క్రిస్మస్ సమయం దేనికి ప్రాధాన్యత ఇవ్వబడుతోంది?
క్రిస్మస్ సమయం దేనికి ప్రాధాన్యత ఇవ్వబడుతోంది?
కోట్లాదిమందికి పండుగ సమయం అంటే కుటుంబంతో, స్నేహితులతో గడపడానికి, ప్రేమానుబంధాలను బలపర్చుకోవడానికి తగిన సమయం. ఇంకా అనేకులు దాన్ని యేసుక్రీస్తు జననం గురించి, మానవజాతి రక్షణలో ఆయన పాత్ర గురించి ధ్యానించవలసిన సమయంగా పరిగణిస్తారు. అనేక దేశాల్లోని పరిస్థితికి భిన్నంగా రష్యాలో ప్రజలకు క్రిస్మస్ పండుగ జరుపుకునే స్వేచ్ఛ ఉండేదికాదు. అయితే రష్యన్ ఆర్థడాక్స్ చర్చి సభ్యులు శతాబ్దాలపాటు స్వేచ్ఛగా క్రిస్మస్ పండుగ జరుపుకున్నప్పటికీ, 20వ శతాబ్దంలో అధికభాగం వారలా పండుగ చేసుకోవడానికి అనుమతించబడలేదు. ఆ మార్పుకు కారణమేమిటి?
1917 బోల్షెవిక్ కమ్యూనిస్టు విప్లవం తర్వాత వెంటనే, దేశవ్యాప్తంగా అందరూ నాస్తికత్వాన్ని పాటించాలని సోవియట్ అధికారులు తీవ్ర ఒత్తిడి తెచ్చారు. మతసంబంధ ఛాయలుగల క్రిస్మస్ పండుగ సమయం నిరాదరణకు గురయ్యింది. ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలకు, నూతన సంవత్సర వేడుకలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించింది. ఆ పండుగకు సంబంధించిన స్థానిక చిహ్నాలైన క్రిస్మస్ చెట్టు, రష్యన్లు డెడ్ మరోజ్ లేదా గ్రాండ్‌ఫాదర్ ఫ్రాస్ట్ అని పిలిచే సాంతాక్లాజ్ లేదా క్రిస్మస్ తాత వంటివి కూడా బహిరంగంగా ఖండించబడేవి.
1935లో సంభవించిన ఒక మార్పు, రష్యన్లు పండుగ వేడుకలు జరుపుకునే విధానాన్ని ఎంతగానో మార్చివేసింది. సోవియట్‌వాసులు ఒక విశేషమైన తేడాతో క్రిస్మస్ తాతను, క్రిస్మస్ చెట్టును, నూతన సంవత్సర వేడుకను మళ్ళీ ప్రారంభించారు. క్రిస్మస్ తాత క్రిస్మస్ రోజున కాకుండా నూతన సంవత్సర దినాన బహుమతులు తీసుకువస్తాడని చెప్పబడింది. అలాగే, ఇక మీదట క్రిస్మస్ చెట్టు ఉండదుగానీ నూతన సంవత్సర చెట్టు ఉంటుంది! అలా, సోవియట్ యూనియన్‌లో పెద్ద మార్పు వచ్చింది. ఒక విధంగా నూతన సంవత్సర వేడుక క్రిస్మస్ స్థానాన్ని ఆక్రమించింది.
అధికారపూర్వకంగా మతసంబంధ భావాలేవీ లేకుండా తొలగించబడిన క్రిస్మస్ పండుగ సమయం పూర్తిగా మతేతర పండుగ సమయంగా మారింది. నూతన సంవత్సర చెట్టు మతసంబంధమైన అలంకారాలతో కాకుండా, సోవియట్ యూనియన్ అభివృద్ధిని వర్ణించే లౌకిక అలంకారాలతో అలంకరించబడింది. ఓక్రగ్ స్వేటా (భూభ్రమణం) అనే రష్యన్ వార్తాపత్రిక ఇలా వివరిస్తోంది: “సోవియట్ యుగంలోని వివిధ సంవత్సరాల సంఖ్యల ఆకారమున్న అలంకారాలతో నూతన సంవత్సర చెట్టును అలంకరించడం ద్వారా కమ్యూనిస్టు సమాజాన్ని స్థాపించడానికి సంబంధించిన చరిత్రను తెలుసుకోవడం సాధ్యమే. సాధారణంగా ఉపయోగించబడే కుందేలు పిల్లలు, ఐసికెల్స్ (క్రిందికి జారుతున్న నీరు గడ్డకట్టడంతో ఏర్పడే ఆకారాలు), గుండ్రని రొట్టెలు వంటివాటితోపాటు కొడవలి, సుత్తి, ట్రాక్టరు వంటి ఆకారాలు ఆ చెట్టుకు అలంకరించబడ్డాయి. తర్వాత వీటి స్థానాల్లో గని కార్మికుల, వ్యోమగాముల, చమురు రిగ్గుల, రాకెట్ల ఆకారాలు, చంద్రుని మీద తిరిగే మర వాహనాల ఆకారాలు రూపొందించబడ్డాయి.”
