కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నా సృష్టికర్తను సేవిస్తూ ఉండాలని నిశ్చయించుకున్నాను

నా సృష్టికర్తను సేవిస్తూ ఉండాలని నిశ్చయించుకున్నాను

జీవిత కథ

నా సృష్టికర్తను సేవిస్తూ ఉండాలని నిశ్చయించుకున్నాను

కాన్స్‌టాన్స్‌ బనాంటీ చెప్పినది

అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి! 22 నెలల మా అమ్మాయి కమీల్‌కు తీవ్రజ్వరం వచ్చి ఆరు దినాల్లో మరణించింది. నేను భరించరాని దుఃఖాన్ని అనుభవించాను. నేను కూడా చనిపోవాలనుకున్నాను. దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితిని అనుమతించాడు? అనే ప్రశ్న నన్ను కలవరపెట్టింది.

నాతల్లిదండ్రులు ఇటలీలోని సిసిలీలో ఉన్న క్యాస్టెల్లమారె డెల్‌ గోల్ఫో నగరం నుండి వచ్చిన శరణార్థులు. వారు న్యూయార్క్‌ పట్టణానికి వచ్చారు, నేను అక్కడ 1908, డిసెంబరు 8న జన్మించాను. మా కుటుంబంలో మా అమ్మానాన్నలతో పాటు మేము ఎనిమిది మంది పిల్లలం, ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలం. *

మా నాన్న సాన్టో కాటన్జరో 1927లో బైబిలు విద్యార్థుల చిన్న గుంపు నిర్వహించే కూటానికి హాజరవడం మొదలుపెట్టాడు, అప్పట్లో యెహోవాసాక్షులు అలా పిలువబడేవారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న (బెతెల్‌ అని పిలువబడే) ప్రధాన కార్యాలయంలో సేవ చేస్తున్న ఇటలీకి చెందిన సహోదరుడు జొవెన్ని డెచెకా, ఆ కార్యాలయానికి దగ్గర్లో ఉన్న న్యూ జెర్సీ రాష్ట్రంలో, మేము నివసిస్తున్న చోట కూటాలు నిర్వహించేవాడు. కొంతకాలానికి నాన్న ప్రకటించడం మొదలుపెట్టి పూర్తికాల పరిచర్యను చేపట్టాడు, ఆయన 1953లో తాను మరణించేంతవరకు ఆ పనిలో కొనసాగాడు.

మా అమ్మ చిన్నప్పుడు ఒక మతసన్యాసిని కావాలనుకునేది, అయితే ఆమె తల్లిదండ్రులు దానికి అనుమతించలేదు. నేను నాన్నతో కలిసి బైబిలు అధ్యయనం చేయకుండా మొదట్లో మా అమ్మ నన్ను ప్రభావితం చేసింది. అయితే త్వరలోనే నేను ఆయనలో మార్పులు గమనించాను. ఆయన నెమ్మదస్థునిగా, మృదు స్వభావిగా మారాడు, అంతేకాక కుటుంబంలో ఎంతో శాంతి నెలకొంది. నేను ఆ మార్పులను ఇష్టపడ్డాను.

అదే సమయంలో నేను, బ్రూక్లిన్‌లో పుట్టి పెరిగిన ఛార్లెస్‌ అనే నా సమాన వయస్కుడైన ఒక వ్యక్తిని కలిశాను. ఆయన కుటుంబం మా కుటుంబంలాగే సిసిలీ నుండి వచ్చింది. కొంతకాలానికి మాకు పెళ్ళి నిశ్చయమైంది, 1931లో ఒహాయోలోని కొలంబస్‌లో జరిగిన యెహోవాసాక్షుల సమావేశం నుండి మా నాన్న తిరిగివచ్చిన తర్వాత మేము పెళ్ళి చేసుకున్నాం. ఒక సంవత్సరంలోనే మా అమ్మాయి కమీల్‌ జన్మించింది. ఆమె మరణించినప్పుడు నేను దుఃఖంలో మునిగిపోయాను. ఒకరోజు ఛార్లెస్‌ ఏడుస్తూ నాతో ఇలా అన్నాడు: “కమీల్‌ నీకెలా కూతురో నాకు కూడా అలాగే కూతురు కదా. మనం ఒకరినొకరం ఓదార్చుకుంటూ మన జీవితాన్ని ఎందుకు కొనసాగించకూడదు?”

