కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన వినయాన్ని అలవరచుకోండి

నిజమైన వినయాన్ని అలవరచుకోండి

నిజమైన వినయాన్ని అలవరచుకోండి

‘వినయస్థులను నీవు రక్షించెదవు.’​—⁠2 సమూయేలు 22:​28, Nw.

ఐగుప్తు పిరమిడ్లు ఒకప్పటి ఆ దేశ పాలకులకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి. చరిత్రలో అష్షూరు పాలకుడైన సన్హెరీబు, గ్రీకు వీరుడైన అలెగ్జాండర్‌, రోమ్‌ పాలకుడైన జూలియస్‌ సీజర్‌ తదితరులు పేరుగాంచారు. అలాంటి పాలకులందరిలో ఒకటి మాత్రం సర్వసాధారణంగా కనబడుతుంది. అదేమిటంటే, వారు నిజమైన వినయంగల వ్యక్తులు అనే పేరు సంపాదించుకోలేదు.​—⁠మత్తయి 20:25, 26.

2 పైన పేర్కొనబడిన పరిపాలకుల్లో ఎవరికైనా తమ రాజ్యంలో ఆదరణ అవసరమైన దీన ప్రజల కోసం వెదికే అలవాటు ఉన్నట్లు మీరు ఊహించగలరా? ఊహించలేరు! లేక అణగారిన ప్రజలకు ధైర్యం చెప్పేందుకు వారి పూరిళ్లకు వెళ్లడాన్ని కూడా మీరు ఊహించలేరు. దీన మానవుల విషయంలో విశ్వ సర్వోన్నత పరిపాలకుడైన యెహోవా దేవునికున్న దృక్పథానికి వారి దృక్పథానికి ఎంత వ్యత్యాసమో కదా!

వినయం విషయంలో అత్యంత గొప్ప మాదిరి

3 యెహోవా శోధించడానికి సాధ్యంకానంత గొప్పవాడు, సర్వోన్నతుడు, అయినప్పటికీ “తనయెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది.” (2 దినవృత్తాంతములు 16:9) వివిధ పరీక్షల ఫలితంగా నలిగిన మనస్సుగల దీనులైన తన ఆరాధకులను చూసినప్పుడు యెహోవా ఏమి చేస్తాడు? ఒక విధంగా ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా ‘నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసిస్తున్నాడు.’ (యెషయా 57:15) ఆ విధంగా ఉజ్జీవింపజేయబడిన ఆయన ఆరాధకులు ఆనందంగా మళ్లీ ఆయన సేవ చేయగలుగుతారు. దేవుడు చూపించే ఆ వినయమెంత ఉదాత్తమైనదో కదా!

4 పాపులైన మానవులకు సహాయం చేసేందుకు సర్వోన్నత ప్రభువు తననుతాను తగ్గించుకున్నంతగా విశ్వంలో ఇంకెవ్వరూ తగ్గించుకోలేదు. అందుకే కీర్తనకర్త ఇలా వ్రాయగలిగాడు: “యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు; ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి యున్నది. ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు? ఆయన భూమ్యాకాశములను వంగిచూడ ననుగ్రహించుచున్నాడు. . . . ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీదనుండి బీదలను పెకెత్తువాడు.”​—⁠కీర్తన 113:​4-8.

5 ‘వంగి చూడడం’ అనే పదాన్ని గమనించండి. మానవులను ఉదాహరిస్తూ చెప్పినప్పుడు ఆ పదానికి ‘క్రిందిస్థాయి వారికంటే లేదా దుస్థితిలో ఉన్నవారికంటే తానెంతో ఉన్నతుడని భావించడం’ అనే పెడర్థం ఉంది. అలాంటి అహంకార దృక్పథం, ‘అహంభావం’ ఏ మాత్రం లేని నిర్మలుడైన, పరిశుద్ధుడైన యెహోవా దేవుణ్ణి ఎన్నటికీ వర్ణించదు. (మార్కు 7:22, 23) అయితే ‘వంగి చూడడం’ అనే మాట సమాజంలో తక్కువస్థాయి వ్యక్తితో వ్యవహరించేటప్పుడు తన హోదాను లేదా ఠీవిని తగ్గించుకోవడం లేదా క్రిందిస్థాయికి దిగిరావడం అనే భావాన్ని కూడా ఇవ్వగలదు. కాబట్టి కొన్ని బైబిలు భాషాంతరాలు కీర్తన 113:6లో దేవుడు తననుతాను వినయస్థునిగా చేసుకుంటున్నట్లు అనువదిస్తున్నాయి. తన అపరిపూర్ణ మానవ ఆరాధకుల అవసరాలపట్ల ప్రేమపూర్వకంగా శ్రద్ధవహించే సాత్వికుడైన మన దేవుని స్వరూపాన్ని అదెంత యుక్తంగా వర్ణిస్తుందో కదా!​—⁠2 సమూయేలు 22:36.

