు వర్ణించిన సూచనను నిర్లక్ష్యం చేయడానికి ప్రజలకు ఏ కారణాలున్నాయి? అత్యాశతో వారు అంధులై ఉండవచ్చు, ఉదాసీనతవల్ల మొద్దుబారిపోయి ఉండవచ్చు, గట్టి నిర్ణయం తీసుకోలేక వారు అశక్తులై ఉండవచ్చు, అనుదిన కార్యకలాపాల్లో తలమునకలవుతూ ఉండవచ్చు, పరువు పోతుందనే భయం వారిని అలుముకొని ఉండవచ్చు. వీటిలో ఏవైనా, యేసు ప్రత్యక్షతకు సంబంధించిన సూచనను మీరు అలక్ష్యం చేసేలా చేస్తున్నాయా? సూచనను గుర్తించి తగినవిధంగా చర్య తీసుకోవడం జ్ఞానయుక్తంగా ఉండదా?
పరదైసు భూమ్మీద జీవితం
యేసు ప్రత్యక్షతకు సంబంధించిన సూచనను అంతకంతకూ చాలామంది లక్ష్యపెడుతున్నారు. జర్మనీకి చెందిన క్రిస్టియెన్ అనే వివాహిత యువకుడు ఇలా వ్రాస్తున్నాడు: “ఇవి నిరాశాపూరిత కాలాలు. మనం నిస్సందేహంగా ‘అంత్యదినాల్లో’ జీవిస్తున్నాం.” ఆయనా ఆయన భార్యా, మెస్సీయ రాజ్యం గురించి ఇతరులతో మాట్లాడడంలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఫ్రాంక్ కూడా అదే దేశంలో నివసిస్తున్నాడు. ఆయనా ఆయన భార్యా, బైబిల్లోని సువార్తతో ఇతరులను ప్రోత్సహిస్తున్నారు. “ప్రపంచంలోని పరిస్థితి మూలంగా, చాలామంది నేడు భవిష్యత్తు గురించి చింతిస్తున్నారు. పరదైసు భూమిని గురించిన బైబిలు ప్రవచనాలతో మేము వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాం” అని ఫ్రాంక్ చెబుతున్నాడు. ఆ విధంగా క్రిస్టియెన్, ఫ్రాంక్ యేసు చెప్పిన సూచనలోని ఒక అంశం, అంటే రాజ్య సువార్త ప్రకటించబడడమనే అంశం నెరవేరడానికి సహాయం చేస్తున్నారు.—మత్తయి 24:14.
అంత్యదినాలు చరమాంకాన్ని చేరుకుంటుండగా, యేసు ఈ పాత విధానాన్ని, దాన్ని సమర్థించే ప్రజలను నిర్మూలిస్తాడు. అప్పుడు మెస్సీయ రాజ్యం భూ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది, అప్పుడు భూమి ముందే తెలియజేయబడిన పరదైసు పరిస్థితిలోకి తీసుకురాబడుతుంది. మానవజాతి పాపమరణాల నుండి విముక్తి చేయబడుతుంది, మృతులు భూమిపై జీవించడానికి పునరుత్థానం చేయబడతారు. ఇవి, కాలాల సూచనలను గుర్తించే వారి కోసం వేచివున్న సంతోషకరమైన ఉత్తరాపేక్షలు. సూచన గురించి, ఈ విధానాంతాన్ని తప్పించుకోవడానికి ఏమి చేయాలనేదాని గురించి మరింతగా తెలుసుకోవడం జ్ఞానయుక్తమైన చర్య కాదా? నిజంగా ఇది ప్రతి ఒక్కరూ అత్యవసరంగా తీసుకోవలసిన చర్య.—యోహాను 17:3.
[4వ పేజీలోని బ్లర్బ్]
భూమ్మీద ఎక్కడనుండి చూసినా గుర్తించదగిన సూచనగా రూపొందే అనేక సంఘటనల గురించి యేసు ముందే తెలియజేశాడు
[6వ పేజీలోని బ్లర్బ్]
మీరు ఒక నమూనాను, భూవ్యాప్త ప్రాముఖ్యతగల సంయుక్త సూచనను చూడగలుగుతున్నారా?
[6వ పేజీలోని బాక్సు/చిత్రాలు]
అంత్యదినాల గుర్తింపు చిహ్నాలు
మునుపెన్నడూ లేనంతగా యుద్ధాలు.—మత్తయి 24:7; ప్రకటన 6:4
కరవు.—మత్తయి 24:8; ప్రకటన 6:5, 6, 8
తెగుళ్లు.—లూకా 21:11; ప్రకటన 6:8
విస్తరిస్తున్న అక్రమము.—మత్తయి 24:12
భూకంపాలు.—మత్తయి 24:8
అపాయకరమైన కాలములు.—2 తిమోతి 3:1
ధనం మీద మితిమీరిన కాంక్ష.—2 తిమోతి 3:2
తలిదండ్రులకు అవిధేయత.—2 తిమోతి 3:2
అనురాగరాహిత్యం.—2 తిమోతి 3:3
దేవునికంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించడం.—2 తిమోతి 3:4
అజితేంద్రియత.—2 తిమోతి 3:3
సజ్జనద్వేషులు.—2 తిమోతి 3:3
రానున్న ప్రమాదాన్ని ఏ మాత్రం లక్ష్యపెట్టకపోవడం.—మత్తయి 24:39
అపహాసకులు అంత్యదినాల గురించిన రుజువులను నిరాకరించడం.—2 పేతురు 3:3, 4
భూవ్యాప్తంగా జరిగే దేవుని రాజ్య ప్రకటన.—మత్తయి 24:14
[5వ పేజీలోని చిత్రసౌజన్యం]
WWI సైనికులు: The World War—A Pictorial History, 1919 అనే పుస్తకం నుండి; పేద కుటుంబం: AP Photo/Aijaz Rahi; పోలియో బాధితుడు: © WHO/P. Virot