మేము బైబిలు సత్యాన్ని అంగీకరించాం

నాన్న, కమీల్‌ అంత్యక్రియలప్పుడు ఇచ్చిన ప్రసంగంలో పునరుత్థాన నిరీక్షణ గురించి మాట్లాడాడని ఛార్లెస్‌ నాకు గుర్తు చేశాడు. “మీరు పునరుత్థానాన్ని నిజంగా నమ్ముతున్నారా?” అని నేను ఆయనను అడిగాను.

ఆయనిలా జవాబిచ్చాడు: “నేను నమ్ముతున్నాను! బైబిలు ఇంకా ఏమి చెబుతుందో మనమెందుకు తెలుసుకోకూడదు?”

ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. ఉదయాన్నే ఆరు గంటలకు నాన్న పనికి వెళ్ళకముందే నాన్నను కలిసి, నేనూ ఛార్లెస్‌ బైబిలు అధ్యయనం చేయాలనుకుంటున్నామని చెప్పాను. ఆయన దానికి సంతోషించి, నన్ను కౌగిలించుకున్నాడు. ఇంకా మంచం మీదే ఉన్న మా అమ్మ మా సంభాషణను విన్నది. ఏమయిందని ఆమె నన్ను అడిగింది. “ఏమీ కాలేదు, ఛార్లెస్‌, నేను బైబిలు అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాం” అని చెప్పాను.

“మనమందరం బైబిలు అధ్యయనం చేయాలి” అని ఆమె అన్నది. దానితో, మేమందరం అంటే నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళతో సహా మొత్తం 11 మందిమి, కుటుంబంగా అధ్యయనం చేయడం ప్రారంభించాం.

బైబిలు అధ్యయనం నాకు ఓదార్పునిచ్చింది, మెల్లగా నాలో మానసిక ఆందోళన స్థానంలో నిరీక్షణ చోటుచేసుకుంది. ఒక సంవత్సరం తర్వాత, 1935లో ఛార్లెస్‌, నేను ఇతరులతో బైబిలు సత్యాలను పంచుకోవడం మొదలుపెట్టాం. 1937 ఫిబ్రవరిలో, బ్రూక్లిన్‌లోని ప్రధాన కార్యాలయంలో, నీటి బాప్తిస్మానికున్న లేఖనాధార ప్రాముఖ్యతను వివరించిన ప్రసంగాన్ని విన్న తర్వాత, మేము చాలామంది ఇతరులతో పాటు దగ్గర్లోని హోటల్‌లో బాప్తిస్మం తీసుకున్నాం. మా అమ్మాయిని ఏదో ఒకరోజు మళ్లీ చూస్తాననే నిరీక్షణ కారణంగానే నేను ఈ చర్య తీసుకోలేదు, నేను మన సృష్టికర్త గురించిన జ్ఞానం సంపాదించుకుని, ఆయనను ప్రేమించడం మొదలుపెట్టాను కాబట్టి ఆయనను సేవించాలనే కోరికతో కూడా ఆ చర్య తీసుకున్నాను.

పూర్తికాల పరిచర్యను చేపట్టడం

నేను నేర్చుకున్నవాటిని ఇతరులతో పంచుకోవడం ఉత్తేజకరంగా, ప్రతిఫలదాయకంగా ఉండేది, ఎందుకంటే ప్రత్యేకించి ఆ కాలంలో చాలామంది రాజ్య సందేశానికి ప్రతిస్పందించి దానిని ప్రకటించడంలో భాగం వహించేవారు. (మత్తయి 9:​37) 1941లో నేను, ఛార్లెస్‌ పయినీర్లమయ్యాం, యెహోవాసాక్షులు తమ పూర్తికాల పరిచారకులను అలా పిలుస్తారు. కొంతకాలం తర్వాత మేము ఒక ట్రెయిలర్‌ను కొన్నాం, ఛార్లెస్‌ మా కుటుంబానికి చెందిన ప్యాంట్‌లు తయారుచేసే ఫ్యాక్టరీనీ మా తమ్ముడు ఫ్రాంక్‌కు అప్పజెప్పాడు. కొంతకాలానికి, మేము ప్రత్యేక పయినీర్లుగా నియమించబడ్డామని తెలియజేసే ఉత్తరాన్ని అందుకొని ఉత్తేజితులమయ్యాం. మొదట్లో మేము న్యూ జెర్సీలో సేవచేశాం, ఆ తర్వాత మేము న్యూయార్క్‌ రాష్ట్రానికి పంపించబడ్డాం.

