కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవునితో నడిచేందుకు హోషేయ ప్రవచనం మనకు సహాయపడుతుంది

దేవునితో నడిచేందుకు హోషేయ ప్రవచనం మనకు సహాయపడుతుంది

దేవునితో నడిచేందుకు హోషేయ ప్రవచనం మనకు సహాయపడుతుంది

“వారు యెహోవా వెంబడి నడిచెదరు.”​—⁠హోషేయ 11:10.

ఆకర్షణీయమైన పాత్రలు, ఆసక్తికరమైన కథాంశాలున్న నాటకాలను మీరిష్టపడతారా? బైబిలు పుస్తకమైన హోషేయలో ఒక సూచనార్థక నాటకముంది. * ఆ నాటకం దేవుని ప్రవక్తయైన హోషేయ కుటుంబ పరిస్థితిని వర్ణించడమే కాక, అది మోషే ధర్మశాస్త్రం మూలంగా ప్రాచీన ఇశ్రాయేలుతో యెహోవా కుదుర్చుకున్న అలంకారార్థ పెళ్ళికి కూడా సంబంధించినది.

2 ఈ నాటకపు నేపథ్యం హోషేయ 1వ అధ్యాయంలో కనబడుతుంది. హోషేయ ఇశ్రాయేలీయుల పది గోత్రాల రాజ్యంలో ఏదో ఒక ప్రాంతంలో నివసించినట్లు తెలుస్తోంది. ఆ రాజ్యంలో ఎఫ్రాయిము పలుకుబడిగల గోత్రంగా ఉన్నందున అది ఎఫ్రాయిము అని కూడా పిలువబడింది. ఆయన ఇశ్రాయేలు చివరి ఏడుగురు పాలకుల పరిపాలనా కాలంలో, యూదా రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాల కాలంలో ప్రవచించాడు. (హోషేయ 1:⁠1) కాబట్టి హోషేయ కనీసం 59 సంవత్సరాలు ప్రవచించాడు. హోషేయ పుస్తకం సా.శ.పూ. 745 తర్వాత కొద్దికాలంలోపే పూర్తి చేయబడినప్పటికీ, “వారు యెహోవా వెంబడి నడిచెదరు” అని ప్రవచించబడిన ప్రజల జీవన విధానాన్నే లక్షలాదిమంది అనుసరిస్తున్న కారణంగా అది ఇప్పటికీ అనుసరణీయమైనదే.​—⁠హోషేయ 11:⁠10.

సమీక్ష ఏమి వెల్లడిస్తోంది?

3 హోషేయలోని 1 నుండి 5 అధ్యాయాల క్లుప్త సమీక్ష విశ్వాసంతో, దేవుని చిత్తానుసారమైన జీవన విధానాన్ని అనుసరిస్తూ ఆయనతో నడవాలనే మన దృఢసంకల్పాన్ని బలపరుస్తుంది. ఇశ్రాయేలు రాజ్య ప్రజలు ఆధ్యాత్మిక వ్యభిచారం విషయంలో దోషులైనప్పటికీ, వారు పశ్చాత్తాపం చూపిస్తే దేవుడు వారిని కరుణిస్తాడు. ఇది హోషేయ తన భార్యయైన గోమెరుతో వ్యవహరించిన తీరులో ఉదాహరించబడింది. ఆయనకు ఒక కుమారుణ్ణి కనిన తర్వాత, ఆమెకు అక్రమ సంబంధం మూలంగా ఇద్దరు పిల్లలు పుట్టారు. అయినప్పటికీ, పశ్చాత్తప్త ఇశ్రాయేలీయులపట్ల కరుణ చూపించడానికి యెహోవా సుముఖంగా ఉన్నట్లే, హోషేయ ఆమెను తిరిగి చేర్చుకున్నాడు.​—⁠హోషేయ 1:1-3:⁠5.

4 ఆ దేశంలో సత్యం గానీ, ప్రేమపూర్వక దయగానీ, దేవుని గూర్చిన జ్ఞానం గానీ లేని కారణంగా ఇశ్రాయేలీయులపై యెహోవాకు న్యాయపరమైన వ్యాజ్యం ఉంది. వ్యభిచారం చేసిన ఇశ్రాయేలును, దారితప్పిన యూదా రాజ్యాన్ని ఆయన శిక్షిస్తాడు. కానీ దేవుని ప్రజలు “దురవస్థలో” ఉన్నప్పుడు మాత్రమే యెహోవాను వెదికేవారు.​—⁠హోషేయ 4:1-5:⁠15.

