పాఠకుల ప్రశ్నలు
పాఠకుల ప్రశ్నలు
భూమ్యాకాశములు “నశించును” అని కీర్తన 102:26 చెబుతోంది. భూగ్రహం నాశనం చేయబడుతుందని దాని భావమా?
కీర్తనకర్త యెహోవాకు చేసిన ప్రార్థనలో ఇలా చెప్పాడు: “ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడ నీ చేతిపనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు; అవియన్నియు వస్త్రమువలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును.” (కీర్తన 102:25, 26) ఆ వచనాలు భూమి నాశనం గురించి మాట్లాడడం లేదు గానీ, దేవుని నిత్యత్వం గురించి మాట్లాడుతున్నాయని ఆ వచనపు సందర్భం చూపిస్తుంది. ఆ ప్రాముఖ్యమైన సత్యం దేవుని సేవకులకు ఎందుకు ఓదార్పునిస్తుందో కూడా ఆ సందర్భం చూపిస్తుంది.
కీర్తనకర్త బహుశా బబులోను చెరలో ఉన్నప్పుడు కీర్తనకర్త తన బాధలను వివరిస్తూ తన కీర్తనను ప్రారంభించాడు. ఆయన “పొగ యెగిరిపోవునట్లుగా” తన జీవితం తరిగిపోతుందనే బాధను వ్యక్తం చేశాడు. తీవ్రమైన భావోద్రేక కలవరం తన శరీరాన్ని బాధించి “పొయిలోనిది కాలిపోయినట్లు” తన ఎముకలు కాలిపోతున్న భావన ఆయనకు కలుగుతుంది. ఆయన అలసిపోయి, “ఎండదెబ్బకు వాడిన గడ్డివలె” తయారయ్యాడు, “యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె” ఒంటరితనాన్ని అనుభవించాడు. ఆయన ఎదుర్కొంటున్న కష్టాలు ఆయన ఆకలిని హరించివేయడమే కాక, ఆయన దినాలు దుఃఖంతో నిండిపోయేలా కూడా చేశాయి. (కీర్తన 102:3-11) అయినా, కీర్తనకర్త ఆశలన్నీ వదులుకోలేదు. ఎందుకు? యెహోవా సీయోను లేక యెరూషలేము విషయంలో చేసిన వాగ్దానాన్నిబట్టి ఆయన ఆశలన్నీ వదులుకోలేదు.
సీయోను నాశనం చేయబడినా, అది పునరుద్ధరించబడుతుందని యెహోవా వాగ్దానం చేశాడు. (యెషయా 66:8) కాబట్టి కీర్తనకర్త నమ్మకంతో యెహోవాతో ఇలా అన్నాడు: “నీవు లేచి సీయోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయకాలమే వచ్చెను. ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు.” (కీర్తన 102:13, 16) ఆ తర్వాత కీర్తనకర్త తన బాధల గురించి మళ్ళీ వివరించడం మొదలుపెడతాడు. యెహోవా దేవుని శక్తి నిర్మానుష్యంగా ఉన్న యెరూషలేమును పునరుద్ధరించగలిగితే, ఆయన తనను కూడా దుర్భర పరిస్థితి నుండి తప్పక కాపాడగలడని కీర్తనకర్త తర్కిస్తాడు. (కీర్తన 102:17, 20, 23) కీర్తనకర్త యెహోవాపట్ల పూర్తి నమ్మకముంచడానికి ఆయనను మరో విషయం ప్రోత్సహిస్తుంది. అదేమిటి? దేవుడు నిత్యుడనే వాస్తవం.
యెహోవా నిత్య ఉనికికి కీర్తనకర్త అల్పాయుష్షుకు ఎంతో వ్యత్యాసం ఉంది. “నీ సంవత్సరములు తరతరములుండును” అని ఆయన యెహోవాతో అన్నాడు. (కీర్తన 102:24) కీర్తనకర్త తర్వాత ఇలా చెప్పాడు: “ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడ నీ చేతిపనులే.”—కీర్తన 102:25.
అయినా భూమ్యాకాశాల అధిక వయసును కూడా యెహోవా నిత్య ఉనికితో పోల్చలేము. కీర్తనకర్త ఇంకా ఇలా చెబుతున్నాడు: ‘అవి [భూమ్యాకాశాలు] నశించును గాని నీవు నిలిచియుందువు.’ (కీర్తన 102:26) భూమ్యాకాశాలు నాశనం చేయబడవచ్చు. నిజమే, అవి నిత్యము నిలుస్తాయని యెహోవా మరోచోట చెప్పాడు. (కీర్తన 119:90; ప్రసంగి 1:4) అవి నాశనమవడమే దేవుని సంకల్పమైతే వాటిని నాశనం చేయడం సాధ్యమే. వాటికి భిన్నంగా దేవునికి మరణంలేదు. దేవుడు భౌతిక సృష్టిని కాపాడుతున్నాడు కాబట్టే అవి ‘శాశ్వతంగా కొనసాగుతాయి.’ (కీర్తన 148:6, ఈజీ-టు-రీడ్ వర్షన్) యెహోవా భౌతిక సృష్టిని పునరుజ్జీవింపజేయడం ఒకవేళ మానుకుంటే అప్పుడు “అవియన్నియు వస్త్రమువలె పాతగిలును.” (కీర్తన 102:26) ఒక మానవుడు ఎలాగైతే తన దుస్తులకన్నా ఎక్కువకాలం జీవిస్తాడో, అలాగే తన సృష్టికన్నా ఎక్కువకాలం జీవించడానికి యెహోవా ఇష్టపడితే ఆయన అలా జీవించగలడు. అయితే అది ఆయన చిత్తం కాదని మనకు ఇతర లేఖనాలనుబట్టి తెలుసు. అక్షరార్థ భూమ్యాకాశాలు నిత్యం నిలుస్తాయని యెహోవా నిశ్చయించాడని దేవుని వాక్యం హామీ ఇస్తోంది.—కీర్తన 104:5.
యెహోవా తన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చడానికి నిత్యమూ ఉంటాడని తెలుసుకోవడం మనకు ఓదార్పునిస్తుంది. మనకు ఎలాంటి కష్టాలు ఎదురైనా మనం ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన ‘దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరుగుతాడు’ అనే నమ్మకంతో మనం ఉండవచ్చు. (కీర్తన 102:17) అవును, 102వ కీర్తనలో యెహోవా తాను మద్దతు ఇస్తానని ఇచ్చిన భరోసా, మనం నిలిచివున్న భూమికన్నా స్థిరమైనది.