కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించే ప్రగతిశీల పరిచారకులుగా తయారవడం

పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించే ప్రగతిశీల పరిచారకులుగా తయారవడం

పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించే ప్రగతిశీల పరిచారకులుగా తయారవడం

“ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.”​—⁠1 కొరింథీయులు 9:​22.

జ్ఞానవంతులైన మేధావులతోనూ, గుడారాలు తయారుచేసే సామాన్యులతోనూ ఆయన ఎలాంటి ఇబ్బందీ లేకుండా మెలిగేవాడు. ఆయన రోమా అధిపతులతోపాటు ఫ్రుగియలోని పామరులనూ ఒప్పించాడు. ఆయన రచనలు స్వేచ్ఛావాద గ్రీసు దేశస్థులతోపాటు సనాతనవాద యూదులనూ పురికొల్పాయి. ఆయన భావావేశ అభ్యర్థన ఎంత శక్తిమంతంగా ఉందో ఆయన న్యాయతర్కన అంత సవాలు చేయలేని విధంగా ఉంది. కొందరైనా క్రీస్తును నమ్మేలా చేయాలని, ఆయన ప్రతీ ఒక్కరితో మాట్లాడేందుకు ఇరువర్గాలకు సమ్మతమైనదేదో ఒకటి కనుగొనడానికి ప్రయత్నించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 20:​20-21.

2 ఆయనే అపొస్తలుడైన పౌలు, నిస్సందేహంగా ఆయన సమర్థుడైన, ప్రగతిశీల పరిచారకుడు. (1 తిమోతి 1:12) ‘అన్యజనుల యెదుటను, రాజుల యెదుటను, ఇశ్రాయేలీయుల యెదుటను [క్రీస్తు] నామము భరించే’ ఆజ్ఞను ఆయన యేసు నుండి పొందాడు. (అపొస్తలుల కార్యములు 9:15) ఈ నియామకంపట్ల ఆయనకు ఎలాంటి దృక్పథం ఉంది? ఆయన ఇలా ప్రకటించాడు: “ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను.” (1 కొరింథీయులు 9:19-23) మన ప్రకటనా పనిలో, బోధనా పనిలో మరింత సమర్థవంతంగా ఉండేందుకు మనకు సహాయం చేయగల ఏ విషయాన్ని మనం పౌలు మాదిరి నుండి నేర్చుకోవచ్చు?

మారిన మనిషి ఆ సవాలును అధిగమించాడు

3 పౌలు అన్ని సందర్భాల్లోనూ సహనశీలిగా, ఇతరుల కష్టసుఖాలపట్ల శ్రద్ధవహించేవాడిగా, తానుపొందిన నియామకానికి తగిన వ్యక్తిగా ఉన్నాడా? లేడు. మత ఛాందసత్వం సౌలును (పూర్వం పౌలుకున్న పేరు) క్రీస్తు అనుచరులను దౌర్జన్యపూరితంగా హింసించే వ్యక్తిగా మార్చింది. యౌవనునిగా ఆయన స్తెఫను హత్యను ఆమోదించాడు. ఆ తర్వాత పౌలు నిర్దాక్షిణ్యంగా క్రైస్తవులను వేటాడాడు. (అపొస్తలుల కార్యములు 7:​58; 8:1, 3; 1 తిమోతి 1:​13) ‘ప్రభువు శిష్యులను బెదిరించుటలో, హత్య చేయుటలో’ ఆయన కొనసాగాడు. యెరూషలేములోని శిష్యులను వెంటాడడంతో సంతృప్తిచెందక, తన ద్వేషాగ్నిని దమస్కు వరకు వ్యాపింపజేయడం మొదలుపెట్టాడు.​—⁠అపొస్తలుల కార్యములు 9:1, 2.

