కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“గరుడపక్షి దేశం”లో యెహోవా వాక్యం విస్తరిస్తోంది

“గరుడపక్షి దేశం”లో యెహోవా వాక్యం విస్తరిస్తోంది

“గరుడపక్షి దేశం”లో యెహోవా వాక్యం విస్తరిస్తోంది

“గరుడపక్షి దేశం.” అల్బేనియన్లు తమ దేశాన్ని తమ భాషలో అలా పిలుస్తారు. ఆ దేశం బాల్కన్‌ ద్వీపకల్పంలో ఏడ్రియాటిక్‌ సముద్రం వైపున గ్రీసు, మునుపటి యుగోస్లావియా దేశాల మధ్య నెలకొని ఉంది. అల్బేనియన్ల పూర్వీకుల గురించి అనేక వాదనలు ఉన్నా, అల్బేనియన్లు, వారు మాట్లాడే భాష, ప్రాచీన ఇల్లూరియన్ల నుండి వచ్చిందని చాలామంది చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం ఆ ఇల్లూరియన్ల సంస్కృతి సా.శ.పూ. 2000కి చెందింది.

అల్బేనియా ప్రకృతి అందాల్లో సుదూరంగా ఉత్తరాన ఉన్న మొనదేలిన పర్వతాలు, దక్షిణాన ఏడ్రియాటిక్‌ సముద్రం దగ్గర ఉన్న తెల్లని ఇసుకతెన్నెలుగల పొడవైన సముద్రతీరాలు ఉన్నాయి. అయితే అతిగొప్ప అందం ఆ దేశ ప్రజల్లో కనిపిస్తుంది. వారు ఆప్యాయతగలవారు, ఆతిథ్యమిచ్చే గుణంగలవారు, చురుకైనవారు, తమ భావాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు, ఉత్సాహవంతమైన అభినయాలతో తమ అభిప్రాయాలను భావోద్వేగాలతో వ్యక్తం చేస్తారు, వారు విషయాన్ని త్వరగా ఆకళింపు చేసుకుంటారు.

ప్రఖ్యాత మిషనరీ సందర్శించడం

వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, రమణీయమైన ప్రకృతి అందాలు, కొన్ని శతాబ్దాల క్రితం ప్రయాణించిన ఒక ప్రత్యేక యాత్రికుని దృష్టిని ఖచ్చితంగా ఆకర్షించి ఉంటాయి. ఎన్నో ప్రయాణాలు చేసిన అపొస్తలుడైన పౌలు దాదాపు సా.శ. 56లో ఇలా వ్రాశాడు: “ఇల్లూరికు ప్రాంతమువరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను.” (రోమీయులు 15:​18) ఆ కాలంనాటి ఇల్లూరికు దక్షిణ భాగం నేటి మధ్య, ఉత్తర అల్బేనియా. పౌలు ఇల్లూరికుకు దక్షిణాన ఉన్న గ్రీసులోని కొరింథు నుండి వ్రాశాడు. తాను “ఇల్లూరికు ప్రాంతమువరకు” సమగ్రంగా ప్రకటించాను అని చెప్పడం ద్వారా తాను ఆ ప్రాంత సరిహద్దు వరకు లేక వాస్తవంగా ఆ ప్రాంతంలోకి వెళ్ళానని ఆయన సూచిస్తున్నాడు. రెండింటిలో ఏది నిజమైనా ఆయన నేటి దక్షిణ అల్బేనియాలో ప్రకటించి ఉండవచ్చు. కాబట్టి అల్బేనియాలో జరిగిన తొలి రాజ్య ప్రకటనా పనిని పౌలు చేశాడు అని చెప్పవచ్చు.

శతాబ్దాలు గడిచాయి. సామ్రాజ్యాలు ఉద్భవించాయి, కూలాయి. 1912లో అల్బేనియా స్వతంత్ర్య రాజ్యం అయ్యేంతవరకు యూరప్‌లోని ఆ చిన్న ప్రాంతాన్ని వివిధ విదేశీ శక్తులు పరిపాలించాయి. ఒక దశాబ్దం గడిచిన తర్వాత అల్బేనియాలో యెహోవా రాజ్యం గురించి మళ్ళీ ప్రకటించబడింది.

