కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎజ్రా పుస్తకంలోని ముఖ్యాంశాలు

ఎజ్రా పుస్తకంలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

ఎజ్రా పుస్తకంలోని ముఖ్యాంశాలు

బైబిలు పుస్తకమైన ఎజ్రా, రెండవ దినవృత్తాంతముల గ్రంథములో నమోదు చేయబడిన వృత్తాంతం తర్వాత జరిగిన సంఘటనల గురించిన వివరణతో ప్రారంభమౌతుంది. దాని రచయిత, యాజకుడైన ఎజ్రా, బబులోను చెరలో ఉన్న యూదుల శేషం తమ స్వదేశానికి తిరిగివెళ్ళేందుకు అనుమతిస్తూ పర్షియా రాజైన కోరెషు జారీ చేసిన ఆజ్ఞ గురించిన వివరణతో ఆ వృత్తాంతాన్ని మొదలుపెడతాడు. ఆ దేశంలోని ప్రజల కారణంగా తమను తాము మలినపరచుకున్నవారిని శుభ్రపరచడానికి ఎజ్రా తీసుకున్న చర్యలను వివరిస్తూ ఆ కథనం ముగుస్తుంది. మొత్తం కలిపి, ఆ పుస్తకంలో 70 సంవత్సరాల్లో జరిగిన సంఘటనల గురించి అంటే సా.శ.పూ. 537 నుండి 467 వరకు జరిగిన సంఘటనల గురించి నమోదు చేయబడింది.

ఆ పుస్తకాన్ని వ్రాయడంలో ఎజ్రాకు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. అదేమిటంటే, బబులోను చెరలో ఉన్న తన ప్రజలను విడిపించి, యెరూషలేములో స్వచ్ఛారాధనను పునరుద్ధరించాలనే తన వాగ్దానాన్ని యెహోవా ఎలా నెరవేర్చాడనేది చూపించడం. కాబట్టి, ఎజ్రా ఆ సంకల్పంతో సంబంధమున్న సంఘటనలనే నొక్కిచెప్పాడు. ఆలయం ఎలా పునర్నిర్మించబడింది, వ్యతిరేకత ఉన్నా, దేవుని ప్రజలు అపరిపూర్ణులైనా యెహోవా ఆరాధన ఎలా పునఃస్థాపించబడింది అనే విషయాల గురించిన వివరాలు ఎజ్రా పుస్తకంలో ఉన్నాయి. మనం కూడా పునరుద్ధరణ కాలంలో జీవిస్తున్నాం కాబట్టి ఆ వృత్తాంతం మనకు కూడా ఎంతో ప్రాముఖ్యం. చాలామంది ‘యెహోవా మందిర పర్వతానికి’ ప్రవాహంలా వస్తున్నారు, భూమంతా ‘యెహోవా మాహాత్మ్యమును గురించిన జ్ఞానముతో నిండనున్నది.’​—⁠యెషయా 2:2, 3; హబక్కూకు 2:14.

ఆలయం పునర్నిర్మించబడింది

(ఎజ్రా 1:1-6:22)

కోరెషు, విడుదల విషయంలో జారీ చేసిన ఆజ్ఞకు ప్రతిస్పందనగా చెరలో ఉన్న దాదాపు 50,000 మంది యూదులు, అధిపతియైన జెరుబ్బాబెలు లేక షేష్బజ్జరు నాయకత్వంలో యెరూషలేముకు తిరిగివస్తారు. అలా తిరిగివచ్చినవారు వెంటనే బలిపీఠాన్ని దాని స్థానంలో నిర్మించి యెహోవాకు బలులు అర్పించడం మొదలుపెడతారు.

