కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఇటలీ భాషలో బైబిలు దాని కల్లోలభరిత చరిత్ర

ఇటలీ భాషలో బైబిలు దాని కల్లోలభరిత చరిత్ర

ఇటలీ భాషలో బైబిలు దాని కల్లోలభరిత చరిత్ర

“మా దేశంలో [ఇటలీలో] అతివిస్తృతంగా పంచిపెట్టబడిన పుస్తకాల్లో బైబిలు ఒకటి, అయితే అది అతితక్కువగా చదవబడే పుస్తకాల్లో కూడా ఒకటి. ఇప్పటికీ క్యాథలిక్కులకు బైబిలుతో పరిచయం ఏర్పరచుకోవడానికి ఏ మాత్రం ప్రోత్సాహం లభించడంలేదు, దేవుని వాక్యముగా దాన్ని చదవడానికి ఏ మాత్రం సహాయం లభించడంలేదు. బైబిలు గురించి తెలుసుకోవాలని కోరుకునేవారు ఉన్నారు గానీ వారికి దాన్ని విడమర్చి చెప్పేవారెవరూ లేరు.”

ఇటలీ బిషప్పుల సమాలోచనసభ 1995లో చేసిన ఈ వ్యాఖ్యానం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇటలీలో గత శతాబ్దాల్లో బైబిలు ఎంత విస్తృతంగా చదవబడింది? పంపిణీ విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే అది ఎందుకు వెనకబడింది? ఇటలీలో అది ఇప్పటికీ చాలా తక్కువగా చదవబడే పుస్తకంగా ఎందుకు పరిగణించబడుతోంది? బైబిలు యొక్క ఇటలీ భాషానువాదాల చరిత్రను పరిశీలించడంవల్ల కొన్ని సమాధానాలు లభిస్తాయి.

లాటిన్‌ నుండి ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, పోర్చుగీస్‌, స్పానిష్‌ వంటి రొమాన్స్‌ భాషలు వృద్ధి కావడానికి శతాబ్దాల కాలం పట్టింది. లాటిన్‌ నేపథ్యంగల అనేక యురోపియన్‌ దేశాల్లో సామాన్యులు ఉపయోగించే భాష క్రమేణా గౌరవాన్ని సంతరించుకుని, గ్రంథరచనలో కూడా ఉపయోగించబడేది. సామాన్యులు ఉపయోగించే భాష బైబిలు అనువాదంపై సూటిగా ప్రభావం చూపించింది. ఎలా? కాలప్రవాహంలో, క్యాథలిక్‌ చర్చి ఉపయోగించే అధికారిక భాషయైన లాటిన్‌కు, మాండలికాలు స్థానిక యాసలు గల సామాన్యుల భాషకు మధ్య అంతరం ఎంతగా పెరిగిపోయిందంటే, కనీస విద్య లేనివారు లాటిన్‌ను అర్థమే చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

1000వ సంవత్సరానికల్లా, ఇటలీ ద్వీపకల్పంలోని చాలామంది నివాసులు తమకు లాటిన్‌ వల్గేట్‌ ఒకవేళ లభించినా దాన్ని చదవడం కష్టమైపోయేది. చర్చి అధికారిక గణం అప్పట్లో ఉనికిలోవున్న కొన్ని విశ్వవిద్యాలయాల్లో బోధించబడేదానితో సహా విద్యపై శతాబ్దాలపాటు గుత్తాధిపత్యం వహించింది. ఉన్నతవర్గానికి చెందిన కొద్దిమంది మాత్రమే దాని నుండి ప్రయోజనం పొందారు. కాబట్టి, బైబిలు చివరికి “అపరిచిత పుస్తకం” అయ్యింది. అయినప్పటికీ, చాలామంది దేవుని వాక్యాన్ని సంపాదించుకుని, దాన్ని తమ సొంత భాషలో అర్థం చేసుకోవాలని కోరుకున్నారు.

