నీతిని వెదకడం మనల్ని కాపాడుతుంది
నీతిని వెదకడం మనల్ని కాపాడుతుంది
“[దేవుని] నీతిని మొదట వెదకుడి.”—మత్తయి 6:33.
ఆసియాలో ఒక యౌవన క్రైస్తవ స్త్రీ ప్రభుత్వ కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసేది. త్వరగా పనికి వస్తూ ఉద్యోగ సమయాన్ని వృధాచేయకుండా ఆమె చాలా జాగ్రత్తగా ఉండేది. అయితే, ఆమెది పర్మనెంట్ ఉద్యోగం కానందువల్ల అది పునర్విచారణకు వచ్చింది. ఆ యువతి పనిచేస్తున్న విభాగ అధిపతి తన కోరిక తీరిస్తే ఆమె ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయడమే కాక, ఆమెకు పదోన్నతి కూడా కల్పిస్తానని అన్నాడు. తన ఉద్యోగం పోతుందని తెలిసినా ఆమె దానికి పూర్తిగా నిరాకరించింది.
2 ఆ యౌవన క్రైస్తవ స్త్రీకి వాస్తవిక దృక్పథం లేదని అర్థమా? ఎంతమాత్రం కాదు, ఆమె “[దేవుని] నీతిని మొదట వెదకుడి” అని చెప్పిన యేసు మాటలను జాగ్రత్తగా అనుసరిస్తోంది. (మత్తయి 6:33) లైంగిక దుర్నీతికి పాల్పడి ప్రయోజనం పొందడంకన్నా నీతి సూత్రాలను అనుసరించడం ఆమెకు మరెంతో ప్రాముఖ్యం.—1 కొరింథీయులు 6:18.
నీతియొక్క ప్రాముఖ్యత
3 “నీతి” నైతిక యథార్థతను, నిజాయితీని సూచిస్తుంది. బైబిల్లోని గ్రీకు, హీబ్రూ పదాలకు “నైతికత” లేదా “సత్యవర్తన” అనే అర్థాలున్నాయి. ఇది ఒక వ్యక్తి తన సొంత ప్రమాణాల ప్రకారం తనను తాను బేరీజు వేసుకునే స్వనీతికాదు. (లూకా 16:15) అది యెహోవా ప్రమాణాలకు అనుగుణంగావున్న సత్యవర్తన. అది దేవుని నీతి.—రోమీయులు 1:17; 3:21.
4 నీతి ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే, ‘నీతికి ఆధారమగు దేవుడైన’ యెహోవా నీతిని అభ్యసించినప్పుడు తన ప్రజలపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. (కీర్తన 4:1; సామెతలు 2:20-22; హబక్కూకు 1:13) అవినీతిపరుల్లో ఏ ఒక్కరూ ఆయనతో సన్నిహిత సంబంధం కలిగివుండలేరు. (సామెతలు 15:8) అందుకే అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇలా ఉద్బోధించాడు: ‘నీవు యౌవనేచ్ఛలనుండి పారిపోయి’ ఇతర ఆవశ్యక లక్షణాలతోపాటు ‘నీతిని వెంటాడుము.’ (2 తిమోతి 2:22) అందుకే మన ఆధ్యాత్మిక కవచపు వివిధ భాగాలను పేర్కొన్నప్పుడు పౌలు ‘నీతియను మైమరుపును’ కూడా వాటిలో చేర్చాడు.—ఎఫెసీయులు 6:14.
5 నిజమే, ఏ మానవుడూ పూర్తి భావంలో నీతిమంతునిగా ఉండలేడు. జన్మతః అందరూ ఆదామునుండి అపరిపూర్ణతను స్వాస్థ్యంగా పొందారు, కాబట్టి అందరూ పాపులు, అనీతిమంతులు. అయినప్పటికీ మనం నీతిని వెదకాలని యేసు చెప్పాడు. అదెలా సాధ్యం? అది సాధ్యమే, ఎందుకంటే యేసు మనకోసం తన పరిపూర్ణ జీవితాన్ని విమోచన క్రయధనంగా అర్పించాడు. కాబట్టి మనం ఆ బలిని విశ్వసిస్తే యెహోవా మన పాపాలను క్షమించడానికి సుముఖంగా ఉన్నాడు. (మత్తయి 20:28; యోహాను 3:16; రోమీయులు 5:8, 9, 12, 18) దాని ఆధారంగా మనం యెహోవా నీతి ప్రమాణాలను నేర్చుకుంటూ వాటిని పాటించేందుకు శాయశక్తులా కృషిచేస్తే అంటే మన బలహీనతలను అధిగమించేందుకు సహాయం కోసం ప్రార్థిస్తే యెహోవా మన ఆరాధనను అంగీకరిస్తాడు. (కీర్తన 1:6; రోమీయులు 7:19-25; ప్రకటన 7:9, 14) అదెంత ఓదార్పుకరమో కదా!