నాటకం స్పష్టమవడం

5 “జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము” అని దేవుడు హోషేయకు ఆజ్ఞాపించాడు. (హోషేయ 1:⁠2) ఇశ్రాయేలులో వ్యభిచారము ఎంత ప్రబలంగా ఉంది? మనకిలా చెప్పబడింది: “వ్యభిచారమనస్సు వారిని [పది గోత్రాల రాజ్య ప్రజలను] త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. . . . మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడండ్లును వ్యభిచారిణులైరి. జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులనర్పింతురు.”​—⁠హోషేయ 4:​12-14.

6 శారీరకంగానూ, ఆధ్యాత్మిక భావంలోనూ ఇశ్రాయేలులో వ్యభిచారం విశృంఖలంగా ఉంది. కాబట్టి యెహోవా ఇశ్రాయేలీయులను ‘శిక్షిస్తాడు.’ (హోషేయ 1:⁠4; 4:⁠9) నేడు లైంగిక దుర్నీతిని అభ్యసించేవారిని, అపవిత్ర ఆరాధన చేసేవారిని యెహోవా శిక్షిస్తాడు కాబట్టి మనకు ఈ హెచ్చరిక ప్రాముఖ్యమైనది. అయితే దేవునితో నడిచేవారు ఆయన పరిశుద్ధ ఆరాధనా ప్రమాణాలను అనుసరిస్తారు. అంతేకాక, వారికి ‘ఏ వ్యభిచారి దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడని’ కూడా తెలుసు.​—⁠ఎఫెసీయులు 5:5; యాకోబు 1:⁠27.

7 హోషేయ గోమెరును పెళ్లి చేసుకున్నప్పుడు, ఆమె కన్యగా ఉండడమే కాక, ఆమె “అతనికొక కుమారుని” కన్నప్పుడు నమ్మకమైన భార్యగానే ఉంది. (హోషేయ 1:3) సూచనార్థక నాటకంలో చిత్రీకరించబడినట్లుగా, సా.శ.పూ. 1513లో దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వం నుండి విడిపించిన కొద్దికాలం తర్వాత, ఆయన వారితో పవిత్రమైన వివాహ ఒప్పందంలాంటి ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనకు అంగీకరిస్తూ ఇశ్రాయేలు తన “భర్తయైన” యెహోవాకు నమ్మకంగా ఉంటానని వాగ్దానం చేసింది. (యెషయా 54:5) అవును, గోమెరును హోషేయ చేసుకున్న పవిత్ర వివాహం, దేవుడు అలంకారార్థంగా ఇశ్రాయేలును చేసుకున్న ఆ వివాహాన్ని సూచించింది. అయితే పరిస్థితులు ఎంతగా మారిపోయాయో కదా!

8 హోషేయ భార్య “మరల గర్భవతియై కుమార్తెను కనెను.” ఆ కుమార్తె, ఆ తర్వాత పుట్టిన బిడ్డ కూడా గోమెరుకు బహుశా వ్యభిచారంవల్లనే పుట్టివుంటారు. (హోషేయ 1:6, 8) గోమెరు ఇశ్రాయేలుకు సూచనగా ఉంది కాబట్టి, ‘ఇశ్రాయేలు ఎలా వ్యభిచరించింది’ అని మీరు అడగవచ్చు. సా.శ.పూ. 997లో ఇశ్రాయేలు పది గోత్రాలు దక్షిణ దిక్కునున్న యూదా, బెన్యామీను గోత్రాల నుండి వేరుపడ్డాయి. యెరూషలేము దేవాలయంలో యెహోవాను ఆరాధించేందుకు ప్రజలు యూదాకు వెళ్లకుండా చేసేందుకు, ఉత్తర దిక్కునున్న పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యంలో దూడ ఆరాధన నెలకొల్పబడింది. లైంగిక దుశ్చర్యలు విశృంఖలంగా ఉండే, అబద్ధ దేవుడైన బయలు ఆరాధన ఇశ్రాయేలులో వేళ్ళూనుకుపోయింది.