యేసు ఎందుకు వినయం చూపించాడు?

6 మానవాళిని రక్షించేందుకు మానవునిగా ఈ భూమిపై జన్మించేలా తన ప్రియమైన జ్యేష్ఠకుమారుణ్ణి పంపించడం దేవుని అత్యంత గొప్ప వినయాన్ని, ప్రేమను వెల్లడిస్తోంది. (యోహాను 3:16) యేసు తన పరలోకపు తండ్రి గురించిన సత్యాన్ని మనకు బోధించి, “లోకపాపమును” తొలగించేందుకు తన పరిపూర్ణ మానవ జీవితాన్ని అర్పించాడు. (యోహాను 1:​29; 18:37) యేసు తన తండ్రియైన యెహోవా వినయంతో సహా ఆయనను పరిపూర్ణంగా ప్రతిబింబిస్తూ, ఆయన తనకప్పగించిన పనిని చేయడానికి సుముఖంగా ఉన్నాడు. వినయం, ప్రేమ చూపించడంలో దేవుడు సృష్టించిన మరెవరూ అంత విశిష్టమైన మాదిరిని ఉంచలేదు. యేసు వినయాన్ని అందరూ విలువైనదిగా పరిగణించలేదు, పైగా ఆయన శత్రువులు ఆయనను ‘అత్యల్ప మనుష్యునిగానే’ పరిగణించారు. (దానియేలు 4:17) ఏదేమైనప్పటికీ, తన తోటి విశ్వాసులు మాత్రం యేసును అనుకరిస్తూ, తమ పరస్పర వ్యవహారాల్లో వినయం ప్రదర్శించాలని అపొస్తలుడైన పౌలు గ్రహించాడు.​—⁠1 కొరింథీయులు 11:1; ఫిలిప్పీయులు 2:3, 4.

7 యేసు అసాధారణ మాదిరిని నొక్కిచెబుతూ పౌలు ఇలా వ్రాశాడు: “క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను.”​—⁠ఫిలిప్పీయులు 2:5-8.

8 ‘యేసు వినయాన్ని ఎలా నేర్చుకున్నాడు?’ అని కొందరు ఆశ్చర్యపోవచ్చు. ఆయన అసంఖ్యాకమైన యుగాల కాలంలో యావత్‌ సృష్టిలో దేవుని “ప్రధానశిల్పి”గా పనిచేస్తూ తన పరలోకపు తండ్రి సాంగత్యంలో ఆ వినయాన్ని నేర్చుకున్నాడు. (సామెతలు 8:30) ఏదెను తిరుగుబాటు తర్వాత, పాపులైన మానవులతో తన తండ్రి వ్యవహరించిన తీరులో ఆయన ప్రదర్శించిన వినయాన్ని దేవుని జ్యేష్ఠకుమారుడు చూడగలిగాడు. తదనుగుణంగానే, యేసు భూమ్మీద ఉన్నప్పుడు, తన తండ్రి వినయాన్ని ప్రతిబింబిస్తూ ఈ విన్నపం చేశాడు: “నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.”​—⁠మత్తయి 11:29; యోహాను 14:⁠9.