సాధారణంగా, మతనాయకులు బైబిలు అనువాదాన్ని వ్యతిరేకించేవారు, ఎందుకంటే చర్చి సనాతన సిద్ధాంతాలకు విరుద్ధమైనవిగా పిలువబడేవాటి వ్యాప్తిని అది ప్రోత్సహిస్తుందేమోనని వారు భయపడ్డారు. మాస్సిమో ఫిర్పో అనే చరిత్రకారుడు చెబుతున్నదాని ప్రకారం, “సామాన్యుల భాషను ఉపయోగిస్తే, మత విషయాల్లో మతనాయకులకున్న సంపూర్ణ అధికారాన్ని కాపాడుతూ వస్తున్న భాషాపరమైన అడ్డుగోడ తొలగిపోతుంది.” కాబట్టి, ఇటలీలో ఇప్పటికీ ప్రబలంగావున్న బైబిలు విద్యా కొరతకు సాంస్కృతిక, మత, సామాజిక అంశాల సమ్మేళనమే మూలకారణం.

మొదటి పాక్షిక బైబిలు అనువాదాలు

లాటిన్‌ భాష నుండి ఇటలీ భాషలోకి బైబిలు పుస్తకాల మొదటి అనువాదాలు 13వ శతాబ్దంలో జరిగాయి. అలాంటి పాక్షిక అనువాదాలు చేతితో వ్రాయబడ్డాయి, అవి చాలా ఖరీదైనవిగా ఉండేవి. అనువాదాల సంఖ్య 14వ శతాబ్దంలో అధికమవడంతో, బైబిల్లోని వివిధ పుస్తకాలను వివిధ ప్రజలు వివిధ సమయాల్లో స్థలాల్లో అనువదించినప్పటికీ దాదాపు మొత్తం బైబిలు ఇటలీ భాషలో అందుబాటులోకి వచ్చింది. అజ్ఞాత అనువాదకులు చేసిన ఈ అనువాదాల్లో అనేకం ధనవంతుల, విద్యావంతుల హస్తగతమయ్యాయి, వారు మాత్రమే వాటిని సంపాదించుకోగలిగేవారు. ముద్రణ మూలంగా పుస్తకాల ఖరీదు చాలామేరకు తగ్గిపోయినప్పటికీ, బైబిళ్లు “చాలా తక్కువమందికి అందుబాటులో” ఉండేవని జీల్యోలా ఫ్రాన్యీటో అనే చరిత్రకారిణి చెబుతోంది.

జనాభాలో అధికశాతం మంది శతాబ్దాలపాటూ నిరక్షరాస్యులుగానే ఉన్నారు. 1861లో ఇటలీ విలీనమైనప్పుడు కూడా జనాభాలో 74.7 శాతం మంది నిరక్షరాస్యులుగానే ఉన్నారు. అయితే, ఇటలీ ప్రభుత్వం ప్రజలందరికీ తప్పనిసరి, ఉచిత విద్య ఏర్పాటు చేయడానికి సిద్ధమైనప్పుడు, 1870లో తొమ్మిదవ పోప్‌ పయస్‌ ఈ చట్టాన్ని వ్యతిరేకించమని రాజును వ్రాతపూర్వకంగా కోరుతూ, అది “క్యాథలిక్‌ పాఠశాలలను పూర్తిగా నాశనం చేయడానికి” ఉద్దేశించబడిన “ఉపద్రవం” అని వర్ణించాడు.

ఇటలీ భాషలో మొట్టమొదటి బైబిలు

ఇటలీ భాషలో మొట్టమొదటి పూర్తి బైబిలు 1471లో, అంటే ముద్రణ కొరకు ఉపయోగించే టైప్‌ పేసుల్ని సులభంగా మార్చుకోవడానికి వీలయ్యే అవకాశమున్న విధానం యూరప్‌లో మొదటిసారి ఉపయోగించబడిన దాదాపు 16 సంవత్సరాల తర్వాత వెనీస్‌లో ముద్రించబడింది. నీకోలో మాలెర్బీ అనే కామల్డోలీ సన్యాసి తన అనువాదాన్ని ఎనిమిది నెలల్లో తయారుచేశాడు. ఆయన అప్పటికే అందుబాటులోవున్న అనువాదాలపై ఎక్కువగా ఆధారపడి, లాటిన్‌ వల్గేట్‌ ఆధారంగా వాటిని ఎడిట్‌చేసి, కొన్ని పదాలను తొలగించి తన ప్రాంతమైన వెనిష్యలో సామాన్యంగా వాడుకలోవున్న పదాలను చేర్చాడు. ఆయన అనువాదమే ఇటలీలో విశేషమైన పంపిణీ పొందిన మొదటి ముద్రిత బైబిలు ప్రతి.