9 గోమెరుకు బహుశా అక్రమ సంతానంగా రెండవ బిడ్డ పుట్టినప్పుడు, దేవుడు హోషేయతో ఇలా అన్నాడు: “దీనికి లోరూహామా అనగా జాలినొందనిది అని పేరు పెట్టుము; ఇకమీదట నేను ఇశ్రాయేలువారిని క్షమించను, వారియెడల జాలిపడను.” (హోషేయ 1:6) సా.శ.పూ. 740లో అష్షూరు ఇశ్రాయేలీయులను బంధీలుగా తీసుకొని పోయినప్పుడు యెహోవా వారిపై ‘జాలిపడలేదు.’ అయితే యెహోవా రెండు గోత్రాల యూదా రాజ్యంపై జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుఱ్ఱములు, రౌతుల ప్రమేయం లేకుండా దానిని రక్షించాడు. (హోషేయ 1:⁠7) సా.శ.పూ. 732లో యెహోవా పంపించిన ఒకేఒక దేవదూత యూదా రాజధానియైన యెరూషలేమును ముట్టడించిన అష్షూరు సైనికుల్లో 1,85,000 మందిని ఒకే రాత్రిలో హతమార్చాడు.​—⁠2 రాజులు 19:⁠35.

ఇశ్రాయేలుపై యెహోవా న్యాయసమ్మతమైన వ్యాజ్యం

10 గోమెరు హోషేయను విడిచిపెట్టి “వ్యభిచారము చేయు స్త్రీగా” మారి మరో పురుషునితో వ్యభిచార జీవితం గడిపింది. ఇది ఇశ్రాయేలు రాజ్యం విగ్రహారాధన చేసే జనాంగాలతో రాజకీయ పొత్తుపెట్టుకుని వాటిపై ఆధారపడడం ఆరంభించడాన్ని ఉదాహరిస్తోంది. ఇశ్రాయేలు తాను పొందిన భౌతిక ఆశీర్వాదాల ఘనతను యెహోవాకు ఇచ్చే బదులు, ఆ ఆశీర్వాదాలను జనాంగాల దేవతలకు ఆపాదిస్తూ, అబద్ధారాధన చేస్తూ దేవునితో చేసుకున్న తమ వివాహ నిబంధనను ఉల్లంఘించింది. కాబట్టి ఆధ్యాత్మిక వ్యభిచారం చేస్తున్న ఆ జనాంగంపై యెహోవాకు న్యాయసమ్మత వ్యాజ్యం ఉండడంలో ఆశ్చర్యం లేదు.​—⁠హోషేయ 1:⁠2; 2:2, 12, 13.

11 తన భర్తను విడిచిపెట్టినందుకు ఇశ్రాయేలు ఎలాంటి మూల్యం చెల్లించింది? అష్షూరుపై విజయం సాధించిన బబులోను “అరణ్యములోనికి” ఇశ్రాయేలీయులు సా.శ.పూ. 740లో చెరగా కొనిపోబడేందుకు దేవుడు అనుమతించాడు. (హోషేయ 2:​14) ఆ 10 గోత్రాల రాజ్యం అలా అంతరించేలా యెహోవా చేసినప్పటికీ, ఆయన మొదట్లో 12 గోత్రాల ఇశ్రాయేలు జనాంగంతో చేసుకున్న వివాహ నిబంధనను రద్దు చేయలేదు. వాస్తవానికి, సా.శ.పూ. 607లో బబులోనీయులు యెరూషలేమును నాశనం చేయడానికి, యూదా ప్రజలు బంధీలవడానికి దేవుడు అనుమతించినప్పటికీ, 12 గోత్రాల ఇశ్రాయేలు జనాంగం తనతో అలంకారార్థ వివాహబంధంలోకి ప్రవేశించేందుకు ఆధారమైన మోషే ధర్మశాస్త్రాన్ని ఆయన రద్దు చేయలేదు. యూదా మతనాయకులు యేసుక్రీస్తును తిరస్కరించి, ఆయనను సా.శ. 33లో మరణానికి అప్పగించిన తర్వాతే ఆ వివాహ సంబంధం రద్దయ్యింది.​—⁠కొలొస్సయులు 2:​13-14.

