కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“ఆ యా భాషలు మాటలాడు” ప్రజలు సువార్త వింటున్నారు

“ఆ యా భాషలు మాటలాడు” ప్రజలు సువార్త వింటున్నారు

“ఆ యా భాషలు మాటలాడు” ప్రజలు సువార్త వింటున్నారు

ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది​—⁠దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.’​—⁠జెకర్యా 8:23.

సమయం, సందర్భం అనుకూలంగా ఉన్నాయి. అది సా.శ. 33 పెంతెకొస్తు దినం. అప్పటికి కొన్ని వారాల ముందునుండే, రోమా సామ్రాజ్యంలోని దాదాపు 15 సుదూర ప్రాంతాల నుండి పస్కాను ఆచరించేందుకు యెరూషలేముకు వచ్చిన యూదులతో, యూదామత ప్రవిష్టులతో ఆ నగరం క్రిక్కిరిసిపోయింది. ఆ రోజున, ప్రాచీన బబులోనులోనివారు చేసినట్లు గలిబిలిగా కాక, పరిశుద్ధాత్మతో నిండిన సాధారణ ప్రజలు ఆ సామ్రాజ్యంలో వాడుకలోవున్న చాలా భాషల్లో సువార్త ప్రకటించడాన్ని వేలాదిమంది విన్నారు. (అపొస్తలుల కార్యములు 2:1-12) ఆ సందర్భంలో క్రైస్తవ సంఘం స్థాపించబడడమే కాక, అనేక భాషల, అనేక దేశాల ప్రజలకు ప్రకటించడం ప్రారంభమై, ఆ పని నేటికీ కొనసాగుతోంది.

2 యేసు శిష్యులు, ఆ కాలంలో ప్రజాదరణ పొందిన సాధారణ గ్రీకు భాష మాట్లాడగలుగుతుండవచ్చు. వారు దేవాలయంలో ఉపయోగించే హీబ్రూ భాష కూడా మాట్లాడేవారు. అయితే, ఆనాటి పెంతెకొస్తునాడు వారు తమ విభిన్న శ్రోతల మాతృభాషల్లో మాట్లాడి వారిని ‘విభ్రాంతిపరిచారు.’ దాని ఫలితమేమిటి? ఆ శ్రోతలు తమ మాతృభాషలో విన్న ప్రధాన సత్యాల మూలంగా వారి హృదయాలు కదిలించబడ్డాయి. చిన్న గుంపుగా ఉన్న ఆ శిష్యులు ఆ రోజు సాయంకాలానికల్లా 3,000కు పైగా విస్తరించిన ఓ పెద్ద గుంపుగా వృద్ధిచెందారు.​—⁠అపొస్తలుల కార్యములు 2:37-42.

3 ఆ ముఖ్య సంఘటన జరిగిన కొద్దికాలానికే యెరూషలేములో హింస చెలరేగడంతో, “చెదిరిపోయినవారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి.” (అపొస్తలుల కార్యములు 8:1-4) ఉదాహరణకు, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో మనం గ్రీకు భాష మాట్లాడే సువార్తికుడైన ఫిలిప్పు గురించి చదువుతాం. ఫిలిప్పు సమరయులకు ప్రకటించాడు. ఆయన క్రీస్తు సందేశానికి స్పందించిన ఐతియోపీయుడైన అధికారికి కూడా ప్రకటించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 6:​1-5; 8:​5-13, 26-40; 21:8, 9.

4 ఆ క్రైస్తవులు యెరూషలేము, యూదయ, గలిలయ పరిసరాలకు వెలుపల సంచరిస్తూ, నివాస స్థలాలను అన్వేషిస్తుండగా వారికి క్రొత్తగా జాతిపరమైన, భాషాపరమైన అవాంతరాలు ఎదురయ్యాయి. వారిలో కొందరు యూదులకు మాత్రమే సాక్ష్యమిచ్చి ఉంటారు. కానీ శిష్యుడైన లూకా ఇలా నివేదిస్తున్నాడు: “కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపువారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి.”​—⁠అపొస్తలుల కార్యములు 11:19-21.

