కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మొదటి శతాబ్దపు యూదుల్లో క్రైస్తవత్వం వ్యాప్తి చెందడం

మొదటి శతాబ్దపు యూదుల్లో క్రైస్తవత్వం వ్యాప్తి చెందడం

మొదటి శతాబ్దపు యూదుల్లో క్రైస్తవత్వం వ్యాప్తి చెందడం

యెరూషలేములో దాదాపు సా.శ. 49లో ఒక ప్రాముఖ్యమైన సమావేశం జరిగింది. మొదటి శతాబ్దంలోని క్రైస్తవ సంఘానికి “స్తంభములుగా ఎంచబడిన” యోహాను, పేతురు, యేసు సహోదరుడు యాకోబు అక్కడున్నారు. ఆ సమావేశానికి మరో ఇద్దరు కూడా హాజరైనట్లు పేర్కొనబడింది, వారు అపొస్తలుడైన పౌలు, ఆయన సహచరుడు బర్నబా. విస్తారమైన క్షేత్రాన్ని ప్రకటనా పని కోసం ఎలా విభజించాలనే విషయం గురించి వారు చర్చించారు. దాని గురించి పౌలు ఇలా వివరించాడు: “మేము అన్యజనులకును తాము సున్నతిపొందినవారికిని అపొస్తలులుగా ఉండవలెనని చెప్పి. . . . నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి.”​—⁠గలతీయులు 2:​1, 8. *

మనం ఆ ఒప్పందాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సువార్త ప్రకటించాల్సిన క్షేత్రాన్ని యూదులు, యూదా మతప్రవిష్టులు ఉన్న ప్రాంతాన్ని ఒక క్షేత్రంగా, అన్యులు ఉన్న ప్రాంతాన్ని మరో క్షేత్రంగా విభజించారా? లేక క్షేత్రాన్ని భౌగోళికంగా విభజించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారా? వాటికి సహేతుకమైన జవాబులు పొందాలంటే, డయస్పోరా గురించి అంటే, పాలస్తీనా వెలుపల నివసిస్తున్న యూదుల గురించి కొంత చారిత్రక సమాచారం మనకు అవసరం.

మొదటి శతాబ్దంలోని యూదా ప్రపంచం

మొదటి శతాబ్దంలో ఎంతమంది యూదులు పాలస్తీనా వెలుపల నివసిస్తున్నారు? అట్లాస్‌ ఆఫ్‌ జ్యూయిష్‌ వరల్డ్‌ అనే పుస్తకం చెబుతున్న ఈ విషయంతో చాలామంది విద్వాంసులు ఏకీభవిస్తున్నట్లు అనిపిస్తోంది: “వారి ఖచ్చితమైన సంఖ్యను నిర్ధారించడం కష్టం, అయితే సా.శ. 70కి కొంతకాలం ముందు యూదయలో 25 లక్షలమంది యూదులు ఉన్నారని, రోమా సామ్రాజ్యపు మిగతా భాగంలో 40 లక్షలకన్నా ఎక్కువమంది స్థిరపడ్డారని ఒక అంచనా. . . . రోమా సామ్రాజ్యంలోని జనాభా అంతటిలో యూదులు దాదాపు పది శాతం ఉండి ఉండవచ్చు, యూదులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, తూర్పు ప్రాంతాల్లోని పట్టణాల్లో వారు జనాభాలో 25 శాతం లేక అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు.”

యూదుల ప్రధాన కేంద్రాలు సిరియా, ఆసియా మైనరు, బబులోను, ఐగుప్తు, తూర్పు ప్రాంతాలలో ఉండేవి, యూదుల చిన్న సమాజాలు యూరప్‌లో ఉండేవి. పేరుగాంచిన తొలి యూదా క్రైస్తవుల్లో కొంతమంది పాలస్తీనా వెలుపల నివసించారు, ఉదాహరణకు, బర్నబా కుప్రకు చెందినవాడు, ప్రిస్కిల్లా, అకులాలు పొంతులో నివసించారు, ఆ తర్వాత రోములో నివసించారు, అపొల్లో అలెక్సంద్రియకు చెందినవాడు, పౌలు తార్సుకు చెందినవాడు.​—⁠అపొస్తలుల కార్యములు 4:36; 18:2, 24; 22:⁠3.

