కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘చెరలోవున్నవారికి విడుదలను ప్రకటించండి’

‘చెరలోవున్నవారికి విడుదలను ప్రకటించండి’

‘చెరలోవున్నవారికి విడుదలను ప్రకటించండి’

యేసు తన పరిచర్య ఆరంభంలో, ‘చెరలోవున్నవారికి విడుదలను ప్రకటించడం’ తనకివ్వబడిన నియామకంలో భాగమని చెప్పాడు. (లూకా 4:​18) నిజ క్రైస్తవులు తమ యజమాని మాదిరిని అనుసరిస్తూ, ‘మనుష్యులందరికీ’ రాజ్య సువార్త ప్రకటించి, వారిని ఆధ్యాత్మిక చెర నుండి విడిపించి, తమ జీవితాలను మెరుగుపరచుకోవడానికి వారికి సహాయం చేస్తున్నారు.​—⁠1 తిమోతి 2:⁠4.

నేడు ఈ పనిలో, నిజంగా చెరలోవున్నవారికి అంటే వివిధ నేరాల మూలంగా జైల్లో ఉండి ఆధ్యాత్మిక విడుదలను కోరుకునేవారికి ప్రకటించడం కూడా ఒక భాగమే. యుక్రెయిన్‌లోనూ, యూరప్‌లోని మరితర ప్రాంతాల్లోనూ జైళ్ళలో యెహోవాసాక్షులు చేస్తున్న ప్రకటనా కార్యకలాపాల ఈ ప్రోత్సాహకరమైన నివేదికను చదివి ఆనందించండి.

మాదకద్రవ్యాలకు అలవాటుపడినవారు క్రైస్తవులుగా మారడం

సెర్హీ * తన 38 ఏళ్ళ జీవితంలో 20 ఏళ్ళు జైల్లోనే గడిపాడు. ఆయన పాఠశాల చదువు కూడా జైల్లోనే ముగించాడు. ఆయనిలా చెబుతున్నాడు: “ఎన్నో సంవత్సరాల క్రితం నేను హత్య చేసినందుకు జైలుపాలయ్యాను, నేను ఇంకా శిక్ష అనుభవించవలసి ఉంది. నేను జైల్లో ఒక నిరంకుశ పాలకుడిలా ప్రవర్తించాను, మిగతా ఖైదీలు నన్ను చూసి భయపడేవారు.” ఇది ఆయన స్వేచ్ఛ పొందినట్లు భావించేలా చేసిందా? లేదు. సెర్హీ ఎన్నో సంవత్సరాలపాటు మాదకద్రవ్యాలకు, మద్యానికి, పొగాకుకు బానిసయ్యాడు.

అప్పుడు ఒక తోటి ఖైదీ ఆయనకు బైబిలు సత్యం గురించి చెప్పాడు. దానితో చీకట్లో వెలుగు రేఖ ప్రసరించినట్లయింది. కొన్ని నెలల్లోనే, ఆయన తన వ్యసనాల నుండి బయటపడి, సువార్త ప్రకటించడం మొదలుపెట్టి, బాప్తిస్మం తీసుకున్నాడు. సెర్హీ ఇప్పుడు జైల్లో పూర్తికాల సేవకునిగా యెహోవా సేవచేస్తూ తీరికలేకుండా ఉన్నాడు. ఏడుగురు నేరస్థులు తమ విధానాలు మార్చుకుని, తన ఆధ్యాత్మిక సహోదరులుగా మారేందుకు ఆయన సహాయం చేశాడు. వారిలో ఆరుగురు విడుదల చేయబడ్డారు, సెర్హీ ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఆయన దీనికేమీ బాధపడడం లేదు ఎందుకంటే ఇతరులు ఆధ్యాత్మిక విడుదల పొందడానికి తాను సహాయం చేయగలనని ఆయన సంతోషంగా ఉన్నాడు.​—⁠అపొస్తలుల కార్యములు 20:​35.

