ప్రేమతో వినే కళ
ప్రేమతో వినే కళ
“నేను చెప్పింది విన్నందుకు కృతజ్ఞతలు.” ఈ మధ్య మీకు ఎవరైనా అలా చెప్పారా? అది ఎంత చక్కని ప్రశంసో కదా! శ్రద్ధగా వినేవారిని దాదాపు ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. మనం శ్రద్ధగా వినడం ద్వారా మానసిక కృంగుదలతో ఉన్నవారిని లేక సమస్యల భారం మోస్తున్నవారిని పునరుత్తేజపరచవచ్చు. మనం శ్రద్ధగా వినేవారిగా ఉండడం వ్యక్తులను అమూల్యమైనవారిగా పరిగణించేందుకు మనకు సహాయం చేయదా? క్రైస్తవ సంఘంలో ‘ప్రేమచూపడానికి సత్కార్యాలు చేయడానికి ఒకరినొకరు పురికొల్పుకోవడంలో’ ప్రేమతో వినడం చాలా ప్రాముఖ్యమైన భాగం.—హెబ్రీయులు 10:24.
అయితే చాలామంది సరిగ్గా వినరు. ఇతరులు చెప్పేది వినే బదులు వారు తమ సలహా, తమ అనుభవాలు లేక తమ అభిప్రాయం చెప్పడానికే ఇష్టపడతారు. వినడం నిజానికి ఒక కళ. మనం ప్రేమతో వినడాన్ని ఎలా నేర్చుకోవచ్చు?
అతి ప్రాముఖ్యమైన ఒక కారకం
యెహోవా మన “మహోపదేశకుడు.” (యెషయా 30:20, NW) ఆయన మనకు వినడం గురించి ఎక్కువగా బోధించగలడు. యెహోవా ఏలీయా ప్రవక్తకు ఎలా సహాయం చేశాడో పరిశీలించండి. ఏలీయా, యెజెబెలు రాణి బెదిరింపులకు భయపడి అరణ్యంలోకి పారిపోయి చనిపోవాలని కోరుకున్నాడు. అక్కడ దేవుని దూత ఆయనతో మాట్లాడాడు. ఆ ప్రవక్త తన భయాలను వివరిస్తున్నప్పుడు యెహోవా విని ఆ తర్వాత తన గొప్ప శక్తిని ప్రదర్శించాడు. దాని ఫలితమేమిటి? ఏలీయా భయాన్ని వీడి తన నియామకాన్ని తిరిగి చేపట్టాడు. (1 రాజులు 19:2-15) యెహోవా తన సేవకుల చింతలు వినడానికి ఎందుకు సమయం తీసుకుంటాడు? ఎందుకంటే ఆయన వారి గురించి చింతిస్తున్నాడు. (1 పేతురు 5:7) శ్రద్ధగా వినేవారిగా తయారవడానికి ఒక ముఖ్య కారకం ఏమిటంటే, ఇతరుల గురించి చింతించి, వారిపట్ల నిజమైన శ్రద్ధ చూపించడం.
బొలీవియాలోని ఒక వ్యక్తి గంభీరమైన తప్పు చేసినప్పుడు, తోటి విశ్వాసి అలాంటి నిజమైన శ్రద్ధ కనపరచినందుకు ఆయన కృతజ్ఞత చూపించాడు. ఆ వ్యక్తి ఇలా వివరిస్తున్నాడు: “నేనప్పుడు నా జీవితంలో అతి దుఃఖకరమైన సమయంలో ఉన్నాను. ఒక సహోదరుడు నేను చెప్పేది వినడానికి సమయం తీసుకోనట్లయితే నేను సులభంగా యెహోవాను సేవించే ప్రయత్నాలు మానేసేవాణ్ణే. ఆయన ఎక్కువగా ఏమీ చెప్పలేదు, అయితే ఆయన నేను చెప్పేది వినడానికి శ్రద్ధ చూపించాడు అని తెలుసుకోవడం నన్ను నిజంగా బలపరిచింది. నాకు పరిష్కారం అవసరం లేదు, నేనేమి చేయాలో నాకు తెలుసు. నేనెలా భావిస్తున్నాననేది అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి శ్రద్ధ చూపిస్తున్నాడని తెలుసుకోవడం మాత్రమే నాకు అవసరం. నేను చెప్పేది ఆయన వినడం నేను నిరాశతో కృంగిపోకుండా కాపాడింది.”
