కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎవరికి లోబడతారు—దేవునికా లేక మనుష్యులకా?

మీరు ఎవరికి లోబడతారు—దేవునికా లేక మనుష్యులకా?

మీరు ఎవరికి లోబడతారు​—⁠దేవునికా లేక మనుష్యులకా?

“మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను.”​—⁠అపొస్తలుల కార్యములు 5:⁠29.

యూదా ఉన్నత న్యాయస్థానపు న్యాయాధిపతులు చాలా కోపంగా ఉన్నారు. చెరసాలలో ఖైదీలు కనిపించడం లేదు. ఆ ఖైదీలు యేసుక్రీస్తు అపొస్తలులు, కొన్నివారాల క్రితమే ఆ ఉన్నత న్యాయస్థానం ఆయనకు మరణ శిక్ష విధించింది. ఇప్పుడు ఆ న్యాయస్థానమే ఆయన సన్నిహిత అనుచరులను విచారించడానికి సిద్ధంగా ఉంది. రక్షకభటులు వాళ్ళను న్యాయస్థానానికి తీసుకొచ్చేందుకు చెరసాలకు వెళ్లినప్పుడు, చెరసాల గదుల తలుపులకు తాళాలు ఉన్నా లోపల అవి ఖాళీగా ఉన్నట్లు వారు కనుగొన్నారు. ఆ అపొస్తలులు ఏ పని కారణంగానైతే ఖైదు చేయబడ్డారో ఆ పనినే చేస్తూ అంటే యేసుక్రీస్తు గురించి నిర్భయంగా ప్రజలకు బోధిస్తూ యెరూషలేము ఆలయంలో ఉన్నట్లు ఆ తర్వాత రక్షకభటులు తెలుసుకున్నారు. దానితో రక్షకభటులు తిన్నగా ఆలయానికి వెళ్లి, అపొస్తలులను మళ్లీ బంధించి న్యాయస్థానానికి తీసుకొచ్చారు.​—⁠అపొస్తలుల కార్యములు 5:17-27.

2 ఒక దేవదూత ఆ అపొస్తలులను చెరనుండి విడిపించాడు. ఆయన వారిని మరింత హింసలపాలు కాకుండా కాపాడడానికే విడిపించాడా? లేదు. యెరూషలేము నివాసులు యేసుక్రీస్తు గురించిన సువార్త వినాలన్న ఉద్దేశంతోనే వారిని విడిపించాడు. “ఈ జీవమును గూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని” ఆ దేవదూత అపొస్తలులను ఆదేశించాడు. (అపొస్తలుల కార్యములు 5:19, 20) అలా ఆలయ భటులు అక్కడకు వచ్చినప్పుడు, అపొస్తలులు విధేయతతో ఆ ఆదేశాన్ని అమలుచేస్తూ ఉండడం కనిపించింది.

3 దృఢ సంకల్పంగల ఆ ప్రచారకులలో ఇద్దరు, అంటే అపొస్తలులైన పేతురు, యోహానులు అంతకు ముందొకసారి కూడా న్యాయస్థానంలో ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తియైన యోసేపు కయప వారికి ఆ విషయాన్ని గట్టిగా గుర్తుచేస్తూ ఇలా అన్నాడు: “మీరు ఈ నామమునుబట్టి [యేసు నామమునుబట్టి] బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి[యున్నారు].” (అపొస్తలుల కార్యములు 5:​28) పేతురు, యోహానులు తిరిగి న్యాయస్థానంలో కనిపించడం చూసి కయప పెద్దగా ఆశ్చర్యపోయి ఉండడు. ప్రకటించకూడదని మొదటిసారి ఆదేశించబడినప్పుడు ఆ ఇద్దరు అపొస్తలులు “దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి; మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేము” అని జవాబిచ్చారు. ప్రాచీనకాల యిర్మీయా ప్రవక్తలాగే పేతురు, యోహానులు ప్రకటించమని తమకివ్వబడిన ఆజ్ఞను నెరవేర్చకుండా ఉండలేకపోయారు.​—⁠అపొస్తలుల కార్యములు 4:18-20; యిర్మీయా 20:9.

