కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అన్యాయం నిండిన లోకం

అన్యాయం నిండిన లోకం

అన్యాయం నిండిన లోకం

మనం అన్యాయం నిండిన లోకంలో జీవిస్తున్నామని మీరు అంగీకరిస్తారా? తప్పకుండా అంగీకరిస్తారు. మనకు ఎలాంటి ప్రతిభా పాటవాలున్నా, మనం జీవితాన్ని ఎంత జ్ఞానయుక్తంగా పథకం వేసుకున్నా, మనకు సంపదగానీ సాఫల్యంగానీ కనీసం ఆహారమైనా దొరుకుతుందన్న హామీ లేదు. పరిస్థితి తరచూ, జ్ఞానవంతుడైన ప్రాచీనకాల సొలొమోను రాజు చెప్పినట్లే ఉంటుంది: “జ్ఞానముగలవారికి అన్నము దొరకదు; బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు; తెలివిగలవారికి అనుగ్రహము దొరకదు.” ఎందుకు? ఎందుకంటే, ద న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌ ప్రకారం, సొలొమోను ఇంకా ఇలా చెబుతున్నాడు: ‘సమయం, అనూహ్య ఘటనలు అందరినీ ప్రభావితం చేస్తాయి.’​—⁠ప్రసంగి 9:⁠11.

“హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు”

అవును, ‘సమయం, అనుహ్య ఘటనలు’ అంటే, అనుకోని సమయంలో అనుకోని చోట ఉండడం, మనం ఎంతో జాగ్రత్తగా వేసుకున్న పథకాలను, మనకు అతిప్రియమైన ఆశలను కూలదోస్తాయి. సొలొమోను చెబుతున్నట్లుగా, “చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పట్టుబడునట్లు” మనకు ‘హఠాత్తుగా చేటు కలుగుతుంది.’ (ప్రసంగి 9:​12) ఉదాహరణకు, తమ కుటుంబాలకు ఆహారం సమకూర్చేందుకు అవిశ్రాంతంగా పొలాలను సాగుచేసే కోట్లాదిమంది, వర్షాలు పడక అనావృష్టితో తమ పంటలు నాశనమైనప్పుడు తమకు కలిగే ‘చేటును’ తప్పించుకోలేరు.

ఇతరులు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు, కానీ ప్రపంచ ప్రజలు “చేటు” కలిగినవారికి చేసే సహాయంలో కూడా తరచూ అన్యాయమే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు, ఇటీవలి ఒక సంవత్సరంలో, కరవును అరికట్టే ప్రయత్నంలో భాగంగా “[ఆఫ్రికా] ఖండమంతటికీ గల్ఫ్‌ యుద్ధానికి కేటాయించబడిన డబ్బులో కేవలం ఒకింట ఐదవవంతు డబ్బు మాత్రమే సహాయభృతిగా అందింది” అని ఒక ప్రముఖ సహాయ సంస్థ తెలియజేస్తోంది. కరవు మూలంగా బాధపడుతున్న ఒక ఖండమంతటికీ సహాయం చేయడానికి వెచ్చించిన డబ్బుకంటే ఐదురెట్లు ఎక్కువ డబ్బును కేవలం యుద్ధం చేయడానికి ఒక దేశం వెచ్చించడం న్యాయంగా ఉందా? చాలామంది వస్తుసంపదలతో వర్ధిల్లుతున్న సమయంలో, భూనివాసుల్లోని ప్రతి నలుగురిలో ఒకరు ఇప్పటికీ పూర్తి దారిద్ర్యంలో మగ్గుతుండడం లేదా ప్రతి సంవత్సరం 40 లక్షలమంది పిల్లలు నివారించదగ్గ జబ్బులతోనే చనిపోతుండడం న్యాయంగా ఉందా? ఎంతమాత్రం లేదు!

‘హఠాత్తుగా చేటు కలగడంలో’ ‘సమయం, అనుహ్య ఘటనల’ కంటే ఇంకా ఎక్కువే ఇమిడి ఉంది. మన అదుపులోలేని బలమైన శక్తులు కూడా మన జీవితాలపై ప్రభావం చూపిస్తూ మనకు జరిగేదాన్ని నిర్దేశిస్తున్నాయి. అలన్యా రిపబ్లిక్‌లోని బెస్లన్‌ ప్రాంతంలో 2004 శరదృతువులో సరిగ్గా అదే జరిగింది, అక్కడ తీవ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య జరిగిన అమానుషమైన పోరాటంలో వందలాదిమంది చనిపోయారు, వారిలో చాలామంది పాఠశాలకు మొదటిరోజు హాజరైన పసిబిడ్డలే. నిజమే ఆ దుర్ఘటనలో ఎవరు చనిపోయారు ఎవరు తప్పించుకున్నారు అనేది ఎక్కువగా అనూహ్యంగానే జరిగింది, కానీ ఆ “చేటు”కు కేవలం మానవ సంఘర్షణే ప్రాథమిక కారణం.

ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుందా?

అన్యాయాల గురించి మాట్లాడినప్పుడు, “జీవితమంటే అలాగే ఉంటుంది. ఎప్పుడూ అలాగే జరుగుతూ వస్తోంది, ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది” అని కొందరంటారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం, బలవంతులు ఎప్పుడూ బలహీనులను అణచివేస్తారు, గొప్పవారు ఎప్పుడూ బీదవాళ్ళను దోచుకుంటారు. దీనితోపాటు, ‘సమయం, అనూహ్య ఘటనలు’ కలిసి మానవ కుటుంబం ఉనికిలో ఉన్నంతవరకు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయని వారంటారు.

నిజంగా ఇలా జరగవలసిందేనా? తమ సామర్థ్యాలను తెలివిగా, జ్ఞానయుక్తంగా ఉపయోగించుకునేవారు తమ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందడం ఎప్పటికైనా సాధ్యమవుతుందా? అన్యాయం నిండిన లోకంలో శాశ్వతమైన, నిరంతరం నిలిచే మార్పు తీసుకురావడానికి ఎవరైనా ఏదైనా చేయగలరా? దీని గురించి తర్వాతి ఆర్టికల్‌ ఏమి చెబుతుందో పరిశీలించండి.

[2వ పేజీలోని చిత్రసౌజన్యం]

ముఖచిత్రం: పిల్లవాడితో ఒక వ్యక్తి: UN PHOTO 148426/McCurry/Stockbower

[3వ పేజీలోని చిత్రసౌజన్యం]

MAXIM MARMUR/AFP/Getty Images