కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అపవాదికి చోటివ్వకండి

అపవాదికి చోటివ్వకండి

అపవాదికి చోటివ్వకండి

అపవాదికి “అవకాశమివ్వకండి.”​—⁠ఎఫెసీయులు 4:​27, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

శతాబ్దాలుగా చాలామంది అపవాది అంటే కొమ్ములు, చీలిన గిట్టలతో ఎర్రని వస్త్రాలు ధరించివుంటాడనీ, పంగలకర్రతో దుష్ట మానవులను నరకాగ్నిలోకి పడద్రోసే ప్రాణి అనీ నమ్మారు. అలాంటి ఆలోచనను బైబిలు సమర్థించడం లేదు. అయితే అలాంటి తప్పుడు తలంపులు, కోట్లాదిమంది అపవాది ఉనికిని ప్రశ్నించేందుకు లేదా ఆ పదం కేవలం దుష్ట స్వభావానికే అన్వయిస్తుందని భావించేందుకు కారణమయ్యాయి.

2 అపవాది ఉనికిలో ఉన్నాడని బైబిలు ప్రత్యక్ష రుజువును, స్పష్టమైన సాక్ష్యాన్నిస్తోంది. యేసుక్రీస్తు అతణ్ణి పరలోకంలో చూశాడు, భూమ్మీద అతనితో మాట్లాడాడు. (యోబు 1:6; మత్తయి 4:4-11) లేఖనాలు ఈ ఆత్మప్రాణి అసలు పేరును వెల్లడి చేయకపోయినా, అతడు దేవుని మీద అపవాదు వేసినందుకు అతణ్ణి అపవాది అని పిలుస్తున్నాయి. అతడు యెహోవాను వ్యతిరేకించాడు కాబట్టి, (“వ్యతిరేకించేవాడు” అనే అర్థమున్న) సాతాను అని కూడా పిలవబడ్డాడు. అపవాదియైన సాతాను హవ్వను మోసగించేందుకు పామును ఉపయోగించాడు కాబట్టి, అతడు ‘ఆది సర్పము’ అని పేర్కొనబడ్డాడు. (ప్రకటన 12:9; 1 తిమోతి 2:14) అతనికి ‘దుష్టుడు’ అనే పేరు కూడా ఉంది.​—⁠మత్తయి 6:13. *

3 యెహోవా సేవకులముగా మనం ఏ విధంగా కూడా అద్వితీయ సత్యదేవుని ప్రధాన శత్రువైన సాతానులా ప్రవర్తించాలని ఇష్టపడం. కాబట్టి మనం అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని లక్ష్యపెట్టాలి: “సాతానుకు అవకాశమివ్వకండి.” (ఎఫెసీయులు 4:​27, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అలాగైతే మనం అనుకరించకూడని సాతాను లక్షణాలు కొన్ని ఏమిటి?

ప్రధాన అపవాదకుణ్ణి అనుకరించకండి

4 ఆ ‘దుష్టుడు’ అపవాది అని పిలువబడడానికి అర్హుడే ఎందుకంటే వాడు అపవాదు వేస్తాడు. అపవాదు వేయడమంటే మరోవ్యక్తి గురించి మోసపూరితంగా, దురుద్దేశపూర్వకంగా, అవమానకరంగా మాట్లాడడమే. ఆదాముకు దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు: “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.” (ఆదికాండము 2:17) హవ్వకు ఆ విషయం తెలుసు, కానీ పాము ద్వారా అపవాది ఆమెకిలా చెప్పాడు: “మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియును.” (ఆదికాండము 3:4, 5) అలా చెప్పడం దురుద్దేశంతో యెహోవా దేవునిపై కొండెములు చెప్పడమే లేదా అపవాదు వేయడమే అవుతుంది.

5 ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞాపించబడింది: “నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు.” (లేవీయకాండము 19:16) అపొస్తలుడైన యోహాను తన కాలంలోని ఒక కొండెగాని గురించి ఇలా వ్రాశాడు: “నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మునుగూర్చి చెడ్డమాటలు వదరుచు[న్నాడు] . . . అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును.” (3 యోహాను 9, 10) దియొత్రెఫే యోహానుపై కొండెములు చెబుతున్నాడు, కాబట్టి అతను తన క్రియలకు సంజాయిషీ ఇవ్వాలి. దియొత్రెఫేలా వ్యవహరిస్తూ ప్రధాన అపవాదియైన సాతానును అనుకరించాలని ఏ యథార్థ క్రైస్తవుడు మాత్రం కోరుకుంటాడు?

