కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిర్ణయాత్మక చర్య తీసుకోవలసిన సమయం ఇదే

నిర్ణయాత్మక చర్య తీసుకోవలసిన సమయం ఇదే

నిర్ణయాత్మక చర్య తీసుకోవలసిన సమయం ఇదే

“ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు?”​—⁠1 రాజులు 18:21.

యెహోవాయే అద్వితీయ సత్యదేవుడని మీరు నమ్ముతున్నారా? బైబిలు ప్రవచనాలు మన కాలాన్ని సాతాను దుష్ట విధానపు ‘అంత్యదినాలని’ సూచిస్తున్నాయని కూడా మీరు నమ్ముతున్నారా? (2 తిమోతి 3:1) అలాగైతే, నిర్ణయాత్మక చర్య తీసుకోవలసిన అవసరం ఇంతకుముందుకన్నా ఇప్పుడే ఎక్కువగా ఉందని మీరు తప్పకుండా అంగీకరిస్తారు. మానవ చరిత్రలో ఎన్నడూ ఇంతమంది ప్రజల జీవితాలు ప్రమాదంలో లేవు.

2 సా.శ.పూ. పదవ శతాబ్దంలో ఇశ్రాయేలు జనాంగం ఒక గంభీరమైన నిర్ణయం తీసుకోవలసివచ్చింది. వారు ఎవరిని సేవిస్తారు? రాజైన అహాబు అన్యమతస్థురాలైన తన భార్య యెజెబెలు ప్రభావంవల్ల పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యంలో బయలు ఆరాధనను ప్రోత్సహించాడు. బయలు ఫలవర్ధక దేవతగా వర్షాన్ని, ఫలప్రదమైన పంటలను ఇవ్వాలి. చాలామంది బయలు ఆరాధకులు తమ దేవతా ప్రతిమను ముద్దుపెట్టుకునేవారు లేదా మోకాళ్లూని దానికి నమస్కరించేవారు. వారి పాడిపంటలను బయలు దీవించేలా అతని ఆరాధకులు దేవదాసీలతో విశృంఖల లైంగిక కృత్యాలు చేసేవారు. రక్తం కారేలా శరీరాలను కోసుకునే ఆచారం కూడా వారిలో ఉండేది.​—⁠1 రాజులు 18:28.

3 ఇశ్రాయేలీయుల్లో శేషించిన దాదాపు 7,000 మంది, విగ్రహ సంబంధమైన, దుర్నీతికరమైన, దౌర్జన్యపూరితమైన ఆ ఆరాధనలో భాగం వహించేందుకు నిరాకరించారు. (1 రాజులు 19:18) వారు యెహోవా దేవుడు తమతో చేసిన నిబంధనకు విశ్వసనీయంగా కట్టుబడివున్నారు, అందుకు వారు హింసించబడ్డారు. ఉదాహరణకు, రాణియైన యెజెబెలు యెహోవా ప్రవక్తలను చాలామందిని హతమార్చింది. (1 రాజులు 18:4, 13) ఈ పరీక్షాపూర్వక పరిస్థితుల కారణంగా, ఇశ్రాయేలీయుల్లో అధికశాతం మంది ఇటు యెహోవాను అటు బయలును సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తూ మిశ్రమ విశ్వాసాన్ని అభ్యసించారు. అయితే ఒక ఇశ్రాయేలీయుడు యెహోవా నుండి వైదొలగి అబద్ధ దేవతను ఆరాధించడమంటే అది మతభ్రష్టతే అవుతుంది. తనను ప్రేమించి తన ఆజ్ఞలకు లోబడితే ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. కానీ వారు తనకు “రోషము” కలిగిస్తే లేదా తనపట్ల అవిభాగిత భక్తిని ప్రదర్శించడంలో విఫలమైతే సర్వనాశనమవుతారనే వారిని హెచ్చరించాడు.​—⁠ద్వితీయోపదేశకాండము 5:​6-10; 28:15, 63.