క్రిస్మస్ రోజు మాటేమిటి? అది మాత్రం గుర్తించబడలేదు. సోవియట్ ప్రభుత్వం దాన్ని సాధారణ పని దినంగా మార్చింది. మతపరంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని కోరుకునేవారు ఎంతో యుక్తిగా జరుపుకోవాలి, అంతేగాక పాలకుల ఆగ్రహానికి, ఇబ్బందికర పర్యవసానాలకు గురయ్యే ప్రమాదం ఉండేది. అవును, 20వ శతాబ్దపు రష్యాలో, పండుగ ఆచరణలో మార్పువచ్చింది, మతసంబంధ ఆచరణ నుండి అది లౌకిక వేడుకగా మారిపోయింది.
ఇటీవల వచ్చిన మార్పు
1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోవడంతో ప్రజలకు మరింత స్వేచ్ఛ లభించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాస్తికత్వ విధానం పోయింది. క్రొత్తగా ఏర్పడిన సార్వభౌమాధికారంగల దేశాలు ఎక్కవగా లౌకికపరమైనవి, వాటిలో చర్చికి, ప్రభుత్వానికి సంబంధం లేదు. మతాసక్తిగల చాలామంది ఇప్పుడు తాము తమ మత నమ్మకాలకు అనుగుణంగా జీవించవచ్చని ఆశించారు. అలా జీవించడానికి ఒక మార్గం, మతసంబంధ క్రిస్మస్ పండుగ జరుపుకోవడమేనని వాళ్ళు భావించారు. అయితే, అలాంటి చాలామందికి అనతి కాలంలోనే ఎంతో నిరాశ ఎదురైంది. ఎందుకు?
ఒక్కో సంవత్సరం గడుస్తుండగా, పండుగ సమయం వాణిజ్య దృష్టిని సంపాదించుకుంది. అవును, పశ్చిమ దేశాల్లో ఉన్నట్లే, క్రిస్మస్ పండుగ సమయం ఉత్పత్తిదారులకు, వ్యాపారస్తులకు, వర్తకులకు డబ్బు సంపాదించుకోవడానికి మంచి అవకాశంగా మారింది. క్రిస్మస్ అలంకారాలు దుకాణాల ఎదుట ఆడంబరంగా ప్రదర్శించబడ్డాయి. రష్యాకు అంతకుముందు పరిచయంలేని పశ్చిమ శైలీ క్రిస్మస్ సంగీతం, పాటలు దుకాణాల్లో నుండి వినిపించడం మొదలైంది. క్రిస్మస్ సంబంధిత చిన్న చిన్న అలంకార వస్తువులను అమ్ముకునేవారు పెద్ద సంచీలతో ట్రైనుల్లోకి, ఇతర ప్రజారవాణా వాహనాల్లోకి ఎక్కి వాటిని అమ్మడం సాగించారు. ఇప్పుడు అక్కడ అదే కనిపిస్తుంది.
