కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పండుగ సమయం మీ ఆశలన్నిటినీ తీరుస్తుందా?

పండుగ సమయం మీ ఆశలన్నిటినీ తీరుస్తుందా?

పండుగ సమయం మీ ఆశలన్నిటినీ తీరుస్తుందా?

“జనవరి 1న చర్చీలన్నిటిలో ప్రత్యేకమైన నూతన సంవత్సర ప్రార్థనలు జరిపించాలని పీటర్‌ [ద గ్రేట్‌] ఆజ్ఞాపించాడు. అంతేకాక, ఇళ్ళలోని లోపలి ద్వారబంధాలను సతతహరిత చెట్ల కొమ్మలతో అలంకరించాలని ఆదేశించడమేకాక, మాస్కో పౌరులందరూ నూతన సంవత్సర దినాన ఒకరికొకరు ‘బిగ్గరగా శుభాకాంక్షలు చెప్పుకోవడం ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేయాలి’ అని కూడా అతడు ఆజ్ఞాపించాడు.”​—⁠పీటర్‌ ద గ్రేట్‌​—⁠హిస్‌ లైఫ్‌ అండ్‌ వరల్డ్‌.

చాలామంది పండుగ సమయం అని పిలిచే కాలంలో మీరు దేని కోసం ఎదురుచూస్తారు? ఈ పండుగ సమయంలో క్రీస్తు జన్మదినం అని సాంప్రదాయకంగా విశ్వసించబడే క్రిస్మస్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని, అయితే దానిలో నూతన సంవత్సర వేడుకలు కూడా ఒక భాగమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అంటారు. కాబట్టి అది చాలా రోజులు కొనసాగే పండుగ సమయం. ఈ సమయంలో పిల్లలకు, పెద్దవారికి సెలవులు ఉంటాయి, కాబట్టి కుటుంబాలు కలిసి సమయం గడపడానికి ఇది చాలా అనుకూలమైన కాలంగా అనిపించవచ్చు. అయితే ఇతరులు సంవత్సరంలోని ఈ సమయంలో క్రీస్తును ఘనపర్చాలని అనుకుంటారు కాబట్టి దీన్ని “క్రిస్మస్‌ సమయం” అంటారు. బహుశా మీరు కూడా ఈ సమయంలో ఇది అత్యంత ప్రాముఖ్యమైన అంశమని భావిస్తుండవచ్చు.

క్రీస్తును ఘనపర్చడానికే అయినా, కుటుంబంతో కలిసి సమయం గడపడానికే అయినా లేక రెండింటి కోసమైనా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది భర్తలు, భార్యలు, పిల్లలు ఈ సమయం కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. ఈ సంవత్సరం మాటేమిటి? అది మీ కుటుంబానికి ప్రత్యేకమైన సమయంగా ఉంటుందా, అది దేవునికి ప్రత్యేకమైన సమయంగా ఉంటుందా? ఒకవేళ కుటుంబమంతా కలుసుకోబోతుంటే, అంతా మీరు ఆశించినట్లే జరుగుతుందా లేక మీకు నిరాశే మిగులుతుందా?

మతపరమైన అంశంపై దృష్టినిలిపే చాలామంది తరచూ క్రిస్మస్‌తోపాటు, నూతన సంవత్సరం కూడా క్రీస్తు సంబంధిత స్ఫూర్తి ఏమాత్రం లేకుండా జరుపుకోబడుతున్నట్లు గమనిస్తారు. అంతేగాక ఆ పండుగ సమయం కేవలం బహుమతులు అందుకునే సమయంగా, క్రీస్తును అగౌరవపరిచే ప్రవర్తనతో కూడిన పార్టీలు చేసుకోవడానికో, లేదా కుటుంబమంతా కలుసుకోవడానికో ఒక సాకుగా తయారవుతుంది. అలా సమకూడినప్పుడు సాధారణంగా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు అతిగా తినడం, మద్యం అతిగా సేవించడం, గృహ దౌర్జన్యానికి కారణమయ్యే వాదోపవాదాలు తలెత్తడం జరుగుతుంటుంది. మీరీ విషయాన్ని గమనించే ఉంటారు, లేదా బహుశా మీకే అలాంటి అనుభవం ఎదురై ఉండవచ్చు.

అలాగైతే, ఆర్టికల్‌ ఆరంభంలో వర్ణించబడిన, రష్యన్‌ జార్‌ అయిన పీటర్‌ ద గ్రేట్‌ కాలానికీ ఇప్పటికీ పెద్ద తేడా ఏమీ లేదని మీకనిపించవచ్చు. నేటి ధోరణినిబట్టి కలత చెందిన అనేకులు పండుగ సమయం గంభీరమైన మత సంబంధ ధ్యానానికి, సంతోషకరమైన కుటుంబ సహవాసానికి తగిన సమయంగా ఉండాలని ఆశిస్తారు. కొందరైతే, పండుగకు యేసే మూలం వంటి నినాదాలతో మార్పు తీసుకురావడానికి కూడా కృషి చేస్తున్నారు. కానీ మార్పు సాధ్యమేనా? ఇది క్రీస్తును నిజంగా ఘనపరుస్తుందా? పండుగ సమయం విషయంలో భిన్న దృక్కోణంతో ఉండడానికి కారణాలున్నాయా?

సంతృప్తికరమైన సమాధానాలు పొందడానికి, సంవత్సరంలోని ఈ సమయాన్నిబట్టి కృతజ్ఞత కలిగివుండడానికి ప్రత్యేక కారణం ఉన్న ఒక దేశ ప్రజల దృష్టికోణం నుండి మనం పరిస్థితిని పరిశీలిద్దాం.