కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు”

“ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు”

“ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు”

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని మాసాచూసెట్స్‌లో ఉన్న గ్లౌసెస్టర్‌లో ఓడరేవుకు ఎదురుగా, తుఫానులో తన ఓడను నడిపేందుకు ప్రయత్నిస్తున్న ఒక సరంగు కంచు విగ్రహం ఉంది. ఆ విగ్రహం గ్లౌసెస్టర్‌లోని వేలాదిమంది మత్స్యకారులు సముద్రంలో చనిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ విగ్రహం అడుగు భాగంలోను, దగ్గరలో ఉన్న మరో ఫలకంమీదను కీర్తన 107:23, 24లోని ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి: “ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు మహాజలములమీద సంచరించుచు వ్యాపారము చేయువారు, యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి.”

అట్లాంటిక్‌ సముద్రంలో అధికంగా చేపలు లభించే ప్రాంతంలో చేపలు పట్టడం ప్రమాదంతో కూడుకున్న పని. ఇప్పుడు సుమారు 30,000జనాభావున్న గ్లౌసెస్టర్‌లో గడచిన సంవత్సరాల్లో 5,368కన్నా ఎక్కువమంది సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ స్మారక ఫలకం ఇలా చెబుతోంది: “కొంతమంది నాశనకరమైన ఈశాన్యపు భయంకరమైన గాలుల ద్వారా, భీకరమైన అలల ద్వారా సముద్రంలో మునిగిపోయారు. వాళ్ళను చేపలుపట్టే ప్రాంతానికి తీసుకెళ్లిన ఓడనుండి విడిపోయి దూరంగా కొట్టుకుపోయిన చిన్న పడవల్లో మరికొందరు చనిపోయారు. తుఫానులో చిక్కుకున్న కొన్ని ఓడలు ఒకదానికొకటి ఢీకొని విషాదకరంగా మునిగిపోయాయి. మరికొన్ని ఓడలు, మార్గమధ్యంలో స్టీమర్లకు గుద్దుకొని మునిగిపోయాయి.”

చాలా శతాబ్దాలుగా మత్స్యకారులు ఎదుర్కొన్న కష్టాలకు, ప్రమాదాలకు, ఆ స్మారక చిహ్నం విషాదకరమైన నిదర్శనంగా ఉంది. తమ భర్తలను, తండ్రులను, సహోదరులను, కుమారులను కోల్పోయినవారికి మిగిలిన నిరాశాపూరిత కన్నీళ్ళను ఊహించండి. అయినప్పటికీ, యెహోవా దేవుడు విధవరాండ్రను, అనాధలను, లేదా సముద్రంలో తమ ప్రాణాలను కోల్పోయినవారిని మరచిపోడు. అపొస్తలుడైన యోహాను భవిష్యత్తులో జరిగే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు: “సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను.” (ప్రకటన 20:​13) నిజానికి ‘ఓడలెక్కి సముద్రప్రయాణము చేయడానికి’ వెళ్లినవారు తమ పునరుత్థాన సమయంలో అద్భుతమైన “యెహోవా కార్యములను” చూస్తారు.