కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు మీద దోషారోపణ చేసిన ప్రధానయాజకుడు

యేసు మీద దోషారోపణ చేసిన ప్రధానయాజకుడు

యేసు మీద దోషారోపణ చేసిన ప్రధానయాజకుడు

పాత యెరూషలేము నగరానికి దక్షిణాన, దాదాపు ఒక కిలోమీటరు దూరంలో, 1990 నవంబరులో పార్కు, రోడ్డు పనులు చేస్తున్నవారు ఆసక్తికరమైన ఒక విషయాన్ని కనుగొన్నారు. ఒక ట్రాక్టర్‌ ప్రమాదవశాత్తు ప్రాచీన సమాధిగుహ పైకప్పును కూల్చివేసింది. దానికి చుట్టూ ఉన్న ప్రాంతం సా.శ.పూ. మొదటి శతాబ్దం నుండి సా.శ. మొదటి శతాబ్దం వరకు ఒక పెద్ద శ్మశానవాటికగా ఉపయోగించబడింది. అయితే పురావస్తుశాస్త్రజ్ఞులు ఆ గుహ లోపల ఆసక్తికరమైన ఒక విషయాన్ని కనుగొన్నారు.

ఆ గుహలో 12 అస్థిక పేటికలు ఉన్నాయి. మృతుల కళేబరాలు దాదాపు సంవత్సరంపాటు సమాధిలో ఉంచబడి వాటి మాంసం కుళ్ళిపోయిన తర్వాత మిగిలిన అస్థికలు ఆ పేటికలో పెట్టబడ్డాయి. అలా దొరికిన వాటిలో, వైభవంగా చెక్కబడిన ఒకానొక శవపేటికకు ఒకవైపు, యెహోసెఫ్‌ బార్‌ కెయిఫా (కయప కుమారుడైన యోసేపు) అని చెక్కబడి ఉంది. అది ఇప్పటివరకు దొరికిన శ్రేష్ఠమైన శవపేటికల్లో ఒకటి.

ఆ సమాధి, ఇప్పటివరకు నిర్వహించబడిన న్యాయవిచారణల్లో అతి ప్రాముఖ్యమైనదైన యేసుక్రీస్తు న్యాయవిచారణను నిర్వహించిన ప్రధానయాజకునిది కావచ్చని రుజువులు సూచిస్తున్నాయి. ఆ ప్రధానయాజకుడు “కయప అని పిలవబడిన యోసేపు” అని యూదా చరిత్రకారుడు జోసీఫస్‌ గుర్తిస్తున్నాడు. లేఖనాల్లో అతడు కయప అని మాత్రమే పిలవబడ్డాడు. మనం అతడి గురించి తెలుసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపించాలి? యేసు మీద దోషారోపణ చేయడానికి అతడిని ప్రోత్సహించిందేమిటి?

కుటుంబం, నేపథ్యం

కయప, అన్న అనే మరో ప్రధానయాజకుని కుమార్తెను వివాహమాడాడు. (యోహాను 18:​12, 13) రెండు కుటుంబాల వారు మంచి సంబంధాన్నే ఇష్టపడి ఉండవచ్చు అందుకే వారు ఆ సంబంధాన్ని వివాహానికి చాలా సంవత్సరాల ముందే ఖాయం చేసుకొనివుండవచ్చు. అలాంటి మంచి సంబంధం కోసం వారు తమ యాజకత్వపు వంశానుక్రమం స్వచ్ఛంగా ఉందోలేదో జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ రెండు కుటుంబాలు సమాజంలో ధనిక, ఉన్నత వర్గానికి చెందినవని స్పష్టమవుతోంది, ఎందుకంటే అవి యెరూషలేము చుట్టుపట్ల ఉన్న విస్తారమైన స్థిరాస్తుల నుండి తమకు సంపద సమకూర్చుకొని ఉండవచ్చు. అన్న తనకు కాబోయే అల్లుడు విశ్వసనీయమైన రాజకీయ సహచరునిగా ఉండాలని కోరుకొని ఉంటాడనడంలో సందేహం లేదు. అన్న, కయపలు ఇద్దరూ ప్రాబల్యంగల సద్దూకయ్యుల వర్గానికి చెందినవారని అనిపిస్తోంది.​—⁠అపొస్తలుల కార్యములు 5:​17.