4 ఇప్పుడు పేతురు, యోహానులు మాత్రమే కాదు క్రొత్తగా ఎంపిక చేయబడిన మత్తీయతోసహా అపొస్తలులందరికీ న్యాయస్థానంలో తమ మనోభావాన్ని బాహాటంగా తెలియజేసే అవకాశం లభించింది. (అపొస్తలుల కార్యములు 1:21-26) వారు ప్రకటించకూడదని ఆదేశించబడినప్పుడు కూడా ధైర్యంగా “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను” అని సమాధానమిచ్చారు.​—⁠అపొస్తలుల కార్యములు 5:29.

ఎవరికి లోబడాలి దేవునికా లేక మనుష్యులకా?

5 అపొస్తలులు సాధారణంగా న్యాయస్థాన ఆదేశానికి ఎదురు తిరగని శాసనబద్ధులైన మనుష్యులు. అయితే, మనుష్యులకు ఎంత అధికారం ఉన్నప్పటికీ, దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించాలని ఆదేశించే అధికారం ఎవరికీ లేదు. యెహోవాయే “సర్వలోకములో మహోన్నతుడు.” (కీర్తన 83:18) ఆయన ‘సర్వలోకమునకు న్యాయము తీర్చువాడు’ మాత్రమే కాక, ఆయనే సర్వోన్నత శాసనకర్త మరియు యుగములకు రాజు. దేవుని ఆజ్ఞలను రద్దు చేసేందుకు ప్రయత్నించే ఎలాంటి న్యాయస్థాన ఆదేశమైనా అది దేవుని ఉద్దేశంలో చెల్లదు.​—⁠ఆదికాండము 18:25; యెషయా 33:22.

6 ఈ వాస్తవాన్ని అత్యుత్తమ న్యాయ నిపుణుల్లోని కొందరు గుర్తించారు. ఉదాహరణకు, బైబిల్లోని “ప్రకటిత శాసనానికి” విరుద్ధమైన ఏ మానవ చట్టాన్నీ అనుమతించకూడదని 18వ శతాబ్దపు ప్రఖ్యాత ఆంగ్ల న్యాయ నిపుణుడు విలియమ్‌ బ్లాక్‌స్టోన్‌ పేర్కొన్నాడు. అయితే యూదుల మహాసభ అపొస్తలులను ప్రకటించవద్దని ఆదేశించినప్పుడు అది ఆ వాస్తవిక అధికారపు హద్దులు మీరింది. కాబట్టి అపొస్తలులు ఆ ఆదేశానికి లోబడలేకపోయారు.

7 ప్రకటిస్తూ ఉండాలనే అపొస్తలుల నిర్ణయం ప్రధానయాజకులకు కోపం తెప్పించింది. కయపతోపాటు యాజకవర్గంలోని కొందరు సభ్యులు సద్దూకయ్యులు, వారు పునరుత్థానాన్ని నమ్మేవారుకాదు. (అపొస్తలుల కార్యములు 4:​1, 2; 5:17) కానీ యేసు మృతుల్లోనుండి పునరుత్థానం చేయబడ్డాడని అపొస్తలులు మానక నొక్కిచెబుతూ వచ్చారు. అంతేకాక, ఆ ప్రధానయాజకుల్లో కొందరు రోమా అధికారుల అనుగ్రహం సంపాదించుకునేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. యేసు న్యాయవిచారణ సమయంలో, యేసును తమ రాజుగా అంగీకరించే అవకాశం ఇవ్వబడినప్పుడు ఆ ప్రధానయాజకులు “కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు” అనేంతగా తెగించారు. (యోహాను 19:15) * యేసు పునరుత్థానం చేయబడ్డాడని నొక్కి చెప్పడమే కాక, ఆ అపొస్తలులు యేసు మినహా “మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము” అని బోధించారు. (అపొస్తలుల కార్యములు 2:​36; 4:12) ప్రజలు పునరుత్థానం చేయబడిన యేసును తమ నాయకునిగా చూడడం ఆరంభిస్తే, రోమీయుల ప్రాబల్యం పెరిగి యూదా నాయకులు ‘తమ స్థలాన్ని, జనాన్ని’ పోగొట్టుకుంటారని ఆ యాజకులు భయపడ్డారు.​—⁠యోహాను 11:48.