ఆ తర్వాతి సంవత్సరం ఇశ్రాయేలీయులు యెహోవా మందిరానికి పునాదివేస్తారు. శత్రువులు పునర్నిర్మాణ పనిలో జోక్యం చేసుకుంటూ, చివరకు ఆ పని ఆగిపోవడానికి రాజాజ్ఞ జారీ అయ్యేలా చేయడంలో వారు సఫలులవుతారు. హగ్గయి, జెకర్యా ప్రవక్తలు, ఆలయ నిర్మాణపనిని నిషేధం ఉన్నా తిరిగి ప్రారంభించేందుకు ప్రజలను ప్రోత్సహిస్తారు. అయితే కోరెషు ప్రారంభంలో జారీచేసిన, మార్చడానికి వీలుకాని పర్షియా ఆజ్ఞను వ్యతిరేకించడానికి వారి శత్రువులు భయపడి ఊరుకుంటారు. అధికార విచారణలో “యెరూషలేములో ఉండు దేవుని మందిరమును గూర్చిన” కోరెషు ఆజ్ఞ వెలుగులోకి వస్తుంది. (ఎజ్రా 6:⁠3) దానితో ఆ పని సాఫీగా కొనసాగి పూర్తవుతుంది.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​3-6​—⁠స్వదేశానికి తిరిగివెళ్ళడానికి స్వచ్ఛందంగా ముందుకురాని ఇశ్రాయేలీయుల విశ్వాసం బలహీనంగా ఉందా? కొందరు ఐశ్వర్యాసక్తి కారణంగా లేక సత్యారాధనపట్ల గౌరవం లోపించిన కారణంగా యెరూషలేముకు తిరిగివెళ్ళివుండకపోవచ్చు, అయితే అందరి విషయంలో అది నిజం కాదు. మొదటిగా, 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న యెరూషలేముకు చేరుకోవాలంటే నాలుగు లేక ఐదు నెలలు ప్రయాణించాల్సివస్తుంది. అంతేకాక, 70 సంవత్సరాలు నిర్మానుష్యంగా ఉన్న దేశంలో స్థిరపడి పునర్నిర్మాణ పని చేయాలంటే చాలా శారీరక శక్తి అవసరం. కాబట్టి శారీరక రుగ్మతలు, వృద్ధాప్యం, కుటుంబ బాధ్యతలు వంటి అననుకూల పరిస్థితులు కొందరు యెరూషలేముకు తిరిగివెళ్ళకుండా చేశాయనడంలో సందేహంలేదు.

2:​43​—⁠నెతీనీయులు ఎవరు? ఈ ప్రజలు ఇశ్రాయేలీయులుకాని పూర్వీకుల నుండి వచ్చినవారు, వారు ఆలయ సేవకులుగా లేక పరిచారకులుగా పనిచేశారు. వారిలో యెహోషువ కాలంనాటి గిబియోనీయుల వంశీయులు, “లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులును నిర్ణయించిన” మరికొందరు ఉన్నారు.​—⁠ఎజ్రా 8:​20.

2:​55​—⁠సొలొమోను సేవకుల వంశస్థులు ఎవరు? ఈ సేవకులు, యెహోవా సేవలో ప్రత్యేక నియామకాలు ఇవ్వబడిన, ఇశ్రాయేలీయులుకానివారు. వారు ఆలయంలో లేదా ఏదో ఒక కార్యనిర్వాహక హోదాలో శాస్త్రులుగా లేక లేఖికులుగా పనిచేసి ఉండవచ్చు.

2:​61-63​—⁠యెహోవా నుండి జవాబు అవసరమైనప్పుడు ఉపయోగించబడిన ఊరీము తుమ్మీము, చెర నుండి తిరిగివచ్చినవారికి అందుబాటులో ఉన్నాయా? యాజక వంశీయులమని చెప్పుకున్నవారు తమ వంశావళిని నిరూపించుకోలేకపోతే ఊరీము తుమ్మీము ఉపయోగించడం ద్వారా తమ వాదనకు చట్టబద్ధత కల్పించుకోగలిగేవారు. అలామాత్రమే తమ వంశావళిని నిరూపించుకోవడం సాధ్యమని ఎజ్రా చెబుతున్నాడు. అప్పుడు గానీ ఆ తర్వాత గానీ ఊరీము తుమ్మీము ఉపయోగించబడినట్లు లేఖనాల్లో ఎలాంటి దాఖలాలు లేవు. యూదా సంప్రదాయం తెలియజేస్తున్న ప్రకారం, సా.శ.పూ. 607లో ఆలయం నాశనంచేయబడినప్పుడు ఆ ఊరీము తుమ్మీము కనుమరుగయ్యాయి.

