లోకాన్ని ఎవరైనా నిజంగా మార్చగలరా?
లోకాన్ని ఎవరైనా నిజంగా మార్చగలరా?
“పేదవారు తమకు అన్నిటికంటే ముఖ్యంగా శాంతిభద్రతలు కావాలని, తమ జీవితాలను మెరుగుపర్చుకోవడానికి అవకాశాలు కావాలని మాకు చెబుతారు. ధనిక దేశాల, ధనిక కంపెనీల అణచివేసే శక్తి మూలంగా తమ ప్రయత్నాలకు విఘాతం కలగకుండా న్యాయబద్ధమైన జాతీయ, అంతర్జాతీయ విధానాలు కావాలని వారు కోరుకుంటారు.”
పేదప్రజల ఆశలను, ఆకాంక్షలను ఒక అంతర్జాతీయ సహాయ సంస్థ సంచాలకురాలు పైవిధంగా వర్ణించింది. నిజానికి, ఆమె మాటలు దుఃఖాలు, అన్యాయాలు ఎదుర్కొంటున్న లోకంలోని బాధితులందరి ఆకాంక్షను చక్కగా వర్ణిస్తాయి. వారంతా నిజమైన శాంతిభద్రతలుండే లోకం కోసం పరితపిస్తున్నారు. అలాంటి లోకం ఎప్పటికైనా వస్తుందా? అన్యాయమే ఎక్కువగా కనబడుతున్న ఈ లోకాన్ని మార్చే శక్తి సామర్థ్యాలు నిజంగా ఎవరికైనా ఉన్నాయా?
మార్పు కోసం ప్రయత్నాలు
చాలామంది ప్రయత్నించారు. ఉదాహరణకు, 19వ శతాబ్దానికి చెందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే ఒక ఆంగ్ల వనిత రోగులకు పరిశుభ్రమైన, వాత్సల్యపూరితమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పానికి తన జీవితాన్ని అంకితం చేసింది. ఆమె కాలంలో అంటే రోగనిరోధకాలు, క్రిమిసంహారకాలు లేనికాలంలో, వైద్య సంరక్షణ నేడు మనం ఆశించేదానిలా ఉండేదికాదు. “అప్పట్లో నర్సులు విద్యలేనివారు, అపరిశుభ్రంగా ఉండేవారు, త్రాగుబోతుతనానికి అనైతికతకు పేరుగాంచారు” అని ఒక పుస్తకం తెలియజేస్తోంది. నర్సుల ప్రపంచాన్ని మార్చాలని చేసిన ప్రయత్నాల్లో ఫ్లోరెన్స్ నైటింగేల్ విజయం సాధించిందా? సాధించింది. అలాగే శ్రద్ధగల, నిస్వార్థపరులైన లెక్కలేనంతమంది ప్రజలు సాహిత్యం, విద్య, వైద్యం, గృహనిర్మాణం, ఆహారం వంటి జీవితంలోని అనేక రంగాల్లో విశేషమైన విజయం సాధించారు. ఫలితంగా, అననుకూల పరిస్థితుల్లో ఉన్న కోట్లాదిమంది ప్రజల జీవన ప్రమాణాల్లో విశేషమైన అభివృద్ధి జరిగింది.
అయినప్పటికీ, మనం ఈ కఠిన సత్యాన్ని కాదనలేము: ఇప్పటికీ కోట్లాదిమంది యుద్ధం, నేరం, వ్యాధి, కరవు, ఇతర విపత్కరమైన పరిస్థితుల మూలంగా బాధననుభవిస్తున్నారు. “పేదరికం మూలంగా ప్రతీరోజు 30,000 మంది మరణిస్తున్నారు” అని ఐర్లాండ్ సహాయ సంస్థ కన్సర్న్ చెబుతోంది. శతాబ్దాలుగా అనేక సంస్కరణకర్తల అంశమైన బానిసత్వం కూడా ఇప్పటికీ మనతోనే ఉంది. “నేడు, ట్రాన్సట్లాంటిక్ బానిస వ్యాపారం జరిగిన కాలంలో ఆఫ్రికా నుండి దొంగచాటుగా తరలించబడిన ప్రజలకన్నా ఎక్కువ సంఖ్యలో బానిసలు ఉనికిలో ఉన్నారు” అని డిస్పోసబుల్ పీపుల్—న్యూ స్లేవరీ ఇన్ ద గ్లోబల్ ఎకానమీ చెబుతోంది.