9 యేసు చూపించిన నిజమైన వినయం కారణంగా పిల్లలు ఆయనను చూసి భయపడేవారు కాదు. బదులుగా వారాయనకు సన్నిహితమయ్యారు. ఆయన పిల్లలపట్ల మక్కువ చూపిస్తూ వారిపట్ల శ్రద్ధ కనబరిచాడు. (మార్కు 10:13-16) పిల్లల్లో యేసును అంతగా ఆకట్టుకున్న విషయమేమిటి? నిశ్చయంగా, పెద్దవారైన తన శిష్యుల్లో కొందరు అన్ని సందర్భాల్లో కనబరచని మంచి లక్షణాలు పిల్లల్లో ఉండడమే. చిన్నపిల్లలు పెద్దవాళ్లను గొప్పవారిగా దృష్టించడం అందరికీ తెలిసిందే. వారడిగే అనేక ప్రశ్నలనుబట్టి మీరు ఆ విషయాన్ని గమనించవచ్చు. అవును, చాలామంది పెద్దవాళ్లతో పోల్చినప్పుడు పిల్లలు బోధింపతగినవారిగా ఉంటారే తప్ప అహంకారులుగా ఉండరు. ఒక సందర్భంలో యేసు ఒక బిడ్డను చూపిస్తూ తన అనుచరులతో “మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని” చెబుతూ ఇంకా ఇలా అన్నాడు: “ఈ బిడ్డవలె తన్ను తాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.” (మత్తయి 18:3, 4) యేసు ఈ ప్రమాణం విధించాడు: “తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.”​—⁠లూకా 14:​11; 18:14; మత్తయి 23:​12.

10 ఆ సత్యం ప్రాముఖ్యమైన ప్రశ్నలను లేవదీస్తుంది? మనం నిత్యజీవం పొందడమనేది కొంతమేరకు నిజమైన వినయాన్ని అలవరచుకోవడంపైనే ఆధారపడివుంటుంది, అయితే వినయంగా ఉండడం క్రైస్తవులకు ఎందుకు కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది? అహంకారాన్ని అణచుకోవడమే కాక, పరీక్షలు వచ్చినప్పుడు వినయంతో స్పందించడం మనకు ఎందుకు కష్టంగా ఉంటుంది? నిజమైన వినయాన్ని అలవరచుకోవడంలో సఫలమయ్యేందుకు మనకు ఏది సహాయం చేస్తుంది?​—⁠యాకోబు 4:6, 10.

వినయంగా ఉండడం ఎందుకు కష్టం?

11 వినయంగా ఉండేందుకు మీరు పోరాడుతున్నట్లయితే, అలా పోరాడుతున్నది మీరొక్కరు మాత్రమే కాదు. ఎప్పుడో 1920లోనే ఈ పత్రికయొక్క ఆంగ్లసంచిక, వినయం విషయంలో బైబిలు ఉపదేశం గురించి చర్చిస్తూ ఇలా వ్యాఖ్యానించింది: “వినయానికి ప్రభువు ఎంత విలువ ఇస్తున్నాడో మనం చూస్తున్నప్పుడు, నిజ శిష్యులందరూ ఈ లక్షణాన్ని ప్రతీరోజు అలవరచుకోవాలని అది వారిని ప్రోత్సహించాలి.” ఆ తర్వాత ఆ పత్రిక ఇలా ధైర్యంగా ఒప్పుకున్నది: “లేఖనాల్లో ఇన్ని ఉపదేశాలున్నప్పటికీ, ప్రభువు ప్రజలుగా మారి, ఆయన మార్గాన్ని అనుసరించాలని తీర్మానించుకున్న అపరిపూర్ణ మానవ స్వభావానికి మరిదేనికన్నా వినయం కనబరచడమే మరెంతో కష్టంగా, గట్టి పోరాటంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది.” నిజ క్రైస్తవులు వినయం ప్రదర్శించేందుకు పోరాడడానికి గల ఒక కారణాన్ని అంటే అనుచిత వైభవం కోసం ప్రాకులాడే మన పాపభరిత మానవ నైజాన్ని అది నొక్కిచెబుతోంది. దీనికి కారణం, మనం స్వార్థ కోరికలకు లొంగిపోయిన పాపభరిత దంపతులైన ఆదాము, హవ్వల సంతానం కావడమే.​—⁠రోమీయులు 5:12.