4 క్రైస్తవత్వంపట్ల పౌలుకున్న తీవ్ర ద్వేషానికి కారణం, బహుశా ఆ క్రొత్త విశ్వాసం దాని విభిన్న, హానికరమైన ఆలోచనలతో యూదామతాన్ని పాడు చేస్తుందనే నమ్మకం కావచ్చు. నిజానికి పౌలు “పరిసయ్యుడు,” ఆ మాటకు “ప్రత్యేకింపబడిన వ్యక్తి” అని అర్థం. (అపొస్తలుల కార్యములు 23:6) ప్రజలందరిలోకీ అన్యజనులకు క్రీస్తును ప్రకటించేందుకు దేవుడు తనను ఎన్నుకున్నాడని తెలుసుకున్నప్పుడు పౌలు ఎంత దిగ్భ్రాంతికి గురైవుంటాడో ఊహించుకోండి! (అపొస్తలుల కార్యములు 22:​14, 15; 26:16-18) అంతెందుకు, పరిసయ్యులు తాము పాపులుగా పరిగణించే ప్రజలతో భోజనం కూడా చేసేవారు కాదు! (లూకా 7:36-39) తన దృక్కోణాన్ని పునఃపరిశీలించుకొని, దానిని మనుష్యులందరూ రక్షణ పొందాలనే దేవుని చిత్తానికనుగుణంగా మార్చుకొనేందుకు నిస్సందేహంగా గట్టి కృషి అవసరమై ఉండవచ్చు.​—⁠గలతీయులు 1:13-17.

5 మనం కూడా అలాగే చేయవలసి ఉంటుంది. మన అంతర్జాతీయ, బహుభాషా క్షేత్రంలో క్రమంగా అధికమవుతున్న వివిధ ప్రజలను మనం కలుస్తున్నప్పుడు, మన దృక్పథాన్ని పరిశీలించుకొని, మనలో ఎలాంటి వివక్ష ఉన్నా దానిని విసర్జించేందుకు మనఃపూర్వక ప్రయత్నం చేయాలి. (ఎఫెసీయులు 4:22-24) మనం గ్రహించినా, గ్రహించకపోయినా సామాజికంగా, విద్యాసంబంధంగా మనం పెరిగిన వాతావరణ ప్రభావం మనపై ఉంటుంది. ఇది పక్షపాతపు, దురభిమానపు, కఠినత్వపు దృక్కోణాలను, దృక్పథాలను మనలో కలిగించగలదు. గొర్రెలాంటి ప్రజలను కనుగొని, వారికి సహాయం చేయాలంటే అలాంటి మనోభావాలను మనం అధిగమించాలి. (రోమీయులు 15:7) పౌలు అదే చేశాడు. ఆయన తన పరిచర్యను విస్తృతపరచుకునే సవాలును అంగీకరించాడు. ప్రేమచేత పురికొల్పబడి, అనుసరించదగిన బోధనా నైపుణ్యాలను ఆయన వృద్ధి చేసుకున్నాడు. అవును ‘అన్యజనులకు అపొస్తలుడైన’ పౌలు పరిచర్యను అధ్యయనం చేస్తే ఆయన ప్రకటించడంలో, బోధించడంలో శ్రద్ధగలవాడనీ, పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించగలడనీ, ప్రజ్ఞావంతుడనీ తెలుస్తుంది. *​—⁠రోమీయులు 11:13.

ప్రగతిశీల క్రియాత్మక పరిచారకుడు

6 తన శ్రోతల నమ్మకాల, నేపథ్యాలపట్ల పౌలు శ్రద్ధ చూపించాడు. రెండవ అగ్రిప్ప రాజును ఉద్దేశించి మాట్లాడుతూ, ఆయనకు ‘యూదులలో ఉండు సమస్తమైన ఆచారములు, వివాదములు విశేషముగా’ తెలుసని పౌలు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత పౌలు అగ్రిప్ప నమ్మకాలకు సంబంధించిన తన జ్ఞానాన్ని నేర్పుగా ఉపయోగిస్తూ, ఆ రాజు బాగా అర్థం చేసుకోగల విషయాలను ఆయనతో చర్చించాడు. పౌలు తర్కంలో స్పష్టత, నమ్మకం ఎంతగా ఉన్నాయంటే, అగ్రిప్ప చివరకు “ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయజూచుచున్నావే” అన్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 26:2, 3, 27, 28.