సంపూర్ణమైన, నిరంతరం నిలిచే మార్పు తీసుకురావాలన్న ప్రజల ప్రయత్నాలకు అడ్డుతగిలిందేమిటి? కేవలం ధనికుల, శక్తిమంతుల అణచివేసే ఆధిపత్యమేనా లేక మరింకేమైనా ఉందా?
మార్పుకు అడ్డంకులు
దేవుని వాక్యం ప్రకారం, నిజంగా న్యాయమైన మార్పు తీసుకురావాలని మానవుడు చేస్తున్న ప్రయత్నాలకు అతిపెద్ద అడ్డంకు అపవాదియైన సాతాను. “లోకమంతయు దుష్టుని యందున్నది” అని అపొస్తలుడైన యోహాను మనకు చెబుతున్నాడు. (1 యోహాను 5:19) వాస్తవానికి, ఇప్పుడు సాతాను “సర్వలోకమును మోస పుచ్చుచు[న్నాడు].” (ప్రకటన 12:9) అతని దుష్ట ప్రభావం తొలగించబడేంతవరకు దుష్టత్వానికి, అన్యాయానికి బలయ్యేవారు ఉంటారు. ఈ విషాదకర పరిస్థితికి కారణమేమిటి?
మానవ కుటుంబం కోసం అంటే “చాలమంచిదిగ” ఉన్న లోకం కోసం, పరిపూర్ణమైన పరదైసు గృహంగా ఉండేలా రూపొందించబడిన భూమి మన ఆది తల్లిదండ్రులైన ఆదాముహవ్వలకు బహుమతిగా ఇవ్వబడింది. (ఆదికాండము 1:31) కానీ పరిస్థితులెలా మారాయి? సాతానే మార్చాడు. స్త్రీ పురుషులు అనుసరించవలసిన కట్టడలను ఇచ్చేందుకు దేవునికున్న హక్కును అతడు సవాలు చేశాడు. దేవుని పరిపాలనా విధానం న్యాయమైనది కాదని అతడు పరోక్షంగా తెలియజేశాడు. మంచి చెడులు తమకు తాముగా నిర్ణయించుకోగలిగేలా స్వేచ్ఛా విధానాన్ని ఎంచుకోమని అతడు ఆదాముహవ్వలను ప్రేరేపించాడు. (ఆదికాండము 3:1-6) దానితో న్యాయమైన లోకాన్ని తీసుకురావాలన్న మానవుని ప్రయత్నాలకు రెండవ అడ్డంకు ఏర్పడింది, అదే పాపం, అపరిపూర్ణత.—రోమీయులు 5:12.
ఇదంతా ఎందుకు అనుమతించడం?
‘మరి పాపం, అపరిపూర్ణత వృద్ధి చెందడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? ఆయన తన అపరిమితమైన శక్తిని ఉపయోగించి తిరుగుబాటుదారులను నిర్మూలించి అంతా మళ్ళీ మొదలుపెట్టి ఉండవచ్చుకదా?’ అని కొందరు అడగవచ్చు. అది చాలా సుళువైన
పరిష్కారంలాగే అనిపిస్తుంది. అయితే, అధికార వినియోగం గంభీరమైన ప్రశ్నలను లేవదీస్తుంది. లోకంలోని పేదలు, అణచివేయబడినవారు అనుభవిస్తున్న ముఖ్య బాధల్లో ఒకటి అధికార దుర్వినియోగం అన్నది నిజం కాదా? ఎవరైనా నిరంకుశ పాలకుడు తన సిద్ధాంతాలతో ఏకీభవించని వారిని నిర్మూలించడానికి తన అధికారాన్ని ఉపయోగిస్తే అది యథార్థ హృదయుల మనసుల్లో సందేహాలను రేకెత్తించదా?దేవుడు తాను అధికార దుర్వినియోగం చేసే నిరంకుశ పాలకుణ్ణి కాదని యథార్థ హృదయులకు హామీ ఇచ్చేందుకే దైవిక కట్టడలు, సూత్రాలు లేకుండా స్వతంత్రంగా చర్య తీసుకోవడానికి సాతానును, మానవ తిరుగుబాటుదారులను అనుమతించాడు, అయితే అది కేవలం పరిమిత సమయం వరకే. దేవుని పరిపాలనా విధానం మాత్రమే సరైనదని కాలం నిరూపిస్తుంది. ఆయన మనపై విధించే ఏ విధమైన పరిమితులైనా మన మంచి కోసమేనని అది నిరూపిస్తుంది. వాస్తవానికి, దేవుని పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటువల్ల కలిగిన దుఃఖకరమైన ఫలితాలు అది నిజమని ఇప్పటికే నిరూపించాయి. ఆ ఫలితాలు, దేవుడు తాను కోరుకున్నప్పుడు దుష్టత్వాన్నంతటినీ నిర్మూలించడానికి తన గొప్ప అధికారాన్ని ఉపయోగించడం పూర్తిగా న్యాయమేనని నిరూపించాయి. త్వరలోనే ఆయనలా చర్య తీసుకుంటాడు.—ఆదికాండము 18:23-32; ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తన 37:9, 10, 38.
