కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“బైబిలు సంబంధిత తొలి ఉల్లేఖనాలు”

“బైబిలు సంబంధిత తొలి ఉల్లేఖనాలు”

“బైబిలు సంబంధిత తొలి ఉల్లేఖనాలు”

ఇరవై ఐదు సంవత్సరాల క్రితం, ఇజ్రాయిల్‌లోని పురాతత్వశాస్త్రజ్ఞులు ఒక అద్భుతమైన దానిని కనుగొన్నారు. వారు యెరూషలేములోని, హిన్నోము లోయలోవున్న ఏటవాలు ప్రాంతంలోని సమాధి గుహలలో బైబిలు వచనాలు వ్రాయబడివున్న రెండు చిన్న వెండి గ్రంథపు చుట్టలను కనుగొన్నారు. అవి, బబులోనీయులు యెరూషలేమును నాశనం చేయక ముందటి కాలానికి, అంటే సా.శ.పూ. 607 కంటే ముందటి కాలానికి చెందినవి. సంఖ్యాకాండము 6:24-26లో నమోదు చేయబడిన ఆశీర్వాదాలలోని భాగాల్ని అవి ఉల్లేఖిస్తున్నాయి. ఈ రెండు చుట్టలలోనూ, దేవుని స్వంత నామమైన యెహోవా, చాలాసార్లు కనిపిస్తుంది. “హీబ్రూ బైబిలులోని భాగాలున్న అత్యంత పురాతన లిఖిత పత్రాలు”గా ఈ శాసనాలు వర్ణించబడ్డాయి.

అయితే, కొందరు విద్వాంసులు, ఆ చుట్టలు వ్రాయబడిన తేదీ గురించి వివాదం లేవదీసి అవి సా.శ.పూ. రెండో శతాబ్దంలో వ్రాయబడ్డాయని వాదించారు. విద్వాంసులు అలా అనడానికి ఒక కారణం, ఈ అతి చిన్న గ్రంథపు చుట్టల తొలి ఫోటోగ్రాఫ్‌ల నాణ్యత, వివరాలను తగినంత నిశితంగా పరిశీలించడానికి అనుకూలంగా లేదు. ఈ తేదీ సమస్యను పరిష్కరించడానికి విద్వాంసుల బృందం ఒక క్రొత్త అధ్యయనం చేపట్టింది. వారు ఆ గ్రంథపు చుట్టల హై-రెసొల్యూషన్‌ డిజిటల్‌ చిత్రాలను రూపొందించడానికి ఇటీవలి ఫోటోగ్రాఫిక్‌ మరియు కంప్యూటర్‌ ఇమేజింగ్‌ సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించారు. వారు చేసిన క్రొత్త విశ్లేషణల ఫలితాలు ఇటీవలే ప్రచురించబడ్డాయి. ఆ విద్వాంసుల బృందం ఎటువంటి నిర్ధారణలకు వచ్చింది?

ముందుగా, పురాతత్వశాస్త్ర సమాచారం, ఆ చుట్టలు ఇశ్రాయేలీయులు బబులోనుకు బందీలుగా వెళ్ళకముందు కాలంలో వ్రాయబడినవనే విషయాన్ని సమర్థిస్తోందని విద్వాంసులు నొక్కి చెబుతున్నారు. పురాతన వ్రాత శాస్త్ర పరిశీలనలు, అంటే అవి వ్రాయబడిన భాషలోని అక్షరాల ఆకారం, శైలి, స్థానం, వ్రాయబడిన విధానం మరియు దిశ, అవి అదే కాలానికి, అంటే సా.శ.పూ. ఏడవ శతాబ్దాంతానికి చెందినవనే చూపిస్తున్నాయి. చివరిగా, లిపి శాస్త్రాన్ని కూడా పరిశీలించిన ఆ బృందం ఈ ముగింపుకు వచ్చింది: “ఆ శాసనాల తేదీని సరైనదిగా నిరూపించడానికి పురాతత్వశాస్త్రం, పురాతన వ్రాత శాస్త్రం ఇచ్చిన ఆధారాలకు లిపి శాస్త్ర సమాచారం కూడా పొందిక కలిగివుంది.”

కెటెఫ్‌ హిన్నోమ్‌ శాసనాలు అని కూడా పిలువబడే ఈ వెండి గ్రంథపు చుట్టల అధ్యయనాన్ని బులిటన్‌ ఆఫ్‌ ది అమెరికన్‌ స్కూల్స్‌ ఆఫ్‌ ఓరియంటల్‌ రిసెర్చ్‌ అనే పత్రిక సంగ్రహంగా ఇలా తెలియజేసింది: “అందువల్ల, ఈ గ్రంథపు చుట్టలు బైబిలు సంబంధిత తొలి ఉల్లేఖనాలను భద్రపరిచాయని అనేకమంది విద్వాంసులు తేల్చిచెప్పిన విషయాన్ని మనం నమ్మవచ్చు.”

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

గుహ: Pictorial Archive (Near Eastern History) Est.; వ్రాతలు: Photograph © Israel Museum, Jerusalem; courtesy of Israel Antiquities Authority