మేము 1946లో మేరీల్యాండ్‌లోని బాల్టమోర్‌లో జరిగిన సమావేశానికి హాజరవుతున్నప్పుడు యెహోవాసాక్షుల ప్రత్యేక ప్రతినిధులను కలవాలని మాకు చెప్పబడింది. మేము అక్కడ నేథన్‌ హెచ్‌. నార్‌ను, మిల్టన్‌ జి. హెన్షెల్‌ను కలిశాం. వారు మిషనరీ పని గురించి, ప్రత్యేకంగా ఇటలీలో ప్రకటనా పని గురించి మాకు చెప్పారు. బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు హాజరయ్యే అవకాశం గురించి ఆలోచించమని వారు మాకు చెప్పారు.

“మీరు దాని గురించి ఆలోచించి ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మాకు తెలియజేయండి” అని వారు మాతో చెప్పారు. మేము ఆ కార్యాలయం నుండి బయటికి వచ్చిన తర్వాత ఛార్లెస్‌ నేను ఒకరినొకరం చూసుకొని, వెనక్కి తిరిగి, లోపలికి వెళ్ళాం. “మేము దాని గురించి ఆలోచించాం, మేము గిలియడ్‌కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం” అని వారితో చెప్పాం. పది రోజుల తర్వాత మేము ఏడవ గిలియడ్‌ తరగతికి హాజరయ్యాం.

మేము శిక్షణలో గడిపిన నెలలు మరపురానివి. ఉపదేశకుల ఓర్పు, ప్రేమ మమ్మల్ని ప్రత్యేకంగా ప్రభావితం చేశాయి, విదేశీ క్షేత్రంలో సమస్యలు ఎదుర్కోవడానికి అవి మమ్మల్ని సంసిద్ధులను చేశాయి. 1946 జూలైలో మేము పట్టభద్రులమైన తర్వాత, కొద్దికాలం ఇటలీకి చెందిన జనాభా అధికంగా ఉన్న న్యూయార్క్‌ పట్టణంలో ప్రకటించే నియామకం అందుకున్నాం. ఆ తర్వాత ఉత్తేజకరమైన ఆ రోజు రానే వచ్చింది! 1947 జూన్‌ 25న మేము మా మిషనరీ నియామకమైన ఇటలీకి బయలుదేరాం.

మా నియామకంలో స్థిరపడడం

ఇంతకుముందు సైనిక అవసరాలకు ఉపయోగించబడిన ఓడలో మేము ప్రయాణించాం. మేము సముద్రంలో 14 రోజులు ప్రయాణించిన తర్వాత ఇటలీ ఓడరేవు పట్టణమైన జెనోవాలో ఆగాం. కేవలం రెండు సంవత్సరాల క్రితం ముగిసిన రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టం ఆ పట్టణంలో కనిపిస్తోంది. ఉదాహరణకు, ఆ పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో బాంబు దాడుల కారణంగా కిటికీలకు అద్దాలే లేవు. మేము జెనోవాలో గూడ్స్‌ రైలు ఎక్కి బ్రాంచి కార్యాలయం, మిషనరీ గృహం ఉన్న మిలాన్‌కు చేరుకున్నాం.