3:​12​—⁠యెహోవా ‘మునుపటి మందిరాన్ని చూసిన వృద్ధులు’ ఎందుకు ఏడ్చారు? ఈ వృద్ధులు సొలొమోను నిర్మించిన ఆలయం ఎంత వైభవంగా ఉండేదో గుర్తుచేసుకోగలిగారు. తమ ముందున్న క్రొత్త ఆలయపు పునాదిని ఆ పాత ఆలయంతో పోలిస్తే “[వారి] కండ్లకు ఇప్పటిది ఎందుకూ పనికిరానిదిగా ఉన్నట్లు” అనిపించింది. (హగ్గయి 2:​2, 3, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) తమ ప్రయత్నాలవల్ల మునుపటి ఆలయపు మహిమను తిరిగి తీసుకురాలేమని తెలుసుకొని వాళ్ళు నిరుత్సాహం చెందివుండవచ్చు, అందుకే వారు ఏడ్చారు.

3:​8-10; 4:​23, 24; 6:​15, 16​—⁠ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఆలయ పునాది, సా.శ.పూ. 536లో అంటే, “వారు వచ్చిన రెండవ సంవత్సరములో” వేయబడింది. సా.శ.పూ. 522లో రాజైన అర్తహషస్త దినాల్లో నిర్మాణ పని ఆపుచేయబడింది. ఆ నిషేధం సా.శ.పూ. 520 వరకు అంటే రాజైన దర్యావేషు పాలనలోని రెండవ సంవత్సరం వరకు కొనసాగింది. అతని పాలనలోని ఆరవ సంవత్సరంలో లేక సా.శ.పూ. 515లో ఆ ఆలయ నిర్మాణం ముగిసింది. (“సా.శ.పూ. 537 నుండి 467 వరకు పరిపాలించిన పర్షియా రాజులు” అనే బాక్సును చూడండి) కాబట్టి, ఆలయ నిర్మాణానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది.

4:8–6:18—ఎజ్రాలోని ఈ భాగం ఎందుకు అరామిక్‌ భాషలో వ్రాయబడింది?​—⁠ఈ భాగంలో ఎక్కువగా ప్రభుత్వాధికారులకూ, రాజులకూ మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలకు సంబంధించిన సమాచారం ఉంది. ఆ కాలంనాటి వ్యాపార భాషగా, అధికార భాషగా ఉన్న అరామిక్‌లో వ్రాయబడిన ప్రభుత్వ దస్తావేజుల నుండి ఎజ్రా వాటిని నకలు చేశాడు. ఈ ప్రాచీన సెమిటిక్‌ భాషలో వ్రాయబడిన ఇతర బైబిలు భాగాలు ఎజ్రా 7:​12-26, యిర్మీయా 10:​11, దానియేలు 2:4-7:28 వచనాలలో ఉన్నాయి.

మనకు పాఠాలు:

1:2. యెషయా దాదాపు 200 సంవత్సరాల క్రితం ప్రవచించినది నెరవేరింది. (యెషయా 44:28) యెహోవా వాక్యంలోని ప్రవచనాలు ఎన్నడూ విఫలంకావు.

1:3-6. బబులోనులోనే ఉండిపోయిన కొందరు ఇశ్రాయేలీయుల్లాగే యెహోవాసాక్షుల్లో చాలామందికి పూర్తికాల పరిచర్యను చేపట్టడానికి లేక అవసరం అధికంగా ఉన్న చోట సేవచేయడానికి వీలుకాకపోవచ్చు. అయినా వారు పూర్తికాల పరిచర్యను చేపట్టగలిగేవారికి మద్దతునిచ్చి ప్రోత్సహించవచ్చు, అంతేకాక రాజ్య ప్రకటనా పనిని, శిష్యులను చేసే పనిని విస్తరింపజేయడానికి స్వచ్ఛంద విరాళాలు కూడా ఇవ్వవచ్చు.

3:1-6. సా.శ.పూ. 537లోని ఏడవ నెలలో (సెప్టెంబరు/అక్టోబరు నెలలకు సరిసమానమైన తిష్రీ నెలలో) చెర నుండి తిరిగివచ్చిన నమ్మకస్థులు తమ మొదటి బలిని అర్పించారు. సా.శ.పూ. 607లోని ఐదవ నెలలో (జూలై/ఆగస్టు నెలలకు సరిసమానమైన అబ్‌ నెలలో) నెబుకద్నెజరు రాజు యెరూషలేములో ప్రవేశించాడు, రెండు నెలల తర్వాత ఆ పట్టణాన్ని నాశనం చేయడం పూర్తైంది. (2 రాజులు 25:8-17, 22-26) ముందుగా ప్రవచించబడినట్లు, యెరూషలేము నిర్మానుష్యంగా ఉండాల్సిన 70 సంవత్సరాల గడువు సరైన సమయంలో ముగిసింది. (యిర్మీయా 25:11; 29:10) యెహోవా వాక్యం ప్రవచించే విషయాలన్నీ ఎల్లప్పుడూ నెరవేరతాయి.

