కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“యెహోవా మార్గములు చక్కనివి”

“యెహోవా మార్గములు చక్కనివి”

“యెహోవా మార్గములు చక్కనివి”

“యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు.”​—⁠హోషేయ 14:⁠9.

ప్రవక్తయైన మోషే కాలంలో యెహోవా ఇశ్రాయేలీయులకు ఒక చక్కని ఆరంభాన్నిచ్చాడు. అయితే సా.శ.పూ. ఎనిమిదవ శతాబ్దపు తొలిభాగానికల్లా, వారి పరిస్థితి ఎంత చెడ్డగా మారిందంటే, దేవుడు వారిని ఘోర అపరాధులుగా ఎంచాడు. హోషేయ 10 నుండి 14 అధ్యాయాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

2 ఇశ్రాయేలీయుల హృదయం వేషధారణతో నిండిపోయింది. ఆ పది గోత్రాల రాజ్య ప్రజలు ‘చెడుతనాన్ని దున్ని’ పాపాన్ని లేదా అవినీతిని పంటగా కోశారు. (హోషేయ 10:​1, 13) “ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తుదేశములోనుండి పిలిచితిని” అని యెహోవా అన్నాడు. (హోషేయ 11:⁠1) దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెర నుండి విడుదల చేసినా, వారు అబద్ధాలతో, మోసాలతో ఆయనపై తిరుగుబాటు చేశారు. (హోషేయ 11:​12) కాబట్టి యెహోవా వారికిలా ఉపదేశించాడు: “నీవు నీ దేవునితట్టు తిరుగవలెను; కనికరమును న్యాయమును అనుసరించుము.”​—⁠హోషేయ 12:⁠6.

3 తిరగబడిన షోమ్రోనుకు దాని రాజుకు విపత్కర ముగింపు ఉంటుంది. (హోషేయ 13:​11, 16) అయితే హోషేయ ప్రవచనంలోని చివరి అధ్యాయం ఆరంభంలో ఈ విన్నపం ఉంది: ‘ఇశ్రాయేలూ, నీ దేవుడైన యెహోవాతట్టు తిరుగుము.’ ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపంతో దేవుని క్షమాపణను అడిగితే, దేవుడు వారిని కరుణిస్తాడు. అయితే, వారు “యెహోవా మార్గములు చక్కనివి” అని ఒప్పుకొని, వాటిని అనుసరించి నడుచుకోవాలి.​—⁠హోషేయ 14:​1-6, 9.

4 హోషేయ ప్రవచనంలోని ఈ భాగంలో దేవునితో నడిచేందుకు మనకు సహాయపడగల అనేక సూత్రాలు ఉన్నాయి. మనం వీటిని పరిశీలిద్దాం: (1) యెహోవా నిష్కపటమైన ఆరాధనను కోరతాడు, (2) దేవుడు తన ప్రజలపట్ల విశ్వసనీయ ప్రేమను ప్రదర్శిస్తాడు, (3) మనం ఎడతెగక యెహోవాయందు నమ్మకముంచాలి (4) యెహోవా మార్గాలు ఎల్లప్పుడూ చక్కనివి, (5) పాపులు యెహోవాతట్టు తిరగవచ్చు.

యెహోవా నిష్కపటమైన ఆరాధనను కోరతాడు

5మనమాయనకు స్వచ్ఛమైన, నిష్కపటమైన పవిత్ర సేవ చేయాలని యెహోవా కోరుతున్నాడు. అయితే ఇశ్రాయేలు ఫలాలివ్వని ‘ద్రాక్షచెట్టులా’ తయారైంది. ఇశ్రాయేలు నివాసులు అబద్ధారాధన కోసం “బలిపీఠములను మరి విశేషముగా” కడుతూ వచ్చారు. ఈ మతభ్రష్టులు బహుశా అపవిత్ర ఆరాధనలో వాడేందుకు ఉద్దేశించబడిన నాలుగు పలకల దేవతాస్తంభాలను కూడా నిలబెట్టారు. యెహోవా ఈ బలిపీఠాలను, అలాంటి దేవతాస్తంభాలను నాశనం చేయబోతున్నాడు.​—⁠హోషేయ 10:​1, 2.

