కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునితో నడవండి, మంచిని పంటగా కోయండి

దేవునితో నడవండి, మంచిని పంటగా కోయండి

దేవునితో నడవండి, మంచిని పంటగా కోయండి

“వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును.”​—⁠హోషేయ 8:⁠7.

ఒక ప్రమాదకరమైన ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు, అనుభవంగల మార్గదర్శి ముందుండి నడిపించడం సురక్షితంగా ఉంటుంది. స్వయంగా మనమే ముందుకు వెళ్లే బదులు అలాంటి మార్గదర్శితో నడవడం జ్ఞానయుక్తం. ఇది కొంతమేరకు మన పరిస్థితిని ఉదాహరిస్తోంది. నిజానికి, విశాలమైన ప్రస్తుత దుష్ట లోకపు ఎడారి గుండా మనల్ని నడిపించేందుకు యెహోవా సుముఖంగా ఉన్నాడు. స్వయంగా మనమే ముందుకుసాగేందుకు ప్రయత్నించకుండా ఆయనతో కలిసి నడవడం జ్ఞానయుక్తం. మనం దేవునితో ఎలా నడవగలం? ఆయన తన వాక్యంలో దయచేసిన మార్గనిర్దేశాన్ని అనుసరించడం ద్వారా అలా నడవగలం.

2 ముందరి ఆర్టికల్‌ హోషేయ 1 నుండి 5 అధ్యాయాల్లోని సూచనార్థక నాటకాన్ని చర్చించింది. మనం గమనించినట్లుగా, దేవునితో నడిచేందుకు సహాయపడే పాఠాలు ఆ నాటకంలో ఉన్నాయి. ఇప్పుడు మనం 6 నుండి 9 అధ్యాయాల్లోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. ఈ నాలుగు అధ్యాయాల సమీక్షతో ఆరంభించడం సహాయకరంగా ఉంటుంది.

క్లుప్త సమీక్ష

3 ఉత్తర దిక్కునున్న పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని గురించి ప్రవచించడానికే యెహోవా ప్రాథమికంగా హోషేయను పంపించాడు. ప్రాబల్యంగల ఎఫ్రాయిము గోత్రం పేరుతో కూడా తెలియబడిన ఆ రాజ్యం, దేవుణ్ణి తృణీకరించింది. ప్రజలు యెహోవా నిబంధనను మీరి, దుష్టకార్యాలు చేస్తూ విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని హోషేయలోని 6 నుండి 9 అధ్యాయాలు వివరిస్తున్నాయి. (హోషేయ 6:⁠7) యెహోవావైపు తిరగడానికి బదులు వారు లోక రాజ్యాలను నమ్ముకున్నారు. చెడునే విత్తుతూ వచ్చారు కాబట్టి, వారు చెడునే పంటగా కోస్తారు. మరోవిధంగా చెప్పాలంటే, వారిపైకి కఠిన తీర్పు రాబోతోంది. అయితే హోషేయ ప్రవచనంలో సంతోషకరమైన సందేశం కూడా ఉంది. ప్రజలు యెహోవావైపు తిరిగి, తమ హృదయపూర్వక పశ్చాత్తాపానికి రుజువు చూపిస్తే యెహోవా వారిని కనికరిస్తాడని వారికి హామీ ఇవ్వబడింది.

4 హోషేయ ప్రవచనంలోని ఈ నాలుగు అధ్యాయాల నుండి, దేవునితో నడిచేందుకు సహాయపడే మరింత మార్గనిర్దేశాన్ని మనం పొందవచ్చు. నాలుగు ఆచరణాత్మక పాఠాలను మనం పరిశీలిద్దాం: (1) నిజమైన పశ్చాత్తాపం కేవలం మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా వెల్లడవుతుంది; (2) బలులు మాత్రమే దేవుణ్ణి సంతోషపెట్టవు; (3) తన ఆరాధకులు తనకు దూరమైతే యెహోవా బాధపడతాడు; (4) మనం మంచిని పంటగా కోయాలంటే, మంచినే విత్తాలి.

నిజమైన పశ్చాత్తాపం వెల్లడయ్యే విధానం

5 హోషేయ ప్రవచనం పశ్చాత్తాపం, కనికరం గురించి మనకెంతో బోధిస్తుంది. హోషేయ 6:​1-3లో మనమిలా చదువుతాం: “మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి; యెహోవానుగూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చురీతిని ఆయన ఉదయించును; వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.”

