కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“సమయోచితమైన మాట యెంత మనోహరము!”

“సమయోచితమైన మాట యెంత మనోహరము!”

“సమయోచితమైన మాట యెంత మనోహరము!”

యెహోవాసాక్షుల ఒకరోజు సమావేశం జరుగుతుండగా, కిమ్‌ తన రెండున్నర సంవత్సరాల కూతుర్ని అల్లరి చేయకుండా కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తూనే, కార్యక్రమాన్ని జాగ్రత్తగా వింటూ నోట్స్‌ వ్రాసుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. కార్యక్రమం ముగిసిన తర్వాత, అదే వరుసలో కూర్చున్న ఒక క్రైస్తవ సహోదరి కిమ్‌వైపు తిరిగి ఆమె, ఆమె భర్త కార్యక్రమం జరుగుతున్నప్పుడు తమ కూతుర్ని చూసుకున్న రీతినిబట్టి మనఃపూర్వకంగా ప్రశంసించింది. ఆ ప్రశంస కిమ్‌ను ఎంతగా పురికొల్పిందంటే, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పటికీ ఆమె ఇలా అంటోంది: “ప్రత్యేకంగా నేను కూటాల్లో బాగా అలసిపోయినట్లు భావించినప్పుడు, ఆ సహోదరి అన్న మాటలనే ఆలోచిస్తాను. మా అమ్మాయికి శిక్షణ ఇవ్వడంలో కొనసాగేందుకు ఆమె పలికిన స్నేహపూర్వక మాటలు నన్నింకా ప్రోత్సహిస్తూనే ఉన్నాయి.” అవును సమయోచితమైన మాటలు ఒక వ్యక్తిని ప్రోత్సహించగలవు. బైబిలు ఇలా చెబుతోంది: “సమయోచితమైన మాట యెంత మనోహరము!”​—⁠సామెతలు 15:​23.

అయితే మనలో కొందరికి ఇతరులను ప్రశంసించడం కష్టంగా ఉండవచ్చు. కొన్నిసార్లు మన లోపాలు మనకే తెలిసి ఉండడం అలా ప్రశంసించడాన్ని కష్టభరితం చేయవచ్చు. ఒక క్రైస్తవుడు ఇలా అంటున్నాడు: “నాకైతే అది మెత్తని నేలపై నిలబడినట్లుగా ఉంటుంది. ఇతరులను నేను ప్రశంసించేకొద్దీ, నేను నేలలోకి మరింత కూరుకుపోతున్నట్లుగా ఉంటుంది.” సిగ్గు, అభద్రత లేదా అపార్థం చేసుకుంటారనే భయం వంటివి కూడా ప్రశంసించడాన్ని కష్టభరితం చేస్తాయి. అంతేకాక, మనం ఎదుగుతున్నప్పుడు వ్యక్తిగతంగా అలాంటి ప్రశంసను లేదా గుర్తింపును పొంది ఉండకపోతే, ఇతరులను ప్రశంసించడం మనకు కష్టంగా ఉంటుంది.

ఏదేమైనప్పటికీ, ప్రశంసించడం ఇచ్చేవారిపై, పుచ్చుకునేవారిపై మంచి ప్రభావం చూపిస్తుందని తెలుసుకోవడం, సరైన సమయంలో ప్రశంసించేలా శాయశక్తులా ప్రయత్నించేందుకు మనల్ని పురికొల్పవచ్చు. (సామెతలు 3:​27) అయితే అలా చేయడంవల్ల కలిగే ప్రయోజనాలేమిటి? మనం కొన్నింటిని పరిశీలిద్దాం.