ఇలా పండుగ పేరుతో జరుగుతున్న వ్యాపారం చాలామందికి అభ్యంతరం కలిగించకపోయినా, ఆ సమయంలో జరిగే మద్యసేవనం, దాని ప్రతికూల పర్యవసానాలు చాలామందిని కలవరపరుస్తాయి. మాస్కోలోని ఒక ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగంలో పనిచేసే ఒక వైద్యుడు ఇలా వివరించాడు: “నూతన సంవత్సర వేడుకలంటే గృహదౌర్జన్యం, త్రాగుబోతుల కలహాలు, రోడ్డు ప్రమాదాలు వంటివాటి మూలంగా కలిగే దెబ్బలే కాక, కత్తిపోట్లతో, బుల్లెట్లతో కలిగే గాయాలని వైద్యులకు తెలుసు.” రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బ్రాంచిలో ఉద్యోగం చేసే ఒక సీనియర్ శాస్త్రవేత్త ఇలా చెప్పాడు: “మద్యపానీయాల సంబంధిత మరణాల సంఖ్య హఠాత్తుగా పెరిగిపోయింది. ప్రత్యేకంగా అది 2000వ సంవత్సరంలో మరీ ఎక్కువైంది. ఆత్మహత్యలు, హత్యలు కూడా చాలా అధికమైపోయాయి.”
విచారకరంగా, రష్యాలో పండుగ సమయంలో అలాంటి ఏ ప్రవర్తనైనా మరో కారణం మూలంగా మరింత ఘోరంగా తయారవుతుంది. ఈజ్వెస్టియా అనే వార్తాపత్రిక, “రష్యన్లు క్రిస్మస్ పండుగను రెండుసార్లు జరుపుకుంటారు” అనే శీర్షికతో ఇలా నివేదించింది: “రష్యన్లలో ప్రతి పదిమందిలో ఒకరు క్రిస్మస్ రెండుసార్లు జరుపుకుంటారు. రష్యన్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ మార్కెట్ రీసెర్చ్ మానిటరింగ్ సెంటర్ నిర్వహించిన సర్వే చూపించినట్లుగా, ఆ సర్వేలో ప్రతిస్పందించినవారిలో 8 శాతం మంది తాము క్యాథలిక్ క్రిస్మస్ క్యాలెండర్ ప్రకారం డిసెంబరు 25న, ఆర్థడాక్స్ చర్చి ప్రకారం జనవరి 7న ఇలా రెండుసార్లు క్రిస్మస్ పండుగ జరుపుకుంటామని అంగీకరించారు . . . కొంతమందికి క్రిస్మస్‌కున్న మతపరమైన ప్రాముఖ్యత కాదు గానీ దాన్ని జరుపుకోవడానికి లభించిన అవకాశం చాలా ప్రాముఖ్యమైనదని స్పష్టమవుతోంది.” *
ప్రస్తుత పరిస్థితి నిజంగా క్రీస్తును ఘనపరుస్తుందా?
పండుగ సమయంలో దైవభక్తిలేని ప్రవర్తన ఎక్కువగా ఉంటుందనేది స్పష్టం. ఇది ఎంతో కలతపరిచేదే అయినా, దేవుణ్ణి, క్రీస్తును గౌరవించడానికి ఈ వేడుకలను జరుపుకోవాలని కొందరు భావిస్తారు. దేవుణ్ణి ప్రీతిపర్చాలన్న కోరిక ప్రశంసనీయమైనదే. కానీ క్రిస్మస్ పండుగ సమయాన్నిబట్టి దేవుడు, క్రీస్తు నిజంగా సంతోషిస్తారా? దాని మూలం గురించి ఆలోచించండి.
ఉదాహరణకు, క్రిస్మస్ గురించి సోవియట్ ఎలా భావిస్తుందనే దాని గురించి ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా, గ్రేట్ సోవియట్ ఎన్‌సైక్లోపీడియాలో పేర్కొనబడిన ఈ క్రింది చారిత్రక వాస్తవాలనుబట్టి దానిని సమర్థించడం కష్టమే: “క్రిస్మస్ . . . ‘చనిపోయి, మృతుల్లో నుండి లేచే’ క్రైస్తవపూర్వ దేవుళ్ళ ఆరాధన నుండి తీసుకోబడింది, ఇది ముఖ్యంగా వ్యవసాయం చేసుకునే ప్రజల మధ్య ప్రబలంగా ఉండేది, అదీగాక ఆ పండుగను వాళ్ళు డిసెంబరు 21-25 మధ్య చలికాలంలో జరుపుకునేవారు. ప్రకృతిలో క్రొత్త చైతనాన్ని నింపే దైవసంరక్షకుని ‘జననాన్ని’ వాళ్ళు ప్రతీ సంవత్సరం జరుపుకునేవారు.”