కయప, సుప్రసిద్ధ యాజక కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఆయన హీబ్రూ లేఖనాల్లో, వాటి భావాన్ని వివరించడంలో విద్యనభ్యసించి ఉండవచ్చు. ఆయన తన 20వ ఏట ఆలయ సేవ ప్రారంభించివుండవచ్చు, అయితే ఆయన ఏ వయసులో ప్రధానయాజకుడయ్యాడనేది తెలియదు.

ప్రధానయాజకులు, ముఖ్య యాజకులు

ప్రధాన యాజకత్వం ప్రారంభంలో వారసత్వంగా లభించే, జీవితకాల నియామకంగా ఉండేది. అయితే సా.శ.పూ. రెండవ శతాబ్దంలో హస్మోనియన్లు అక్రమంగా ప్రధాన యాజకత్వాన్ని చేజిక్కించుకున్నారు. * హేరోదు రాజు ప్రధానయాజకులను నియమించాడు, తొలగించాడు, అలా ప్రధానయాజకులను నియమించే అసలైన అధికారం తనకే ఉందన్నట్లు చేశాడు. యూదయకు చెందిన రోమా అధిపతులు కూడా అదే పద్ధతిని అనుసరించారు.

ఈ పరిణామాలు, “ముఖ్య యాజకులు” అని లేఖనాలు పేర్కొనే గుంపు ఏర్పడడానికి దారితీశాయి. (మత్తయి 26:​3, 4, NW) ఈ గుంపులో కయపే కాక, పదవీచ్యుతులైనా ఇంకా ఆ బిరుదునే పట్టుకు వేళ్లాడుతున్న అన్న వంటి మాజీ ప్రధానయాజకులు కూడా ఉన్నారు. ఆ గుంపులో పదవిలోవున్న ప్రధానయాజకుని, మాజీ ప్రధానయాజకుని సన్నిహిత కుటుంబాలు కూడా ఉండేవి.

యూదయలో అనుదిన ప్రభుత్వాధికారాల నిర్వహణను యూదా ఉన్నత వంశీయులతోపాటు ముఖ్య యాజకులు కూడా నిర్వహించేందుకు రోమీయులు అనుమతించారు. అలా చేయడంవల్ల చాలామంది సైనికులను అక్కడికి పంపించకుండానే ఆ ప్రాంతాన్ని నియంత్రించడానికి, పన్నులను రాబట్టుకోవడానికి రోమా ప్రభుత్వానికి వీలైంది. యూదా మతాధికారుల గుంపు శాంతి భద్రతలను, తమ ప్రయోజనాలను కాపాడాలని రోమా సామ్రాజ్యం ఆశించింది. రోమా ఆధిపత్యాన్ని అసహ్యించుకునే యూదా నాయకులను రోమా అధిపతులు ఇష్టపడేవారు కాదు. అయితే స్థిరమైన ప్రభుత్వం కోసం పరస్పరం సహకరించుకోవడం వారి ఉమ్మడి ప్రయోజనాలకు అవసరం.

కయప సమయానికల్లా ప్రధానయాజకుడే యూదా రాజకీయ నాయకునిగా ఉన్నాడు. సా.శ. 6 లేక 7లో సిరియాకు చెందిన రోమా అధిపతి కురేనియస్‌, అన్నను ఈ పదవికి నియుక్తుణ్ణి చేశాడు. ప్రముఖ యూదా ఉన్నత వంశీయుల కుటుంబాల్లో అత్యాశ, బంధు ప్రీతి, అణచివేత, హింస వంటివి సర్వసాధారణమని రబ్బీల సాంప్రదాయం తెలియజేస్తోంది. ప్రధానయాజకునిగా అన్న తన అల్లుడు “ఆలయ మతాధికారుల వ్యవస్థలో త్వరగా పదోన్నతి పొందేలా” చూశాడని, “నిజానికి కయప ఎంత గొప్ప హోదా పొందితే అతడు అన్నకు అంత ఎక్కువగా ఉపయోగపడతాడు” అని ఒక రచయిత్రి భావించింది.