యెహోవా ఇశ్రాయేలును హెచ్చరించడం

12 ఇశ్రాయేలు ‘తన పోకిరిచూపు’ మానుకోవాలని దేవుడు దానిని హెచ్చరించాడు, అయినా అది తన విటకాండ్రను అనుసరించి వెళ్లడానికే ఇష్టపడింది. (హోషేయ 2:​3, 5) అందువల్ల యెహోవా ఇలా అన్నాడు: “ముండ్లకంచె దాని మార్గములకు అడ్డము వేయుదును; దాని మార్గములు దానికి కనబడకుండ గోడ కట్టుదును. అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును; ఎంత వెదకినను వారు దానికి కనబడకయుందురు. అప్పుడు అది​—⁠ఇప్పటికంటె పూర్వమే నా స్థితి బాగుగ నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటియొద్దకు వెళ్లుదుననుకొనును. దానికి ధాన్య ద్రాక్షారసతైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చినవాడను నేనేయని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచెను.”​—⁠హోషేయ 2:​6-8.

13 తన ‘విటకాండ్రయిన’ జనాంగాల సహాయాన్ని ఇశ్రాయేలు వెదకినప్పటికీ, వాటిలో ఏ ఒక్కటీ దానికి సహాయం చేయలేకపోయాయి. దానికి వేయబడిన కంచె ఎంత మందంగా ఉందంటే, ఆ జనాంగాలు దానికి ఏ విధంగానూ సహాయం చేయలేకపోయాయి. అష్షూరు మూడు సంవత్సరాల ముట్టడి తర్వాత సా.శ.పూ. 740లో దాని ముఖ్యపట్టణమైన షోమ్రోను కూలిపోగా, పది గోత్రాల రాజ్యం మళ్లీ పునఃస్థాపించబడలేదు. చెరలోకి వెళ్లిన ఇశ్రాయేలీయుల్లో కొందరు మాత్రమే, తమ పితరులు యెహోవాను సేవించినప్పుడు పరిస్థితి ఎంత మెరుగ్గా ఉండేదో గ్రహిస్తారు. ఆ కొద్దిమంది బయలు ఆరాధనను త్యజించి యెహోవాతో నిబంధనా సంబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవాలని ప్రయత్నిస్తారు.

ఆ నాటకాన్ని మళ్లీ చూడడం

14 హోషేయ ఇంటి పరిస్థితులకూ, యెహోవాతో ఇశ్రాయేలుకున్న బంధానికీ మధ్యవున్న సంబంధాన్ని ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి ఈ మాటలను పరిశీలించండి: “యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా​—⁠. . .దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము.” (హోషేయ 3:⁠1) గోమెరు ఎవరితో కలిసి జీవిస్తుందో ఆ వ్యక్తి నుండి ఆమెను తిరిగి కొనడం ద్వారా హోషేయ ఆ ఆజ్ఞకు లోబడ్డాడు. ఆ తర్వాత హోషేయ తన భార్యను ఇలా గట్టిగా హెచ్చరించాడు: “చాల దినములు నా పక్షమున నిలిచియుండి యే పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు నీవుండవలెను.” (హోషేయ 3:​2, 3) గోమెరు ఆ క్రమశిక్షణకు తగినట్లు ప్రవర్తించడంతో, హోషేయ ఆమెతో తన వైవాహిక సంబంధాలు పునరుద్ధరించుకున్నాడు. ఇశ్రాయేలు, యూదా ప్రజలకు సంబంధించిన దేవుని వ్యవహారాలకు ఇదెలా అన్వయించింది?

15 ఇశ్రాయేలు, యూదా ప్రజలు బబులోను చెరలో ఉండగా, ‘వారితో ప్రేమగా మాట్లాడేందుకు’ దేవుడు తన ప్రవక్తలను ఉపయోగించాడు. దేవుని కనికరం పొందేందుకు, ఆ ప్రజలు గోమెరు తన భర్త దగ్గరకు తిరిగివెళ్లినట్లే పశ్చాత్తాపపడి భర్తలాంటి తమ యజమాని దగ్గరకు వెళ్లాలి. అప్పుడే క్రమశిక్షణ పొందిన తన భార్యలాంటి జనాంగాన్ని యెహోవా బబులోను “అరణ్యము” నుండి తోడుకొని యూదా, యెరూషలేముకు తిరిగి తీసుకొస్తాడు. (హోషేయ 2:​14, 15) ఆయన ఆ వాగ్దానాన్ని సా.శ.పూ. 537లో నెరవేర్చాడు.