4 నేడు క్రైస్తవమత సామ్రాజ్యంలో అలాంటి పరిస్థితే నెలకొంది. చర్చి సభ్యులు తాము క్రైస్తవులమని చెప్పుకుంటారు, కానీ వారి మతసంబంధ సెలవులు, ప్రవర్తన, నమ్మకాలు బైబిలు బోధలకు విరుద్ధంగా ఉన్నాయి. యెజెబెలులాగే క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులు కూడా యెహోవాసాక్షులను హింసించడంలో సారథ్యం వహిస్తున్నారు. క్రైస్తవమత సామ్రాజ్య మతనాయకులకు యుద్ధాలను బలపరిచిన సుదీర్ఘ చరిత్ర కూడా ఉంది, ఆ విధంగా వారు కోట్లసంఖ్యలో చర్చి సభ్యుల మరణానికి బాధ్యులు. లోకసంబంధ ప్రభుత్వాలకు మతాలిచ్చే మద్దతును, బైబిలు ఆధ్యాత్మిక వ్యభిచారంగా గుర్తిస్తోంది. (ప్రకటన 18:2, 3) దానికితోడు, క్రైస్తవమత సామ్రాజ్యం అంతకంతకు ఎక్కువగా దాని మతనాయకుల మధ్య అక్షరార్థ జారత్వాన్ని సహిస్తోంది. ఈ గొప్ప మతభ్రష్టత్వం గురించి యేసుక్రీస్తు, ఆయన అపొస్తలులు ముందేచెప్పారు. (మత్తయి 13:36-43; అపొస్తలుల కార్యములు 20:29, 30; 2 పేతురు 2:1, 2) వందకోట్లకన్నా ఎక్కువగావున్న క్రైస్తవమత సామ్రాజ్య అనుచరులకు చివరికి ఏమి సంభవిస్తుంది? వీరిపట్ల, అబద్ధమతంచేత మోసగించబడుతున్న ఇతరులందరిపట్ల యెహోవా నిజ ఆరాధకులకు ఎలాంటి బాధ్యత ఉంది? ‘బయలును ఇశ్రాయేలువారిమధ్య నుండకుండా నాశనం చేసేందుకు’ దారితీసిన నాటకీయ పరిణామాలను పరిశీలించడం ద్వారా మనకు ఆ ప్రశ్నలకు స్పష్టమైన జవాబులు లభిస్తాయి.​—⁠2 రాజులు 10:28.

చపలచిత్తులైన తన ప్రజలపట్ల దేవుని ప్రేమ

5 నమ్మకద్రోహులను శిక్షించడంలో యెహోవా దేవుడు ఆనందించడు. ప్రేమగల తండ్రిగా ఆయన దుష్టులు పశ్చాత్తాపపడి తిరిగి తనవద్దకు రావాలని కోరుతున్నాడు. (యెహెజ్కేలు 18:32; 2 పేతురు 3:9) దీనికి రుజువుగా యెహోవా, అహాబు యెజెబెలుల కాలంలో బయలు ఆరాధనా పర్యవసానాల గురించి తన ప్రజలను హెచ్చరించేందుకు చాలామంది ప్రవక్తలను పంపించాడు. అలాంటి ప్రవక్తల్లో ఏలీయా ఒకరు. ముందే ప్రకటించబడిన వినాశనకరమైన అనావృష్టి తర్వాత, ఇశ్రాయేలీయులను, బయలు ప్రవక్తలను కర్మెలు పర్వతం మీద సమకూర్చాలని ఏలీయా అహాబు రాజుకు చెప్పాడు.​—⁠1 రాజులు 18:1, 19.

