కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సృష్టిలోని అద్భుతాలు యెహోవాను ఘనపరుస్తున్నాయి

సృష్టిలోని అద్భుతాలు యెహోవాను ఘనపరుస్తున్నాయి

సృష్టిలోని అద్భుతాలు యెహోవాను ఘనపరుస్తున్నాయి

యెహోవా దేవుడు అపరిపూర్ణ మానవులు ఊహించగలిగే దానికన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాడు. భూమ్మీది, పరలోకంలోని ఆయన సృష్టి కార్యాలు ఆయనను స్తుతిస్తున్నాయి, మనలో సంభ్రమాన్ని కలిగిస్తున్నాయి.​—⁠కీర్తన 19:​1-4.

యెహోవా సృష్టికర్త, విశ్వసర్వాధిపతి కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆలకించబడడానికి ఆయనకు అర్హత ఉంది. అయితే భూమ్మీద ఉన్న మానవమాత్రులమైన మనతో ఆయన మాట్లాడితే మనం ఎంత ఆశ్చర్యపోతామో కదా! ఆయన మీతో ఒక దేవదూత ద్వారా మాట్లాడాడని అనుకుందాం. మీరు తప్పక ఆయన చెప్పేది శ్రద్ధగా వింటారు. దాదాపు 3,500 సంవత్సరాల క్రితం దేవుడు నీతిమంతుడైన యోబుతో మాట్లాడినప్పుడు ఆయన ఎంతో శ్రద్ధగా విని ఉంటాడు. భూమ్యాకాశాల గురించి దేవుడు యోబుతో మాట్లాడిన విషయాల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

భూమికి పునాది ఎవరు వేశారు, సముద్రాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు?

దేవుడు సుడిగాలి నుండి యోబును భూమి, సముద్రం గురించి అడుగుతాడు. (యోబు 38:​1-11) ఏ మానవ వాస్తుశిల్పి కూడా భూమి ఎంత పెద్దగా ఉండాలి అనేది నిర్ణయించి ఆ తర్వాత దానిని సృష్టించడానికి సహాయం చేయలేదు. దేవుడు భూమిని ఒక భవనంతో పోలుస్తూ యోబును ఇలా అడిగాడు: “దాని మూలరాతిని వేసినవాడెవడు?” ఏ మానవుడూ వేయలేదు! యెహోవా ఈ గ్రహాన్ని సృష్టిస్తున్నప్పుడు దేవుని దూతలు దానిని చూసి ఆనందించారు.

సముద్రం దేవుని ముందు ఒక శిశువుతో సమానం, ఆయన దానికి అలంకారార్థంగా వస్త్రాన్ని తొడిగిస్తాడు. అది “దాని గర్భమునుండి పొర్లి” వచ్చింది. ఊచలతో, మూసిన తలుపులతో బంధించినట్లు దేవుడు సముద్రాన్ని బంధిస్తాడు. సూర్యచంద్రుల ఆకర్షణవల్ల దానిలో ఆటుపోట్లు కలుగుతాయి.

ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “గాలివల్ల చిన్న అలల నుండి 30 మీటర్లకన్నా ఎక్కువ ఎత్తుకు ఎగిసిపడే భయంకరమైన అలలు సంభవిస్తాయి. . . . గాలి ఆగిన తర్వాత, అలలు మహాసముద్ర ఉపరితలం మీద కదులుతూనే ఉంటాయి, అవి ప్రారంభమైన చోట నుండి ఎంతో దూరం ప్రయాణించగలవు. అవి మృదువుగా పొడవుగా తయారవుతాయి. అలలు చివరకు తీరానికి చేరుకొని అక్కడ విరిగి నురుగుగా తయారవుతాయి.” సముద్రం దేవుని ఈ ఆజ్ఞకు లోబడుతుంది: “నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడ[దు] ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడును.”

ఉదయాన్ని ఎవరు కలుగజేస్తారు?