ఉత్తేజవంతమైన ఆధునిక ప్రారంభం

అంతర్జాతీయ బైబిలు విద్యార్థులు అని అప్పట్లో పిలువబడిన యెహోవాసాక్షులతో సహవసించిన, అమెరికాకు వెళ్ళిన కొంతమంది అల్బేనియా వలసదారులు, తాము నేర్చుకున్నది ఇతరులతో పంచుకోవడానికి 1920లలో అల్బేనియాకు తిరిగివచ్చారు. అలా వచ్చినవారిలో నాషో ఇడ్రిజీ ఉన్నారు. ప్రకటనా పనికి కొంతమంది అనుకూలంగా ప్రతిస్పందించారు. పెరిగిన ఆసక్తిపట్ల శ్రద్ధ వహించడానికి 1924లో అల్బేనియాలోని ప్రకటనా పనిని పర్యవేక్షించే బాధ్యత రుమేనియా కార్యాలయానికి అప్పగించబడింది.

ఆ సంవత్సరాల్లో అల్బేనియాలో యెహోవా గురించి తెలుసుకున్నవారిలో థానాస్‌ డ్యూలి (అథాన్‌ డౌలిస్‌) ఉన్నారు. ఆయన ఇలా గుర్తుచేసుకున్నాడు: “1925లో అల్బేనియాలో సంస్థీకరించబడిన మూడు సంఘాలు ఉండడమే కాక దేశమంతటిలో వివిధ ప్రాంతాల్లో అక్కడక్కడ బైబిలు విద్యార్థులు, ఆసక్తిగల వ్యక్తులు కూడా ఉన్నారు. వారి మధ్య ఉన్న ప్రేమ వారి చుట్టూ ఉన్న ప్రజలకు. . . . ఎంతో భిన్నంగా ఉంది!” *

సరైన రోడ్లు లేని కారణంగా ప్రయాణం చాలా కష్టంగా ఉండేది. అయినా ఉత్సాహవంతులైన ప్రచారకులు ఆ సవాలును స్వీకరించారు. ఉదాహరణకు, దక్షిణ తీరాన ఉన్న వ్లోరేలో, 1928లో అరెటీ పినా, తన 18వ ఏట బాప్తిస్మం తీసుకుంది. ఆమె బైబిలు చేతపట్టుకొని ఎత్తుపల్లాలుగల కొండలను ఎక్కుతూ దిగుతూ ప్రకటించేది. ఆమె 1930ల తొలిభాగంలో వ్లోరేలో ఉన్న ఉత్సాహవంతమైన సంఘంలో ప్రచారకురాలిగా ఉంది.

1930కల్లా అల్బేనియాలోని ప్రకటనా పనిని గ్రీసులోని ఏథెన్సులో ఉన్న బ్రాంచి కార్యాలయం నిర్దేశిస్తోంది. 1932లో సహోదరులను ప్రోత్సహించి బలపరచడానికి గ్రీసు నుండి ఒక ప్రయాణ పైవిచారణకర్త అల్బేనియాను సందర్శించాడు. ఆ కాలంలో బైబిలు సత్యాన్ని తెలుసుకుంటున్న చాలామందికి పరలోక నిరీక్షణ ఉంది. పరిశుభ్రమైన, నిజాయితీపరులైన ప్రజలుగా వారికున్న పేరు అన్నిచోట్లా వారికి ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆ నమ్మకమైన సహోదరుల పని ఎన్నో ఫలాలను ఫలించింది. 1935, 1936 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరంలో అల్బేనియాలో దాదాపు 6,500 బైబిలు సాహిత్యాలు అందించబడ్డాయి.