16 దేవుడు ఈ వాగ్దానాన్ని కూడా నెరవేర్చాడు: “ఆ దినమున నేను నా జనులపక్షముగా భూజంతువులతోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకు జంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును.” (హోషేయ 2:​18) తమ స్వదేశానికి తిరిగివచ్చిన యూదా శేష ప్రజలు జంతు భయమేమీ లేకుండా నిర్భయంగా నివసించారు. ఈ ప్రవచనం సా.శ. 1919లో, ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహాబబులోను” నుండి ఆధ్యాత్మిక ఇశ్రాయేలు శేషం విడిపించబడినప్పుడు కూడా నెరవేరింది. వారిప్పుడు భూమ్మీద నిరంతరం జీవించే నిరీక్షణగల తమ సహవాసులతో ఆధ్యాత్మిక పరదైసులో నిర్భయంగా నివసిస్తూ జీవితాన్ని ఆనందిస్తున్నారు. ఈ నిజ క్రైస్తవుల్లో మృగలక్షణాలు మచ్చుకైనా కనిపించవు.​—⁠ప్రకటన 14:8; యెషయా 11:6-9; గలతీయులు 6:⁠16.

పాఠాలు గుర్తుంచుకోండి

17దేవుడు కరుణామయుడు, జాలిగలవాడు, మనం కూడా అలాగే ఉండాలి. హోషేయ తొలి అధ్యాయాల్లో మనకు ఆ పాఠం నేర్పించబడింది. (హోషేయ 1:​6, 7; 2:​23) పశ్చాత్తప్త ఇశ్రాయేలీయులపట్ల జాలి చూపాలనే దేవుని సుముఖత ఈ ప్రేరేపిత సామెతకు అనుగుణంగా ఉంది: “అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు; వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.” (సామెతలు 28:​13) పశ్చాత్తప్త దోషులకు కీర్తనకర్త పలికిన ఈ మాటలు కూడా ఓదార్పునిస్తాయి: “విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.”​—⁠కీర్తన 51:​17.

18 హోషేయ ప్రవచనం మనం ఆరాధించే దేవుని కరుణను, జాలిని నొక్కి చెబుతోంది. కొందరు ఆయన నీతి మార్గాల నుండి తప్పిపోయినా, వారు పశ్చాత్తాపపడి తిరిగి రావచ్చు. వారలా వచ్చినప్పుడు యెహోవా వారిని సాదరంగా ఆహ్వానిస్తాడు. అలంకారార్థ వివాహ బంధంలో ప్రవేశించిన ఇశ్రాయేలు జనాంగపు పశ్చాత్తప్త సభ్యులను ఆయన కరుణించాడు. వారు యెహోవాకు అవిధేయులై ‘ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి సంతాపము కలిగించినా, వారు కేవలము శరీరులై యున్నారని జ్ఞాపకము చేసికొని’ వారిపై కనికరపడ్డాడు. (కీర్తన 78:38-41) కరుణామయుడైన యెహోవా దేవునితో నడిచేందుకు అలాంటి కనికరం మనల్ని పురికొల్పాలి.

19 ఇశ్రాయేలులో హత్య, దొంగతనం, వ్యభిచారం వంటి పాపాలు విశృంఖలంగా జరుగుతున్నప్పటికీ, యెహోవా ‘దానితో ప్రేమగా మాట్లాడాడు.’ (హోషేయ 2:​14; 4:⁠2) యెహోవా కనికరాన్ని, జాలిని మనం ప్రతిఫలిస్తుండగా మన హృదయాలు కదిలించబడి, యెహోవాతో మనకున్న వ్యక్తిగత బంధం బలపరచబడాలి. కాబట్టి మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుందాం: ‘ఇతరులతో వ్యవహరించేటప్పుడు నేను యెహోవా కనికరాన్ని, జాలిని ఎంత బాగా అనుకరించగలను? నన్ను బాధపెట్టిన తోటి క్రైస్తవుడు క్షమాపణ అడిగితే, దేవునిలాగే నేను కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నానా?’​—⁠కీర్తన 86:⁠5.