పాలస్తీనా వెలుపల నివసిస్తున్న యూదా సమాజాలకు తమ స్వదేశంతో ఎన్నో సంబంధాలు ఉండేవి. వాటిలో ఒకటి, యెరూషలేములోని దేవాలయానికి వార్షిక పన్ను పంపించడం, దేవాలయ జీవితంలో, ఆరాధనలో భాగం వహించడానికి అది ఒక మార్గం. దాని గురించి విద్వాంసుడైన జాన్‌ బార్క్‌లే ఇలా చెబుతున్నాడు: “ఆ డబ్బుతోపాటు, ధనికులిచ్చే అదనపు విరాళాలను సేకరించే పనిని పాలస్తీనా వెలుపల నివసిస్తున్న యూదా సమాజాలు జాగ్రత్తగా నిర్వహించేవనడానికి తగినంత సాక్ష్యాధారం ఉంది.”

మరో సంబంధం ఏమిటంటే, ప్రతీ సంవత్సరం పండుగల కోసం యెరూషలేముకు వెళ్ళే వేలాదిమంది యాత్రికులు. సా.శ. 33 పెంతెకొస్తు గురించి అపొస్తలుల కార్యములు 2:​9-11లో ఉన్న వృత్తాంతం ఆ విషయాన్ని ఉదాహరిస్తోంది. ఆ పండుగకు వచ్చిన యూదా యాత్రికులు పార్తీయ, మాద్య, ఏలాము, మెసొపొతమియ, కప్పదొకియ, పొంతు, ఆసియా, ఫ్రుగియ, పంఫూలియా, ఐగుప్తు, లిబియ, రోమా, క్రేతు, అరేబియా ప్రాంతాల నుండి వచ్చారు.

యెరూషలేములో ఉన్న ఆలయ నిర్వహణ విభాగం, పాలస్తీనా వెలుపల నివసిస్తున్న యూదులతో లిఖిత పత్రాల ద్వారా సంప్రదింపులు జరిపేది. అపొస్తలుల కార్యములు 5:​34లో ప్రస్తావించబడిన ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలు బబులోనుకు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఉత్తరాలు పంపించాడనేది తెలిసిన విషయమే. అపొస్తలుడైన పౌలు దాదాపు సా.శ. 59లో రోమాకు ఖైదీగా వచ్చినప్పుడు “యూదులలో ముఖ్యులైనవారు,” “యూదయ నుండి నిన్నుగూర్చి పత్రికలు మాకు రాలేదు; ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్నుగూర్చి చెడుసంగతి ఏదియు మాకు తెలియపరచను లేదు, మరియు ఎవరును చెప్పుకొనను లేదు” అని పౌలుతో అన్నారు. స్వదేశం నుండి రోమాకు తరచూ ఉత్తరాలు, నివేదికలు పంపించబడేవని ఇది సూచిస్తోంది.​—⁠అపొస్తలుల కార్యములు 28:​17, 21.

పాలస్తీనా వెలుపల నివసిస్తున్న యూదులు, సెప్టాజింట్‌ అనే, హీబ్రూ లేఖనాల గ్రీకు అనువాదాన్ని బైబిలుగా ఉపయోగించేవారు. ఒక రెఫరెన్సు గ్రంథం ఇలా చెబుతోంది: “LXX [సెప్టాజింట్‌], పాలస్తీనా వెలుపల నివసిస్తున్న యూదుల బైబిలుగా లేక ‘పరిశుద్ధ లేఖనాలుగా’ యూదులు వెళ్ళిన ప్రాంతాలన్నిటిలో చదవబడిందనే, ఆమోదించబడిందనే అభిప్రాయానికి రావడం సబబే.” తొలి క్రైస్తవులు తమ బోధల్లో ఆ అనువాదాన్నే విస్తృతంగా ఉపయోగించారు.

యెరూషలేములోని క్రైస్తవ పరిపాలక సభ సభ్యులకు ఆ పరిస్థితుల గురించి బాగా తెలుసు. సువార్త అప్పటికే, పాలస్తీనా వెలుపల అంటే సిరియాలోనూ దమస్కు, అంతియొకయ ప్రాంతాలతో సహా సిరియాకు అవతలి వైపున్న ప్రాంతాల్లోనూ నివసిస్తున్న యూదులకు చేరింది. (అపొస్తలుల కార్యములు 9:19, 20; 11:19; 15:23, 41; గలతీయులు 1:​21) సా.శ. 49లో జరిగిన సమావేశానికి హాజరైనవారు భవిష్యత్తు పనికోసం ప్రణాళిక వేశారనేది స్పష్టం. యూదులలో, యూదా మతప్రవిష్టులలో జరిగిన విస్తరణ గురించిన బైబిలు లేఖనాలను మనం పరిశీలిద్దాం.

