అపవాది ఉన్నాడని మీరు నిజంగా నమ్ముతున్నారా?
అపవాది ఉన్నాడని మీరు నిజంగా నమ్ముతున్నారా?
లేఖనాలు అపవాదిని ఒక నిజమైన వ్యక్తిగా వర్ణిస్తున్నాయి. దేవుడు ఏ కారణంచేత మానవ కళ్ళకు కనిపించడో అదే కారణంచేత ఇతడు కూడా మానవులకు కనిపించడు. “దేవుడు ఆత్మ” అని బైబిలు చెబుతోంది. (యోహాను 4:24) అపవాది ఒక ఆత్మ ప్రాణి. అయితే సృష్టికర్తకు భిన్నంగా, అపవాదికి ఒక ఆరంభం ఉంది.
యెహోవా దేవుడు మానవులను సృష్టించడానికి ఎంతోకాలం పూర్వం, అనేకానేక ఆత్మ ప్రాణులను సృష్టించాడు. (యోబు 38:4, 7) ఈ ఆత్మ ప్రాణులు బైబిలులో దేవదూతలు అని పిలువబడ్డారు. (హెబ్రీయులు 1:13, 14) దేవుడు వీరందరిని పరిపూర్ణులుగా సృష్టించాడు, వారిలో ఏ ఒక్కరూ అపవాది కాదు, వారిలో ఏ దుష్టగుణాలూ లేవు. అయితే మరి అపవాది ఎక్కడి నుండి వచ్చాడు? “అపవాది” అనే పదానికి, “అపవాదు వేసేవాడు” అని అర్థం, కాబట్టి అది ఇతరుల గురించి ఘోరమైన అబద్ధాలు చెప్పే వ్యక్తిని సూచిస్తుంది. “సాతాను” అంటే “ఎదిరించేవాడు” లేదా వ్యతిరేకి అని అర్థం. ముందు నిజాయితీగా ఉన్న వ్యక్తి దొంగతనం చేయడం ద్వారా ఎలా దొంగవుతాడో, అలాగే దేవుని పరిపూర్ణ ఆత్మ కుమారుల్లో ఒకరు తన అనుచితమైన కోరిక ప్రకారం ప్రవర్తించి తనను తాను అపవాదియైన సాతానుగా మార్చుకున్నాడు. స్వీయ భ్రష్టత్వానికి సంబంధించిన ఆ ప్రక్రియను బైబిలు ఇలా వివరిస్తోంది: “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును.”—యాకోబు 1:14, 15.
నిజానికి అదే జరిగింది. యెహోవా దేవుడు మొదటి మానవ జంటయైన ఆదాముహవ్వలను సృష్టించినప్పుడు, దేవునిపై తిరుగుబాటు చేయబోతున్న దేవదూత గమనించాడు. సృష్టికర్తను ఆరాధించే నీతిమంతులైన ప్రజలతో భూమిని నింపమని యెహోవా ఆదాముహవ్వలకు ఆజ్ఞాపించాడని అతడికి తెలుసు. (ఆదికాండము 1:28) తాను ఘనతను, ప్రాముఖ్యతను పొందే అవకాశం ఉందని ఈ దూత గ్రహించాడు. అతడు దురాశతో పురికొల్పబడి, న్యాయబద్ధంగా సృష్టికర్తకు మాత్రమే చెందవలసిన మానవుల ఆరాధనను ఆశించాడు. దేవుని ఆత్మ కుమారుడైన ఇతడు అలాంటి అనుచితమైన కోరికను త్రోసిపుచ్చే బదులు, ఆ కోరిక ఒక అబద్ధానికి, ఆ తర్వాత తిరుగుబాటుకు దారితీసేవరకు దాన్ని అలాగే పెంచుకున్నాడు. అతడేమి చేశాడో ఒకసారి పరిశీలించండి.