వెనీస్‌ బైబిలు అనువాదాన్ని ప్రచురించిన మరో వ్యక్తి ఆంటోన్యో బ్రుకోలీ. ఆయన రోమన్‌ గ్రీక్‌ సాహిత్యంలోను పురాతత్త్వ విజ్ఞానంలోను పండితుడు, అంతేగాక ఆయనకు ప్రొటస్టెంట్‌ నమ్మకాలున్నా, క్యాథలిక్‌ చర్చి నుండి ఎన్నడూ ఆయన పూర్తిగా విడిపోలేదు. 1532లో, బ్రుకోలీ ఆదిమ హీబ్రూ, గ్రీకు భాషల నుండి బైబిలును అనువదించాడు. ఇది, ఆదిమ మూలపాఠాల నుండి ఇటలీ భాషలోకి అనువదించబడిన మొదటి బైబిలు. అది చక్కని సాహిత్యపరమైన ఇటలీ భాషలో లేకపోయినప్పటికీ, ఆ రోజుల్లో ప్రాచీన భాషల జ్ఞానం చాలా పరిమితంగా ఉండేదనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, అనువాదం మూలపాఠానికి అంటిపెట్టుకునివున్న విధానం చాలా విశేషంగా ఉంది. కొన్ని స్థలాల్లో, అనువాదాల్లో, బ్రుకోలీ దేవుని పేరును “ఇయోవా” అనే రూపంలో పొందుపరిచాడు. దాదాపు ఒక శతాబ్దంపాటు, ఇటలీ ప్రొటస్టెంట్లలో, మతపరమైన అసమ్మతివాదులలో ఆయన బైబిలు చాలా పేరుపొందింది.

ఇతర ఇటలీ భాషా అనువాదాలు ప్రచురించబడ్డాయి, నిజానికి అవి కాస్త మార్పులు చేయబడిన బ్రుకోలీ బైబిళ్ళే. వాటిలో కొన్నింటిని క్యాథలిక్కులే ప్రచురించారు. వాటిలో ఏవీ చెప్పుకోదగినంతగా పంపిణీ చేయబడలేదు. కాల్వనిస్ట్‌ పాస్టరైన జోవాన్నీ డయోడాటీ 1607లో జెనీవాలో మూలభాషల నుండి ఇటలీ భాషలోకి మరో అనువాదాన్ని ప్రచురించాడు. ఆయన తల్లిదండ్రులు మతసంబంధ హింసను తప్పించుకోవడానికి స్విట్జర్లాండ్‌కు పారిపోయారు. ఆయన చేసిన అనువాదమే శతాబ్దాలపాటు ఇటలీ ప్రొటస్టెంట్ల బైబిలయ్యింది. అది ఉత్పత్తి చేయబడిన కాలంలో అది చక్కని ఇటలీ అనువాదంగా పరిగణించబడింది. డయోడాటీ బైబిలు ఇటలీవాళ్ళు బైబిలు బోధలను అర్థం చేసుకోవడానికి సహాయం చేసింది. కానీ ఈ బైబిలుకు, మరితర అనువాదాలకు మతనాయకుల అజమాయిషీ అడ్డంకుగా తయారైంది.