12 వినయం కనబరిచేందుకు మనకు కష్టమవడానికి మరో కారణం, మన చుట్టూ ఉన్న లోకం ఇతరులకంటే పై స్థాయిలో ఉండేలా కృషి చేసేందుకు ప్రజలను ప్రోత్సహించడమే. ఈ లోకపు సాధారణ లక్ష్యాల్లో ‘[పాపపు] శరీరాశను, నేత్రాశను, జీవపుడంబాన్ని’ తీర్చుకోవాలనే కోరిక ఒకటి. (1 యోహాను 2:16) అలాంటి లోక కోరికలకు దాసోహమయ్యే బదులు, యేసు శిష్యులు తమ కంటిని తేటగా ఉంచుకొని దేవుని చిత్తం చేయడం మీదే దృష్టి సారించాలి.​—⁠మత్తయి 6:22-24, 31-33; 1 యోహాను 2:17.

13 వినయాన్ని అలవరచుకొని, కనబరచడాన్ని కష్టతరం చేసే మూడో కారణం, దాని మూలకారకుడైన అపవాదియగు సాతాను ఈ లోకాన్ని పరిపాలించడమే. (2 కొరింథీయులు 4:4; 1 తిమోతి 3:6) సాతాను తన దుష్ట లక్షణాలను ప్రోత్సహిస్తున్నాడు. ఉదాహరణకు, అతడు యేసుకు ‘లోకరాజ్యములన్నిటిని, వాటి మహిమను’ ఇచ్చి దానికి ప్రతిగా ఆయనచేత ఆరాధించబడేందుకు ప్రయత్నించాడు. వినయస్థుడైన యేసు అపవాది ప్రతిపాదనను స్థిరంగా త్రోసిపుచ్చాడు. (మత్తయి 4:8, 10) అదే విధంగా, క్రైస్తవులు తమ వైభవం కోసం ప్రయత్నించేలా సాతాను వారిని శోధిస్తాడు. కానీ వినయస్థులైన క్రైస్తవులు అలా చేసే బదులు యేసు మాదిరిని అనుకరిస్తూ దేవునికే స్తుతులు, ఘనతా చెల్లించడానికి కృషి చేస్తారు.​—⁠మార్కు 10:17, 18.

నిజమైన వినయాన్ని అలవరచుకొని, కనబరచడం

14 కొలొస్సయులకు తాను వ్రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు మనుష్యులను మెప్పించేందుకు బూటకపు వినయాన్ని ప్రదర్శించడం గురించి హెచ్చరించాడు. పౌలు దీనిని ‘అతివినయమని’ వర్ణించాడు. తాము వినయస్థులమన్నట్లు నటించేవారు ఆధ్యాత్మిక ప్రజలు కారు. బదులుగా, తాము నిజంగా అహంకారంతో ‘ఉప్పొంగే’ వారమని తమకు తెలియకుండానే వారు వెల్లడిస్తారు. (కొలొస్సయులు 2:18, 23) అలాంటి బూటకపు వినయానికి ఉదాహరణలను యేసు సూచించాడు. పరిసయ్యుల డాంబిక ప్రార్థనలను, ఇతరులు గమనించేలా దుఃఖముఖులై ఉపవాసం చేసే వారి పద్ధతిని ఆయన ఖండించాడు. దానికి భిన్నంగా దేవుని ఎదుట మన ప్రార్థనలకు విలువ ఉండాలంటే, ఆ ప్రార్థనలను వినయంతో చేయాలి.​—⁠మత్తయి 6:5, 6, 16.