ఒకరోజు వ్లోరే పట్టణం మధ్యలో నాషో ఇడ్రిజీ, జె. ఎఫ్‌. రూథర్‌ఫర్డ్‌ ఇచ్చిన ప్రసంగాల్లో ఒకదానిని గ్రామ్‌ఫోన్‌ రికార్డు ద్వారా వినిపించారు. సహోదరుడు ఇడ్రిజీ ఆ ప్రసంగాన్ని అల్బేనియన్‌లోకి అనువదిస్తున్నప్పుడు ప్రజలు తమ దుకాణాలను మూసివేసి ఆయన చెబుతున్నది వినడానికి వచ్చారు. అలుపెరుగని ఆ తొలి బైబిలు బోధకుల ఉత్సాహం ఆశీర్వదించబడింది. 1940కల్లా అల్బేనియాలో 50 మంది సాక్షులు తయారయ్యారు.

ఒక నాస్తిక దేశం

1939లో ఇటలీకి చెందిన ఫాసిస్టులు దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. యెహోవాసాక్షుల చట్టబద్ధ గుర్తింపు రద్దు చేయబడి వారి ప్రకటనా పని నిషేధించబడింది. కొంతకాలం తర్వాత జర్మనీ దళాలు దేశాన్ని ఆక్రమించాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అన్వర్‌ హోజా అనే జనాకర్షక మిలటరీ నాయకుడు బయల్దేరాడు. అతని కమ్యూనిస్టు పార్టీ 1946 ఎన్నికల్లో గెలిచింది, అతడు ప్రధానమంత్రి అయ్యాడు. ఆ తర్వాతి సంవత్సరాలు విడుదల కాలంగా పిలవబడ్డాయి, అయితే యెహోవా ప్రజలకు అది విడుదల కాలంగా లేదు కానీ అణచివేత కాలంగా మారింది.

ప్రభుత్వానికి మతంపట్ల క్రమంగా సహనం తగ్గుతూ పోయింది. అల్బేనియాలోని యెహోవాసాక్షులు తమ క్రైస్తవ తటస్థతకు అనుగుణంగా ఆయుధాలను చేపట్టడానికి, రాజకీయాల్లో పాల్గొనడానికి నిరాకరించారు. (యెషయా 2:2-4; యోహాను 15:​17-19) చాలామంది కారాగారాల పాలయ్యారు, ఆహారం లేక జీవితపు కనీస అవసరాలు లభించని పరిస్థితికి గురయ్యారు. అనేక సందర్భాల్లో, కారాగారాల బయట ఉన్న ఆధ్యాత్మిక సహోదరీలు వారి బట్టలు ఉతికారు, వారికి వంట చేసి పెట్టారు.

హింస ఎదురైనా ధైర్యంగా ఉన్నారు

1940ల తొలిభాగంలో, ఫ్రోసీనా జకా కౌమారప్రాయంలో ఉంది, పెర్మెట్‌ జిల్లా దగ్గర్లో ఉన్న పల్లెలో ఆమె నివసించేది, బూట్లు తయారుచేసే నాషొ దొరి * అనే సాక్షి నుండి తన అన్నయ్యలు నేర్చుకుంటున్నవాటి గురించి ఆమె విన్నది. అప్పట్లో అధికారులు యెహోవాసాక్షులతో కఠినంగా వ్యవహరిస్తున్నారు, అయితే తన తల్లిదండ్రులకు కోపం కలిగించే విధంగా ఫ్రోసినా విశ్వాసం బలపడింది. “నేను క్రైస్తవ కూటాలకు వెళ్తే వారు నా బూట్లను దాచేవారు, నన్ను కొట్టేవారు. నేను ఒక అవిశ్వాసిని వివాహం చేసుకొనేలా ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నించారు. నేను దానికి తిరస్కరించినప్పుడు వారు నన్ను ఇంటి నుండి బయటికి గెంటివేశారు. ఆ రోజు మంచు కురుస్తోంది. నాకు సహాయం చేయమని నాషొ దొరి, గ్జీరోకాస్టర్‌లో నివసిస్తున్న సహోదరుడు గోలే ఫ్లోకోను కోరాడు. నేను ఆయన కుటుంబంతో నివసించడానికి వారు ఏర్పాట్లు చేశారు. నా సహోదరులు తమ తటస్థ వైఖరి కారణంగా రెండు సంవత్సరాలు కారాగారంలో గడిపారు. వారు విడుదలైన తర్వాత వారితో నివసించడానికి నేను వ్లోరేకి వెళ్ళాను.