సెర్హీ విద్యార్థుల్లో ఒకరు విక్టర్‌, ఆయన అంతకుముందు మాదకద్రవ్యాలు అమ్ముతూ, వాటికి బానిసగా మారాడు. విక్టర్‌ తాను జైలు నుండి విడుదల చేయబడిన తర్వాత, ఆధ్యాత్మిక ప్రగతి సాధించి, చివరకు యుక్రెయిన్‌లో పరిచర్యా శిక్షణ పాఠశాల నుండి పట్టభద్రుడయ్యాడు. ఇప్పుడాయన మాల్డోవాలో ప్రత్యేక పయినీరు సేవకునిగా సేవచేస్తున్నాడు. విక్టర్‌ ఇలా చెబుతున్నాడు: “నేను 8 ఏళ్ల వయస్సులో పొగ త్రాగడం, 12 ఏళ్ల వయస్సులో మద్యం త్రాగడం, 14 ఏళ్ల వయస్సులో మాదకద్రవ్యాలు ఉపయోగించడం ప్రారంభించాను. నేను నా జీవితాన్ని మార్చుకోవాలనుకున్నాను కానీ నా ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తర్వాత 1995లో, నేనూ నా భార్యా నా చెడు సహవాసుల నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నప్పుడు, ఒక హత్యోన్మాది ఆమెను హత్య చేశాడు. నా జీవితం సర్వనాశనమైపోయింది. ‘నా భార్య ఇప్పుడు ఎక్కడుంది? మరణించినవ్యక్తికి ఏమి సంభవిస్తుంది?’ నేనిలా ప్రశ్నించుకుంటూనే ఉన్నాను గానీ జవాబులు కనుగొనలేకపోయాను. ఆమె లేని లోటును తీర్చుకోవడానికి మరింత ఎక్కువగా మాదకద్రవ్యాలు తీసుకోవడం మొదలుపెట్టాను. మాదకద్రవ్యాలు అమ్ముతున్నందుకు నేను అరెస్టు చేయబడ్డాను, నాకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడింది. అక్కడ, నా ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి సెర్హీ నాకు సహాయం చేశాడు. నేను చాలాసార్లు మాదకద్రవ్యాలు తీసుకోవడం మానేయాలని ప్రయత్నించాను కానీ ఇప్పుడు బైబిలు నుండి సహాయం పొందడం ద్వారా మాత్రమే విజయం సాధించగలిగాను. దేవుని వాక్యం ఎంతో శక్తిమంతమైనది!”​—⁠హెబ్రీయులు 4:​12.

కఠినమైన నేరస్థుల్లో మార్పు

వాసిల్‌ ఎప్పుడూ మాదకద్రవ్యాలు ఉపయోగించలేదు, అయినా ఆయనకు జైలుశిక్ష తప్పలేదు. ఆయనిలా వివరిస్తున్నాడు: “కిక్‌బాక్సింగ్‌ నా దురలవాటు. ఎలాంటి గాయాలూ కనబడకుండా ప్రజలను కొట్టడమెలాగో నేను నేర్చుకున్నాను.” ప్రజలను దోచుకోవడానికి వాసిల్‌ తన దౌర్జన్యపూరిత మార్గాలను ఉపయోగించేవాడు. “నేను మూడుసార్లు జైలుకు వెళ్ళాను, దానితో నా భార్య నాకు విడాకులిచ్చింది. చివరి ఐదు సంవత్సరాల శిక్ష సమయంలో, నాకు యెహోవాసాక్షుల సాహిత్యం లభించింది. ఇది నన్ను బైబిలు చదివేలా పురికొల్పింది, అయినా నేను కిక్‌బాక్సింగ్‌ చేస్తూనే ఉన్నాను, అదంటే నాకెంతో ఇష్టం.

