కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మిమ్మల్ని ఎంతమాత్రం విడిచిపెట్టడు

యెహోవా మిమ్మల్ని ఎంతమాత్రం విడిచిపెట్టడు

యెహోవా మిమ్మల్ని ఎంతమాత్రం విడిచిపెట్టడు

యూదయలోని క్రైస్తవులు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవడమే కాక, తమ చుట్టూ ఉన్న ప్రజల ఐశ్వర్యాసక్తితో కూడిన దృక్పథంతో కూడా పోరాడాల్సివచ్చింది. అపొస్తలుడైన పౌలు, వారిని ప్రోత్సహించడానికి, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ముందు యెహోవా ఆ జనాంగానికి చెప్పిన మాటలను ఉటంకించాడు. పౌలు ఇలా వ్రాశాడు: “నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను.” (హెబ్రీయులు 13:5; ద్వితీయోపదేశకాండము 31:⁠6) ఆ వాగ్దానం మొదటి శతాబ్దపు హెబ్రీ క్రైస్తవులను ఖచ్చితంగా బలపరిచింది.

“అపాయకరమైన కాలములలో” జీవిస్తుండడంవల్ల వచ్చే చింతలను ఎదుర్కోవడానికి ఆ వాగ్దానం మనల్ని కూడా బలపరచాలి. (2 తిమోతి 3:⁠1) మనం యెహోవా మీద నమ్మకంతో ఉంటూ, దానికి అనుగుణంగా ప్రవర్తించినట్లయితే ఆయన మనల్ని అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆదుకుంటాడు. యెహోవా ఈ వాగ్దానాన్ని ఎలా నెరవేరుస్తాడో గ్రహించడానికి, ఒక వ్యక్తి తన జీవనోపాధిని అకస్మాత్తుగా కోల్పోవడం గురించిన ఒక ఉదాహరణను మనం పరిశీలిద్దాం.

ఊహించని పరిస్థితులను ఎదుర్కోవడం

ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఒక పోలిష్‌ పత్రిక ప్రకారం, నిరుద్యోగం “అతి కష్టమైన సాంఘిక, ఆర్థిక సమస్యల్లో ఒకటిగా” పరిగణించబడుతోంది. పారిశ్రామిక దేశాలు కూడా ఈ సమస్యలకు అతీతమేమీ కావు. ఉదాహరణకు, ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ సభ్య దేశాల్లో కూడా 2004 కల్లా నిరుద్యోగులు “3.2 కోట్లకన్నా ఎక్కువమందే ఉన్నారు, అది 1930 లలో సంభవించిన ఆర్థిక మాంద్యం కన్నా ఎక్కువ స్థాయికి చేరుకుంది.” పోలాండ్‌లోని సెంట్రల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌, డిసెంబరు 2003 నాటికి 30 లక్షలమంది నిరుద్యోగులు ఉన్నారని పేర్కొంది, అంటే “ఉద్యోగం చేసే వయస్కులలో 18 శాతం మంది” నిరుద్యోగులే. దక్షిణాఫ్రికాలోని నల్లజాతి ఆఫ్రికన్ల జనాభాలో నిరుద్యోగుల శాతం 2002లో 47.8కి చేరిందని ఒక సమాచార మూలం చెప్పింది!

అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం, ఊహించని విధంగా ఉద్యోగం నుండి తొలగించబడడం వంటివి చాలామందికి నిజమైన ముప్పులుగా ఉన్నాయి, అలాంటి ముప్పులు యెహోవా సేవకులు కూడా ఎదుర్కొంటున్నారు. “కాలవశముచేతను, అనూహ్యంగాను” జరిగే ఘటనలు ఎవరికైనా ఎదురవుతాయి. (ప్రసంగి 9:11, NW) కీర్తనకర్త దావీదు పలికినట్లే మనమూ ఇలా అనవచ్చు: “నా హృదయవేదనలు అతివిస్తారములు.” (కీర్తన 25:​17) అలాంటి ప్రతికూల పరిస్థితులను మీరు ఎదుర్కోగలరా? ఆ పరిస్థితులు మీ భావోద్రేక, ఆధ్యాత్మిక, భౌతిక సంక్షేమాన్ని ప్రభావితం చేయవచ్చు. మీరు ఉద్యోగం కోల్పోతే మళ్ళీ మీ మునుపటి స్థితిలోకి రాగలరా?

