కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మీ అందరి ప్రేమ విస్తరిస్తున్నది’

‘మీ అందరి ప్రేమ విస్తరిస్తున్నది’

‘మీ అందరి ప్రేమ విస్తరిస్తున్నది’

జపాన్‌లో 2004వ సంవత్సరంలో తుఫానులు, వరదలు, భూకంపాలు వంటి అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. వాటివల్ల యెహోవాసాక్షులతోపాటు అనేకులు తీవ్రంగా ప్రభావితులయ్యారు. (ప్రసంగి 9:​11, NW) అయితే ఈ వైపరీత్యాలు సాక్షులకు పరస్పరం సహోదర ప్రేమను చూపించుకునే అవకాశాన్నిచ్చాయి.​—⁠1 పేతురు 1:22.

ఉదాహరణకు, జూలైలో కురిసిన భారీ వర్షాలవల్ల మధ్య జపాన్‌లో ఒక నది పొంగిపొర్లింది. వరదలవల్ల యెహోవాసాక్షులకు చెందిన 20 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఒక రాజ్యమందిరంలో నేలకు ఒక మీటరు ఎత్తు వరకు వరదనీరు నిలిచింది. ఆ వెంటనే సమీప సంఘాల్లోని సాక్షులు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వందల సంఖ్యలో స్వచ్ఛంద సేవకులు వచ్చి బురదతో నిండుకుపోయిన ఇళ్లను శుభ్రం చేశారు. రాజ్యమందిరాన్ని వారు కేవలం రెండు రోజుల్లోనే పూర్తిగా శుభ్రం చేసి, బాగుచేశారు.

అదే ప్రాంతంలో అక్టోబరు 23న రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైన భూకంపం సంభవించింది. కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోగా, 1,00,000 కంటే ఎక్కువమందిని ఇళ్లు ఖాళీ చేయించవలసి వచ్చింది. నీరు, గ్యాస్‌, విద్యుత్తు వంటివాటి సరఫరా ఆగిపోయింది. బాగుచేసిన రాజ్య మందిరానికి 50 కిలోమీటర్ల దూరంలోనే భూకంపం వచ్చినప్పటికీ అది దెబ్బతినలేదు. అది సత్వరమే తాత్కాలిక సహాయ శిబిరంగా మారింది. క్రైస్తవ పైవిచారణకర్తలు తమ తోటి విశ్వాసుల క్షేమం గురించి వెంటనే వాకబుచేసి వారిలో ఎవరూ గాయపడలేదని, చనిపోలేదని తెలుసుకొని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ మరుసటి ఉదయమే, ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు అందించేందుకు జూలైలో సంభవించిన వరద బాధితులైన ఆరుగురు సాక్షులు ఆసక్తిగా ముందుకొచ్చారు. భూకంపం సంభవించిన కొన్ని గంటల్లోనే సహాయ సామగ్రి అందుబాటులోకివచ్చింది.

“వరదలవల్ల నష్టపోయినవారు భూకంపంవల్ల ప్రభావితులైన వారికి సహాయపడే పనుల్ని, తాము పొందిన సహాయంపట్ల కృతజ్ఞతను వ్యక్తపరిచే అవకాశంగా పరిగణించారు” అని ఒక పైవిచారణకర్త చెబుతున్నాడు. “వారు ఉదయం నుండి రాత్రి చాలా సమయం వరకు కష్టపడి పనిచేశారు. వారి ముఖాలు సంతోషంతో ఎంతగా వెలిగిపోయాయో!”

యెహోవాసాక్షుల క్రైస్తవ సహోదరత్వాన్ని కలిపివుంచే ప్రేమానుబంధాన్ని వరదలు గానీ, భూకంపాలు గానీ తెంచలేవు. బదులుగా, అలాంటి విపత్తులు సంభవించినప్పుడు, థెస్సలొనీకలోని తోటి విశ్వాసులకు పౌలు చెప్పిన ఈ మాటలను క్రైస్తవులు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు: “మీ అందరిలో ప్రతివాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది.”​—⁠2 థెస్సలొనీకయులు 1:⁠3.