15 వినయానికి ఉత్తమ ఆదర్శాలైన యెహోవా దేవునిపై, యేసుక్రీస్తుపై దృష్టి నిలపడం మూలంగా యథార్థమైన దీనమనస్సును కాపాడుకొనేందుకు క్రైస్తవులకు సహాయం లభిస్తుంది. దీనిలో బైబిలును, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందించే బైబిలు అధ్యయన సహాయకాలను క్రమంగా అధ్యయనం చేయడం కూడా ఉంది. (మత్తయి 24:45) “[తమ] సహోదరులమీద గర్వించ”కుండా ఉండేందుకు, క్రైస్తవ పైవిచారణకర్తలకు అలాంటి అధ్యయనం చాలా ప్రాముఖ్యం. (ద్వితీయోపదేశకాండము 17:​19-20; 1 పేతురు 5:1-3) తాము కనబరచిన వినయ దృక్పథాన్నిబట్టి దీవించబడిన రూతు, హన్నా, ఎలీసబెతు, ఇంకా అనేకమంది ఇతరుల ఉదాహరణలను ధ్యానించండి. (రూతు 1:16, 17; 1 సమూయేలు 1:11, 20; లూకా 1:41-43) అలాగే యెహోవా సేవలో వినయస్థులుగా నిలిచిన దావీదు, యోషీయా, బాప్తిస్మమిచ్చు యోహాను, అపొస్తలుడైన పౌలు వంటి అనేకమంది ప్రముఖుల ఉదాహరణల గురించి కూడా ఆలోచించండి. (2 దినవృత్తాంతములు 34:1, 2, 19, 26-28; కీర్తన 131:1; యోహాను 1:​26, 27; 3:26-30; అపొస్తలుల కార్యములు 21:20-26; 1 కొరింథీయులు 15:9) క్రైస్తవ సంఘంలో మనకు కనిపించే, వినయానికి సంబంధించిన అనేక ఆధునిక ఉదాహరణల విషయమేమిటి? ఈ ఉదాహరణలను ధ్యానించడం ద్వారా నిజ క్రైస్తవులు “ఎదుటివానియెడల దీనమనస్సు” కలిగివుండేందుకు సహాయం పొందుతారు.​—⁠1 పేతురు 5:5.

16 క్రైస్తవ పరిచర్యలో క్రమంగా పాల్గొనడం కూడా మనం వినయంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. మనం ఇంటింటి సేవకు వెళ్లినప్పుడు లేదా ఇతర ప్రదేశాల్లో క్రొత్తవారిని కలిసినప్పుడు వినయం మనం ఫలవంతంగా ఉండేందుకు దోహదపడుతుంది. గృహస్థులు మొదట్లో రాజ్య సందేశానికి నిర్లిప్తంగా లేదా దురుసుగా స్పందించినప్పుడు ఇది ప్రత్యేకంగా వాస్తవమై ఉంటుంది. మన నమ్మకాల గురించిన ప్రశ్నలు తరచూ ఎదురవుతాయి, కాబట్టి ఆ ప్రశ్నలకు క్రైస్తవుడు ‘సాత్వికముతో భయముతో’ లేదా ప్రగాఢ గౌరవంతో జవాబు చెప్పేందుకు వినయం సహాయం చేయగలదు. (1 పేతురు 3:15) వినయస్థులైన దేవుని సేవకులు క్రొత్త ప్రాంతాలకు వెళ్లి వివిధ సంస్కృతులు, కట్టుబాట్లుగల ప్రజలకు సహాయం చేశారు. అలాంటి పరిచారకులు తాము సువార్త చెప్పాలని ఇష్టపడేవారికి మరింత సహాయం చేయగలిగేలా వినయంతో క్రొత్త భాషను కష్టపడి నేర్చుకోవలసి ఉంటుంది. అదెంత మెచ్చుకోదగిన పనో కదా!​—⁠మత్తయి 28:19, 20.

17 చాలామంది వినయంతో తమ స్వవిషయాలకన్నా ఇతరుల విషయాలపట్ల మొదట ఆసక్తి చూపిస్తూ తమ క్రైస్తవ విధులను నిర్వర్తించారు. ఉదాహరణకు, సిద్ధపడి తన పిల్లలకు సమర్థవంతమైన బైబిలు అధ్యయనం నిర్వహించడానికి తన సమయాన్ని కేటాయించేందుకు ఒక క్రైస్తవ తండ్రికి వినయం అవసరం. అపరిపూర్ణులైన తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ వారికి లోబడివుండేలా వినయం పిల్లలకు కూడా సహాయం చేస్తుంది. (ఎఫెసీయులు 6:1-4) అవిశ్వాసులైన భర్తలున్న భార్యలు తమ ప్రగాఢ గౌరవంతోకూడిన లేదా ‘భయముతోకూడిన పవిత్ర ప్రవర్తన’ ద్వారా తమ భర్తలను రాబట్టేందుకు ప్రయత్నిస్తుండగా, వారు తరచూ వినయం ప్రదర్శించవలసిన పరిస్థితులను ఎదుర్కొంటారు. (1 పేతురు 3:​1-2) రోగుల, వృద్ధ తల్లిదండ్రుల అవసరాలను మనం ప్రేమతో తీర్చేటప్పుడు కూడా వినయం, స్వయంత్యాగ ప్రేమ విలువైన లక్షణాలుగా ఉంటాయి.​—⁠1 తిమోతి 5:4.