4:1-3. అబద్ధ ఆరాధకులతో మతపరమైన సంబంధాన్ని ఏర్పరచుకొనేలా చేసే ప్రతిపాదనను చెరనుండి తిరిగివచ్చిన నమ్మకమైన శేషం తిరస్కరించింది. (నిర్గమకాండము 20:5; 34:12) అలాగే నేటి యెహోవా ఆరాధకులు కూడా ఎలాంటి మిశ్రమ విశ్వాస సంబంధిత కార్యకలాపాల్లోనూ పాల్గొనరు.

5:1-7; 6:1-12. యెహోవా తన ప్రజలు విజయం సాధించడానికి పరిస్థితులను వారికి అనుకూలంగా మార్చగలడు.

6:14, 22. యెహోవా పనిలో హృదయపూర్వకంగా భాగంవహించడంవల్ల ఆయన ఆమోదం, ఆశీర్వాదం లభిస్తాయి.

6:21. ఆ కాలంలో యూదుల దేశంలో నివసిస్తున్న సమరయులు, తిరిగివచ్చిన యూదుల్లో అన్యమత ప్రభావాలకు లోనైనవారు, యెహోవా పని ప్రగతి సాధించడం కళ్లారా చూసినప్పుడు, తమ జీవితాల్లో అవసరమైన మార్పులు చేసుకోవడానికి అది వారిని ప్రోత్సహించింది. రాజ్య ప్రకటనా పనితో సహా దేవుడు మనకు నియమించిన పనుల్లో మనం ఉత్సాహంగా భాగంవహించవద్దా?

ఎజ్రా యెరూషలేముకు రావడం

(ఎజ్రా 7:1-10:44)

పునర్నిర్మించబడిన యెహోవా మందిరం ప్రతిష్ఠించబడి యాభై సంవత్సరాలు గడిచాయి. అది సా.శ.పూ. 468వ సంవత్సరం. ఎజ్రా బబులోను నుండి యెరూషలేముకు తనతోపాటు దేవుని ప్రజల శేషాన్ని, ఆర్థిక విరాళాలను తీసుకువెళ్తాడు. ఆయన అక్కడ ఏమి గమనిస్తాడు?

పెద్దలు ఎజ్రాకు ఇలా చెబుతారు: “ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును . . . దేశపు జనములలో నుండి తమ్మును తాము వేరు పరచుకొనక, వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచున్నారు.” అంతేకాక, “ఈ అపరాధము చేసినవారిలో పెద్దలును అధికారులును నిజముగా ముఖ్యులై” ఉన్నారు. (ఎజ్రా 9:1, 2) అది విని ఎజ్రా ఆశ్చర్యపోతాడు. “ధైర్యము తెచ్చుకొని” చర్యతీసుకోమని ఆయన ప్రోత్సహించబడతాడు. (ఎజ్రా 10:4) ఎజ్రా దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పుడు ప్రజలు సానుకూలంగా ప్రతిస్పందిస్తారు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

7:1, 7, 11—ఈ వచనాలన్నీ నిర్మాణపనిని నిలిపివేసిన అర్తహషస్తను సూచిస్తున్నాయా? లేదు. అర్తహషస్త అనేది ఇద్దరు పర్షియా రాజులకు ఆపాదించబడిన పేరు లేక బిరుదు. ఆ రాజులలో ఒకరు, సా.శ.పూ. 522లో ఆలయ పనిని నిలిపివేయాల్సిందిగా ఆజ్ఞ జారీచేసిన బార్డియా లేక గౌమాట అయివుండవచ్చు. ఎజ్రా యెరూషలేముకు వచ్చిన కాలంలోని అర్తహషస్త లాంగిమెనస్‌ అర్తహషస్త.

