కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మేలు కీడును ఎలా జయిస్తుంది?

మేలు కీడును ఎలా జయిస్తుంది?

మేలు కీడును ఎలా జయిస్తుంది?

రాజైన దావీదు మంచి వ్యక్తి. ఆయనకు దేవునిపట్ల ప్రేమ, న్యాయం కోసం తపన, దీనులపట్ల అనురాగం ఉన్నాయి. అయితే ఆ మంచి రాజే ఒకసారి తన నమ్మినబంటు భార్యయైన బత్షెబతో వ్యభిచరించాడు. ఆమె తనవల్ల గర్భవతి అయిందని దావీదుకు తెలిసినప్పుడు ఆయన చివరకు ఆమె భర్త హతమార్చబడేలా ఏర్పాటుచేశాడు. ఆ తర్వాత తన నేరాలను కప్పిపుచ్చేందుకు ఆయన బత్షెబను పెళ్లి చేసుకున్నాడు.​—⁠2 సమూయేలు 11:1-27.

ఎంతో మేలు చేయగల సామర్థ్యం మనుష్యులకు ఉందనేది స్పష్టం. కానీ ఇంత కీడుకు వారెందుకు పాల్పడుతున్నారు? దానికి బైబిలు అనేక ప్రాథమిక కారణాలను గుర్తిస్తోంది. అలాగే దేవుడు, క్రీస్తుయేసు ద్వారా కీడంతటినీ శాశ్వతంగా ఎలా తొలగిస్తాడో కూడా అది వెల్లడిస్తోంది.

చెడువైపుకు మొగ్గుచూపడం

హానికర కృత్యాలకు ఒక కారణాన్ని రాజైన దావీదు గుర్తించాడు. తన నేరాలు వెల్లడైన తర్వాత, ఆయన తన చర్యల బాధ్యతను అంగీకరించాడు. ఆ తర్వాత ఆయన పరితాపంతో ఇలా వ్రాశాడు: “నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.” (కీర్తన 51:5) తల్లులు పాపంచేసే పిల్లలను కనాలని దేవుడు ఎన్నడూ సంకల్పించలేదు. అయితే, మొదట హవ్వ, ఆ తర్వాత ఆదాము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, పాపరహితులైన పిల్లలను కనే సామర్థ్యాన్ని వారు పోగొట్టుకున్నారు. (రోమీయులు 5:12) అపరిపూర్ణ మానవుల సంఖ్య పెరిగేకొద్దీ, “నరుల హృదయాలోచన వారి బాల్యమునుండి చెడ్డది” అనే విషయం స్పష్టమైంది.​—⁠ఆదికాండము 8:21.

చెడువైపుకు మొగ్గుచూపే ఈ స్వభావాన్ని అదుపు చేయకపోతే, “జారత్వము, . . . ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు” వంటివే కాక, “శరీరకార్యములు” అని బైబిలు వర్ణించే నాశనకరమైన ఇతర ప్రవర్తనలు కూడా ఏర్పడతాయి. (గలతీయులు 5:​19-21) రాజైన దావీదు శారీరక బలహీనతకు తావిచ్చి వ్యభిచారం చేశాడు అది కలహానికి దారితీసింది. (2 సమూయేలు 12:​1-12) దుర్నీతివైపు మొగ్గుచూపే తన స్వభావాన్ని ఆయన ఎదిరించే అవకాశముంది. అలా ఎదిరించే బదులు బత్షెబను అదే పనిగా కోరుకున్న కారణంగా, దావీదు “ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడినవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును” అని ఆ తర్వాత యాకోబు వర్ణించిన మార్గాన్నే అనుసరించాడు.​—⁠యాకోబు 1:​14, 15.

చెడు కోరికలు తమ క్రియలను నిర్దేశించేలా ప్రజలు అనుమతిస్తే సంభవించే పరిణామాలకు ముందరి ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన సామూహిక హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు తీవ్ర ఉదాహరణలు.