6 బహుశా యెజెబెలును సంతోషపెట్టేందుకు ‘పడద్రోయబడిన’ యెహోవా బలిపీఠమున్న ప్రాంతంలో ఆ సమావేశం జరిగింది. (1 రాజులు 18:30) విచారకరంగా, అక్కడకు వచ్చిన ఇశ్రాయేలీయులకు, అత్యవసరమైన వర్షాన్ని రప్పించగల శక్తి నిజంగా ఎవరికి ఉంది​—⁠బయలుకా లేక యెహోవాకా అనేది సందిగ్ధంలో ఉంది. బయలుకు 450 మంది ప్రవక్తలు ఉండగా, యెహోవాకు ఒక్క ఏలీయా మాత్రమే ప్రతినిధిగా ఉన్నాడు. ఏలీయా, సమస్యకున్న అసలు కారణాన్ని ప్రస్తావిస్తూ ‘ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు?’ అని ఆ ప్రజలను అడిగి, ఆ పిమ్మట మరింత స్పష్టమైన మాటలతో ఈ వివాదాంశాన్ని వారి ముందుంచాడు: “యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని ననుసరించుడి.” యెహోవాపట్ల అవిభాగిత భక్తిని ప్రదర్శించేలా ఆ అనిశ్చిత ఇశ్రాయేలీయులను పురికొల్పేందుకు ఏలీయా నిజమైన దేవుడు ఎవరో తేల్చే పరీక్షను ప్రతిపాదించాడు. ఒకటి యెహోవాకు రెండవది బయలుకు అన్నట్లు రెండు ఎద్దుల్ని బలిగా అర్పించాలి. నిజమైన దేవుడు ఎవరో ఆయనే తన బలిని అగ్నితో దహిస్తాడు. బయలు ప్రవక్తలు తమ బలిని సిద్ధంచేసి అనేక గంటలపాటు “బయలా, మా ప్రార్థన వినుమని” ప్రార్థించారు. ఏలీయా వారిని అపహాస్యం చేసినప్పుడు, వారు రక్తం కారేంతగా తమను కోసుకుంటూ, బిగ్గరగా కేకలు వేశారు. అయినా వారికి జవాబు దొరకలేదు.​—⁠1 రాజులు 18:21, 26-29.

7 ఇప్పుడు ఏలీయా వంతు వచ్చింది. మొదట ఆయన యెహోవా బలిపీఠాన్ని బాగుచేసి ముక్కలు చేసిన ఎద్దు మాంసాన్ని దానిమీద పేర్చి, ఆ బలిమీద నాలుగు పెద్ద జాడీలతో నీళ్లు పోయమని చెప్పాడు. ఆ బలిపీఠం చుట్టూవున్న కందకం నీళ్లతో నిండేంతవరకు మూడుసార్లు అలా నీళ్లు పోయబడ్డాయి. ఆ పిమ్మట ఏలీయా ఇలా ప్రార్థించాడు: “యెహోవా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై యున్నావనియు, నేను నీ సేవకుడనై యున్నాననియు, ఈ కార్యములన్నియు నీ సెలవుచేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము; యెహోవావైన నీవే దేవుడవై యున్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు ఈ జనులకు తెలియునట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.”​—⁠1 రాజులు 18:30-37.

8 సత్య దేవుడు పరలోకం నుండి అగ్ని కురిపించి బలిని, బలిపీఠాన్ని దహిస్తూ ప్రత్యుత్తరమిచ్చాడు. ఆ అగ్ని, కందకంలోని నీళ్లను సహితం ఆరిపోయేలా చేసింది! అది ఇశ్రాయేలీయులపై ఎలాంటి ప్రభావం చూపించిందో ఊహించండి! వారు వెంటనే “సాగిలపడి​—⁠యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలువేసిరి.” ఆ వెంటనే ఏలీయా నిర్ణయాత్మక చర్య తీసుకొని, ఇశ్రాయేలీయులను ఇలా ఆదేశించాడు: “ఒకనినైన తప్పించుకొని పోనియ్యక బయలు ప్రవక్తలను పట్టుకొనుడి.” ఆ పిమ్మట కర్మెలు పర్వతం దగ్గర ఆ 450 మంది బయలు ప్రవక్తలు వధించబడ్డారు.​—⁠1 రాజులు 18:38-40.

9 మరపురాని ఆ రోజున యెహోవా మూడున్నర సంవత్సరాల్లో మొదటిసారిగా ఆ దేశంలో వర్షం కురిపించాడు. (యాకోబు 5:17, 18) ఆ ఇశ్రాయేలీయులు తిరిగి తమ ఇళ్లకు వెళ్లేటప్పుడు ఏమి మాట్లాడుకుని ఉంటారో మీరు ఊహించుకోవచ్చు; యెహోవా తన దైవత్వమే సత్యమని నిరూపించాడు. అయితే బయలు ఆరాధకులు ఊరుకోలేదు. యెజెబెలు యెహోవా సేవకులపై హింసాత్మక దండయాత్రను కొనసాగించింది. (1 రాజులు 19:​1, 2; 21:​11-16) ఆ విధంగా దేవుని ప్రజల యథార్థత మళ్లీ పరీక్షించబడింది. బయలు ఆరాధకులపై యెహోవా తీర్పు వచ్చిన రోజున వారు ఆయనపట్ల అవిభాగిత భక్తిని ప్రదర్శిస్తారా?