భావోద్రేక ఒత్తిళ్ళను ఎదుర్కోవడం

మగవారే సంప్రదాయ కుటుంబ పోషకులుగా పరిగణించబడతారు కాబట్టి, “ఉద్యోగం కోల్పోతే వారే ఎక్కువగా బాధపడతారు” అని మనస్తత్త్వ శాస్త్రజ్ఞుడు యనుష్‌ యీట్జిన్‌స్కి వివరిస్తున్నాడు. ఉద్యోగం కోల్పోవడంవల్ల మగవారి “భావోద్వేగాలు తీవ్రమైన మార్పులకు” గురికావచ్చు, కోపం రావచ్చు, అలాగే జీవితంలో తాను ఎదుర్కొంటున్న పరిస్థితి అనివార్యమైనదనే నిరాశ కలగవచ్చు. ఉద్యోగం కోల్పోయిన ఒక తండ్రి తన ఆత్మగౌరవాన్ని కోల్పోయి “తన కుటుంబంతో పోట్లాడడం” ప్రారంభించవచ్చు.

ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఆడమ్‌, తాను ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు ఎలా భావించాడో వివరిస్తున్నాడు: “నేను ఊరకనే కలవరపడేవాణ్ణి; ప్రతీ విషయం నన్ను విసిగించేది. నా పని గురించి, నా పిల్లలనూ, ఊహించని విధంగా నాలాగే ఉద్యోగం కోల్పోయిన నా భార్యనూ ఎలా పోషించాలనే విషయాల గురించి రాత్రుళ్ళు కలలు కూడా వచ్చేవి.” ఒక పాప ఉన్న వివాహ దంపతులైన రిషర్డ్‌, మారియోలాలు తమ ఆదాయ ఆధారాన్ని కోల్పోయిన సమయానికి వారు పెద్ద మొత్తంలో బ్యాంకు రుణం కట్టవలసి ఉంది. భార్య ఇలా చెబుతోంది: “నేను తరచూ కలవరపడేదాన్ని, ఆ రుణం తీసుకోవడం పెద్ద తప్పిదమని నా మనస్సాక్షి చెప్పడం మొదలుపెట్టింది. తప్పంతా నాదే అని నేను అనుకోవడం మొదలుపెట్టాను.” అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనం త్వరగా కోపపడవచ్చు, వ్యాకులపడవచ్చు లేక తీవ్ర బాధకు గురికావచ్చు, మన భావోద్రేకాలు మనల్ని ముంచెత్తవచ్చు. అయితే మనం, మనలో ఏర్పడే ప్రతికూల భావాలను ఎలా నియంత్రించుకోవచ్చు?

ఆశాభావ వైఖరిని ఎలా కాపాడుకోవాలి అనే విషయం గురించి బైబిలు సమర్థమైన సలహా ఇస్తోంది. “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును” అని పౌలు సలహా ఇచ్చాడు. (ఫిలిప్పీయులు 4:​6, 7) యెహోవాను ప్రార్థనలో సమీపించడంవల్ల మనకు “దేవుని సమాధానము” లభిస్తుంది, అంటే ఆయన మీద విశ్వాసం ఆధారంగా ప్రశాంత మనస్సు లభిస్తుంది. ఆడమ్‌ భార్య ఈరెనా ఇలా చెబుతోంది: “మా ప్రార్థనలో మేము మా పరిస్థితి గురించి, మా జీవితాన్ని ఇంకా నిరాడంబరంగా ఎలా చేసుకుంటాము అనే విషయం గురించి యెహోవాకు చెప్పాం. సాధారణంగా అతి త్వరగా కలవరపడే మావారు, మా సమస్యకు పరిష్కారం తప్పక లభిస్తుందని భావించడం మొదలుపెట్టారు.”