అజ్ఞానం కీడుకు ఆజ్యం పోస్తుంది

ప్రజలు కీడు తలపెట్టేందుకున్న రెండవ కారణాన్ని అపొస్తలుడైన పౌలు ఉదాహరణ నొక్కిచెబుతోంది. పౌలు చనిపోయేనాటికి నెమ్మదస్థుడనీ, ప్రేమగలవాడనీ పేరు సంపాదించుకున్నాడు. ఆయన తన క్రైస్తవ సహోదర, సహోదరీలకు నిస్వార్థంగా సేవచేశాడు. (1 థెస్సలొనీకయులు 2:​7-9) అయితే ఆయన సౌలు అనే పేరుతో ఉన్నప్పుడు, తన ముందరి జీవితంలో ఆ క్రైస్తవులనే ‘బెదిరించి హత్య చేయడానికి’ వెనుదీయలేదు. (అపొస్తలుల కార్యములు 9:​1, 2) తొలి క్రైస్తవులకు వ్యతిరేకంగా తలపెట్టిన కీడును పౌలు ఎందుకు మన్నించి, అందులో భాగం వహించాడు? ‘తెలియక చేశాను’ అని ఆయన చెబుతున్నాడు. (1 తిమోతి 1:​12-13) అవును, పౌలుకు అప్పట్లో ‘దేవునియందు ఆసక్తివుంది, గానీ అది జ్ఞానానుసారమైనది కాదు.’​—⁠రోమీయులు 10:⁠2.

పౌలులాగే యథార్థపరులు చాలామంది దేవుని చిత్తమేమిటో తెలియని కారణంగా కీడు తలపెట్టారు. ఉదాహరణకు, యేసు తన శిష్యులను ఇలా హెచ్చరించాడు: “మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది.” (యోహాను 16:⁠2) ప్రస్తుత దిన యెహోవాసాక్షులు యేసు మాటల్లోని సత్యాన్ని అనుభవపూర్వకంగా చూస్తున్నారు. చాలాదేశాల్లో వారు దేవుని సేవిస్తున్నామని చెప్పుకునే ప్రజలచేతనే హింసించబడుతూ, చంపబడుతున్నారు కూడా. ఖచ్చితంగా అలాంటి దారితప్పిన ఆసక్తి సత్యదేవుణ్ణి సంతోషపెట్టదు.​—⁠1 థెస్సలొనీకయులు 1:6.

కీడుకు మూలకారకుడు

కీడు ఉండడానికిగల ముఖ్య కారణాన్ని యేసు గుర్తించాడు. తనను చంపనుద్దేశించిన మత నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయనిలా చెప్పాడు: “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆదినుండి వాడు నరహంతకుడు.” (యోహాను 8:​44) స్వార్థపూరిత కారణాలతో సాతానే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా ఆదాము హవ్వలను వలలో వేసుకున్నాడు. ఆ తిరుగుబాటే మానవులందరికీ పాపాన్నీ దానితోపాటు మరణాన్నీ తీసుకొచ్చింది.

సాతాను హత్యావైఖరి యోబుతో అతను వ్యవహరించిన రీతిలో మరింతగా వెల్లడైంది. యోబు యథార్థతను పరీక్షించేందుకు సాతానును యెహోవా అనుమతించినప్పుడు, అతడు యోబు ఆస్తులను పాడుచేయడంతోనే తృప్తిపడలేదు. ఆయన పదిమంది పిల్లల మరణానికి కూడా కారకుడయ్యాడు. (యోబు 1:​9-19) ఇటీవలి దశాబ్దాల్లో, మానవ అపరిపూర్ణత, అజ్ఞానంవల్లనే కాక, మానవ వ్యవహారాల్లో సాతాను అంతకంతకూ ఎక్కువగా జోక్యం చేసుకోవడం కారణంగా కూడా మానవజాతి కీడు మరింత అధికం కావడాన్ని చవిచూసింది. అపవాది “భూమిమీదికి పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి” అని బైబిలు వెల్లడిస్తోంది. సాతాను కట్టడి చేయబడడం కనీవినీ ఎరుగని రీతిలో ‘భూమికి శ్రమ’ అని ఆ ప్రవచనమే ఖచ్చితంగా ముందే చెప్పింది. కీడు చేసేలా సాతాను ప్రజల్ని ఒత్తిడి చేయలేకపోయినా, అతడు ‘సర్వలోకమును మోసపుచ్చడంలో’ మహా నేర్పరి.​—⁠ప్రకటన 12:​9, 12.

చెడువైపుకు మొగ్గుచూపే స్వభావాన్ని తొలగించడం

మానవ సమాజం నుండి కీడును శాశ్వతంగా తొలగించాలంటే, చెడువైపుకు మొగ్గుచూపే మానవుని సహజ స్వభావాన్ని, అజ్ఞానాన్ని, సాతాను ప్రభావాన్ని తొలగించాలి. మొదట, పాపంవైపుకు మొగ్గుచూపే మానవుని సహజ స్వభావాన్ని అతని హృదయం నుండి ఎలా తొలగించవచ్చు?