ఆ తర్వాత దేవుడు యోబును వెలుగుకున్న ప్రభావాల గురించి, ఆయన మిగతా సృష్టి గురించి అడుగుతాడు. (యోబు 38:​12-18) ఏ మానవుడూ రాత్రింబగళ్ళ చక్రాన్ని నియంత్రించలేడు. పగటి వెలుగు అలంకారార్థంగా భూమి అంచులను పట్టుకొని దుష్టులను బట్టబయలు చేస్తుంది. పాపులు “సందె చీకటి”లో అనీతి క్రియలు చేస్తుండవచ్చు. (యోబు 24:​15, 16) అయితే పగటి వెలుగు చాలామంది దుష్టులను చెదరగొడుతుంది.

పగటి వెలుగు దేవుని హస్తంలో ఒక ముద్రలాంటిది, భూమి అందమైన ముద్రను దాని నుండి పొందుతుంది. సూర్యకాంతి అనేక రంగులను వెల్లడి చేస్తుంది, ఆ కారణంగా ఈ భూగోళం ప్రశస్తమైన వస్త్రాలు ధరించినట్లు అనిపిస్తుంది. ఆ విషయంలో యోబు ఎలాంటి పాత్రా పోషించలేదు, ఆయన సముద్రంలో ఉన్న సంపదల జాబితా తయారు చేయడానికి దాని లోతుల్లోకి నడవలేదు. అంతెందుకు, ఇప్పటికీ పరిశోధకులకు మహాసముద్రంలో ఉన్న జీవం గురించి కేవలం పరిమితమైన జ్ఞానమే ఉంది!

మంచు, వడగండ్ల నిధులు ఎవరి దగ్గర ఉన్నాయి?

ఏ మానవుడూ వెలుగును లేక చీకటిని వాటి ఇంటికి చేర్చలేదు లేదా “యుద్ధ దినము” కోసం దేవుడు దాచి ఉంచిన మంచు, వడగండ్ల నిధులలోకి ప్రవేశించలేదు. (యోబు 38:​19-23) యెహోవా గిబియోనులో తన శత్రువుల మీద వడగండ్లను కురిపించినప్పుడు “ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మంది యయిరి.” (యెహోషువ 10:​11) ఆయన గోగు లేక సాతాను నడిపిస్తున్న దుష్ట మానవులను నాశనం చేయడానికి వెల్లడి చేయబడని పరిమాణంలో ఉండే వడగండ్లను కురిపించవచ్చు.​—⁠యెహెజ్కేలు 38:​18, 22.

2002 జూలైలో చైనాలోని మధ్య హోనాన్‌ ప్రాంతంలో గుడ్డు పరిమాణంలో ఉన్న వడగండ్లు 25 మందిని పొట్టనబెట్టుకున్నాయి, 200 మందిని క్షతగాత్రులను చేశాయి. 1545లో సంభవించిన వడగండ్లవాన గురించి ఇటలీకి చెందిన శిల్పి బెన్వెనుటో సెలినీ ఇలా వ్రాశాడు: “మేము లయన్స్‌కు చేరాలంటే ఇంకా ఒకరోజు ప్రయాణించాలి. . . . ఆ సమయంలో ఆకాశంలో పెద్ద పెద్ద ఉరుములు ప్రారంభమయ్యాయి. . . . ఆ ఉరుముల తర్వాత ఆకాశం ఎంత భయంకరమైన శబ్దం చేసిందంటే నేను ఈ లోకానికి అంతం వచ్చిందని అనుకున్నాను: దానితో నేను నా గుర్రాన్ని కాసేపు ఆపాను, అప్పుడు ఒక చుక్క నీరు కూడా లేని వడగండ్లు కురవడం మొదలయ్యాయి. . . . వడగండ్ల పరిమాణం పెద్ద నిమ్మకాయలంత అయింది. . . . ఆ వడగండ్ల వాన తీవ్రంగా కాసేపు కురిసింది, అయితే చివరకు అది ఆగిపోయింది . . . మేము మా శరీరం మీద ఏర్పడిన గీతలను, గాయాలను ఒకరికొకరం చూపించుకున్నాం, అయితే ఒక మైలు దూరంకన్నా ఎక్కువ దూరం ప్రయాణించిన తర్వాత మేము అనుభవించిన దానిని మించిన వినాశకర దృశ్యాన్ని చూశాం, అది వర్ణనాతీతంగా ఉంది. చెట్ల ఆకులన్నీ రాలిపోయాయి, అవి చెల్లాచెదరయ్యాయి; పొలంలోని జంతువులు చచ్చిపడున్నాయి; చాలామంది పశువుల కాపరులు కూడా చనిపోయారు; రెండు చేతులతోనూ పట్టుకోలేనంత పెద్ద వడగండ్లు చాలా పడి ఉండడం చూశాం.”​—⁠ఆటోబయోగ్రఫీ (2వ పుస్తకం, 50వ పేజీ), హార్వర్డ్‌ క్లాసిక్స్‌, 31వ సంపుటి, 352-3 పేజీలు.