దాదాపు సా.శ. 15లో యూదయ అధిపతియైన వెలేరియస్‌ గ్రేటస్‌ అన్నను ఆ పదవి నుండి తొలగించాడు. ఆ తర్వాత మరో ముగ్గురు, వెంటవెంటనే ఒకరి తర్వాత ఒకరు ప్రధానయాజకుని పదవిని చేపట్టారు, వారిలో అన్న కుమారులలో ఒకరు ఉన్నారు. దాదాపు సా.శ. 18లో కయప ప్రధానయాజకుడయ్యాడు. సా.శ. 26లో యూదయ అధిపతిగా నియుక్తుడైన పొంతి పిలాతు, తాను అధిపతిగా ఉన్న పది సంవత్సరాలూ కయపను ఆ పదవిలోనే ఉండనిచ్చాడు. కయప యేసు పరిచర్య కాలంలో, ఆయన శిష్యుల పరిచర్య ఆరంభ కాలంలో ప్రధానయాజకునిగా ఉన్నాడు. అయితే కయప క్రైస్తవ సందేశాన్ని ద్వేషించాడు.

యేసుపట్ల, రోమాపట్ల భయం

కయప యేసును సమస్యలు సృష్టించే ప్రమాదకరమైన వ్యక్తిగా పరిగణించాడు. యేసు సబ్బాతు నియమాల విషయంలో మతాధికారుల వివరణను సవాలుచేశాడు, వ్యాపారస్థులు, రూకలు మార్చేవారు దేవాలయాన్ని “దొంగల గుహగా” మార్చారని చెబుతూ వారిని దేవాలయం నుండి వెళ్ళగొట్టాడు. (లూకా 19:​45, 46) దేవాలయంలోని దుకాణాలు అన్న కుటుంబసభ్యులకు చెందినవని, కయప యేసు నోరుమూయించే ప్రయత్నం చేయడానికి అది మరో కారణం కావచ్చని కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. ముఖ్య యాజకులు యేసును పట్టుకోవడానికి అధికారులను పంపించినప్పుడు వారు ఆయన మాటలు విని ఎంతగా ఆశ్చర్యపోయారంటే వారు వట్టిచేతులతో వెనక్కి వచ్చారు.​—⁠యోహాను 2:13-17; 5:1-16; 7:​14-49.

యేసు లాజరును పునరుత్థానం చేశాడని యూదా మతాధికారుల గుంపు విన్నప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. యోహాను సువార్త ఇలా నివేదిస్తోంది: “ప్రధానయాజకులును పరిసయ్యులును మహాసభను సమకూర్చి​—⁠మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచకక్రియలు చేయుచున్నాడే. మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాస ముంచెదరు; అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి.” (యోహాను 11:​47, 48) మతవ్యవస్థ అధికారానికీ, పిలాతు తమపై ఉంచిన బాధ్యతయైన పౌరభద్రతకూ యేసు ముప్పుగా మారాడని ఆ మహాసభ భావించింది. రోమన్లు ఏ ప్రజా ఉద్యమాన్నైనా రాజద్రోహంగా భావిస్తే, వారు యూదుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చు, అలాంటి పరిస్థితి ఎదురవడం మహాసభకు ఎంతమాత్రం ఇష్టంలేదు.

యేసు శక్తిమంతమైన కార్యాలు చేశాడనే వాస్తవాన్ని కయప తిరస్కరించలేకపోయినా, అతడు యేసు మీద విశ్వాసముంచే బదులు తన హోదాను, అధికారాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నించాడు. లాజరు పునరుత్థానాన్ని ఆయన ఎలా ఒప్పుకోగలడు? కయప ఒక సద్దూకయ్యునిగా పునరుత్థానాన్ని నమ్మలేదు!​—⁠అపొస్తలుల కార్యములు 23:⁠8.

కయప తన తోటి పరిపాలకులతో ఇలా చెప్పినప్పుడు అతని దుష్టత్వం బయటపడింది: “మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు.” ఆ వృత్తాంతం ఇంకా ఇలా చెబుతోంది: “తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండెను గనుక యేసు ఆ జనముకొరకును, ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినమునుండి వారు [యేసును] చంప నాలోచించుచుండిరి.”​—⁠యోహాను 11:​49-53.