సానుకూల ప్రభావాలు

సముచితమైన ప్రశంస దాన్ని పొందేవారిలో మనోధైర్యాన్ని పెంపొందిస్తుంది. “ప్రజలు నన్ను ప్రశంసించినప్పుడు, వారికి నాపై నమ్మకముందనీ, వారు నన్ను విశ్వసిస్తున్నారనీ నేను భావిస్తాను” అని ఇలాన్‌ అనే ఒక క్రైస్తవ భార్య చెబుతోంది. అవును, మనోధైర్యం లేని వ్యక్తిని ప్రశంసిస్తే, అది ఆ వ్యక్తికి ఆటంకాలను ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుంది, ఫలితంగా ఆయన ఆనందాన్ని పొందుతాడు. యౌవనులు ప్రత్యేకంగా తగిన ప్రశంసనుండి ప్రయోజనం పొందుతారు. తన సొంత ప్రతికూల భావాలతో నిరుత్సాహపడిన ఒక టీనేజి అమ్మాయి ఇలా చెబుతోంది: “నేను ఎల్లప్పుడూ యెహోవాను సంతోషపెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాను, అయితే కొన్ని సందర్భాల్లో నేను ఏమిచేసినా అదంత సరిగా లేదని నేను భావిస్తాను. ఎవరైనా నన్ను ప్రశంసిస్తే నాకెంతో సంతోషం కలుగుతుంది.” అవును బైబిలు చెబుతున్న ఈ సామెత సత్యం: “సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.”​—⁠సామెతలు 25:11.

ప్రశంస ఒక వ్యక్తిని పురికొల్పి, ప్రోత్సహిస్తుంది. ఒక పూర్తికాల పరిచారకుడు ఇలా చెబుతున్నాడు: “ప్రశంస నేను మరింత కష్టపడి పనిచేసేలా, నా పరిచర్య నాణ్యతను మెరుగుపరచుకునేలా నన్ను ప్రోత్సహిస్తుంది.” కూటాల్లో వ్యాఖ్యానించినందుకు సంఘంలోని ఇతరులు మా పిల్లలను ప్రశంసించినప్పుడు వారు ఇంకా ఎక్కువగా వ్యాఖ్యానించేందుకు ఇష్టపడుతున్నట్లు ఇద్దరు పిల్లల తల్లి గమనించింది. అవును, క్రైస్తవ జీవితంలో పురోగతి సాధించేలా అది యౌవనులను ప్రేరేపించగలదు. వాస్తవానికి, అభిమానపాత్రులుగా, విలువైనవారిగా పరిగణించబడుతున్నామనే అభయం మనందరికీ అవసరం. ఒత్తిడితో నిండిన ఈ లోకం మనల్ని అలసిపోజేసి, నిరుత్సాహపర్చవచ్చు. ఒక క్రైస్తవ పెద్ద ఇలా చెబుతున్నాడు: “నేను నిరుత్సాహపడినప్పుడు, లభించే ప్రశంస నా ప్రార్థనలకు జవాబులా ఉంటుంది.” ఇదేవిధంగా ఇలాన్‌ కూడా ఇలా అంటోంది: “ఇతరుల వ్యాఖ్యల ద్వారా యెహోవా నాపట్ల తన ఆమోదాన్ని తెలుపుతున్నట్లు కొన్నిసార్లు అనిపిస్తుంది.”

ప్రశంసించబడడం అవసరమైనవారమనే భావాన్ని కలిగిస్తుంది. యథార్థంగా ప్రశంసించడం శ్రద్ధను వెల్లడిచేయడమే కాక, స్నేహశీలమైన, భద్రతగల, గౌరవప్రదమైన వాతావరణాన్ని వృద్ధిచేస్తుంది. అది మనం తోటి క్రైస్తవులను నిజంగా ప్రేమిస్తున్నాం, వారిని విలువైనవారిగా ఎంచుతున్నాం అనడానికి రుజువు. తల్లిగావున్న జోసీ ఇలా చెబుతోంది: “గతంలో నేను మతపరంగా విభాగించబడిన గృహంలో సత్యం పక్షాన నిలబడాల్సి వచ్చేది. ఆ సమయంలో, ఆధ్యాత్మిక పరిణతిగల ఆయా వ్యక్తుల నుండి లభించిన గుర్తింపు స్థిరంగా నిలబడాలనే నా తీర్మానాన్ని బలపరిచింది.” అవును, “మనము ఒకరికొకరము అవయవములై యున్నాము.”​—⁠ఎఫెసీయులు 4:​25.