6 ఈ వచనాల్లోని మాటలు ఎవరు పలికారు? అవిశ్వాస ఇశ్రాయేలీయులే ఆ మాటలు పలికారనీ, అవిధేయులైన ఆ ప్రజలు కపట పశ్చాత్తాపం ప్రదర్శిస్తూ దేవుని కనికరం నుండి లాభం గడించాలనుకున్నారనీ కొందరు అంటున్నారు. అయితే మరికొందరు యెహోవా దగ్గరకు రావాలని ప్రజల్ని వేడుకుంటూ హోషేయ ప్రవక్తే ఈ మాటలు పలికాడని అంటున్నారు. ఈ మాటలు ఎవరు పలికినప్పటికీ, కీలకమైన ప్రశ్నేమిటంటే, ఇశ్రాయేలు పది గోత్రాల రాజ్యంలోని ప్రజలు నిజమైన పశ్చాత్తాపం కనబరుస్తూ యెహోవా దగ్గరికి తిరిగి వచ్చారా? లేదు. హోషేయ ద్వారా యెహోవా ఇలా అంటున్నాడు: “ఎఫ్రాయిమూ, నిన్ను నేనేమిచేతును? యూదా, నిన్ను నేనేమిచేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును.” (హోషేయ 6:⁠4) దేవుని ప్రజల ఘోర ఆధ్యాత్మిక స్థితిని అది ఎంత చక్కగా వర్ణిస్తుందో కదా! ఉదయాన్నే కనబడే పొగమంచు సూర్యోదయంతో కనుమరుగైనట్లు, వారిలో భక్తి కూడా దాదాపు కనుమరుగైంది. ప్రజలు పశ్చాత్తాపపడినట్లు పైకి నటించినా, వారిని కరుణించేందుకు యెహోవాకు ఏ ఆధారమూ కనబడలేదు. సమస్య ఏమిటి?

7 ఇశ్రాయేలు కనబరిచిన పశ్చాత్తాపం నిజానికి హృదయపూర్వకమైనది కాదు. యెహోవాకు తన ప్రజలపట్ల ఉన్న అసమ్మతిని గురించి హోషేయ 7:⁠14 ఇలా చెబుతోంది: “హృదయపూర్వకముగా నన్ను బతిమాలుకొనక శయ్యలమీద పరుండి కేకలు వేయుదురు.” 16వ వచనం ఇంకా ఇలా అంటోంది: “వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వానియొద్దకు తిరుగరు.” యెహోవాతో తమ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉన్నతమైన ఆయన ఆరాధనవైపు తిరగడానికి ఆ ప్రజలు ఇష్టపడలేదు. నిజానికి వారు దేవునితో నడవాలని కోరుకోలేదు.

8 ఇశ్రాయేలీయులు చూపించిన పశ్చాత్తాపం విషయంలో మరో సమస్య ఉంది. ప్రజలు పాపం చేయడం మానుకోలేదు అంటే మోసం, హత్య, దొంగతనం, విగ్రహారాధన, ఇతర జనాంగాలతో అజ్ఞానపు బంధుత్వాలు కలుపుకోవడం వంటి అనేకరకాల పాపాలు చేస్తూనే ఉన్నారు. వారిలో రేగుతున్న తప్పుడు కోరికల కారణంగా కావచ్చు, హోషేయ 7:4లో ఆ ప్రజలు ‘అధికమైన వేడితో’ లేదా ‘రొట్టెలు కాల్చే పొయ్యతో’ పోల్చబడ్డారు. అలాంటి ఘోరమైన ఆధ్యాత్మిక పరిస్థితి దృష్ట్యా, వారు కనికరించబడేందుకు అర్హులా? ఎంతమాత్రం అర్హులు కాదు! యెహోవా ‘వారి దోషమును జ్ఞాపకము చేసుకుంటాడనీ,’ ‘వారి పాపములకై వారికి శిక్ష విధిస్తాడనీ’ హోషేయ ఆ తిరుగుబాటు ప్రజలకు చెబుతున్నాడు. (హోషేయ 9:⁠9) కనికరించబడేందుకు వారు అర్హులు కానేకారు.