అవినీతి నిండిన లోకంలో నీతిగా ఉండడం
6 యేసు శిష్యులు “భూదిగంతముల వరకు” ఆయనకు సాక్షులై ఉండాలనే ఆజ్ఞను పొందినప్పుడు, వారు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నారు. (అపొస్తలుల కార్యములు 1:8) వారి నియమిత ప్రాంతమంతా ‘దుష్టుడైన సాతాను ఆధీనంలో’ ఉంది. (1 యోహాను 5:19) అతడు పురికొల్పే దుష్ట స్వభావంతో ఆ లోకం నిండిపోయింది, కాబట్టి ఆ క్రైస్తవులు కలుషిత ప్రభావానికి గురవుతారు. (ఎఫెసీయులు 2:2) వారికి లోకం ప్రమాదకరమైన స్థలంగా ఉంటుంది. కేవలం దేవుని రాజ్యాన్ని వెదకడం ద్వారానే వారు అవిచ్ఛిన యథార్థతతో సహించగలరు. చాలామంది సహించారు, అయితే కొద్దిమంది మాత్రం ‘నీతిమార్గం నుండి’ ప్రక్కకు మళ్లించబడ్డారు.—సామెతలు 12:28; 2 తిమోతి 4:10.
7 లోకం నేడు క్రైస్తవులకు సురక్షితమైనదిగా ఉందా? ఎంతమాత్రం లేదు! నిజానికి అది మొదటి శతాబ్దంకన్నా మరింత అనీతితో నిండిపోయింది. అంతేకాక, సాతాను భూమ్మీదికి పడద్రోయబడి, “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన” అభిషిక్త క్రైస్తవులపై క్రూరమైన యుద్ధం చేస్తున్నాడు. (ప్రకటన 12:12, 17) ఆ ‘సంతానానికి’ మద్దతిచ్చే వారిమీద కూడా సాతాను దాడి చేస్తున్నాడు. క్రైస్తవులు లోకంలోని ఈ పరిస్థితిని తప్పించుకోలేరు. లోక సంబంధులు కాకుండానే, వారు ఈ లోకంలో జీవించాలి. (యోహాను 17:15, 16) సరైన మనోవైఖరి గలవారిని వెదకి క్రీస్తు శిష్యులయ్యేందుకు వారికి బోధించడానికి వారు లోకంలో ప్రకటించాలి. (మత్తయి 24:14; 28:19, 20) క్రైస్తవులు ఈ లోకపు అవినీతి ప్రభావాలను పూర్తిగా తప్పించుకోలేరు కాబట్టి, వారు వాటిని ఎదిరించాలి. ఆ ప్రభావాల్లో నాలిగింటిని మనం పరిశీలిద్దాం.
లైంగిక దుర్నీతి అనే ఉరి
8 అరణ్యంలో సంచరించిన 40 సంవత్సరాల ముగింపులో, ఇశ్రాయేలీయుల్లో చాలామంది నీతి మార్గాన్నుండి ప్రక్కకు మళ్లిపోయారు. విడుదలకు సంబంధించి యెహోవా చేసిన అనేక కార్యాలను వారు కళ్లారా చూశారు, త్వరలోనే వారు వాగ్దానదేశంలోకి ప్రవేశిస్తారు. అయితే, ఆ కీలక దశలో వారు మోయాబీయుల దేవతలను సేవించడం ఆరంభించారు. ఎందుకు? వారు ‘శరీరాశకు’ లొంగిపోయారు. (1 యోహాను 2:16) నివేదిక ఇలా చెబుతోంది: “ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి.”—సంఖ్యాకాండము 25:1.