ప్రశంసించాలనే కోరిక ఇతరుల్లో మనం మంచిని చూసేలా చేస్తుంది. ఇతరుల్లో మనం వారి బలహీనతలను కాదుగానీ వారి సద్గుణాలను చూస్తాము. డేవిడ్‌ అనే ఒక క్రైస్తవ పెద్ద ఇలా చెబుతున్నాడు: “ఇతరులు చేసే పనులపట్ల కృతజ్ఞత కలిగివుండడం ఇతరులను అనేకసార్లు ప్రశంసించేందుకు మనకు సహాయం చేస్తుంది.” యెహోవా, ఆయన కుమారుడు అపరిపూర్ణ మానవుల గురించి మంచిగా మాట్లాడడంలో ఎంత ఉదారంగా ఉంటారో గుర్తుంచుకోవడం, ఈ విషయంలో మనమూ అంత ఉదారంగా ఉండేందుకు మనల్ని పురికొల్పుతుంది.​—⁠మత్తయి 25:21-23; 1 కొరింథీయులు 4:5.

ప్రశంసకు అర్హులైనవారు

యెహోవా దేవుడు సృష్టికర్త అయినందుకు, మన స్తుత్యార్హమైన వారిలో ఆయన ప్రప్రథముడు. (ప్రకటన 4:10) మనమాయనకు ధైర్యం చెప్పాల్సిన లేదా పురికొల్పవలసిన అవసరం లేకపోయినప్పటికీ, యెహోవా భీకరత్వాన్నిబట్టి, ఆయన దయాపూర్వక ప్రేమనుబట్టి మనమాయనను స్తుతించినప్పుడు, ఆయన మనకు సన్నిహితుడవడమే కాక, ఆయనతో మనమొక బంధాన్ని వృద్ధి చేసుకుంటాం. దేవుణ్ణి స్తుతించడం మన సొంత కార్యాల విషయంలో ఆరోగ్యదాయకమైన, నమ్రతగల అంచనా వేసుకోవడానికి సహాయం చేయడమే కాక, మన విజయాల ఘనతను మనం యెహోవాకే ఆపాదించేందుకు కారణమవుతుంది. (యిర్మీయా 9:23, 24) అర్హులైన మానవులందరికీ యెహోవా నిత్యజీవ ఉత్తరాపేక్షను ఇస్తున్నాడు, అది ఆయనను స్తుతించడానికి మరో ప్రోత్సాహకరమైన కారణం. (ప్రకటన 21:3, 4) ప్రాచీనకాల రాజైన దావీదు ‘దేవుని నామమును స్తుతిస్తూ, కృతజ్ఞతాస్తుతులతో ఆయనను ఘనపరిచేందుకు’ ప్రగాఢాసక్తిని ప్రదర్శించాడు. (కీర్తన 69:​30) మన అభీష్టం కూడా అలాగే ఉండును గాక!

తోటి ఆరాధకులు సముచితమైన ప్రశంసకు అర్హులు. మనం ప్రశంసించినప్పుడు ‘ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెననే’ దైవిక ఆజ్ఞకు అనుగుణంగా ప్రవర్తిస్తాం. (హెబ్రీయులు 10:​24) ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు మాదిరిగా ఉన్నాడు. ఆయన రోమాలోని సంఘానికి ఇలా వ్రాశాడు: “మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (రోమీయులు 1:8) అదేవిధంగా అపొస్తలుడైన యోహాను ‘సత్యమును అనుసరించి నడుచుకోవడంలో’ విశిష్ఠమైన మాదిరిగావున్న తన తోటి క్రైస్తవుడైన గాయును మెచ్చుకున్నాడు.​—⁠3 యోహాను 1-4.