ప్రేమతో వినే కళ విషయంలో యేసుక్రీస్తు ఒక గొప్ప ఆదర్శం. యేసు మరణించిన కొద్దికాలం తర్వాత ఆయన ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెకు ప్రయాణిస్తున్నారు. వారు ఖచ్చితంగా నిరుత్సాహంతో ఉన్నారు. అందుకే పునరుత్థానుడైన యేసుక్రీస్తు వారితో నడవడం మొదలుపెట్టాడు. ఆయన వారి చింతల గురించి తెలుసుకోవడానికి జాగ్రత్తగా కూర్చిన ప్రశ్నలు అడిగాడు, దానికి శిష్యులు ప్రతిస్పందించారు. వారు తాము పెట్టుకున్న ఆశల గురించి, తాము అప్పుడు అనుభవిస్తున్న నిరాశ, గందరగోళం గురించి చెప్పారు. యేసు వారిపట్ల శ్రద్ధ చూపించాడు, వారు చెప్పింది ఆయన ప్రేమతో వినడం ఆ ఇద్దరు శిష్యులు ఆయన చెప్పేది వినేందుకు వారిని సిద్ధం చేసింది. ఆ తర్వాత యేసు “లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.”—లూకా 24:13-27.
ఇతరులు మనం చెప్పేది వినేలా చేసే ఒక ప్రేమపూర్వకమైన పద్ధతి, వారు చెబుతున్నది వినేందుకు చొరవ చూపించడమే.
బొలీవియాకు చెందిన ఒక స్త్రీ ఇలా చెబుతోంది: “నేను నా పిల్లలను పెంచుతున్న పద్ధతిని నా తల్లిదండ్రులు, నా అత్తామామలు ఆక్షేపించడం మొదలుపెట్టారు. వారి వ్యాఖ్యానాలకు నేను కోపగించుకొనేదాన్ని, కానీ ఒక తల్లిగా నాకు నా మీదే అపనమ్మకం కలిగింది. ఆ సమయంలోనే ఒక యెహోవాసాక్షి నన్ను కలిసింది. ఆమె నాతో దేవుని వాగ్దానాల గురించి మాట్లాడింది. అయితే ఆమె నా అభిప్రాయం గురించి అడిగిన విధం నేను చెప్పేది వినడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్లు గుర్తించడానికి నాకు సహాయం చేసింది. ఆమెను లోపలికి ఆహ్వానించాను, కొంతసేపటికి నేను ఆమెకు నా సమస్యను వివరించడం మొదలుపెట్టాను. నేను చెబుతున్నది ఆమె ఓపికగా విన్నది. నా పిల్లల విషయంలో నేను ఏమి ఆశిస్తున్నాను, మావారు దాని గురించి ఏమనుకుంటున్నారు అనే అంశాలు ఆమె అడిగింది. నన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తితో సమయం గడపడం ఉపశమనాన్ని ఇచ్చింది. ఆమె కుటుంబ జీవితం గురించి బైబిలు ఏమి చెబుతోందో చూపించడం మొదలుపెట్టినప్పుడు నా పరిస్థితి గురించి శ్రద్ధ చూపించే ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నానని గుర్తించాను.”“ప్రేమ . . . స్వప్రయోజనమును విచారించుకొనదు” అని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 13:4, 5) కాబట్టి ప్రేమతో వినడం అంటే మనం మన స్వప్రయోజనాలను ప్రక్కన పెట్టడమని భావం. అలా చేయాలంటే ఇతరులు మనతో గంభీరమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు టీవీ కట్టేయడం, వార్తాపత్రికను ప్రక్కన పెట్టడం, సెల్‌ఫోన్‌ను ఆపివేయడం వంటివి చేయడం అవసరం కావచ్చు. ప్రేమతో వినడం అంటే ఎదుటి వ్యక్తి ఆలోచనలపట్ల ఎంతో ఆసక్తి చూపించడమని అర్థం. అలా ఆసక్తి చూపించాలంటే మనం “కొంతకాలం క్రితం నాకు జరిగినదాన్ని ఇది గుర్తుచేస్తోంది” అని చెబుతూ మన సొంత విషయాల గురించి మాట్లాడడం మొదలుపెట్టకుండా ఉండడం అవసరం కావచ్చు. స్నేహపూరితమైన సంభాషణలో అలాంటి మాటలు ఆమోదయోగ్యమైనవే అయినా, ఎవరైనా ఒక గంభీరమైన సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు మనం స్వప్రయోజనాలను ప్రక్కన పెట్టాలి. ఇతరులపట్ల నిజమైన ఆసక్తిని మరో విధంగా కూడా ప్రదర్శించవచ్చు.