7 పౌలు పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించగల వ్యక్తి కూడా. ప్రజలు లుస్త్ర పట్టణంలో తనను, బర్నబాను దేవతలుగా ఆరాధించకుండా వారిని నివారించే ప్రయత్నంలో ఆయన ఒక భిన్నమైన పద్ధతిని ఎలా ఉపయోగించాడో పరిశీలించండి. లుకయోనియ భాష మాట్లాడే ఆ ప్రజలు అంతగా విద్యావంతులు కాదుగానీ వారికి ఎన్నో మూఢనమ్మకాలున్నాయని చెప్పబడుతోంది. అపొస్తలుల కార్యములు 14:14-18 ప్రకారం, సత్యదేవుని ఔన్నత్యానికి రుజువుగా సృష్టి గురించి, దానిలోని ప్రకృతి సంపదల గురించి పౌలు ప్రస్తావించాడు. ఆ తర్కం అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండి, అది పౌలుకు, బర్నబాకు ‘బలి అర్పింపకుండ సమూహములను ఆపినట్లు’ స్పష్టమవుతోంది.

8 నిజమే, పౌలు పరిపూర్ణుడు కాదు, ఆ యా విషయాల్లో ఆయనలో ప్రగాఢ భావావేశాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఒక సందర్భంలో తనను కించపరిచేలా, అన్యాయంగా తనపై దాడి జరిగినప్పుడు, ఆయన కోపంతో అననీయ అనే యూదునిపై మండిపడ్డాడు. అయితే పౌలు తాను చూసుకోకుండా ప్రధాన యాజకుణ్ణి అవమానపరిచాడని తెలుసుకున్నప్పుడు, ఆయన వెంటనే క్షమాపణ అడిగాడు. (అపొస్తలుల కార్యములు 23:1-5) ఆయన మొదట్లో ఏథెన్సు ‘విగ్రహములతో నిండియుండుట చూచినందున పరితాపము పట్టలేకపోయాడు.’ అయినప్పటికీ, మార్సు కొండపై ఇచ్చిన ప్రసంగంలో పౌలు అలాంటి పరితాపాన్ని వెళ్లగ్రక్కలేదు. బదులుగా ఏథెన్సువాసుల చర్చావేదికలో వారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు, “తెలియబడని దేవునికి” అనే వారి బలిపీఠాన్ని సూచిస్తూ, వారి కవీశ్వరుల్లో ఒకరిని ఉదాహరిస్తూ ఆయన సాధారణ అంశాల ఆధారంగా తర్కించాడు.​—⁠అపొస్తలుల కార్యములు 17:16-28.

9 వివిధరకాల ప్రేక్షకులతో వ్యవహరిస్తున్నప్పుడు పౌలు అసాధారణ ప్రజ్ఞను ప్రదర్శించాడు. తన ప్రేక్షకుల ఆలోచనను తీర్చిదిద్దిన సంస్కృతిని, పరిస్థితులను ఆయన పరిగణలోకి తీసుకున్నాడు. రోమాలోని క్రైస్తవులకు వ్రాసినప్పుడు, వారు ఆ కాలపు అత్యంత శక్తిమంతమైన రాజ్య రాజధానిలో ఉన్నారని ఆయనకు బాగా తెలుసు. క్షయపరిచే ఆదాము పాపపు శక్తిని క్రీస్తు విమోచనా శక్తి జయిస్తుందనేది రోమాలోని క్రైస్తవులకు పౌలు వ్రాసిన పత్రికలో ప్రధానాంశం. రోమాలోని, దాని పరిసర ప్రాంతాల్లోని క్రైస్తవులతో పౌలు వారి హృదయాలను ఆకట్టుకునే భాషలో మాట్లాడాడు.​—⁠రోమీయులు 1:⁠1-4; 5:14, 15.

10 తన శ్రోతలకు లోతైన బైబిలు సత్యాలను వివరించాలనుకున్నప్పుడు పౌలు ఏమిచేశాడు? సంక్లిష్టమైన ఆధ్యాత్మిక తలంపులను స్పష్టం చేయడానికి ఆ అపొస్తలుడు సామాన్యమైన, సులభంగా అర్థమయ్యే ఉపమానాలు ఉపయోగించాడు. ఉదాహరణకు, రోమా సామ్రాజ్యమంతటా ఉన్న దాస్య విధానం రోమా ప్రజలకు పరిచయమేనని పౌలుకు తెలుసు. వాస్తవానికి, తాను ఎవరికైతే వ్రాశాడో ఆ ప్రజల్లో చాలామంది బహుశా దాసులుగా ఉన్నారు. కాబట్టి పాపానికి లేదా నీతికి లోబడడం అనే వ్యక్తిగత ఎంపిక గురించిన తన వాదనను బలపరిచేందుకు పౌలు దాసత్వాన్ని ఒక ఉపమానంగా ఉపయోగించాడు.​—⁠రోమీయులు 6:16-20.