6 యెహోవా సేవకుల్లో వేషధారణకు తావులేదు. అయితే, ఇశ్రాయేలీయుల విషయంలో ఏమి జరిగింది? ‘వారి మనస్సు కపటంగా మారిపోయింది’! ఒకప్పుడు వారు యెహోవా సమర్పిత ప్రజలుగా ఆయనతో నిబంధన చేసుకున్నప్పటికీ, వారి వేషధారణనుబట్టి ఆయన వారిని దోషులుగా ఎంచాడు. దీని నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ఒకవేళ మనల్ని మనం దేవునికి సమర్పించుకొని ఉంటే, మనలో వేషధారణ ఉండకూడదు. సామెతలు 3:⁠32 ఇలా హెచ్చరిస్తోంది: “కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును.” మనం దేవునితో నడవాలంటే, “పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు” కలిగే ప్రేమను మనం కనబరచాలి.​—⁠1 తిమోతి 1:⁠5.

దేవుడు తన ప్రజలపట్ల విశ్వసనీయ ప్రేమను ప్రదర్శిస్తాడు

7మనం నిష్కపటంగా, యథార్థంగా యెహోవాను ఆరాధించినప్పుడు, ఆయన ప్రేమపూర్వక దయ లేదా విశ్వసనీయ ప్రేమ మనకు దక్కుతుంది. చపలచిత్తులైన ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పబడింది: “నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి; ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి.”​—⁠హోషేయ 10:12.

8 ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపంతో యెహోవా కోసం వెదకితే పరిస్థితి ఎంత బాగుండేదో కదా! అప్పుడాయన ‘నీతినిబట్టి’ వారికి ఆనందంగా ఉపదేశమిచ్చి ఉండేవాడు. మనమేదైనా గంభీరమైన పాపం చేస్తే, యెహోవాను వెదకి, క్షమాపణ కోసం ఆయనకు ప్రార్థిస్తూ, క్రైస్తవ పెద్దల నుండి ఆధ్యాత్మిక సహాయం పొందేందుకు ప్రయత్నిద్దాం. (యాకోబు 5:​13-16) దేవుని పరిశుద్ధాత్మ నిర్దేశం కోసం కూడా మనం ప్రయత్నించాలి, ఎందుకంటే “తన శరీరేచ్ఛేలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును.” (గలతీయులు 6:8) మనం ‘ఆత్మనుబట్టి విత్తితే’ మనమెల్లప్పుడూ దేవుని విశ్వసనీయ ప్రేమను ఆస్వాదిస్తాం.

9 యెహోవా ఎల్లప్పుడూ తన ప్రజలతో ప్రేమగా వ్యవహరిస్తాడని మనం దృఢంగా నమ్మవచ్చు. దీనికి రుజువు మనకు హోషేయ 11:​1-4లో కనబడుతుంది, అక్కడ మనమిలా చదువుతాం: “ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తు దేశములోనుండి పిలిచితిని. . . . బయలుదేవతలకు వారు బలులనర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిమును [ఇశ్రాయేలీయుల] చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే; వారిని కౌగలించుకొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని; ఒకడు పశువులమీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి యెదుట భోజనము పెట్టితిని.”

10 ఇక్కడ ఇశ్రాయేలు ఒక బాలునితో పోల్చబడింది. యెహోవా ప్రేమపూర్వకంగా ఇశ్రాయేలీయుల చెయ్యిపట్టుకొని వారికి నడక నేర్పించాడు. ఆయన వారిని “స్నేహబంధములతో” ఆకర్షిస్తూ వచ్చాడు. ఎంతటి వాత్సల్యపూరిత దృశ్యమో కదా! తప్పటడుగులు వేస్తున్న పాపాయికి సహాయం చేస్తున్న తల్లిదండ్రుల్లో ఒకరిగా మిమ్మల్ని ఊహించుకోండి. మీ చేతులు ముందుకు చాపి ఉంటారు. ఆ పసివాడు పట్టుకొని నడవడానికి వీలుగా మెత్తని తాళ్లలాంటివి కట్టివుంటారు. మీ పట్ల యెహోవాకున్న ప్రేమ కూడా అంతే వాత్సల్యపూరితమైనది. మిమ్మల్ని “స్నేహబంధములతో” నడిపించడానికి ఆయన ఆనందిస్తాడు.