“నేను రాజకీయ కార్యకలాపాల్లో భాగం వహించేలా నన్ను బలవంతం చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. నేను దానికి తిరస్కరించాను. వాళ్ళు నన్ను అరెస్టు చేసి ఒక గదికి తీసుకువెళ్ళి నన్ను చుట్టుముట్టారు. వారిలో ఒకరు నన్ను ఇలా బెదిరించారు: ‘మేము నిన్ను ఏమి చేయగలమో నీకు తెలుసా?’ నేను ఇలా అన్నాను: ‘యెహోవా మిమ్మల్ని అనుమతించిన దానిని మాత్రమే మీరు చేయగలరు.’ దానికి ఆయన ఇలా అన్నాడు: ‘నీకు పిచ్చిపట్టినట్లుంది! ఇక్కడి నుండి ఫో!’”

ఆ సంవత్సరాలన్నిటిలో అలాంటి యథార్థ వైఖరి, అల్బేనియా సహోదరుల గుర్తింపు చిహ్నంగా నిలిచింది. 1957 నాటికి రాజ్య ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్య 75కి చేరుకుంది. 1960ల తొలిభాగంలో, యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయం, క్రైస్తవ పనిని వ్యవస్థీకరించడంలో సహాయం చేయడానికి, అమెరికాకు వలసవెళ్ళిన అల్బేనియా దేశస్థుడు జాన్‌ మార్క్స్‌, టిరానా పట్టణాన్ని సందర్శించేందుకు ఏర్పాటు చేసింది. * అయితే కొంతకాలంలోనే లుచి గ్సెకా, మిహాల్‌ స్వేజీ, లవోనేథా పోపా, బాధ్యతగల మరితర సహోదరులు లేబర్‌ క్యాంపులకు పంపించబడ్డారు.

కష్ట పరిస్థితి నుండి ఉపశమనం కలుగుతుందనే నమ్మకం

అల్బేనియాలో 1967 వరకు మతాలన్నీ ఆమోదించబడలేదు. ఆ తర్వాత వాటిపట్ల ఇక ఏ మాత్రం సహనం చూపించబడలేదు. క్యాథలిక్‌, ఆర్థడాక్స్‌ ఫాదిరులు లేక ముస్లిం మతగురువులు మతకర్మలు నిర్వహించకూడదు. చర్చీలు, మసీదులు మూసివేయబడ్డాయి లేక అవి వ్యాయామశాలలుగా, పురావస్తు ప్రదర్శనశాలలుగా లేక బజార్లుగా మార్చివేయబడ్డాయి. ఎవరి దగ్గరా బైబిలు ఉండకూడదు. ఎవరూ తమకు దేవునిమీద నమ్మకం ఉన్నట్లు వ్యక్తం చేయకూడదు.

ప్రకటించడం, కూటాలకు సమకూడడం దాదాపు అసాధ్యమైంది. సాక్షులు ఒకరి నుండి మరొకరు వేరైనా యెహోవాకు సేవచేయడానికి తమకు సాధ్యమైనంతమట్టుకు కృషి చేశారు. 1960ల నుండి 1980ల వరకు సాక్షుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయినా వారు ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నారు.

