బధిరులతో వారు సువార్తను పంచుకుంటారు
బధిరులతో వారు సువార్తను పంచుకుంటారు
“వారు మీలో ఆధ్యాత్మికత నింపుతారు!” స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ఉన్న నావాల్‌కార్నేరో వృద్ధాశ్రమపు డైరెక్టర్, తమ ఆశ్రమాన్ని యెహోవాసాక్షులు సందర్శించడం గురించి ఇటీవల అన్న మాటలవి. అలా అనడానికి ఆయనను ఏమి పురికొల్పింది?
రోసాస్ డెల్ కామీనో ఆశ్రమంలో ఉన్న చాలామంది ఆశ్రమవాసులు బధిరులే. అయితే, సాక్షులు స్పానిష్ సంజ్ఞా భాష నేర్చుకోవడానికి కృషి చేశారు కాబట్టి, వారు బధిరులతో సంభాషించగలరు. ఆధ్యాత్మిక విలువలను నేర్చుకోవడానికి ప్రత్యేక సహాయం అవసరమైనవారికి సాక్షులు తమ సమయాన్ని వెచ్చించి ఉచితంగా బోధిస్తున్నందుకు డైరెక్టర్ వారిని ప్రశంసించాడు. ఆయన ఆ ఆశ్రమవాసుల మీద రాజ్య సువార్త ఉపదేశం చూపించిన సానుకూల ప్రభావాన్ని గమనించాడు. ఆ నివాసులు, ముఖ్యంగా వినికిడి లోపం లేక దృష్టి లోపం ఉన్నవారు కూడా సాక్షుల సందర్శనాలను ఎంతో విలువైనవిగా పరిగణించారు.
చెవిటితనం, అంధత్వం రెండూ ఉన్న యూలోహీయో అనే ఒక నివాసి, యెహోవాసాక్షులతో ఇప్పుడు బైబిలు అధ్యయనం చేస్తున్నాడు. ఒకరోజు బైబిలు అధ్యయనం జరుగుతున్న సమయంలో, ఒక వృద్ధుడు వచ్చి సాక్షి చేతికి ఒక కవితను ఇచ్చాడు. అది అక్కడి నివాసులు తమ కృతజ్ఞతను తెలుపుతూ అల్లిన కవిత. ఆ కవిత పేరు “ఒక సాక్షిగా ఉండడం.” సంక్షిప్తంగా అందులో ఇలా ఉంది: “వారు సంతృప్తికరమైన, చక్కని క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని జీవిస్తారు. వారు యెహోవా నుండి ఆనందభరితమైన జ్ఞానాన్ని పొందుతారు. వారు పదేపదే ఇంటింటికి వెళ్తారు, ఎందుకంటే వారికి యెహోవా మీద నమ్మకం ఉంది.”
అవును, ఖచ్చితంగా యెహోవా మీది ఆ నమ్మకమే ప్రపంచవ్యాప్తంగా అనేకమంది సాక్షులను తమ దేశంలో ఉన్న చెవిటివారి కోసం సంజ్ఞా భాష నేర్చుకోవడానికి పురికొల్పింది. ఆ విధంగా వారు బైబిల్లో లభించే ప్రోత్సాహకరమైన నిరీక్షణా సందేశాన్ని బధిరులతో పంచుకుంటారు.