పక్షపాతంలేని దేవుని దగ్గర అందరి కోసం సందేశముంది

5 అలాంటి పెరుగుదల దేవుని మార్గాలకు అనుగుణంగా ఉంది; ఆయనకు పక్షపాతం లేదు. యెహోవా అన్యజనుల విషయంలో అపొస్తలుడైన పేతురు దృక్కోణాన్ని సరిచేసిన తర్వాత, ఆయన కృతజ్ఞతాపూర్వకంగా ఇలా అన్నాడు: “దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొస్తలుల కార్యములు 10:34, 35; కీర్తన 145:⁠9) గతంలో క్రైస్తవులను హింసించిన అపొస్తలుడైన పౌలు ‘మనుష్యులందరు రక్షణపొందడమే’ దేవుని చిత్తమని ప్రకటించినప్పుడు, దేవుడు పక్షపాతికాడని ఆయన పునరుద్ఘాటించాడు. (1 తిమోతి 2:4) అన్నిరకాల, తెగల, జాతుల లేదా భాషల ప్రజలకు రాజ్య నిరీక్షణ అందుబాటులో ఉండడాన్నిబట్టి సృష్టికర్త పక్షపాతికాడని స్పష్టమవుతోంది.

6 ఈ అంతర్జాతీయ విస్తరణ శతాబ్దాల పూర్వమే ప్రవచించబడింది. దానియేలు ప్రవచనం ప్రకారం “సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను [యేసును] సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను.” (దానియేలు 7:14) యెహోవా రాజ్యం గురించి మీరు చదవగలిగేలా ఈ పత్రిక 151 భాషల్లో ప్రచురించబడుతూ ప్రపంచవ్యాప్తంగా పంచిపెట్టబడుతోందనే వాస్తవం ఆ బైబిలు ప్రవచన నెరవేర్పును ప్రతిబింబిస్తోంది.

7 వివిధ భాషల ప్రజలు ప్రాణాధార సందేశాన్ని వినే కాలం గురించి బైబిలు ముందే చెప్పింది. సత్యారాధన అనేకులను ఎలా ఆకర్షిస్తుందో వర్ణిస్తూ, జెకర్యా ఇలా ప్రవచించాడు: “ఆ దినములలో ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని [“దేవుని ఇశ్రాయేలులో” భాగమైన, ఆత్మాభిషిక్త క్రైస్తవుని] చెంగుపట్టుకొని​—⁠దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.” (జెకర్యా 8:23; గలతీయులు 6:16) అపొస్తలుడైన యోహాను దర్శనంలో తాను చూసింది వివరిస్తూ, ఇలా అన్నాడు: ‘ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్పసమూహము సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడెను.’ (ప్రకటన 7:9) అలాంటి ప్రవచనాలు నిజమవడం మనం చూశాం!

అన్నిరకాల ప్రజలను చేరుకోవడం

8 నేడు ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసవెళ్ళడం ఎక్కువవుతోంది. ప్రపంచీకరణ వలసవెళ్లే క్రొత్త శకాన్ని ఆరంభించింది. యుద్ధపీడిత ప్రాంతాల నుండి, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల నుండి ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తుపరంగా సురక్షిత జీవనం కోసం మరింత స్థిరంగావున్న ప్రాంతాలకు తరలివెళ్లారు. చాలాదేశాల్లో వలసదారుల, శరణార్థుల రాక వేరేభాషా సమాజాలు రూపుదిద్దుకోవడానికి దారితీశాయి. ఉదాహరణకు, ఫిన్‌లాండ్‌లో 120కన్నా ఎక్కువ భాషలు మాట్లాడబడుతుండగా, ఆస్ట్రేలియాలో ఆ సంఖ్య 200కన్నా ఎక్కువగా ఉంది. అమెరికాలో కేవలం ఒక నగరంలో అంటే సాండియాగోలో 100కన్నా ఎక్కువ భాషలు ఉపయోగంలో ఉన్నాయి.