బైబిలు​—⁠“అపరిచిత పుస్తకం”

“పుస్తకాలను నిఘా క్రింద ఉంచడమనే తన విధిని చర్చి ఎల్లప్పుడూ నిర్వహిస్తూనేవుంది, కానీ ముద్రణా ప్రక్రియ కనుగొనబడడానికి ముందు, నిషేధిత పుస్తకాల పట్టిక తయారు చేసుకోవలసిన అవసరం ఉందని అది భావించలేదు, ఎందుకంటే ప్రమాదకరమైనవని పరిగణించబడిన వ్రాతలు కాల్చివేయబడేవి” అని ఎన్‌సైక్లోపీడియా కాట్టొలికా చెబుతోంది. ప్రొటస్టెంట్‌ సంస్కరణ ప్రారంభమవకముందు కూడా అనేక యూరప్‌ దేశాల మతనాయకులు చర్చి సనాతన సిద్ధాంతాలకు విరుద్ధమైనవని పిలువబడిన పుస్తకాల పంపిణీని పరిమితం చేయడానికి తమ శక్తిమేరకు ప్రయత్నించారు. 1546లో కౌన్సిల్‌ ఆఫ్‌ ట్రెంట్‌ తర్వాత, సామాన్యుల భాషల్లోకి అనువదించడం గురించిన ప్రశ్న పరిశీలించబడినప్పుడు ఒక విశేషమైన మార్పు వచ్చింది. రెండు విభిన్న అభిప్రాయాలు బయటపడ్డాయి. నిషేధాన్ని ఇష్టపడుతున్నవారు, సామాన్యుల భాషలోకి అనువదించబడిన బైబిలు, “చర్చి సనాతన సిద్ధాంతాలకు విరుద్ధమైన వాదాలన్నిటికీ మూలమనీ, తల్లిలాంటిదనీ” అభిప్రాయపడ్డారు. నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నవారు, “మోసాన్ని, దగాను” దాచిపెట్టడానికే బైబిలు సామాన్యుల భాషలోకి అనువదించబడడాన్ని చర్చి నిషేధించిందని వారి “శత్రువులు,” అంటే ప్రొటస్టెంట్లు వాదిస్తారని అన్నారు.

ఏకాభిప్రాయంలేని కారణంగా కౌన్సిల్‌ ఆ విషయంలో నిర్దిష్టమైన నిర్ణయమేదీ తీసుకోలేదు గానీ వల్గేట్‌ యొక్క ఖచ్చితత్వానికి మాత్రం అధికారపూర్వక సమ్మతి తెలియజేసింది, అదే క్యాథలిక్‌ చర్చికి ప్రామాణిక మూలపాఠంగా తయారైంది. వల్గేట్‌ “ఖచ్చితమైనది” అని చెప్పడం “నిజానికి అది మాత్రమే చట్టబద్ధమైన బైబిలనే తలంపుకు మద్దతిచ్చింది” అని రోమ్‌లోవున్న సేల్‌స్యేనం పొంటిఫికల్‌ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ఉన్న కార్లో బుజెట్టీ అన్నాడు. తర్వాత జరిగిన పరిణామాలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

1559లో, నాల్గవ పోప్‌ పాల్‌ నిషేధిత పుస్తకాల మొదటి పట్టికను, అంటే క్యాథలిక్కులు చదవడాన్ని, అమ్మడాన్ని, అనువదించడాన్ని లేదా కలిగివుండడాన్ని నిషేధించిన పుస్తకాల పట్టికను ప్రచురించాడు. ఈ గ్రంథాలు చెడ్డవిగా, విశ్వాసానికీ నైతిక యథార్థతకూ ప్రమాదకరమైనవిగా పరిగణించబడ్డాయి. బ్రుకోలీ అనువాదంతో సహా సామాన్యుల భాషల్లోకి అనువదించబడిన బైబిళ్ళను చదవడం ఆ పట్టికలో నిషేధించబడింది. దాన్ని మీరినవారు బహిష్కరించబడ్డారు. 1596 నాటి పట్టిక మరింత కట్టుదిట్టం చేసేదిగా ఉంది. సామాన్యుల భాషలోకి బైబిలును అనువదించడానికి, ముద్రించడానికి ఇక ఎంతమాత్రం అధికారం ఇవ్వబడలేదు. అలాంటి బైబిళ్ళను నాశనం చేయాలి.