20దేవుడు నిజమైన నిరీక్షణను అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు, ఆయన ఇలా వాగ్దానం చేశాడు: ‘దానికి ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను.’ (హోషేయ 2:15) “ఆకోరు లోయ” ఉన్న తమ స్వదేశానికి తిరిగి పునరుద్ధరించబడతామనే ఖచ్చితమైన నిరీక్షణ దేవుని ప్రాచీన భార్యలాంటి సంస్థకు ఉంది. సా.శ.పూ. 537లో నెరవేరిన ఆ వాగ్దాన నెరవేర్పు, యెహోవా మన ఎదుట ఉంచిన ఖచ్చితమైన నిరీక్షణలో ఆనందించే విలువైన కారణాన్ని మనకిస్తోంది.

21దేవునితో నిరంతరం నడిచేందుకు, మనమెల్లప్పుడూ ఆయన గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ, దానిని మన జీవితాల్లో అన్వయించుకుంటూ ఉండాలి. యెహోవా గురించిన జ్ఞానం ఇశ్రాయేలులో బొత్తిగా లేకుండా పోయింది. (హోషేయ 4:1, 6) అయినప్పటికీ, కొందరు దైవిక బోధను అత్యుత్తమంగా పరిగణించి దానికి అనుగుణంగా ప్రవర్తించి మెండుగా ఆశీర్వదించబడ్డారు. వారిలో హోషేయ ఒకరు. ఏలీయా కాలంలో బయలుకు మోకాళ్లూనని 7,000 మందీ ఆయనలాగే ఆశీర్వదించబడ్డారు. (1 రాజులు 19:18; రోమీయులు 11:1-4) దైవిక ఉపదేశంపట్ల మన కృతజ్ఞత ఎల్లప్పుడూ దేవునితో నడిచేందుకు మనకు సహాయం చేస్తుంది.​—⁠కీర్తన 119:66; యెషయా 30:20, 21.

22తన ప్రజల్లో సారథ్యం వహిస్తున్నవారు మతభ్రష్టత్వాన్ని విసర్జించాలని యెహోవా ఆశిస్తున్నాడు. అయితే హోషేయ 5:1 ఇలా తెలియజేస్తోంది: “యాజకులారా, నామాట ఆలకించుడి; ఇశ్రాయేలువారలారా, చెవిని బెట్టి ఆలోచించుడి; రాజసంతతివారలారా, చెవియొగ్గి ఆలకించుడి, మీరు మిస్పామీద ఉరిగాను తాబోరుమీద వలగాను ఉన్నారు గనుక మిమ్మునుబట్టి ఈ తీర్పు జరుగును.” మతభ్రష్ట నాయకులు ఇశ్రాయేలీయులను విగ్రహారాధనవైపు ఆకర్షించే ఒక ఉరిగాను, వలగాను ఉన్నారు. తాబోరు పర్వతం, మిస్పా అనే ప్రాంతం బహుశా అలాంటి అబద్ధ ఆరాధనా కేంద్రాలుగా ఉండవచ్చు.

23 హోషేయ ప్రవచనం ఇప్పటివరకు మనకు యెహోవా నిరీక్షణ అనుగ్రహించే కనికరంగల దేవుడనీ, తన ఉపదేశాన్ని అన్వయించుకుంటూ మతభ్రష్టత్వాన్ని తృణీకరించేవారిని ఆశీర్వదిస్తాడనీ చూపించింది. పూర్వకాలంలో పశ్చాత్తాపపడిన ఇశ్రాయేలీయుల్లాగే, మనం కూడా యెహోవాను వెదకి ఎల్లప్పుడూ ఆయనను సంతోషపెట్టేందుకు కృషి చేసేవారిగా ఉందాం. (హోషేయ 5:15) అలా చేయడం ద్వారా మంచిని పంటగా కోయడమే కాక, నమ్మకంగా దేవునితో నడిచేవారందరూ అనుభవించే సాటిలేని ఆనందాన్ని, సమాధానాన్ని మనమూ అనుభవిస్తాం.​—⁠కీర్తన 100:2; ఫిలిప్పీయులు 4:6, 7.