11 “రోమీయుల్లో యజమాని బేషరతుగా దాసుణ్ణి వదిలేయవచ్చు లేదా ఒక దాసుడు తన యజమానికి మూల్యం చెల్లించి స్వేచ్ఛను కొనుక్కోవచ్చు. యాజమాన్యాన్ని దేవతకు అప్పగిస్తూ కూడా స్వేచ్ఛను ప్రసాదించవచ్చు” అని ఒక రెఫరెన్సు గ్రంథం చెబుతోంది. స్వేచ్ఛ లభించిన దాసుడు జీతం కోసం తన యజమాని దగ్గరే పనిచేసుకునే అవకాశముంది. ఏ యజమానికి విధేయత చూపించాలి, పాపానికా లేక నీతికా అనే వ్యక్తిగత ఎంపిక గురించి వ్రాసినప్పుడు పౌలు ఈ రివాజునే సూచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. రోమాలోని క్రైస్తవులు పాపం నుండి విడుదలై దేవుని దాసులుగా మారారు. దేవుని సేవించే స్వేచ్ఛ వారికుంది, అయినప్పటికీ వారిష్టపడితే పాత యజమానియైన పాపానికి దాసులుగా ఉండడానికి కూడా వారు ఎంపిక చేసుకోవచ్చు. సరళమైన, పరిచయమున్న ఆ ఉపమానం రోమాలోని క్రైస్తవులు “నేను ఏ యజమానికి దాసునిగా ఉన్నాను?” అని ప్రశ్నించుకునేందుకు పురికొల్పింది. *

పౌలు మాదిరి నుండి నేర్చుకోవడం

12 విభిన్న శ్రోతల హృదయాలను చేరుకునేందుకు మనం కూడా పౌలులాగే శ్రద్ధగలవారిగా, పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించేవారిగా, ప్రజ్ఞావంతులుగా ఉండాలి. మన శ్రోతలు సువార్త భావాన్ని గ్రహించేలా సహాయం చేయడానికి, మనం నామమాత్రంగా వెళ్లడం, సిద్ధపడిన సందేశాన్ని చెప్పడం లేదా కొంత బైబిలు సాహిత్యాన్ని అందించడం మాత్రమే సరిపోతుందని అనుకోము. మనం వారి అవసరాలను, చింతలను, వారి ఇష్టాయిష్టాలను, వారి భయాలను, వివక్షలను గ్రహించేందుకు ప్రయత్నిస్తాం. దానికెంతో ఆలోచన, ప్రయత్నం అవసరమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా రాజ్య ప్రచారకులు ఆసక్తిగా అలా చేస్తున్నారు. ఉదాహరణకు, హంగరిలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం ఇలా నివేదిస్తోంది: “సహోదరులు ఇతర జాతీయుల ఆచారాలను, జీవనశైలిని గౌరవిస్తూ, వారు స్థానిక కట్టుబాట్లకు తగినట్లు మారాలని ఆశించరు.” ఇతర ప్రాంతాల్లోని సాక్షులు కూడా అలా ఉండేందుకే కృషి చేస్తారు.

13 ఒక సుదూర తూర్పు దేశంలో చాలామంది ప్రజలు ఆరోగ్యం, పిల్లల శిక్షణ, విద్య వంటి విషయాల్లో శ్రద్ధ చూపిస్తారు. అక్కడి రాజ్య ప్రచారకులు దిగజారుతున్న భౌగోళిక పరిస్థితులు లేదా సంక్లిష్టమైన సామాజిక వివాదాల సంబంధిత విషయాల గురించి ప్రకటనాపనిలో మాట్లాడే బదులు ఈ విషయాలనే నొక్కిచెప్పేందుకు ప్రయత్నిస్తారు. అదేవిధంగా అమెరికాలోని ఒక మహానగరంలోని ప్రచారకులు తమ ఇరుగుపొరుగు ప్రాంతాల ప్రజలు అవినీతి, ట్రాఫిక్‌ సమస్య, నేరం వంటి సమస్యలవల్ల కలవరపడుతున్నారని గమనించారు. బైబిలు చర్చలు ఆరంభించేందుకు సాక్షులు ఈ అంశాలను విజయవంతంగా ఉపయోగిస్తారు. సమర్థులైన బైబిలు బోధకులు తాము ఏ అంశం ఎన్నుకున్నప్పటికీ, వారు సానుకూలంగా, ప్రోత్సాహకరంగా ఉండి ఇప్పుడు బైబిలు సూత్రాలను అన్వయించుకోవడంలోని ప్రయోజనాన్ని, భవిష్యత్తు కోసం దేవుడు అందజేస్తున్న ఉజ్జ్వలమైన ఉత్తరాపేక్షలను నొక్కి చెబుతారు.​—⁠యెషయా 48:​17, 18; 52:7.