తిరుగుబాటుదారుడైన ఆ దూత మొదటి స్త్రీయైన హవ్వతో మాట్లాడడానికి ఒక సర్పాన్ని ఉపయోగించుకున్నాడు. ఆదికాండము 3:1-5) అంటే దేవుడు ఆదాముహవ్వలకు నిజం చెప్పలేదని అతడు ఆరోపించాడు. ఆ చెట్టు ఫలములు తినడం ద్వారా, హవ్వ మంచేదో చెడేదో నిర్ణయించుకునే అధికారంగల దేవతలా తయారవుతుందని అతడన్నాడు. అదే మొట్టమొదటి అబద్ధం. ఆ అబద్ధం చెప్పడంతో అతడు అపవాదు వేసేవాడిగా మారాడు. అతడు దేవుడ్ని వ్యతిరేకించేవాడు కూడా అయ్యాడు. అందుకే బైబిలు, దేవుని శత్రువైన ఇతడ్ని ‘అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘటసర్పము’ అని గుర్తిస్తోంది.—ప్రకటన 12:9.
“ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?” అని సర్పం హవ్వను అడిగింది. హవ్వ దేవుడిచ్చిన ఆజ్ఞను ప్రస్తావిస్తూ, దానికి అవిధేయత చూపిస్తే వచ్చే శిక్ష గురించి చెప్పినప్పుడు సర్పం ఇలా అన్నది: “మీరు చావనే చావరు. ఏలయనగా మీరు [తోట మధ్యనున్న చెట్టు ఫలములను] తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.” (“మెలకువగా ఉండుడి”
అపవాది హవ్వతో చెప్పిన అబద్ధం, అతడు ఉద్దేశించినట్లే జరిగింది. బైబిలు ఇలా చెబుతోంది: “స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను.” (ఆదికాండము 3:6) హవ్వ సాతాను చెప్పింది నమ్మి దేవునికి అవిధేయత చూపించింది. ఆమె ఆదాము కూడా దేవునికి అవిధేయత చూపించేలా ప్రభావితం చేయగలిగింది. అలా అపవాది, మొదటి మానవ దంపతులు దేవునిపై తిరగబడేలా చేయడంలో విజయం సాధించాడు. అప్పటినుండి, సాతాను మానవ వ్యవహారాల్లో అదృశ్యమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అతడి లక్ష్యమేమిటి? ప్రజలు సత్యదేవుణ్ణి ఆరాధించకుండా వారిని దారి మళ్ళించి, వారి ఆరాధనను తాను పొందాలన్నదే అతడి లక్ష్యం. (మత్తయి 4:8, 9) కాబట్టి సకారణంగానే, లేఖనాలు ఇలా హెచ్చరిస్తున్నాయి: “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.”—1 పేతురు 5:8.
అపవాది నిజమైన ఆత్మ ప్రాణి అని, అంటే భ్రష్టుడై, ప్రమాదకారిగా మారిన దూత అని బైబిలు ఎంత స్పష్టంగా వివరిస్తోందో కదా! మెలకువగా ఉండడానికి మనం తీసుకోవాల్సిన ఆవశ్యకమైన మొదటి చర్య ఏమిటంటే, అతడు నిజంగా ఉనికిలో ఉన్నాడని గుర్తించడం. అయితే నిబ్బరమైన బుద్ధి కలిగి, మెలకువగా ఉండడంలో అంతకంటే ఎక్కువే ఇమిడివుంది. సాతాను “తంత్రముల” గురించి, ప్రజలను తప్పుదోవ పట్టించే అతడి పద్ధతుల గురించి తెలుసుకొని ఉండడం కూడా ప్రాముఖ్యం. (2 కొరింథీయులు 2:11) అతడి పన్నాగాలేమిటి? వాటికి వ్యతిరేకంగా మనం ఎలా స్థిరంగా నిలబడవచ్చు?
