కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జంతు సృష్టి యెహోవాను ఘనపరుస్తుంది

జంతు సృష్టి యెహోవాను ఘనపరుస్తుంది

జంతు సృష్టి యెహోవాను ఘనపరుస్తుంది

యెహోవా వైభవం జంతు సామ్రాజ్యంలో వెల్లడవుతుంది. మానవజాతికి అవసరమైనవన్నీ సమకూరుస్తున్నట్లుగానే దేవుడు జంతువులపట్ల కూడా శ్రద్ధ కనబరుస్తున్నాడు. (కీర్తన 145:16) వాటినీ మనల్నీ చేసిన సృష్టికర్తలో లోపాన్ని వెదకడం ఎంత పొరపాటు! యోబు నిజాయితీపరుడే అయినప్పటికీ “దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు” చెప్పుకున్నాడు. కాబట్టి, యోబు నేర్చుకోవలసిన పాఠాలు కొన్ని ఉన్నాయి!​—⁠యోబు 32:2; 33​:8-​12; 34:⁠5.

జంతు సృష్టినుండి తీసుకోబడిన ఉదాహరణలు, దేవుని మార్గాలను ప్రశ్నించే హక్కు మానవులకు లేదని యోబుకు చూపించాయి. యెహోవా తన సేవకుడైన యోబుతో పలికిన మాటలను మనం పరిశీలిస్తుండగా ఆ విషయం మనకు మరింత స్పష్టమవుతుంది.

వాటికి మానవుల సహాయం అవసరం లేదు

దేవుడు జంతు జీవితాన్ని గురించి అడిగిన ప్రశ్నలకు యోబు సమాధానం చెప్పలేకపోయాడు. (యోబు 38:39-41) యెహోవా ఏ మానవ సహాయం లేకుండానే సింహానికీ కాకులకూ ఆహారాన్ని సమకూరుస్తున్నాడన్నది స్పష్టమే. ఆహారం కోసం కాకులు వెదకవలసివచ్చినా నిజంగా వాటికి ఆహారం లభించేది దేవుని నుండే.​—లూకా 12:24.

దేవుడు అడవి జంతువుల గురించి అడిగినప్పుడు యోబుకు నోటమాట రాలేదు. (యోబు 39:​1-8) కొండమేకలను, లేళ్ళను ఏ మానవుడూ కావలికాయలేడు. అంతెందుకు, కొండమేకల దగ్గరికి వెళ్ళడం కూడా చాలా కష్టమే. (కీర్తన 104:18) ఈనే ముందు గుంపునుండి వేరుగా అడవిలోకి వెళ్ళిపోవడం లేళ్ళకు దేవుడిచ్చిన సహజమైన ప్రవృత్తి. అది తన పిల్లలను బాగా చూసుకుంటుంది, అయినప్పటికీ, అవి ‘పుష్టిగా’ తయారయ్యాక “తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు.” అవి ఇక వాటంతటవే జీవిస్తాయి.

అరణ్య ప్రాంతంలో నివసించే అడవి గాడిద (జీబ్రా) స్వేచ్ఛగా తిరుగుతుంది. బరువులు మోయడానికి యోబు దానిని ఉపయోగించలేడు. అది మేత కోసం కొండలపై సంచరిస్తూ “ప్రతి విధమైన పచ్చని మొలకను” వెదుకుతుంది. అది పట్టణాలలో మానవుల దగ్గర మరింత సులభంగా దొరికే ఆహారం కోసం తన స్వేచ్ఛను వదులుకోదు. అది తాను సంచరించే ప్రాంతంలో మనిషిని చూడగానే పారిపోతుంది కాబట్టి, “తోలువాని కేకలను అది వినదు.”