1980ల చివరి భాగంలో అల్బేనియాలో రాజకీయ మార్పులు మెల్లగా సంభవించడం మొదలుపెట్టాయి. ఆహారం, వస్త్రాల కొరత ఏర్పడింది. ప్రజలు సంతోషంగా లేరు. తూర్పు యూరప్‌లో వ్యాపించిన సంస్కరణలు 1990ల తొలిభాగంలో అల్బేనియాను కూడా ప్రభావితం చేశాయి. ఆ దేశంలో 45 సంవత్సరాల నిరంకుశ పరిపాలన తర్వాత ఒక క్రొత్త ప్రభుత్వం మళ్ళీ మత స్వాతంత్ర్యాన్ని అనుమతించింది.

యెహోవాసాక్షుల పరిపాలక సభ నిర్దేశంలో ఆస్ట్రియా, గ్రీసులలోని బ్రాంచి కార్యాలయాలు స్థానిక అల్బేనియన్‌ సహోదరులను వెంటనే సంప్రదించడం మొదలుపెట్టాయి. అల్బేనియన్‌ తెలిసిన గ్రీకు సహోదరులు క్రొత్తగా అనువదించబడిన బైబిలు సాహిత్యాన్ని టిరానా, బరాట్‌ పట్టణాలకు తీసుకువచ్చారు. ఇంతకుముందు చెల్లాచెదురైన స్థానిక సహోదరులు, చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారిగా విదేశాల నుండి వచ్చిన సహోదరులను కలుసుకున్నప్పుడు వారి హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి.

ఉత్సాహవంతులైన విదేశీ పయినీర్లు పనిలో సారథ్యం వహిస్తున్నారు

పరిపాలక సభ, 1992వ సంవత్సరపు తొలిభాగంలో అల్బేనియన్‌ నేపథ్యంవున్న మైకల్‌, లిన్డా డిగ్రెగోర్యో అనే మిషనరీ దంపతులను అల్బేనియాకు పంపించడానికి ఏర్పాటు చేసింది. వారు వృద్ధులైన నమ్మకమైనవారిని సంప్రదించి, వారు అంతర్జాతీయ ఆధ్యాత్మిక కుటుంబంలో మళ్ళీ భాగమయ్యేలా సమకూడడానికి సహాయం చేశారు. నవంబరులో, నలుగురు గ్రీకు పయినీర్లతోపాటు, కష్టపడి పనిచేసే ఇటలీకి చెందిన 16 మంది ప్రత్యేక పయినీర్ల గుంపు లేక పూర్తికాల సేవకుల గుంపు వచ్చింది. వారు స్థానిక భాషను నేర్చుకొనేందుకు సహాయం చేయడానికి ఒక భాషా కోర్సు ఏర్పాటు చేయబడింది.

ఆ విదేశీ పయినీర్లకు దైనందిన జీవితం కష్టమైంది. విద్యుత్తు సరఫరా క్రమంగా ఉండేది కాదు. శీతాకాలంలో వాతావరణం చలిగా, తేమగా ఉండేది. ప్రజలు ఆహారం, జీవితపు ఇతర అవసరాలు సంపాదించుకోవడానికి గంటలకొద్దీ క్యూలో నిల్చొనేవారు. అయితే సహోదరులకు ఎదురైన అతి పెద్ద సమస్య, సత్యానికి పెద్ద సంఖ్యలో ప్రతిస్పందిస్తున్న ఆసక్తిగలవారికి సరిపడే భవనాలను ఎలా కనుగొనడం అనేదే!

కోరుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఒక భాషను పరిపూర్ణంగా మాట్లాడడమే మార్గం కాదని అల్బేనియన్‌ భాష మాట్లాడడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న పయినీర్లు గ్రహించారు. అనుభవజ్ఞుడైన బైబిలు బోధకుడు వారికి ఇలా చెప్పాడు: “స్నేహపూర్వకంగా చిరునవ్వు చిందించడానికి లేక మన సహోదరులను ఆలింగనం చేసుకోవడానికి మనం వ్యాకరణరీత్యా ఏ తప్పులూ లేకుండా మాట్లాడవలసిన అవసరం లేదు. అల్బేనియన్లు మీ హృదయం నుండి వచ్చే ప్రేమకు ప్రతిస్పందిస్తారే గానీ పరిపూర్ణ వ్యాకరణానికి కాదు. మీరు చింతించకండి, వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.”