నేడు, తోటి క్రైస్తవుల్లో ఒకరు, ఆదర్శవంతమైన రీతిలో క్రీస్తులాంటి లక్షణాన్ని ప్రదర్శించినప్పుడు, కూటాల్లో చక్కగా సిద్ధపడిన భాగాన్ని నిర్వహించినప్పుడు లేదా కూటాల్లో హృదయపూర్వక వ్యాఖ్యానం చేసినప్పుడు, ఆ వ్యక్తిపట్ల మన కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచే అవకాశం మనకుంటుంది. లేదా సంఘ కూటాల్లో లేఖనాన్ని తెరచి చూసేందుకు ఒక పిల్లవాడు కష్టపడి ప్రయత్నిస్తున్నప్పుడు మనమా పిల్లవాణ్ణి మెచ్చుకోవచ్చు. ముందు ప్రస్తావించుకున్న ఇలాన్‌ ఇలా అంటోంది: “మనలో మనకు వివిధ రకాల ఈవులున్నాయి. వేరొకరు చేసిన పనిని గమనించడం ద్వారా, దేవుని ప్రజల్లోని వివిధ రకాల ఈవులపట్ల కృతజ్ఞత చూపించిన వారమవుతాం.”

కుటుంబంలో

మన సొంత కుటుంబ సభ్యులపట్ల ప్రశంసను వ్యక్తపరిచే విషయమేమిటి? తమ కుటుంబానికి ఆధ్యాత్మిక, భావోద్రేక, వస్తుపరమైన రీతిలో మద్దతిచ్చేందుకు భార్యాభర్తల పక్షాన ఎంతో సమయం, కృషి, ప్రేమపూర్వక శ్రద్ధ అవసరం. వారు పరస్పర ప్రశంసకే కాక, పిల్లల ప్రశంసకు కూడా నిశ్చయంగా అర్హులైవున్నారు. (ఎఫెసీయులు 5:​33) ఉదాహరణకు, సమర్థురాలైన భార్య గురించి దేవుని వాక్యమిలా చెబుతోంది: “ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. . . . ఆమె పెనిమిటి ఆమెను పొగడును.”​—⁠సామెతలు 31:​10, 28, 29.

పిల్లలు కూడా ప్రశంసకు అర్హులు. విచారకరంగా, కొందరు తల్లిదండ్రులు తాము పిల్లలనుండి ఏమి ఆశిస్తున్నారో ఆత్రపడి చెబుతారు గానీ, పిల్లలు గౌరవప్రదంగా, విధేయులుగా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అరుదుగా ప్రశంసిస్తారు. (లూకా 3:​22) పిల్లవాడు ఎదిగే శిశుప్రాయపు సంవత్సరాల్లో ఇచ్చే ప్రశంస, తరచూ ఆ పిల్లవాడు తానెంతో కోరదగినవాడనీ, భద్రంగా ఉన్నాననీ భావించేలా చేస్తుంది.

నిజమే, ఇతరులను ప్రశంసించేందుకు ప్రయత్నం అవసరం, అయితే అలా చేసినందుకు మనమెన్నో ప్రయోజనాలు పొందుతాం. వాస్తవానికి అర్హులైన వారిని ప్రశంసించేందుకు మనమెంత శ్రద్ధ చూపిస్తామో, అంత ఎక్కువగా మనం సంతోషిస్తాం.​—⁠అపొస్తలుల కార్యములు 20:​35.

సరైన ప్రేరణతో ప్రశంసను అంగీకరించండి, ఇవ్వండి

కానీ కొందరికి ప్రశంసను అంగీకరించడం ఒక పరీక్షగా ఉంటుంది. (సామెతలు 27:​21) ఉదాహరణకు, గర్వించే స్వభావమున్న వ్యక్తుల్లో అది తాము ఉన్నతులమనే భావాలు కలిగించవచ్చు. (సామెతలు 16:​18) కాబట్టి, జాగ్రత్తగా ఉండడం అవసరం. అపొస్తలుడైన పౌలు ఈ ఆచరణాత్మకమైన సలహాను ఇచ్చాడు: “తన్ను తాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధిగల వాడగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెను.” (రోమీయులు 12:⁠3) తమ గురించి తాము అధికంగా ఆలోచించుకునే ఉరిలో పడకుండా ఇతరులకు సహాయం చేసేందుకు, చురుకైన తెలివితేటలు లేదా అందంలాంటి లక్షణాలపై దృష్టి నిలపకుండా ఉండడం జ్ఞానయుక్తం. బదులుగా, ఇతరుల సత్కార్యాలను మనం మెచ్చుకోవాలి.