ఇప్పుడే నిర్ణయాత్మక చర్య తీసుకోండి

10 ఆధునిక కాలాల్లో, అభిషిక్త క్రైస్తవులు ఏలీయా చేసినటువంటి పనినే చేశారు. నోటిమాట ద్వారా, ముద్రిత ప్రచురణల ద్వారా వారు అబద్ధమతంవల్ల కలిగే ప్రమాదం గురించి క్రైస్తవమత సామ్రాజ్యంలోని వారినీ, వెలుపలి వారినీ హెచ్చరించారు. ఫలితంగా, లక్షలాదిమంది అబద్ధమతంలో తమ సభ్యత్వాన్ని రద్దుచేసుకునే నిర్ణయాత్మక చర్య తీసుకున్నారు. వారు తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్న యేసుక్రీస్తు శిష్యులుగా మారారు. అవును, సంబంధించి “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి” అని అబద్ధమతానికి దేవుడిచ్చిన అత్యవసర పిలుపును వారు లక్ష్యపెట్టారు.​—⁠ప్రకటన 18:4.

11 ఇంకా లక్షలాదిమంది, యెహోవాసాక్షులు ప్రకటిస్తున్న బైబిలు ఆధారిత సందేశానికి ఆకర్షితులైనప్పటికీ, తామేమి చేయాలో తెలియని అనిశ్చిత స్థితిలోనే ఉన్నారు. వారిలో కొందరు ప్రభువు రాత్రి భోజన ఆచరణ లేదా జిల్లా సమావేశాల కొన్ని కార్యక్రమాలు వంటి క్రైస్తవ కూటాలకు అప్పుడప్పుడూ హాజరవుతుంటారు. అలాంటి వారందరూ ఏలీయా పలికిన ఈ మాటలను జాగ్రత్తగా ఆలోచించాలని మేము కోరుతున్నాం: “మీరు ఎంతకాలం గోడమీద కూర్చొనివుంటారు?” (1 రాజులు 18:​21, న్యూ ఇంగ్లీష్‌ బైబిల్‌) ఆలస్యం చేయకుండా వారిప్పుడే నిర్ణయాత్మక చర్య తీసుకొని, సమర్పించుకొని బాప్తిస్మం తీసుకున్న యెహోవా ఆరాధకులయ్యే లక్ష్యాన్ని సాధించడానికి ఆసక్తిగా పనిచేయాలి. వారి నిత్యజీవపు ఉత్తరాపేక్షలు ప్రమాదంలో ఉన్నాయి.​—⁠2 థెస్సలొనీకయులు 1:6-9.

12 బాప్తిస్మం తీసుకున్న కొందరు క్రైస్తవులు, విచారకరంగా తమ ఆరాధనలో క్రమత్వాన్ని కోల్పోయినవారిగా లేదా క్రియాశూన్యులుగా తయారయ్యారు. (హెబ్రీయులు 10:​23-25; 13:15, 16) కొందరు హింస, జీవన చింతలు, ధనవంతులు కావాలనే ప్రయత్నాల కారణంగా లేదా స్వార్థపూరిత సుఖాల కారణంగా తమ ఆసక్తిని కోల్పోయారు. యేసు తన అనుచరుల్లో కొందరిని ఇవే తొట్రుపడేలా చేస్తాయనీ, అణచివేస్తాయనీ, ఉరిలో పడేస్తాయనీ హెచ్చరించాడు. (మత్తయి 10:​28-33; 13:20-22; లూకా 12:​22-31; 21:34-36) అలాంటివారు ‘రెండు తలంపుల మధ్య తడబడే’ బదులు తాము దేవునికి చేసుకున్న సమర్పణకు తగిన నిర్ణయాత్మక చర్య తీసుకుంటూ “ఆసక్తి కలిగి మారుమనస్సు” పొందాలి.​—⁠ప్రకటన 3:15-19.