[అధస్సూచి]

^ పేరా 3 గలతీయులు 4:21-26లో ఇంకొక సూచనార్థక నాటకం వర్ణించబడింది. దాని గురించి యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం) సంపుటి 2, 693-4 పేజీలు చూడండి.

మీరెలా సమాధానమిస్తారు?

హోషేయ గోమెరుల వివాహం దేనిని సూచించింది?

ఇశ్రాయేలుపై యెహోవాకు ఎందుకు న్యాయసమ్మతమైన వ్యాజ్యం ఉంది?

హోషేయ 1 నుండి 5 అధ్యాయాల్లోని ఏ పాఠం మిమ్మల్ని ప్రభావితం చేసింది?

[అధ్యయన ప్రశ్నలు]

1. హోషేయ పుస్తకంలో ఎలాంటి సూచనార్థక నాటకం కనబడుతుంది?

2. హోషేయ గురించి తెలిసిన వివరాలు ఏమిటి?

3, 4. హోషేయ 1 నుండి 5 అధ్యాయాల్లో ఉన్న విషయాలను క్లుప్తంగా వివరించండి.

5, 6. (ఎ) పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యంలో వ్యభిచారం ఎంత విశృంఖలంగా ఉంది? (బి) ప్రాచీన ఇశ్రాయేలుకు ఇవ్వబడిన హెచ్చరిక మనకెందుకు ప్రాముఖ్యమైనది?

7. గోమెరు హోషేయల వివాహం దేనిని సూచిస్తోంది?

8. పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం ఎలా ఉనికిలోకి వచ్చింది, దాని ఆరాధన గురించి మీరేమి చెప్పగలరు?

9. హోషేయ 1:6లో ముందే చెప్పబడినట్లుగా ఇశ్రాయేలుకు ఏమి సంభవించింది?

10. గోమెరు వ్యభిచార ప్రవర్తన దేనిని ఉదాహరించింది?

11. ఇశ్రాయేలీయులను, యూదావారిని చెరగా కొనిపోవడానికి యెహోవా అనుమతించినప్పుడు ధర్మశాస్త్రానికి ఏమి సంభవించింది?

12, 13. హోషేయ 2:6-8 సారాంశమేమిటి, ఆ మాటలు ఇశ్రాయేలుకు ఎలా అన్వయించాయి?

14. హోషేయ గోమెరుతో ఎందుకు తన వైవాహిక సంబంధాలు పునరుద్ధరించుకున్నాడు?

15, 16. (ఎ) క్రమశిక్షణ పొందిన దేవుని జనాంగం ఎలాంటి పరిస్థితుల్లో ఆయన కరుణను చవిచూడగలదు? (బి) హోషేయ 2:⁠18 ఎలా నెరవేరింది?

17-19. (ఎ) మనం అనుకరించాలని ఉద్బోధించబడిన దేవుని లక్షణాలు ఏమిటి? (బి) యెహోవా కనికరం, జాలి మనపై ఎలాంటి ప్రభావం చూపించాలి?

20. దేవుడు అనుగ్రహించిన నిరీక్షణను మనం విశ్వసించాలని చూపించే ఒక ఉదాహరణ చెప్పండి.

21. మనం దేవునితో నడిచే విషయంలో జ్ఞానం ఎలాంటి పాత్ర పోషిస్తుంది?

22. మతభ్రష్టత్వాన్ని ఎలా దృష్టించాలి?

23. హోషేయ 1 నుండి 5 అధ్యాయాల అధ్యయనం నుండి మీరెలా ప్రయోజనం పొందారు?

[18వ పేజీలోని చిత్రం]

హోషేయ భార్య ఎవరికి ప్రతీకగా ఉందో మీకు తెలుసా?

[19వ పేజీలోని చిత్రం]

సా.శ.పూ. 740లో అష్షూరీయులు షోమ్రోను నివాసులను జయించారు

[20వ పేజీలోని చిత్రం]

ఆనందకరమైన ప్రజలు తమ స్వదేశానికి తిరిగివచ్చారు