9 హోషేయ మాటలను మనం చదువుతుండగా పశ్చాత్తాపం, కనికరం గురించి మనమేమి నేర్చుకుంటాం? యెహోవా కనికరం నుండి ప్రయోజనం పొందడానికి మనం హృదయపూర్వక పశ్చాత్తాపం చూపించాలని, విశ్వాసరహిత ఇశ్రాయేలీయుల హెచ్చరికా మాదిరి మనకు బోధిస్తోంది. అలాంటి పశ్చాత్తాపాన్ని ఎలా చూపించవచ్చు? కల్లబొల్లి మాటలకు, కన్నీళ్లకు యెహోవా మోసపోడు. నిజమైన పశ్చాత్తాపం క్రియల్లో స్పష్టమవుతుంది. తప్పు చేసిన వ్యక్తి కనికరం పొందడానికి తన పాపమార్గాన్ని పూర్తిగా వదిలేసి, యెహోవా ఉన్నత ఆరాధనా ప్రమాణాలకు అనుగుణంగా తన జీవితాన్ని మలచుకోవాలి.

బలులు మాత్రమే దేవుణ్ణి సంతోషపెట్టవు

10 యెహోవాతో నడిచేందుకు మనకు సహాయపడగల రెండవ పాఠాన్ని మనమిప్పుడు చర్చిద్దాం. అదేమిటంటే, బలులు మాత్రమే దేవుణ్ణి సంతోషపెట్టవు. హోషేయ 6:6 ఇలా చెబుతోంది: “[యెహోవానైన] నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహనబలులకంటె దేవునిగూర్చిన జ్ఞానము నాకిష్టమైనది.” ఇక్కడ, హృదయ సంబంధిత లక్షణమైన కనికరమునుబట్టి, తన గురించిన జ్ఞానాన్నిబట్టి యెహోవా సంతోషిస్తాడని గమనించండి. అయితే మీరిలా ఆలోచిస్తుండవచ్చు: ‘యెహోవా “బలిని,” ‘దహనబలుల్ని’ ఇష్టపడడు అని ఈ వచనం ఎందుకు చెబుతోంది? మోషే ధర్మశాస్త్రం ప్రకారం అవి అవసరం లేదా?’

11 ధర్మశాస్త్రం ప్రకారం బలులు, అర్పణలు అవసరమే, అయితే హోషేయ సమకాలీనుల్లో ఒక గంభీరమైన సమస్య ఉంది. అదేమిటంటే, ఇశ్రాయేలీయుల్లో కొందరు పైకి భక్తిని ప్రదర్శిస్తూ, తమకు తప్పదన్నట్లు అలాంటి అర్పణలను అర్పించారు. అదే సమయంలో వారు పాపం చేస్తూవచ్చారు. తమ పాపబుద్ధి ద్వారా వారు తమ హృదయాల్లో కనికరం లేదని చూపించారు. అలాగే వారు దేవుని జ్ఞానానికి అనుగుణంగా జీవించకుండా, తాము దానిని తిరస్కరిస్తున్నట్లు కూడా చూపించారు. ప్రజలకు సరైన హృదయ స్థితిలేకపోతే, వారు సరైన జీవనశైలి అనుసరించకపోతే వారి బలులకు విలువేమి ఉంటుంది? వారిచ్చే బలుల్ని యెహోవా దేవుడు ఇష్టపడలేదు.

12 నేడు చర్చీలకు వెళ్తున్న అనేకమందికి, హోషేయ మాటల్లో ఒక హెచ్చరిక ఉంది. వారు మతాచారాల రూపంలో దేవునికి అర్పణలు అర్పిస్తారు. కానీ వారి దైనందిన ప్రవర్తనలో వారి ఆరాధనా ప్రభావం కాస్తయినా కనిపించదు. దేవుని గురించిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకొని, పాపభరిత ఆచారాలను విసర్జించడం ద్వారా ఆ జ్ఞానాన్ని అన్వయించుకొనేందుకు తమ హృదయాలు పురికొల్పకపోతే, అలాంటి ప్రజలు నిజంగా దేవుణ్ణి సంతోషపెడతారా? మతపరమైన క్రియలు మాత్రమే దేవుణ్ణి సంతోషపెడతాయని ఎవరూ అనుకోకూడదు. వాక్య ప్రకారం జీవించడానికి బదులు కేవలం పైకి భక్తి కనబరుస్తూ తన అనుగ్రహం కోసం ప్రయత్నించే మనుష్యులనుబట్టి యెహోవా సంతోషించడు.​—⁠2 తిమోతి 3:⁠5.