9 అజాగ్రత్తపరులను తప్పుడు కోరికలు ఎలా పాడు చేయగలవో ఆ సంఘటన నిరూపిస్తోంది. లైంగిక దుర్నీతి విస్తృత రీతిలో అంగీకృత జీవన శైలిగా దృష్టించబడుతోంది కాబట్టి, మనమా సంఘటన నుండి నేర్చుకోవాలి. (1 కొరింథీయులు 10:6, 8) అమెరికా నుండి వచ్చిన ఒక నివేదిక ఇలా చెబుతోంది: “1970కి ముందు అమెరికా రాష్ట్రాల్లో ఇద్దరు కలిసి ఉండడం [అవివాహిత జంటలు కలిసి జీవించడం] చట్టవిరుద్ధమైనదిగా పరిగణించబడేది. ఇప్పుడది వాడుకగా తయారైంది. మొదటిసారి వివాహం చేసుకునే దంపతుల్లో సగంకన్నా ఎక్కువమంది తమ వివాహానికి ముందు కలిసి ఉంటున్నారు.” ఇలాంటి అనైతిక అభ్యాసాలు ఒక దేశానికే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అలా జరుగుతోంది, విచారకరంగా కొందరు క్రైస్తవులు ఆ పోకడ అనుసరించి క్రైస్తవ సంఘంలో తమ స్థానాన్ని కూడా పోగొట్టుకున్నారు.—1 కొరింథీయులు 5:11.
10 అంతేకాక, లైంగిక దుర్నీతిని పురికొల్పే ప్రచారం అన్నిచోట్లా ఉన్నట్లు కనిపిస్తోంది. యౌవనస్థులు వివాహానికి ముందే లైంగిక సంబంధం కలిగివుండడం
పూర్తిగా ఆమోదయోగ్యమని సినిమాలు, టీవీ కార్యక్రమాలు సూచిస్తున్నాయి. సలింగ సంయోగ సంబంధాలు సాధారణమే అన్నట్లు చూపించబడుతున్నాయి. అనేక కార్యక్రమాలు అంతకంతకూ విపరీతమైన లైంగికత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. విశృంఖలమైన లైంగిక చిత్రాలు ఇంటర్నెట్‌లో కూడా సులభంగా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, ఏడు సంవత్సరాల పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చి, తన పాఠశాల స్నేహితుడొకడు, నగ్నంగా ఉన్న స్త్రీలు లైంగిక క్రియలు జరిగిస్తుండడాన్ని చూపిస్తున్న ఇంటర్నెట్ వెబ్‌సైట్‌ను చూసినట్లు చెప్పాడని తన తండ్రికి ఉత్సాహంగా వివరించాడని ఒక వార్తాపత్రిక విలేఖరి నివేదించాడు. ఆ తండ్రయితే అదిరిపడ్డాడు గానీ, అలాంటి వెబ్‌సైట్లు చూసే ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్తున్నారు? తమ పిల్లలు ఎలాంటి వీడియో గేములు ఆడుతున్నారో ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? దానికితోడు, ప్రాచుర్యం పొందిన అనేక ఆటల్లో జుగుప్సాకరమైన లైంగిక దుర్నీతితోపాటు దయ్యాలకు సంబంధించిన, దౌర్జన్యపూరితమైన అంశాలు ఉంటున్నాయి.11 అలాంటి నీచమైన “వినోదాన్ని” ఒక కుటుంబం ఎలా నిరోధించవచ్చు? దేవుని నీతిని మొదట వెదకుతూ, అనైతికమైనదేనిలోనైనా పాల్గొనకుండా ఉండడం ద్వారానే నిరోధించవచ్చు. (2 కొరింథీయులు 6:14; ఎఫెసీయులు 5:3) తమ పిల్లల కార్యకలాపాలను జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ తమ పిల్లల్లో యెహోవాపట్ల ఆయన నైతిక ప్రమాణాలపట్ల ప్రేమను పెంపొందింపజేసుకునే తల్లిదండ్రులు అశ్లీల వీడియో గేములను, దుర్నీతికరమైన సినిమాలను, ఇతర అనైతిక ప్రలోభాలను నిరోధించేందుకు వారిని శక్తిమంతులను చేస్తారు.—ద్వితీయోపదేశకాండము 6:4-9. *
సామాజిక ఒత్తిడిలోని ప్రమాదం
12 ఆసియా మైనరులోని లుస్త్రలో ఉన్నప్పుడు పౌలు అద్భుతరీతిలో ఒక వ్యక్తిని బాగుచేశాడు. ఆ వృత్తాంతమిలా చెబుతోంది: “జనసమూహములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో—దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగి వచ్చి యున్నారని కేకలువేసి, బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగియైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి.” (అపొస్తలుల కార్యములు 14:11, 12) తర్వాత అదే జనసమూహము పౌలును, బర్నబాను చంపాలని చూశారు. (అపొస్తలుల కార్యములు 14:19) ఆ ప్రజలు సామాజిక ఒత్తిడికి లొంగిపోయారనడం స్పష్టమే. ఆ ప్రాంతంలోని కొందరు క్రైస్తవులైనప్పుడు, వారింకా మూఢనమ్మకాలను విడిచిపెట్టలేదన్నట్లుగా కనిపిస్తోంది. పౌలు, కొలొస్సీలోని క్రైస్తవులకు తాను వ్రాసిన పత్రికలో, “దేవదూతారాధన” విషయంలో హెచ్చరించాడు.—కొలొస్సయులు 2:18.
