మీకు జ్ఞాపకమున్నాయా?
మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికల నుండి ప్రయోజనం పొందారా?
అయితే, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
• మొదటి పాపమైన ఆదాము అవిధేయతను వారసత్వంగా వచ్చే వ్యాధితో ఎందుకు పోల్చవచ్చు?
ఆదాము తన సంతానానికి పాపాన్ని సంక్రమింపజేశాడు కాబట్టి అది ఒక వ్యాధి లాంటిది. అందువల్ల, కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి ఎలాగైతే ఒక వ్యాధిని వారసత్వంగా పొందుతారో అలాగే మనం ఆ లోపమైన పాపాన్ని వారసత్వంగా పొందాం.—8/15, 5వ పేజీ.
• నేడు పెరుగుతున్న హింసకు ప్రధాన కారణాలేమిటి?
చిత్రాలు, సంగీతం, ఆటగాళ్లను క్రూరత్వానికి, చిత్రహింసకు పాల్పడేలా పురికొల్పే కంప్యూటర్ గేమ్స్ వంటి వాటి ద్వారా ప్రజల హృదయాల్లో సాతాను దౌర్జన్య స్ఫూర్తిని నాటి వారిని యెహోవా నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రసారసాధనాల్లో ప్రసారమయ్యే దౌర్జన్యం అనేక హింసాయుత చర్యలకు దోహదపడుతోంది.—9/1, 29వ పేజీ.
• పొంతి పిలాతు ఎవరు?
ఆయన క్రిందిస్థాయి శ్రీమంతుల వర్గానికి చెందిన రోమా పౌరుడు, ఆయన సైన్యంలో పనిచేసి ఉండవచ్చు. సా.శ. 26లో రోమా చక్రవర్తి తిబెరి, పిలాతును యూదా ప్రాంతానికి అధిపతిగా నియమించాడు. పిలాతు యేసును న్యాయవిచారణ చేస్తున్నప్పుడు యూదా నాయకుల ఆరోపణలను విన్నాడు. ఆయన జనసమూహాన్ని సంతోషపెట్టడానికి యేసుకు మరణశిక్ష విధించాడు.—9/15, 10-12 పేజీలు.
• మత్తయి 24:3లో పేర్కొనబడిన “సూచన” ఏమిటి?
ఈ సూచనలో వివిధ అంశాలు ఇమిడివున్నాయి, అవన్నీ కలిపి ఒక సంయుక్త గుర్తింపు చిహ్నంగా లేక సంకేతంగా పనిచేస్తాయి. ఆ సూచనలో యుద్ధాలు, కరవులు, తెగుళ్ళు, భూకంపాలు ఉన్నాయి, అవి యేసు అనుచరులు ఆయన “ప్రత్యక్షతను,” అలాగే “యుగసమాప్తిని” గుర్తించేందుకు సహాయం చేస్తాయి.—10/1, 4-5 పేజీలు.
• డయస్పోరా అంటే ఏమిటి, దానిలో ఏ ప్రాంతాలు ఉన్నాయి?
పాలస్తీనా వెలుపల నివసిస్తున్న యూదులకు ఆ పదం వర్తిస్తుంది. మొదటి శతాబ్దంలో యూదుల ప్రధాన కేంద్రాలు సిరియా, ఆసియా మైనరు, బబులోను, ఐగుప్తు ప్రాంతాల్లో ఉండేవి, యూదుల చిన్న సమాజాలు రోమా సామ్రాజ్యానికి చెందిన యూరప్‌లో ఉండేవి.—10/15, 12వ పేజీ.
• ఒక క్రైస్తవుడు ఆయుధాలు ధరించాల్సిన ఉద్యోగంలో చేరినట్లయితే, ఆయన స్వచ్ఛమైన మనస్సాక్షిని కాపాడుకోగలడా?
తుపాకీని లేదా వేరే ఆయుధాన్ని ధరించాల్సిన ఉద్యోగం చేయడం అనేది వ్యక్తిగత నిర్ణయం. అలాంటి ఉద్యోగం చేసే వ్యక్తి తను ధరించిన ఆయుధాన్ని ఉపయోగించాల్సి వస్తే, అది అతడ్ని రక్తాపరాధానికి గురిచేసే అవకాశం ఉంది. దాడులవల్ల లేక ప్రతీకార చర్యలవల్ల గాయపడే లేదా ప్రాణాలు కోల్పోయే అపాయానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. అలాంటి ఆయుధాలు ధరించే క్రైస్తవుడు సంఘంలోని ప్రత్యేక ఆధిక్యతలకు అర్హుడు కాడు.—(1 తిమోతి 3:2, 10)—11/1, 31వ పేజీ.
• “అర్మగిద్దోను” అనే పదం, “మెగిద్దో పర్వతం” అనే పదబంధం నుండి వచ్చింది కాబట్టి, అర్మగిద్దోను యుద్ధం మధ్య ప్రాచ్యంలోని ఒక పర్వతం మీద జరుగుతుందా?
లేదు. మెగిద్దో పర్వతం వంటి పర్వతమంటూ ఏదీ లేదు, ఇశ్రాయేలులోని ఆ స్థలంలో ఉన్న మైదానానికి ప్రక్కన ఎత్తుగా ఉన్న ఒక మట్టిదిబ్బ మాత్రమే ఉంది. ఆ స్థలంలో ‘భూరాజులు వారి సేనలు’ అంతా పట్టరు. దేవుని మహాయుద్ధం భూవ్యాప్తంగా జరుగుతుంది, అది యుద్ధాలన్నిటినీ అంతం చేస్తుంది. (ప్రకటన 16:14, 16; 19:19; కీర్తన 46:8, 9)—12/1, 4-7 పేజీలు.