7:28–8:20—బబులోనులోని చాలామంది యూదులు ఎజ్రాతోపాటు యెరూషలేముకు వెళ్ళడానికి ఎందుకు సుముఖత చూపించలేదు? యూదుల మొదటి గుంపు తమ స్వదేశానికి తిరిగివచ్చి 60కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిచినా యెరూషలేములో జనావాసం తక్కువగా ఉంది. యెరూషలేముకు తిరిగివెళ్తే అసౌకర్యవంతమైన, ప్రమాదకరమైన పరిస్థితుల్లో క్రొత్త జీవితాన్ని ప్రారంభించాల్సివస్తుంది. బబులోనులో వర్ధిల్లుతున్న యూదులకు ఆ కాలంలో యెరూషలేములో వస్తుపరంగా ఆకర్షణీయమైన అవకాశాలు లేవు. వారు అపాయకరమైన ప్రయాణం చేయాల్సివస్తుందనేది కూడా మనం మరచిపోకూడదు. వారు స్వదేశానికి తిరిగివెళ్లాలంటే వారికి యెహోవాపట్ల బలమైన విశ్వాసం, సత్యారాధనపట్ల ఉత్సాహం, ధైర్యం అవసరం. ఎజ్రా యెహోవా హస్తము తోడుగా ఉన్న కారణంగానే బలపరచబడ్డాడు. ఎజ్రా ప్రోత్సాహంతో 1,500 కుటుంబాలు ప్రతిస్పందించాయి, ఆ కుటుంబాలవారి సంఖ్య 6,000 అయివుండవచ్చు. ఎజ్రా అదనపు చర్యలు తీసుకున్న తర్వాత 38 మంది లేవీయులు, 220 మంది నెతీనీయులు ప్రతిస్పందించారు.

9:1, 2—ఆ దేశంలోని అన్యులను వివాహం చేసుకోవడంవల్ల కలిగే ముప్పు ఎంత గంభీరమైనది? పునఃస్థాపించబడిన ఆ జనాంగం మెస్సీయ వచ్చేంతవరకు యెహోవా ఆరాధనను సంరక్షించాలి. ఆ దేశంలోని ఇతర అన్యులను వివాహం చేసుకోవడం సత్యారాధనకు నిజమైన ముప్పుగా ఉంది. కొందరు విగ్రహారాధన చేసే ప్రజలతో పెళ్ళి సంబంధాలు ఏర్పరచుకున్నారు కాబట్టి చివరకు ఆ జనాంగం అన్యజనులతో మిళితమైపోవచ్చు. అప్పుడు భూమ్మీద నుండి స్వచ్ఛారాధన కనుమరుగైవుండేది. అలా జరిగివుంటే మెస్సీయ ఎవరి కోసం రావాలి? ఎజ్రా జరిగినదానిని చూసి కలతచెందడంలో ఆశ్చర్యంలేదు!

10:3, 44—భార్యలతోపాటు పిల్లలు కూడా ఎందుకు వెలివేయబడ్డారు? ఒకవేళ పిల్లలు అక్కడే ఉన్నట్లయితే వెలివేయబడిన భార్యలు వారి కారణంగా తిరిగివచ్చే అవకాశం ఎక్కువయ్యేది. అంతేకాక, చిన్నపిల్లలకు సాధారణంగా తమ తల్లుల సంరక్షణ అవసరం.

మనకు పాఠాలు:

7:10. ఎజ్రా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివే విద్యార్థిగా, నైపుణ్యంగల బోధకునిగా మనకు ఒక మాదిరిని ఉంచాడు. ఆయన యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించడానికి తన హృదయాన్ని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచుకున్నాడు. ఎజ్రా దానిని పరిశోధిస్తున్నప్పుడు యెహోవా చెబుతున్న విషయాలపట్ల ఎంతో శ్రద్ధ చూపించాడు. ఎజ్రా తాను నేర్చుకున్న విషయాలను అన్వయించుకొని వాటిని ఇతరులకు బోధించడానికి తీవ్ర కృషి చేశాడు.

7:13. యెహోవా సుముఖతగల సేవకులను ఇష్టపడతాడు.

7:27, 28; 8:21-23. ఎజ్రా యెహోవాకు ఘనతను ఆపాదించాడు, యెరూషలేముకు సుదీర్ఘమైన, అపాయకరమైన ప్రయాణం చేసే ముందు దేవుణ్ణి యథార్థంగా వేడుకుని, ఆయనను మహిమపరిచేందుకు తన వ్యక్తిగత భద్రతను కూడా లెక్కచేయలేదు. అలా ఆయన మనకొక మంచి మాదిరిని ఉంచాడు.

