మెక్సికోలోని చైనీయులకు సహాయం చేయడం
మెక్సికోలోని చైనీయులకు సహాయం చేయడం
“ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో పదేసిమంది యొక యూదుని చెంగుపట్టుకొని—దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు.” (జెకర్యా 8:23) ఈ రమ్యమైన ప్రవచనం నేడు ప్రపంచవ్యాప్తంగా నెరవేరుతోంది. “ఆ యా భాషలు మాటలాడు అన్యజనులలో” నుండి వచ్చిన ప్రజలు యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయుల చెంగు పట్టుకుంటున్నారు. యెహోవాసాక్షులు ఈ ప్రవచన నెరవేర్పులో ఎంతో ఆసక్తి కలిగివున్నారు. ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిలో భాగం వహించడానికి వారిలో చాలామంది మరో భాష నేర్చుకుంటున్నారు.
మెక్సికోలోని యెహోవాసాక్షులు కూడా అలాగే చేస్తున్నారు. మెక్సికోలో 30,000 మంది చైనీస్ భాష మాట్లాడేవారున్నారని అంచనా వేయబడింది. వారిలో 15 మంది 2003లో, మెక్సికో నగరంలో జరిగిన క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినానికి హాజరయ్యారు. అలా మెక్సికోలోని సాక్షులు చైనీస్ భాష మాట్లాడేవారిలో ఆధ్యాత్మిక అభివృద్ధి జరిగే అవకాశముందని గ్రహించారు. చైనీస్ భాష మాట్లాడే ఈ ప్రజలకు ప్రకటించడానికి ఎక్కువమంది ప్రచారకులు ఉండేలా, మెక్సికోలోని సాక్షులకు మాండరిన్ చైనీస్ భాషలో సరళంగా సువార్త ప్రకటించడాన్ని నేర్పేందుకు మూడు నెలల కోర్సు ప్రారంభించబడింది. మొత్తం 25 మంది సాక్షులు ఆ కోర్సులో పాల్గొన్నారు. అది ముగిసినప్పుడు, మెక్సికో నగరంలో ఉన్న మాండరిన్ మాట్లాడే సమాజానికి చెందిన ఒక అధికారి ఆ కోర్సు స్నాతకోత్సవానికి హాజరయ్యాడంటే, చైనీస్ భాష మాట్లాడే ప్రజలపై ఆ తరగతి చూపించిన ప్రభావం స్పష్టమవుతోంది. స్థానిక చైనా సంస్థ, తాము నేర్చుకున్న చైనీస్ భాషను మరింత మెరుగుపరచుకునేందుకు విదేశాలకు వెళ్ళేలా ముగ్గురు విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇచ్చింది.
ఆ భాషా కోర్సులో ఆచరణాత్మక తర్ఫీదు కూడా ఒక భాగం. కొన్ని సరళమైన పదబంధాలు నేర్చుకున్న తర్వాత విద్యార్థులు వెంటనే మెక్సికో నగరంలోని వ్యాపార స్థలంలో చైనీస్ భాషలో ప్రకటించడం మొదలుపెట్టారు. ఆసక్తిగల ఆ విద్యార్థులు 21 బైబిలు అధ్యయనాలు ప్రారంభించారు. చైనీస్ భాషలోని దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషుర్ ఎంతో సహాయపడింది, అది ఇంగ్లీషు అక్షరాల్లో వ్రాయబడి ఉంటుంది, దాన్ని పిన్యిన్ అంటారు.
చైనీస్ భాషలో అప్పుడే కోర్సు ప్రారంభించిన సాక్షులు బైబిలు అధ్యయనాలు ఎలా నిర్వహించారు? మొదట్లో వారు పేరావైపు, ఆ తర్వాత ప్రశ్నవైపు చూపించి “చిన్ డూ [దయచేసి చదవండి]” అని మాత్రమే చెప్పగలిగేవారు. అవతలి వ్యక్తి చదివి, చైనీస్ భాషలో జవాబు చెప్పిన తర్వాత, వారు “షీ షీ [కృతజ్ఞతలు]” అని, “హెన్ హావో [చాలా బాగుంది]” అని చెప్పేవారు.