పౌలు ప్రయాణాలకు, పాలస్తీనా వెలుపల నివసిస్తున్న యూదులకు మధ్య సంబంధం

అపొస్తలుడైన పౌలుకు ఇవ్వబడిన ప్రాథమిక నియామకం ఏమిటంటే, “అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను [యేసుక్రీస్తు] నామము భరించుట.” * (అపొస్తలుల కార్యములు 9:​15) యెరూషలేములో సమావేశం జరిగిన తర్వాత పౌలు తాను ప్రయాణించిన ప్రాంతాలన్నిటిలోనూ పాలస్తీనా వెలుపల నివసిస్తున్న యూదులను కలుసుకోవడానికి ప్రయత్నించాడు. (14వ పేజీలోని బాక్సును చూడండి) కాబట్టి క్షేత్రానికి సంబంధించిన ఆ ఒప్పందం క్షేత్రాన్ని భౌగోళికంగా విభజించడమే అయి ఉండవచ్చని అది సూచిస్తోంది. పౌలు, బర్నబాలు తమ మిషనరీ పనిని పడమటి దిశగా విస్తరింపజేశారు, ఇతరులు స్వదేశమైన యూదాలో, తూర్పు దేశాల్లోవున్న పెద్ద యూదా సమాజాల్లో సేవ చేశారు.

పౌలు, ఆయన సహచరులు రెండవ మిషనరీ ప్రయాణాన్ని సిరియాలోని అంతియొకయ నుండి ప్రారంభించినప్పుడు వారు పడమటి దిశలో ఆసియా మైనరు గుండా త్రోయవరకు వెళ్ళమని నిర్దేశించబడ్డారు. అక్కడి నుండి వారు సముద్రాన్ని దాటి మాసిదోనియకు వెళ్ళారు, ఎందుకంటే వారు “[మాసిదోనియవారికి] సువార్త ప్రకటించుటకు దేవుడు [తమను] పిలిచి యున్నాడనే” నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత క్రైస్తవ సంఘాలు ఏథెన్సు, కొరింథు పట్టణాలతోసహా ఇతర యూరప్‌ పట్టణాల్లో కూడా ప్రారంభమయ్యాయి.​—⁠అపొస్తలుల కార్యములు 15:40, 41; 16:6-10; 17:1-18:​18.

పౌలు దాదాపు సా.శ. 56లో తన మూడవ మిషనరీ ప్రయాణపు ముగింపులో, సుదూరంగా పడమటి దిశకు వెళ్ళి, యెరూషలేము సమావేశంలో తనకు నియమించబడిన క్షేత్రాన్ని విస్తృతం చేయాలని అనుకున్నాడు. ఆయన ఇలా వ్రాశాడు: “కాగా నావలననైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను,” “నేను, మీ పట్టణముమీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును.” (రోమీయులు 1:15; 15:​24, 28) అయితే పాలస్తీనా వెలుపల నివసిస్తున్న, అంటే తూర్పున ఉన్న పెద్ద యూదా సమాజాల విషయం ఏమిటి?

తూర్పున ఉన్న యూదా సమాజాలు

సా.శ. మొదటి శతాబ్దంలో ఐగుప్తులో ప్రత్యేకంగా దాని రాజధాని అలెక్సంద్రియలో, పాలస్తీనా వెలుపల నివసిస్తున్న పెద్ద యూదా సమాజం ఉంది. వ్యాపారానికి, సంస్కృతికి కేంద్రమైన ఆ పట్టణంలో యూదుల జనాభా లక్షల్లో ఉండి, పట్టణమంతటిలో సమాజ మందిరాలు అక్కడక్కడా నెలకొనివున్నాయి. ఆ సమయంలో ఐగుప్తు అంతటిలో కనీసం పది లక్షలమంది యూదులు ఉన్నారని అలెగ్జాండ్రియాకు చెందిన యూదుడైన ఫీలో చెప్పాడు. చాలామంది దగ్గర్లో ఉన్న లిబియా ప్రాంతంలోని కురేనే పట్టణంలో, దానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో కూడా స్థిరపడ్డారు.