మొదటి భాషా కోర్సు పూర్తైన తర్వాత పయినీర్లు బరాట్‌, డ్యూరస్‌, గ్జీరోకాస్టర్‌, స్కోడర్‌, టిరానా, వ్లోరే పట్టణాలలో పని ప్రారంభించారు. కొంతకాలంలోనే ఆ పట్టణాలలో సంఘాలు వేగంగా ఏర్పడ్డాయి. తన 80వ పడిలో ఉన్న అరెటీ పినా అనారోగ్యంతో ఉండి, అప్పటింకా వ్లోరేలోనే ఉంది. ఆ ప్రాంతంలో అరెటీతో కలిసి ప్రకటించడానికి ఇద్దరు ప్రత్యేక పయినీర్లు పంపించబడ్డారు. విదేశీయులు అల్బేనియన్‌లో మాట్లాడడం చూసి ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు: “ఇతర మతగుంపుల మిషనరీలు, మేము ఏమైనా నేర్చుకోవాలంటే మేము ఇంగ్లీషు లేక ఇటాలియన్‌ భాషలను నేర్చుకొనేలా చేస్తారు. మీరు నిజంగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీ దగ్గర ఏదో ప్రాముఖ్యమైన సందేశం ఉంది, కాబట్టే మీరు అల్బేనియన్‌ నేర్చుకున్నారు!” అరెటీ తన భూజీవితాన్ని 1994 జనవరిలో నమ్మకంగా ముగించింది, ఆమె తన జీవితంలోని ఆఖరి నెల వరకు ప్రకటనా పనిలో చురుకుగా పాల్గొన్నది. ఆమె, పయినీర్లూ చూపించిన ఉత్సాహం ఆశీర్వదించబడింది. 1995లో వ్లోరేలోని సంఘం పునఃస్థాపించబడింది. నేడు, ఆ ఓడరేవులో వర్ధిల్లుతున్న మూడు సంఘాలు ప్రకటనా పనిలో నిమగ్నమై ఉన్నాయి.

ఆ దేశమంతటా ప్రజలు ఆధ్యాత్మిక ఆకలితో అలమటిస్తున్నారు, వారిలో మత వివక్ష చాలా తక్కువగా ఉంది. సాక్షులు వారికిచ్చిన బైబిలు ఆధారిత సాహిత్యాలన్నింటినీ ఆసక్తితో తీసుకున్నారు, చదివారు. చాలామంది యౌవనులు అధ్యయనం చేయడం ప్రారంభించి త్వరగా ప్రగతి సాధించారు.

ఆ దేశమంతటిలో 90 కన్నా ఎక్కువ సంఘాలు, గుంపులు ‘విశ్వాసమందు స్థిరపడుతూ, అనుదినము లెక్కకు విస్తరిస్తున్నాయి.’ (అపొస్తలుల కార్యములు 16:⁠5) అల్బేనియాలోని 3,513 మంది సాక్షులకు, చేయడానికి ఇంకా ఎంతో పని ఉంది. మార్చి 2005లో క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు 10,144 మంది హాజరయ్యారు. ప్రకటనా పనిలో ఆతిథ్యమిచ్చే గుణం ఉన్న ప్రజలతో చేసిన చర్చల కారణంగా 6,000 కన్నా ఎక్కువ బైబిలు అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి. అల్బేనియా భాషలో ఇటీవల విడుదల చేయబడిన నూతనలోక అనువాదము నుండి వేలాదిమంది ప్రయోజనం పొందుతారనేది స్పష్టం. నిజమే, “గరుడపక్షి దేశంలో” యెహోవాకు స్తుతి కలిగే విధంగా ఆయన వాక్యం విస్తరిస్తోంది.