ఆ ఎన్‌సైక్లోపీడియా ఖచ్చితంగా చూపిస్తున్నది చాలా విశేషమైనదిగా ఉన్నట్లు మీరు గమనించవచ్చు: “మొదటి శతాబ్దాల్లోని క్రైస్తవులకు క్రిస్మస్ వేడుక గురించి తెలియదు. . . . నాలుగవ శతాబ్దం మధ్యభాగం నుండి క్రైస్తవత్వం, మిత్ర ఆరాధనకు సంబంధించిన శీతాకాలపు పండుగను స్వీకరించి, దాన్ని క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం ప్రారంభించింది. మొట్టమొదట రోమ్‌లోని మత సమాజాలే క్రిస్మస్‌ను జరుపుకున్నాయి. పదవ శతాబ్దంలో, క్రైస్తవత్వంతోపాటు క్రిస్మస్ కూడా రష్యాకు వ్యాపించింది, అక్కడది పూర్వీకుల ఆత్మలను గౌరవిస్తూ ప్రాచీన స్లావ్‌లు ఆచరించే చలికాలపు వేడుకతో మిళితమైపోయింది.”
‘యేసు డిసెంబరు 25న జన్మించాడనేదాని గురించి దేవుని వాక్యమైన బైబిలు ఏమి చెబుతోంది’ అని మీరు అడగవచ్చు. నిజానికి, బైబిలు యేసు జనన తేదీ గురించి నిర్దిష్టంగా ఏమీ చెప్పడంలేదు, యేసు దాని గురించి మాట్లాడిన దాఖలాలు కూడా ఏమీ లేవు, ఇక దాన్ని ఆచరించమని చెప్పినట్లు అసలే లేదు. అయితే, సంవత్సరంలోని ఏ కాలంలో యేసు జన్మించివుంటాడో గుర్తించడానికి మాత్రం బైబిలు సహాయం చేస్తుంది.
మత్తయి సువార్త 26, 27 అధ్యాయాల ప్రకారం, యేసు నీసాను 14న అంటే సా.శ. 33 మార్చి 31న ప్రారంభమైన యూదుల పస్కా పండుగ రోజున సాయంకాలం చంపబడ్డాడు. యేసు బాప్తిస్మం తీసుకుని తన పరిచర్య ప్రారంభించేటప్పటికి ఆయనకు 30 సంవత్సరాలని లూకా సువార్త నుండి మనం తెలుసుకోవచ్చు. (లూకా 3:21-23) ఆ పరిచర్య మూడున్నర సంవత్సరాలు కొనసాగింది. కాబట్టి, యేసు చనిపోయేనాటికి ఆయన వయస్సు ముప్పైమూడున్నర సంవత్సరాలు. సా.శ. 33 అక్టోబరు 1కి ఆయనకు 34 ఏళ్ళు వచ్చేవి. యేసు జనన సమయంలో గొఱ్ఱెలకాపరులు “పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచు[న్నారు]” అని లూకా నివేదిస్తున్నాడు. (లూకా 2:8) గొఱ్ఱెలకాపరులు డిసెంబరు నాటి చలికాలంలో, అదీ బేత్లెహేము పరిసరాల్లో మంచు కురిసే కాలంలో తమ మందలతో బయట ఉండే అవకాశం లేదు. అయితే వారు అక్టోబరు 1 ఆ ప్రాంతంలోనైతే బయట ఉండే అవకాశం ఉంది, కాబట్టి యేసు జన్మించిన సమయం అదే అయ్యుండవచ్చు.
మరైతే, నూతన సంవత్సర వేడుకల మాటేమిటి? మనం ఇప్పటికే చూసినట్లుగా, ఆ సమయంలో చాలా చెడు ప్రవర్తన ఉంటుంది. దాన్ని లౌకిక సెలవుదినంగా చేయాలని ప్రయత్నాలు జరిగినప్పటికీ, దాని మూలాలు కూడా ప్రశ్నార్థకంగా ఉన్నాయి.