మానవునిలో స్వతఃసిద్ధంగావున్న అవసరాన్ని అపవాది తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటాడు
అపవాది మానవజాతి సృష్టించబడినప్పటి నుండి మానవులను గమనిస్తున్నాడు. అతడికి మానవ నైజం, వారి అవసరాలు, ఆసక్తులు, కోరికలు తెలుసు. మానవుడు ఆధ్యాత్మిక అవసరతతో సృష్టించబడ్డాడని సాతానుకు బాగా తెలుసు, అందుకే అపవాది ఆ అవసరాన్ని చాలా యుక్తిగా తన ప్రయోజనం కోసం ఉపయోగించుకున్నాడు. ఎలా? మానవజాతికి అసత్యాలు బోధించడం ద్వారా అతడలా చేశాడు. (యోహాను 8:44) దేవుని గురించిన అనేక మతబోధలు పరస్పర విరుద్ధమైనవిగా, తికమక పెట్టేవిగా ఉన్నాయి. ఇది ఎవరి సంకల్పాన్ని నెరవేరుస్తుందని మీరనుకుంటున్నారు? పరస్పర విరుద్ధమైన బోధలన్నీ నిజం కాలేవు. కాబట్టి అనేక మతబోధలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రత్యేకంగా సాతాను రూపించినవిగా, ఉపయోగిస్తున్నవిగా ఉండే అవకాశం లేదా? నిజానికి బైబిలు అతడిని, ప్రజల మనసులకు అంధత్వం కలిగించిన “ఈ యుగ సంబంధమైన దేవత” అని పేర్కొంటోంది.—2 కొరింథీయులు 4:4.
దైవిక సత్యం మతసంబంధమైన మోసాల విషయంలో రక్షణనిస్తుంది. బైబిలు దేవుని వాక్య సత్యాన్ని ప్రాచీనకాల సైనికుడు తన నడుముకు రక్షణగా కట్టుకునే దట్టీతో పోలుస్తోంది. (ఎఫెసీయులు 6:14) మీరు బైబిలు జ్ఞానాన్ని పొంది, దాన్ని దట్టీ కట్టుకున్నట్లుగా, దానిలోని సందేశం ప్రకారం జీవిస్తే, మతసంబంధమైన అబద్ధాల మూలంగా, తప్పుల మూలంగా తప్పుదోవ పట్టకుండా దేవుని వాక్యం మిమ్మల్ని కాపాడుతుంది.
మానవునిలోవున్న ఆరాధించాలనే కోరిక, తనకు తెలియని వాటిని అన్వేషించేలా చేసింది. ఇది అతడ్ని సాతానుయొక్క మరో మోసపూరిత పన్నాగంలో చిక్కుకునేలా చేసింది. అసాధారణమైనదాని గురించి, మర్మమైనదాని గురించి తెలుసుకోవాలనే మానవుని ఉత్సుకతను తన ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని చూస్తూ, సాతాను అనేకులను తన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి అభిచారాన్ని ఉపయోగించాడు. వేటగాడు తాను వేటాడాలనుకుంటున్న జంతువును ఆకర్షించడానికి ఎరను ఉపయోగించినట్లే సాతాను ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించి, వారిని చేజిక్కించుకోవడానికి సోదె చెప్పడం, జ్యోతిశ్శాస్త్రం, హిప్నాటిజమ్, మాంత్రికవిద్య, హస్తసాముద్రికం, ఇంద్రజాలం వంటివాటిని ఉపయోగిస్తాడు.—లేవీయకాండము 19:31; కీర్తన 119:110.
అభిచారంలో చిక్కుకుపోకుండా మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చు? ద్వితీయోపదేశకాండము 18:10-12 ఇలా చెబుతోంది: “తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునముచెప్పు సోదెగానినైనను, మేఘశకునములనుగాని సర్పశకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.”