మీరు ఊహించని విధంగా ఉద్యోగం కోల్పోయినట్లయితే, కొండమీది ప్రసంగంలో యేసుక్రీస్తు ఇచ్చిన సలహాను అన్వయించుకొనే అవకాశం మీకు దొరుకుతుంది: “ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి. . . . కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:​25, 33) రిషర్డ్‌, మారియోలాలు తమ భావోద్రేకాలతో వ్యవహరించడానికి ఈ సలహాను అన్వయించుకున్నారు. “నా భర్త నన్ను ఎప్పుడూ ఓదారుస్తూ యెహోవా మనల్ని విడిచిపెట్టడు అని నొక్కిచెప్పేవాడు” అని మారియోలా గుర్తుచేసుకుంటోంది. ఆమె భర్త కూడా ఇలా అన్నాడు: “మేము కలిసి పట్టుదలగా ప్రార్థనలు చేయడం ద్వారా మేము దేవునికి సన్నిహితులమయ్యాం, ఒకరికొకరం సన్నిహితులమయ్యాం, అది మాకు అవసరమైన ఓదార్పునిచ్చింది.”

మన భావోద్రేకాలతో వ్యవహరించడానికి దేవుని పరిశుద్ధాత్మ కూడా మనకు సహాయం చేస్తుంది. పరిశుద్ధాత్మ మనలో ఆశానిగ్రహాన్ని కలిగించగలదు, మనం ప్రశాంతంగా ఉండడానికి అది సహాయం చేయగలదు. (గలతీయులు 5:​22, 23) అయితే అదంత సులభం కాకపోవచ్చు, కానీ సాధ్యమయ్యేదే, ఎందుకంటే “పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో [నిశ్చయముగా] అనుగ్రహించును” అని యేసు వాగ్దానం చేశాడు.​—⁠లూకా 11:13; 1 యోహాను 5:​14, 15.

మీ ఆధ్యాత్మిక అవసరాలను ఉపేక్షించకండి

ఊహించని విధంగా ఉద్యోగం కోల్పోతే ఎంతో సమతుల్యంగా ఉండే క్రైస్తవుడు కూడా మొదట్లో చింతించవచ్చు, అయితే మనం మన ఆధ్యాత్మిక అవసరాలను ఉపేక్షించకూడదు. ఉదాహరణకు, 40 సంవత్సరాల మోషేనే తీసుకోండి, ఆయన రాజకుటుంబంలో తన స్థానాన్ని కోల్పోయి, ఐగుప్తీయులు అసహ్యించుకొనే కాపరి పని చేయాల్సి వచ్చినప్పుడు ఆయన జీవితమే పూర్తిగా మారిపోయింది. (ఆదికాండము 46:​34) మోషే తన క్రొత్త పరిస్థితులతో సర్దుకుపోవాల్సి వచ్చింది. ఆ తర్వాతి 40 సంవత్సరాలు, ముందున్న క్రొత్త పనులకు యెహోవా తనను మలచడానికి, సిద్ధం చేయడానికి ఆయన అనుమతించాడు. (నిర్గమకాండము 2:11-22; అపొస్తలుల కార్యములు 7:29, 30; హెబ్రీయులు 11:​24-26) మోషే కష్టాలను ఎదుర్కొంటున్నా ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి నిలిపాడు, యెహోవా శిక్షణను అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. ప్రతికూల పరిస్థితులు మన ఆధ్యాత్మిక విలువలను మరుగునపడేసేందుకు ఎన్నడూ అనుమతించకండి!

అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం మనల్ని కలవరపెట్టవచ్చు, అయినా యెహోవా దేవునితో, ఆయన ప్రజలతో మన బంధాల్ని బలోపేతం చేసుకోవడానికి అది సరైన సమయం. ఇంతకుముందు ప్రస్తావించిన ఆడమ్‌ ఆ విధంగానే భావించాడు. ఆయన ఇలా చెబుతున్నాడు: “నేను, నా భార్య ఉద్యోగాలు కోల్పోయినప్పుడు క్రైస్తవ కూటాలకు హాజరవకూడదనే లేక ప్రకటనా పనిలో మా భాగాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన మాకు ఎప్పుడూ రాలేదు. ఆ దృక్పథం, మేము రేపటి గురించి ఎక్కువగా చింతించకుండా మమ్మల్ని కాపాడింది.” రిషర్డ్‌ కూడా అలాగే భావిస్తున్నాడు: “కూటాలకు, పరిచర్యకు మేము వెళ్ళనట్లయితే మేము మా సమస్యను ఎదుర్కోలేకపోయేవాళ్ళం, చింత మమ్మల్ని హరించివేసేదే. ఇతరులతో చేసే ఆధ్యాత్మిక సంభాషణలు ప్రోత్సాహాన్నిస్తాయి, అవి మన అవసరాలవైపు కాక, వారి అవసరాలవైపు మన దృష్టిని మళ్ళిస్తాయి.”​—⁠ఫిలిప్పీయులు 2:⁠4.