ఇటలీలో యుద్ధానంతర జీవన పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. పునర్నిర్మాణ ప్రయత్నాలు అమలులో ఉన్నా పేదరికం విస్తృతంగా ఉంది. కొంతకాలానికి నేను తీవ్ర అనారోగ్యానికి గురయ్యాను. నా గుండె చాలా అనారోగ్యంగా ఉన్నందుకు నేను అమెరికాకు తిరిగివెళ్ళడం మంచిదని ఒక వైద్యుడు భావించాడు. అతను చేసిన రోగనిర్ధారణ తప్పైనందుకు నేను సంతోషిస్తున్నాను. అది జరిగి ఇప్పటికి 58 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ నేను ఇంకా ఇటలీలోని నా నియామకంలో సేవచేస్తూనే ఉన్నాను.

మా నియామకంలో కేవలం కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత, అమెరికాలోవున్న నా తమ్ముళ్ళు మాకు కారు ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఛార్లెస్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు, నేను ఆ నిర్ణయాన్ని గౌరవించాను. మాకు తెలిసినంతవరకు ఆ కాలంలో ఇటలీలో సాక్షులెవరికీ కారు లేదు, మా క్రైస్తవ సహోదరులకున్న జీవన ప్రమాణాలే మాకూ ఉండడం మంచిదని ఛార్లెస్‌ భావించాడు. 1961లో మేము చిన్నకారు కొనేంతవరకు మాకు కారు లేదు.

మిలాన్‌లోని మా మొదటి రాజ్యమందిరం బేస్‌మెంట్‌లో (నేలమాళిగలో) ఉండేది, ఆ గదిలో మట్టినేల ఉండేది. రాజ్యమందిరంలో బాత్‌రూమ్‌ లేదు, నీటి సరఫరా లేదు, వర్షం కురిసినప్పుడు అది జలమయమయ్యేది. మా రాజ్య మందిరంలో మాకు తోడుగా చిట్టెలుక కూడా నివసించేది, అది అటు ఇటు సంచరించేది. రెండు బల్బులు కూటాలు జరుగుతున్నప్పుడు వెలుగునిచ్చేవి. అలాంటి అసౌకర్యాలున్నా యథార్థవంతులు మన కూటాలకు వచ్చి చివరకు మాతో కలిసి పరిచర్యలో పాల్గొనడాన్ని చూడడం ప్రోత్సాహకరంగా ఉండేది.

మిషనరీ అనుభవాలు

మేము ఒకసారి, శాంతి—అది నిలువగలదా? (ఆంగ్లం) అనే చిన్నపుస్తకం ఒక వ్యక్తికి ఇచ్చాం. మేము ఆ వ్యక్తి ఇంటి నుండి బయటికి వస్తున్నప్పుడు ఆయన భార్య సాన్టీనా, కిరాణా బ్యాగుల బరువుతో వచ్చింది. మమ్మల్ని చూసి ఆమె ముఖం చిరాకుగా పెట్టింది, తనకు ఎనిమిదిమంది అమ్మాయిలను పోషించే బాధ్యత ఉందని తనకు తీరిక లేదని ఆమె చెప్పింది. నేను సాన్టీనాను మళ్ళీ కలిసినపుడు ఆమె భర్త ఇంట్లో లేడు, ఆమె ఊలుతో అల్లుతోంది. “మీరు చెప్పేది వినడానికి నాకు సమయం లేదు, అదీగాక, నాకు చదవడం కూడా రాదు” అని ఆమె చెప్పింది.

నేను నిశ్శబ్దంగా యెహోవాకు ప్రార్థించి, మావారి కోసం ఒక స్వెట్టర్‌ అల్లడానికి నేను తనకు డబ్బు చెల్లించవచ్చా అని ఆ తర్వాత ఆమెను అడిగాను. రెండు వారాల తర్వాత నాకు స్వెట్టర్‌ దొరికింది, “సత్యం మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది” (ఆంగ్లం) అనే పుస్తకం సహాయంతో నేను సాన్టీనాతో క్రమంగా బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. సాన్టీనా చదవడం నేర్చుకుంది, ఆమెకు ఆమె భర్త నుండి వ్యతిరేకత ఎదురైనా ఆమె ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకుంది. ఆమె ఐదుగురు అమ్మాయిలు సాక్షులయ్యారు, ఇతరులు చాలామంది బైబిలు సత్యాన్ని అంగీకరించేందుకు కూడా సాన్టీనా సహాయం చేసింది.