కయపకు తన మాటల పూర్తి ప్రాధాన్యత తెలియదు. ఆయన ప్రధానయాజకునిగా సేవచేశాడు కాబట్టే అలా ప్రవచించాడు. * యేసు మరణం యూదులకు మాత్రమే ప్రయోజనకరం కాదు. ఆయన విమోచన క్రయధన బలి, మానవులందరికీ పాపమరణాల నుండి విముక్తి పొందే మార్గాన్ని ఏర్పరుస్తుంది.

హత్య చేయడానికి కుట్ర

యేసును ఎలా పట్టుకొని చంపాలో చర్చించడానికి యూదా ముఖ్య యాజకులు, పెద్దలు, కయప ఇంట్లో సమావేశమయ్యారు. యేసును వంచించడానికి చెల్లించే మూల్యాన్ని గురించి యూదా ఇస్కరియోతుతో ఒప్పందం చేసుకోవడంలో బహుశా ప్రధానయాజకుని పాత్ర ఉండవచ్చు. (మత్తయి 26:3, 4, 14, 15) కయప తన చెడు లక్ష్యాలను సాధించడానికి ఒకరిని హత్య చేస్తే సరిపోదు. “అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధానయాజకులు లాజరునుకూడ చంప నాలోచనచేసిరి.”​—⁠యోహాను 12:10, 11.

యేసును పట్టుకోవడానికి పంపించబడిన జనసమూహంలో కయప దాసుడైన మల్కు కూడా ఉన్నాడు. న్యాయవిచారణ చేయడానికి వారు బంధించిన యేసును మొదటిగా అన్న దగ్గరకు తీసుకువెళ్ళారు, ఆ తర్వాత, చట్టవిరుద్ధంగా రాత్రి పూట న్యాయవిచారణ చేయడానికి యూదా పెద్దలను అప్పటికే సమావేశపరచిన కయప దగ్గరకు ఆయనను తీసుకువెళ్ళారు.​—⁠మత్తయి 26:57; యోహాను 18:​10, 13, 19-24.

యేసుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్షులు చెప్పిన సాక్ష్యాలకు నేరారోపణకు పొంతన లేకపోవడాన్ని కయప అడ్డగించలేదు. తనను తాను మెస్సీయగా ప్రకటించుకునే వ్యక్తి విషయంలో తన తోటి కుట్రదారుల అభిప్రాయాలు ప్రధానయాజకునికి తెలుసు. కాబట్టి యేసు తాను మెస్సీయనని చెప్పుకుంటున్నాడా లేదా అని అధికార స్వరంతో అడిగాడు. దానికి యేసు, తనను నిందించినవారు తాను “సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు” చూస్తారని చెప్పాడు. దైవభక్తిని ప్రదర్శిస్తున్నట్లుగా “ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని—వీడు దేవదూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి?” అన్నాడు. దానితో యేసు మరణించడానికి తగినవాడని మహాసభ ఆమోదించింది.​—⁠మత్తయి 26:​64-66.

అయితే మరణదండనలను రోమన్లు ఆమోదించాలి. వారికి, యూదులకు మధ్యవర్తిగావున్న కయపే బహుశా పిలాతుకు ఫిర్యాదు సమర్పించి ఉండవచ్చు. పిలాతు యేసును విడిపించడానికి ప్రయత్నించినప్పుడు “[ఆయనను] సిలువవేయుము సిలువవేయుము” అని కేకలు వేసిన ముఖ్య యాజకుల్లో కయప కూడా ఉండవచ్చు. (యోహాను 19:​4-6) యేసు విడుదల బదులు హంతకుని విడుదల కోసం కేకలు వేయమని కయప జనసమూహాన్ని ప్రేరేపించివుండవచ్చు, “కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు” అని వేషధారణతో ప్రకటించిన ముఖ్య యాజకుల్లో అతడు కూడా ఉండివుండవచ్చు.​—⁠యోహాను 19:15; మార్కు 15:7-11.