తరువాత దేవుడు గురుపోతును ప్రస్తావించాడు. (యోబు 39:9-12) దాని గురించి ఆంగ్ల పురాతత్వశాస్త్రవేత్తైన ఆస్టన్‌ లేయార్డ్‌ ఇలా వ్రాశాడు: “ఉబ్బెత్తు శిల్పాలలో తరచూ రూపించబడినట్లుగా, గురుపోతు భీకరమైనదే కాక, దానిని వేటాడడం సింహాన్ని వేటాడడంకన్నా గొప్ప విషయంగా పరిగణింపబడేదన్నట్లు తెలుస్తోంది. రాజు తరచూ దానితో తలపడుతూ కనిపించేవాడు, సైనికులు దానిని కాలినడకన లేదా గుర్రాలపై వెంటాడేవారు.” (నీనెవే అండ్‌ ఇట్స్‌ రిమెయిన్స్‌, 1849, 2వ సంపుటి, 326వ పేజీ) అయితే, అదుపుచేయలేని ఆ గురుపోతుకు, జ్ఞానం ఉన్న ఏ మనిషీ పగ్గం వేయడానికి ప్రయత్నించడు.​—కీర్తన 22:21.

రెక్కలుగల ప్రాణులు యెహోవాను ఘనపరుస్తున్నాయి

తరువాత, యెహోవా యోబును రెక్కలుగల ప్రాణుల గురించి ప్రశ్నించాడు. (యోబు 39:13-​18) సంకుబుడి కొంగ తన బలమైన రెక్కలతో ఎంతో ఎత్తుకు ఎగరగలదు. (యిర్మీయా 8:7) నిప్పుకోడి తన రెక్కలను ఆడించగలదు కానీ పైకి ఎగరలేదు. అయితే, సంకుబడి కొంగలా అది తన గుడ్లను చెట్టుపై కట్టిన గూటిలో ఉంచదు. (కీర్తన 104:17) అది ఇసుకలో ఒక గోతిని తవ్వి, తన గుడ్లను అందులో పెడుతుంది. అంతేకానీ అది ఎన్నడూ తన గుడ్లను విడిచివెళ్లదు. ఆ గుడ్లు ఇసుకతో కప్పబడి సరైన ఉష్ణోగ్రతలో ఉంచబడతాయి. వాటిని సంరక్షించడంలో ఆడ, మగ పక్షులు రెండూ పాలుపంచుకుంటాయి.

క్రూరమృగాల నుండి ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు పారిపోతున్నట్లు కనిపించే నిప్పుకోడి ‘తెలివిలేనిదిగా’ అనిపించవచ్చు. అయితే, యాన్‌ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్‌ బైబిల్‌ యానిమల్స్‌ ఇలా చెప్తోంది: “అది దృష్టిని మళ్ళించే ఒక విధానం: ఒక మనిషి లేదా జంతువు నుండి ప్రమాదం ఎదురైనప్పుడు [నిప్పుకోళ్ళు] తమ రెక్కలను ఊపుతూ తమవైపు దృష్టిని మళ్ళింపజేసుకొంటూ, శత్రువులను తమ గుడ్లకు దూరంగా తీసుకువెళ్తాయి.”

మరి నిప్పుకోడి ఎలా “గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించును?” ది వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “నిప్పుకోడి ఎగరలేదు కానీ నేలపై వేగంగా పరుగెత్తడానికి అది పేరుగాంచింది. దాని పొడవైన కాళ్ళు 4.6 మీటర్ల అంగలు వేస్తూ, అది గంటకు 64 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తడానికి తోడ్పడతాయి.”

దేవుడు గుర్రానికి బలాన్నిచ్చాడు

ఆ తరువాత దేవుడు గుర్రం గురించి యోబును ప్రశ్నించాడు. (యోబు 39:19-​25) పూర్వకాలాల్లో సైనికులు గుర్రాలపై స్వారీ చేస్తూ యుద్ధం చేసేవారు అంతేకాక, ఇద్దరు సైనికులు, ఒక సారథి ఉండే రథాలను లాగడానికి కూడా వాటిని ఉపయోగించేవారు. యుద్ధానికి తహతహలాడే గుర్రం గట్టిగా సకిలించి నేలపై కాలు దువ్వుతుంది. అది భీతినొందదు, ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు. బాకానాదమును విన్నప్పుడు అది “ఆహా” అన్నట్లుగా స్పందిస్తూ వేగంగా ముందుకు ‘పరుగెడుతుంది’. అయినా, అది దాని రౌతుకు లోబడుతుంది.