నామకార్థ క్రైస్తవురాలైన ఒక స్త్రీతో అలా బైబిలు అధ్యయనం ప్రారంభించబడింది. మూడవ పాఠం ముగిసిన తర్వాత, సమాచారం ఆ స్త్రీకి అర్థమవుతోందో లేదో అని ఆ సాక్షికి అనుమానం వచ్చింది. కాబట్టి ఆ సాక్షి చైనీస్
భాష మాట్లాడే ఒక సహోదరుడ్ని తనతో తీసుకువెళ్ళింది. ఏమైనా ప్రశ్నలున్నాయా అని ఆ సాక్షి ఆ స్త్రీని అడిగినప్పుడు, “బాప్తిస్మం తీసుకోవాలంటే నాకు ఈత వచ్చి ఉండాలా?” అని ఆమె అడిగింది.ఎంతోకాలం గడవక ముందే ఒక సంఘ పుస్తక అధ్యయనం ప్రారంభించబడింది, దానికి సగటున చైనీస్ భాష మాట్లాడే 9 మంది వ్యక్తులు, 23 మంది స్థానిక మెక్సికన్ సాక్షులు హాజరయ్యేవారు. అలా హాజరవుతున్నవారిలో చైనీయుడైన ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయనకు తన రోగుల్లో ఒకరి నుండి స్పానిష్ భాషలో కావలికోట, తేజరిల్లు! అందుతుండేవి. ఆయన స్పానిష్ చదువుకోలేదు కాబట్టి, ఆయన ఎవరితోనో కొన్ని వాక్యాలు అనువాదం చేయించుకున్నాడు. ఆ పత్రికలు బైబిలు సంబంధితమైనవని గ్రహించి, చైనీస్ భాషలో పత్రికలు తీసుకురావడం వీలవుతుందా అని ఆయన ఆ రోగిని అడిగాడు. ఆమె అలాగే తీసుకువచ్చింది, మెక్సికోలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయం ద్వారా, చైనీస్ భాష మాట్లాడే సాక్షి ఆయనను కలిసే ఏర్పాట్లు చేయబడ్డాయి. చైనాలో ఉన్న ఆయన తల్లి దగ్గర ఒక బైబిలు ఉండేది, ఆ డాక్టర్ అది చదివి ఆనందించేవాడు. ఆయన మెక్సికోకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నప్పుడు, బైబిలు చదవడం మానవద్దని ఆయన తల్లి ఆయనకు చెప్పింది. బైబిలులోని దేవుని గురించి మరింత తెలుసుకోవడానికి తనకు సహాయం చేయగలవారి కోసం ఆయన ప్రార్థించాడు. “దేవుడు నా ప్రార్థన ఆలకించాడు!” అని ఆయన బిగ్గరగా అన్నాడు.
పుస్తక అధ్యయనానికి ఒక చైనీయుల కుటుంబం కూడా వచ్చేది, వాళ్లు ఒక మెక్సికన్ స్త్రీ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు, ఆ స్త్రీ యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తోంది. ఆ చైనీయుల కుటుంబానికి స్పానిష్ అంతగా అర్థం కాకపోయినా, వాళ్ళు బైబిలు చర్చలకు కూర్చొనేవారు. కొంతకాలానికి, ఆ కుటుంబం చైనీస్ భాషలో ఏవైనా ప్రచురణలు ఉన్నాయా అని అధ్యయనం చేస్తున్న సాక్షిని అడిగింది. త్వరలోనే వారితో చైనీస్ భాషలో బైబిలు అధ్యయనం ప్రారంభమైంది. ఎంతోకాలం గడవక ముందే, ఆ కుటుంబం తమ స్వదేశస్థులకు ప్రకటించాలని, తమ జీవితాలను యెహోవాకు సమర్పించుకోవాలని ఉందనే తమ కోరిక తెలియజేశారు.
చైనీస్ భాష, నేర్చుకోవడానికి చాలా కష్టమైన భాష అన్నది నిజమే. అయితే పై అనుభవాల్లో చూసినట్లుగా, యెహోవా సహాయంతో చైనీస్ భాషతో సహా అనేక భాషల ప్రజలు మెక్సికోలోను, భూమ్మీది ఇతర ప్రాంతాల్లోను దేవుని చిత్తం గురించి తెలుసుకుంటున్నారు.
[17వ పేజీలోని చిత్రం]
మెక్సికో నగరంలో చైనీస్ భాషా తరగతి
[18వ పేజీలోని చిత్రం]
చైనీస్ భాషలో బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్న మెక్సికో సాక్షి
[18వ పేజీలోని చిత్రం]
మెక్సికో నగరంలో, చైనీస్ భాషలో ఇంటింటి పరిచర్య