భావాలను గ్రహించేందుకు వినండి
యోబు సహచరులు కనీసం ఆయన ఇచ్చిన పది ప్రసంగాలైనా విన్నారు. అయినా యోబు బాధతో ఇలా చెప్పాడు: “నా మనవి వినుటకై నాకొకడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను!” (యోబు 31:35) ఎందుకు? ఎందుకంటే వారు వినడంవల్ల ఆయన ఎలాంటి ఓదార్పూ పొందలేదు. వారు యోబు విషయంలో శ్రద్ధ చూపించలేదు, అలాగే ఆయన భావాలను అర్థం చేసుకోవడానికి ఇష్టపడలేదు. సానుభూతిగా వినేవారు చూపించే తదనుభూతి వారికి లేదు. అయితే అపొస్తలుడైన పేతురు ఇలా సలహా ఇస్తున్నాడు: “మీరందరు ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదరప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై యుండుడి.” (1 పేతురు 3:8) మనం ఒకరి సుఖదుఃఖాల్లో మరొకరం ఎలా పాలుపంచుకోవచ్చు? ఇతరుల భావాలపట్ల శ్రద్ధ చూపిస్తూ, వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఒక మార్గం. “అది మిమ్మల్ని కలవరపెట్టి ఉండవచ్చు” లేక “అపార్థం చేసుకోబడినట్లు మీరు భావించి ఉండవచ్చు” వంటి సానుభూతితో కూడిన వ్యాఖ్యానాలు చేయడం మనం శ్రద్ధ చూపిస్తున్నామని చూపించే ఒక మార్గం. ఆ వ్యక్తి చెబుతున్నదానిని మన మాటల్లో చెప్పడం మరో మార్గం, అలా చెప్పడం ద్వారా ఆయన చెప్పింది మనం అర్థం చేసుకున్నామని చూపిస్తాం. ప్రేమతో వినడం అంటే మాటలకు మాత్రమే కాక ఆ మాటల్లో దాగి ఉన్న భావోద్రేకాలకు కూడా శ్రద్ధనివ్వడమని భావం.
రాబర్ట్ * ఒక యెహోవాసాక్షి, ఆయన అనుభవజ్ఞుడైన పూర్తికాల పరిచారకుడు. ఆయన ఇలా చెబుతున్నాడు: “నా జీవితంలో ఒకసారి నేను నా పరిచర్య విషయంలో నిరుత్సాహపడ్డాను. నేను మాట్లాడాలనుకుంటున్నట్లు ప్రయాణ పై విచారణకర్తతో చెప్పాను. ఆయన నేను చెప్పింది నిజంగా విని నా భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆయన నా వైఖరిని విమర్శిస్తాడేమోననే నా భయాన్ని కూడా ఆయన అర్థం చేసుకున్నట్లు నాకు అనిపించింది. తాను కూడా అలాంటి భావాలు అనుభవించాడు కాబట్టి, నా భావాలు అర్థం చేసుకోదగినవేనని ఆ సహోదరుడు నాకు అభయాన్నిచ్చాడు. పరిచర్యలో కొనసాగేందుకు అది నాకు నిజంగా సహాయం చేసింది.”
ఒకరు చెబుతున్న విషయాలతో మనం ఏకీభవించకుండానే మనం వారు చెప్పేది వినవచ్చా? తాను ఎలా భావిస్తున్నాడో చెప్పినందుకు కృతజ్ఞులమని మనం ఒక వ్యక్తితో చెప్పవచ్చా? తప్పకుండా. మీ చిన్న కుమారుడు పాఠశాలలో పోట్లాడితే, లేక మీ అమ్మాయి ఇంటికి వచ్చి తాను ప్రేమలో పడ్డానని చెబితే అప్పుడేమిటి? ఒక తల్లి లేక తండ్రి ఏది సరైన ప్రవర్తనో, ఏది సరైన ప్రవర్తన కాదో వివరించే ముందు వారు చెబుతున్నది విని యౌవనుల మనసుల్లో ఏమి ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించడం సరైనది కాదా?
“నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్లవంటిది, వివేకముగలవాడు దానిని పైకి చేదుకొనును” అని సామెతలు 20:5 చెబుతోంది. ఒక వివేకవంతుడు అనుభవజ్ఞుడైన వ్యక్తి, కోరనిదే సలహా ఇవ్వడానికి ఇష్టపడనట్లయితే ఆయన సలహా పొందడానికి ఆయన మనసులో ఉన్న విషయాలను మనం రాబట్టాల్సి రావచ్చు. మనం ప్రేమతో వింటున్నప్పుడు కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. ఒక వ్యక్తి మనసులో ఉన్న విషయాలను బయటికి రాబట్టడానికి వివేచన అవసరం. ప్రశ్నలు అడగడం సహాయం చేస్తుంది, అయితే మనం అడిగే ప్రశ్నలు వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలుగజేసుకుంటున్నట్లుగా ఉండకుండా జాగ్రత్త వహించాలి. తనకు సౌకర్యవంతంగా అనిపించే అంశాలను మొదట చెప్పమని మాట్లాడే వ్యక్తికి సలహా ఇవ్వడం సహాయకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, తన వివాహంలో తాను ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడాలనుకునే ఒక భార్యకు, తాను తన భర్త ఎలా కలుసుకున్నారో, ఆ తర్వాత ఎలా వివాహం చేసుకున్నారో మొదట మాట్లాడడం సులభం అనిపించవచ్చు. క్రైస్తవ పరిచర్యలో నిష్క్రియునిగా మారిన ఒక వ్యక్తికి తాను సత్యాన్ని ఎలా తెలుసుకున్నాననే విషయాన్ని మొదట వివరించడం సులభమనిపించవచ్చు.
ప్రేమతో వినడం ఒక సవాలు
మన మీద కోపంగా ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వినడం కష్టమనిపించవచ్చు, ఎందుకంటే మనం సాధారణంగా మనల్ని మనం సమర్థించుకోవడానికే మొగ్గుచూపుతాం. మనం ఆ కష్టమైన పరిస్థితితో ఎలా వ్యవహరించవచ్చు? “మృదువైన మాట క్రోధమును చల్లార్చును” అని సామెతలు 15:1 చెబుతోంది. ఆ వ్యక్తిని మాట్లాడమని దయాపూర్వకంగా ఆహ్వానించి ఆయన తన ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పుడు ఓర్పుతో వినడం మృదువుగా జవాబిచ్చే ఒక పద్ధతి.
తీవ్రమైన వాగ్వివాదాల్లో, సాధారణంగా ఇద్దరు వ్యక్తులు తాము అప్పటికే చెప్పిన అంశాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటారు. ఇద్దరూ అవతలి వ్యక్తి వినడంలేదని అనుకుంటారు. ఇద్దర్లో ఒకరు మాట్లాడడం ఆపేసి అవతలి వ్యక్తి చెప్పే విషయాన్ని నిజంగా వింటే ఎంత బాగుంటుందో కదా! ఆశానిగ్రహాన్ని పాటించి తనను తాను వివేకంతో, ప్రేమపూర్వకమైన విధంగా వ్యక్తం చేసుకోవడం ప్రాముఖ్యమనేది నిజమే. బైబిలు మనకు ఇలా చెబుతోంది: “తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.”—సామెతలు 10:19.
ప్రేమతో వినే సామర్థ్యం సహజంగా రాదు. అయితే అది కృషితో, క్రమశిక్షణతో నేర్చుకోగల ఒక కళ. ఆ కళను సంపాదించుకోవడం నిజంగా ప్రయోజనకరం. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు నిజంగా వినడం మన ప్రేమను వ్యక్తం చేసే విధం. అది మన సంతోషానికి కూడా దోహదపడుతుంది. కాబట్టి ప్రేమతో వినే కళను వృద్ధి చేసుకోవడం ఎంత జ్ఞానయుక్తమో కదా!
[అధస్సూచి]
^ పేరా 12 పేరు మార్చబడింది.
[11వ పేజీలోని చిత్రం]
మనం వింటున్నప్పుడు మన స్వప్రయోజనాలను ప్రక్కన పెట్టాలి
[12వ పేజీలోని చిత్రం]
మనమీద కోపంగా ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వినడం కష్టమనిపించవచ్చు