11 యెహోవా ఇశ్రాయేలీయులతో వ్యవహరించినప్పుడు, “ఒకడు పశువుమీదికి కాడిని తీసినట్లు [ఆయన] వారి కాడిని తీసి వారియెదుట భోజనము” పెట్టాడు. పశువు ఇబ్బంది లేకుండా మేయడానికి వీలుగా దాని మెడమీది కాడిని ఎత్తి ప్రక్కకు తొలగించే వ్యక్తిలా దేవుడు వ్యవహరించాడు. ఇశ్రాయేలీయులు యెహోవాకు లోబడనప్పుడు మాత్రమే, వారు తమ శత్రువుల క్రూరమైన కాడి క్రిందికి వచ్చారు. (ద్వితీయోపదేశకాండము 28:45, 48; యిర్మీయా 28:​14) మనమెన్నటికీ మన ప్రధాన శత్రువైన సాతాను గుప్పిట్లో చిక్కుకొని అతని క్రూరమైన కాడివల్ల కలిగే వేదనలను అనుభవించకుండా ఉందాం. బదులుగా మనం మన ప్రేమగల దేవునితో ఎల్లప్పుడూ విశ్వసనీయంగా నడుద్దాం.

ఎడతెగక యెహోవాయందు నమ్మకముంచండి

12నిరంతరం దేవునితో నడిచేందుకు, మనం ఎడతెగక ఆయనయందు నమ్మకముంచాలి. ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పబడింది: “నీవు నీ దేవునితట్టు తిరుగవలెను; కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవునియందు నమ్మికనుంచుము.” (హోషేయ 12:⁠6) ఇశ్రాయేలు నివాసులు కనికరము చూపిస్తూ, న్యాయమును అనుసరిస్తూ, ‘ఎడతెగక దేవునియందు నమ్మకముంచుతూ’ పశ్చాత్తాపంతో యెహోవాతట్టు తిరిగిన రుజువు ఇవ్వవచ్చు. ఎంతకాలంగా దేవునితో నడుస్తున్నప్పటికీ, మనం కనికరం చూపించడానికి, న్యాయంగా ప్రవర్తించడానికి, ఎల్లప్పుడూ దేవునియందు నమ్మకముంచడానికి దృఢంగా తీర్మానించుకోవాలి.​—⁠కీర్తన 27:⁠14.

13 ఇశ్రాయేలీయుల గురించిన హోషేయ ప్రవచనం దేవునియందు నమ్మకముంచేందుకు మనకొక ప్రత్యేక కారణాన్ని ఇస్తోంది. యెహోవా ఇలా అన్నాడు: “పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువునుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ?” (హోషేయ 13:14) ఆ సమయంలో యెహోవా ఇశ్రాయేలీయులను భౌతిక మరణం నుండి రక్షించబోవడం లేదు, బదులుగా ఆయన చివరకు మరణాన్ని మ్రింగివేసి దానికి అపజయం కలుగజేస్తాడు.

14 పౌలు తోటి అభిషిక్త క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ హోషేయ ప్రవచనం నుండి ఉల్లేఖిస్తూ ఇలా వ్రాశాడు: “ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు,​—⁠విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.” (1 కొరింథీయులు 15:​54-57) యెహోవా యేసును మరణం నుండి పునరుత్థానం చేసి, దేవుని జ్ఞాపకంలో ఉన్న ప్రజలు పునరుత్థానం చేయబడతారనే ఓదార్పుకరమైన హామీ ఇస్తున్నాడు. (యోహాను 5:​28, 29) యెహోవాయందు నమ్మకముంచేందుకు ఎంతటి ఆనందకరమైన కారణమో కదా! అయితే దేవునితో నడిచేలా మనల్ని పురికొల్పేందుకు పునరుత్థానంతోపాటు మరొక విషయం కూడా ఉంది.

యెహోవా మార్గాలు ఎల్లప్పుడూ చక్కనివి

15“యెహోవా మార్గములు చక్కనివి” అనే దృఢమైన నమ్మకం ఎల్లప్పుడూ దేవునితో నడిచేందుకు మనకు సహాయం చేస్తుంది. షోమ్రోను నివాసులు దేవుని నీతిమార్గాల్లో నడవలేదు. పర్యవసానంగా, వారు తమ పాపానికీ, యెహోవాపట్ల తమ అవిశ్వాసానికీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. వారి గురించి ఇలా ముందే చెప్పబడింది: “షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటుచేసెను గనుక అది శిక్షనొందును. జనులు కత్తిపాలగుదురు. వారి పిల్లలు రాళ్లకువేసి కొట్టబడుదురు, గర్భిణి స్త్రీల కడుపులు చీల్చబడును.” (హోషేయ 13:​16) షోమ్రోనును జయించిన అష్షూరీయులు అలాంటి దారుణకృత్యాలు చేయగల సమర్థులని చారిత్రక నివేదికలు చూపిస్తున్నాయి.