క్రైస్తవులుగా మారిన కొంతమంది యూదులు ఆ ప్రాంతాల నుండే వచ్చారు. మనం “అలెక్సంద్రియవాడైన అపొల్లో” గురించి, ‘కొందరు కుప్రీయులు, కొందరు కురేనీయుల’ గురించి, సిరియాలోని అంతియొకయ సంఘానికి మద్దతిచ్చిన “కురేనీయుడైన లూకియ” గురించి చదువుతాం. (అపొస్తలుల కార్యములు 2:10; 11:19, 20; 13:1; 18:​24) బైబిల్లో ఆ నివేదికలు తప్పించి ఐగుప్తులో, దాని పరిసర ప్రాంతాల్లో తొలి క్రైస్తవులు చేసిన పని గురించిన నివేదికలు లేవు, అయితే క్రైస్తవ సువార్తికుడు ఫిలిప్పు ఐతియొపీయుడైన నపుంసకునికి సాక్ష్యం ఇవ్వడం గురించి మాత్రం బైబిలు నివేదిస్తోంది.​—⁠అపొస్తలుల కార్యములు 8:​26-39.

పార్తీయ, మాద్య, ఏలాము వరకు విస్తరించిన బబులోను మరో ప్రధాన కేంద్రంగా ఉంది. “టైగ్రీస్‌, యూఫ్రటీస్‌ మైదానంలోని ప్రాంతాలన్నిటిలో అంటే అర్మేనియా నుండి పర్షియా సింధుశాఖ వరకు మాత్రమే కాక, ఈశాన్య దిశలో కాస్పియన్‌ సముద్రం వరకు, తూర్పుదిశన మాద్య వరకు ఉన్న ప్రాంతాలలో కూడా యూదా జనాభా ఉంది” అని ఒక చరిత్రకారుడు చెబుతున్నాడు. వారి జనాభా 8,00,000 లేక అంతకన్నా ఎక్కువే ఉండవచ్చని ఎన్‌సైక్లోపీడియా జుడైకా అంచనావేసింది. బబులోనుకు చెందిన వేలాదిమంది యూదులు వార్షిక పండుగల కోసం యెరూషలేముకు వెళ్ళేవారని మొదటి శతాబ్దపు యూదా చరిత్రకారుడు జోసీఫస్‌ మనకు చెబుతున్నాడు.

బబులోను నుండి యెరూషలేముకు వచ్చినవారిలో కొందరు సా.శ. 33 పెంతెకొస్తునాడు బాప్తిస్మం తీసుకున్నారా? ఆ విషయం మనకు తెలియదు, అయితే ఆ రోజున అపొస్తలుడైన పేతురు చెప్పినది విన్నవారిలో మెసొపొతమియకు చెందినవారు ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 2:⁠9) అపొస్తలుడైన పేతురు దాదాపు సా.శ. 62-64 మధ్య కాలంలో బబులోనులో ఉన్నాడని మనకు తెలుసు. ఆయన అక్కడ ఉన్నప్పుడు తన మొదటి పత్రికను వ్రాశాడు, ఆయన రెండవ పత్రికను కూడా అక్కడి నుండే వ్రాసి ఉండవచ్చు. (1 పేతురు 5:​13) గలతీయులకు వ్రాసిన పత్రికలో పేర్కొనబడిన సమావేశంలో, బబులోను, దానిలో ఉన్న యూదుల అధిక జనాభా, పేతురు, యోహాను, యాకోబులకు నియమించబడిన క్షేత్రంలో భాగంగా పరిగణించబడినట్లు తెలుస్తోంది.

యెరూషలేము సంఘం, పాలస్తీనా వెలుపల నివసిస్తున్న యూదులు

క్షేత్రాల గురించి పేర్కొనబడిన కూటానికి యాకోబు కూడా హాజరయ్యాడు, ఆయన యెరూషలేము సంఘంలో పైవిచారణకర్తగా పనిచేశాడు. (అపొస్తలుల కార్యములు 12:12, 17; 15:13; గలతీయులు 1:​18, 19) పాలస్తీనా వెలుపల నివసిస్తున్న యూదులు సా.శ. 33 పెంతెకొస్తునాడు యెరూషలేములో ఉండి సువార్తకు ప్రతిస్పందించి, బాప్తిస్మం తీసుకోవడాన్ని ఆయన ప్రత్యక్షంగా చూశాడు.​—⁠అపొస్తలుల కార్యములు 1:14; 2:​1, 41.