కయప యేసు పునరుత్థానం గురించిన రుజువును తిరస్కరించాడు. అతడు పేతురు, యోహానులను ఆ తర్వాత స్తెఫనును వ్యతిరేకించాడు. సౌలు తాను దమస్కులో కనబడిన క్రైస్తవులను బంధించడానికి కూడా కయప ఆయనకు అధికారమిచ్చాడు. (మత్తయి 28:11-13; అపొస్తలుల కార్యములు 4:1-17; 6:8-7:60; 9:​1, 2) అయితే దాదాపు సా.శ. 36లో సిరియాకు చెందిన రోమన్‌ లెగేట్‌ అయిన విటెల్లియస్‌ కయపను అతని పదవి నుండి తొలగించాడు.

యూదుల గ్రంథాలు కయప కుటుంబం గురించి ప్రతికూలంగా వ్రాశాయి. ఉదాహరణకు, బాబిలోనియన్‌ టాల్‌ముడ్‌ ఇలా విచారాన్ని వెలిబుచ్చింది: “హనిన్‌ [అన్న] కుటుంబం కారణంగా, వారి గుసగుసల కారణంగా నేను శ్రమలను ఎదుర్కొన్నాను” లేక వారి “అపనిందల” కారణంగా నేను శ్రమలను ఎదుర్కొన్నాను. ఈ ఫిర్యాదు “అణచివేత చర్యలు రూపొందించడానికి జరిగిన రహస్య సమావేశాలను” సూచిస్తుండవచ్చని భావించబడుతోంది.

కయప జీవితం నేర్పించే పాఠం

ప్రధానయాజకులు “కఠినత్వం, కుయుక్తి, సామర్థ్యం, బహుశా గర్వం” ఉన్న వ్యక్తులని ఒక విద్వాంసుడు వర్ణించాడు. కయప తన గర్వం కారణంగా మెస్సీయను అంగీకరించలేదు. కాబట్టి నేడు ప్రజలు బైబిలు సందేశాన్ని తిరస్కరించినప్పుడు అది మనకు ఆశ్చర్యం కలిగించకూడదు. కొందరు తాము ప్రియంగా ఎంచిన నమ్మకాలను విడిచిపెట్టేందుకు లేఖనాధార సత్యాలపట్ల తగినంత ఆసక్తి చూపించరు. మరికొందరు వినయస్థులైన సువార్తికులుగా మారడం తమ హోదాకు తగినది కాదని భావించవచ్చు. క్రైస్తవ ప్రమాణాలు నిజాయితీ లేనివారికి లేక అత్యాశపరులకు ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు.

కయప ఒక ప్రధానయాజకునిగా తోటి యూదులు మెస్సీయను అంగీకరించేలా సహాయం చేయగలిగివుండేవాడు, అయితే అధికార వ్యామోహం కారణంగా అతడు యేసు మీద దోషారోపణ చేశాడు. కయప చనిపోయేంతవరకు ఆ వ్యతిరేకతను కొనసాగించివుండవచ్చు. మనం మరణించినప్పుడు మనం మన అస్థికలు మాత్రమే వదిలివెళ్ళమని అతని ప్రవర్తన గురించిన వృత్తాంతం చూపిస్తుంది. మనం మన చర్యల ద్వారా దేవుని ఎదుట శాశ్వత పేరును సంపాదించుకుంటాం, మంచిగా ప్రవర్తించినా చెడుగా ప్రవర్తించినా దేవుని ఎదుట ఒక పేరును సంపాదించుకుంటాం.

[అధస్సూచీలు]

^ పేరా 9 హస్మోనియన్ల చరిత్ర కోసం, కావలికోట, జూన్‌ 15, 2001, 27-30 పేజీలు చూడండి.

^ పేరా 19 యెహోవా ఇశ్రాయేలీయుల గురించిన సత్య ప్రవచనాలు ప్రవచించడానికి గతంలో దుష్ట బిలామును ఉపయోగించాడు.​—⁠సంఖ్యాకాండము 23:1-24:​24.

[10వ పేజీలోని చిత్రం]

కయప కుమారుడైన యోసేపు

[10వ పేజీలోని చిత్రం]

ఇటీవల కనుగొనబడిన అస్థిక పేటిక

[10వ పేజీలోని చిత్రసౌజన్యం]

అస్థిక పేటిక, చెక్కబడిన మాటలు, నేపథ్యంలో గుహ: Courtesy of Israel Antiquities Authority