ఆ పోలికనే వర్ణిస్తూ పురాతత్వశాస్త్రవేత్త లేయార్డ్‌ ఇలా వ్రాశాడు: “ఒక అరేబియన్‌ గుర్రం గొర్రెలా సాధు జంతువైనా, దాన్ని నడిపించడానికి దాని మెడకు కళ్లెముంటే చాలు, అది యుద్ధ నినాదం విని, ఈటెతో సిద్ధంగావున్న రౌతును చూసిందంటే చాలు దాని కళ్ళు నిప్పుకణాల్లా మెరుస్తాయి. దాని ఎర్రని నాసికా రంధ్రాలు విశాలంగా తెరుచుకుంటాయి, దాని మెడ కమానులా అందంగా వంపు తిరుగుతుంది, దాని తోక, జూలు పైకి లేచి గాలికి చక్కగా ఊగుతాయి.”​—⁠డిస్కవరీస్‌ ఎమాంగ్‌ ద రూయిన్స్‌ ఆఫ్‌ నీనెవే అండ్‌ బాబిలోన్‌, 1853, 330వపేజీ.

డేగనూ గద్దనూ గమనించండి

యెహోవా తన అవధానాన్ని కొన్ని ఇతర పక్షులపైకి మళ్ళించాడు. (యోబు 39:26-​30) డేగలు ‘పైకి ఎగిరి గాలిలో రెక్కలు చాస్తాయి.’ ద గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, పెరెగ్రీన్‌ ఫాల్కన్‌ను అత్యంత వేగంగా ఎగిరే పక్షిగా పేర్కొంటూ ఇలా చెబుతోంది: “అది తన ప్రాంతంలోకి చొరబడిన ఇతర పక్షులతో పోరాడటానికి గొప్ప ఎత్తులమీదినుంచి దూసుకువచ్చినప్పుడు లేదా మధ్యాకాశంలో తన ఎరను పట్టుకునేటప్పుడు దాని వేగం రికార్డు స్థాయికి చేరుకుంటుంది.” అది 45 డిగ్రీల కోణంలో కిందికి దూసుకువచ్చేటప్పుడు దాని వేగం గంటకి 349 కిలోమీటర్లకు చేరుకుందనే రికార్డు ఉంది.

గద్దలు గంటకు 130 కిలోమీటర్ల కన్నా ఎక్కువ వేగంతో ఎగరగలవు. యోబు జీవితం గతించిపోవడాన్ని, గద్ద తన ఎరమీదికి దూసుకువచ్చే వేగంతో పోల్చాడు. (యోబు 9:​25, 26) మనం, అలుపే ఎరుగదేమో అనిపించే పక్షిరాజు రెక్కల మీదున్నట్లుగా, ముందుకు సాగేందుకు దేవుడు మనకు బలాన్నిస్తాడు. (యెషయా 40:​31) గద్ద ఎగిరేటప్పుడు ఉష్ణవాయువులని పిలువబడే పైకెగిసే వేడి గాలి తరంగాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటుంది. అది ఆ వేడి తరంగాలలో గుండ్రంగా తిరుగుతున్నప్పుడు ఆ ఉష్ణవాయువు దాన్ని పైపైకి తీసుకువెళ్తుంది. కావలసినంత ఎత్తుకు చేరుకున్నాక, అది నెమ్మదిగా తరువాతి ఉష్ణవాయువుకు వెళ్తుంది. ఈ విధంగా, గద్ద చాలా తక్కువ శక్తిని వినియోగిస్తూ గంటల తరబడి ఎత్తులో ఎగురుతూ ఉండగలుగుతుంది.

గద్ద తన పిల్లలను సురక్షిత స్థానంలో ఉంచడానికి, “తన గూడును ఎత్తయిన చోటున,” అంటే ఎవరూ ఎక్కజాలని ప్రదేశంలో కట్టుకుంటుంది. అలా చేయటం, యెహోవా గద్దకు ఇచ్చిన సహజ ప్రవృత్తి. అంతేగాక, దేవుడు ఇచ్చిన చూపుతో ‘[గద్ద] కన్నులు దూరము నుండి కనిపెడతాయి’. చాలా త్వరగా దృష్టిని మళ్ళించి కేంద్రీకరించగల సామర్థ్యం, అది కిందకు దిగేటప్పుడు తన ఎరపై లేదా ఒక మృత కళేబరంపై దృష్టి నిలిపేందుకు దోహదపడుతుంది. గద్ద జంతు కళేబరాలను తింటుండవచ్చు, అందుకే “హతులైనవారు ఎక్కడనుందురో అక్కడనే అది యుండును.” ఈ పక్షి చిన్న జంతువులను పట్టి, వాటిని తన పిల్లల కోసం తీసుకువెళ్తుంది.