అవును, ఉద్యోగం గురించి చింతించే బదులు, మీకు దొరికిన అదనపు సమయాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాలకు, వ్యక్తిగత అధ్యయనానికి, సంఘ కార్యకలాపాలలో భాగం వహించడానికి, లేక మీ పరిచర్యను విస్తృతం చేసుకోవడానికి ఉపయోగించుకునేందుకు ప్రయత్నించండి. అలా చేస్తే మీరు నిరుద్యోగులుగా జీవించే బదులు “ప్రభువు కార్యాభివృద్ధియందు” ఆసక్తికలిగి ఉంటారు, అది మీకూ, మీరు ప్రకటించే రాజ్య సందేశానికి ప్రతిస్పందించే యథార్థవంతులైన వ్యక్తులకూ ఆనందాన్నిస్తుంది.​—⁠1 కొరింథీయులు 15:​58.

మీ కుటుంబాన్ని పోషించడం

అయితే ఆధ్యాత్మిక పోషణ ఖాళీ కడుపును నింపదు. మనం ఈ క్రింది సూత్రాన్ని గుర్తుంచుకోవాలి: “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.” (1 తిమోతి 5:⁠8) “సంఘంలోని సహోదరులు మన భౌతికావసరాలను తీర్చడానికి ఇష్టపడుతున్నా, ఉద్యోగం కోసం వెదికే బాధ్యత క్రైస్తవులముగా మనకు ఉంది” అని ఆడమ్‌ ఒప్పుకుంటున్నాడు. మనం యెహోవా మీద, ఆయన ప్రజల మీద ఆధారపడవచ్చు, అయితే ఉద్యోగం సంపాదించుకోవడంలో మనమే చొరవ తీసుకోవాలనేది ఎప్పుడూ మరచిపోకూడదు.

మీరు ఎలాంటి చొరవ తీసుకోవచ్చు? “దేవుడే చర్యతీసుకుంటాడని, ఏదో అద్భుతం సంభవిస్తుందని చేతులు కట్టుకొని వేచివుండొద్దు, మీరు పని కోసం వెదుకుతున్నట్లయితే యెహోవాసాక్షులుగా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి సంకోచించకండి. యజమానులు సాధారణంగా దానికి విలువ ఇస్తారు” అని ఆడమ్‌ వివరిస్తున్నాడు. రిషర్డ్‌ ఈ సలహా ఇస్తున్నాడు: “మీకు తెలిసినవారిని ఉద్యోగావకాశాల గురించి అడగండి, ఉపాధి కల్పించే సంస్థల దగ్గర వాకబు చేస్తుండండి, ‘వికలాంగ వ్యక్తిని చూసుకోవడానికి ఒక స్త్రీ కావాలి’ లేక ‘తాత్కాలిక ఉద్యోగం: స్ట్రాబెర్రీ పండ్లను ఏరాలి’ వంటి ప్రకటనలను చదవండి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండండి! మీరు అల్పమైన పని చేయాల్సివచ్చినా లేక మీ అభిలాషలను నెరవేర్చలేని పని చేయాల్సివచ్చినా ఒక నిర్దిష్టమైన ఉద్యోగమే కావాలని కాచుకొని ఉండకండి.”

అవును, ‘యెహోవా [మీకు] సహాయుడు.’ ఆయన ‘మిమ్మల్ని ఏమాత్రం విడువడు, మిమ్మల్ని ఎన్నడు ఎడబాయడు.’ (హెబ్రీయులు 13:5, 6) మీరు ఎక్కువగా కలత చెందనవసరం లేదు. కీర్తనకర్త దావీదు ఇలా వ్రాశాడు: “నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును.” (కీర్తన 37:⁠5) ‘మన మార్గాన్ని యెహోవాకు అప్పగించడం’ అంటే పరిస్థితులు మనకు అనుకూలంగా కనిపించకపోయినా మనం ఆయన మీద ఆధారపడడం, ఆయన మార్గంలో పనులను చేయడం అని అర్థం.