16 షోమ్రోను ఇశ్రాయేలు పది గోత్రాల రాజ్యానికి ముఖ్యపట్టణం. అయితే ఇక్కడ షోమ్రోను అనే పేరు ఆ రాజ్యం మొత్తానికి అన్వయిస్తుంది. (1 రాజులు 21:⁠1) అష్షూరు రాజైన ఐదవ షల్మనేసెరు సా.శ.పూ. 742లో షోమ్రోను పట్టణాన్ని ముట్టడించాడు. చివరకు షోమ్రోను సా.శ.పూ. 740లో పతనమైనప్పుడు, దాని నివాసుల్లో అనేకమంది మెసొపొతమియకు, మిద్యానుకు చెరగా కొనిపోబడ్డారు. షోమ్రోనును ఐదవ షల్మనేసెరు స్వాధీనం చేసుకున్నాడో లేక ఆయన వారసునిగా వచ్చిన రెండవ సర్గోను స్వాధీనం చేసుకున్నాడో స్పష్టంగా తెలియదు. (2 రాజులు 17:1-6, 22, 23; 18:​9-12) ఏదేమైనప్పటికీ, 27,290 మంది ఇశ్రాయేలీయులను యూఫ్రటీసు ఎగువ ప్రాంతానికి, మిద్యానుకు తరలించినట్లు సర్గోనుయొక్క నివేదికలు సూచిస్తున్నాయి.

17 షోమ్రోను నివాసులు యెహోవాకు లోబడనందుకు, ఆయన మార్గాల్లో నడవనందుకు తగిన మూల్యం చెల్లించారు. సమర్పిత క్రైస్తవులుగా మనం కూడా పాపాన్ని అభ్యసిస్తూ, నీతి ప్రమాణాలను తృణీకరిస్తూ ఉంటే, మనం కూడా విషాదకర పర్యవసానాలు అనుభవించక తప్పదు. అలాంటి దుష్ట మార్గాన్ని మనమెన్నటికీ అనుసరించకుందము గాక! బదులుగా అపొస్తలుడైన పేతురు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని మనలో ప్రతీ ఒక్కరం అన్వయించుకుందాం: “మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినయెడల అతడు సిగ్గుపడక, ఆ పేరునుబట్టియే దేవుని మహిమపరచవలెను.”​—⁠1 పేతురు 4:15, 16.

18 మనకిష్టమొచ్చిన రీతిలో ప్రవర్తించే బదులు, ఆయన చక్కని మార్గాల్లో పయనిస్తూ మనం ‘దేవుణ్ణి మహిమపరచాలి.’ పాపము పొంచివుందని యెహోవా చేసిన హెచ్చరికను పెడచెవినబెట్టి తన ఇష్టానుసారంగా ప్రవర్తించిన కారణంగానే కయీను హత్యకు పాల్పడ్డాడు. (ఆదికాండము 4:​1-8) మోయాబు రాజు నుండి మూల్యం తీసుకొని బిలాము ఇశ్రాయేలీయులను శపించడానికి విఫల ప్రయత్నం చేశాడు. (సంఖ్యాకాండము 24:​10) మోషే అహరోనుల అధికారాన్ని ధిక్కరించినందుకు లేవీయుడైన కోరహును, ఇతరులను దేవుడు హతమార్చాడు. (సంఖ్యాకాండము 16:​1-3, 31-33) ‘కయీను నడిచిన’ నరహత్యా మార్గంలో నడవాలనీ, ‘బిలాము నడిచిన తప్పుత్రోవలో’ ఆత్రంగా పరుగెత్తాలనీ, లేదా ‘కోరహు చేసినట్లు తిరస్కారము చేసి’ నశించాలని మనం నిశ్చయంగా కోరుకోం. (యూదా 11) అయితే మనం తప్పు చేసినప్పుడు, హోషేయ ప్రవచనం మనకు ఓదార్పునిస్తుంది.