9 క్రైస్తవ పరిచారకులముగా మనం, వేరేభాష మాట్లాడే అలాంటి ప్రజలు ఉండడాన్ని మన పరిచర్యకు ఒక అవరోధంగా దృష్టిస్తామా? ఎంతమాత్రం దృష్టించం! బదులుగా, వారిని మనం మన పరిచర్యా ప్రాంతాన్ని విస్తరించడానికి దొరికిన అవకాశంగా అంటే ‘తెల్లబారి కోతకు వచ్చిన పొలాలుగా’ దృష్టిస్తాం. (యోహాను 4:35) ప్రజల జాతి లేదా భాష ఏదైనప్పటికీ, తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారిపట్ల శ్రద్ధ చూపించేందుకు మనం కృషి చేస్తాం. (మత్తయి 5:​3) ఫలితంగా, ప్రతీ సంవత్సరం ‘ఆ యా భాషలు’ మాట్లాడే ప్రజలు అంతకంతకు అధిక సంఖ్యలో క్రీస్తు శిష్యులవుతున్నారు. (ప్రకటన 14:6) ఉదాహరణకు, జర్మనీలో 2004 ఆగస్టు నాటికి దాదాపు 40 భాషల్లో ప్రకటనా పని జరుగుతోంది. అదే సమయానికి, పది సంవత్సరాల క్రితం కేవలం 18 భాషల్లో మాత్రమే ప్రకటనా పని జరిగిన ఆస్ట్రేలియాలో ఇప్పుడు దాదాపు 30 భాషల్లో ప్రకటనా పని జరుగుతోంది. గ్రీస్‌లో యెహోవాసాక్షులు దాదాపు 20 విభిన్న భాషల్లో ప్రజలకు ప్రకటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మంది యెహోవాసాక్షులు, విస్తృతంగా ఉపయోగంలోవున్న అంతర్జాతీయ భాషయైన ఇంగ్లీషు కాకుండా వేరే భాష మాట్లాడతారు.

10 అవును, “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్చబడుతోంది! (మత్తయి 28:​19) ఉత్సాహంగా ఆ ఆజ్ఞను హత్తుకుంటూ యెహోవాసాక్షులు 235 దేశాల్లో చురుకుగా పనిచేస్తూ 400కన్నా ఎక్కువ భాషల్లో సాహిత్యాలు అందజేస్తున్నారు. ప్రజలకు ప్రకటించేందుకు అవసరమైనవాటిని యెహోవా సంస్థ సమకూరుస్తుండగా, ప్రజలు చక్కగా అర్థం చేసుకోగల భాషలో ‘అందరికీ’ బైబిలు సందేశాన్ని అందించడానికి ప్రతీ రాజ్య ప్రచారకుడూ చొరవ తీసుకోవాలి. (యోహాను 1:7) ఈ ఉమ్మడి ప్రయత్నం, కోట్ల సంఖ్యలో వివిధ భాషా గుంపుల ప్రజలు సువార్త నుండి ప్రయోజనం పొందేందుకు దోహదపడుతుంది. (రోమీయులు 10:14, 15) అవును మనలో ప్రతీ ఒక్కరం ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నాం!

సవాలును అధిగమించడం

11 నేడు చాలామంది రాజ్య ప్రచారకులు మరో భాషను నేర్చుకునేందుకు ఇష్టపడుతున్నారు, అలాగని వారు అద్భుతమైన దేవుని ఆత్మ వరాలపై ఆధారపడలేరు లేదా వాటిని ఆశించలేరు. (1 కొరింథీయులు 13:8) క్రొత్త భాష నేర్చుకోవడానికి గట్టి ప్రయత్నమే చేయాల్సివస్తుంది. మరో భాషను మాట్లాడగల వారు సహితం, ఆ భాష మాట్లాడినా విభిన్న నేపథ్యాలు, సంస్కృతులు ఉన్న ప్రజలకు బైబిలు సందేశాన్ని ఆకర్షణీయమైనదిగా చేసేందుకు తమ ఆలోచనను, పద్ధతిని మార్చుకోవలసి ఉంటుంది. అలాగే క్రొత్తగా వలస వచ్చినవారు తరచూ బిడియపడుతూ, భయపడుతుంటారు; వారి ఆలోచనా సరళిని అర్థం చేసుకోవడానికి గట్టి కృషి అవసరం.

