కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఒక క్రైస్తవుడు ఆయుధాలు ధరించాల్సిన ఉద్యోగంలో చేరినట్లయితే, ఆయన స్వచ్ఛమైన మనస్సాక్షిని కాపాడుకోగలడా?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు తమ కుటుంబాలను పోషించే విషయంలో దేవుడు ఇచ్చిన బాధ్యతను గంభీరంగా తీసుకుంటారు. (1 తిమోతి 5:⁠8) అయితే కొన్ని రకాల ఉద్యోగాలు బైబిలు సూత్రాలకు స్పష్టంగా విరుద్ధమైనవిగా ఉన్నాయి, అలాంటి ఉద్యోగాలు చేయకూడదు. జూదం, రక్త దుర్వినియోగం, పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించడానికి సంబంధించిన ఉద్యోగాలు అదే జాబితాలోకి వస్తాయి. (యెషయా 65:11; అపొస్తలుల కార్యములు 15:29; 2 కొరింథీయులు 7:1; కొలొస్సయులు 3:⁠5) మరికొన్ని రకాల ఉద్యోగాలు బైబిల్లో సూటిగా ఖండించబడకపోయినా, అవి ఆ ఉద్యోగి మనస్సాక్షికి గానీ ఇతరుల మనస్సాక్షికి గానీ వ్యతిరేకంగా పనిచేయవచ్చు.

తుపాకీని లేదా వేరే ఆయుధాన్ని ధరించాల్సిన ఉద్యోగం చేయడం అనేది వ్యక్తిగత నిర్ణయం. అయితే అలాంటి ఉద్యోగం చేసే వ్యక్తి తను ధరించిన ఆయుధాన్ని ఉపయోగించాల్సి వస్తే, అది అతడ్ని రక్తాపరాధానికి గురిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఒక క్రైస్తవుడు, మనుష్యుల ప్రాణాలకు సంబంధించిన పరిస్థితుల్లో వెంటనే నిర్ణయం తీసుకునే బాధ్యత విషయంలో సిద్ధంగా ఉన్నాడో లేదో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించాలి. ఒక వ్యక్తి ఆయుధాన్ని ధరించినప్పుడు దాడులవల్ల లేక ప్రతీకార చర్యలవల్ల గాయపడే లేదా ప్రాణాలు కోల్పోయే అపాయానికి కూడా గురయ్యే అవకాశం ఉంది.

ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం కారణంగా ఇతరులు కూడా ప్రభావితులు కావచ్చు. ఉదాహరణకు, ఒక క్రైస్తవుని ప్రాథమిక బాధ్యత దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం. (మత్తయి 24:​14) జీవనోపాధి కోసం ఆయుధాన్ని ధరించి, మరోపక్క “సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి” అని ఇతరులకు బోధించగలమా? (రోమీయులు 12:​18) పిల్లలు లేదా కుటుంబంలోని ఇతరుల విషయం ఏమిటి? ఇంట్లో చేతి తుపాకీ ఉండడం వారి ప్రాణాలను ప్రమాదంలో ఉంచుతుందా? అంతేకాదు ఈ విషయంలో ఒక వ్యక్తి వైఖరినిబట్టి ఇతరులు అభ్యంతరపడే అవకాశం ఉందా?​—⁠లూకా 17:⁠2.

ఈ “అంత్యదినములలో” చాలామంది ‘క్రూరత్వం, సజ్జనద్వేషం’ ప్రదర్శిస్తున్నారు. (2 తిమోతి 3:​1, 3) ఇది తెలిసి, అలాంటి వ్యక్తులతో పోరాడాల్సిన పరిస్థితుల్లోకి నెట్టగల ఆయుధాలను ధరించాల్సిన ఉద్యోగంలో ఒక వ్యక్తి చేరితే అతను ‘అనింద్యునిగా’ ఉండగలడా? (1 తిమోతి 3:​10) ఏమాత్రం వీలుకాదు. ఆ కారణంగా అలాంటి వ్యక్తికి సంఘం ప్రేమపూర్వకంగా బైబిలు హితవు చెప్పిన తర్వాత కూడా అతను ఆయుధాన్ని ధరించే ఉద్యోగంలోనే కొనసాగితే, సంఘం అతడ్ని ‘నిందారహితునిగా’ పరిగణించదు. (1 తిమోతి 3:2; తీతు 1:​5, 6) కాబట్టి అలాంటి స్త్రీ లేక పురుషుడు సంఘంలోని ప్రత్యేక ఆధిక్యతలలో దేనికీ అర్హులు కారు.

రాజ్య సంబంధ విషయాలకు తమ జీవితంలో మొదటిస్థానమిస్తే, తమ జీవితావసరాల గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం ఉండదని యేసు తన శిష్యులకు హామీ ఇచ్చాడు. (మత్తయి 6:​25, 33) మనం పూర్తిగా యెహోవామీద నమ్మకముంచితే “ఆయనే [మనల్ని] ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.”​—⁠కీర్తన 55:​22.