పాపులు యెహోవాతట్టు తిరగవచ్చు

19గంభీరమైన పాపంవల్ల తొట్రిల్లినవారు కూడా యెహోవాతట్టు తిరగవచ్చు. హోషేయ 14:​1, 2లో మనమీ విన్నపాన్ని చూస్తాం: “ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా​—⁠మా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.”

20 పశ్చాత్తాపపడిన ఇశ్రాయేలీయులు ‘ఎడ్లకు బదులుగా వారి పెదవులను’ దేవునికి అర్పించవచ్చు. అవి హృదయపూర్వక స్తుతియాగములు. “దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము” అని పౌలు క్రైస్తవులకు ఉద్బోధించినప్పుడు ఈ ప్రవచనాన్నే సూచించాడు. (హెబ్రీయులు 13:​15) నేడు దేవునితో నడుస్తూ, అలాంటి స్తుతియాగం చేయగలగడం ఎంత గొప్ప ఆధిక్యతో కదా!

21 తమ అవిధేయతా మార్గాన్ని విసర్జించి దేవునితట్టు తిరిగిన ఇశ్రాయేలీయులు ఆయనకు ‘ఎడ్లకు బదులుగా తమ పెదవులను’ అర్పించారు. ఆ విధంగా వారు దేవుడు వాగ్దానం చేసినట్లే ఆధ్యాత్మిక పునరుద్ధరణను అనుభవించారు. హోషేయ 14:​4-7 ఇలా చెబుతోంది: “వారు విశ్వాసఘాతకులు కాకుండ [యెహోవానగు] నేను వారిని గుణపరచుదును. వారిమీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును. తామరపుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు.”

22 పశ్చాత్తాపపడిన ఇశ్రాయేలీయులు ఆధ్యాత్మిక స్వస్థత పొంది, దేవుని ప్రేమను మళ్ళీ ఆస్వాదిస్తారు. యెహోవా వారిని ఉత్తేజపరిచే మంచులా ఉంటాడు, అంటే ఆయన వారిని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. పునరుద్ధరించబడిన ఆయన ప్రజలకు ‘ఒలీవచెట్టుకు కలిగినంత సౌందర్యము కలుగుతుంది,’ వారు దేవుని మార్గాల్లో నడుస్తారు. మనం యెహోవా దేవునితో నడవాలని తీర్మానించుకున్నాం కాబట్టి, మన నుండి ఏమి కోరబడుతోంది?

యెహోవా చక్కని మార్గాల్లో ఎల్లప్పుడూ నడవండి

23 మనం ఎల్లప్పుడూ దేవునితో నడవాలంటే, మనం ‘పైనుండివచ్చు జ్ఞానాన్ని’ అభ్యసిస్తూ, అన్ని సందర్భాల్లో ఆయన చక్కని మార్గాలకు అనుగుణంగా ప్రవర్తించాలి. (యాకోబు 3:​17, 18) హోషేయ ప్రవచనంలోని చివరి వచనంలో మనమిలా చదువుతాం: “జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.”​—⁠హోషేయ 14:9.

24 ఈ లోక జ్ఞానంచేత, ప్రమాణాలచేత నడిపించబడేందుకు కాక దేవుని చక్కని మార్గాల్లో నడిచేందుకే తీర్మానించుకుందాం. (ద్వితీయోపదేశకాండము 32:⁠4) హోషేయ, 59 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు అలా నడిచాడు. జ్ఞానులు, బుద్ధిమంతులు అర్థం చేసుకుంటారని తెలిసి ఆయన దేవుని సందేశాలను నమ్మకంగా ప్రకటించాడు. మన విషయమేమిటి? సాక్ష్యమివ్వడానికి యెహోవా మనల్ని అనుమతించినంత వరకు, ఆయన కృపను విజ్ఞతతో అంగీకరించేవారి కోసం మనం అన్వేషిస్తూనే ఉంటాం. మనమీ పనిని, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునితో’ పూర్తిగా సహకరిస్తూ చేయడానికి ఆనందిస్తాం.​—⁠మత్తయి 24:​45-47.