అబద్ధమతం అకస్మాత్తుగా అంతమవుతుంది

13 మానవులు ఇప్పుడే అత్యవసరంగా ఎందుకు చర్య తీసుకోవాలనేదానికి కారణాన్ని, కర్మెలు పర్వతం మీద దైవత్వపు వివాదం పరిష్కారమైన 18 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులకు సంభవించిన దానిలో చూడవచ్చు. బయలు ఆరాధనకు వ్యతిరేకంగా యెహోవా తీర్పుదినం ఏలీయా వారసుడైన ఎలీషా పరిచర్య కాలంలో అకస్మాత్తుగానూ, అనూహ్యంగానూ వచ్చింది. అహాబు రాజు కుమారుడైన యెహోరాము ఇశ్రాయేలును పరిపాలిస్తున్నాడు, రాజమాతగా యెజెబెలు ఇంకా బ్రతికే ఉంది. ఎలాంటి హడావిడీ లేకుండా ఇశ్రాయేలు సైన్యాధిపతియైన యెహూను క్రొత్త రాజుగా అభిషేకించేందుకు ఎలీషా తన దాసుణ్ణి పంపించాడు. అప్పుడు యెహూ ఇశ్రాయేలు శత్రువులపై యుద్ధం నడిపిస్తూ రామోత్గిలాదులో యొర్దాను నదికి తూర్పున ఉన్నాడు. రాజైన యెహోరాము యుద్ధ గాయాలనుండి కోలుకుంటూ మెగిద్దోకు దగ్గర్లోవున్న యెజ్రెయేలు మైదానపు లోయలో ఉన్నాడు.​—⁠2 రాజులు 8:29-9:4.

14 ఇలా చేయమని యెహోవా యెహూకు ఆజ్ఞాపించాడు: “నా సేవకులైన ప్రవక్తలను హతము చేసినదానిని బట్టియు, యెహోవా సేవకులందరిని హతము చేసిన దానినిబట్టియు, యెజెబెలునకు ప్రతికారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతివారిని హతముచేయుము. అహాబు సంతతివారందరును నశింతురు; . . . యెజెబెలు పాతి పెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కలచేత తినివేయబడును.”​—⁠2 రాజులు 9:​7-10.

15 యెహూ స్థిరచిత్తంగలవాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన తన రథమెక్కి యెజ్రెయేలు వైపు వేగంగా వెళ్లాడు. యెజ్రెయేలు దగ్గరున్న ఒక కావలివాడు యెహూ తోలడాన్ని గుర్తించి రాజైన యెహోరాముకు చెప్పగా, యెహోరాము తన రథమెక్కి తన సైన్యాధిపతిని కలుసుకునేందుకు వెళ్లాడు. వారు కలుసుకున్నప్పుడు యెహోరాము ఇలా అడిగాడు: “యెహూ సమాధానమా?” దానికి యెహూ “నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమాధాన మెక్కడనుండి వచ్చునని” జవాబిచ్చాడు. ఆ పిమ్మట, రాజైన యెహోరాము అక్కడినుండి పారిపోకముందే యెహూ తన విల్లు ఎక్కుపెట్టి అతని గుండెల్లోంచి దూసుకుపోయేలా బాణంతో కొట్టి హతమార్చాడు.​—⁠2 రాజులు 9:20-24.

16 ఆలస్యం చేయకుండా యెహూ తన రథంలో వేగంగా నగరానికి చేరుకున్నాడు. యెజెబెలు వైభవంగా అలంకరించుకొని కిటికిలోనుండి కిందికిచూస్తూ యెహూను బెదిరిస్తూ మాట్లాడింది. ఆమె మాటలు పట్టించుకోకుండా యెహూ మద్దతును ఆశిస్తూ “నా పక్షమందున్న వారెవరని” అడిగాడు. యెజెబెలు దాసులు ఇప్పుడు నిర్ణయాత్మక చర్య తీసుకోవాలి. ఇద్దరు ముగ్గురు పరిచారకులు కిటికీలోనుండి తొంగిచూశారు. తక్షణమే వారి విశ్వసనీయత పరీక్షించబడింది. “దీనిని క్రింద పడద్రోయుడి” అని యెహూ వారిని ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ పరిచారకులు యెజెబెలును క్రిందనున్న వీధిలోకి పడద్రోయగా, యెహూ ఆమెమీదికి రథాన్ని పోనిచ్చి గుర్రాలతో త్రొక్కించాడు. ఆ విధంగా ఇశ్రాయేలులో బయలు ఆరాధనా దుష్ప్రేరకురాలికి తగిన మరణమే లభించింది. ఆమెను పాతిపెట్టకముందే, ప్రవచింపబడినట్లే కుక్కలు ఆమె మాంసాన్ని తినేశాయి.​—⁠2 రాజులు 9:30-37.