లేఖన ఉపదేశం నిర్దిష్టంగా ఇలా ఉంది: అభిచారంతో ఎలాంటి సంబంధం పెట్టుకోకండి. మీరు ఏదో ఒక రకమైన అభిచారంలో భాగంవహిస్తూ ఇప్పుడు దానికి దూరంగా ఉండాలనుకుంటే అప్పుడేమి చేయాలి? ఎఫెసు నగరంలోని తొలిక్రైస్తవుల మాదిరిని మీరు అనుసరించవచ్చు. “మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు,” “ప్రభువు వాక్యము” అంగీకరించి, “తమ పుస్తకములు తెచ్చి అందరియెదుట వాటిని కాల్చివేసిరి” అని బైబిలు చెబుతోంది. ఈ పుస్తకాలు ఖరీదైనవి. వాటి విలువ 50,000 వెండి రూకలు. (అపొస్తలుల కార్యములు 19:19, 20) అయినప్పటికీ వాటిని నాశనం చేయడానికి ఎఫెసులోని క్రైస్తవులు వెనుకాడలేదు.
సాతాను మానవ బలహీనతలను ఎరగా ఉపయోగించుకుంటాడు
పరిపూర్ణుడైన ఒక దేవదూత తనను తాను హెచ్చించుకోవాలనే కోరికకు లొంగిపోయినందుకు అపవాదియైన సాతానుగా మారాడు. అంతేగాక, అతడు హవ్వలో, దేవునిలా ఉండాలనే అహంకారపూరిత, స్వార్థపూరిత కోరికను రేకెత్తించాడు. నేడు సాతాను అనేకులలో అహంకార భావాలను రేకెత్తించడం ద్వారా వారిని తన అదుపులో ఉంచుకుంటున్నాడు. ఉదాహరణకు, కొంతమంది తమ తెగ, జాతి, లేక జాతీయత ఇతరులకంటే గొప్పవని భావిస్తారు. బైబిలు బోధించేదానికి ఇదెంత విరుద్ధమో కదా! (అపొస్తలుల కార్యములు 10:34, 35) ‘దేవుడు ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు’ అని బైబిలు స్పష్టంగా చెబుతోంది.—అపొస్తలుల కార్యములు 17:26.
ప్రజల్లో గర్వాన్ని రేకెత్తించాలని సాతాను చేస్తున్న ప్రయత్నాలకు ఒక సమర్థవంతమైన ఆత్మరక్షణ, అణకువ. “తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొన” వద్దని బైబిలు మనకు ఉపదేశిస్తోంది. (రోమీయులు 12:3) “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును” అని అది చెబుతోంది. (యాకోబు 4:6) సాతాను ప్రయత్నాలను ఎదిరించడానికి ఒక ఖచ్చితమైన మార్గమేమిటంటే, మీ జీవితంలో అణకువను, దేవుడు ఆమోదించే ఇతర లక్షణాలను ప్రదర్శించడం.
అనుచితమైన శారీరక కోరికలకు లొంగిపోయే మానవ బలహీనతను తన ప్రయోజనం కోసం ఉపయోగించుకోవాలని కూడా సాతాను ఆత్రుతతో ఉన్నాడు. మానవులు జీవితాన్ని ఆనందించాలని యెహోవా దేవుడు ఉద్దేశించాడు. దేవుని చిత్తపు పరిధిలో కోరికలు నెరవేరినప్పుడు, నిజమైన సంతోషం కలుగుతుంది. కానీ అనైతిక మార్గాల్లో తమ కోరికలు తీర్చుకునేలా సాతాను మానవులను శోధిస్తాడు. (1 కొరింథీయులు 6:9, 10) పవిత్రమైనవాటిపైన, మంచివాటిపైన మనస్సు నిలపడం మంచిది. (ఫిలిప్పీయులు 4:8) ఇది మీరు మీ తలంపులను, భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి సహాయం చేస్తుంది.