యెహోవా యోబుకు ఉపదేశించడం

జంతువుల గురించి మరిన్ని ప్రశ్నలు అడగబోయేముందు దేవుడు యోబును ఉపదేశించాడు. దానికి యోబు ఎలా ప్రతిస్పందించాడు? ఆయన తనను తాను తగ్గించుకొని, ఇవ్వబడిన ఉపదేశాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరించాడు.​—⁠యోబు 40:​1-​14.

యోబు జీవితానుభవాల గురించి వ్రాయబడిన ప్రేరేపిత వృత్తాంతంలోని ఒకటైన ఈ సందర్భంలో మనం ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంటాం. అదేమిటంటే: సర్వశక్తిమంతునిలో తప్పు వెదకడానికి ఏ మానవునికీ ఆధారం లేదు. మన సంభాషణ, నడత మన పరలోక తండ్రిని ప్రీతిపర్చేవిగా ఉండాలి. అంతేకాక, యెహోవా దేవుని పవిత్ర నామాన్ని పరిశుద్ధపరచడం, ఆయన సర్వోన్నతాధిపత్యాన్ని నిరూపించడం మన ముఖ్య ఉద్దేశంగా ఉండాలి.

దేవుణ్ణి ఘనపర్చే బహేమోత్‌

దేవుడు తన అవధానాన్ని మళ్ళీ జంతు సృష్టిపై నిలుపుతూ యోబును బహేమోత్‌ గురించి ప్రశ్నించాడు, సాధారణంగా ఇది నీటిగుర్రమని భావించబడుతోంది. (యోబు 40:15-​24, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) పూర్తిగా ఎదిగిన ఒక నీటిగుర్రం నాలుగు నుండి ఐదు మీటర్ల పొడవు, 3,600 కిలోగ్రాముల బరువు ఉంటుంది. దాని ‘బలం దాని నడుములో ఉంది,’ అంటే దాని నడుము కండరాలలో ఉందని అర్థం. పొట్టి కాళ్ళున్న నీటిగుర్రం నదీగర్భంలోని రాళ్ళపై తన శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్తుంది కాబట్టి దాని పొట్ట ప్రాంతంలో ఉన్న మందమైన చర్మం దానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బలమైన శరీరం, పెద్ద నోరు, శక్తివంతమైన దవడలు కలిగిన బహేమోత్‌కు ఖచ్చితంగా ఏ మానవుడూ సాటి రాలేడు.

నీటిగుర్రం పచ్చని “గడ్డి” విందుచేయడానికి నదిలోనుండి బయటికి వస్తుంది. దాని ఆకలి తీర్చడానికి కొండపైనున్న పచ్చికంతా అవసరమేమో అనిపిస్తుంది, ఎందుకంటే దాని రోజువారీ ఆహారం 90 నుండి 180 కిలోగ్రాముల పచ్చిక. ఆకలి తీరాక అది కలువ చెట్ల కిందనో లేదా నిరవంజి చెట్ల నీడలోనో పడుకుంటుంది. తాను నివసించే నది పొంగినప్పుడు అది తలను నీళ్ళపైకి పెట్టి వరదలోనైనా ఈదుకుంటూ వెళ్ళిపోగలదు. పెద్దదైన నోరు, భయంకరమైన కొమ్ములతో నీటిగుర్రం ముందుకి వచ్చినప్పుడు దాని ముక్కుకు సూత్రము వేసి ఉరియొగ్గడానికి యోబు ధైర్యం చేయలేకపోవచ్చు.