8 యేసుక్రీస్తు అపొస్తలులకు భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. యూదుల మహాసభ న్యాయాధిపతులు వారిని చంపించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 5:33) అయితే, పరిస్థితి ఊహించని విధంగా మలుపు తిరిగింది. ధర్మశాస్త్ర నిపుణుడైన గమలీయేలు ముందుకొచ్చి తొందరపడి చర్య తీసుకోవద్దని తోటివారిని హెచ్చరించాడు. ఆయన జ్ఞానయుక్తంగా ఇలా అన్నాడు: “ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును. దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు.” ఆ తర్వాత గమలీయేలు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెబుతూ ఇంకా ఇలా అన్నాడు: “మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.”​—⁠అపొస్తలుల కార్యములు 5:34, 38, 39.

9 ఊహించని రీతిలో ఆ న్యాయస్థానం గమలీయేలు సలహాను స్వీకరించింది. ఆ మహాసభ “అపొస్తలులను పిలిపించి కొట్టించి​—⁠యేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల” చేసింది. అయితే ఆ అపొస్తలులు భయపడలేదు గానీ, ప్రకటించమని దేవదూత ఇచ్చిన ఆజ్ఞకు లోబడేందుకే నిర్ణయించుకున్నారు. అలా వారు విడుదలైన తర్వాత, అపొస్తలులు “ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.” (అపొస్తలుల కార్యములు 5:40, 42) యెహోవా వారి ప్రయత్నాలను ఆశీర్వదించాడు. ఎంతమేరకు? “దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను.” నిజానికి, “యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.” (అపొస్తలుల కార్యములు 6:7) ప్రధానయాజకులకు అదెంత పెద్ద దెబ్బో కదా! ఆ అపొస్తలుల సేవ నిజంగా దేవుని నుండి కలిగినదనే రుజువు అంతకంతకు మరెక్కువగా స్పష్టమైంది!

దేవునికి వ్యతిరేకంగా పోరాడేవారు విజయం సాధించలేరు

10 మొదటి శతాబ్దంలో యూదామత ప్రధానయాజకులను రోమా అధికారులు నియమించేవారు. ధనవంతుడైన యోసేపు కయపను ఆ స్థానంలో వెలేరియస్‌ గ్రేటస్‌ నియమించగా, అతడు ఆ హోదాలో తనకుముందున్న అనేకులకన్నా ఎక్కువకాలం ఉన్నాడు. కయప తనకు ఆ ఘనత దేవుని జోక్యంతో కాదుగానీ, దౌత్యవేత్తగా తనకున్న నైపుణ్యంవల్ల, పిలాతుతో తనకున్న స్నేహాన్నిబట్టి లభించిందని భావించి ఉండవచ్చు. ఏదేమైనా, అతను మనుష్యులపై నమ్మకముంచడం తప్పని తేలింది. అపొస్తలులు మహాసభ ఎదుటకు వచ్చిన కేవలం మూడు సంవత్సరాల తర్వాత, కయప రోమా అధికారుల దగ్గర తన పరపతిని కోల్పోయి, ప్రధానయాజకునిగా ఉండకుండా తొలగించబడ్డాడు.

