డబ్బు మరియు నైతిక విలువలు చరిత్ర నుండి ఒక పాఠం
డబ్బు మరియు నైతిక విలువలు చరిత్ర నుండి ఒక పాఠం
దాదాపు నాలుగు వందలమంది, 1630, ఏప్రిల్ 7న, నాలుగు ఓడల్లో ఇంగ్లాండ్ నుండి అమెరికాకు బయల్దేరారు. వాళ్ళలో చాలామంది ఎంతో విద్యావంతులు. ఇతరులు సఫలీకృత వ్యాపారులు. కొంతమంది పార్లమెంటు సభ్యులు కూడా. ఇంగ్లాండ్‌లో ఆర్థికస్థితి అంతబాగా లేదు, యూరప్‌లో జరుగుతున్న ముప్పై సంవత్సరాల (1618-48) యుద్ధం మూలంగా పరిస్థితి మరింత దిగజారింది. కాబట్టి వాళ్లు అనిశ్చయంగానే, తమ ఇళ్లను, వ్యాపారాల్ని, బంధువులను వదిలి మంచి అవకాశాల అన్వేషణకు బయల్దేరారు.
అయితే ఆశాభావంతో బయల్దేరిన వాళ్లు, కేవలం అవకాశవాద వ్యాపారస్థులు మాత్రమే కాదు. వాళ్లు మతహింస నుండి దూరంగా పారిపోతున్న మతనిష్ఠగల ప్యూరిటన్‌లు. * తాము, తమ పిల్లలు బైబిలు ప్రమాణాల విషయంలో రాజీ పడకుండానే వస్తుపరంగా వర్ధిల్లగల దైవిక సమాజాన్ని స్థాపించాలన్నది వాళ్ళ అసలు ఆశయం. వాళ్ళు మసాచుసెట్స్‌లోని సేలంలో దిగిన వెంటనే తీరం వెంబడివున్న కాస్త స్థలాన్ని ఆక్రమించుకున్నారు. వాళ్లు తమ క్రొత స్థలాన్ని బోస్టన్ అని పిలుచుకున్నారు.
అసంబద్ధపు సమతూకం
వారి నాయకుడు, అధిపతి అయిన జాన్ విన్‌త్రోప్ క్రొత్త కాలనీలో సొంత సంపదను, ప్రజా సంక్షేమాన్ని పెంపొందింపజేయడానికి ఎంతో కృషి చేశాడు. ప్రజలకు డబ్బు, నైతిక విలువలు రెండూ ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ అది అసంబద్ధపు సమతూకమని నిరూపించబడింది. సవాళ్ళు ఎదురవుతాయని నమ్ముతూనే ఆయన దైవిక సమాజంలో సంపద వహించే పాత్ర గురించి తన సహచరులతో సుదీర్ఘంగా మాట్లాడాడు.
ఇతర ప్యూరిటన్ నాయకుల్లాగే, విన్‌త్రోప్ కూడా సంపద కోసం ప్రాకులాడడం తప్పేమీ కాదని నమ్మాడు. ధనసంపదల ముఖ్య సంకల్పం ఇతరులకు సహాయం చేయడమేనని ఆయన వాదించాడు. కాబట్టి ఒక వ్యక్తి ఎంత సంపన్నుడైతే, అంత ఎక్కువగా మేలు చేయగలడు. “ప్యూరిటన్‌లకు సంపద కలిగించినంత కలత మరేదీ కలిగించలేదు. అది అటు దేవుని ఆశీర్వాదానికి సూచన, ఇటు అహంకారమనే పాపానికి . . . శారీరక పాపాలకు పాల్పడేలా చేసే శక్తిమంతమైన శోధన” అని చరిత్రకారురాలైన పెట్రీషియా ఓటూల్ పేర్కొంటోంది.