ఫలితంగా, చర్చి కూడళ్లలో బైబిళ్ళను కాల్చివేయడం 16వ శతాబ్దాంతం తర్వాత అధికమయ్యింది. సామాన్య ప్రజల మనసుల్లో లేఖనాలు చర్చి సనాతన సిద్ధాంతాలను వ్యతిరేకించేవారి పుస్తకంగా తయారయ్యాయి, ఆ తలంపు ఇప్పటికీ అలాగే ఉంది. ప్రజా గ్రంథాలయాల్లోని, వ్యక్తిగత గ్రంథాలయాల్లోని బైబిళ్ళు, బైబిలు వ్యాఖ్యాన గ్రంథాలు దాదాపు అన్నీ నాశనం చేయబడ్డాయి, తర్వాతి 200 సంవత్సరాల వరకు ఏ క్యాథలిక్కూ బైబిలును ఇటలీ భాషలోకి అనువదించలేదు. ఇటలీ ద్వీపకల్పంలో పంపిణీలో ఉన్న బైబిళ్ళు, అదీ దొరికిపోతే జప్తు చేసుకుంటారనే భయంతో రహస్యంగా పంపిణీలో ఉన్నవి, ప్రొటస్టెంటు పండితులు అనువదించినవే. మర్యో చిన్యోనీ అనే చరిత్రకారుడు ఇలా చెబుతున్నాడు: “నిజానికి చర్చి సభ్యులు బైబిలు చదవడం శతాబ్దాలపాటు పూర్తిగా మానేశారు. బైబిలు వాస్తవంగా అపరిచిత పుస్తకం అయిపోయింది, కోట్లాదిమంది ఇటలీ వాసులు దానిలోని కనీసం ఒక్క పేజీ కూడా చదవకుండానే తమ జీవితాలు వెళ్ళబుచ్చారు.”

నిషేధం ఎత్తివేయబడింది

ఆ తర్వాత, 1757 జూన్‌ 13వ తేదీగల పట్టికపై ఇవ్వబడిన ఒక ఆజ్ఞలో పధ్నాల్గవ పోప్‌ బెనెడిక్ట్‌, “పరిశుద్ధ బిషప్పు అధికారం ఆమోదించిన, బిషప్పుల నిర్దేశం క్రింద ప్రచురించబడిన బైబిలు అనువాదాలు చదవడాన్ని అనుమతిస్తూ” మునుపటి శాసనాన్ని సవరించాడు. తత్ఫలితంగా, ఆ తర్వాత ఫ్లోరెన్స్‌ ఆర్చిబిషప్పు అయిన, ఆంటోనియో మార్టిని వల్గేట్‌ను అనువదించడానికి సిద్ధమయ్యాడు. దాని మొదటిభాగం 1769లో ప్రచురించబడింది, 1781లో అది పూర్తి చేయబడింది. ఒక క్యాథలిక్‌ గ్రంథం ప్రకారం, మార్టినీ అనువాదం, “ప్రత్యేకంగా చెప్పుకోదగిన మొదటి అనువాదం.” అంతవరకు, లాటిన్‌ అర్థం కాని క్యాథలిక్కులు, చర్చి ఆమోదించిన బైబిలును చదవలేకపోయేవారు. తర్వాతి 150 సంవత్సరాల పాటు ఇటలీ క్యాథలిక్కుల కోసం ఆమోదించబడిన ఏకైక అనువాదం మార్టినీ అనువాదమే.

రెండవ వాటికన్‌ విశ్వవ్యాప్త క్రైస్తవ చర్చీల సమాలోచనా సభలో, ఒక గణనీయమైన మార్పు సంభవించింది. 1965లో, డయీ వెర్బమ్‌ మొట్టమొదటిసారిగా, “ప్రాముఖ్యంగా పరిశుద్ధ గ్రంథాల మూలపాఠాల నుండి వివిధ భాషల్లోకి తగినవిధంగా, సరిగ్గా అనువదించడాన్ని” ప్రోత్సహించింది. దానికి కొంతకాలం ముందు, అంటే 1958లో, పొంటిఫిస్టో ఇన్‌స్టిట్యూటో బిబ్లికో (పొంటిఫికల్‌ బైబిల్‌ ఇన్స్‌టిట్యూషన్‌) “ఆదిమ మూలపాఠాల నుండి అనువదించబడిన మొట్టమొదటి పూర్తి క్యాథలిక్‌ అనువాదాన్ని” ప్రచురించింది. ఈ అనువాదం దైవిక నామాన్ని “జావే” అనే రూపంలో పలుచోట్ల పొందుపర్చింది.