6 యెహోవా సేవకులపై తరచూ తీవ్రమైన అపవాదకర వ్యాఖ్యలు, అబద్ధారోపణలు చేయబడుతున్నాయి. “ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి [యేసు]మీద తీక్షణముగా నేరము మోపిరి.” (లూకా 23:​10) ప్రధానయాజకుడైన అననీయ, మరితరులు పౌలుపై అబద్ధారోపణ చేశారు. (అపొస్తలుల కార్యములు 24:1-8) “రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడు” అని బైబిలు సాతాను గురించి చెబుతోంది. (ప్రకటన 12:​10) ఈ అంత్యదినాల్లో భూమిపై నివసిస్తున్న అభిషిక్త క్రైస్తవులే అలా అబద్ధారోపణ చేయబడిన ఆ సహోదరులు.

7 ఇతరులపై అపవాదు వేయాలనీ లేక అబద్ధారోపణలు చేయాలనీ ఏ క్రైస్తవుడూ కోరుకోడు. అయినప్పటికీ, వేరొకరికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేటప్పుడు మన దగ్గర పూర్తి సమాచారం లేకపోతే అలా అపవాదు వేసే అవకాశముంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం, ఉద్దేశపూర్వకంగా అబద్ధ సాక్ష్యం చెప్పే ఆరోపకుడు మరణశిక్షకు గురికాగలడు. (నిర్గమకాండము 20:16; ద్వితీయోపదేశకాండము 19:​15-19) అంతేకాక, యెహోవా అసహ్యించుకునే వాటిలో “లేనివాటిని పలుకు అబద్ధసాక్షి” కూడా ఉన్నాడు. (సామెతలు 6:​16-19) కాబట్టి మనం ప్రధాన అపవాదకుణ్ణి, అబద్ధారోపకుణ్ణి అనుకరించాలని నిశ్చయంగా కోరుకోం.

ఆది నరహంతకుని మార్గాలను విసర్జించండి

8 అపవాది ఒక నరహంతకుడు. “ఆదినుండి వాడు నరహంతకుడు” అని యేసు చెప్పాడు. (యోహాను 8:44) ఆదాము హవ్వలను దేవుని నుండి దూరం చేయడమనే తన మొదటి క్రియతో ఆరంభించి సాతాను నరహంతకునిగానే ఉన్నాడు. మొదటి మానవజత, వారి సంతానం మరణించడానికి అతడే కారకుడు. (రోమీయులు 5:12) ఈ చర్యను ఒక వ్యక్తికి తప్ప కేవలమొక దుష్ట స్వభావానికి ఆపాదించలేమని గమనించాలి.

9 ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన పది ఆజ్ఞల్లో ఒకటి, “నరహత్య చేయకూడదు” అని చెబుతోంది. (ద్వితీయోపదేశకాండము 5:17) అపొస్తలుడైన పేతురు క్రైస్తవులను సంబోధిస్తూ ఇలా వ్రాశాడు: ‘మీలో ఎవడును నరహంతకుడుగా బాధ అనుభవింప తగదు.’ (1 పేతురు 4:15) కాబట్టి యెహోవా సేవకులముగా మనం హత్యచేయం. అయితే, తోటి క్రైస్తవుణ్ణి ద్వేషిస్తూ అతని మరణాన్ని కోరుకుంటే దేవుని ఎదుట మనం దోషులుగా నిలుస్తాం. “తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు” అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. (1 యోహాను 3:15) ఇశ్రాయేలీయులు ఇలా ఆజ్ఞాపించబడ్డారు: “నీ సోదరుణ్ణి నీ హృదయంలో కూడా నీవు ద్వేషించకూడదు.” (లేవీయకాండము 19:​17, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) నరహంతకుడైన సాతాను మన క్రైస్తవ ఐక్యతను నాశనం చేయకుండా ఉండేందుకు, తోటి విశ్వాసికీ మనకూ మధ్య తలెత్తే ఎలాంటి సమస్యనైనా సత్వరమే పరిష్కరించుకుందాం.​—⁠లూకా 17:3, 4.