సంపద, విలాసం ప్రేరేపించే పాపాలను నివారించడానికి మితం పాటించమని, నిగ్రహశక్తి కలిగివుండమని విన్‌త్రోప్ కోరేవాడు. అయితే, చాలా త్వరలోనే, లాభం సంపాదించుకోవాలనే తన తోటిపౌరుల స్ఫూర్తికి, దైవభక్తి కలిగివుండి
ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆయన వారిని బలవంతపెట్టడానికి మధ్య వివాదం తలెత్తింది. ఆయనతో సమ్మతించనివారు, విన్‌త్రోప్ తమ వ్యక్తిగత విషయాల్లో తలదూరుస్తూ అతిగా వ్యవహరిస్తున్నాడని భావిస్తూ ఆయన అభిప్రాయాలను సవాలు చేయడం మొదలుపెట్టారు. నిర్ణయాలు తీసుకోవడంలో భాగం వహించే, ఎన్నుకోబడిన విధానసభ కోసం కొందరు ఆందోళన చేయడం ప్రారంభించారు. ఇతరులు తమ సొంత లక్ష్యసాధనల కోసం పొరుగునున్న కనెక్టికట్‌కు వెళ్లిపోవడం ద్వారా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.“మసాచుసెట్స్‌లోని ప్యూరిటన్‌ల జీవితంలో అవకాశం, సమృద్ధి, ప్రజాస్వామ్యం వంటివన్నీ బలమైన శక్తులుగా ఉన్నాయి, ప్రజాసంక్షేమం కోసం సంపదలు ఖర్చుచేయాలనే విన్‌త్రోప్ సమిష్టి తలంపును బలిపెడుతూ అందరూ తమ సొంత లక్ష్యసాధనల కోసం పాటుపడడం ప్రారంభించారు” అని ఓటూల్ చెబుతోంది. 1649లో, విన్‌త్రోప్ తన 61వ ఏట దాదాపు చేతిలో పైసా లేకుండా చనిపోయాడు. ఎన్నో కష్టాలు ఎదురైనా ఆ బలహీన సమాజం కొనసాగగలిగింది కానీ, విన్‌త్రోప్ తన కల నిజమవడాన్ని చూడలేకపోయాడు.
అన్వేషణ కొనసాగుతోంది
మంచి లోకం కోసం కలలు కనడం జాన్ విన్‌త్రోప్‌తోనే అంతరించిపోలేదు. మరింత మంచి జీవితాన్ని కనుగొనాలని ఆఫ్రికా, ఆగ్నేయాసియా, తూర్పు యూరప్, లాటిన్ అమెరికాల నుండి ప్రతీ సంవత్సరం లక్షలాదిమంది వలస వెళ్తున్నారు. వారిలో కొందరు, ధనవంతులు కావడమెలాగో తెలియజేస్తామని వాగ్దానం చేస్తూ ప్రతీ సంవత్సరం ఉత్పత్తి చేయబడుతున్న వందల కొలది పుస్తకాలు, సదస్సులు, వెబ్‌సైట్ల మూలంగా ప్రేరణ పొందుతున్నారు. స్పష్టంగా, చాలామంది నైతిక విలువలను వదులుకోకుండానే డబ్బు సంపాదించుకోవాలనే ఆశతో ఇప్పటికీ కృషి చేస్తున్నారు.
నిర్మొహమాటంగా చెప్పాలంటే, ఫలితాలు నిరాశాపూరితంగా ఉన్నాయి. సంపదకోసం ప్రాకులాడేవారు తరచూ తమ నైతికసూత్రాలను, కొన్నిసార్లు తమ విశ్వాసాన్ని కూడా ధనపిశాచికి బలిచేయవలసి వస్తోంది. కాబట్టి, మీరిలా ప్రశ్నించడం సబబే: “ఎవరైనా నిజ క్రైస్తవులుగా ఉంటూ అదే సమయంలో ధనవంతులుగా ఉండగలరా? వస్తుపరంగానూ ఆధ్యాత్మికంగానూ వర్ధిల్లే దైవభయంగల సమాజం ఎప్పటికైనా ఏర్పడుతుందా?” తర్వాతి ఆర్టికల్ చూపిస్తున్నట్లుగా, ఆ ప్రశ్నలకు బైబిలు సమాధానాలిస్తోంది.
[అధస్సూచి]
^ పేరా 3 తమ చర్చినుండి రోమన్ క్యాథలిక్ ప్రభావాన్ని పూర్తిగా తొలగించాలని కోరుకున్న చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లోని ప్రొటస్టెంట్లకు 16వ శతాబ్దంలో ప్యూరిటన్‌లు అనే పేరు ఇవ్వబడింది.
[3వ పేజీలోని చిత్రసౌజన్యం]
నౌకలు: The Complete Encyclopedia of Illustration/J. G. Heck; విన్‌త్రోప్: Brown Brothers