యెహోవా మంచు, వడగండ్ల నిధులను తన శత్రువుల మీద కురిపించినప్పుడు ఏమి సంభవిస్తుంది? ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడానికి మంచును లేక వడగండ్లను కురిపించినప్పుడు వారు బ్రతకలేరు.

వర్షం, మంచుబిందువు, మంచుగడ్డ, మంచు ఎవరి చేతి పని?

యెహోవా యోబును ఆ తర్వాత వర్షం, మంచుబిందువు, మంచుగడ్డ, మంచు గురించి అడుగుతాడు. (యోబు 38:​24-30) దేవుడే వర్షాన్ని సృష్టిస్తాడు, ‘జనులులేని ఎడారులు’ కూడా ఆయన ఆశీర్వాదాన్ని అనుభవిస్తాయి. వర్షానికి, మంచుగడ్డకు మానవ తండ్రిగాని లేక మానవ సృష్టికర్తగాని లేడు.

నేచర్‌ బులెటిన్‌ అనే పత్రిక ఇలా చెబుతోంది: “[మంచుకు] ఉన్న అతి వింతైన, బహుశా అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే నీళ్ళు గడ్డకడుతున్నప్పుడు వ్యాపిస్తాయి . . . శీతాకాలంలో చెరువులో మంచు పొరలు ఏర్పడి నీటి మీద తేలడంవల్ల నీటిలో పెరిగే మొక్కలు, జంతువులు (చేపలు మొదలైనవి) కింద ఉన్న నీటిలో సజీవంగా ఉండగలుగుతాయి. ఒకవేళ . . . నీళ్ళు సంకోచించి అవి ఘనీభవించేకొద్దీ దాని సాంద్రత పెరిగినట్లయితే మంచు నీళ్ళకన్నా బరువై అడుగుకు చేరుతుంది. చెరువు గట్టిగా గడ్డకట్టేంతవరకు అధిక మొత్తంలో మంచు ఉపరితలంపై ఏర్పడుతుంది. . . . ప్రపంచంలోని శీతల ప్రాంతాల్లోని నదులు, చెరువులు, కొలనులే కాక, మహాసముద్రాలు కూడా శాశ్వతంగా గడ్డకడతాయి.”

ఆ జలాశయాలు గడ్డకట్టవు కాబట్టి మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలో కదా! యెహోవా చేతిపనిగా వర్షం, మంచుబిందువు భూమ్మీది వృక్షజీవాన్ని చైతన్యపరుస్తున్నందుకు మనం తప్పక కృతజ్ఞులమై ఉన్నాం.

ఆకాశమండలపు కట్టడలను ఎవరు పెట్టారు?