13 నేడు నిజ క్రైస్తవులు కూడా అదేవిధంగా క్రైస్తవ ప్రమాణాలను ఉల్లంఘించే అబద్ధమత తలంపులపై ఆధారపడి, ప్రజాదరణ పొందిన ఆచారాలను త్యజించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు, కొన్ని దేశాల్లో జనన మరణాల సంబంధిత అనేక ఆచారాలు, మరణాన్ని తప్పించుకొనే ఆత్మ మనలో ఉందనే అబద్ధం మీద ఆధారపడి వాడుకలోవున్నాయి. (ప్రసంగి 9:5, 10) కొన్ని దేశాల్లో అమ్మాయిలను బలవంతంగా ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్‌కు గురిచేసే ఆచారం ఉంది. * ఇది క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఋణపడివున్న ప్రేమపూర్వక శ్రద్ధకు విరుద్ధంగావున్న క్రూరమైన అనవసరమైన ఆచారం. (ద్వితీయోపదేశకాండము 6:6, 7; ఎఫెసీయులు 6:4) క్రైస్తవులు సామాజిక ఒత్తిళ్ళను ఎదిరించి, అలాంటి ఆచారాలకు ఎలా దూరంగా ఉండవచ్చు? యెహోవాపై పూర్తి నమ్మకముంచడం ద్వారానే. (కీర్తన 31:6) నీవే “నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడు” అని హృదయపూర్వకంగా తనకు చెప్పేవారిని నీతిమంతుడైన దేవుడు బలపర్చి, వారిపై శ్రద్ధకనుపరుస్తాడు.—కీర్తన 91:2; సామెతలు 29:25.
యెహోవాను మర్చిపోకండి
14 ఇశ్రాయేలీయులు ఇక వాగ్దానదేశంలోకి ప్రవేశిస్తారనగా యెహోవా తనను మర్చిపోవద్దని వారిని హెచ్చరించాడు. ఆయనిలా చెప్పాడు: “నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి యిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు నీ గొఱ్ఱె మేకలును వృద్ధియై నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి . . . నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో.”—ద్వితీయోపదేశకాండము 8:11-14.
15 నేడుకూడా అలాగే జరిగే అవకాశం ఉందా? అవును, మనకు తప్పుడు ప్రాధాన్యతలుంటే అలాగే జరిగే అవకాశం ఉంది. అయితే, దేవుని నీతిని మనం మొదట వెదకితే స్వచ్ఛారాధన మన జీవితాల్లో అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా ఉంటుంది. పౌలు మనల్ని ప్రోత్సహించినట్లుగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన పరిచర్యలో అత్యవసర భావాన్ని కలిగివుంటాము. (కొలొస్సయులు 4:5; 2 తిమోతి 4:2) వినోదంకన్నా లేదా ఆనందంగా గడపడానికన్నా కూటాలకు హాజరవడానికి, క్షేత్రసేవకు తక్కువ ప్రాధాన్యతనిస్తుంటే, మన జీవితాల్లో యెహోవాకు ప్రథమస్థానం లేదన్న భావంలో ఆయనను మర్చిపోతాము. అంత్యదినాల్లో మనుష్యులు ‘దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారిగా’ ఉంటారని పౌలు చెప్పాడు. (2 తిమోతి 3:4) యథార్థ క్రైస్తవులు తాము అలాంటి ఆలోచనా ప్రభావం క్రిందికి రాలేదని రూఢీపర్చుకోవడానికి తమనుతాము క్రమంగా పరీక్షించుకుంటారు.—2 కొరింథీయులు 13:5.