దేవుడు చర్య తీసుకునేలోపు, మనం “ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచు” అన్యాయంతో నిండిన లోకంలో చిక్కుబడే ఉంటాము. (రోమీయులు 8:22) మనం పరిస్థితులను మార్చేందుకు ఏమి చేసినా, సాతానును వదిలించుకోలేము, అలాగే మనం అనుభవించే బాధలన్నిటికీ మూలకారణమైన అపరిపూర్ణతనూ పూర్తిగా నిర్మూలించలేము. ఆదాము నుండి వారసత్వంగా పొందిన పాప ప్రభావాలను తప్పించుకోవడం మన తలకుమించిన పని.—కీర్తన 49:7-9.
యేసుక్రీస్తు నిరంతరం నిలిచే మార్పు తీసుకువస్తాడు
అంటే పరిస్థితి పూర్తిగా నిరాశాజనకంగా ఉందని అర్థమా? ఎంతమాత్రం కాదు. శాశ్వత మార్పు తీసుకువచ్చే బాధ్యత, సామాన్య మానవునికన్నా శక్తిమంతుడైన వ్యక్తికి అప్పగించబడింది. ఆయనెవరు? ఆయనే యేసుక్రీస్తు. ఆయన బైబిలులో, మానవ కుటుంబ రక్షణకు దేవుడు నియమించిన అధిపతిగా వర్ణించబడ్డాడు.—అపొస్తలుల కార్యములు 5:31.
ఇప్పుడాయన చర్య తీసుకోవడానికి దేవుని “సమయము” కోసం వేచి ఉన్నాడు. (ప్రకటన 11:18) ఖచ్చితంగా ఆయనేమి చేస్తాడు? ఆయన అన్నిటికీ, ‘దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించిన కుదురుబాటు కాలములు’ తీసుకువస్తాడు. (అపొస్తలుల కార్యములు 3:21) ఉదాహరణకు, యేసు ‘దరిద్రులు మొఱ్ఱపెట్టగా వారిని విడిపించును. దీనులను నిరాధారులను విడిపించును. కపట బలాత్కారములనుండి వారి ప్రాణమును విమోచించును.’ (కీర్తన 72:12-16) యేసుక్రీస్తు ద్వారా, “భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు[తాను]” అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. (కీర్తన 46:9) “నాకు దేహములో బాగులేదని [శుభ్రపరచబడిన భూమిపై] నివసించు వాడెవడును అనడు” అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. గ్రుడ్డివారు, చెవిటివారు, కుంటివారు, అనారోగ్య అస్వస్థతలకు గురైన వారందరూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని తిరిగిపొందుతారు. (యెషయా 33:24; 35:5, 6; ప్రకటన 21:3, 4) గత శతాబ్దాల్లో మరణించినవారు కూడా ప్రయోజనం పొందుతారు. అన్యాయానికి, అణచివేతకు బలైనవారిని తిరిగి జీవానికి తీసుకువస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు.—యోహాను 5:28, 29.
యేసుక్రీస్తు తెచ్చే మార్పు పాక్షికమైనదిగా, తాత్కాలికమైనదిగా ఉండదు. ఆయన నిజంగా న్యాయమైన లోకానికున్న అడ్డంకులన్నిటినీ పూర్తిగా నిర్మూలిస్తాడు. ఆయన పాపాన్ని, అపరిపూర్ణతను తొలగించి, అపవాదియైన సాతానును, అతని తిరుగుబాటు విధానాన్ని అనుసరించేవారందరినీ నాశనం చేస్తాడు. (ప్రకటన 19:19, 20; 20:1-3, 10) దేవుడు తాత్కాలికంగా అనుమతించిన బాధ, వేదన “రెండవమారు రాకుండ” ఉంటాయి. (నహూము 1:9) దేవుని రాజ్యం రావాలనీ, దేవుని చిత్తం “పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును” నెరవేరాలనీ ప్రార్థించమని బోధించినప్పుడు యేసు మనస్సులో ఉన్నది ఇదే.—మత్తయి 6:9-10.