11 కయపను ఆ పదవినుండి తొలగించాలనే ఆదేశం పిలాతు పై అధికారియైన సిరియా అధిపతి లూక్యుస్‌ విటెల్యూస్‌ నుండి వచ్చింది, కయప సన్నిహిత స్నేహితుడైన పిలాతు దానిని నివారించలేకపోయాడు. నిజానికి, కయప పదవీచ్యుతుడైన ఒక సంవత్సరంలోపే, పిలాతు కూడా పదవినుండి తొలగించబడి తాను ఎదుర్కొంటున్న తీవ్ర ఆరోపణలకు సంజాయిషీ చెప్పేందుకు రోమాకు పిలిపించబడ్డాడు. కైసరుపై విశ్వాసముంచిన యూదా నాయకుల విషయానికొస్తే రోమన్లు నిజంగానే వారి ‘స్థలాన్ని, జనాంగాన్ని’ ఆక్రమించుకున్నారు. రోమా సైన్యం ఆలయంతోపాటు యూదుల మహాసభనూ యెరూషలేము నగరాన్ని పూర్తిగా నాశనం చేసిన సా.శ. 70లో ఇది సంభవించింది. ఈ విషయంలో కీర్తనకర్త పలికిన ఈ మాటలు ఎంతో సత్యమని నిరూపించబడ్డాయి: “రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి.”​—⁠యోహాను 11:48; కీర్తన 146:3.

12 అందుకే దేవుడు గొప్ప ఆధ్యాత్మిక ఆలయంలో పునరుత్థానుడైన యేసుక్రీస్తును ప్రధానయాజకునిగా నియమించాడు. ఆ నియామకాన్ని ఏ మానవుడూ రద్దు చేయలేడు. నిజానికి యేసు “మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను.” (హెబ్రీయులు 2:⁠9; 7:​17, 24; 9:11) అలాగే దేవుడు సజీవులకును, మృతులకును తీర్పుతీర్చే న్యాయాధిపతిగా కూడా యేసును నియమించాడు. (1 పేతురు 4:5) ఆ అధికారాన్నిబట్టి యేసు యోసేపు కయపకు, పొంతి పిలాతుకు భవిష్యత్తు జీవితం సాధ్యమా లేదా నిర్ణయిస్తాడు.​—⁠మత్తయి 23:33; అపొస్తలుల కార్యములు 24:​14-15.

ధైర్యవంతులైన నేటి రాజ్య ప్రచారకులు

13 మొదటి శతాబ్దంలోలాగే మన కాలంలో కూడా ‘దేవునితో పోరాడేవారు’ ఎక్కువగానే ఉన్నారు. (అపొస్తలుల కార్యములు 5:39) ఉదాహరణకు, జర్మనీలో అడాల్ఫ్‌ హిట్లర్‌ను తమ నాయకునిగా గుర్తించడానికి యెహోవాసాక్షులు నిరాకరించినప్పుడు, వారిని రూపుమాపుతానని హిట్లర్‌ శపథం చేశాడు. (మత్తయి 23:10) అతని హత్యా కుతంత్రపు దండు అందుకు సమర్థమైనదే అన్నట్లు కనిపించింది. వారు వేలాదిమంది సాక్షులను బంధించి, సామూహిక నిర్బంధ శిబిరాలకు పంపించడంలో కృతకృత్యులయ్యారు. వారు కొంతమంది సాక్షులను కూడా హతమార్చగలిగారు. కానీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలనే సాక్షుల దృఢ సంకల్పాన్ని వారు ఛేదించలేకపోయారు, ఒక గుంపుగా దేవుని సేవకులను వారు నిర్మూలించలేకపోయారు. ఈ క్రైస్తవుల పని మనుష్యులవల్ల కాదు దేవునివలననే కలిగింది, దేవుని పనిని వ్యర్థపరచడం అసాధ్యం. అరవై సంవత్సరాల తర్వాత, హిట్లర్‌ సామూహిక నిర్బంధ శిబిరాలనుండి ప్రాణాలతో బయటపడిన విశ్వాసులు ‘తమ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో’ ఇంకా యెహోవాను సేవిస్తూనే ఉన్నారు, అయితే హిట్లర్‌, అతని నాజీ పార్టీ కనుమరుగై, వారుచేసిన ఘోరకృత్యాలకు మాత్రమే గుర్తు చేసుకోబడుతున్నారు.​—⁠మత్తయి 22:37.