సరైన స్వభావంతో అంగీకరించినప్పుడు, ఇచ్చినప్పుడు ప్రశంస మనపై ప్రయోజనాత్మక ప్రభావం చూపగలదు. మనం చేసే ఏ మంచి పని విషయంలోనైనా యెహోవాకు రుణపడివున్నామని గుర్తించేందుకు మనం పురికొల్పబడవచ్చు. ప్రశంస మనమెల్లప్పుడూ సంపూర్ణ మాన్యతకలిగి ప్రవర్తించేందుకు కూడా మనల్ని ప్రోత్సహించవచ్చు.

యథార్థమైన, సంపూర్ణార్హమైన ప్రశంస మనందరం ఇవ్వగల ఒక బహుమానం. మనం సాలోచనాపూర్వకంగా ఎవరినైనా ప్రశంసించినప్పుడు, ఆ వ్యక్తి మనమనుకున్న దానికన్నా మరెంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

[18వ పేజీలోని బాక్సు/చిత్రం]

ఆమె హృదయాన్ని స్పర్శించిన ఉత్తరం

శీతాకాలంలో బాగా చలిగావున్న ఒకరోజు పరిచర్య నుండి తనూ, తన భార్య తామున్న వసతికి తిరిగివచ్చిన సందర్భాన్ని ఒక ప్రయాణ కాపరి గుర్తుతెచ్చుకుంటున్నాడు. ఆయనిలా అంటున్నాడు: “నా భార్య చలినిబట్టి నిరుత్సాహపడి, తానిక కొనసాగలేనట్లు భావించానని చెప్పింది. ‘ఒకే స్థలంలో సంఘంతోపాటు పూర్తికాల సేవలోవుండి, మన సొంత బైబిలు అధ్యయనాలు నిర్వహించుకోవడం ఎంత బాగుంటుందో’ అని అంది. ఆ సంభాషణ అక్కడితో ఆపేసి, ఆ వారంలోని మిగిలిన రోజులు పూర్తయిన తర్వాత తనకు అప్పుడేమనిపిస్తుందో చూద్దామని అన్నాను. ఆమె అప్పటికీ గట్టిగా అలాగే భావిస్తుంటే ఆమె చెప్పినట్లే చేద్దామనుకున్నాను. ఆ రోజే మేము పోస్టాఫీసు దగ్గర ఆగినప్పుడు, బ్రాంచి కార్యాలయం నుండి ఆమె పేరుమీద ఒక ఉత్తరం రావడం చూశాం. ఆ ఉత్తరంలోని విషయాలు క్షేత్ర పరిచర్యలో ఆమె ప్రయత్నాలను, ఆమె సహనాన్ని ప్రశంసించడమే కాక, ప్రతీవారం ఒక క్రొత్త స్థలంలో పడుకోవడం ఎంత కష్టమో అర్థం చేసుకుంటున్నట్లు తెలిపాయి. ఆ ప్రశంస ఆమెను ఎంతగా ప్రభావితం చేసిందంటే, ప్రయాణ సేవను విడిచిపెట్టే మాట ఆమె ఇక మరెన్నడూ మాట్లాడలేదు. నిజానికి, విడిచిపెడదామని నేను ఆలోచించినప్పుడు, కొనసాగుదామని ఆమె అనేకమార్లు నన్ను ప్రోత్సహించింది.” ఈ జంట దాదాపు 40 సంవత్సరాలపాటు ప్రయాణ సేవలో గడిపారు.

[17వ పేజీలోని చిత్రం]

మీ సంఘంలో ఎవరు ప్రశంసార్హులుగా ఉన్నారు?

[19వ పేజీలోని చిత్రం]

ప్రేమపూర్వక శ్రద్ధ, ప్రశంసలనుబట్టి పిల్లలు వర్ధిల్లుతారు