ఏ మానవ శస్త్రచికిత్స నిపుణుడు లేదా మానవ ఔషధం ఆ పని చేయలే[డు]దు. అయితే యెహోవా దేవుడు, అంగీకరించడానికి ఇష్టపడే వారందరి కోసం వారసత్వ పాపాన్ని, అపరిపూర్ణతను తొలగించే పరిష్కారాన్ని ఏర్పాటుచేశాడు. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.” (1 యోహాను 1:7) పరిపూర్ణ మానవుడైన యేసు స్వచ్ఛందంగా తన ప్రాణాన్ని అర్పించినప్పుడు, ఆయన “మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను.” (1 పేతురు 2:​24) యేసు బలిపూర్వక మరణం ఆదాము చెడు క్రియ మూలంగా కలిగిన ప్రభావాలను తొలగిస్తుంది. క్రీస్తుయేసు “అందరికొరకు విమోచన క్రయధనముగా” అర్పించుకున్నాడని పౌలు చెబుతున్నాడు. (1 తిమోతి 2:6) అవును, క్రీస్తు మరణం ఆదాము పోగొట్టుకున్న పరిపూర్ణతను మానవులందరూ తిరిగి సంపాదించుకునే మార్గాన్ని సుగమం చేసింది.

అయితే మీరిలా ప్రశ్నించవచ్చు, ‘యేసు మరణం దాదాపు 2,000 సంవత్సరాల క్రితమే మానవాళి పరిపూర్ణతను తిరిగి పొండదాన్ని సాధ్యం చేసింది కదా, అలాంటప్పుడు కీడు, మరణం ఇంకా ఎందుకున్నాయి?’ ఆ ప్రశ్నకు జవాబు పొందడం కీడుకున్న రెండవ కారణాన్ని అంటే దేవుని సంకల్పాల గురించిన మానవుని అజ్ఞానాన్ని తొలగించేందుకు సహాయం చేయగలదు.

ప్రామాణిక జ్ఞానంవల్ల మంచితనం బలపడుతుంది

కీడును తొలగించేందుకు యెహోవా, యేసు ఇప్పుడు చేస్తున్న దానికి సంబంధించిన ప్రామాణిక జ్ఞానం పొందడం యథార్థపరుడైన ఒక వ్యక్తి తెలియక హానికర క్రియలను మన్నించేవాడిగా లేక అంతకంటే ఘోరంగా, ‘దేవునితో పోరాడేవానిగా’ తయారవకుండా కాపాడుతుంది. (అపొస్తలుల కార్యములు 5:​38, 39) గతంలో తెలియక చేసిన తప్పుల్ని మన్నించడానికి యెహోవా ఇష్టపడుతున్నాడు. ఏథెన్సులో మాట్లాడుతూ అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.”​—⁠అపొస్తలుల కార్యములు 17:​30, 31.

యేసు మృతుల్లోనుండి లేపబడ్డాడని పౌలుకు వ్యక్తిగత అనుభవాన్నిబట్టి తెలుసు, ఎందుకంటే పునరుత్థానుడైన యేసు స్వయంగా పౌలుతో మాట్లాడి, తొలి క్రైస్తవులను హింసించకుండా ఆయనను అడ్డుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 9:​3-7) పౌలు దేవుని సంకల్పాల ప్రామాణిక జ్ఞానం పొందిన వెంటనే, తన జీవితంలో మార్పులు చేసుకొని క్రీస్తును అనుకరించే నిజమైన మంచి మనిషిగా తయారయ్యాడు. (1 కొరింథీయులు 11:1; కొలొస్సయులు 3:​9, 10) అంతేకాక, పౌలు “ఈ రాజ్య సువార్త”ను ఆసక్తిగా ప్రకటించాడు. (మత్తయి 24:14) యేసుక్రీస్తు తన మరణ పునరుత్థానాల తర్వాత దాదాపు 2,000 సంవత్సరాలుగా పౌలులా తనతోపాటు తన రాజ్యంలో పరిపాలించేవారిని మానవాళినుండి ఎన్నుకున్నాడు.​—⁠ప్రకటన 5:​9, 10.