“అయితే ఆరు నెలలపాటు బైబిలు చదివిన తర్వాత, నాలో ఏదో మార్పు వచ్చింది. ఏదైనా పోట్లాటలో గెలవడం నాకిక ముందటిలా సంతృప్తినివ్వడం లేదు. కాబట్టి నేను యెషయా 2:4 ఆధారంగా నా జీవితాన్ని విశ్లేషించుకోవడం మొదలుపెట్టి, నేను నా ఆలోచనా విధానాన్ని సరిజేసుకోకపోతే నా శేష జీవితాన్ని జైల్లో గడపక తప్పదని గ్రహించాను. పోట్లాటకు నేను ఉపయోగించేవాటన్నిటినీ అవతలపడేసి, నా వ్యక్తిత్వాన్ని మెరుగుచేసుకోవడం ప్రారంభించాను. అదంత సులభం కాలేదు, కానీ ధ్యానించడం, ప్రార్థన క్రమేణా చెడు అలవాట్లు మానేయడానికి నాకు సహాయం చేశాయి. కొన్నిసార్లు, నా దురలవాటును మానేయడానికి బలమివ్వమని యెహోవాను కన్నీళ్ళతో వేడుకున్నాను. చివరకు, నేను విజయం సాధించాను.

“నేను జైలు నుండి విడుదలైన తర్వాత తిరిగి నా కుటుంబాన్ని కలుసుకున్నాను. ఇప్పుడు నేనొక బొగ్గుగనిలో పనిచేస్తున్నాను. దానితో నా భార్యతో కలిసి ప్రకటనాపనిలో భాగం వహించడానికి, సంఘంలో నా బాధ్యతలను నిర్వర్తించడానికి తగిన సమయం నాకు లభిస్తుంది.”

మైకోలా, ఆయన స్నేహితులు యుక్రెయిన్‌లో చాలా బ్యాంకులను దోచుకున్నారు. దానితో ఆయనకు పదేళ్ళ జైలుశిక్ష పడింది. ఆయన జైలుకు వెళ్ళకముందు ఒక్కసారి చర్చికి వెళ్లాడు, అదీ ఆ చర్చిని దోచుకునే పథకం వేసుకోవడానికి వెళ్ళాడు. అయితే ఆయన పథకం ఫలించలేదు కానీ ఆయనలా చర్చికి వెళ్ళడం, బైబిలు నిండా ఆర్థడాక్స్‌ ప్రీస్టులు, కొవ్వొత్తులు, మతసంబంధ పండుగలు వంటివాటి గురించి విసుగుపుట్టించే కథలుంటాయని మైకోలా నమ్మేలా చేసింది. ఆయనిలా చెబుతున్నాడు: “నాకు సరిగ్గా కారణం తెలియదు గానీ నేను బైబిలు చదవడం మొదలుపెట్టాను. అందులో నేననుకున్నట్లుగా లేకపోవడం చూసి నేనెంతో ఆశ్చర్యపోయాను!” ఆయన బైబిలు అధ్యయనం కోసం అడిగి, 1999లో బాప్తిస్మం తీసుకున్నాడు. ఇప్పుడు ఆయనను చూస్తే, వినయస్థుడైన ఈ పరిచర్య సేవకుడు ఒకప్పుడు ఘోరమైన సాయుధ బ్యాంకు దోపిడిదారుడంటే నమ్మడం కష్టం!

వ్లాడిమీర్‌కు మరణశిక్ష విధించబడింది. ఆయన ఆ శిక్ష అమలు చేయబడడం కోసం ఎదురుచూస్తూ, తనను కాపాడితే నీ సేవ చేస్తానని దేవునికి ప్రార్థించాడు. ఈలోగా చట్టం మారి, ఆయన మరణశిక్ష యావజ్జీవ కారాగార శిక్షగా మార్చబడింది. వ్లాడిమీర్‌ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి, నిజమైన మతం కోసం వెదకడం మొదలుపెట్టాడు. ఆయన ఉత్తరప్రత్యుత్తరాల కోర్సుకు దరఖాస్తు పెట్టుకుని అడ్వెంటిస్ట్‌ చర్చి నుండి డిప్లొమా అందుకున్నాడు గానీ ఆయనకు సంతృప్తి కలుగలేదు.