12 అయితే, వేరే భాష మాట్లాడే ప్రజలకు సహాయం చేయడంలో యెహోవా సేవకులు చేస్తున్న ప్రయత్నాల్లో వారికి పరిశుద్ధాత్మ ఇప్పుడు కూడా సహాయం చేస్తోంది. (లూకా 11:13) అద్భుతమైన భాషా సామర్థ్యాలను వారిలో కలిగించే బదులు, ఆ ఆత్మ మన భాష మాట్లాడని ప్రజలతో సంభాషించాలనే మన కోరికను అధికం చేస్తుంది. (కీర్తన 143:10) ప్రజలకు పరిచయంలేని భాషలో బైబిలు సందేశాన్ని బోధించడంవల్ల లేదా ప్రకటించడంవల్ల అది వారి మెదడుకు మాత్రమే చేరుతుంది. అయితే మన శ్రోతల హృదయాలను స్పృశించేందుకు వారి మాతృభాషను అంటే వారి ప్రగాఢ అభిలాషలను, ఉద్దేశాలను, ఆశలను పలకరించే భాషను మాట్లాడడమే తరచూ ప్రయోజనకరంగా ఉంటుంది.​—⁠లూకా 24:32.

13 బైబిలు సత్యానికి చక్కని స్పందన లభించడం చూసిన చాలామంది రాజ్య ప్రచారకులు వేరే భాషా క్షేత్రంలో పరిచర్యను చేపట్టారు. తమ సేవ మరింత సవాలుదాయకంగా, ఆసక్తికరంగా మారినప్పుడు మరింత ప్రోత్సహించబడినట్లు మరితరులు భావిస్తున్నారు. “తూర్పు ఐరోపానుండి వచ్చే చాలామంది సత్యం కోసం తహతహలాడుతున్నారు” అని దక్షిణ ఐరోపాలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం చెబుతోంది. అలాంటి దాహార్తులకు సహాయం చేయడం ఎంత సంతృప్తికరంగా ఉంటుందో కదా!​—⁠యెషయా 55:1, 2.

14 అయితే ఈ పనిలో అర్థవంతంగా భాగం వహించేందుకు మనకు దృఢ నిశ్చయం, స్వయంత్యాగం అవసరం. (కీర్తన 110:3) ఉదాహరణకు, చైనా దేశపు వలసదారుల గుంపులకు సహాయం చేసేందుకు జపాన్‌కు చెందిన అనేక సాక్షుల కుటుంబాలు అనేకం పెద్ద నగరాల్లోని తమ సుఖ నివాసాలను వదిలిపెట్టి మారుమూల ప్రాంతాలకు తరలివెళ్లాయి. అమెరికా పశ్చిమ తీరంలోని ప్రచారకులు ఫిలిప్పినో క్షేత్రంలోని ప్రజలకు బైబిలు అధ్యయనాలు నిర్వహించేందుకు క్రమంగా ఒకటి రెండుగంటలు కారులో ప్రయాణం చేసి వెళ్తున్నారు. నార్వేలో, ఒక జంట, ఆఫ్ఘనిస్తాన్‌ నుండి వచ్చిన ఒక కుటుంబంతో అధ్యయనం చేస్తుంది. సాక్షి దంపతులు దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? * బ్రోషుర్‌ను ఇంగ్లీషు, నార్వేజియన్‌ భాషల్లో ఉపయోగిస్తున్నారు. ఆ కుటుంబం వారి మాతృభాషయైన డారికి దగ్గర సంబంధమున్న పర్షియా భాషలో పేరాలు చదువుతుంది. వారు విషయాలను ఇంగ్లీషులో, నార్వేజియన్‌లో చర్చిస్తారు. విదేశీయులు సువార్తకు స్పందించినప్పుడు అలాంటి త్యాగపూరిత స్ఫూర్తికి, పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించగల స్ఫూర్తికి చక్కని ప్రతిఫలం లభిస్తుంది. *

15 ఈ బహుభాషా కార్యక్రమంలో మీరు భాగం వహించగలరా? మరైతే మీ క్షేత్రంలో సాధారణంగా మాట్లాడుతున్న వేరే భాషలు ఏమేమి ఉన్నాయో ఎందుకు గమనించకూడదు? అప్పుడు మీరు ఆ భాషల్లో కొన్ని కరపత్రాలను, బ్రోషుర్‌లను మీతోకూడా తీసుకెళ్లవచ్చు. 2004లో విడుదల చేయబడిన అన్ని దేశాల ప్రజలకు సువార్త అనే చిన్నపుస్తకం సరళమైన, సానుకూలమైన సందేశంతో అనేక భాషల్లో రాజ్య నిరీక్షణను వ్యాప్తి చేయడంలో ఇప్పటికే ఉపయుక్తంగా ఉంది.​—⁠32వ పేజీలోవున్న “అన్ని దేశాల ప్రజలకు సువార్త” అనే ఆర్టికల్‌ చూడండి.