పండుగ సమయానికి సంబంధించిన వాస్తవాల వెలుగులో, ‘పండుగకు యేసే మూలం’ వంటి నినాదాలు అర్థరహితంగా ఉంటాయి. క్రిస్మస్ పండుగ సమయంలో జరిగే వ్యాపారాన్నిబట్టి, చెడు ప్రవర్తననుబట్టి, అలాగే దానికున్న అన్యమత మూలాలనుబట్టి మీరు కలత చెందుతుంటే, నిరుత్సాహపడకండి. దేవునికి చెందవలసిన గౌరవాన్ని ఆయనకు ఇవ్వడానికి, క్రీస్తును ఘనపర్చడానికి, అదే సమయంలో కుటుంబ బంధాలను బలపర్చుకోవడానికి తగిన మార్గం ఉంది.
దేవుణ్ణి, క్రీస్తును ఘనపర్చడానికి శ్రేష్ఠమైన మార్గం
యేసుక్రీస్తు “అనేకులకు ప్రతిగా విమోచన మత్తయి 20:28) ఆయన తనను చంపడానికి అనుమతిస్తూ మన పాపాల కోసం ఇష్టపూర్వకంగా చనిపోయాడు. కొంతమంది తాము క్రీస్తును ఘనపర్చాలని కోరుకుంటూ, క్రిస్మస్ పండుగ సమయంలో అలా చేయవచ్చని భావిస్తారు. కానీ మనం చూసినట్లుగా, క్రిస్మస్‌కు, నూతన సంవత్సరానికి క్రీస్తుతో చాలా తక్కువ సంబంధం ఉంది, వాటి మూలాలు అన్యుల ఆచారాల నుండి వచ్చాయి. అంతేగాక, క్రిస్మస్ పండుగ సమయం కొంతమందికి ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, ఆ సమయంలో వ్యాపారమే ఎక్కువగా జరుగుతుంది. అంతేగాక, దేవునికి క్రీస్తుకు అసంతోషం కలిగించే సిగ్గుకరమైన ప్రవర్తనతో క్రిస్మస్ పండుగకు దగ్గరి సంబంధం ఉందని అంగీకరించవలసిందే.
క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు” వచ్చాడని బైబిలు చెబుతోంది. (దేవునికి సంతోషం కలిగించాలని ప్రయత్నించేవారు ఎలా ప్రతిస్పందించాలి? యథార్థవంతుడైన ఒక వ్యక్తి, మతసంబంధ భావాలను తృప్తిపర్చేవే అయినా లేఖనాలకు విరుద్ధమైనవైన మానవ సంప్రదాయాలను అంటిపెట్టుకుని ఉండే బదులు, దేవుణ్ణి క్రీస్తును ఘనపరిచే నిజమైన మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. సత్య మార్గం ఏది మరియు మనమేమి చేయాలి?
క్రీస్తే మనకిలా చెబుతున్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:3) అవును, నిజంగా యథార్థవంతుడైన వ్యక్తి దేవుణ్ణి, క్రీస్తును ఎలా ఘనపర్చాలనే విషయంలో ఖచ్చితమైన జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఆయన ఈ జ్ఞానాన్ని సంవత్సరంలోని ఏదో ఒక సమయంలో మాత్రం కాక జీవితంలో అనుదినం అన్వయించుకుంటాడు. నిత్యజీవానికి నడిపించే అలాంటి యథార్థ ప్రయత్నాలకు దేవుడు ఎంతో సంతోషిస్తాడు.
మీ కుటుంబం, లేఖనాలకు అనుగుణంగా దేవుణ్ణి, క్రీస్తును నిజంగా ఘనపర్చేవారిలో ఉండాలని కోరుకుంటుందా? బైబిలు నుండి ఆవశ్యకమైన జ్ఞానాన్ని పొందడానికి యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు సహాయం చేశారు. మీ ప్రాంతంలోని యెహోవాసాక్షులను సంప్రదించమని లేదా ఈ పత్రికలోని రెండవ పేజీలో ఉన్న సముచితమైన చిరునామా ఉపయోగించి వారికి వ్రాయమని మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.