గత శతాబ్దం మొదలుకొని ఇప్పటివరకు, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞను యెహోవాసాక్షులు ఆసక్తిగా నెరవేర్చారు. (మత్తయి 28:​19, 20) ఈ సందేశానికి ప్రతిస్పందించేవారికి క్రీస్తు పరలోక ప్రభుత్వ పరిపాలనలో భూమిపై నిరంతరం జీవించే ఉత్తరాపేక్ష ఉంటుంది. యేసు ఇలా అన్నాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహాను 17:⁠3) ఈ జ్ఞానం పొందేలా వేరొక వ్యక్తికి సహాయం చేయడం ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చేయగల అత్యంత గొప్ప మేలు.

ఈ రాజ్య సువార్తను అంగీకరించేవారు తమ చుట్టూ ఎంత కీడు అలుముకొని ఉన్నప్పటికీ, “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము” వంటి లక్షణాలను కనబరుస్తారు. (గలతీయులు 5:​22) యేసును అనుకరిస్తూ వారు “కీడుకు ప్రతి కీడెవనికిని” చేయరు. (రోమీయులు 12:​17) వ్యక్తిగతంగా వారు ‘మేలుచేత కీడును జయించడానికే’ కృషిచేస్తారు.​—⁠రోమీయులు 12:21; మత్తయి 5:​44.

కీడుపై అంతిమ విజయం

కీడుకు మూల కారకుడైన అపవాదియగు సాతానుపై మానవులు స్వయంగా ఎన్నటికీ అంతిమ విజయం సాధించలేరు. అయితే యెహోవా త్వరలోనే సాతాను తలమీద కొట్టేందుకు యేసును ఉపయోగిస్తాడు. (ఆదికాండము 3:​15; రోమీయులు 16:​20) అలాగే చరిత్రంతటిలో ఎంతో కీడుకు కారణమైన అనేక రాజకీయ విధానాలతోపాటు రాజకీయ వ్యవస్థలన్నింటిని “పగులగొట్టి నిర్మూలము” చేసేందుకు కూడా యెహోవా క్రీస్తుయేసును ఉపయోగిస్తాడు. (దానియేలు 2:44; ప్రసంగి 8:⁠9) రాబోయే ఈ తీర్పుదినంలో ‘ప్రభువైన యేసు సువార్తకు లోబడనివారు నిత్యనాశనమను దండన పొందుతారు.’​—⁠2 థెస్సలొనీకయులు 1:6, 9; జెఫన్యా 1:​14-18.

సాతాను అతనికి మద్దతిచ్చేవారు తొలగించబడిన తర్వాత, మిగిలివుండే తప్పించబడినవారు ఈ భూమిని తొలి స్థితికి పునరుద్ధరించేలా యేసు పరలోకం నుండి వారికి సహాయం చేస్తాడు. అలాగే పునరుద్ధరించబడిన భూమిపై జీవించే యోగ్యతగల వారందరినీ యేసు పునరుత్థానం చేస్తాడు. (లూకా 23:32, 39-43; యోహాను 5:26-29) ఆ ప్రక్రియలో ఆయన మానవజాతి అనుభవించిన హానికర ప్రభావాలను కొన్నింటిని రూపుమాపుతాడు.

యేసు సువార్తకు లోబడాలని యెహోవా ప్రజలను ఒత్తిడి చేయడు. అయితే జీవానికి నడిపే జ్ఞానం పొందే అవకాశాన్ని ఆయన ప్రజలకిస్తున్నాడు. మీరిప్పుడే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అత్యంత ప్రాముఖ్యం. (జెఫన్యా 2:2, 3) మీరలా చేసినప్పుడు, మీ జీవితాన్ని ఇప్పుడు పట్టిపీడించే ఎలాంటి కీడునైనా సహించడాన్ని మీరు నేర్చుకుంటారు. అలాగే కీడుపై క్రీస్తు అంతిమ విజయం సాధించడాన్ని మీరు చూస్తారు.​—⁠ప్రకటన 19:​11-16; 20:1-3, 10; 21:3, 4.

[5వ పేజీలోని చిత్రం]

ప్రామాణిక జ్ఞానం లేనందువల్లే సౌలు కీడును మన్నించాడు

[7వ పేజీలోని చిత్రం]

దేవుని గూర్చిన ప్రామాణిక జ్ఞానం పొందేలా సహాయం చేయడమే ఒక వ్యక్తి మరొకరికి చేయగల అత్యంత గొప్ప మేలు