ఆ తర్వాత దేవుడు యోబును ఆకాశమండలం గురించి అడుగుతాడు. (యోబు 38:​31-33) కృత్తిక నక్షత్రరాశిలో సూర్యుని నుండి దాదాపు 380 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఏడు పెద్ద నక్షత్రాలు, అనేక చిన్న నక్షత్రాలు ఉన్నాయి. మానవుడు ‘కృత్తిక నక్షత్రాలను బంధించ’లేడు, ఆ నక్షత్రాలను దగ్గరకు చేర్చలేడు. ఏ మానవుడు కూడా “మృగశీర్షకు కట్లను విప్ప”లేడు. నక్షత్రరాసులు, సప్తర్షి నక్షత్రాలు ఇప్పుడు ఎలా పిలువబడుతున్నా, మానవుడు వాటిని నియంత్రించలేడు, నిర్దేశించలేడు. మానవులు విశ్వాన్ని నిర్దేశిస్తున్న నియమాలను అంటే “ఆకాశమండలపు కట్టడలను” మార్చలేరు.

దేవుడు ఆకాశ గ్రహాలను నిర్దేశించే నియమాలను స్థిరపరిచాడు, అవి భూ వాతావరణాన్ని, అలలను, వాతావరణాన్ని ఈ గ్రహం మీద జీవపు ఉనికినే ప్రభావితం చేస్తాయి. సూర్యుని గురించి ఆలోచించండి. దాని గురించి ది ఎన్‌సైక్లోపీడియా అమెరికానా (1996 సంపుటి) ఇలా చెబుతోంది: “సూర్య కిరణాలు భూమికి వేడిని, వెలుగును అందిస్తాయి, మొక్కలు పెరగడానికి దోహదపడతాయి, మహాసముద్రం నుండి మరితర జలాశయాల నుండి నీటిని ఆవిరి చేస్తాయి, గాలిని ఉత్పత్తి చేయడంలో ఒక పాత్ర పోషిస్తాయి, భూమ్మీద జీవం ఉనికిలో ఉండడానికి చాలా అవసరమైన ఇతర పనులెన్నో చేస్తాయి.” అదే గ్రంథం ఇలా చెబుతోంది: “ఒక వ్యక్తి సూర్యకాంతికి ఉన్న విస్తారమైన శక్తిని అర్థం చేసుకోవాలంటే, గాలిలో, డ్యాముల్లో, నదుల్లో ఉండే శక్తి, వంటచెరకు, బొగ్గు, చమురు వంటి సహజ ఇంధనాల్లో ఉన్న శక్తి అంతా సూర్యుని నుండి 150కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి చిన్న గ్రహమైన [భూమి] దాచుకున్న సూర్య శక్తే అని గుర్తించాలి.”

మేఘాలలో జ్ఞానము ఎవరు ఉంచారు?

యెహోవా, యోబును మేఘాలను పరిశీలించమని అడుగుతాడు. (యోబు 38:​34-38) మానవుడు ఏ ఒక్క మేఘాన్నైనా, వచ్చి నీటిని విడుదల చేయమని ఆజ్ఞాపించలేడు. అయితే దేవుడు స్థాపించిన నీటి చక్రం మీద మానవులు ఎంతగా ఆధారపడుతున్నారో కదా!

నీటి చక్రం అంటే ఏమిటి? ఒక గ్రంథం ఇలా చెబుతోంది: “నీటి చక్రంలో నాలుగు వేర్వేరు దశలు ఉన్నాయి: నిల్వ ఉండడం, ఆవిరవ్వడం, వర్షించడం, నీటి ప్రవాహాలు ఏర్పడడం. నీళ్ళను భూమిపై తాత్కాలికంగా మాత్రమే మహాసముద్రాల్లో, సరస్సుల్లో, నదుల్లో, ఉత్తర దక్షిణ ధృవాల్లో, మందంగా ఉండే మంచు పొరల్లో, హిమఖండాల్లో నిల్వచేయవచ్చు. అది భూమి ఉపరితలం మీద నుండి ఆవిరై మబ్బుల్లో నీటిగా మారి భూమ్మీదకు తిరిగి (వర్షంగా లేక మంచుగా) కురుస్తుంది, అది చివరకు సముద్రంలోనైనా చేరుతుంది లేక వాతావరణంలోకి తిరిగి ఆవిరైపోతుంది. దాదాపు భూమ్మీద ఉన్న నీరంతా లెక్కలేనన్నిసార్లు నీటి చక్రం గుండా వెళ్ళింది.”​—⁠మైక్రోసాఫ్ట్‌ ఎన్కార్టా రెఫరెన్స్‌ లైబ్రరీ 2005.