14 ప్రజలు సంస్కృతిలో, విద్యలో, మతసంబంధ నేపథ్యాల్లో చాలా వైవిధ్యంగా ఉంటారు కాబట్టి మన పరిచర్యలో వివిధ పద్ధతులు ఉపయోగించడం కూడా సహాయకరంగా ఉంటుంది. సృష్టికర్తను నమ్మినా బైబిలును నమ్మనివారితో మనం మాట్లాడే విధానానికి, దేవుడు లేడని నమ్మేవారితో మనం మాట్లాడే విధానానికి తేడా ఉంటుంది. మతసంబంధ ప్రచురణలన్నీ మత ప్రచారానికి సంబంధించిన సాధనాలని భావించే వ్యక్తితో మనం మాట్లాడే విధానానికీ, బైబిలు బోధలను అంగీకరించే వ్యక్తితో మాట్లాడే విధానానికీ తేడా ఉంటుంది. ఎన్నోరకాల విద్యాస్థాయులుగల ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కూడా పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించడం అవసరం. నిపుణులైన బోధకులు తమకు ఎదురైన పరిస్థితికి తగిన తర్కాన్ని, ఉపమానాలను ఉపయోగిస్తారు.​—⁠1 యోహాను 5:20.

క్రొత్త పరిచారకులకు సహాయం

15 పౌలు కేవలం తన బోధనా పద్ధతులను మెరుగుపరచుకోవడంపైనే శ్రద్ధ చూపించలేదు. సమర్థులైన పరిచారకులయ్యేలా తిమోతి, తీతు వంటి యౌవనులకు శిక్షణ ఇచ్చి, వారిని సిద్ధపరచాల్సిన అవసరాన్ని ఆయన చూశాడు. (2 తిమోతి 2:2; 3:10, 14; తీతు 1:4) అదేవిధంగా, నేడు శిక్షణ ఇవ్వలసిన, శిక్షణ పొందవలసిన అవసరత ఎంతో ఉంది.

16 ప్రపంచవ్యాప్తంగా 1914లో దాదాపు 5,000 మంది రాజ్య ప్రచారకులు ఉన్నారు; నేడు ప్రతీవారం ఇంచుమించు 5,000 మంది క్రొత్తవారు బాప్తిస్మం తీసుకుంటున్నారు. (యెషయా 54:2, 3; అపొస్తలుల కార్యములు 11:21) క్రొత్తవారు క్రైస్తవ సంఘంతో సహవసించడం ఆరంభించి, పరిచర్యలో భాగం వహించాలనుకున్నప్పుడు వారికి శిక్షణ, నిర్దేశం అవసరం. (గలతీయులు 6:6) శిష్యులకు బోధించి శిక్షణ ఇవ్వడంలో మనం, యజమానియైన యేసు విధానాలను ఉపయోగించడం అతి ప్రాముఖ్యం. *

17 ఒక జనసమూహాన్ని చూసి వారితో ఇక మాట్లాడడం ప్రారంభించమని యేసు తన అపొస్తలులకు చెప్పలేదు. ఆయన మొదట ప్రకటనా పని అవసరతను నొక్కిచెప్పి, ప్రార్థనాపూర్వక దృక్పథాన్ని ప్రోత్సహించాడు. ఆ తర్వాత ఆయన వారి సహాయార్థమై మూడు ప్రాథమిక ఏర్పాట్లు చేశాడు: సహవాసిని, ప్రాంతాన్ని, సందేశాన్ని ఇచ్చాడు. (మత్తయి 9:​35-38; 10:5-7; మార్కు 6:7; లూకా 9:2, 6) మనం కూడా అలాగే చేయవచ్చు. మనం మన అబ్బాయికి, క్రొత్త విద్యార్థికి లేదా కొంతకాలంగా ప్రకటనా కార్యక్రమంలో పాల్గొనని వ్యక్తికి సహాయం చేస్తున్నప్పుడు, ఈ విధంగా వారికి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేయడం సముచితంగా ఉంటుంది.