1951 మార్చిలో మేము, మరో ఇద్దరు మిషనరీలైన రూత్‌ కానన్‌, * లోయిస్‌ కలహన్‌లతో పాటు సాక్షులులేని బ్రెశాకు బదిలీ చేయబడ్డాం, లోయిస్‌ కలహన్‌ కొంతకాలం తర్వాత బిల్‌ వెనార్ట్‌ను వివాహం చేసుకుంది. మాకు సామానులు అమర్చబడిన అపార్ట్‌మెంట్‌ దొరికింది, అయితే రెండు నెలల తర్వాత ఆ ఇంటి యజమాని మమ్మల్ని 24 గంటల్లోగా ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఆ ప్రాంతంలో వేరే సాక్షులు ఎవరూ లేరు కాబట్టి మాకు వేరే గత్యంతరం లేక హోటల్‌కు వెళ్ళాల్సివచ్చింది, అక్కడ మేము దాదాపు రెండు నెలలు బస చేశాం.

మా ఆహారం చాలా పరిమితంగా ఉండేది: ఉదయం కాఫీ, ఫలహారాలు, మధ్యాహ్నం పండు, బ్రెడ్డు, ఛీజ్‌, మళ్ళీ రాత్రికి పండు, బ్రెడ్డు, ఛీజ్‌. మాకు అసౌకర్యాలు ఎదురైనా మేము నిజంగా ఆశీర్వదించబడ్డాం. కొంతకాలానికి మాకు చిన్న అపార్ట్‌మెంట్‌ దొరికింది, 1952లో క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినానికి మేము రాజ్య మందిరంగా ఉపయోగించిన ఆ చిన్న గదిలో 35 మంది హాజరయ్యారు.

సవాళ్ళను ఎదుర్కోవడం

ఆ సమయంలో మతనాయకులు ప్రజల మీద గొప్ప అధికారం చెలాయిస్తుండేవారు. ఉదాహరణకు, మేము బ్రెశాలో ప్రకటిస్తున్నప్పుడు మా మీద రాళ్ళు రువ్వడానికి ఫాదిరి కొంతమంది అబ్బాయిలను ఉసిగొల్పాడు. అయితే కొంతకాలానికి అక్కడ 16 మంది మాతో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించారు, అనతికాలంలో వారు సాక్షులయ్యారు. అలా సాక్షులైనవారిలో ఎవరున్నారు? మా మీద రాళ్ళు రువ్వుతానని బెదిరించిన ఒక అబ్బాయి కూడా ఉన్నాడు! ఆయన ఇప్పుడు బ్రెశాలో ఉన్న సంఘాల్లో ఒకదానిలో పెద్దగా సేవచేస్తున్నాడు. 1955లో మేము బ్రెశా విడిచివెళ్ళినప్పుడు 40 మంది రాజ్య ప్రచారకులు ప్రకటనా పనిలో భాగం వహిస్తున్నారు.

ఆ తర్వాత మేము మూడు సంవత్సరాలు లోగార్న్‌లో (లివోర్నో) సేవచేశాం, అక్కడ సాక్షుల్లో అధికశాతం మంది స్త్రీలే. ఆ కారణంగా, సాధారణంగా సహోదరులు నిర్వర్తించే సంఘంలోని కొన్ని బాధ్యతలను సహోదరీలమైన మేము నిర్వర్తించాల్సివచ్చింది. మేము అక్కడినుండి, 11 సంవత్సరాల క్రితం ఇటలీలో మా సేవను ప్రారంభించిన జెనోవా పట్టణానికి వెళ్ళాం. అప్పటికే అక్కడ ఒక సంఘం ఉంది. రాజ్య మందిరం మా అపార్ట్‌మెంట్‌ ఉన్న భవనంలోని మొదటి అంతస్థులో ఉంది.