“పరదేశిని జాలి తలచుడి”

16 మనం మరో భాష నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా, మన ప్రాంతంలోని విదేశీయులకు ఆధ్యాత్మిక విద్యనందివ్వడంలో మనమందరం సహాయం చేయవచ్చు. “పరదేశిని జాలి తలచుడి” లేదా ప్రేమించండి అని యెహోవా తన ప్రజలకు ఉపదేశించాడు. (ద్వితీయోపదేశకాండము 10:​18, 19) ఉదాహరణకు, ఉత్తర అమెరికాలోని ఒక మహానగరంలో ఐదు సంఘాలు ఒకే రాజ్య మందిరంలో కలుసుకుంటాయి. అనేక రాజ్య మందిరాల్లోలాగే అక్కడ కూడా సంవత్సరానికి ఒకసారి కూటాల సమయాలు మారతాయి, దానివల్ల చైనా భాషా కూటాల సమయం ఆదివారం సాయంకాలానికి మారుతుంది. అలాగైతే రెస్టారెంటు సంబంధిత ఉద్యోగాలు చేసుకుంటున్న అనేకమంది వలసదారులు కూటాలకు హాజరవడం కష్టం. అందుకని, ఇతర సంఘాల పెద్దలు చైనా భాషా కూటాలు ఆదివారం ఉదయం జరుపుకునేలా ప్రేమపూర్వకంగా సర్దుబాట్లు చేసుకున్నారు.

17 వేరేభాషా గుంపులకు సహాయం చేసేందుకు వెళ్లాలని ఇష్టపడే అర్హత, నిపుణతగల సహోదర సహోదరీలను ప్రేమగల పైవిచారణకర్తలు మెచ్చుకుంటారు. స్థానికంగా అలాంటి అనుభవంగల బైబిలు బోధకుల కొరత ఏర్పడుతుండవచ్చు, అయినా, ఆ పైవిచారణకర్తలు లుస్త్రలో, ఈకొనియలో ఉన్న పెద్దల్లాగే భావిస్తారు. తమ సంఘాలకు తిమోతి దీవెనగా ఉన్నప్పటికీ, ఆయన పౌలుతో కూడా ప్రయాణించి వెళ్లేందుకు ఆ పెద్దలు అభ్యంతరం చెప్పలేదు. (అపొస్తలుల కార్యములు 16:1-4) పైగా ప్రకటనా పనిలో సారథ్యం వహించేవారు విదేశీయుల విభిన్న మనస్తత్వానికి, కట్టుబాట్లకు లేదా వ్యవహార విధానానికి నిరుత్సాహపడరు. బదులుగా వారు వైవిధ్యాన్ని ఆదరించి, సువార్త నిమిత్తం మంచి సంబంధాలు నెలకొల్పడానికి మార్గాలు అన్వేషిస్తారు.​—⁠1 కొరింథీయులు 9:22, 23.

18 బైబిల్లో ప్రవచించబడినట్లుగా, సువార్త “ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో” ప్రకటించబడుతోంది. వేరేభాషా క్షేత్రాల్లో అభివృద్ధికి అద్భుతమైన అనుకూల పరిస్థితి ఉంది. సాధనసంపత్తిగల వేలాదిమంది ప్రచారకులు “కార్యానుకూలమైన గొప్ప ద్వారము”లోకి ప్రవేశించారు. (1 కొరింథీయులు 16:​9, అధస్సూచి) అయినప్పటికీ, తర్వాతి ఆర్టికల్‌ చూపిస్తున్నట్లుగా, అలాంటి క్షేత్రాల అభివృద్ధికి అవసరమైనది మరెంతో ఉంది.

[అధస్సూచీలు]

^ పేరా 19 యెహోవాసాక్షులు ప్రచురించినది.

^ పేరా 19 మరిన్ని ఉదాహరణల కోసం కావలికోట, ఏప్రిల్‌ 1, 2004, 24-8 పేజీల్లోని “చిన్న త్యాగాలు మాకు గొప్ప ఆశీర్వాదాలను తెచ్చాయి” అనే ఆర్టికల్‌ చూడండి.

మీరు వివరించగలరా?