అయితే జైలు గ్రంథాలయంలో కావలికోట, తేజరిల్లు! పత్రికలు చదివిన తర్వాత, వ్లాడిమీర్‌ తనను సందర్శించమని యుక్రెయిన్‌లోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి వ్రాశాడు. స్థానిక సహోదరులు తనను సందర్శించినప్పుడు, ఆయన అప్పటికే తనను తాను ఒక సాక్షిగా పరిగణించుకుంటూ జైలులో ప్రకటిస్తున్నాడు. రాజ్య ప్రచారకుడయ్యేందుకు ఆయనకు సహాయం అందించబడింది. ఇది వ్రాయబడే సమయానికి వ్లాడిమీర్‌, ఆ జైలులోని మరో ఏడుగురు బాప్తిస్మం తీసుకోవడానికి ఎదురుచూస్తున్నారు. కానీ వారికో సమస్య ఉంది. యావజ్జీవ కారాగార శిక్ష విధించబడినవారిని వారి వారి మతనమ్మకాల అనుసారంగా జైలుగదులలో ఉంచుతారు కాబట్టి, వ్లాడిమీర్‌, ఆయనతోపాటు ఉన్నవారు ఒకే విశ్వాసానికి చెందినవారిగా వారు ఒకేచోట ఉండాలి. కాబట్టి వాళ్లు ఎవరికి ప్రకటిస్తారు? వాళ్ళు జైలు కాపలాదారులకు, ఉత్తరాలు వ్రాయడం ద్వారా, సువార్త ప్రకటిస్తున్నారు.

నాజర్‌ యుక్రెయిన్‌ నుండి ఛెక్‌ రిపబ్లిక్‌కు వెళ్ళి, అక్కడ ఒక దొంగల ముఠాలో చేరాడు. దానితో ఆయనకు మూడున్నర సంవత్సరాల జైలు శిక్షపడింది. జైల్లో ఉన్నప్పుడు ఆయన కార్లోవీ వారీ నగరం నుండి వచ్చే యెహోవాసాక్షుల సందర్శనాలకు ప్రతిస్పందించి, సత్యం తెలుసుకుని, పూర్తిగా మారిపోయాడు. ఇది చూసి, కాపలాదారుల్లో ఒకరు నాజర్‌ తోటి ఖైదీలతో ఇలా అన్నాడు: “మీరంతా ఆ యుక్రెయిన్‌ దేశస్థుడిలా మారిపోతే, నేను నా వృత్తి మార్చుకోవలసిందే.” మరొకరు ఇలా అన్నారు: “ఈ యెహోవాసాక్షులు నిజంగా నైపుణ్యవంతులు. ఒక వ్యక్తి నేరస్థునిగా జైల్లోకి వచ్చి, మంచి వ్యక్తిగా మారి వెళ్ళిపోతాడు.” ఇప్పుడు నాజర్‌ ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఆయన వడ్రంగం నేర్చుకుని, పెళ్ళి చేసుకున్నాడు, ఆయనా ఆయన భార్యా పూర్తికాల పరిచర్యలో ఉన్నారు. సాక్షులు జైళ్ళను సందర్శిస్తున్నందుకు ఆయనెంత కృతజ్ఞతతో ఉన్నాడో!

అధికారిక గుర్తింపు

యెహోవాసాక్షుల సేవలనుబట్టి కృతజ్ఞతతో ఉన్నది ఖైదీలు మాత్రమే కాదు. పోలాండ్‌లోని జైళ్ళలో ఒకదాని ప్రతినిధియైన మీరోస్లోవ్‌ కోవాల్‌స్కీ ఇలా చెప్పాడు: “మేము వాళ్ల సందర్శనాలను ఎంతో విలువైనవిగా పరిగణిస్తున్నాం. కొంతమంది ఖైదీలకు చాలా దుఃఖకరమైన నేపథ్యాలున్నాయి. బహుశా ఎవరూ వారిని ఎన్నడూ మనుష్యులుగా దృష్టించి ఉండకపోవచ్చు. . . . [సాక్షుల] సహాయం ఎంతో విలువైనది, ఎందుకంటే మా దగ్గర ఉద్యోగుల, విద్యావేత్తల కొరత ఉంది.”