మేము జెనోవాకు వచ్చిన వెంటనే నేనొక స్త్రీతో అధ్యయనం ప్రారంభించాను, ఆమె భర్త మాజీ బాక్సర్‌, బాక్సింగ్‌ జిమ్‌ మేనేజరు. ఆ స్త్రీ ఆధ్యాత్మిక ప్రగతి సాధించి కొంతకాలానికే మన క్రైస్తవ సహోదరిగా మారింది. అయితే ఆమె భర్త చాలాకాలంపాటు వ్యతిరేకించాడు. ఆ తర్వాత ఆయన తన భార్యతోపాటు కూటాలకు వచ్చేవాడు. ఆయన హాల్లోకి రాకుండా బయటే కూర్చొని కార్యక్రమాన్ని వినేవాడు. మేము జెనోవా విడిచి వెళ్ళిన తర్వాత, ఆయన బైబిలు అధ్యయనం కావాలని అడిగాడని తెలిసింది. కొంతకాలానికి ఆయన బాప్తిస్మం తీసుకుని ప్రేమగల క్రైస్తవ పైవిచారణకర్త అయ్యాడు. ఆయన మరణించేంతవరకు నమ్మకంగా ఉన్నాడు.

పోలీసుతో పెళ్ళి నిశ్చయం అయిన ఒక స్త్రీతో కూడా నేను బైబిలు అధ్యయనం చేశాను. ఆయన ప్రారంభంలో కొంత ఆసక్తి చూపించాడు, అయితే వివాహమైన తర్వాత ఆయన వైఖరి మారింది. ఆయన ఆమెను వ్యతిరేకించాడు, ఆమె అధ్యయనం చేయడం మానేసింది. ఆమె ఆ తర్వాత బైబిలు అధ్యయనాన్ని పునఃప్రారంభించినప్పుడు, మేము బైబిలు అధ్యయనం చేస్తున్నట్లు తాను మళ్ళీ ఎప్పుడైనా చూస్తే మా ఇద్దరినీ కాల్చిపారేస్తానని ఆమె భర్త ఆమెను బెదిరించాడు. ఆమె ఆధ్యాత్మిక ప్రగతి సాధించి బాప్తిస్మం తీసుకున్న సాక్షి అయింది. ఆయన మమ్మల్ని ఎప్పుడూ కాల్చలేదని వేరే చెప్పనవసరంలేదు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల తర్వాత నేను జెనోవాలోని ఒక సమావేశానికి హాజరైనప్పుడు ఎవరో నా వెనుక నుండి వచ్చి తన చేతులతో నా కళ్ళు మూసి తాను ఎవరో చెప్పమని అడిగారు. ఆ స్త్రీ భర్తను చూసినప్పుడు అశ్రువులతో నా కళ్లు నిండిపోయాయి. నన్ను ఆలింగనం చేసుకున్న తర్వాత, యెహోవాకు తాను చేసుకున్న సమర్పణకు సూచనగా తాను ఆ రోజే బాప్తిస్మం తీసుకున్నానని ఆయన నాతో చెప్పాడు!

1964 నుండి 1972 వరకు ఛార్లెస్‌ సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరిచేందుకు సందర్శిస్తున్నప్పుడు ఆయనతో పాటు వెళ్ళే ఆధిక్యత నాకు లభించింది. మేము దాదాపు ఉత్తర ఇటలీ అంతటిలో సేవచేశాం, అంటే పీడ్మాంట్‌, లొంబార్డీ, లెగ్యూరియా ప్రాంతాల్లో సేవ చేశాం. ఆ తర్వాత మేము పయినీరు సేవను ఫ్లోరెన్స్‌ పట్టణంలో, ఆ తర్వాత వర్చెలి ప్రాంతంలో పునఃప్రారంభించాం. 1977లో వర్చెలి ప్రాంతంలో కేవలం ఒక సంఘమే ఉంది కానీ 1999లో మేము ఆ ప్రాంతాన్ని విడిచివెళ్ళేటప్పటికి అక్కడ మూడు సంఘాలు ఏర్పడ్డాయి. ఆ సంవత్సరం నేను నా 91వ ఏట ప్రవేశించాను, రోమ్‌లోని మిషనరీ గృహానికి వెళ్ళమని మేము ప్రోత్సహించబడ్డాం, ఆ మిషనరీ గృహం ప్రశాంతమైన ప్రాంతంలో ఉన్న ఒక అందమైన భవనం.