9:2. “ప్రభువునందు మాత్రమే” పెండ్లిచేసుకోమని ఇవ్వబడిన హితవును మనం గంభీరంగా తీసుకోవాలి.—1 కొరింథీయులు 7:39.

9:14, 15. చెడు సహవాసాలు యెహోవా తిరస్కారానికి దారితీయవచ్చు.

10:2-12, 44. అన్యులను భార్యలుగా స్వీకరించిన వ్యక్తులు వినయంగా పశ్చాత్తాపపడి, తమ తప్పుడు మార్గాలను సరిదిద్దుకున్నారు. వారి వైఖరి, వారు తీసుకున్న చర్య ఆదర్శప్రాయంగా ఉన్నాయి.

యెహోవా తన వాగ్దానాలను నెరవేరుస్తాడు

ఎజ్రా పుస్తకం మనకు ఎంత అమూల్యమైనదో కదా! యెహోవా తన ప్రజలను బబులోను చెర నుండి విడిపించి యెరూషలేములో సత్యారాధనను పునరుద్ధరిస్తాననే తన వాగ్దానాన్ని ఖచ్చితమైన సమయంలో నెరవేర్చాడు. యెహోవాపట్ల, ఆయన వాగ్దానాలపట్ల మన విశ్వాసాన్ని అది బలపరచడం లేదా?

ఎజ్రా పుస్తకంలో ఉన్న ఉదాహరణల గురించి ఆలోచించండి. యెరూషలేములో స్వచ్ఛారాధనను పునరుద్ధరించడంలో భాగంవహించేందుకు తిరిగివచ్చిన ఎజ్రా, మరితరులు ఆదర్శప్రాయమైన భక్తిని ప్రదర్శించారు. ఈ పుస్తకం, దైవభయంగల విదేశీయులు కనపరచిన విశ్వాసాన్ని, పశ్చాత్తాపపడిన తప్పిదస్థులు చూపించిన వినయ స్వభావాన్ని కూడా నొక్కిచెబుతోంది. అవును, “దేవుని వాక్యము సజీవమై బలముగలదని” స్పష్టమైన రుజువును ఎజ్రా ప్రేరేపిత వాక్యాలు ఇస్తున్నాయి.—హెబ్రీయులు 4:​12.

[18వ పేజీలోని చార్టు/చిత్రం]

సా.శ.పూ. 537 నుండి 467 వరకు పరిపాలించిన పర్షియా రాజులు

కోరెషు రాజు (ఎజ్రా 1:⁠1) సా.శ.పూ. 530లో మరణించాడు

క్యాంబిసెస్‌, లేక అహష్వేరోషు (ఎజ్రా 4:⁠6) సా.శ.పూ. 530-22

అర్తహషస్త​—⁠బార్డియా లేక గౌమాట (ఎజ్రా 4:⁠7) సా.శ.పూ. 522 (కేవలం ఏడు నెలలు పరిపాలించిన తర్వాత హత్యచేయబడ్డాడు)

దర్యావేషు I (ఎజ్రా 4:​24)సా.శ.పూ. 522-486

క్సెరెక్సెస్‌, లేక అహష్వేరోషు * సా.శ.పూ. 486-75 (సా.శ.పూ. 496-86 వరకు సహపరిపాలకునిగా దర్యావేషు Iతో పరిపాలించాడు)

అర్తహషస్త లాంగిమెనస్‌ (ఎజ్రా 7:⁠1)సా.శ.పూ. 475-24

[అధస్సూచి]

^ పేరా 50 ఎజ్రా పుస్తకంలో క్సెరెక్సెస్‌ పేరు లేదు. ఆయన బైబిలు పుస్తకమైన ఎస్తేరులో అహష్వేరోషుగా పేర్కొనబడ్డాడు.

[చిత్రం]

అహష్వేరోషు

[17వ పేజీలోని చిత్రం]

కోరెషు

[17వ పేజీలోని చిత్రం]

చెరలో ఉన్నవారు తమ స్వదేశాలకు తిరిగివెళ్ళేందుకు జారీ చేయబడిన శాసనం గురించి కోరెషు స్థూపం పేర్కొంటోంది

[చిత్రసౌజన్యం]

స్థూపం: Photograph taken by courtesy of the British Museum

[20వ పేజీలోని చిత్రం]

నైపుణ్యంగల బోధకుడయ్యేందుకు ఎజ్రాకు ఏమి సహాయం చేసిందో మీకు తెలుసా?