17 “మహా బబులోను” అనే పేరుగల సూచనార్థక వేశ్యకు కూడా అలాంటి దిగ్భ్రాంతికరమైన నాశనమే సంభవిస్తుంది. ఆ వేశ్య సాతాను ప్రపంచ అబద్ధమతాలకు ప్రతీకగా ఉంది, ఆ మతాలన్నీ ప్రాచీన బబులోను పట్టణం నుండే ఆరంభమయ్యాయి. అబద్ధమతం నాశనమైన తర్వాత, సాతాను ప్రపంచంలో లౌకిక విభాగాలుగా ఉన్న మానవులందరిపైకి యెహోవా దేవుడు తన దృష్టిని మళ్లిస్తాడు. నీతియుక్త నూతనలోకానికి మార్గాన్ని సుగమం చేస్తూ ఆ విభాగాలు కూడా నాశనం చేయబడతాయి.​—⁠ప్రకటన 17:​3-6; 19:19-21; 21:1-4.

18 యెజెబెలు మరణం తర్వాత రాజైన యెహూ అహాబు కుటుంబీకులను, ముఖ్య మద్దతు దారులను హతమార్చడంలో ఆలస్యం చేయలేదు. (2 రాజులు 10:11) అయితే బయలును ఆరాధిస్తున్న ఇశ్రాయేలీయులు ఆ దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు. ‘యెహోవా గురించిన తన ఆసక్తిని’ ప్రదర్శించేందుకు యెహూ వీరి విషయంలో నిర్ణయాత్మక చర్య తీసుకున్నాడు. (2 రాజులు 10:16) బయలు ఆరాధకునిలా నటిస్తూ యెహూ షోమ్రోనులో అహాబు నిర్మించిన బయలు ఆలయంలో గొప్ప పండుగను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలులోని బయలు ఆరాధకులందరూ ఆ పండుగకు వచ్చారు. ఆలయంలో చిక్కుబడిన వారందరిని యెహూ మనుష్యులు వధించారు. బైబిలు ఆ వృత్తాంతాన్ని ఈ మాటలతో ముగిస్తోంది: “ఈ ప్రకారము యెహూ బయలు దేవతను ఇశ్రాయేలువారిమధ్య నుండకుండ నాశనము చేసెను.”​—⁠2 రాజులు 10:18-28.

19 ఇశ్రాయేలు నుండి బయలు ఆరాధన నిర్మూలించబడింది. అదే ప్రకారంగా, ఈ లోక అబద్ధమతాలు ఆకస్మికంగా, దిగ్భ్రాంతి కలిగించేలా నాశనం చేయబడతాయి. ఆ గొప్ప తీర్పు దినంలో మీరు ఎవరి పక్షాన నిలబడతారు? ఇప్పుడే నిర్ణయాత్మక చర్య తీసుకోండి, అలా తీసుకున్నప్పుడు “మహాశ్రమలనుండి” తప్పించుకునే మనుష్యుల “గొప్పసమూహము”లో మీరూ ఉండే ఆధిక్యత మీకు లభిస్తుంది. అప్పుడు “తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు” జరిగిన తీర్పును ఆనందంగా గుర్తుచేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తారు. ఇతర సత్యారాధకులతో కలిసి, పరలోకవాసులతో గొంతు కలిపి పులకరింపజేసే ఈ మాటలు ఆలపిస్తారు: “సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు; ఆయనను స్తుతించుడి.”​—⁠ప్రకటన 7:​9, 10, 14; 19:1, 2, 6.

ధ్యానించడానికి ప్రశ్నలు

ప్రాచీన ఇశ్రాయేలు ఎలా బయలు ఆరాధనా దోషిగా తయారైంది?

ఏ గొప్ప మతభ్రష్టత్వాన్ని బైబిలు ప్రవచించింది, ఆ ప్రవచనం ఎలా నెరవేరింది?

బయలు ఆరాధనను యెహూ ఎలా నిర్మూలించాడు?

దేవుని తీర్పు దినాన్ని తప్పించుకునేందుకు మనమేమి చేయాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. గతంకన్నా మన కాలాన్ని ఏది భిన్నంగా చేస్తోంది?

2. రాజైన అహాబు పరిపాలనా కాలంలో పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యంలో ఏమి సంభవించింది?