13 బలులు మాత్రమే దేవుణ్ణి సంతోషపెట్టవని నిజ క్రైస్తవులమైన మనకు తెలుసు. నిజమే మనం దేవునికి జంతు బలులు అర్పించం. అయితే ‘మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుచు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పిస్తాం.’ (హెబ్రీయులు 13:​15) దేవునికి అలాంటి ఆధ్యాత్మిక అర్పణలు అర్పించడం ద్వారా, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవచ్చని తలంచిన హోషేయ కాలపు పాపభరిత ఇశ్రాయేలీయుల్లా మనం తయారవకుండా ఉండడం ఆవశ్యకం. రహస్యంగా అనైతికతకు పాల్పడిన ఒక అమ్మాయి ఉదాహరణనే పరిశీలించండి. “తప్పును కప్పివేస్తుందనే తలంపుతో క్షేత్ర పరిచర్యలో ఎక్కువగా పాల్గొనేదాన్ని” అని ఆమె ఆ తర్వాత అంగీకరించింది. ఇది, దారితప్పిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయత్నంలాగే ఉంది. సరైన హృదయ స్పందన, దైవిక ప్రవర్తన ముడిపడి ఉన్నప్పుడు మాత్రమే మన స్తుతియాగం యెహోవాకు ఆమోదయోగ్యంగా ఉంటుంది.

తన ఆరాధకులు తనకు దూరమైతే యెహోవా బాధపడతాడు

14 తన ఆరాధకులు తనకు దూరమైతే యెహోవా ఎలా భావిస్తాడనే మూడవ పాఠాన్ని మనం హోషేయ 6 నుండి 9 అధ్యాయాల్లో నేర్చుకుంటాం. దేవునికి బలమైన, మృదువైన భావాలున్నాయి. తమ పాపాల విషయంలో పశ్చాత్తాపపడేవారి పట్ల వాత్సల్యంతో ఆయన వారినిబట్టి ఆనందిస్తాడు. అయితే తన ప్రజలు పశ్చాత్తాపం చూపించకపోతే ఆయన గట్టి చర్య తీసుకుంటాడు. దేవునికి మన సంక్షేమంపట్ల శ్రద్ధవుంది కాబట్టే, మనం నమ్మకంగా తనతో నడిచినప్పుడు ఆయన సంతోషిస్తాడు. “యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు” అని కీర్తన 149:4 చెబుతోంది. కానీ తన సేవకులు విశ్వాసఘాతుకానికి పాల్పడినప్పుడు దేవుడు ఎలా భావిస్తాడు?

15 విశ్వాసఘాతుకానికి పాల్పడిన ఇశ్రాయేలీయులను ఉద్దేశించి యెహోవా ఇలా అంటున్నాడు: “ఆదాము నిబంధన మీరినట్లు వారు నాయెడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు.” (హోషేయ 6:⁠7) ‘విశ్వాసఘాతుకానికి పాల్పడడం’ అని అనువదించబడిన హీబ్రూ పదానికి “మోసపూరితంగా ప్రవర్తించడం, నమ్మకద్రోహం చేయడం” అనే అర్థాలు కూడా ఉన్నాయి. తమ వివాహజతకు నమ్మకద్రోహం చేసిన ఇశ్రాయేలీయుల యథార్థతా లోపాన్ని వర్ణించడానికి మలాకీ 2:10-16లో అదే హీబ్రూ పదం ఉపయోగించబడింది. హోషేయ 6:7లో ఈ పదం ఉపయోగించబడడాన్ని గురించి ఒక రెఫరెన్సు గ్రంథం ఇలా అంటోంది: “అది వివాహ సంబంధంలోని వ్యక్తిగత లక్షణాలను వర్ణించే వివాహసంబంధిత రూపకాలంకార పదం . . . వివాహంలో ప్రేమను ఉల్లంఘించిన వ్యక్తిగత పరిస్థితిని అది సూచిస్తుంది.”

16 ఇశ్రాయేలు జనాంగంతో తాను చేసుకున్న నిబంధననుబట్టి యెహోవా వారిని అలంకారార్థ భార్యగా దృష్టించాడు. కాబట్టి ప్రజలు తన నిబంధనా షరతుల్ని ఉల్లంఘించినప్పుడు, వారు వ్యభిచరించారన్న భావమే ఇచ్చింది. దేవుడు నమ్మకమైన భర్తలా ఉన్నా, ఆయన ప్రజలు ఆయనను తృణీకరించారు.