14 నాజీ ప్రయత్నాల తర్వాతి సంవత్సరాల్లో, యెహోవాకు ఆయన ప్రజలకు విరుద్ధంగా చేసిన పోరాటంలో ఇతరులూ విఫలమయ్యారు. ఐరోపాలోని చాలాదేశాల్లో కుత్సిత మత, రాజకీయ శక్తులు యెహోవాసాక్షులపై ‘ప్రమాదకరమైన మతభేదము’ అనే ముద్ర వేసేందుకు ప్రయత్నించారు. ఇలాంటి ఆరోపణే మొదటి శతాబ్దపు క్రైస్తవులపై మోపబడింది. (అపొస్తలుల కార్యములు 28:22) అయితే యురోపియన్‌ మానవ హక్కుల న్యాయస్థానం యెహోవాసాక్షులను ఒక మతభేదముగా కాదు, ఒక మతంగా గుర్తించింది. వ్యతిరేకులకు ఆ విషయం తెలుసు. అయినప్పటికీ, వారు సాక్షులపై అపనిందలు వేస్తూనే ఉన్నారు. నేరుగా చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం కారణంగా, ఈ క్రైస్తవుల్లో కొందరు తమ ఉద్యోగాలు కోల్పోయారు. సాక్షుల పిల్లలు పాఠశాలల్లో వేధింపులకు గురవుతున్నారు. భయపడిన భూస్వాములు అనేక సంవత్సరాలుగా సాక్షులు ఉపయోగిస్తున్న భవనాల ఒప్పందాలను రద్దుచేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ సంస్థలు యెహోవాసాక్షులనే నెపంతో కొందరికి పౌరసత్వాన్ని కూడా నిరాకరించాయి. అయిప్పటికీ, సాక్షులు బెదిరిపోవడం లేదు.

15 ఉదాహరణకు, ఫ్రాన్సులో ప్రజలు సాధారణంగా సమంజసమైనవారు, మర్యాదస్థులు. అయితే కొందరు వ్యతిరేకులు రాజ్య పనిని అడ్డగించడానికి గురిపెట్టిన చట్టాలను ప్రయోగించారు. అక్కడున్న యెహోవాసాక్షులు ఎలా ప్రతిస్పందించారు? ముందుకన్నా మరింత ఎక్కువగా తమ ప్రకటనా పనిని ఉద్ధృతం చేశారు. ఫలితంగా పులకరింపజేసే ఫలితాలు వారికి లభించాయి. (యాకోబు 4:7) అంతెందుకు, కేవలం ఆరు నెలల్లోనే ఆ దేశంలో బైబిలు అధ్యయనాల సంఖ్య అద్భుతరీతిలో 33 శాతం అభివృద్ధి సాధించింది! ఫ్రాన్సులో యథార్థహృదయులు సువార్తకు స్పందించడం అపవాదిని రెచ్చగొట్టి ఉంటుంది. (ప్రకటన 12:17) ఫ్రాన్సులోని మన తోటి క్రైస్తవులు యెషయా ప్రవక్త పలికిన ఈ మాటలు తమ విషయంలో నిజమని నిరూపించబడతాయనే నమ్మకంతో ఉన్నారు: “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు. న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసెదవు.”​—⁠యెషయా 54:17.

16 హింసించబడడాన్ని యెహోవాసాక్షులు ఏమీ ఆనందించరు. అయితే, క్రైస్తవులందరికీ దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడుతూ, తాము విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేరు, ఉండరు కూడా. మంచి పౌరులుగా ఉండేందుకు వారు కృషి చేస్తారు. అయితే దేవుని నియమానికి, మానవ చట్టానికి మధ్య విభేదం వచ్చినప్పుడు వారు దేవునికే లోబడాలి.