దేవుణ్ణి మహిమపర్చే లివయాటాన్‌

తరువాత యోబు లివయాటాన్‌ గురించి విన్నాడు. (యోబు 41:​1-​34, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం) ఈ హీబ్రూ పదానికి “మడతల తోలు కల జంతువు” అని అర్థం, బహుశా ఇది మొసలి అయ్యుండవచ్చు. యోబు, మొసలిని పిల్లలకు ఆటవస్తువుగా చేయగలడా? ఎన్నటికీ చేయలేడు! దానిని ఎదిరించిన సందర్భాలు, అది ప్రమాదకరమైనదని పదే పదే రుజువు చేశాయి. నిజానికి, ఒకవేళ దానిని వశపరచుకోవడానికి ఏ మనిషైనా ప్రయత్నిస్తే, ఆ పోరు ఎంత భీకరంగా ఉంటుందంటే, అతను మళ్ళీ ఆ పనిని చెయ్యాలనుకోడు.

సూర్యోదయాన మొసలి తన తలను నీటిలోనుండి పైకి లేపినప్పుడు దాని “కండ్లు ఉదయ సూర్య కిరణాలలా” ఉంటాయి. దాని శరీరంపై పొలుసులు ఒకదానితో ఒకటి అంటుకొనినట్లుంటాయి, అంతేగాక దాని చర్మం క్రింద ఎముకల పలకలు ఉండడంవల్ల, అది ఎంత గట్టిగా ఉంటుందంటే దాన్ని ఖడ్గములు, ఈటెలే కాదు చివరికి బుల్లెట్లు కూడా ఏమీ చేయలేవు. దాని పొట్ట భాగంలో కరుకైన పొలుసులు ఉండడంవల్ల నది ఒడ్డున అది నడిచినప్పుడు తడి నేలపై “నురిపిడికర్రలాగే” అచ్చులు పడతాయి. అది నీటిలో చేసే అలజడి నీటిని ఒక నురుగుతోకూడిన తైలముగా మారుస్తుంది. లివయాటాన్‌ దాని పరిమాణం, కవచం, జడిపించే నోరూ శక్తిమంతమైన తోకా వంటి ఆయుధాలవల్ల, భీతిని ఎరుగదు.

యోబు తన తప్పు తెలుసుకున్నాడు

‘నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని’ అని యోబు అంగీకరించాడు. (యోబు 42:​1-3) ఆయన దేవుని దిద్దుబాటును స్వీకరించి, తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడ్డాడు. ఆయన సహచరులు గద్దింపబడినప్పటికీ ఆయన మాత్రం గొప్పగా ఆశీర్వదించబడ్డాడు.​—⁠యోబు 42:​4-​17.

యోబు అనుభవాన్ని మనస్సులో పెట్టుకోవడం ఎంత జ్ఞానయుక్తమో కదా! దేవుడు ఆయనను అడిగిన ప్రశ్నలన్నిటికీ బహుశా మనము జవాబు చెప్పలేకపోవచ్చు. కానీ, యెహోవాను ఘనపర్చే అద్భుతమైన సృష్టిపై కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండగలము, కలిగి ఉండాలి కూడా.

[13వ పేజీలోని చిత్రం]

కొండమేక

[13వ పేజీలోని చిత్రం]

కాకి

[13వ పేజీలోని చిత్రం]

ఆడ సింహం

[14వ పేజీలోని చిత్రం]

అడవి గాడిద (జీబ్రా)

[14వ పేజీలోని చిత్రం]

నిప్పుకోడి తన గుడ్లనుండి దూరంగా వెళ్ళినా, వాటిని విడిచిపెట్టదు

[14వ పేజీలోని చిత్రం]

నిప్పుకోడి గుడ్లు

[14, 15వ పేజీలోని చిత్రం]

పెరెగ్రీన్‌ ఫాల్కన్‌ (డేగ)

[చిత్రసౌజన్యం]

ఫాల్కన్‌: © Joe McDonald/Visuals Unlimited

[15వ పేజీలోని చిత్రం]

అరేబియన్‌ గుర్రం

[15వ పేజీలోని చిత్రం]

సువర్ణ గ్రద్ద

[16వ పేజీలోని చిత్రం]

బహేమోత్‌ సాధారణంగా నీటిగుఱ్ఱమని భావించబడుతోంది

[16వ పేజీలోని చిత్రం]

లివయాటాన్‌ ఒక శక్తిమంతమైన మొసలి అని తలంచబడుతోంది