కానీ “‘బీదలెల్లప్పుడు మీతోకూడ ఉందురు’ అని యేసే చెప్పాడు కదా, దానర్థం అన్యాయం, పేదరికం ఎప్పటికీ అలాగే ఉంటాయని కాదా?” అని మీరు అభ్యంతరం చెప్పవచ్చు. (మత్తయి 26:11) అవును, పేద ప్రజలు ఎప్పటికీ ఉంటారని యేసు చెప్పాడు. అయితే, ఆయన మాటల సందర్భమూ, దేవుని వాక్యంలోని వాగ్దానాలూ, ఈ విధానం ఉన్నంతవరకు పేద ప్రజలు ఉంటారన్నది ఆయన ఉద్దేశమని చూపిస్తున్నాయి. ఈ లోకంలో నుండి పేదరికాన్ని, అన్యాయాన్ని ఏ మానవుడు ఎన్నడూ నిర్మూలించలేడని ఆయనకు తెలుసు. ఆ పరిస్థితిని తాను మారుస్తానని కూడా ఆయనకు తెలుసు. ఆయన త్వరలోనే పూర్తిగా క్రొత్త విధానాన్ని అంటే బాధ, అనారోగ్యం, పేదరికం, మరణం ఇక ఎంతమాత్రం ఉండని “క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని” తీసుకువస్తాడు.—2 పేతురు 3:13; ప్రకటన 21:1.
‘ఉపకారం చేయడం మరచిపోకండి’
అయితే ఇతరులకు సహాయం చేయడానికి మనకు సాధ్యమైనంత చేయడం వ్యర్థమని దీని భావమా? ఎంతమాత్రం కాదు. ఇతరులు కష్టాలు, వేదనభరిత పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు వారికి సహాయం చేయమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. “మేలుచేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము” అని ప్రాచీనకాల రాజైన సొలొమోను వ్రాశాడు. (సామెతలు 3:27) “ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి” అని అపొస్తలుడైన పౌలు ఉద్బోధిస్తున్నాడు.—హెబ్రీయులు 13:16.
ఇతరులకు సహాయం చేయడానికి మనకు సాధ్యమైనంత చేయాలని యేసుక్రీస్తు స్వయంగా ప్రోత్సహించాడు. కొట్టబడి, దోచుకోబడిన ఒక వ్యక్తిని చూసిన సమరయుని ఉపమానాన్ని ఆయన చెప్పాడు. సమరయుడు “జాలిపడి,” కొట్టబడిన వ్యక్తి గాయాలకు కట్లుకట్టి, ఆ దాడి నుండి కోలుకొనేలా అతడికి సహాయం చేయడానికి తన సొంత వనరులను ఉపయోగించేందుకు పురికొల్పబడ్డాడని యేసు చెప్పాడు. (లూకా 10:29-37) దయగల ఆ సమరయుడు లోకాన్ని మార్చలేదు కానీ మరో వ్యక్తి జీవితంలో పెద్ద మార్పు తీసుకువచ్చాడు. మనమూ అలాగే చేయవచ్చు.
అయితే, యేసుక్రీస్తు వ్యక్తులకు సహాయం చేయడంకన్నా ఎక్కువే చేయగలడు. ఆయన నిజంగా మార్పు తీసుకురాగలడు, అదీ ఆయన అతిత్వరలో మార్పు తీసుకువస్తాడు. ఆయనలా మార్పు తీసుకువచ్చినప్పుడు, నేటి అన్యాయపు పరిస్థితులకు బలైనవారు తమ జీవితాలను మెరుగుపర్చుకొని, నిజమైన శాంతిభద్రతలను అనుభవించగలుగుతారు.—కీర్తన 4:8; 37:10, 11.
అలా జరగాలని ఎదురుచూస్తూ, ఆధ్యాత్మికంగానూ వస్తుపరంగానూ మనకు సాధ్యమైనంత చేయడానికీ, అన్యాయపు లోకంలో బాధలనుభవిస్తున్న వారందరికి ‘మేలు చేయడానికీ’ వెనుకాడకుండా ఉందాం.—గలతీయులు 6:10.
[5వ పేజీలోని చిత్రాలు]
ఫ్లోరెన్స్ నైటింగేల్ వైద్యసేవా ప్రపంచంలో విశేషమైన మార్పులు తీసుకువచ్చింది
[చిత్రసౌజన్యం]
Courtesy National Library of Medicine
[7వ పేజీలోని చిత్రాలు]
క్రీస్తు అనుచరులు ఇతరులకు మేలు చేస్తారు
[4వ పేజీలోని చిత్రసౌజన్యం]
The Star, Johannesburg, S.A.