సాతానును ఎదిరిస్తూనే ఉండండి
అపవాదిని ఎదిరించడంలో మీరు విజయం సాధించగలరా? సాధించగలరు. బైబిలు మనకిలా హామీ ఇస్తోంది: “అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.” (యాకోబు 4:7) మీరు సాతానును ఎదిరిస్తే, అతడు వెంటనే మిమ్మల్ని వదిలేసి, మీరు దేవుని గురించిన జ్ఞానాన్ని పొందుతుంటే మీకు ఇబ్బంది కలిగించకుండా ఏమీ ఉండడు. అపవాది మిమ్మల్ని ‘కొంతకాలము విడిచిపెట్టి’ మళ్లీ ప్రయత్నిస్తాడు. (లూకా 4:13) అయితే, మీరు అపవాదికి భయపడవలసిన అవసరం లేదు. మీరు అతడిని ఎదిరిస్తూనే ఉంటే, అతడు మిమ్మల్ని సత్య దేవుని నుండి దూరం చేయలేడు.
అయితే అపవాదిని ఎదిరించడానికి, అతడు ఎవరు, అతడు ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తాడు, అతడి పన్నాగాలకు వ్యతిరేకంగా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి అనే వాటి గురించిన జ్ఞానం మీకు అవసరం. అలాంటి జ్ఞానానికి ఒకే ఒక ఖచ్చితమైన మూలం ఉంది, అదే దేవుని వాక్యమైన బైబిలు. కాబట్టి ప్రేరేపిత లేఖనాలను అధ్యయనం చేయాలనే, వాటి నుండి మీరు నేర్చుకుంటున్నదాన్ని మీ జీవితంలో అన్వయించుకోవాలనే దృఢ నిశ్చయతతో ఉండండి. మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులు, మీకు అనుకూలమైన సమయంలో ఉచితంగా మీతో అలా అధ్యయనం చేయడానికి సంతోషంగా అంగీకరిస్తారు. వారిని సంప్రదించడానికి లేక ఈ పత్రిక ప్రచురణకర్తలకు వ్రాయడానికి దయచేసి సంకోచించకండి.
మీరు బైబిలు అధ్యయనం చేస్తుండగా, దేవునివాక్య సత్యాన్ని తెలుసుకోకుండా మిమ్మల్ని ఆపేందుకు సాతాను వ్యతిరేకతను లేదా హింసను ఉపయోగిస్తాడని మీరు గ్రహించాలి. మీరు బైబిలు అధ్యయనం చేస్తున్నందుకు మీకు ప్రియమైనవారు కొందరు మీ మీద కోపం తెచ్చుకోవచ్చు. దానిలోని అద్భుతమైన సత్యాలు వారికి తెలియవు కాబట్టి అలా జరగవచ్చు. ఇతరులు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. కానీ అలాంటి ఒత్తిళ్ళకు లొంగిపోవడం దేవునికి నిజంగా సంతోషాన్నిస్తుందా? మీరు నిజమైన దేవుని గురించి తెలుసుకోవడం మానేసేలా మిమ్మల్ని నిరుత్సాహపరచాలని అపవాది కోరుకుంటున్నాడు. ఆ విషయంలో సాతాను విజయం సాధించడానికి మీరు ఎందుకు అనుమతించాలి? (మత్తయి 10:34-39) మీరు అతడికేమీ ఋణపడి లేరు. కానీ యెహోవాకు మీరు మీ జీవితాన్నే ఋణపడి ఉన్నారు. కాబట్టి, అపవాదిని ఎదిరించి, ‘యెహోవా హృదయాన్ని సంతోషపరచాలని’ దృఢంగా నిశ్చయించుకోండి.—సామెతలు 27:11.
[6వ పేజీలోని చిత్రం]
క్రైస్తవులుగా మారినవారు తమ అభిచార సంబంధ పుస్తకాలను కాల్చివేశారు
[7వ పేజీలోని చిత్రం]
బైబిలు అధ్యయనం చేయాలని దృఢంగా నిశ్చయించుకోండి