ప్రజలందరిపట్ల నిష్పక్షపాతంగా ఉండడంలో మనమెలా యెహోవాను అనుకరించవచ్చు?

మన ప్రాంతంలోవున్న, మన భాష మాట్లాడని ప్రజలను మనమెలా దృష్టించాలి?

ప్రజలకు వారి మాతృభాషలో ప్రకటించడం ఎందుకు సహాయకరంగా ఉంటుంది?

మన మధ్య నివసిస్తున్న విదేశీయులపట్ల మనమెలా శ్రద్ధ చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. అనేక భాషల అనేక దేశాల ప్రజలకు ప్రకటించడానికి శ్రేష్ఠమైన సమయ సందర్భాలను యెహోవా ఎలా దయచేశాడు?

2. సా.శ. 33 పెంతెకొస్తునాడు యేసు శిష్యులు తమ విభిన్న శ్రోతలను ఎలా ‘విభ్రాంతిపరిచారు’?

3, 4. శిష్యులు యెరూషలేము, యూదయ, గలిలయ నుండి వెళ్లిపోతుండగా ప్రకటనా పని ఎలా విస్తరించింది?

5. సువార్త విషయంలో యెహోవా నిష్పక్షపాత వైఖరి ఎలా స్పష్టమవుతోంది?

6, 7. అంతర్జాతీయంగా అనేక భాషల్లో సువార్త వ్యాపిస్తుందని ఏ బైబిలు ప్రవచనాలు ప్రవచించాయి?

8. నేటి ఏ వాస్తవిక పరిస్థితి కారణంగా మన సాక్ష్యపు పనిలో సర్దుబాట్లు అవసరమవుతాయి?

9. మన ప్రాంతంలోవున్న, వేరే భాష మాట్లాడే ప్రజలను మనమెలా దృష్టించాలి?

10. “సమస్త జనులను” శిష్యులనుగా చేయడంలో ప్రతీ ప్రచారకుని పాత్ర ఏమిటి?

11, 12. (ఎ) మనం ఎలాంటి సవాళ్లను అధిగమించాలి, పరిశుద్ధాత్మ ఎలా సహాయం చేస్తుంది? (బి) ప్రజల మాతృభాషలోనే వారికి ప్రకటించడం తరచూ ఎందుకు సహాయకరంగా ఉంటుంది?

13, 14. (ఎ) మరో భాషలో పరిచర్యను చేపట్టడానికి కొందరిని ఏది ప్రేరేపిస్తుంది? (బి) స్వయంత్యాగ స్ఫూర్తి ఎలా స్పష్టమవుతుంది?

15. బహుభాషా ప్రకటనా కార్యక్రమంలో మనమందరం ఎలా భాగం వహించవచ్చు?

16. వేరేభాష మాట్లాడేవారికి సహాయం చేయడంలో బాధ్యతగల సహోదరులు ఎలా నిస్వార్థ శ్రద్ధను ప్రదర్శించవచ్చు?

17. వేరేభాషా గుంపుకు సహాయం చేయడానికి తరలివెళ్లాలని కొందరు నిర్ణయించుకున్నప్పుడు మనమెలా భావించాలి?

18. అందరికీ కార్యానుకూలమైన ఎలాంటి గొప్ప ద్వారము తెరవబడి ఉంది?

[23వ పేజీలోని మ్యాపు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

రోమా

క్రేతు

ఆసియా

ఫ్రుగియ

పంఫూలియా

పొంతు

కప్పదొకియ

మెసొపొతమియ

మాద్య

పార్తీయ

ఏలాము

అరేబియా

లిబియ

ఐగుప్తు

యూదయ

యెరూషలేము

[సముద్రాలు]

మధ్యధరా సముద్రం

నల్ల సముద్రం

ఎర్ర సముద్రం

పర్షియా సింధుశాఖ

[చిత్రం]

సా.శ. 33 పెంతెకొస్తు దినాన రోమా సామ్రాజ్యంలోని 15 ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ మాతృభాషలో సువార్త విన్నారు

[24వ పేజీలోని చిత్రాలు]

చాలామంది పరదేశులు బైబిలు సత్యానికి చక్కగా స్పందిస్తున్నారు

[25వ పేజీలోని చిత్రం]

ఐదు భాషల్లోవున్న రాజ్య మందిర బోర్డు