ఆడమ్‌, ఐరీనాలు కిటికీలు, మెట్లు శుభ్రం చేయడం ద్వారా, వస్తువులు కొంటున్నప్పుడు పొదుపు పాటించడం ద్వారా తమను తాము పోషించుకోగలిగారు. వారు ఉపాధి కల్పించే సంస్థలకు కూడా క్రమంగా వెళ్ళేవారు. “సహాయం అవసరమైనప్పుడే ఖచ్చితంగా మాకు ఎప్పుడూ సహాయం అందేది” అని ఐరీనా అంటోంది. ఆమె భర్త ఇంకా ఇలా చెబుతున్నాడు: “మేము ప్రార్థించిన విషయాలు దేవుని చిత్తానికి అనుగుణంగా లేవని మా అనుభవం ద్వారా తెలుసుకున్నాం. మా అవగాహన ప్రకారంగా చర్య తీసుకోకుండా ఆయన జ్ఞానం మీద ఆధారపడాలని అది మాకు నేర్పించింది. దేవుడిచ్చే పరిష్కారం కోసం ప్రశాంతంగా వేచివుండడం మంచిది.”​—⁠యాకోబు 1:⁠4.

రిషర్డ్‌, మారియోలాలు వివిధ చిన్నచిన్న ఉద్యోగాలు చేశారు, అయితే వారు అదే సమయంలో అవసరం అధికంగా ఉన్న క్షేత్రాలలో సాక్ష్యపు పనిలో నిమగ్నమయ్యారు. “తినడానికి ఏమీ మిగలని సమయాల్లోనే మాకు అవసరమైన పనులు దొరికాయి, మా దైవపరిపాలనా బాధ్యతలకు ఆటంకం కలిగించే మంచి జీతం వచ్చే ఉద్యోగాలను మేము తిరస్కరించాం. యెహోవా కోసం కనిపెట్టుకొని ఉండడానికి ఇష్టపడ్డాం” అని రిషర్డ్‌ చెబుతున్నాడు. యెహోవా పరిస్థితులను తమకు అనుకూలంగా మలిచాడని, అందుకే తాము ఒక ఫ్లాట్‌ను తక్కువ ధరకు అద్దెకు తీసుకోగలిగామని, చివరకు రిషర్డ్‌కు ఉద్యోగం దొరికిందని వారు నమ్ముతున్నారు.

జీవనోపాధిని కోల్పోవడం ఒక వ్యక్తికి ఎంతో క్షోభను కలిగించగలదు, అయితే దాన్ని, యెహోవా మిమ్మల్ని ఎన్నటికీ విడువడు అనే విషయాన్ని వ్యక్తిగతంగా రుచి చూసేందుకు లభించిన అవకాశంగా ఎందుకు దృష్టించకూడదు? యెహోవా మీపట్ల శ్రద్ధ వహిస్తాడు. (1 పేతురు 5:​6, 7) ఆయన యెషయా ప్రవక్త ద్వారా ఇలా వాగ్దానం చేశాడు: “నీకు తోడైయున్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై యున్నాను. దిగులుపడకుము, నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే.” (యెషయా 41:⁠9) ఉద్యోగం కోల్పోవడంలాంటి ఊహించని సంఘటనలు మిమ్మల్ని ఎన్నడూ అశక్తులను చేయనివ్వకండి. మీరు చేయగలిగినదంతా చేసి మిగతా విషయాలు యెహోవాకు వదిలేయండి. యెహోవా కోసం “ఓపికతో” కనిపెట్టుకొని ఉండండి. (విలాపవాక్యములు 3:​26) అలా చేస్తే మీరు గొప్ప ఆశీర్వాదాలు అనుభవిస్తారు.​—⁠యిర్మీయా 17:⁠7.

[9వ పేజీలోని చిత్రం]

సమయాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాలకు వినియోగించండి

[10వ పేజీలోని చిత్రాలు]

పొదుపును పాటించడం నేర్చుకోండి, మీరు ఒక ఉద్యోగం కోసం వెదుకుతున్నట్లయితే ఒక నిర్దిష్టమైన ఉద్యోగమే కావాలని కాచుకొని ఉండకండి