అప్పుడూ, ఆ తర్వాతా వేలాదిమంది యూదులు వార్షిక పండుగల కోసం యెరూషలేముకు వచ్చేవారు. ఆ పట్టణం క్రిక్కిరిసిపోయేది, సందర్శకులు పొరుగున ఉన్న పల్లెల్లో గానీ గుడారాల్లో గానీ బస చేయాల్సివచ్చేది. ఆ సమయంలో, యాత్రికులు, తమ స్నేహితులను కలుసుకోవడమే కాక ఆరాధించడానికి, బలులు అర్పించడానికి, తోరహ్‌ను అధ్యయనం చేయడానికి ఆలయంలోకి ప్రవేశించేవారని కూడా ఎన్‌సైక్లోపీడియా జుడైకా వివరిస్తోంది.

యాకోబు, యెరూషలేము సంఘంలోని ఇతర సభ్యులు, పాలస్తీనా వెలుపల నివసిస్తున్న యూదులకు సాక్ష్యమివ్వడానికి ఆ అవకాశాలను ఖచ్చితంగా ఉపయోగించుకొని ఉంటారు. స్తెఫను మరణం కారణంగా “యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగిన” సమయంలో అపొస్తలులు సాక్ష్యపు పనిని ఎంతో జాగ్రత్తగా చేసి ఉండవచ్చు. (అపొస్తలుల కార్యములు 8:⁠1) ఆ ఘటనకు ముందు, ఆ తర్వాత, ప్రకటించే విషయంలో ఆ క్రైస్తవులు చూపించిన ఉత్సాహం కారణంగా సంఘం అంతకంతకూ అభివృద్ధి చెందిందని వృత్తాంతం సూచిస్తోంది.​—⁠అపొస్తలుల కార్యములు 5:42; 8:4; 9:31.

వారి అనుభవాల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

యూదులు ఎక్కడ నివసిస్తుంటే అక్కడ వారిని కలుసుకోవడానికి తొలి క్రైస్తవులు యథార్థంగా కృషి చేశారు. అదే సమయంలో పౌలు, ఇతరులు యూరప్‌ క్షేత్రంలోని అన్యులను కలుసుకోవడానికి ప్రయత్నించారు. “సమస్త జనులను” శిష్యులను చేయమని యేసు తన శిష్యులను విడిచి వెళ్తున్నప్పుడు ఇచ్చిన ఆజ్ఞను వారు పాటించారు.​—⁠మత్తయి 28:19, 20.

యెహోవా ఆత్మ మద్దతు పొందడానికి క్రమమైన పద్ధతిలో ప్రకటించడం ప్రాముఖ్యమని మనం వారి ఉదాహరణ నుండి నేర్చుకోవచ్చు. దేవుని వాక్యంపట్ల గౌరవం ఉన్న వారిని కలుసుకోవడంలోని ప్రయోజనాలను, ప్రత్యేకంగా యెహోవాసాక్షులు చాలా తక్కువగా ఉన్న క్షేత్రాలలో అలాంటివారిని కలుసుకోవడంలోని ప్రయోజనాలను కూడా మనం గ్రహించవచ్చు. మీ సంఘానికి నియమించబడిన క్షేత్రంలోని కొన్ని ప్రాంతాలు ఇతర ప్రాంతాలకన్నా ఫలవంతంగా ఉన్నాయా? ఆ ప్రాంతాలను తరచూ పూర్తి చేయడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో జరిగే బహిరంగ కార్యక్రమాలేవైనా అనియత సాక్ష్యం, వీధి సాక్ష్యం ఇచ్చేందుకు ప్రత్యేక కృషి చేయడానికి అనువుగా ఉన్నాయా?