స్వేచ్ఛాస్వభావం విషయంలో జాగ్రత్తగా ఉండండి
16 ఏదెనులో, హవ్వ స్వార్థపూరితంగా స్వేచ్ఛను కోరుకునేలా చేయడంలో సాతాను సఫలుడయ్యాడు. తప్పొప్పుల విషయంలో స్వంత నిర్ణయాలు తీసుకోవడానికే హవ్వ ఇష్టపడింది. (ఆదికాండము 3:1-6) మొదటి శతాబ్దంలో కొరింథు సంఘంలోని కొందరు అలాంటి స్వేచ్ఛాస్వభావాన్నే కలిగివున్నారు. పౌలుకన్నా తమకే ఎక్కువ తెలుసని వారు తలంచారు. అందుకే, ఆయన వారిని వ్యంగ్యంగా మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలులని పిలిచాడు.—2 కొరింథీయులు 11:3-5; 1 తిమోతి 6:3-5.
17 నేటి లోకంలో చాలామంది ‘మూర్ఖులు, గర్వాంధులుగా’ ఉన్నారు, కొందరు క్రైస్తవులు అలాంటి ఆలోచనా విధానంతో ప్రభావితం చేయబడ్డారు. కొందరు సత్యాన్ని వ్యతిరేకించేవారిగా కూడా తయారయ్యారు. (2 తిమోతి 3:4; ఫిలిప్పీయులు 3:18) స్వచ్ఛారాధన విషయానికి వచ్చినప్పుడు మనం నిర్దేశం కోసం యెహోవావైపు చూడడం, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునితో, సంఘ పెద్దలతో సహకరించడం ఆవశ్యకం. అది నీతిని వెదికే ఒక మార్గమేకాక స్వేచ్ఛాస్వభావాన్ని వృద్ధిజేసుకోకుండా మనల్ని కాపాడుతుంది. (మత్తయి 24:45-47; కీర్తన 25:9, 10; యెషయా 30:21) అభిషిక్తుల సంఘం “సత్యమునకు స్తంభమును ఆధారమునై” ఉంది. మనల్ని కాపాడి నడిపించేందుకే యెహోవా దీనిని అనుగ్రహించాడు. (1 తిమోతి 3:15) యెహోవా నీతియుక్తమైన చిత్తానికి వినయంగా లోబడుతూ దీని ఆవశ్యక పాత్రను గుర్తించడం, మనం ‘వృథాతిశయముచేత ఏమియు చేయకుండా’ ఉండేందుకు మనకు సహాయం చేస్తుంది.—ఫిలిప్పీయులు 2:2-4; సామెతలు 3:4-6.
యేసును అనుకరించేవారిగా ఉండండి
18 యేసు గురించి బైబిలు ప్రవచనార్థకంగా ఇలా చెబుతోంది: “నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు.” (కీర్తన 45:7; హెబ్రీయులు 1:9) అనుకరించదగ్గ ఎంత చక్కని దృక్పథమో కదా! (1 కొరింథీయులు 11:1) యేసు యెహోవా నీతియుక్త ప్రమాణాల్ని కేవలం తెలుసుకొని ఉండలేదుగానీ, ఆయన వాటిని ప్రేమించాడు. కాబట్టి, అరణ్యంలో సాతాను తనను శోధించినప్పుడు ఆయన “న్యాయమార్గము” నుండి వైదొలగడానికి నిస్సంకోచంగా స్థిరంగా నిరాకరించాడు.—సామెతలు 8:20; మత్తయి 4:3-11.
19 నిజమే, దుర్నీతికరమైన శరీర కోరికలు చాలా బలంగా ఉండగలవు. (రోమీయులు 7:19, 20) అయితే నీతి మనకు అమూల్యంగా ఉన్నప్పుడు, అది దుష్టత్వానికి విరుద్ధంగా మనల్ని బలపరుస్తుంది. (కీర్తన 119:165) చెడు మనకు ఎదురైనప్పుడు నీతిపట్ల మనకున్న ప్రగాఢమైన ప్రేమ మనల్ని కాపాడుతుంది. (సామెతలు 4:4-6) మనం శోధనకు లొంగిపోయినప్పుడల్లా, మనం సాతానుకు విజయం చేకూరుస్తున్నామని గుర్తుంచుకోవాలి. అతణ్ణి నిరోధించి యెహోవాకు విజయం చేకూర్చడం ఎంత శ్రేష్ఠమో కదా!—సామెతలు 27:11; యాకోబు 4:7, 8.