[అధస్సూచి]
^ పేరా 11 1917 అక్టోబరు నాటి విప్లవానికి ముందు, రష్యా పాతకాలపు జూలియన్ క్యాలెండర్‌ను ఉపయోగించేది, కానీ చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఉపయోగించడం ప్రారంభించాయి. 1917లో జూలియన్ క్యాలెండర్ దాని సమకాలీన క్యాలెండరైన గ్రెగోరియన్ క్యాలెండర్‌కన్నా 13 రోజులు వెనుకబడి ఉంది. విప్లవం తర్వాత, సోవియట్‌వారు గ్రెగోరియన్ క్యాలెండర్ ఉపయోగించడం మొదలుపెట్టడంతో, రష్యా కూడా మిగతా ప్రపంచమంతా ఉపయోగిస్తున్న క్యాలండర్‌నే ఉపయోగించే దేశమైంది. అయితే ఆర్థడాక్స్ చర్చి మాత్రం జూలియన్ క్యాలెండర్‌ను “పాత శైలి” క్యాలెండర్ అని పిలుస్తూ దానికి అనుగుణంగానే పండుగలు జరుపుకునేది. రష్యాలో జనవరి 7న క్రిస్మస్ పండుగ జరుపుకోవడం గురించి మీరు వినవచ్చు. కానీ, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 7 జూలియన్ క్యాలెండర్ ప్రకారం డిసెంబరు 25 అని గుర్తుంచుకోండి. అలా, చాలామంది రష్యన్లు తమ పండుగ సమయాన్ని ఇలా ఏర్పాటు చేసుకుంటారు: డిసెంబరు 25, పాశ్చాత్య క్రిస్మస్; జనవరి 1, లౌకిక నూతన సంవత్సరం; జనవరి 7, ఆర్థడాక్స్ క్రిస్మస్; జనవరి 14, పాత శైలి నూతన సంవత్సరం.
[7వ పేజీలోని బాక్సు/చిత్రం]
నూతన సంవత్సర వేడుకల మూలాలు
ఒక జార్జియన్ ఆర్థడాక్స్ సన్యాసి ధైర్యంగా తన అభిప్రాయాలు ఇలా వెల్లడిస్తున్నాడు
“నూతన సంవత్సర పండుగ ప్రాచీన రోమ్‌కు చెందిన అనేక అన్యమత పండుగల మూలాల నుండి వచ్చింది. జనవరి 1 అన్యుల దేవుడైన జానస్‌కు అంకితం చేయబడిన పండుగ, ఆ నెల పేరు ఆయన పేరు నుండే వస్తుంది. జానస్ విగ్రహానికి రెండు ప్రక్కల రెండు ముఖాలు ఉంటాయి, అంటే ఆయన గతాన్ని, ప్రస్తుతాన్ని చూడగలడని భావం. జనవరి 1కి ఉల్లాసంగా, నవ్వుతో, సమృద్ధితో స్వాగతం పలికే ఎవరికైనా ఆ సంవత్సరమంతా సంతోషం, సంక్షేమం లభిస్తాయనే సామెత ఉంది. మా దేశస్థుల్లో చాలామంది నూతన సంవత్సర వేడుక చేసుకోవడంలో కూడా అదే మూఢనమ్మకం ఉంది . . . కొన్ని అన్యమత పండుగ దినాల్లో ప్రజలు నేరుగా ఒక విగ్రహానికి బలులు అర్పిస్తారు. కొన్ని పండుగ సమయాలు అనైతిక ప్రవర్తన, జారత్వం, వ్యభిచారం వంటివాటికి పేరుగాంచాయి. మరితర సందర్భాల్లో, ఉదాహరణకు, జానస్ పండుగ సమయంలో ఎక్కువగా తినడం త్రాగడం, త్రాగుబోతుతనం, వాటితోపాటు ఉండే అన్నివిధాలైన అపవిత్ర కార్యాలు జరిగేవి. గడిచిన కాలంలో నూతన సంవత్సర వేడుకలను మనమెలా జరుపుకున్నామో గుర్తుంటే, మనమందరం ఈ అన్యమత వేడుకలో పాల్గొన్నామని మనం అంగీకరించవలసిందే.”—ఒక జార్జియన్ వార్తాపత్రిక.
[6వ పేజీలోని చిత్రం]
క్రైస్తవమత సామ్రాజ్యం మిత్ర ఆరాధనను తనలో జీర్ణించుకుంది
[చిత్రసౌజన్యం]
Museum Wiesbaden
[7వ పేజీలోని చిత్రం]
డిసెంబరు నాటి చలిలో గొఱ్ఱెలకాపరులు తమ మందలతో బయట ఉండివుండరు