తొలి క్రైస్తవుల గురించి బైబిల్లో చదవడం మాత్రమే కాక, కొన్ని చారిత్రక, భౌగోళిక వివరాలను తెలుసుకోవడం ద్వారా మనం ప్రయోజనం పొందుతాం. మన అవగాహనను పెంచుకోవడానికి మనం ఉపయోగించగల ఒక సాధనం, అనేక మ్యాప్‌లు, చిత్రాలు ఉన్న ‘మంచి దేశమును చూడండి’ అనే బ్రోషుర్‌.

[అధస్సూచీలు]

^ పేరా 2 ఈ సమావేశం, మొదటి శతాబ్దపు పరిపాలక సభ సున్నతి గురించి చర్చించిన సమయంలో గానీ ఆ చర్చకు సంబంధించి గానీ నిర్వహించబడి ఉండవచ్చు.​—⁠అపొస్తలుల కార్యములు 15:​6-29.

^ పేరా 13 ఈ ఆర్టికల్‌ పౌలు యూదులకు సాక్ష్యమివ్వడం అనే విషయం మీద మాత్రమే దృష్టిసారిస్తుంది కానీ ‘అన్యజనులకు అపొస్తలునిగా’ ఆయన కార్యకలాపాల మీద కాదు.​—⁠రోమీయులు 11:​14.

[14వ పేజీలోని చార్టు]

పాలస్తీనా వెలుపల నివసిస్తున్న యూదులపట్ల అపొస్తలుడైన పౌలు చూపించిన శ్రద్ధ

సా.శ. 49లో యెరూషలేములో సమావేశం జరగక ముందు

అపొస్తలుల కార్యములు 9:19, 20 దమస్కు​—‘ఆయన సమాజమందిరములలో ప్రకటించుచు వచ్చెను’

అపొస్తలుల కార్యములు 9:⁠28 యెరూషలేము​—‘గ్రీకు భాష మాట్లాడే యూదులతో మాటలాడడం’

అపొస్తలుల కార్యములు 13:5 సలమీ, కుప్ర​—‘యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించడం’

అపొస్తలుల కార్యములు 13:​14 పిసిదియలో ఉన్న అంతియొకయ​—‘సమాజమందిరములోనికి వెళ్ళడం’

అపొస్తలుల కార్యములు 14:⁠1 ఈకొనియ​—‘యూదుల సమాజమందిరములో ప్రవేశించారు’

సా.శ. 49లో యెరూషలేములో సమావేశం జరిగిన తర్వాత

అపొస్తలుల కార్యములు 16:​14 ఫిలిప్పీ​—“లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ”

అపొస్తలుల కార్యములు 17:1 థెస్సలొనీక ​—“యూదుల సమాజ మందిరము”

అపొస్తలుల కార్యములు 17:​10 బెరయ​—“యూదుల సమాజ మందిరము”

అపొస్తలుల కార్యములు 17:​17 ఏథెన్సు​—“సమాజమందిరములలో యూదులతో . . . తర్కించుచు వచ్చెను”

అపొస్తలుల కార్యములు 18:⁠4 కొరింథు​—“సమాజమందిరములో తర్కించుచు . . . నుండెను”

అపొస్తలుల కార్యములు 18:​19 ఎఫెసు​—“సమాజమందిరములో ప్రవేశించి, యూదులతో తర్కించుచుండెను”

అపొస్తలుల కార్యములు 19:8 ఎఫెసు​—“సమాజమందిరములోనికి వెళ్లి . . . ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను”

అపొస్తలుల కార్యములు 28:​17 రోమా​—“యూదులలో ముఖ్యులైనవారిని . . . పిలిపించెను”

[15వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

సా.శ. 33 పెంతెకొస్తునాడు సువార్త విన్నవారు వివిధ ప్రాంతాల నుండి వచ్చారు

ఇల్లూరికు

ఇటలీ

రోమా

మాసిదోనియ

గ్రీసు

ఏథెన్సు

క్రేతు

కురేనే

లిబియ

బితూనియ

గలతీయ

ఆసియా

ఫ్రుగియ

పంఫూలియా

కుప్ర

ఐగుప్తు

ఇతియోపియా

పొంతు

కప్పదొకియ

కిలికియ

మెసొపొతమియ

సిరియా

సమరయ

యెరూషలేము

యూదయ

మాద్య

బబులోను

ఏలాము

అరేబియా

పార్తీయ

[సముద్రాలు]

మధ్యధరా సముద్రం

నల్ల సముద్రం

ఎర్ర సముద్రం

పర్షియా సింధుశాఖ