17 మరి మన విషయమేమిటి? మనమాయనతో నడుస్తామా లేదా అనే విషయాన్ని ఆయన శ్రద్ధగా చూస్తాడు. దేవుడు ‘ప్రేమాస్వరూపి’ అనీ, మన క్రియలు ఆయనను ప్రభావితం చేస్తాయనీ మనం గుర్తుంచుకోవాలి. (1 యోహాను 4:​16) మనం ఏదైనా తప్పు మార్గం అనుసరిస్తే, అది యెహోవాను బాధపెడుతుంది, నిశ్చయంగా అది ఆయనకు అసంతోషం కలిగిస్తుంది. ఈ విషయాన్ని మనసులో ఉంచుకోవడం, శోధనకు లొంగిపోకుండా ఉండేందుకు బలమైన కంచెలా ఉండగలదు.

మనం మంచిని పంటగా కోసే విధానం

18 హోషేయ ప్రవచనంలోని నాలుగవ పాఠాన్ని అంటే మనం మంచిని పంటగా ఎలా కోయవచ్చో పరిశీలిద్దాం. ఇశ్రాయేలీయుల గురించి, విశ్వాసరహితమైన వారి జీవితగమనపు మూర్ఖత్వం గురించి, వ్యర్థత గురించి హోషేయ ఇలా వ్రాస్తున్నాడు: “వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును.” (హోషేయ 8:⁠7) మనం గుర్తుపెట్టుకోవలసిన ఒక సూత్రాన్ని మనమిక్కడ చూస్తాం: మనమిప్పుడు చేసే పనులకు, మనం భవిష్యత్తులో ఎదుర్కొనే పర్యవసానాలకు సూటిగా సంబంధం ఉంది. ఈ సూత్రం విశ్వాసద్రోహులైన ఇశ్రాయేలీయుల విషయంలో ఎలా నిజమైంది?

19 ఆ ఇశ్రాయేలీయులు పాపం చేస్తూ చెడును విత్తుతూ వచ్చారు. చెడు పర్యవసానాలను పంటగా కోయకుండా వారు కొనసాగగలరా? వారి మీదికొచ్చే కఠిన తీర్పును వారు ఏ మాత్రం తప్పించుకోలేరు. హోషేయ 8:⁠13 ఇలా చెబుతోంది: “ఆయన [యెహోవా] వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములనుబట్టి వారిని శిక్షించును.” మరియు మనం హోషేయ 9:17లో ఇలా చదువుతాం: “వారు నా దేవుని మాటల నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు.” ఇశ్రాయేలీయుల పాపాలకు యెహోవా వారిని జవాబుదారులుగా పరిగణిస్తాడు. వారు చెడునే విత్తారు కాబట్టి, వారు చెడునే పంటగా కోస్తారు. సా.శ.పూ. 740లో, అష్షూరీయులు ఆ పదిగోత్రాల ఇశ్రాయేలు రాజ్యాన్ని కూలదోసి దాని నివాసులను బంధీలుగా తీసుకుపోయినప్పుడు దేవుని తీర్పు వారి విషయంలో అమలు చేయబడింది.

20 ఆ ఇశ్రాయేలీయుల అనుభవం మనకు ఈ ప్రాథమిక సత్యాన్ని బోధిస్తోంది: మనం ఏది విత్తుతామో ఆ పంటనే కోస్తాము. దేవుని వాక్యం మనల్ని ఇలా హెచ్చరిస్తోంది: “మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును.” (గలతీయులు 6:⁠7) మనం చెడును విత్తితే, చెడునే పంటగా కోస్తాం. ఉదాహరణకు, అనైతిక జీవన విధానాన్ని కొనసాగించేవారు దుఃఖకరమైన పర్యవసానాల పంట కోస్తారు. పశ్చాత్తాపపడని తప్పిదస్థునికి దుఃఖకరమైన ఫలితం తప్పదు.

21 అట్లయితే మనం మంచినెలా పంటగా కోయగలం? ఓ చిన్న ఉపమానంతో ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వవచ్చు. ఒక రైతు వరి పంటను కోయాలంటే, ఆయన గోధుమలు విత్తుతాడా? విత్తడు! తను కోయాలనుకునే పైరునే ఆయన విత్తాలి. అదేవిధంగా మనం మంచిని పంటగా కోయాలనుకుంటే మంచినే విత్తాలి. మీరు మంచినే ఎల్లప్పుడూ పంటగా కోయాలని, అంటే దేవుని నూతనలోకంలో నిత్యజీవపు ఉత్తరాపేక్షను, ఇప్పుడు సంతృప్తికరమైన జీవితాన్ని పంటగా కోయాలనుకుంటున్నారా? అట్లయితే, మీరు ఎడతెగక దేవునితో నడుస్తూ, ఆయన నీతి ప్రమాణాలకు అనుగుణంగా జీవించడమనే మంచినే ఎల్లప్పుడూ విత్తాలి.

