కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ధ్యానించడం ఆహ్లాదకరమైన విషయంగా చేసుకోండి

ధ్యానించడం ఆహ్లాదకరమైన విషయంగా చేసుకోండి

ధ్యానించడం ఆహ్లాదకరమైన విషయంగా చేసుకోండి

ధ్యానించడం అనే భావనే కొంతమందిని భయపెట్టవచ్చు. వారు ధ్యానించడాన్ని తీవ్రమైన ఏకాగ్రత అవసరమైన కష్టమైన పనిగా దృష్టించవచ్చు. ధ్యానించడాన్ని అశ్రద్ధ చేస్తున్నందుకు అలాంటివారిలో అపరాధ భావాలు కూడా ఏర్పడుతుండవచ్చు, ప్రత్యేకంగా దానికున్న ప్రాముఖ్యతను చదువుతున్నప్పుడు వారిలో అలాంటి భావాలు కలుగవచ్చు. (ఫిలిప్పీయులు 4:⁠8) అయితే యెహోవా గురించి, ఆయన చక్కని లక్షణాల గురించి, ఆయన సాధించిన అద్భుతమైన వాటి గురించి, ఆయన నియమాల గురించి, ఆయన అద్భుతమైన సంకల్పం గురించి మనం తెలుసుకున్న సత్యాలను నిశ్శబ్దంగా ధ్యానించడం ద్వారా, మన సమయాన్ని ఎంతో ఆహ్లాదకరమైన రీతిలో వెచ్చించవచ్చు, మన సమయాన్ని అలా వెచ్చించాలి కూడా. ఎందుకు?

యెహోవా దేవుడు విశ్వ సర్వోన్నత పరిపాలకుడు, ఆయన తన గొప్ప సంకల్ప నెరవేర్పు కోసం చురుగ్గా పని చేస్తున్నాడు. (యోహాను 5:​17) అయినా కూడా ఆయన ప్రతీ ఒక్క ఆరాధకుని నిశ్శబ్ద తలంపుల విషయంలో శ్రద్ధతో ఉన్నాడు. కీర్తనకర్తయైన దావీదుకు ఇది తెలుసు కాబట్టే, ఆయన దైవ ప్రేరేపణతో ఇలా వ్రాశాడు: “యెహోవా, నీవు నన్ను పరీక్షించావు, నన్ను గూర్చి నీకు అంతా తెలుసు. నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు. దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.”​—⁠కీర్తన 139:​1, 2, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

కీర్తనకర్త పలికిన ఆ మాటలు నిరుత్సాహాన్ని కలిగించే విధంగా ఉన్నాయని ఒకవ్యక్తి మొదట్లో భావించవచ్చు. ఆయన ఇలా తర్కించవచ్చు, ‘దేవుడు “దూరంలో ఉన్నా” ఆయన నా మనసులో వచ్చే చెడు తలంపులన్నిటినీ గమనిస్తాడు.’ అవును, ఆయన మన చెడు తలంపులను గమనిస్తాడని గుర్తించడం మనకు ప్రయోజనకరం. మనం చెడు తలంపులతో పోరాడడానికి అది మనకు సహాయం చేస్తుంది, మనకు అలాంటి తలంపులు ఉంటే ఆయన యేసు విమోచన క్రయధన బలిమీద మనకున్న విశ్వాసం ఆధారంగా మనల్ని క్షమిస్తాడనే నమ్మకంతో వాటిని దేవుని ఎదుట ఒప్పుకోవడానికి అది మనకు సహాయం చేస్తుంది. (1 యోహాను 1:8, 9; 2:​1, 2) అదే సమయంలో, యెహోవా తన ఆరాధకులను అనుకూలమైన దృక్పథంతో పరిశీలిస్తాడనేది మనం గుర్తుంచుకోవాలి. మనం ఆయన గురించి కృతజ్ఞతాపూర్వకంగా ఆలోచిస్తున్నప్పుడు ఆయన శ్రద్ధ వహిస్తాడు.

యెహోవా లక్షలాదిమంది తన ఆరాధకుల మంచి తలంపులన్నిటినీ నిజంగా గమనిస్తాడా? అని మీరు అడగవచ్చు. ఆయన తప్పక గమనిస్తాడు. యెహోవా చిన్న పిచ్చుకలను కూడా గమనిస్తాడని యేసు చెప్పినప్పుడు, యెహోవాకు మనపట్ల ఉన్న శ్రద్ధను ఆయన నొక్కిచెప్పాడు, ఆయన ఇంకా ఇలా చెప్పాడు: “మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.” (లూకా 12:​6, 7) పిచ్చుకలు యెహోవా గురించి ఆలోచించలేవు. అయినా వాటి గురించి ఆయన శ్రద్ధ చూపిస్తున్నాడంటే మనపట్ల ఆయనకు ఇంకా ఎంత శ్రద్ధ ఉంటుందో కదా, మనం ఆయన గురించి ఆలోచించినప్పుడు ఆయన ఎంతగా ఆనందిస్తాడో కదా! అవును, దావీదులాగే మనం కూడా నమ్మకంతో ఇలా ప్రార్థించవచ్చు: ‘యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారమగును గాక.’​—⁠కీర్తన 19:​14.

యెహోవా విశ్వసనీయులైన తన ఆరాధకులు ధ్యానించే విషయాలపట్ల నిజంగా శ్రద్ధవహిస్తాడు అని నిరూపించే మరో రుజువు మలాకీ ప్రవక్త పలికిన ప్రేరేపిత వాక్యాల్లో కనిపిస్తుంది. ఆయన మన కాలాల గురించి మాట్లాడుతూ ఇలా ప్రవచించాడు: ‘అప్పుడు, యెహోవాయందు భయభక్తులుగలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.’ (మలాకీ 3:​16) మనం యెహోవా గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన ‘చెవియొగ్గి ఆలకిస్తాడు’ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవడం దేవుని గురించిన మన ధ్యానాన్ని నిజంగా ఆహ్లాదకరమైనదిగా చేస్తుంది. కాబట్టి, “నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును” అని వ్రాసిన కీర్తనకర్త మాటలతో మనం ఏకీభవిద్దాం.​—⁠కీర్తన 77:​12.