18 రాజ్య సందేశాన్ని ప్రకటించడంలో నమ్మకాన్ని కూడగట్టుకునేందుకు క్రొత్తవారికి తగిన సహాయం అవసరం. సరళంగా, ఆకర్షణీయంగా మాట్లాడేందుకు సిద్ధపడడానికి, సాధన చేయడానికి మీరు వారికి సహాయం చేయగలరా? క్షేత్రంలో మొదటగా మీరు కొన్ని ఇళ్లలో మాట్లాడుతుండగా మీ మాదిరి నుండి వారిని నేర్చుకోనివ్వండి. “నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి” అని తోటి యోధులకు చెప్పిన గిద్యోను మాదిరిని మీరు అనుసరించవచ్చు. (న్యాయాధిపతులు 7:16-18) ఆ తర్వాత భాగం వహించే అవకాశాన్ని క్రొత్తవారికి ఇవ్వండి. వారి ప్రయత్నాలనుబట్టి క్రొత్తవారిని ఆప్యాయంగా మెచ్చుకొని, సముచితమని అనిపించినప్పుడు అభివృద్ధి సాధించేలా చిన్నచిన్న సూచనలు ఇవ్వండి.

19 ‘పరిచర్యను సంపూర్ణంగా జరిగించేందుకు’ మనం మరింత మెరుగ్గా పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించాలని తీర్మానించుకోవడమే కాక, క్రొత్త పరిచారకులు కూడా మనలాగే చేసేలా వారికి శిక్షణ ఇవ్వాలని కోరుకుంటాం. మన లక్ష్యానికున్న ప్రాముఖ్యత గురించి అంటే రక్షణకు దారితీసే దేవుని పరిజ్ఞానం పంచాలనే విషయానికున్న ప్రాముఖ్యత గురించి ఆలోచించినప్పుడు, “ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల” వారిగా తయారయ్యే మన ప్రయత్నం, కృషికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తుందనే ఒప్పుదల మనకు కలుగుతుంది.​—⁠2 తిమోతి 4:5; 1 కొరింథీయులు 9:22.

[అధస్సూచీలు]

^ పేరా 8 పౌలు పరిచర్యలో అలాంటి లక్షణాల ఉదాహరణల కోసం అపొస్తలుల కార్యములు 13:​9, 16-42; 17:2-4; 18:1-4; 19:​11-20; 20:34; రోమీయులు 10:11-15; 2 కొరింథీయులు 6:11-13 పరిశీలించండి.

^ పేరా 15 అలాగే దేవునికి ఆయన ఆత్మాభిషిక్త “కుమారులకు” మధ్యగల క్రొత్త సంబంధాన్ని వివరిస్తూ, రోమా సామ్రాజ్యంలోని తన పాఠకులకు బాగా తెలిసిన చట్టపరమైన ఒక అంశాన్ని ఉపయోగించాడు. (రోమీయులు 8:​14-17) “దత్తతను ప్రధానంగా రోమీయులే ఆచరించేవారు, దీనికీ కుటుంబ సంబంధ విషయాల్లో రోమా ఆలోచనలకూ దగ్గరి సంబంధముంది” అని సెయింట్‌ పాల్‌ ఎట్‌ రోమ్‌ అనే పుస్తకం చెబుతోంది.

^ పేరా 22 ప్రస్తుతం యెహోవాసాక్షుల సంఘాలన్నింటిలోనూ పయినీర్లు ఇతరులకు సహాయపడతారు అనే కార్యక్రమం అందుబాటులో ఉంది. ఆ కార్యక్రమం ద్వారా పూర్తికాల పరిచారకుల అనుభవం నుండి, శిక్షణ నుండి తక్కువ అనుభవంగల ప్రచారకులకు సహాయం లభిస్తుంది.