ముఖ్య అబద్ధికునికి వ్యతిరేకంగా స్థిరంగా నిలబడదాం

10 అపవాది ఒక అబద్ధికుడు. “వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై యున్నాడు” అని యేసు చెప్పాడు. (యోహాను 8:44) సాతాను హవ్వకు అబద్ధం చెప్పాడు, కానీ యేసు సత్యం గురించి సాక్ష్యమిచ్చేందుకు ఈ లోకానికి వచ్చాడు. (యోహాను 18:37) క్రీస్తు అనుచరులముగా మనం అపవాదికి వ్యతిరేకంగా స్థిరంగా నిలబడాలంటే, మనం అబద్ధాలకు, మోసాలకు పాల్పడకూడదు. మనం “సత్యమే మాటలా[డాలి].” (జెకర్యా 8:16; ఎఫెసీయులు 4:25) ‘సత్యదేవుడైన యెహోవా’ సత్యవంతులైన తన సాక్షులను మాత్రమే ఆశీర్వదిస్తాడు. ఆయనకు ప్రాతినిధ్యం వహించే హక్కు దుష్టులకు లేదు.​—⁠కీర్తన 31:⁠5; 50:16; యెషయా 43:10.

11 సాతాను అబద్ధాల నుండి మనకు లభించిన ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని మనం అమూల్యమైనదిగా పరిగణించినప్పుడు, ‘సత్యమార్గమైన’ క్రైస్తవత్వానికి మనం అంటిపెట్టుకుని ఉంటాం. (2 పేతురు 2:2; యోహాను 8:32) క్రైస్తవ బోధలన్నీ కలిసి “సువార్త సత్యము”గా ఏర్పడతాయి. (గలతీయులు 2:5, 14) మన రక్షణ, ‘సత్యమును అనుసరించి నడుచుకోవడం’ మీదే అంటే సత్యానికి హత్తుకొని, ‘అబద్ధమునకు జనకుడైన’ వానికి వ్యతిరేకంగా స్థిరంగా నిలబడడం మీదే ఆధారపడి ఉంటుంది.​—⁠3 యోహాను 3, 4, 8.

ప్రథమ మతభ్రష్టుణ్ణి ఎదిరించండి

12 అపవాదిగా మారిన ఆ ఆత్మప్రాణి ఒకప్పుడు సత్యంలో ఉన్నాడు. అయితే వాడు “సత్యమందు నిలిచినవాడు కాడు; వానియందు సత్యమేలేదు” అని యేసు చెప్పాడు. (యోహాను 8:44) ఈ ప్రథమ మతభ్రష్టుడు ‘సత్యదేవుని’ ఎదిరించే మార్గాన్నే నిర్విరామంగా అనుసరించాడు. సత్యం విషయంలో మోసగించబడి, దానినుండి వైదొలగిన కారణంగా మొదటి శతాబ్దపు క్రైస్తవులు కొందరు ‘సాతాను ఉరిలో’ చిక్కుకుని అతనికి బలయ్యారు. అందువల్ల, అలాంటివారు ఆధ్యాత్మికంగా కోలుకొని, సాతాను ఉరినుండి తప్పించబడే విధంగా వారికి సాత్వికముతో ఉపదేశించాలని పౌలు తన తోటి పనివాడైన తిమోతిని కోరాడు. (2 తిమోతి 2:23-26) అయితే, సత్యానికి గట్టిగా హత్తుకొని, మతభ్రష్ట దృక్కోణాల ఉరిలో ఎన్నటికీ చిక్కుకోకుండా ఉండడమే ఉత్తమం.

13 అపవాది మాటవిని అతని అబద్ధాలను తిరస్కరించని కారణంగా, ఆది దంపతులు మతభ్రష్టులయ్యారు. కాబట్టి మనం మతభ్రష్టుల మాటలు వింటూ, వారి పుస్తకాలు చదువుతూ లేదా ఇంటర్నెట్‌లో వారి వెబ్‌సైట్లను పరిశీలించాలా? మనం దేవుణ్ణీ, సత్యాన్నీ ప్రేమిస్తే మనమలా చేయం. మనం మత భ్రష్టుల్ని మన ఇంట్లోకి రానివ్వకూడదు లేదా శుభమని వారికి చెప్పకూడదు, ఎందుకంటే అలాంటి పనులు మనల్ని కూడా ‘వారి దుష్టక్రియల్లో పాలివారిని చేస్తాయి.’ (2 యోహాను 9-11) ‘నాశనకరమగు భిన్నాభిప్రాయాల్ని రహస్యంగా బోధిస్తూ, కల్పనావాక్యములతో మననుండి లాభం సంపాదించుకునేందుకు’ ప్రయత్నించే అబద్ధ బోధకులను అనుసరించడానికి క్రైస్తవ “సత్యమార్గమును” విసర్జించడం ద్వారా అపవాది మోసానికి మనమెన్నడూ గురికాక ఉందము గాక.​—⁠2 పేతురు 2:1-3.