వినయం సమస్యల్ని పరిష్కరిస్తుంది

18 దేవుని మానవ సేవకులందరూ అపరిపూర్ణులే. (యాకోబు 3:2) కొన్ని సందర్భాల్లో, ఇద్దరు క్రైస్తవుల మధ్య అభిప్రాయభేదాలు లేదా అపార్థాలు చోటుచేసుకోవచ్చు. ఒకరికి మరొకరిపై ఫిర్యాదు చేసేందుకు యుక్తమైన కారణం ఉండవచ్చు. సాధారణంగా ఈ ఉపదేశాన్ని అన్వయించుకోవడం ద్వారా అలాంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చు: “ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి.” (కొలొస్సయులు 3:13) నిజమే, ఈ ఉపదేశాన్ని అనుసరించడం సులభం కాదు, అయితే వినయం ఆ సలహాను పాటించేందుకు ఒక వ్యక్తికి సహాయం చేస్తుంది.

19 కొన్నిసార్లు ఒక క్రైస్తవుడు తన ఫిర్యాదు పట్టించుకోకుండా ఉండలేనంత గంభీరమైనదని భావించవచ్చు. అలాంటి సందర్భాల్లో, తనకు హాని చేశాడని భావించే వ్యక్తిని, సమాధానం పునరుద్ధరించే ఉద్దేశంతో కలిసి మాట్లాడేలా వినయం సహాయం చేస్తుంది. (మత్తయి 18:15) కొన్నిసార్లు క్రైస్తవుల మధ్య సమస్యలు అలాగే నిలిచి ఉండేందుకు ఒక కారణం, వారిలో ఒకరు లేదా ఇరు పక్షాలవారు అహంతో తమ తప్పును ఒప్పుకోకుండా ఉండడమే. లేదా కలిసి మాట్లాడేందుకు చొరవ తీసుకునే వ్యక్తి స్వనీతితో, కఠిన స్వభావంతో మాట్లాడవచ్చు. వీటికి భిన్నంగా, నిజమైన వినయ దృక్పథం అనేక భేదాభిప్రాయాలను పరిష్కరించుకోవడంలో ఫలవంతంగా పనిచేస్తుంది.

20 వినయాన్ని వృద్ధి చేసుకోవడానికి ఒక కీలకం దేవుని సహాయం కోసం, ఆత్మ కోసం ప్రార్థించడమే. అయితే “దేవుడు . . . దీనులకు [తన పరిశుద్ధాత్మతో సహా] కృప అనుగ్రహించును” అని గుర్తుంచుకోండి. (యాకోబు 4:6) కాబట్టి మీ తోటి విశ్వాసితో మీకు అభిప్రాయభేదముంటే, మీ వైపున ఏదైనా దోషముంటే అది చిన్నదైనా, పెద్దదైనా దానిని వినయంతో ఒప్పుకునేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి. మీకు బాధ కలిగినప్పుడు, అలా బాధపెట్టిన వ్యక్తి హృదయపూర్వకంగా “నన్ను క్షమించండి” అని అడిగితే, వినయంతో ఆయనను క్షమించండి. అలా చేయడం కష్టమనిపిస్తే, మీ హృదయంలో ఏవైనా అహంకారపు ఛాయలుంటే వాటిని తొలగించుకొనేలా ప్రార్థనాపూర్వకంగా యెహోవా సహాయాన్ని అడగండి.

21 వినయం తీసుకొచ్చే అనేక ప్రయోజనాలను అర్థం చేసుకోవడం, ఈ ప్రశస్త లక్షణాన్ని అలవరచుకొని, దానిని కాపాడుకునేలా మనల్ని పురికొల్పాలి. అలా చేసేందుకు మనకు యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ఎంత అద్భుతమైన మాదిరులుగా ఉన్నారో కదా! ఈ దైవిక హామీని ఎన్నటికీ మరచిపోకండి: “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును.”​—⁠సామెతలు 22:⁠4.