వారికి భయపడకండి

17 మన శత్రువులు చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు. వారు దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. కాబట్టి యేసు ఆజ్ఞకు అనుగుణంగా వారికి భయపడే బదులు, మనల్ని హింసించే వారికోసం మనం ప్రార్థిస్తాం. (మత్తయి 5:44) తార్సువాడైన సౌలులా అజ్ఞానంతో ఎవరైనా దేవుణ్ణి వ్యతిరేకిస్తుంటే, సత్యం విషయంలో యెహోవా దయతో వారి కళ్ళు తెరుస్తాడు. (2 కొరింథీయులు 4:4) సౌలు క్రైస్తవ అపొస్తలుడైన పౌలుగా మారి, తనకాలపు అధికారులవల్ల తీవ్ర కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ, ఆయన “అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడియుండవలెననియు, మనుష్యులందరియెడల [తమను తీవ్రంగా హింసించే వారియెడల కూడా] సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెనని” తోటి విశ్వాసులకు జ్ఞాపకం చేస్తూవచ్చాడు. (తీతు 3:1, 2) ఫ్రాన్సులోని, మరితర ప్రాంతాల్లోని యెహోవాసాక్షులు ఈ హితవును అన్వయించుకునేందుకు కృషి చేస్తారు.

18 ప్రవక్తయైన యిర్మీయాకు దేవుడు ఇలా చెప్పాడు: “విడిపించుటకు నేను నీకు తోడైయున్నాను.” (యిర్మీయా 1:8) నేటి హింసనుండి యెహోవా మనల్ని ఎలా విడిపించవచ్చు? నిష్పక్షపాతంగా వ్యవహరించే గమలీయేలు వంటి న్యాయాధిపతిని ఆయన నిలబెట్టవచ్చు. లేదా ఊహించని రీతిలో, అవినీతిపరుడైన విరోధియైన అధికారి స్థానంలో మరింత న్యాయంగా వ్యవహరించే అధికారి రావచ్చు. అయితే కొన్నిసార్లు, యెహోవా తన ప్రజలపై హింస కొనసాగేందుకు అనుమతించవచ్చు. (2 తిమోతి 3:12) మనం హింసించబడేందుకు దేవుడు అనుమతించినప్పుడు, ఆయన అన్ని సందర్భాల్లో ఆ హింసను భరించే శక్తిని కూడా మనకు అనుగ్రహిస్తాడు. (1 కొరింథీయులు 10:13) దేవుడు ఏమి అనుమతించినా, దాని తుది ఫలితమేమిటో మనకు తెలుసు: దేవుని ప్రజలకు విరుద్ధంగా పోరాడేవారు దేవునితోనే పోరాడుతున్నవారిగా ఉంటారు, అలా దేవునితో పోరాడేవారు నిలబడరు.

19 శ్రమలు కలుగుతాయని యేసు తన శిష్యులకు చెప్పాడు. (యోహాను 16:33) దీని దృష్ట్యా అపొస్తలుల కార్యములు 5:29లో నమోదైన ఈ మాటలు ఇప్పుడు మరింత సమయానుకూలంగా ఉన్నాయి: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను.” అందుకే, పులకరింపజేసే ఆ మాటలు 2006వ సంవత్సరానికి యెహోవాసాక్షుల వార్షిక వచనంగా తీసుకోబడ్డాయి. రాబోయే సంవత్సరమే కాక, యుగయుగాలు ఏమి ఎదురైనా దేవుడే మన పరిపాలకునిగా ఉండాలన్నదే మన దృఢ సంకల్పమై ఉండును గాక!

[అధస్సూచి]

^ పేరా 10 ప్రధానయాజకులు ఆ సందర్భంలో బహిరంగముగా మద్దతు పలికిన ఆ “కైసరు” రోమా చక్రవర్తియైన తిబెరి. అతడు అప్పటికే వేషధారిగా, నరహంతకునిగా తృణీకరించబడ్డాడు. తిబెరి నీచమైన లైంగిక కృత్యాలకూ పేరుగాంచాడు.​—⁠దానియేలు 11:15, 21.

మీరు జవాబివ్వగలరా?