మరో విషాద ఘటన

ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండే ఛార్లెస్‌, 2002 మార్చిలో అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యారు. 2002 మే 11న మరణించేంతవరకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనేవుంది. 71 సంవత్సరాల మా కాపురంలో కష్టసమయాలు వచ్చినప్పుడు కలిసి దుఃఖించాం, ఆశీర్వాదాలు పొందినప్పుడు కలిసి ఆనందించాం. ఆయన మరణం నాకు తీరని లోటును మిగిల్చింది.

ఛార్లెస్‌ సూట్‌ వేసుకొని, 1930ల కాలంలో ఫ్యాషన్‌గా ఉన్న తన టోపీతో ఉన్నట్లు నేను తరచూ ఊహించుకుంటాను. నేను ఆయన చిరునవ్వును ఊహించుకుంటాను, పరిచయమున్న ఆయన నవ్వు వినిపిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. యెహోవా సహాయంతో, చాలామంది ప్రియ క్రైస్తవ సహోదర సహోదరీల ప్రేమ మూలంగా నేను ఈ విషాదకరమైన సమయాన్ని సహించగలిగాను. నేను ఛార్లెస్‌ను మళ్ళీ చూసే సమయం కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నాను.

నా సేవను కొనసాగించడం

నా సృష్టికర్తను సేవించడం నా జీవితంలో అత్యద్భుతమైన విషయం. గడిచిన సంవత్సరాల్లో ‘యెహోవా ఉత్తముడని నేను రుచి చూచి తెలుసుకున్నాను.’ (కీర్తన 34:⁠8) ఆయన ప్రేమను, కాపుదలను చవిచూశాను. నేను నా పాపను కోల్పోయినా యెహోవా నాకు చాలామంది ఆధ్యాత్మిక కుమారులను, కుమార్తెలను ఇచ్చాడు, వారు ఇటలీ అంతటా ఉన్నారు, వారు నా హృదయానికి యెహోవా హృదయానికి ఆనందాన్నిచ్చారు.

నా సృష్టికర్త గురించి ఇతరులతో మాట్లాడడం నేను ఎల్లప్పుడూ చాలా ఇష్టపడతాను. అందుకే నేను ఇప్పటికీ ప్రకటిస్తున్నాను, బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నాను. నా ఆరోగ్యరీత్యా ఎక్కువ చేయలేకపోతున్నానని కొన్నిసార్లు విచారిస్తాను. అయితే, యెహోవాకు నా పరిమితుల గురించి తెలుసనీ, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడనీ, నేను చేయగలుగుతున్న సేవను అమూల్యంగా ఎంచుతున్నాడనీ నాకు తెలుసు. (మార్కు 12:​42) నేను కీర్తన 146:⁠2లోని ఈ మాటలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నిస్తాను: “నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను.” *

[అధస్సూచీలు]

^ పేరా 5 మా తమ్ముడు ఏంజలో కాటన్జరో అనుభవం కావలికోట (ఆంగ్లం), ఏప్రిల్‌ 1, 1975, 205-7 పేజీల్లో ప్రచురించబడింది.

^ పేరా 28 ఆమె జీవితకథ కోసం కావలికోట, మే 1, 1971, 277-80 పేజీలు చూడండి.

^ పేరా 41 సహోదరి బనాంటీ 2005, జూలై 16న, ఈ ఆర్టికల్‌ను సిద్ధంచేస్తున్నప్పుడు చనిపోయింది. ఆమె వయసు 96 సంవత్సరాలు.

[13వ పేజీలోని చిత్రం]

కమీల్‌

[14వ పేజీలోని చిత్రం]

మా పెళ్ళి రోజు, 1931లో

[14వ పేజీలోని చిత్రం]

అమ్మ మొదట్లో ఆసక్తి చూపించకపోయినా ఆ తర్వాత మనమందరం బైబిలు అధ్యయనం చేయాలని అంగీకరించింది

[15వ పేజీలోని చిత్రం]

గిలియడ్‌ గ్రాడ్యుయేషన్‌ సమయంలో సహోదరుడు నార్‌తో, 1946లో

[17వ పేజీలోని చిత్రం]

ఛార్లెస్‌ మరణించడానికి కొంతకాలం ముందు ఛార్లెస్‌తో