25 హోషేయ ప్రవచనానికి సంబంధించి చేసిన ఈ పరిశీలన, మనం దేవుని వాగ్దత్త నూతనలోకంలో నిత్యజీవ నిరీక్షణతో ఎల్లప్పుడూ ఆయనతో నడిచేందుకు మనకు సహాయం చేయాలి. (2 పేతురు 3:13; యూదా 20, 21) ఎంత ఉజ్జ్వలమైన నిరీక్షణో కదా! మన మాట ద్వారా, ప్రవర్తన ద్వారా “యెహోవా మార్గములు చక్కనివి” అని మనం నిరూపించినప్పుడు, ఆ నిరీక్షణ మనకు వ్యక్తిగతంగా వాస్తవమవుతుంది.

మీరెలా సమాధానమిస్తారు?

మనం దేవుణ్ణి స్వచ్ఛంగా ఆరాధిస్తే, ఆయన మనతో ఎలా వ్యవహరిస్తాడు?

మనమెందుకు ఎడతెగక యెహోవాయందు నమ్మకముంచాలి?

యెహోవా మార్గాలు చక్కనివని మీరెందుకు నమ్ముతున్నారు?

మనం ఎల్లప్పుడూ యెహోవా మార్గాల్లో ఎలా నడవవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. ఇశ్రాయేలీయులకు యెహోవా ఎలాంటి ఆరంభాన్నిచ్చాడు, అయితే వారికి ఏమి సంభవించింది?

3. తిరగబడిన షోమ్రోనుకు ఏమి సంభవిస్తుంది, అయితే ఇశ్రాయేలీయులు ఎలా కరుణించబడగలరు?

4. హోషేయ ప్రవచనం నుండి మనం ఏ సూత్రాలను పరిశీలిస్తాం?

5. దేవుడు మననుండి ఎలాంటి సేవను కోరుతున్నాడు?

6. దేవునితో నడవాలంటే, మనమెలాంటి లక్షణానికి తావివ్వకూడదు?

7, 8. (ఎ) ఎలాంటి పరిస్థితుల్లో మనం దేవుని విశ్వసనీయ ప్రేమను ఆస్వాదించగలం? (బి) మనం గంభీరమైన పాపం చేస్తే ఏమి చేయాలి?

9, 10. హోషేయ 11:1-4 ఇశ్రాయేలుకు ఎలా అన్వయిస్తుంది?

11. దేవుడు ఏ విధంగా ‘కాడిని తీసివేసే’ వ్యక్తిలా అయ్యాడు?

12. హోషేయ 12:6 ప్రకారం, ఎల్లప్పుడూ దేవునితో నడిచేందుకు ఏమి అవసరం?

13, 14. యెహోవాయందు నిరీక్షించే ఏ కారణాన్ని మనకు వివరిస్తూ పౌలు హోషేయ 13:14ను ఎలా అన్వయించాడు?

15, 16. షోమ్రోను గురించి ముందే ఏమి చెప్పబడింది, ఆ ప్రవచనం ఎలా నెరవేరింది?

17. దేవుని ప్రమాణాలను తృణీకరించే బదులు మనమేమి చేయాలి?

18. మనమెలా ఎల్లప్పుడూ ‘దేవుణ్ణి మహిమపరచవచ్చు?’

19, 20. పశ్చాత్తాపపడిన ఇశ్రాయేలీయులు ఎలాంటి అర్పణలు అర్పించగలిగేవారు?

21, 22. పశ్చాత్తాపపడిన ఇశ్రాయేలీయులు ఎలాంటి పునరుద్ధరణను అనుభవిస్తారు?

23, 24. హోషేయ ప్రవచనం ఎలాంటి ప్రోత్సాహంతో ముగుస్తోంది, అది మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

25. హోషేయ ప్రవచనానికి సంబంధించి మనం చేసిన పరిశీలన మనమేమి చేయడానికి మనకు సహాయం చేయాలి?

[28వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ పెద్దలు ఇచ్చే ఆధ్యాత్మిక సహాయాన్ని అంగీకరించండి

[29వ పేజీలోని చిత్రం]

యెహోవా చేసిన పునరుత్థాన వాగ్దానాలందు నిరీక్షించే కారణాన్ని హోషేయ ప్రవచనం మనకిస్తుంది

[31వ పేజీలోని చిత్రాలు]

నిత్యజీవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎల్లప్పుడూ దేవునితో నడవండి