ధ్యానించవలసిన అంశాలు

వినయానికి సంబంధించి ఎవరు శ్రేష్ఠమైన మాదిరిగా ఉన్నారు?

వినయాన్ని అలవరచుకోవడం ఎందుకు కష్టం?

వినయంగా ఉండేందుకు మనకు ఏది సహాయం చేయగలదు?

వినయంగా ఉండడం ఎందుకంత ప్రాముఖ్యం?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. చాలామంది ప్రపంచ పరిపాలకుల్లో సర్వసాధారణంగా కనిపించినదేమిటి?

3. సర్వోన్నత పరిపాలకుడు తన మానవ ఆరాధకులతో ఎలా వ్యవహరిస్తాడు?

4, 5. (ఎ) దేవుని పరిపాలనా విధానం విషయంలో కీర్తనకర్త ఎలా భావిస్తున్నాడు? (బి) ‘బీదలకు’ సహాయం చేసేందుకు దేవుడు ‘వంగిచూడడం’ అంటే అర్థమేమిటి?

6. వినయానికి సంబంధించి యెహోవా ఎలాంటి గొప్ప పనిచేశాడు?

7, 8. (ఎ) యేసు వినయం ఎలా నేర్చుకున్నాడు? (బి) శిష్యులు కాబోయేవారికి యేసు ఎలాంటి విన్నపం చేశాడు?

9. (ఎ) పిల్లల్లో ఆకట్టుకునే ఏ విషయాన్ని యేసు గమనించాడు? (బి) ఒక బిడ్డను చూపిస్తూ యేసు ఏ పాఠం బోధించాడు?

10. మనం ఏ ప్రశ్నలను పరిశీలిస్తాం?

11. వినయం చూపించడానికి మనం పోరాడవలసి రావడం ఎందుకు ఆశ్చర్యకరం కాదు?

12, 13. (ఎ) క్రైస్తవ వినయానికి లోకమెలా ఆటంకంగా ఉంది? (బి) వినయాన్ని అలవరచుకునేందుకు మనం చేసే పోరాటాన్ని ఎవరు మరింత కష్టభరితం చేస్తారు?

14. ‘అతి వినయం’ అంటే ఏమిటి?

15. (ఎ) దీనమనస్సును కాపాడుకునేందుకు మనమేమి చేయవచ్చు? (బి) వినయానికి సంబంధించిన కొన్ని మంచి ఉదాహరణలు ఏమిటి?

16. మనం వినయంగా ఉండేందుకు క్రైస్తవ పరిచర్య మనకెలా సహాయం చేస్తుంది?

17. ఎలాంటి క్రైస్తవ బాధ్యతలకు వినయం అవసరం?

18. సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వినయం మనకెలా సహాయం చేస్తుంది?

19. మనల్ని బాధపెట్టిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనమేమి గుర్తుంచుకోవాలి?

20, 21. వినయంగా ఉండేందుకు అత్యంత గొప్ప సహాయం ఏమిటి?

[26వ పేజీలోని చిత్రం]

యేసు నిజమైన వినయాన్ని ప్రదర్శించాడు

[28వ పేజీలోని చిత్రం]

ఇతరులకన్నా తామే ఉత్తములుగా ఉండేందుకు కృషిచేయమని లోకం ప్రజల్ని ప్రోత్సహిస్తోంది

[చిత్రసౌజన్యం]

WHO photo by L. Almasi/K. Hemzǒ

[29వ పేజీలోని చిత్రం]

పరిచర్యలో క్రొత్తవారితో మాట్లాడేందుకు వినయం మనకు సహాయం చేస్తుంది

[30వ పేజీలోని చిత్రాలు]

మనం ప్రేమతో, వినయంగా తప్పులను కప్పివేయడం ద్వారా తరచూ అభిప్రాయభేదాలను పరిష్కరించుకోవచ్చు

[31వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవులు వినయం చూపించే మార్గాలు చాలావున్నాయి