20 నీతిని వెదికినందున నిజ క్రైస్తవులు ‘దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, యేసుక్రీస్తువలననైన నీతిఫలములతో నిండికొనిన వారిగా’ ఉన్నారు. (ఫిలిప్పీయులు 1:9-11) వారు “నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును” ధరించుకుంటారు. (ఎఫెసీయులు 4:24) తమను ప్రీతిపరచుకోవడానికి కాదుగానీ వారు యెహోవాకు చెందినవారై ఆయనను సేవించడానికే జీవిస్తారు. (రోమీయులు 14:8; 1 పేతురు 4:1) ఇదే వారి తలంపులను, క్రియలను తీర్మానిస్తుంది. వారు తమ పరలోకపు తండ్రి హృదయాన్ని ఎంతగా సంతోషింపజేస్తారో గదా!—సామెతలు 23:24.
[అధస్సూచీలు]
^ పేరా 16 లైంగిక దుర్నీతి ప్రభావాల నుండి తల్లిదండ్రులు తమ కుటుంబాన్ని సంరక్షించడానికి సంబంధించిన విలువైన సూచనలను యెహోవాసాక్షులు ప్రచురించిన కుటుంబ సంతోషానికిగల రహస్యం పుస్తకంలో చూడవచ్చు.
^ పేరా 19 ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ గతంలో “స్త్రీల సున్నతి” అని పిలవబడేది.
మీరు వివరించగలరా?
•నీతిని వెదకడం ఎందుకు ఆవశ్యకం?
•అపరిపూర్ణ క్రైస్తవుడు నీతిని ఎలా వెదకగలడు?
•లోకంలో క్రైస్తవుడు దూరంగా ఉండవలసిన కొన్ని విషయాలేమిటి?
•నీతిని వెదకడం మనల్ని ఎలా కాపాడుతుంది?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. ఒక యౌవన క్రైస్తవురాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది?
3. నీతి అంటే ఏమిటి?
4. క్రైస్తవులకు నీతి ఎందుకు ప్రాముఖ్యం?
5. అపరిపూర్ణ ప్రాణులు నీతిని ఎలా వెదకవచ్చు?
6. తొలి క్రైస్తవులకు ఆ లోకం ఎందుకు ప్రమాదకరంగా ఉంది?
7. క్రైస్తవునికున్న ఏ బాధ్యతల మూలంగా అతడు అవినీతి ప్రభావాలను ఎదిరించాలి?
8. ఇశ్రాయేలీయులు ఎందుకు మోయాబీయుల దేవతలను ఆరాధించడం ఆరంభించారు?
9, 10. నేడున్న ఎలాంటి పరిస్థితి శరీరసంబంధమైన చెడు కోరికల వినాశనకర శక్తిని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడాన్ని ప్రాముఖ్యం చేస్తుంది?
11. లోక సంబంధమైన దుర్నీతినుండి ఒక కుటుంబం ఎలా సంరక్షించబడగలదు?
12. మొదటి శతాబ్దంలో ఏ సమస్య తలెత్తింది?
13. క్రైస్తవుడు దూరంగా ఉండాల్సిన కొన్ని ఆచారాలు ఏమిటి, అలా చేయడానికి ఆయనకు బలం ఎక్కడనుండి లభిస్తుంది?
14. ఇశ్రాయేలీయులు ఇక వాగ్దానదేశంలోకి ప్రవేశిస్తారనగా యెహోవా వారికెలాంటి హెచ్చరికనిచ్చాడు?
15. మనం యెహోవాను మర్చిపోవడంలేదని ఎలా రూఢీపర్చుకోవచ్చు?
16. హవ్వ మరియు పౌలు కాలంలోని కొందరు ఎలాంటి తప్పుడు స్వభావాన్ని కనుపర్చారు?
17. స్వేచ్ఛాస్వభావాన్ని వృద్ధిచేసుకోకుండా మనమెలా ఉండవచ్చు?
18. ఏయే విధాలుగా మనం యేసును అనుకరించడానికి ప్రోత్సహించబడుతున్నాం?
19, 20. నీతిని వెదకడంవల్ల ఎలాంటి మేలు కలుగుతుంది?
[26వ పేజీలోని చిత్రం]
యేసు అనుచరులకు లోకం ప్రమాదకరమైన స్థలంగా ఉంది
[27వ పేజీలోని చిత్రం]
యెహోవాను ప్రేమించేలా బోధించబడిన పిల్లలు దుర్నీతి విషయంలో దుర్భేద్యంగా ఉంటారు
[28వ పేజీలోని చిత్రం]
వాగ్దానదేశంలో వర్ధిల్లిన తర్వాత కొందరు ఇశ్రాయేలీయులు యెహోవాను మర్చిపోయారు
[29వ పేజీలోని చిత్రం]
యేసులాగే క్రైస్తవులు దుర్నీతిని ద్వేషిస్తారు