పోలాండ్‌లోని మరో జైలు వార్డెన్‌ తన జైల్లో సాక్షులు తమ కార్యకలాపాలను అధికం చేయాలని కోరుతూ బ్రాంచి కార్యాలయానికి వ్రాశాడు. ఎందుకు? ఆయనిలా వివరించాడు: “వాచ్‌టవర్‌ ప్రతినిధులు మరింత తరచూ సందర్శించడం, ఖైదీలు తమలోని దౌర్జన్యపూరిత స్వభావాన్ని అణచివేసుకుని, సామాజికంగా కోరదగిన లక్షణాలను వృద్ధి చేసుకోవడానికి వారికి సహాయం చేస్తాయి.”

కృంగిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి, ఆ తర్వాత యెహోవాసాక్షుల నుండి సహాయం పొందిన ఒక ఖైదీ గురించి ఒక యుక్రెయిన్‌ వార్తాపత్రిక నివేదించింది. “ప్రస్తుతం ఈ వ్యక్తి భావోద్వేగపరంగా కోలుకుంటున్నాడు. అతడు జైలు దినచర్యకు కట్టుబడి ఉండి, ఇతర ఖైదీలకు ఒక మాదిరిగా ఉన్నాడు” అని ఆ నివేదిక చెబుతోంది.

జైలు వెలుపలా ప్రయోజనాలు

యెహోవాసాక్షులు చేసే పనివల్ల వచ్చే ప్రయోజనాలు జైలుకు మాత్రమే పరిమితం కాదు. ఖైదీలు విడుదల చేయబడిన తర్వాత కూడా అవి కొనసాగుతాయి. బ్రిగేట్‌, రెనేట్‌ అనే ఇద్దరు క్రైస్తవులు కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఇలా సహాయం చేస్తున్నారు. మినె ఎకో అషాఫెన్‌బుర్క్‌ అనే జర్మన్‌ వార్తాపత్రిక వారి గురించి ఇలా నివేదిస్తోంది: “వాళ్ళు, ఖైదీలు విడుదలైన తర్వాత, జీవితంలో ఒక సంకల్పం కనుగొనేందుకు వారిని ప్రోత్సహిస్తూ మూడు నుండి ఐదు నెలలపాటు వారి గురించి శ్రద్ధ తీసుకుంటారు. . . . వాళ్ళు స్వచ్ఛంద ప్రొబేషన్‌ ఆఫీసర్లుగా అధికారిక గుర్తింపు పొందారు. . . . వాళ్ళు జైలు అధికారులతో కూడా నిర్మాణాత్మకంగా, అనుకూలంగా వ్యవహరిస్తారు.” ఈ విధమైన సహాయం మూలంగా చాలామంది ప్రజలు తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకున్నారు.

యెహోవాసాక్షుల బైబిలు విద్యా పని మూలంగా చివరికి జైలు అధికారులు కూడా ప్రయోజనం పొందుతున్నారు. ఉదాహరణకు, రోమన్‌ అనే వ్యక్తి సైనికాధికారి, యుక్రెయిన్‌లోని జైలులో మానసికవేత్త. సాక్షులు ఆయన ఇంటికి వచ్చినప్పుడు, ఆయన బైబిలు అధ్యయనానికి అంగీకరించాడు. తాను పనిచేసే స్థలంలో సాక్షులు ఖైదీలను కలవడానికి అనుమతి లేదని ఆయన తెలుసుకున్నాడు. అయితే తాను ఖైదీలతో పనిచేసేటప్పుడు బైబిలు ఉపయోగించడానికి అనుమతివ్వమని ఆయన వార్డెన్‌ను అడిగాడు. ఆయనకు అనుమతివ్వబడింది, దాదాపు పదిమంది ఖైదీలు ఆసక్తి చూపించారు. రోమన్‌ తాను పొందుతున్న బైబిలు జ్ఞానాన్ని ఈ ఖైదీలతో క్రమంగా పంచుకునేవాడు, ఆయన ప్రయత్నాలకు చక్కని ఫలితాలు లభించాయి. విడుదల చేయబడిన తర్వాత కొందరు ఇంకా అభివృద్ధి సాధించి బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులయ్యారు. దేవుని వాక్య శక్తిని చూసి రోమన్‌ తన అధ్యయనాన్ని మరింత గంభీరంగా తీసుకున్నాడు. ఆయన సైన్యాన్ని విడిచిపెట్టి తన బైబిలు విద్యా కార్యకలాపాల్లో కొనసాగాడు. ఇప్పుడాయన మాజీ ఖైదీతో కలిసి ప్రకటనాపనిలో పాల్గొంటున్నాడు.