3. బయలు ఆరాధన దేవుని ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపించింది?

4. క్రైస్తవుల మధ్య ఏమి జరుగుతుందని యేసు, ఆయన అపొస్తలులు ముందేచెప్పారు, అది ఎలా నెరవేరింది?

5. యెహోవా చపలచిత్తులైన తన ప్రజలపట్ల ప్రేమపూర్వక శ్రద్ధను ఎలా చూపించాడు?

6, 7. (ఎ) ఇశ్రాయేలీయుల మతభ్రష్టత్వానికిగల మూలకారణాన్ని ఏలీయా ఎలా బహిర్గతం చేశాడు? (బి) బయలు ప్రవక్తలు ఏమిచేశారు? (సి) ఏలీయా ఏమిచేశాడు?

8. ఏలీయా ప్రార్థనకు దేవుడు ఎలా ప్రతిస్పందించాడు, ఆ ప్రవక్త ఎలాంటి చర్య తీసుకున్నాడు?

9. సత్యారాధకులు ఇంకా ఏ విధంగా పరీక్షించబడ్డారు?

10. (ఎ) ఆధునిక కాలాల్లో, అభిషిక్త క్రైస్తవులు ఏమిచేస్తూ వచ్చారు? (బి) ప్రకటన 18:4లోని ఆజ్ఞకు లోబడడమంటే అర్థమేమిటి?

11. యెహోవా ఆమోదం పొందేందుకు ఏమి అవసరం?

12. బాప్తిస్మం తీసుకున్న కొందరు క్రైస్తవులు ఎలాంటి ప్రమాదకర పరిస్థితిలోకి జారిపోయారు, వారేమి చేయాలి?

13. యెహూ రాజుగా అభిషేకించబడినప్పుడు ఇశ్రాయేలులో ఉన్న పరిస్థితిని వివరించండి.

14, 15. యెహూ ఏ ఆదేశాన్ని అందుకున్నాడు, ఆయన దానికెలా స్పందించాడు?

16. (ఎ) యెజెబెలు పరిచారకులు హఠాత్తుగా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు? (బి) యెజెబెలు విషయంలో యెహోవా వాక్కు ఎలా నెరవేరింది?

17. యెజెబెలుకు దేవుడు విధించిన తీర్పు ఏ భవిష్యత్‌ సంఘటన విషయంలో మన విశ్వాసాన్ని బలపరచాలి?

18. యెజెబెలు మరణం తర్వాత, ఇశ్రాయేలులోని బయలు ఆరాధకులకు ఏమి సంభవించింది?

19. యెహోవా యథార్థ ఆరాధకుల ‘గొప్పసమూహానికి’ ఏ అద్భుతమైన ఉత్తరాపేక్ష వేచివుంది?

[25వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

శోకో

ఆఫెకు

హెల్కతు

యొక్నెయాము

మెగిద్దో

తానాకు

దోతాను

షోమ్రోను

ఏన్దోరు

షూనేము

ఒఫ్రా

యెజ్రెయేలు

ఇబ్లెయాము (గత్రిమ్మోను)

తిర్సా

బేత్షెమెషు

బేత్షెయాను (బేత్షాను)

యాబేష్గిలాదు?

ఆబేల్మెహోలా

బేతర్బేలు

రామోత్గిలాదు

పర్వత శిఖరాలు

కర్మెలు పర్వతం

తాబోరు కొండ

మోరే

గిల్బోవ పర్వతం

[సముద్రాలు]

మధ్యధరా సముద్రము

గలిలయ సముద్రము

[నది]

యొర్దాను నది

[నీటి బుగ్గ, బావి]

హరోదు బావి

[చిత్రసౌజన్యం]

Based on maps copyrighted by Pictorial Archive (Near Eastern History) Est. and Survey of Israel

[26వ పేజీలోని చిత్రాలు]

క్రమంగా రాజ్య ప్రకటనా పనిలో భాగం వహించడం, క్రైస్తవ కూటాలకు హాజరవడం సత్యారాధనలో ఆవశ్యకమైన అంశాలు

[28, 29వ పేజీలోని చిత్రం]

యెహోవా దినం తప్పించుకోవాలని ఇష్టపడేవారందరూ యెహూలాగే నిర్ణయాత్మక చర్య తీసుకోవాలి