14 పౌలు ఎఫెసులోని క్రైస్తవ పెద్దలకు ఇలా చెప్పాడు: “దేవుడు తన స్వరక్తమిచ్చి [“స్వంత కుమారుని రక్తమిచ్చి,” NW] సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.” (అపొస్తలుల కార్యములు 20:28-30) కొంతకాలానికి, అలాంటి మతభ్రష్టులు పుట్టుకొచ్చి ‘వంకర మాటలు పలికారు.’

15 దాదాపు సా.శ. 65 నాటికి అపొస్తలుడు ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించుమని’ తిమోతికి ఉద్బోధించాడు. అయితే “అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు; వారు​—⁠పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు” అని పౌలు వ్రాశాడు. మతభ్రష్టత్వం ప్రారంభమైంది! “అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది” అని పౌలు ఇంకనూ అన్నాడు.​—⁠2 తిమోతి 2:​15-19.

16 సాతాను సత్యారాధనను పాడుచేసేందుకు తరచూ మతభ్రష్టులను ఉపయోగించాడు గానీ సఫలం కాలేకపోయాడు. రమారమి 1868వ సంవత్సరంలో ఛార్లెస్‌ టేజ్‌ రస్సెల్‌ క్రైస్తవమత సామ్రాజ్య చర్చీల్లో పాతుకుపోయిన సిద్ధాంతాలను జాగ్రత్తగా పరిశీలించడం ఆరంభించి, లేఖనాలకు తప్పుగా భావం చెప్పబడుతున్నట్లు కనుగొన్నాడు. రస్సెల్‌, మరికొందరు సత్యాన్వేషకులు అమెరికాలోవున్న పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో బైబిలు అధ్యయన తరగతిని రూపొందించారు. అప్పటినుండి దాదాపు 140 సంవత్సరాలుగా యెహోవా సేవకులు జ్ఞానంలో, దేవునిపట్ల, ఆయన వాక్యంపట్ల ప్రేమలో ఎదిగారు. ప్రథమ మతభ్రష్టుడు ఎన్ని కుయుక్తులు పన్నినా, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ఆధ్యాత్మిక అప్రమత్తత యెహోవాపట్ల, ఆయన వాక్యంపట్ల విశ్వసనీయంగా ఉండేందుకు ఈ నిజ క్రైస్తవులకు సహాయం చేసింది.​—⁠మత్తయి 24:45.

లోకాధికారి మిమ్మల్నేమీ చెయ్యలేని విధంగా ఉండండి

17 సాతాను మనల్ని ఉరిలో పడేసేందుకు ప్రయత్నించే మరో మార్గం, ఈ లోకాన్ని అంటే దేవుని నుండి దూరమైన అవినీతికరమైన మానవ సమాజాన్ని ప్రేమించేలా శోధించడమే. యేసు అపవాదిని “ఈ లోకాధికారి” అని పిలుస్తూనే, “వాడు నన్నేమీ చెయ్యలేడు” అన్నాడు. (యోహాను 14:30, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) సాతాను మనల్నేమీ చెయ్యలేని విధంగా ఉందము గాక! అయితే “లోకమంతయు [ఆ] దుష్టునియందున్నదని” మనకు తెలుసు. (1 యోహాను 5:19) అందుకే అపవాది ఆరాధనకు సంబంధించి ఒకే ఒక మతభ్రష్ట చర్యకు పాల్పడితే “లోకరాజ్యములన్నిటిని” ఇస్తానని అపవాది యేసుకు ప్రతిపాదించాడు. కానీ దేవుని కుమారుడు ఆ ప్రతిపాదనను దృఢంగా తిరస్కరించాడు. (మత్తయి 4:8-10) సాతాను పరిపాలించే లోకం క్రీస్తు అనుచరులను ద్వేషిస్తుంది. (యోహాను 15:18-21) కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించవద్దని అపొస్తలుడైన యోహాను మనల్ని హెచ్చరించడంలో ఆశ్చర్యం లేదు.