వ్యతిరేకతను ఎదుర్కొన్న విధానంలో అపొస్తలులు మన కోసం ఎలాంటి ప్రోత్సాహకరమైన మాదిరిని ఉంచారు?

మనం ఎల్లప్పుడూ మనుష్యులకు కాదు దేవునికే ఎందుకు లోబడాలి?

మన వ్యతిరేకులు నిజానికి ఎవరికి విరుద్ధంగా పోరాడుతున్నారు?

హింసను సహించేవారికి ఎలాంటి ఫలితం లభిస్తుందని మనం ఎదురుచూడవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. (ఎ) ఈ అధ్యయన మూలవచనమేమిటి? (బి) అపొస్తలులు ఎందుకు బంధించబడ్డారు?

2. అపొస్తలులు ఏ పని చేయాలని దేవదూత ఆజ్ఞాపించాడు?

3, 4. (ఎ) ప్రకటించకూడదని ఆదేశించబడినప్పుడు పేతురు, యోహానులు ఎలా స్పందించారు? (బి) ఇతర అపొస్తలులు ఎలా స్పందించారు?

5, 6. న్యాయస్థాన ఆదేశానికి అపొస్తలులు ఎందుకు లోబడలేదు?

7. ప్రకటనా పని ప్రధానయాజకులకు ఎందుకు కోపం తెప్పించింది?

8. యూదుల మహాసభకు గమలీయేలు ఎలాంటి జ్ఞానయుక్తమైన సలహా ఇచ్చాడు?

9. అపొస్తలుల సేవ దేవుని నుండి కలిగినదని ఏది రుజువు చేస్తోంది?

10. మానవ దృక్కోణం నుండి చూస్తే, కయప తన హోదాకు ప్రమాదం లేదని ఎందుకు భావించి ఉండవచ్చు, అయితే అతని నమ్మకం ఎందుకు తప్పని తేలింది?

11. పొంతి పిలాతుకు, యూదా మత విధానానికి చివరకు ఏమి సంభవించింది, దీనినుండి మీరేమి అర్థం చేసుకున్నారు?

12. దేవునికి విధేయత చూపించడమే జ్ఞానయుక్త విధానమని యేసు విషయం ఎలా నిరూపిస్తోంది?

13. ఆధునిక కాలాల్లో ఏది మనుష్యుల పనిగా, ఏది దేవుని పనిగా నిరూపించబడింది? అలాగని మీకెలా తెలుసు?

14. (ఎ) దేవుని సేవకులపై అపనిందలు వేసేందుకు వ్యతిరేకులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, దాని ఫలితమేమిటి? (బి) అలాంటి ప్రయత్నాలు దేవుని ప్రజలకు ఏమైనా శాశ్వత హాని కలిగిస్తాయా? (హెబ్రీయులు 13:5, 6)

15, 16. ఫ్రాన్సులోని యెహోవాసాక్షులు తమ క్రైస్తవ పనికి వ్యతిరేకత వచ్చినప్పుడు ఎలా స్పందించారు, వారెందుకు మానక ప్రకటిస్తున్నారు?

17. (ఎ) మన శత్రువులకు మనమెందుకు భయపడకూడదు? (బి) హింసించేవారిపట్ల మన దృక్పథమెలా ఉండాలి?

18. (ఎ) యెహోవా ఏయే విధాలుగా తన ప్రజలను విడిపించవచ్చు? (బి) తుది ఫలితం ఎలా ఉంటుంది?

19. రాబోయే 2006వ సంవత్సరపు వార్షిక వచనమేమిటి, అది ఎందుకు సముచితమైనది?

[23వ పేజీలోని బ్లర్బ్‌]

2006వ సంవత్సరపు వార్షిక వచనం: “మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను.”​—⁠అపొస్తలుల కార్యములు 5:29.

[19వ పేజీలోని చిత్రం]

“మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను”

[21వ పేజీలోని చిత్రం]

కయప దేవునిపై కాక, మనుష్యులపై తన నమ్మకముంచాడు