వర్షపు నీటితో నిండి ఉన్న మేఘాలు ఆకాశపు నీటి జాడీల వంటివి. యెహోవా వాటిని వంచినప్పుడు అవి ఎంత వర్షాన్ని కురిపించవచ్చంటే దుమ్ము బురదగా మారుతుంది, మట్టి ముద్దలు ఒకదానికొకటి అంటుకుపోతాయి. దేవుడు వర్షాన్ని కురిపించగలడు లేక వర్షించకుండా చేయగలడు.​—⁠యాకోబు 5:​17, 18.

వర్షంతోపాటు సాధారణంగా మెరుపులు కూడా వస్తాయి, కానీ మానవుడు తన కోరికలు నెరవేరేలా దానిని ఉపయోగించలేడు. మెరుపులు “చిత్తము ఉన్నాము!” అని దేవునికి నివేదిస్తున్నట్లు వర్ణించబడ్డాయి. కాంప్టన్స్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “మెరుపులు వాతావరణంలో ప్రాముఖ్యమైన రసాయనిక మార్పులను కలిగిస్తాయి. ఒక మెరుపు గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, నైట్రిక్‌ ఆమ్లాలు, మరితర సమ్మేళనాలు ఏర్పడేలా నైట్రోజన్‌, ఆక్సిజన్‌ వాయువులను కలిపే ఎంతో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఆ సమ్మేళనాలు వర్షంతోపాటు భూమ్మీద కురుస్తాయి. ఆ విధంగా, మొక్కలు పెరగడానికి నేలకు కావాల్సిన పోషక పదార్థాల సరఫరాను తిరిగి పూరించడంలో వాతావరణం ఎల్లప్పుడూ సహాయం చేయగలుగుతుంది.” మెరుపుల గురించిన పూర్తి జ్ఞానం మానవునికి ఇంకా ఒక మర్మంగానే మిగిలి ఉంది కానీ దేవునికి మాత్రం కాదు.

సృష్టిలోని అద్భుతాలు దేవున్ని స్తుతిస్తున్నాయి

సృష్టిలోని అద్భుతాలు నిజంగా సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తను ఘనపరుస్తున్నాయి. (ప్రకటన 4:​10) భూమి గురించి, అంతరిక్షంలోని ఆకాశ గ్రహాల గురించి యెహోవా చెప్పిన మాటలనుబట్టి యోబు ఎంతగా ప్రభావితుడై ఉండవచ్చో కదా!

యెహోవా యోబును అడిగిన ప్రశ్నల్లో, వర్ణనల్లో, మనం ఇప్పుడే పరిశీలించిన సృష్టిలోని అద్భుతాలు మాత్రమే లేవు. అయినా మనం పరిశీలించిన అంశాలు ఇలా అనేలా మనల్ని ప్రోత్సహిస్తాయి: “ఆలోచించుము, దేవుడు మనం ఊహించగల దానికన్నా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాడు.”​—⁠యోబు 36:​26, NW.

[14వ పేజీలోని చిత్రసౌజన్యం]

మంచుకణం: snowcrystals.net

[15వ పేజీలోని చిత్రసౌజన్యం]

కృత్తిక నక్షత్రరాశి: NASA, ESA and AURA/Caltech; చేప: U.S. Fish & Wildlife Service, Washington, D.C./William W. Hartley