18 యోహాను ఇలా వ్రాశాడు: “ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” (1 యోహాను 2:15-17) ఈ లోక జీవన విధానం పాపభరిత శరీరానికి ఆకర్షణీయంగా ఉండి యెహోవా ప్రమాణాలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి, మనం ఈ లోకాన్ని ప్రేమించకూడదు.

19 మన హృదయంలో ఈ లోకంపట్ల ప్రేమ ఉంటే అప్పుడేమిటి? అలాంటప్పుడు ఆ ప్రేమను, దానికి సంబంధించిన శారీరక కోరికలను అధిగమించేందుకు దేవుని సహాయం కోసం మనం ప్రార్థిద్దాం. (గలతీయులు 5:​16-21) “దురాత్మల సమూహములు” అవినీతికర మానవ సమాజపు అదృశ్య “లోకనాథులు” అని మనం గుర్తుంచుకుంటే, మనం తప్పకుండా “ఇహలోక మాలిన్యము” మనకంటకుండా మనల్ని మనం కాపాడుకునేందుకు కృషిచేస్తాం.​—⁠యాకోబు 1:27; ఎఫెసీయులు 6:11, 12; 2 కొరింథీయులు 4:4.

20 యేసు తన శిష్యుల గురించి ఇలా చెప్పాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహాను 17:16) అభిషిక్త క్రైస్తవులు, వారి సమర్పిత సహవాసులు ఈ లోకం నుండి దూరంగా అంటే నైతికంగా, ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉండేందుకు కృషిచేస్తారు. (యోహాను 15:19; 17:14; యాకోబు 4:4) మనం లోకానికి వేరుగా ఉంటూ ‘నీతిని ప్రకటించే వారిగా’ ఉన్నందుకు ఈ అవినీతికర లోకం మనల్ని ద్వేషిస్తుంది. (2 పేతురు 2:5) అవును, జారులు, వ్యభిచారులు, దోచుకొనువారు, విగ్రహారాధకులు, దొంగలు, అబద్ధికులు, త్రాగుబోతులు ఉన్న మానవ సమాజంలో మనం జీవిస్తున్నాం. (1 కొరింథీయులు 5:9-11; 6:9-11; ప్రకటన 21:8) అలాగని మనం ‘లౌకికాత్మను’ స్వీకరించం, ఎందుకంటే ఆ పాపభరిత ప్రేరణా శక్తిచేత మనం పురికొల్పబడేవారం కాదు.​—⁠1 కొరింథీయులు 2:12.

అపవాదికి చోటివ్వకండి

21 “లౌకికాత్మ”చేత ప్రేరేపించబడే బదులు మనం ప్రేమ, ఆశానిగ్రహం వంటి లక్షణాలను మనలో వృద్ధిచేసే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాం. (గలతీయులు 5:22) ఈ లక్షణాలు, మన విశ్వాసంపై అపవాది చేసే దాడులను ఎదురొడ్డి నిలబడేందుకు సహాయం చేస్తాయి. మనం ‘వ్యసనపడి కీడుకు’ పాల్పడాలని అతడు కోరుతున్నాడు, అయితే దేవుని ఆత్మ ‘కోపం మానుటకు, ఆగ్రహము విడిచిపెట్టుటకు’ మనకు సహాయం చేస్తుంది. (కీర్తన 37:8) నిజమే, మనకు కొన్నిసార్లు న్యాయంగానే కోపం వస్తుంది, కానీ పౌలు మనకిలా ఉపదేశిస్తున్నాడు: “కోపపడుడిగాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు. అపవాదికి చోటియ్యకుడి.”​—⁠ఎఫెసీయులు 4:​26, 27.

