మేలు చుట్టూవున్న కీడు
మేలు చుట్టూవున్న కీడు
నేటి లోకంలో కొద్దిమంది మాత్రమే సహాయం చేయడానికి ఇష్టపడుతున్నట్లు కనిపించవచ్చు. కానీ మరికొందరు “ఏదైనా మార్పు తేవడానికి,” అంటే ఏదోక రీతిలో ఇతరులకు మేలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ప్రతీ సంవత్సరం అనేకమంది తాము సత్క్రియ అని భావించే పనికోసం వందలకోట్ల రూపాయలను విరాళంగా ఇస్తున్నారు. ఉదాహరణకు, బ్రిటన్‌లో 2002లో ధర్మసంస్థలకు ఇచ్చిన విరాళాలు అత్యధిక స్థాయిలో 58,500 కోట్లకు చేరుకున్నాయి. బీదల సహాయార్థమై, 1999 నుండి ఔదార్యులైన దాతల్లో పదిమంది ఇచ్చిన లేదా ఇస్తామని వాగ్దానం చేసిన నగదు 1,71,000 కోట్లరూపాయలకన్నా ఎక్కువే.
ధర్మసంస్థలకు చెందిన పనివారు చేసే మంచిపనుల్లో కొన్ని, తక్కువ రాబడిగల కుటుంబాల వైద్య ఖర్చులు భరించడం, ఒంటరి తల్లి/తండ్రిగల పిల్లలకు విద్యతోపాటు ఇతర సదుపాయాలు సమకూర్చడం, వర్ధమాన దేశాల్లో రోగనిరోధక కార్యక్రమాలకు నిధులు ఇవ్వడం, పిల్లలకు మొదటి క్రొత్త పాఠ్యపుస్తకం ఇవ్వడం, బీద దేశాల్లోని రైతులకు పెంపకం కోసం పశుపక్ష్యాదులను సరఫరా చేయడం, ప్రకృతి వైపరీత్యాలవల్ల నష్టపోయినవారికి సహాయ సామగ్రి అందించడం వంటివి.
పైన పేర్కొన్న వాస్తవాలు, ఇతరులకు మేలుచేసే సామర్థ్యం మనుష్యుల్లో ఉందని చూపిస్తున్నాయి. విచారకరంగా, చెప్పలేనంత కీడు చేసే ప్రజలు కూడా ఉన్నారు.
కీడు పెచ్చరిల్లుతోంది
రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి, జాతినిర్మూలన, రాజకీయ ప్రేరేపిత సామూహిక జనసంహార ఘటనలు దాదాపు 50 వరకు జరిగాయని నివేదించబడింది. “ఈ ఘటనల్లో కనీసం ఒక కోటి ఇరవై లక్షలమందే కాక, రెండుకోట్ల ఇరవై లక్షలమంది పౌరులు కూడా చనిపోయారు. ఈ సంఖ్య 1945 నుండి జరిగిన అంతర్గత, అంతర్జాతీయ యుద్ధాల్లో చనిపోయిన వారికన్నా ఎక్కువ” అని అమెరికన్ పొలిటికల్ సైన్స్ రివ్యూ అనే పత్రిక చెబుతోంది.
ఇరవయ్యో శతాబ్దపు రెండవ అర్థభాగంలో కంబోడియాలో రాజకీయ కారణాలవల్ల దాదాపు 22 లక్షలమంది హత్య చేయబడ్డారు. రువాండాలో చెలరేగిన జాతి విద్వేషంవల్ల 8 లక్షలమంది పురుషులు, స్త్రీలు, పిల్లలు ఊచకోతకు గురయ్యారు. బోస్నియాలో రాజకీయాల, మతం పేరిట జరిగిన హత్యల కారణంగా 2 లక్షలమంది చనిపోయారు.
ఇటీవలి ఘోర కృత్యాలను పేర్కొంటూ 2004వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి కార్యదర్శి ఇలా అన్నాడు: “ఇరాక్‌లో సహాయ సంస్థల పనివారిని, విలేకర్లను, యుద్ధంతో సంబంధంలేని ఇతరులను బంధించి అతిక్రూరంగా చంపడంతోపాటు పౌరులు నిర్దాక్షిణ్యంగా హతమార్చబడడాన్నీ చూస్తున్నాం. అదే సమయంలో
ఇరాకీ బంధీలు అమానవీయంగా హింసించబడడాన్నీ చూస్తున్నాం. డార్ఫర్‌లో, ప్రజలు అధికసంఖ్యలో ఇళ్లనుండి వెళ్ళగొట్టబడ్డారు, వారి ఇళ్లు నాశనం చేయబడ్డాయి, అత్యాచారం ఉద్దేశపూర్వక వ్యూహంగా ఉపయోగించబడింది. ఉత్తర ఉగండాలో, పిల్లల్ని అంగవిహీనుల్నిచేసి, వారిచేత బలవంతంగా భయానక క్రూరకృత్యాలు చేయించడాన్ని చూస్తున్నాం. బెస్లాన్‌లో, పిల్లల్ని బంధించి క్రూరంగా వధించడాన్ని చూశాం.”అభివృద్ధిచెందిన దేశాల్లో సహితం ద్వేషపూరిత నేరాలు పెచ్చరిల్లుతున్నట్లు కనిపిస్తోంది. ఉదాహరణకు, బ్రిటన్‌లో “గత దశాబ్దంలో జాతి పేరిట జరిగిన దాడులు లేదా అకృత్యాలకు బలైనవారి సంఖ్య పదకొండు రెట్లు పెరిగినట్లు” 2004లో ఇండిపెండెంట్ న్యూస్ నివేదించింది.
ఎంతో మేలు చేయగల సామర్థ్యమున్న మానవులు ఎందుకు అలాంటి దుష్ట క్రియలకు పాల్పడుతున్నారు? మనం కీడునుండి ఎన్నటికైనా విముక్తులమవుతామా? తర్వాతి ఆర్టికల్ చూపిస్తున్నట్లుగా, ఈ చిక్కు ప్రశ్నలకు బైబిల్లో సంతృప్తికరమైన జవాబులున్నాయి.
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
ముఖచిత్రం: Mark Edwards/Still Pictures/Peter Arnold, Inc.