బైబిలును సామాన్యుల భాషలోకి అనువదించడానికి ఎదురైన వ్యతిరేకత చాలా వినాశనకరంగా ఉంది, దాని ప్రభావాలు ఇప్పటికీ ఉన్నాయి. జీల్యోలా ఫ్రాన్యీటో చెప్పినట్లుగా, అది “విశ్వాసులు తమ సొంత ఆలోచనావిధానాన్ని, తమ సొంత మనస్సాక్షిపై ఆధారపడడాన్ని శంకించేలా చేసింది.” అంతేగాక, మత సాంప్రదాయాలు బలవంతంగా రుద్దడం కూడా జరిగింది, చాలామంది క్యాథలిక్కులు వాటిని బైబిలుకంటే ప్రాముఖ్యమైనవని భావిస్తారు. నిరక్షరాస్యత పూర్తిగా అంతరించిపోయినా, ఇదంతా ప్రజలు లేఖనాల నుండి దూరమైపోయేలా చేసింది.

అయితే యెహోవాసాక్షుల సువార్త పని ఇటలీ భాషలోని బైబిలుపై క్రొత్త ఆసక్తిని రేకెత్తించింది. సాక్షులు 1963లో ఇటలీ భాషలో క్రైస్తవ గ్రీకు లేఖనాల నూతనలోక అనువాదం ప్రచురించారు. 1967లో పూర్తి బైబిలు అందుబాటులోకి వచ్చింది. కేవలం ఇటలీలోనే ఈ అనువాదపు 40,00,000 కన్నా ఎక్కువ ప్రతులు పంచిపెట్టబడ్డాయి. యెహోవా అనే దైవిక నామాన్ని దాని స్థానంలో తిరిగి చేర్చిన నూతనలోక అనువాదం ఆదిమ మూలపాఠాల భావాన్ని అంటిపెట్టుకుని ఉండడంలో చూపించిన ఖచ్చితత్వాన్నిబట్టి ప్రత్యేకమైన అనువాదంగా నిలుస్తుంది.

యెహోవాసాక్షులు ఇంటింటికీ వెళ్తూ, వినేవారందరికీ లేఖనాధారిత నిరీక్షణా సందేశాన్ని చదివి వినిపించి, దాన్ని వివరిస్తారు. (అపొస్తలుల కార్యములు 20:​20) మీరు ఈ సారి యెహోవాసాక్షులను కలిసినప్పుడు, త్వరలోనే ‘నీతి నివసించే క్రొత్త భూమిని’ నెలకొల్పుతానని దేవుడు చేసిన అద్భుతమైన వాగ్దానం గురించి మీ సొంత బైబిలు ఏమి చెబుతోందో మీకు చూపించమని వారిని ఎందుకు అడగకూడదు?​—⁠2 పేతురు 3:​13.

[13వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

వెనీస్‌

రోమ్‌

[15వ పేజీలోని చిత్రం]

బ్రుకోలీ అనువాదంలో ఇయోవా అనే దైవిక నామం ఉపయోగించబడింది

[15వ పేజీలోని చిత్రం]

నిషేధిత పుస్తకాల పట్టిక, సామాన్యుల భాషలోకి అనువదించబడిన బైబిళ్ళను ప్రమాదకరమైనవిగా పేర్కొంది

[13వ పేజీలోని చిత్రసౌజన్యం]

బైబిలు కవర్‌ పేజీ: Biblioteca Nazionale Centrale di Roma

[15వ పేజీలోని చిత్రసౌజన్యం]

బ్రుకోలీ అనువాదం: Biblioteca Nazionale Centrale di Roma; విషయసూచిక: Su concessione del Ministero per i Beni e le Attività Culturali