[అధస్సూచీలు]

^ పేరా 9 థానాస్‌ డ్యూలి జీవిత కథ కోసం కావలికోట (ఆంగ్లం) డిసెంబరు 1, 1968 సంచికను చూడండి.

^ పేరా 17 నాషొ దొరి జీవితకథ కోసం కావలికోట జనవరి 1, 1996 సంచికను చూడండి.

^ పేరా 19 జాన్‌ మార్క్స్‌ భార్య హెలెన్‌ జీవితకథ కోసం కావలికోట, జనవరి 1, 2002 సంచికను చూడండి.

[20వ పేజీలోని బాక్సు]

కొసావొలో జాతి సంఘర్షణలు కనుమరుగయ్యాయి!

భూ తగాదాలు, లోతుగా నాటుకుపోయిన జాతి విద్వేషాలు యుద్ధానికి, ఆ తర్వాత అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవడానికి దారితీసినప్పుడు కొసావొ అనే పేరు 1990ల చివరి భాగంలో ప్రతీనోట నానింది.

బాల్కన్‌ రాష్ట్రాల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు చాలామంది సాక్షులు పొరుగు దేశాలకు పారిపోవాల్సివచ్చింది. యుద్ధం ముగిసిన తర్వాత, సాక్ష్యపు పని చేయడానికి సిద్ధంగా ఉన్న సాక్షుల చిన్న గుంపు ఒకటి కొసావొకు తిరిగివచ్చింది. అక్కడ ఉన్న 23,50,000 మంది నివాసులకు సహాయం చేయడానికి అల్బేనియాకు, ఇటలీకి చెందిన ప్రత్యేక పయినీర్లు కొసావొకు వెళ్ళడానికి ముందుకు వచ్చారు. నాలుగు సంఘాల్లో, చురుకుగా ఉన్న ఆరు గుంపులలో ఉన్న దాదాపు 130 మంది ప్రచారకులు ఆ క్షేత్రంలో యెహోవాను సేవిస్తున్నారు.

2003 వసంత రుతువులో ఒక ప్రత్యేక సమావేశ దినం ప్రెష్టీనాలో నిర్వహించబడింది, దానికి 252 మంది హాజరయ్యారు. హాజరైనవారిలో అల్బేనియన్‌, ఇటాలియన్‌, జర్మన్‌, జిప్సీ, సెర్బియన్‌ నేపథ్యాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. బాప్తిస్మ ప్రసంగం చివరిలో ప్రసంగీకుడు రెండు ప్రశ్నలు అడిగాడు. ఔనని జవాబిచ్చేందుకు ముగ్గురు నిల్చున్నారు, వారు అల్బేనియన్‌, జిప్సీ, సెర్బియన్‌ జాతులకు చెందినవారు.

బాప్తిస్మం పొందే అభ్యర్థులు ముగ్గురూ తమ తమ భాషల్లో “వా!” “డా!” “పో!” అని బిగ్గరగా ఒకేసారి చెప్పడం ప్రేక్షకులు విన్న తర్వాత కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి. ఆ ముగ్గురూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. తమ దేశాన్ని పట్టిపీడించిన, లోతుగా పాతుకుపోయిన జాతి సంబంధ సమస్యలకు వారు పరిష్కారం కనుగొన్నారు.

[17వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

మధ్యధరా సముద్రం

ఇటలీ

అల్బేనియా

గ్రీసు

[18వ పేజీలోని చిత్రం]

యువ సాక్షులు వయోధికుల ఉత్సాహాన్ని అనుకరిస్తున్నారు

[18వ పేజీలోని చిత్రం]

అరెటీ పినా 1928 నుండి 1994లో తాను మరణించేంతవరకు నమ్మకంగా సేవ చేసింది

[19వ పేజీలోని చిత్రం]

భాషా కోర్సుకు హాజరవుతున్న విదేశీ పయినీర్ల మొదటి గుంపు

[Picture Credit Lineon page 16]

గరుడపక్షి: © Brian K. Wheeler/VIREO