కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

స్వయంత్యాగం యెహోవా ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది

స్వయంత్యాగం యెహోవా ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది

“యెహోవా వలననే నాకు సహాయము కలుగును”

స్వయంత్యాగం యెహోవా ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది

కామెరూన్‌లోని ఒక దట్టమైన అడవి గుండా ఒక వ్యక్తి సైకిల్‌పై వెళ్తుంటాడు. ఆయన కొన్ని గంటలపాటు జలమయమైన రోడ్ల మీదా, బురద గుండా సైకిల్‌ తొక్కుతాడు, ఇతరులను బలపరచడానికి అపాయాలను ఎదుర్కొంటాడు. జింబాబ్వేలో కొందరు, ఐసొలేటెడ్‌ గ్రూపుల్లో ఉండేవారికి బోధించడానికి వరదనీటితో పొంగిపొర్లే నదుల గుండా ప్రయాణిస్తూ 15 కిలోమీటర్ల దూరం నడిచివెళ్తారు, తమ బట్టలు, బూట్లు తడవకుండా ఉండేందుకు వాటిని తమ తలమీద పెట్టుకొని క్రిందపడకుండా జాగ్రత్తగా వెళ్తారు. మరోప్రాంతంలో ఉదయం ఒక గంట మాత్రమే తీరిక దొరికే ఒక నర్సుతో బైబిలు అధ్యయనం చేయడానికి ఒక స్త్రీ తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తుంది.

అలాంటి కృషి చేస్తున్న వ్యక్తుల్లో సాధారణంగా కనిపించే ఒకే అంశం ఏమిటి? వారందరూ బైబిలు సత్యాన్ని బోధించే పనిలో భాగం వహించే యెహోవాసాక్షుల పూర్తికాల సేవకులు. ఆ పూర్తికాల సేవకుల్లో క్రమ పయినీర్లు, ప్రత్యేక పయినీర్లు, మిషనరీలు, ప్రయాణ పైవిచారణకర్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెతెల్‌ గృహాల్లోని వేలాదిమంది స్వచ్ఛంద సేవకులు ఉన్నారు. స్వయంత్యాగం వారి గుర్తింపు చిహ్నం. *

సరైన ప్రేరణ

యెహోవాసాక్షులు, అపొస్తలుడైన పౌలు తిమోతికి చేసిన హితవును లక్ష్యపెడుతున్నారు: “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము.” (2 తిమోతి 2:​15) పూర్తికాల పరిచారకులుగా సేవ చేయడానికి లక్షలాదిమంది సాక్షులను ప్రేరేపించేదేమిటి?

యెహోవా సేవలో ఎందుకు తీవ్ర కృషి చేస్తున్నారని పూర్తికాల పరిచారకులను అడిగినప్పుడు, దేవునిపట్ల, తోటిమానవులపట్ల ఉన్న ప్రేమే తాము తీవ్రంగా కృషి చేయడానికి తమను ప్రేరేపిస్తోందని వారు జవాబిస్తున్నారు. (మత్తయి 22:​37-39) ఆ జవాబు ఎంతో సరైనది, ఎందుకంటే ప్రేమే ప్రేరణగా లేనట్లయితే, ఎంత కృషి చేసినా అది వ్యర్థమే అవుతుంది.​—⁠1 కొరింథీయులు 13:​1-3.

స్వయంత్యాగ సేవ

సమర్పిత క్రైస్తవులందరూ యేసు పిలుపుకు ప్రతిస్పందించారు: “ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.” (మత్తయి 16:​24) మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటే యెహోవా దేవునికి, యేసుక్రీస్తుకు సేవకులుగా ఉండడానికి, వారి నిర్దేశం పొందడానికి ఇష్టపూర్వకంగా ఒప్పుకోవడం అని అర్థం. అలా చేయడం పూర్తికాల పరిచర్యలో స్వయంత్యాగపూరిత సేవ చేయడానికి చాలామందిని నడిపించింది.

యెహోవాకు తాము చేసే సేవను విస్తృతపరచుకోవడానికి చాలామంది సాక్షులు ఎంతో కృషి చేస్తున్నారు. బ్రెజిల్‌లోని సావో పౌలోలో క్రమ పయినీరుగా సేవచేస్తున్న 56 సంవత్సరాల జుల్యా ఉదాహరణను పరిశీలించండి. “నాకు చైనీస్‌ నేర్చుకోవడం ఇష్టమేనా అని అడగడానికి ఒక చైనా సహోదరుడు నాకు ఫోన్‌ చేశాడు. నా వయసు దృష్ట్యా నేను క్రొత్త భాష నేర్చుకోవడం గురించి ఆలోచించలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత నేను ఆ సవాలును చేపట్టాను. ఇప్పుడు నేను చైనీస్‌ భాషలో లేఖనాధారితంగా మాట్లాడగలుగుతున్నాను” అని ఆమె గుర్తుచేసుకుంటోంది.

పెరూలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం ఇలా నివేదిస్తోంది: “ఇటీవలి సంవత్సరాల్లో వందలాదిమంది క్రమ పయినీర్లు అనియమిత క్షేత్రాలకు వెళ్ళారు, అలా వారు ధైర్యవంతమైన, స్వయంత్యాగపూరితమైన స్ఫూర్తిని ప్రదర్శించారు. కనీస సౌకర్యాలు లేని, ఉద్యోగావకాశాలు పరిమితంగా ఉన్న సుదూర పట్టణాలకు వారు వెళ్తున్నారు. ఈ సహోదర సహోదరీలు తమ నియామకంలో కొనసాగడానికి ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. అయితే అతి ప్రాముఖ్యంగా, పరిచర్యలో వారి కార్యశీలత, అనేక ప్రాంతాల్లో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ స్వయంత్యాగపూరిత క్రమ పయినీర్ల సహాయంతో క్రొత్త గుంపులు ఏర్పడ్డాయని ప్రయాణ పైవిచారణకర్తలు నివేదిస్తున్నారు.”

కొందరు క్రైస్తవులు తోటి విశ్వాసులకు సహాయం చేయడానికి తమ ప్రాణాలకు కూడా తెగించారు. (రోమీయులు 16:​3, 4) ఆఫ్రికాలోని ఒక యుద్ధపీడిత ప్రాంతంలో సేవచేస్తున్న ప్రాంతీయ పైవిచారణకర్త ఇలా నివేదిస్తున్నాడు: “తిరుగుబాటుదారులు ఆక్రమించుకున్న ప్రాంతాలకు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాలకు మధ్యనున్న చివరి అవరోధాన్ని చేరుకోక ముందు, తిరుగుబాటుదారుల్లోని నలుగురు సైనిక అధికారులు, వారి అంగరక్షకులు నన్ను, నా భార్యను చుట్టుముట్టారు, వారు మా గుర్తింపు గురించి అడిగారు. మా గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నప్పుడు మేము ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతానికి చెందినవారమని గ్రహించి మమ్మల్ని అనుమానించారు. నేను ఒక గూఢచారిని అని నిందించారు. అందుకే వారు నన్ను ఒక గోతిలో పడేయాలని నిర్ణయించుకున్నారు. మేము ఎవరమో నేను వారికి వివరించాను, చివరకు వారు మమ్మల్ని వెళ్ళనిచ్చారు.” ఆ స్వయంత్యాగపూరిత దంపతులు తమను సందర్శించడంలో సఫలులైనందుకు ఆ సంఘాల్లోనివారు ఎంతో కృతజ్ఞతతో ఉన్నారు!

పూర్తికాల సేవకులు కష్టాలను ఎదుర్కొంటున్నా ప్రపంచవ్యాప్తంగా వారి సంఖ్య పెరుగుతోంది. (యెషయా 6:⁠8) కష్టించి పనిచేసే ఈ పనివారు యెహోవాను సేవించే తమ ఆధిక్యతను అమూల్యమైనదిగా ఎంచుతున్నారు. లక్షలాదిమంది ఇతరులు ఇప్పుడు అలాంటి స్వయంత్యాగపూరిత స్ఫూర్తితోనే యెహోవాను సేవిస్తున్నారు. తత్ఫలితంగా ఆయన వారిని మెండుగా ఆశీర్వదిస్తున్నాడు. (సామెతలు 10:​22) ఆశీర్వాదం, మద్దతు తమకు లభిస్తూ ఉంటాయనే నమ్మకంతో కష్టపడి పనిచేసే అలాంటి పనివారు, కీర్తనకర్త వైఖరిని ప్రతిబింబిస్తున్నారు, ఆయన ఇలా పాడాడు: “యెహోవావలననే నాకు సహాయము కలుగును.”​—⁠కీర్తన 121:⁠2.

[అధస్సూచి]

^ పేరా 4 యెహోవాసాక్షుల క్యాలెండర్‌ 2005 (ఆంగ్లం)లో నవంబరు/డిసెంబరు చూడండి.

[9వ పేజీలోని బ్లర్బ్‌]

“యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు.”​—⁠కీర్తన 110:⁠3

[8వ పేజీలోని బాక్సు]

యెహోవా తన సమర్పిత సేవకులను ఎంతో విలువైనవారిగా ఎంచుతాడు

“మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి, స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై యుండుడి.”​—⁠1 కొరింథీయులు 15:​58.

“మీరు చేసిన కార్యమును . . . తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”​—⁠హెబ్రీయులు 6:​10.