22 మనం కోపంతోనే ఉంటే అది పాపానికి నడిపిస్తుంది. ఆ మానసిక స్థితిలోనే మనముంటే, అది సంఘంలో తగవు రేపేందుకో లేక దుష్ట క్రియలకు పాల్పడేలా మనల్ని పురికొల్పేందుకో సాతానుకు అవకాశమిస్తుంది. కాబట్టి ఇతరులతోవున్న విభేదాలను మనం దేవునికి అంగీకారమైన పద్ధతిలో సత్వరమే పరిష్కరించుకోవాలి. (లేవీయకాండము 19:17, 18; మత్తయి 5:23, 24; 18:15, 16) అందువల్ల, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ, ఆశానిగ్రహం పాటిస్తూ, న్యాయమైన కోపం సహితం వైరీభావంగా, తీవ్రమైన పగగా, ద్వేషంగా మారేందుకు ఎన్నటికీ అనుమతించకుండా ఉందాం.

23 మనం అనుకరించకూడని అపవాది లక్షణాలను కొన్నింటిని మనం చర్చించాం. అయితే కొందరు పాఠకులు ఇలా ఆలోచించవచ్చు: మనం సాతానుకు భయపడాలా? అతడు క్రైస్తవులపై హింసను ఎందుకు ఉసిగొల్పుతున్నాడు? అపవాది మనల్ని మోసగించకుండా మనమెలా తప్పించుకోవచ్చు?

[అధస్సూచి]

^ పేరా 4 కావలికోట నవంబరు 15, 2005లో “అపవాది నిజంగా ఉన్నాడా?” అనే ముఖపత్ర శీర్షికలు చూడండి.

మీ జవాబేమిటి?

•మనమెందుకు ఎన్నటికీ వేరొకరిపై అపవాదు వేయకూడదు?

మొదటి యోహాను 3:15కు అనుగుణంగా, మనం నరహంతకులము కాకుండా ఎలా ఉండవచ్చు?

•మతభ్రష్టుల్ని మనమెలా దృష్టించాలి, ఎందుకు?

•మనమెందుకు లోకాన్ని ప్రేమించకూడదు?

[అధ్యయన ప్రశ్నలు]

1. చాలామంది అపవాది ఉనికిని ఎందుకు ప్రశ్నించారు?

2. అపవాది గురించిన కొన్ని లేఖనాధార వాస్తవాలేమిటి?

3. మనమే ప్రశ్నను పరిశీలిస్తాం?

4. “దుష్టుడు” దేవునిపై ఎలాంటి అపవాదు వేశాడు?

5. కొండెములు చెప్పినందుకు దియొత్రెఫే ఎందుకు సంజాయిషీ ఇవ్వాలి?

6, 7. ఎవరిపైనా అపవాదు వేయకుండా ఉండాలని మనమెందుకు కోరుకుంటాం?

8. అపవాది ఏ విధంగా ‘ఆదినుండి ఒక నరహంతకునిగా’ ఉన్నాడు?

9. మొదటి యోహాను 3:15లో సూచించబడినట్లుగా, మనమెలా నరహంతకులుగా తయారుకాగలం?

10, 11. ముఖ్య అబద్ధికుడైన సాతానుకు వ్యతిరేకంగా స్థిరంగా నిలబడేందుకు మనమేమి చేయాలి?

12, 13. మతభ్రష్టులతో మనమెలా వ్యవహరించాలి?

14, 15. పౌలు ఎఫెసు పెద్దలకు, తన తోటి పనివాడైన తిమోతికి ఎలాంటి హెచ్చరిక చేశాడు?

16. ప్రథమ మతభ్రష్టుడు ఎన్ని కుయుక్తులు పన్నినా మనమెందుకు దేవునిపట్ల, ఆయన వాక్యంపట్ల విశ్వసనీయంగా ఉన్నాం?

17-19. అపవాది అధికారంలో ఉన్న లోకమంటే ఏమిటి, మనం దానిని ఎందుకు ప్రేమించకూడదు?

20. మనం ‘లోకసంబంధులం కాము’ అని ఎందుకు చెప్పవచ్చు?

21, 22. ఎఫెసీయులు 4:26, 27లో వ్రాయబడివున్న పౌలు ఉపదేశాన్ని మీరెలా అన్వయించుకోవచ్చు?

23. తర్వాతి ఆర్టికల్‌లో మనమే ప్రశ్నలను పరిశీలిస్తాం?

[23వ పేజీలోని చిత్రం]

మన క్రైస్తవ ఐక్యతను నాశనం చేసేందుకు మనమెన్నటికీ అపవాదికి చోటివ్వం

[24వ పేజీలోని చిత్రాలు]

లోకాన్ని ప్రేమించవద్దని యోహాను మనకెందుకు ఉద్బోధిస్తున్నాడు?