22హోషేయ 6 నుండి 9 అధ్యాయాల్లో దేవునితో నడిచేందుకు మనకు సహాయపడగల నాలుగు పాఠాలు నేర్చుకున్నాం: (1) నిజమైన పశ్చాత్తాపం క్రియల ద్వారా వెల్లడవుతుంది; (2) బలులు మాత్రమే దేవుణ్ణి సంతోషపెట్టవు; (3) తన ఆరాధకులు తనకు దూరమైతే యెహోవా బాధపడతాడు; (4) మనం మంచిని పంటగా కోయాలంటే మంచినే విత్తాలి. ఈ బైబిలు పుస్తకంలోని చివరి అయిదు అధ్యాయాలు దేవునితో నడిచేందుకు మనకెలా సహాయం చేయగలవు?

మీరెలా సమాధానమిస్తారు?

నిజమైన పశ్చాత్తాపం ఎలా కనబరచబడుతుంది?

బలులు మాత్రమే మన పరలోకపు తండ్రిని ఎందుకు సంతోషపెట్టవు?

తన ఆరాధకులు తనకు దూరమైనప్పుడు దేవుడు ఎలా భావిస్తాడు?

మనం మంచిని పంటగా కోయాలంటే మనమేమి విత్తాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. మనం యెహోవాతో ఎలా నడవగలం?

2. ఈ ఆర్టికల్‌లో ఏమి చర్చించబడుతుంది?

3. హోషేయ 6 నుండి 9 అధ్యాయాల్లోని విషయాలను క్లుప్తంగా వివరించండి.

4. హోషేయ ప్రవచనం నుండి మనమే ఆచరణాత్మక పాఠాలను పరిశీలిస్తాం?

5. హోషేయ 6:1-3లో చెప్పబడిన విషయాల సారాంశం వివరించండి.

6-8. ఇశ్రాయేలీయుల పశ్చాత్తాపంలో ఉన్న దోషమేమిటి?

9. పశ్చాత్తాపం, కనికరం గురించి హోషేయ మాటలు మనకేమి బోధిస్తున్నాయి?

10, 11. ఇశ్రాయేలీయుల స్థితి ఉదాహరించినట్లుగా, బలులు మాత్రమే యెహోవాను ఎందుకు సంతోషపెట్టవు?

12. నేటి ప్రజలకు హోషేయ 6:6లో ఎలాంటి హెచ్చరిక ఉంది?

13. మనమెలాంటి అర్పణలు అర్పిస్తాం, అయితే వాటి విలువ విషయంలో దేనిని గుర్తుంచుకోవాలి?

14. దేవుని భావాల గురించి హోషేయ ప్రవచనం ఏమి వెల్లడిచేస్తోంది?

15. హోషేయ 6:7 ప్రకారం, ఇశ్రాయేలీయుల్లో కొందరు ఎలా ప్రవర్తిస్తున్నారు?

16, 17. (ఎ) ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు చేసిన నిబంధన విషయంలో వారెలా ప్రవర్తించారు? (బి) మన క్రియల విషయంలో మనమేమి గుర్తుంచుకోవాలి?

18, 19. హోషేయ 8:7లో మనకు ఏ సూత్రం కనబడుతుంది, ఆ సూత్రం ఇశ్రాయేలీయుల విషయంలో నిజమని ఎలా నిరూపించబడింది?

20. ఇశ్రాయేలీయుల అనుభవం మనకేమి బోధిస్తోంది?

21. మనం మంచిని పంటగా ఎలా కోయగలం?

22. హోషేయ 6 నుండి 9 అధ్యాయాల్లో మనమే పాఠాలు నేర్చుకున్నాం?

[23వ పేజీలోని చిత్రం]

తెల్లవారగానే కనబడే మేఘంలాగే ఇశ్రాయేలీయుల భక్తి నిలవలేదు

[23వ పేజీలోని చిత్రం]

ఇశ్రాయేలీయుల చెడు కోరికలు పొయ్యిని అధికంగా వేడిచేసినట్లయ్యాయి

[24వ పేజీలోని చిత్రం]

యెహోవా తన ప్రజల బలులను ఎందుకు తిరస్కరించాడు?

[25వ పేజీలోని చిత్రం]

మంచిని పంటగా కోయాలంటే మనం మంచినే విత్తాలి