మీకు జ్ఞాపకమున్నాయా?

పరిచర్యలో మనం పౌలును ఏయే విధాలుగా అనుకరించవచ్చు?

మన ఆలోచనా విధానంలో బహుశా ఎలాంటి మార్పులు అవసరం?

మన సందేశాన్ని సానుకూలంగా ఎలా మార్చుకోవచ్చు?

నమ్మకాన్ని కూడగట్టుకొనేందుకు క్రొత్త పరిచారకులకు ఏమి అవసరం?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) అపొస్తలుడైన పౌలు ఏ యే విధాలుగా సమర్థుడైన పరిచారకునిగా ఉన్నాడు? (బి) పౌలు తన నియామకంపట్ల తనకున్న దృక్పథాన్ని ఎలా వర్ణించాడు?

3. పౌలు తాను మారకముందు క్రైస్తవుల విషయంలో ఎలాంటి దృక్పథంతో ఉన్నాడు?

4. పౌలు తన నియామకాన్ని నెరవేర్చేందుకు ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవలసి వచ్చింది?

5. మన పరిచర్యలో మనం పౌలును ఎలా అనుకరించవచ్చు?

6. పౌలు తన శ్రోతల నేపథ్యాలను ఎలా పరిగణలోకి తీసుకున్నాడు, దాని ఫలితమేమిటి?

7. పౌలు లుస్త్రలోని జనసమూహానికి ప్రకటించేటప్పుడు పరిస్థితికి అనుగుణంగా ఎలా వ్యవహరించాడు?

8. తనలో ప్రగాఢ భావావేశాలు ఉన్నప్పటికీ, తను పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించే వ్యక్తినని పౌలు ఏయే విధాలుగా చూపించాడు?

9. వివిధరకాల ప్రేక్షకులతో వ్యవహరించేటప్పుడు పౌలు ప్రజ్ఞను ఎలా ప్రదర్శించాడు?

10, 11. పౌలు తన ఉపమానాలను తన శ్రోతల పరిస్థితికి అనుగుణంగా ఎలా మలిచాడు? (అధస్సూచి కూడా చూడండి.)

12, 13. (ఎ) విభిన్న శ్రోతల హృదయాలను చేరేందుకు నేడు ఎలాంటి ప్రయత్నం అవసరం? (బి) వివిధ నేపథ్యాల ప్రజలకు ప్రకటించేటప్పుడు ఏది సమర్థవంతంగా ఉన్నట్లు మీరు చూశారు?

14. ప్రజల వివిధ అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా మనం వ్యవహరించగల విధానాలను వివరించండి.

15, 16. క్రొత్త ప్రచారకులకు శిక్షణ ఇవ్వవలసిన అవసరం ఎందుకుంది?

17, 18. పరిచర్యలో క్రొత్తవారు నమ్మకాన్ని కూడగట్టుకునేలా వారికి మనమెలా సహాయం చేయవచ్చు?

19. మీ ‘పరిచర్యను సంపూర్ణంగా జరిగించేందుకు’ మీరు కృషి చేస్తుండగా మీ తీర్మానమేమిటి?

[29వ పేజీలోని బ్లర్బ్‌]

అపొస్తలుడైన పౌలు ప్రకటించడంలో, బోధించడంలో శ్రద్ధగలవాడు, పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించగలవాడు, ప్రజ్ఞావంతుడు

[31వ పేజీలోని బ్లర్బ్‌]

యేసు తన శిష్యుల కోసం ప్రాథమికంగా ఈ మూడు ఏర్పాట్లు చేశాడు: సహవాసిని, ప్రాంతాన్ని, సందేశాన్ని ఇచ్చాడు

[28వ పేజీలోని చిత్రాలు]

పరిస్థితికి అనుగుణంగా వ్యవహరించడం ద్వారా పౌలు విభిన్న శ్రోతలను చేరుకోవడంలో విజయం సాధించాడు

[30వ పేజీలోని చిత్రం]

సమర్థులైన పరిచారకులు తమ శ్రోతల సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుంటారు

[31వ పేజీలోని చిత్రం]

ప్రగతిశీల పరిచారకులు పరిచర్యకు సిద్ధపడేలా క్రొత్తవారికి సహాయం చేస్తారు