“ఇక్కడ మేము బైబిలు, బైబిలు ఆధారిత ప్రచురణలు, బైబిలు అధ్యయనంతో బలపర్చబడుతున్నాం” అని ఒక ఖైదీ వ్రాశాడు. బైబిలు సాహిత్యం కోసం కొన్ని జైళ్ళలో ఉన్న అవసరతను ఆ మాటలు చక్కగా వర్ణిస్తాయి. యుక్రెయిన్‌లోని ఒక సంఘం స్థానిక జైల్లో జరుగుతున్న బైబిలు విద్యా పని గురించి ఇలా నివేదిస్తోంది: “మేము అందజేస్తున్న సాహిత్యానికి వ్యవహార నిర్వహణాధికారులు కృతజ్ఞత కలిగివున్నారు. మేము వాళ్ళకు కావలికోట, తేజరిల్లు! పత్రికల ఒక్కో సంచిక 60 ప్రతుల చొప్పున పంపిస్తున్నాం.” మరో సంఘం ఇలా వ్రాస్తోంది: “20 చిన్న గ్రంథాలయాలున్న ఒక జైలు గురించి మేము శ్రద్ధ తీసుకుంటున్నాము. ప్రతీ గ్రంథాలయానికి మేము మన ముఖ్య ప్రచురణలు అందజేశాము. అవన్నీ కలిపి మొత్తం 20 పెట్టెల సాహిత్యాలయ్యాయి.” ఒక జైలులో, ఖైదీలు మన ప్రతీ సంచిక నుండి ప్రయోజనం పొందగలిగేలా అక్కడి కాపలాదారులు మన పత్రికలను ఒక దొంతరగా అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.

యుక్రెయిన్‌ బ్రాంచి కార్యాలయం 2002లో జైళ్ళను సందర్శించేందుకు ఒక విభాగాన్ని ప్రారంభించింది. ఆ విభాగం ఇప్పటివరకు దాదాపు 120 జైళ్ళను సందర్శించి, వాటి గురించి శ్రద్ధ తీసుకోవడానికి సంఘాలను నియమించింది. ప్రతీ నెల ఖైదీల నుండి దాదాపు 50 ఉత్తరాలు అందుతాయి, వాటిలో అనేకం సాహిత్యాలు కావాలనో బైబిలు అధ్యయనం కావాలనో విజ్ఞప్తి చేస్తూ ఉంటాయి. స్థానిక సహోదరులు వారిని కలుసుకొనేదాకా బ్రాంచి వారికి పుస్తకాలు, పత్రికలు, బ్రోషుర్లు పంపుతుంది.

“బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి” అని అపొస్తలుడైన పౌలు తన తోటి క్రైస్తవులకు వ్రాశాడు. (హెబ్రీయులు 13:​2, 3) తమ విశ్వాసం కారణంగా జైళ్లలో ఉన్నవారిని ఉద్దేశించి ఆయనలా అన్నాడు. నేడు, యెహోవాసాక్షులు శిక్ష విధించబడిన వారిని జ్ఞాపకం చేసుకుని, జైళ్ళను దర్శించి, ‘చెరలోవున్న వారికి విడుదలను ప్రకటిస్తారు.’​—⁠లూకా 4:​18.

[అధస్సూచి]

^ పేరా 5 కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[9వ పేజీలోని చిత్రం]

యుక్రెయిన్‌లోని లావోవ్‌లోవున్న జైలు గోడ

[10వ పేజీలోని చిత్రం]

మైకోలా

[10వ పేజీలోని చిత్రం]

వాసిల్‌, తన భార్య ఐరీనాతో

[10వ పేజీలోని చిత్రం]

విక్టర్‌